టెలివిజన్ ఆవిష్కరణ చరిత్ర


స్కానింగ్ విధానము
ఈ దిశలో మొదటి ప్రయోగం 1883 లోనేజరిగింది. బెర్లిన్ విశ్వవిద్యాలయం లోని పోల్ నివ్ కో అనే విద్యార్థి కాస్త మొరటుగా ఉండే స్కానింగ్ సాధనాన్ని నిర్మించాడు. ముఖ్యంగా రెండు ఆవిష్క్రణలు అతని ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేశాయి. మొదటికి టెలిఫోన్. సెలేనియం అనే లోహంపై సూర్యకాంతి పడనప్పుడు దానిగుండా విద్యుచ్చక్తి మరింత సులువుగా ప్రవహిస్తుందనే విషయాన్ని కనుక్కోవడం రెండోది. దీని ఆధారంగానే ఫోటో ఎలక్ట్రిక్ సెల్ నిర్మించబడినదని ఈ సందర్భంలో మనం గుర్తుంచుకోవాలి. సెలేనియం పై పడే కాంతి తీవ్రతలలో తేడాలను బట్టి విద్యుత్ ప్రవాహం మారుతుంది. గనుక ఒక దృశ్యాన్ని ఈ సిద్ధాంతం ఆధారంగా ప్రసారం చేయాలని నివ్ కో ప్రయత్నించాడు.
నిప్కో డిస్క్ - విద్యుత్ దూరదర్శిని
ఇందుకుగాను దృశ్యాన్ని చిన్నచిన్న భాగాలుగా చేసి, వాటిని ఓ క్రమ పద్ధతిలో వేగంగా స్కాన్ చేయాలి. వాటి కాంతి తీవ్రతల తేడాను బట్టి ప్రవహించె విద్యుత్ పరిమాణంలో మార్పులు ఏర్పడతాయి. రిసీవర్ లో ఈ విద్యుత్తుని మళ్ళీ కాంతిగా మారిస్తే, తెరపై తొలిదృశ్యాన్ని నిర్మించవచ్చు. ఈ సిద్ధాంతం ఆధారంగా నిప్కో నిర్మించిన పరికరానికి విద్యుత్ దూరదర్శిని(Electric Telescope) అని పెరు పెట్టారు. అయితే తన ఆలోచనల్ని కార్యరూపంలోకి తేవటంలో అతడెన్నో సాంకేతిక సమస్యల్ని ఎదుర్కోవలసి వచ్చింది. ప్రయత్నాల్ని అర్థాంతరంగా నిలిపివేసి రైల్వే ఇంజనీరుగా ఉద్యోగంలో చేయసాగాడు.
ఫోటో ఎలక్ట్రిక్ సెల్ నిర్మాణము
ఎలక్ట్రానిక్స్ విభాగంలో పరిశోధనలు కొంత ప్రగతిని సాధించాక టెలివిజన్ సమస్యని మరోకోణం నుంచి పరిశీలించటానికి వీలయింది.

క్రూక్స్ అనే శాస్త్రజ్ఞుడు నిర్మించిన కాథోడ్ కిరణ నాళాన్ని స్ట్రాన్‍బర్గ్ విశ్వవిద్యాలయం లో పనిచేస్తున్న ప్రొఫెసర్ బ్రాన్ మెరుగుపరిచాడు. కిరణ నాళంలో ఒక వైపున వుండే తెరని కొన్ని రసాయనిక పదార్థాలతో పూస్తే దానిపై ఎలక్ట్రాన్ లు పడినపుడు కాంతివంతమైన చుక్కలు ఏర్పడతాయని బ్రాన్ కనుగొన్నాడు.

బ్రాన్ నాళం అనబడే ఈ పరికరం 1897 లో తయారైంది. ఈ సూత్రం ఆధారంగానే జూలియన్ ఎల్‍స్టర్, హాన్స్ గైటర్ అనే ఇద్దరు జర్మన్ శాస్త్రజ్ఞులు సెలేనియం కంటే అతి వేగంగా, సమర్థవంతంగా పనిచేసే ఫోటో ఎలక్ట్రిక్ సెల్ ని నిర్మించారు.
జాన్ లోగీ బయర్డ్ ఆవిష్కరణ
టెలివిజన్ నిర్మాణంలోనే సాంకేతిక సమస్యల్ని చాలా వరకు పరిష్కరించినవాడు స్కాట్లండ్ కి చెందిన ఓ క్రైస్తవ మతాధికారి కొడుకు జాన్ లోగీ బెయిర్డ్.

 అనారోగ్యం కారణంగా ఇంజనీరింగ్ విద్యని పూర్తిచేయలేక యితడు వ్యాపార రంగంలో ప్రవేశించాడు. చారింజ పళ్ళతో ప్రారంభించి సబ్బులు,బ్లెడులు అమ్మటం మొదలు పెట్టాడు. 
మలేరియా తో మంచం పట్టి 1922 లో కోలుకున్నాక టెలివిజన్ సమస్యలవైపు దృష్టి సారించాడు.
విసుగు చెందని విక్రమార్కుడిలా అకుంఠిత దీక్షతో ఓ ధ్యేయం కోసం అహర్నిసలూ శ్రమించిన ఉదాహరణలు సాంకేతిక శాస్త్ర చరిత్రలోనే చాలా అరుదు. ఈ శతాబ్దానికే తలమానికమైన ఆవిష్కరణని సాధించడంలో బెయిర్డ్ ఎదుర్కొన్న అవాంతరాలు అన్ని ఇన్నీ కావు. ఆరోగ్యం అంతంత మాత్రమే. అర్థబలం అసలు లేదు. టెలివిజన్ పూర్వాపరాలను గురించిన పరిజ్ఞానం శూన్యం.
మేడమీదున్న ఓ మురికి గది ఓ ప్రయోగశాల. ఎలక్ట్రికల్ వ్యాపారస్తుడి దగ్గర మూలపడ్డ ఓ పాత ఎలక్ట్రిక్ మోటారు ని కొన్నాడు. చిన్న అట్టముక్క నుంచి నివ్‍కో ఫలకాన్ని తయారు చేశాడు.
సైకిల్ షాప్ లో కొన్ని కటకాలను కొన్నాడు.మిలిటరీ స్టోర్ లో మూల పడేసిన పాత వైర్‍లెస్ టెలిగ్రాఫ్ పరికరాన్ని సంపాదించాడు. టార్చ్ బ్యాటరీలు, సూదులు, కొయ్యముక్కలు, కాస్త లక్క, దారాలు, జిగురు, గదిలో ఎక్కడ చూసినా పడిఉండే తీగలు - ఇవీ అతని ప్రయోగశాలలోని పరికరాలు!
రెండేళ్ళ నిరంతర కృషి ఫలితంగా కొన్ని ఆకారాల్ని సుమారు మూడు మీటర్ల దూరందాకా ప్రసారం చేయడంలో బెయిర్డ్ కృతకృత్యులయ్యాడు. ప్రపంచానికే వింతగొలిపే ఈ అధ్బుత పరికరాన్ని లండన్ లోని ఓ పెద్ద ఎలక్ట్రిక్ షాప్ యజమాని తిలకించి ముగ్ధుడై పోయాడు. తన షాపులో రోజుకి మూడుసార్లు ఈ పరికరాన్ని ప్రదర్శించటానికి బెయిర్డ్ ని అతడు నియోగించాడు.

బతుకు తెరువు కోసం బెయిర్డ్ దీనికి అంగీకరించాడు. తన మొరటు నమూనాని ప్రదర్శిస్తూ ఇలాగే వుండెపోతే అపకీర్తి పాలవడమె కాకుండా పరిశోధనలకు స్వస్తి చెప్పాల్సి వస్తుందని అనతికాలంలోనే గ్రహించిన బెయిర్డ్ రాజీనామా సమర్పించి, మళ్ళీ తన గదిని చేరుకున్నాడు.
తరువాతి పరిశోధనల ఫలితంగా 1925 అక్టోబర్ 2 వ తేదీన ఓ కంపెనీ లో పనిచేసే అబ్బాయి ముఖాన్ని ప్రసారంచేశాడం, ఈ చిత్రాన్ని పక్క గదిలోని రిసీవర్లో చూడటం జరిగింది. కొన్ని నెలల తర్వాత, అతడు తన పరికరాన్ని వైజ్ఞానిక సంఘ సభ్యులకూ, పత్రికా విలేఖరులకూ ప్రదర్శించాడు.
బెయిర్డ్ పరికరంలో స్కానింగ్, ప్రతిబింబాన్ని పునర్నిర్మించటం యాంత్రిక పద్ధతిలో జరగడం మూలాన నమూనా కాస్త మొరటుగానూ, లోపభూయిష్టంగానూ ఉండేది. ప్రసారిణిని రిసీవర్ కి తీగల ద్వారా సంధించడం తొలిదశలో జరిగింది.

ఒకటి రెండు సంవత్సరాల తరువాత రెండింటికీ మధ్య తీగలు లేకుండా వైర్‍లెస్ పద్ధతిని అవలంభించాడు. రిసీవర్ లో కనబదే ప్రతిబింబం మరీ స్పష్టంగా ఉండాలని, ప్రసార దూరం క్రమంగా ఎక్కువ చేయాలనీ బెయిర్డ్ కృషిచేశాడు.

తన పరిశోధనల్లో బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్(బి.బి.సి) భాగస్వామి కావాలని అతడెంతగానో ఆకాంక్షించాడు. మొదట అనేక విఘ్నాలు ఏర్పడినా పార్లమెంట్ వత్తిడి మూలంగా 1929 లో బి.బి.సి ప్రయోగాత్మకంగా టెలివిజన్ కార్యక్రమాల్ని ప్రసారం చేయటం మొదలుపెట్టింది.
ఇది ఇలా ఉండగా అమెరికా లో ఎలక్ట్రానిక్స్ పద్ధతిలో టెలివిజన్ రూపొందించే కృషి ముమ్మరంగా జరిగింది. ఈ విభాగంలో ఫార్నన్ వర్త్, జ్యోరికిన్ అనే ఇద్దరు శాస్త్రజ్ఞులు ప్రముఖంగా చెప్పుకోదగ్గవారు. జ్యోరికిన్ రష్యా లో జన్మించి బోరిన్ రోసింగ్ వద్ద విద్యాభ్యాసం చేశాడు.

వీళ్ళిద్దరూ కలసి 1910 నుంచి కాథోడ్ కిరన నాళాన్ని రిసీవర్ గా ఉపయోగించి టెలివిజన్ కి సంబంధించిన ప్రయోగాలు చేశారు. నివ్ కో ఫలకంతో యాంత్రికంగా జరిగే స్కానింగ్ ని బ్రాన్ నాళంతో ముడిపెట్టడం కుదరదనీ, సంపూర్ణంగా ఎలక్ట్రానిక్స్ పద్ధతిని రూపొందిస్తే టెలివిజన్ ప్రయోగాలు ఫలిస్తాయని వారు గ్రహించారు. జ్యోరికిన్ 1919 లో అమెరికాకు వెళ్ళి పరిశోధన కొనసాగించారు. ఫలితంగా 1928 లో ఇతడు ఐకనోస్కోప్ అనే పరికరాన్ని తయారు చేయగలిగాడు.

దృశ్యాల్ని అతి త్వరగానూ, సమర్థవంతంగానూ ప్రసారం చేయగల విప్లవాత్మక సాధనంగా ఇది తయారైంది. అప్పటి నుంచి ఇది టెలివిజన్ కెమెరా లో ఒక ప్రధాన భాగంగా ఉంటోంది. జ్యోరికిన్ చేసిన ఈ పరిశోధనకి రేడియో కార్పొరేషన్ ఆఫ్ అమెరికా అనే సంస్థ ఆర్థిక వనరుల్ని అందించింది.
జ్యోరికిన్ నిర్మించిన కెమెరా మౌలికంగా మనిషి కన్నులా ఉంటుంది. ప్రసారం చేయాల్సిన దృశ్యాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించి వాటిపై ఓ క్రమ పద్ధతిలో ఎలక్ట్రాన్ ల సముదాయాన్ని సెకనుకు 24 సార్లు పడేలా చేస్తారు. విద్యుత్ ప్రవాహ పరిమాణంలో ఇక్కడ ఏర్పడే మార్పులను ప్రసారిణి వుత్పత్తి చేసే తరంగాలలో సంధించి, వాటిని విద్యుదయస్కాంత తరంగాల రూపంలో ప్రసారం చేస్తారు.

 రిసీవర్ లో ఓ పెద్ద కాథోడ్ కిరణ నాళం, అందులో ఒక పెద్ద తెర వుంటాయి. ప్రసారిణి లో వుండే కెమెరాలలో ఎంత వేగంతో ఎలక్ట్రాన్ ల సముదాయం కదులుతుందో అదే వేగంతో రిసీవర్ లో కూడా కదిలినప్పుదు దృశ్యం తెరమీద నిర్మించబడుతుంది. ఈ రెండు వేగాలు సమానంగా ఉండేలా చూడడాన్ని సింక్రోనైజేషన్ అంటారు. బ్రిటిష్ పద్ధతిలో దృశ్యాల్ని 405 రేఖలుగా విభజిస్తే, అమెరికా, యూరప్ దేశాల్లో 805 రేఖలుగా విభజించే పద్ధతి అందుబాటులో ఉంది.
ప్రసారిణి పంపే టెలివిజన్ తరంగాలు కొంత దూరం మాత్రమే ప్రయాణింప గలుగుతాయి. దేశమంతా టెలివిజన్ ప్రసారాల్ని విస్తరింపజేయటానికి గాను మొదట్లో కో ఆక్సియల్ కేబుల్ లను వాడి దృశ్య తరంగాల్ని, శబ్ద తరంగాల్ని ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్ కు తీసుకెళ్ళే యేర్పాటు ఉండేది.
టెలివిజన్ ప్రసారాల్ని క్రమంగా ప్రసారం చేయడం లండన్ లో 1936 నవంబర్ 2 వ తేదీన ప్రారంభమైనది. ఒక వారం ప్రసారం బెయిర్డ్ పద్ధతిలో జరిగితే మరుసటి వారం జ్యోరికిన్ పద్ధతిలో జరిగుతుండేవి. రెండు పద్ధతుల్ని మార్చి మార్చి వాడాక జ్యోరికిన్ పద్ధతినే తుదకు ఎన్నుకున్నారు.

కానీ శత్రు విమానాలు లండన్ లో చేరడానికి టెలివిజన్ తరంగాలు ఉపకరించవచ్చు. నన్న కారణంగా రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభం కాగానే టెలివిజన్ ప్రసారాలను బ్రిటన్ నిలివివేసి, 1946 జూన్ లో మళ్ళీ ప్రారంభించింది. తన పద్ధతిని ఆపి వేయడంతో నిరాశ చెందిన బెయిర్డ్ 58 వ యేట రంగు టెలివిజన్ లపై పరిశోధనలు చేస్తూ కన్నుమూశాడు.
ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికా లో టెలివిజన్ కి అంకురార్పణ జరిగింది. యుద్ధం ముగిసిన తరువాత టెలివిజన్ రిసీవర్ ల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది.

1960 నాటికి దేశంలో మూడింట రెండు వంతుల జనాభా టెలివిజన్ కార్యక్రమాల్ని తిలకించటానికి వీలైంది. విన్న విషయాల కంటే కళ్లకు కట్టినట్తు చూసిన కార్యక్రమాలు ప్రభావం ఎక్కువగా ఉండటం మూలాన రేడియో తెరమరుక్కి వెళ్ళడం, టెలివిజన్ విశ్వరూపం ధరించి ప్రపంచమంతటా వ్యాపించటం మొదలైంది. ఆధునిక ప్రజాస్వామ్యం లో ఇది కీలక సాధనం. మంచికో చెడుకో ప్రజల్ని సామూహికంగా ఇది ప్రభావం చేయగలదు.

జాయి భవిష్యత్తు ను తీర్చి దిద్దే నాయకుల్ని మన లోగిళ్ళకి లాక్కువస్తుంది. ఎన్నికల్లో నిలబడ్డ రాజకీయ వాదుల్ని నిశితంగా పరిశీలించటానికి, ప్రపంచ సంఘటనల్ని దృశ్య కళల్ని ఆఖరికి సినిమాలనీ చిన్న తెరపై చూడవచ్చు. చికాకు కలిగించే సీరియల్ కథలతోనూ, ఏవగింపు కలిగించే హాస్యాలతోను కాలం వృధా చేయవచ్చు.

చిన్న తెరపై చూపించె వ్యాపార ప్రకటనల ప్రవాహంలో కొట్టుక పోయి పనికిరాని వస్తువులపై డబ్బు తగలెయ్యవచ్చు. ఆవిష్కరనకి పూర్వం మానవ కళ్యాణానికి మరో మెట్టు కాగలదని ఆశలు చిగురింపజేసిన ఈ టెలివిజన్ ఓ వ్యసనంగా, వ్యామోహంగా పరిణమిస్తుందని ఎవరూ మొదట్లో ఊహించలెక పోయారు. సాంకేతిక ప్రగతి ఎక్కువయ్యే కొద్దీ మానవత్వపు విలువలు దెబ్బతినడానికి ఆస్కార ముందని టెలివిజన్ లా మరే ఆవిష్కరనా నిరూపించలేదు.