స్మార్ట్‌ సిటీస్‌ అంటే..ఏమిటి ?

నగరీకరణలో ప్రపంచమంతా పరుగులు పెడుతుంటే మనం వెనక్కి పోతున్నాం. ఆసియాలోకెల్లా అతి పెద్ద మురికివాడ ధారవి.. మెట్రో సిటీగా, ఫైనాన్షియల్ క్యాపిటల్‌గా కీర్తి పొందుతున్న  ముంబయి నగరంలోనే ఉంది. ఇదీ మన ఘనత. గట్టిగా పది సెంటిమీటర్ల వర్షం కురిస్తే.. మన నగరాలు గజగజా వణికిపోతాయి. లోతట్టు ప్రాంతాలు మునిగిపోతాయి. ప్రజా జీవితం స్థంభించిపోతుంది. కరెంట్ ఉండదు. మన దేశంలో నగరాలు ఇలా రోజురోజుకీ సమస్యల్లోకి కూరుకుపోతుంటే.. అభివృద్ధి చెందిన దేశాల్లో నగరాలు ఊహించని రీతిలో ఎదుగుతున్నాయి. 
స్మార్ట్‌ సిటీస్‌ కోసం చిత్ర ఫలితం
స్వర్గంలో ఉన్నామా అనే భావన కలిగించే రీతిలో నగరాలను అభివృద్ధి చేస్తున్నాయి అభివృద్ధి చెందిన దేశాలు. కాలుష్య రహితంగా.. పర్యావరణ హితంగా.. ఎక్కడకు వెళ్లాలన్నా క్షణాల్లో వెళ్లేలా రవాణా వ్యవస్థ.. సకల సౌకర్యాలు అందుబాటులోకి ఉండేలా నగరాల్ని రూపొందిస్తున్నాయి. అరబ్ ఎమిరేట్స్, స్కాండినేవియన్ దేశాలు, అమెరికా, ఐరోపాదేశాల్లో స్మార్ట్ సిటీ కాన్సెప్ట్‌కు పెద్ద పీట వేస్తున్నాయి ప్రభుత్వాలు. 

స్మార్ట్‌ సిటీస్‌ పేరుతో పెద్ద పథకాన్ని ప్రారంభించిన కేంద్రం..  వంద నగరాల్ని అభివృద్ధి చేయగలదా?. నగరంలో నడి రోడ్ల మీదే వెలసిన గుళ్లు, మసీదులు, చర్చ్‌లను తొలగించగలదా?. రోడ్ల విస్తరణకు యుద్ధం చేయాల్సిన పరిస్థితిని మార్చగలదా?. స్వచ్చత, శుభ్రత గురించి పట్టించుకోని స్వార్థపరుల సంగతేంటి?. వాహనాల రణగొణ ధ్వనులు, కాలం చెల్లిన వెహికల్స్ నుంచి వచ్చే కాలుష్యం, పరిశ్రమల వ్యర్థాలు.. వీటన్నింటి మాటేంటి? పచ్చదనమనేది మచ్చుకైనా కనిపించని కాంక్రీట్ అరణ్యాల్లో హరిత వనాలను అభివృద్ధి చేయడం సాధ్యమేనా?



ఇంటింటికీ ఇంటర్నెట్, ప్రతీ సర్వీస్ మీదా పన్ను లాంటి చిన్న చిన్న అంశాల వల్ల నగరాలు స్మార్ట్‌గా మారిపోతాయనుకుంటే అంత కంటే వెర్రితనం మరొకటి ఉండదు. దేశంలో ప్రతీ నగరంలో కాలుష్యం ప్రమాదకర స్థాయిని దాటిపోయింది. పేదా, ధనిక అనే తేడా లేకుండా అందరికీ పరిశుభ్రమైన గాలి, నీరు అందితేనే అది స్మార్ట్‌గా మారినట్లు. ప్రభుత్వం అందించే సేవలు అందరికీ అందుబాటులోకి వస్తేనే కేంద్రం లక్ష్యం నెరవేరినట్లు. ఇదంతా ఒక్కరోజులో సాధ్యమయ్యే వ్యవహారం కాకపోయినా.. ప్రతీ అడుగు లక్ష్యం దిశగా పడితేనే పథకానికి సార్థకత.

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment