జనవరి - 2014 సదస్సులు - సమావేశాలు


జనవరి - 4
¤    హైదరాబాద్ జూబ్లీహాల్‌లో లీడ్ బ్యాంక్ (ఆంధ్రా బ్యాంక్) మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్రన్ అధ్యక్షతన 182వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్‌బీసీ) సమావేశం జరిగింది.   
      
»  ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పలువురు రాష్ట్ర మంత్రులు, 
అధికారులు పాల్గొన్నారు.
జనవరి - 8
¤    అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్) ఆధ్వర్యంలో ఏడో గ్లోబల్ ఇన్స్యూరెన్స్ సదస్సును హైదరాబాద్‌లో నిర్వహించారు.
         

»  బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏ) ఛైర్మన్ టి.ఎస్.విజయన్, 
రాష్ట్ర గవర్నర్ నరసింహన్, అసోచామ్ సెక్రటరీ జనరల్ డి.ఎస్.రావత్,
 ఇండియా ఫస్ట్ లైఫ్ ఛైర్మన్ పి.నందగోపాల్ తదితరులు ఈ సదస్సుకు 
హాజరయ్యారు.
జనవరి - 10

¤    గుజరాత్ విద్యాశాఖ, భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సంయుక్తంగా జాతీయ విద్యాసదస్సును గాంధీ నగర్‌లోని మహాత్మా మందిర్‌లో నిర్వహించారు.      
   
»  గుజరాత్ సీఎం నరేంద్రమోడీ ఈ సదస్సులో ప్రసంగించారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత 
ప్రాంతాల నుంచి 33 మంది ప్రతినిధులు, 100 కు పైగా విశ్వవిద్యాలయాల ఉపకుల
పతులు సదస్సులో పాల్గొన్నారు.
 జనవరి - 11
¤     అంతరిక్ష రంగంలో అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని పెంచుకునేందుకు వాషింగ్టన్‌లో నిర్వహించిన మూడు రోజుల సదస్సు ముగిసింది.        

 » అంతరిక్ష ప్రయోగాలు జరుపుతున్న 32 దేశాల అధికారులు ఈ సదస్సులో పాల్గొన్నారు.         

» అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో భాగస్వామ్య దేశాల సంఖ్యను పెంచడం; అంగారక గ్రహం పైకి మానవ సహిత యాత్రలు, సౌర కుటుంబంలో రోబోటిక్ యాత్రలను చేపట్టడం, భూమికి ముప్పు కలిగించే గ్రహ శకలాలను గుర్తించడం, వాణిజ్య అంతరిక్ష యాత్రలను విస్తరించడం తదితర అంశాలపై ఈ సదస్సులో సమాలోచనలు జరిపారు. 
        
» ఈ సదస్సుకు సమాంతరంగా తొలిసారిగా అమెరికా ప్రభుత్వం కూడా అంతరిక్ష విధాన శిఖరాగ్ర సదస్సును నిర్వహించింది.         

» గతంలో ప్రకటించిన దాని కంటే మరో నాలుగేళ్లు అంటే 2024 వరకూ ఐఎస్ఎస్‌ను కొనసాగించనున్నట్లు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. 
 జనవరి - 13
¤    రాష్ట్రాల మైనారిటీ కమిషన్ల సదస్సును న్యూఢిల్లీలో నిర్వహించారు.
         
»  ప్రధాని మన్మోహన్‌సింగ్ ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లౌకికవాదానికి కొత్త నిర్వచనాలు చెప్పేందుకు ప్రయత్నిస్తూ, భారతీయ లౌకిక భావనలకు విరుద్ధంగా పనిచేసే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రధాని సూచించారు.

'చాలా రాష్ట్రాల్లో మెజారిటీ, మైనారిటీ వర్గాల మధ్య సంబంధాలు సామరస్యంగానే ఉన్నాయి. అక్కడక్కడా ముఖ్యంగా ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలతో ఈ సంబంధాలు తీవ్ర పరీక్షలకు గురయ్యాయి' అంటూ ప్రధాని ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్‌లో జరిగిన మత కలహాలను ప్రస్తావించారు.
         

»  మైనారిటీ వ్యవహారాల మంత్రి కె.రహమాన్ ఖాన్ కూడా సదస్సులో పాల్గొన్నారు.
జనవరి - 15
¤     కేంద్ర సామాజిక న్యాయం, సాధికారికత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 'సమర్థ్-2014' సమావేశాన్ని న్యూఢిల్లీలో నిర్వహించారు.
        

»  యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగాల్లో వికలాంగులకు 5% రిజర్వేషన్ కల్పించే బిల్లును ఫిబ్రవరిలో పార్లమెంట్‌లో ప్రవేశపెడుతున్నట్లు సోనియా గాంధీ ఈ సమావేశంలో ప్రకటించారు.
జనవరి - 16
¤     అయిదో దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకార సమాఖ్య (సార్క్) బిజినెస్ లీడర్స్ కాన్‌క్లేవ్ ను న్యూఢిల్లీలో నిర్వహించారు.        

»  ఈ సమావేశంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద్‌శర్మతోపాటు అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులునేపాల్ , పాకిస్థాన్, శ్రీలంక దేశాల వాణిజ్య, ఆర్థిక మంత్రులు పాల్గొన్నారు.        

»  పేదరికం, నిరుద్యోగం, పౌష్టికాహారలోపం వంటి సమస్యలపై కలసికట్టుగా పోరాడాల్సిన అవసరముందని సమావేశంలో ఈ మంత్రులు అభిప్రాయపడ్డారు.  
      
»  పాకిస్థాన్‌లో కార్యకలాపాలు నిర్వహించడానికి ఎస్‌బీఐ, బీవోఐ లకు ఈ సమావేశంలో అనుమతి లభించింది. భారత్‌లో కార్యకలాపాలు నిర్వహించడానికి నేషనల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్, యునైటెడ్ బ్యాంక్ లకు అనుమతి లభించింది.


¤     అఫ్గానిస్థాన్ భద్రతపై చైనా రాజధాని బీజింగ్‌లో చైనా, భారత్, రష్యాల మధ్య త్రైపాక్షిక చర్చలు జరిగాయి.       

 »  అఫ్గానిస్థాన్‌లో సుస్థిరత, భద్రతే అత్యంత ప్రధానమని ఈ మూడు దేశాలూ అభిప్రాయపడ్డాయి. అఫ్గాన్ నుంచి అమెరికా దళాల ఉపసంహరణతో మళ్లీ ఆ దేశంలో తాలిబన్లు, అల్‌ఖైదాతో సంబంధాలున్న ఉగ్రవాద శక్తులు చెలరేగే ప్రమాదం ఉందని ఈ మూడు దేశాలూ ఆందోళన వ్యక్తం చేశాయి.       

 »  అఫ్గాన్ సుస్థిరతకు, శాంతి నెలకొనడానికి, అభివృద్ధికి అన్ని విధాలా సాయం చేయాలని ఈ దేశాలు నిర్ణయించాయి.        

»  అఫ్గాన్ భద్రతపై గతేడాది కూడా భారత్-చైనాల మధ్య చర్చలు జరిగాయి.
జనవరి - 22
¤     వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సమావేశాన్ని స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో నిర్వహించారు.
        

»   కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ఈ సమావేశానికి హాజరయ్యారు.

       
 »   17వ వార్షిక గ్లోబల్ సీఈవో సర్వేను డబ్ల్యూఈఎఫ్ సమావేశంలో పీడబ్ల్యూసీ (ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్) విడుదల చేసింది. సీఈవోల విశ్వాసంపై తయారు చేసిన జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. అంతర్జాతీయంగా సగటున ఆదాయాలు 39% పెరగగలవని భావిస్తుంటే, అంతకంటే అధికంగా తమ కంపెనీల ఆదాయం పెరగగలదని 49% భారత సీఈవోలు విశ్వాసం వ్యక్తం చేశారు.