జనవరి - 2014 ఆర్థికరంగం



జనవరి - 2
¤   మ్యూచువల్ ఫండ్‌లు నిర్వహిస్తున్న ఆస్తులు 2013లో దాదాపు 11% పెరిగాయి. దేశంలో ఉన్న 44 మ్యూచువల్ ఫండ్‌ల నిర్వహణలో ఉన్న ఆస్తులు 2012 చివరినాటికి రూ.7,93,331 కోట్లు ఉండగా, 2013 చివరినాటికి రూ.8,77,973 కోట్లకు చేరినట్లు అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ ఇండియా (యాంఫీ) ప్రకటించింది.          

»   దాదాపు రూ.1.09 లక్షల కోట్ల ఆస్తులను నిర్వహిస్తూ, హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ అగ్రస్థానంలో ఉంది. రిలయన్స్ ఎంఎఫ్ నిర్వహణలోని ఆస్తులు 13% వృద్ధితో రూ.1.02 లక్షల కోట్లకు పెరిగాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ నిర్వహణలోని ఆస్తులు ఆకర్షణీయంగా 19 శాతానికి పైగా పెరిగి రూ.97,200 కోట్లకు చేరాయి.
జనవరి - 6
¤    ఆర్థిక మందగమనంలోనూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు 12.33% పెరిగి రూ.4.81 లక్షల కోట్లకు చేరాయి.
          

»   అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో వసూళ్లు రూ.4.29 లక్షల కోట్లు. నికరంగా 12.53% పెరిగి రూ.3.69 లక్షల కోట్ల నుంచి రూ.4.15 లక్షల కోట్లకు చేరినట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది.
          
»  2013-14 కు ప్రభుత్వం ప్రత్యక్ష పన్ను వసూళ్ల లక్ష్యాన్ని రూ.6.68 లక్షల కోట్లుగా నిర్దేశించింది. అంతక్రితం ఏడాది సాధించిన రూ.5.65 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 19% ఎక్కువ.
జనవరి - 9
¤    ప్రభుత్వరంగ టెలికాం కంపెనీలు ఎంటీఎన్ఎల్, బీఎస్ఎన్ఎల్ లకు సుమారు రూ.11,258.48 కోట్లు తిరిగి ఇవ్వాలనే ప్రతిపాదనను కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. ఈ రెండు సంస్థలూ బ్రాడ్‌బ్యాండ్ వైర్‌లెస్ యాక్సెస్ (బీడబ్ల్యూఏ) స్పెక్ట్రమ్‌ను స్వాధీనం చేసినందుకు ఈ సొమ్మును వాటికి వాపసు చేయనున్నారు.
         

»  2010లో బీడబ్ల్యూఏ స్పెక్ట్రమ్ కేటాయింపునకు వేలం నిర్వహించారు. ఆ వేలంలో బిడ్‌లు వేసి, నెగ్గిన సంస్థలు పేర్కొన్న మొత్తానికి సమానమైన మొత్తాలనే ఎంటీఎన్ఎల్, బీఎస్ఎన్ఎల్‌లు చెల్లించాలని ప్రభుత్వం సూచించింది. దీంతో బీఎస్ఎన్ఎల్ రూ.8,313.8 కోట్లు, ఎంటీఎన్ఎల్ రూ.4,534 కోట్లు చెల్లించాయి. కానీ, ఈ చెల్లింపులు నష్టాలతో సతమతమవుతున్న ఆ రెండు కంపెనీలకూ భారమయ్యాయి. ఎంటీఎన్ఎల్ రూ.4,533.97 కోట్లు అందుకోనుంది. బీఎస్ఎన్ఎల్ 6 సర్కిళ్లలోని స్పెక్ట్రమ్‌ను మాత్రమే తిరిగి ఇస్తున్న కారణంగా రూ.6,724.51 కోట్లను పొందనుంది. ఈ ఆరు సర్కిళ్లలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, కోల్‌కతాలు ఉన్నాయి.

¤    నవరత్న హోదా ఉన్న విశాఖ ఉక్కు (రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్-ఆర్ఐఎన్ఎల్) సిగలో మరో కలికితురాయి చేరింది.
        

»  'పని ప్రదేశ యాజమాన్య నిర్వహణ వ్యవస్థ-వర్క్‌ప్లేస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌'లో మెరుగైన ప్రతిభ కనబరచిన '5 ఎస్' ధ్రువీకరణ పత్రం సాధించింది.
       
»
  దేశంలోని ఉక్కు పరిశ్రమ రంగంలో ఈ ధ్రువీకరణ పొందిన తొలి పరిశ్రమగా విశాఖ ఉక్కు ఘనత దక్కించుకుంది.
       
»
  పరిశ్రమల్లోని విభాగాలకు కూడా ఈ ధ్రువీకరణ ఇస్తుంటారు. విశాఖ ఉక్కు విషయంలో మొత్తం పరిశ్రమకు ఈ గౌరవం దక్కడం విశేషం.
       
»
  నాణ్యతాప్రమాణాలు పాటిస్తూ వాణిజ్యంలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు వీలుగా, పరిశ్రమల్లోని పని ప్రదేశాల్లో సమర్థ యాజమాన్య నిర్వహణకు జపాన్ ఈ '5 ఎస్' ధ్రువీకరణను ప్రవేశ పెట్టింది.
జనవరి - 10
¤    దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందన్న ఆశలను నీరుగారుస్తూ, నవంబరు నెలలో పారిశ్రామికోత్పత్తి మైనస్ 2.1% కుంగింది. తయారీ రంగం పేలవమైన పనితీరును కనబరచడం, వినియోగ వస్తువుల ఉత్పత్తి.. ముఖ్యంగా గృహోపకరణాల ఉత్పత్తి తగ్గడం దీనికి కారణమైంది. కర్మాగారాల ఉత్పాదన 2012 నవంబరులో 1% తగ్గింది.

¤    ఎగుమతుల వృద్ధి గత డిసెంబరులో 3.49 శాతంగా నమోదయింది. ఇది ఆరునెలల కనిష్ఠ స్థాయి. ఎగుమతులు డిసెంబరులో 26.3 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఏడాది క్రితం ఎగుమతులు 25.4 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్నాయి. అయితే దిగుమతులు మాత్రం 15.25% తక్కువగా 36.4 బిలియన్ డాలర్ల మేరకు ఉన్నాయి. ముఖ్యంగా బంగారం, వెండి దిగుమతులు నెమ్మదించాయి. ఫలితంగా వాణిజ్యలోటు 10.1 బిలియన్ డాలర్లకు పరిమితమయింది. నవంబరులో వాణిజ్యలోటు 9.22 బిలియన్ డాలర్లుగా ఉంది. 2012 డిసెంబరులో వాణిజ్య లోటు 17.5 బిలియన్ డాలర్లుగా ఉంది.

¤    సహజవాయువు ధరను ఖరారు చేసేందుకు కొత్త విధానాన్ని ప్రభుత్వం నోటిఫై చేసింది. దీనిప్రకారం ఏప్రిల్ ఒకటోతేదీ నుంచి దేశంలో ఉత్పత్తయ్యే
సహజవాయువుకు ఒక్కో యూనిట్ (మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్- ఎంబీటీయూ)కు ధర 8.2 డాలర్ల నుంచి 8.4 డాలర్ల మధ్య ఉంటుంది. ఇప్పుడున్న 4.2 డాలర్ల ధరకు ఇది రెట్టింపు.


¤    దక్షిణ కొరియాకు చెందిన ఉక్కు తయారీ సంస్థ 'పోస్కో' ఒడిశాలో రూ.52,000 కోట్లతో ఏర్పాటు చేయాలనుకున్న ఉక్కు ఉత్పత్తి కేంద్రానికి ఎట్టకేలకు పర్యావరణ అనుమతులు లభించినట్లు కొత్తగా పర్యావరణ మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టిన ఎం.వీరప్పమొయిలీ వెల్లడించారు.        
»  దక్షిణకొరియా అధ్యక్షుడు పార్క్ గెయున్‌హై భారత పర్యటనకు వస్తున్న వారం రోజుల ముందు ఈ అనుమతి లభించడం గమనార్హం.        
»  భారత్‌లో అతిపెద్ద మొత్తం ఎఫ్‌డీఐతో ఏర్పాటవుతున్న ప్రాజెక్టు ఇదే. 2005 నుంచి ఈ ప్లాంట్ నిర్మాణానికి అవాంతరాలు ఎదరవుతూ ఉన్నాయి. పర్యావరణ శాఖ నుంచి 2007లో తొలి అనుమతి, 2011లో తుది అనుమతి లభించాయి. అయినా, పర్యావరణ కారణాలను చూపిస్తూ 2012 మార్చిలో జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆ అనుమతులను రద్దు చేసింది.

¤    ప్రభుత్వ యాజమాన్యంలో పని చేస్తున్న 11 పెద్ద కంపెనీల షేర్లతో ఒక ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్)ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని మార్కెట్లో ఆఫర్ చేయాలని, తద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.3,000 కోట్లు సమీకరించాలనే ఉద్దేశంతో ఉంది.        
»  ఈటీఎఫ్‌లో ఓఎన్‌జీసీ, కోల్ ఇండియా, పవర్‌గ్రిడ్, ఆర్ఈసీ, ఆయిల్ఇండియా, కంటైనర్ కార్పొరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్, ఇంజినీర్స్ ఇండియా, భారత్ ఇంజినీరింగ్ ఉంటాయి.
జనవరి - 13
¤    దేశంలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న విమానాల నిర్వహణ, మరమ్మతు (మెయిన్‌టెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్‌హాల్ - ఎంఆర్ఓ) పరిశ్రమకు గట్టి ఊతం లభించింది. దీనికి మౌలిక సదుపాయాల హోదా కల్పించారు.
        

»   ఎయిర్‌పోర్టు మౌలిక సదుపాయాల్లో భాగంగా ఎంఆర్ఓ పరిశ్రమను పరిగణించాలని నిర్ణయించినట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. విదేశీ వాణిజ్య రుణాల కోసం ఈ హోదాను కల్పించింది.
        

»   ప్రస్తుతం దేశంలో ఎంఆర్ఓ పరిశ్రమ వార్షిక టర్నోవరు 80 కోట్ల డాలర్లు. విమానయాన పరిశ్రమ వృద్ధి చెందుతూ ఉండటంతో, వచ్చే దశాబ్ద కాలంలో ఎంఆర్ఓ పరిశ్రమ ఏడాదికి 10% పెరుగుదలను నమోదు చేయగలదని అంచనా. ప్రపంచ ఎంఆర్ఓ మార్కెట్ విలువ 5,000 కోట్ల డాలర్లు.
జనవరి - 16
¤    ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ)లో 10% ప్రభుత్వ వాటాను ఓఎన్‌జీసీ, ఓఐఎల్ లకు విక్రయించడానికి సాధికార మంత్రుల బృందం (ఈజీవోఎం) ఆమోదం లభించింది. చమురుశాఖ అభ్యంతరం తెలిపినప్పటికీ, ఆర్థికమంత్రి చిదంబరం నేతృత్వంలోని ఈజీవోఎం ఈ విషయంలో ముందుకు వెళ్లడానికి నిశ్చయించుకుంది. దీంతో ప్రభుత్వానికి రూ.4,800 కోట్ల నుంచి రూ.5,000 కోట్ల వరకు సమకూరే అవకాశం ఉంది.
జనవరి - 21
¤     నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) వడ్డీరేటు ఫ్యూచర్స్ (ఐఆర్ఎఫ్) క్రయ విక్రయాలను ప్రారంభించింది. తొలిరోజున రూ.3 వేల కోట్లకు పైగా విలువైన లావాదేవీలు నమోదయ్యాయి.
      
»
   ఐఆర్ఎఫ్ కాంట్రాక్టును 'ఎన్ఎస్ఈ బాండ్ ఫ్యూచర్స్‌
'గా వ్యవహరిస్తున్నారు. పదేళ్ల గడువు ఉండే ప్రభుత్వ బాండ్ ప్రాతిపదికగా ఈ కాంట్రాక్టులో క్యాష్ సెటిల్‌మెంట్ ఉంటుంది.
      
»
   బ్యాంకులు, బ్రోకరేజీ సంస్థలు, బీమా కంపెనీలు, ప్రైమరీ డీలర్లు తదితర వర్గాలకు ఈ పథకం ప్రయోజనకరం.
జనవరి - 22
¤     నల్లధనాన్ని, నకిలీ కరెన్సీ నోట్లను అరికట్టే లక్ష్యంతో ఆర్‌బీఐ కఠిన చర్యలకు ఉపక్రమించింది. 2005కు ముందు జారీ చేసిన రూ.500, రూ.1,000 నోట్లను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. మార్చి 31 తర్వాత ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.
      

»   దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని, పాతనోట్లు చెల్లుబాటు అవుతాయని, కాకపోతే, వాటిని ఏప్రిల్ 1 నుంచి బ్యాంకుల్లో మార్చుకోవాలని  పేర్కొంది.
      
»   2005కు ముందున్న కరెన్సీ నోట్లపై వాటిని ముద్రించిన సంవత్సరం ఉండదు. 2005 తర్వాత విడుదలైన నోట్ల వెనుక కింది భాగంలో ముద్రించిన ఏడాది ఉంటుంది.
ఈ తేడాతో పాత నోట్లను సులభంగా గుర్తించవచ్చు. 2005 తర్వాత ముద్రించిన కరెన్సీ నోట్ల విషయంలో ఆర్‌బీఐ పలు జాగ్రత్తలు తీసుకుంది. వీటికి నకిలీవి సృష్టించడం అంత సులభం కాదు.

¤     దేశ మౌలిక సదుపాయాల కల్పన రంగంలో ప్రైవేటు పెట్టుబడులకు ఊతం అందించే ఉద్దేశంతో ఆసియా అభివృద్ధి బ్యాంక్ 400 మిలియన్ డాలర్ల (రూ.2,472.4 కోట్ల) రుణాన్ని భారత్ కు అందించాలని నిర్ణయించింది.
జనవరి - 23
¤     ప్రజాదరణ పొందిన వీడియో వెబ్‌సైట్ యూట్యూబ్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన ఛానల్‌ను ప్రారంభించింది. దీని ద్వారా సామాజిక మీడియా రంగంలో తన ఉనికిని పటిష్ఠపరచుకునే దిశగా అడుగు వేసింది
     
»    మొదటి దశలో యూట్యూబ్‌లోని ఎస్‌బీఐ ఛానల్‌లో బ్యాంక్ పథకాలు, సేవలకు సంబంధించిన సమాచారం ఉంటుంది. క్రమంగా మరిన్ని అంశాలను చేరుస్తారు. గత ఏడాది నవంబరులో ఎస్‌బీఐ ఫేస్‌బుక్‌తో అనుసంధానమైంది.

¤     గతేడాది 99.8 లక్షల వాహనాలను విక్రయించి ప్రపంచంలో అగ్రగామి వాహన తయారీ కంపెనీగా తనకున్న పేరును జపాన్‌కు చెందిన టయోటా నిలబెట్టుకుంది.
    
»
    అమెరికా ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న జనరల్ మోటార్స్ (జీఎం) గతేడాది 97.1 లక్షల కార్లు అమ్మింది.
    
»
    టయోటా 2008లోనే ప్రపంచ అగ్రగామి వాహన కంపెనీగా ఘనతను చేజిక్కించుకుంది. అప్పటికి పది సంవత్సరాలుగా జీఎం కొనసాగుతోంది. 2011లో అగ్రగామి కిరీటాన్ని కోల్పోయిన టయోటా 2012లో తిరిగి తన పూర్వ వైభవాన్ని దక్కించుకుంది.
జనవరి - 24
¤     శాశ్వత ఖాతా సంఖ్య (PAN - పాన్) కేటాయింపు విషయంలో ఆదాయ పన్ను విభాగం నిబంధనలను సవరించింది. పాన్ కోసం ఇక గుర్తింపు, చిరునామా, పుట్టిన తేదీలకు సంబంధించిన అసలు పత్రాలను దరఖాస్తు చేసే సమయంలోనే చూపించాల్సి ఉంటుంది. కేటాయింపు ప్రక్రియలో ఈ మార్పు 2014 ఫిబ్రవరి 3 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర ఆర్థికశాఖ ప్రకటించింది.

¤     పంజాబ్‌లోని టోన్సాలో ర్యాన్‌బాక్సీ కంపెనీకి ఉన్న యూనిట్లో తయారయ్యే ముడి ఔషధాన్ని (యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్‌గ్రేడియంట్స్ - ఏపీఐ) తమ దేశంలో విక్రయించరాదని అమెరికా ఆదేశాలు జారీ చేసింది.
     
»     అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్‌డీఏ) నిబంధనలు విధించిన నాలుగో ర్యాన్‌బాక్సీ యూనిట్ ఇది.
జనవరి - 28
¤     రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురాం రాజన్ ముంబయిలో ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్షను ప్రకటించారు.
ముఖ్యాంశాలు
     
»    రెపోరేటు 8 శాతానికి పెంపు. ఇప్పటివరకూ 7.75% ఉంది. రివర్స్ రెపోరేటు పావు శాతం పెంపుతో 7 శాతానికి చేరింది.     
»    4% వద్దే నగదు నిల్వల నిష్పత్తి.
     

»    9%గా ఉన్న మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్ఎఫ్) యథాతథం.
     

»    ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధిరేటు 5% కంటే తక్కువ.
     

»    జీడీపీ 2014-15లో 5.5 శాతానికి చేరుతుంది.
     

»    2013-14లో కరెంట్ ఖాతా లోటు 2.5% కంటే తక్కువే ఉంటుంది.
     

»    మార్చి చివరి నాటికి ద్రవ్యోల్బణం 8% మించుతుంది.
     

»    రేట్ల పెంపు ద్రవ్యోల్బణాన్ని తగ్గింపు బాట పట్టిస్తుంది.
     

»    ఇకనుంచి సమీక్షను ప్రతి రెండు నెలలకు ఒకసారి నిర్వహించాలని నిర్ణయించారు.
     

»     తదుపరి సమీక్షను ఏప్రిల్ 1న నిర్వహించనున్నారు
జనవరి - 31
¤     వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2014-15) రాష్ట్ర వార్షిక రుణ ప్రణాళికను నాబార్డ్ విడుదల చేసింది. రుణ ప్రణాళిక మొత్తాన్ని రూ.1,25,039 కోట్లుగా అంచనా వేసింది. ఇది గత ఏడాది కంటే 14.58% ఎక్కువ.

¤     స్థూల దేశీయోత్పత్తి గణాంకాలను కేంద్రీయ గణాంక కార్యాలయం (సీఎస్ఓ) విడుదల చేసింది.ముఖ్యాంశాలు     »    గత ఆర్థిక సంవత్సరానికి (2012-13) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు అంచనాలకంటే తగ్గింది. జీడీపీ వృద్ధిరేటు 5% ఉంటుందని అంచనా వేయగా, 4.5 శాతానికే పరిమితమైంది.     
»    వ్యవసాయం, గనులు, తయారీ రంగాల్లో ఆశించిన స్థాయి ఉత్పత్తి లేకపోవడంతో వృద్ధిరేటు తగ్గింది.     
»    గత ఆర్థిక సంవత్సరానికి స్థూల దేశీయోత్పత్తి 2004-05 స్థిర ధరల వద్ద రూ.54.8 లక్షల కోట్లుగా ఉంది. అంతకుముందు ఏడాదిలో నమోదైన రూ.52.5 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 4.5% ఎక్కువ. గత దశాబ్ద కాలంలోనే 2012-13 వృద్ధిరేటు కనిష్ఠ స్థాయి. 2002-03లో 4% వృద్ధిరేటు నమోదయింది. ఆ తరువాత ఇదే తక్కువ.