కంప్యూటర్ అంటే ఏమిటి? |
కంప్యూటర్ అనునది ఒక ఎలక్ట్రానిక్ ఉపకరణం. ఈ ఉపకరణాన్ని ఖచ్చితంగా నిర్వచించాలంటే కష్టతరమనే చెప్పాలి. కంప్యూటర్ అనే పరికరం కాలక్రమేణా ఎన్నో మార్పులు చెందటం వల్ల ఫలానా యంత్రమే కంప్యూటర్ అని నిర్వచించటం కష్టమౌతుంది. మునుపు కంప్యూటర్ అని పిలువబడ్ద యంత్రాలు వేర్వేరు పనులకై ఉపయోగింపబడటం వలన కూడా ఫలానా పని చేసే యంత్రమే కంప్యూటర్ అని చెప్పటం కూడా కష్టమౌతుందనే చెప్పాలి. కానీ ఈ క్రింది నిర్వచనాల ద్వారా కంప్యూటరు అంటే ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం చెప్పవచ్చు. |
కన్సైజ్ ఆక్స్‌ఫర్డు ఆంగ్ల డిక్షనరి కంప్యూటర్‌ను "ముందుగా నిర్ధారించబడిన ఆదేశాల అనుసారం సమాచారాన్ని నిక్షేపించి (store), విశ్లేషించగల (process/analyze) ఒక ఎలెక్ట్రానిక్ పరికరం" అని నిర్వచిస్తోంది. ఈ నిర్వచనం కంప్యూటర్‌ను ఒక విశ్లేషణా యంత్రంగా లేక పరికరంగా చూస్తుంది. |
వెబ్‌స్టర్స్ ఆంగ్ల డిక్షనరి కంప్యూటర్‌కు "సమాచారాన్ని నిక్షేపించి (store) , అనుదానించి (retrieve), విశ్లేషించగల (process/analyze), ప్రోగ్రామబుల్ ఐన (సామాన్యంగా ఎలెక్ట్రానిక్) పరికరం" అనే నిర్వచనాన్ని చెబుతోంది. ఈ నిర్వచనంలో నాన్-ఎలెక్ట్రానిక్ పరికరాలు కూడా కంప్యూటర్లు అనబడవచ్చనే అర్థం గోచరిస్తోంది |
సురేశ్ బసంద్ర తన కంప్యూటర్స్ టుడే అనే పుస్తకంలో ఈ పరికరాన్ని "విపులమైన ఆదేశాల అధారంగా, దత్తాంశాలను (డేటాను) స్వీకరించి, విశ్లేషించి, ఫలితాలను ప్రదానం చేస్తూ సమస్యలను పరిష్కరించగల యంత్రం," అని నిర్వచించారు. ఈ నిర్వచనంలో కంప్యూటర్‌ను 'సమస్యలను పరిష్కరించే యంత్రం' అని గుర్తించటం జరిగింది |
చరిత్ర |
మొదట్లో రెండు రకాల కంప్యూటర్లు వాడుకలో ఉండేవి. అంక కలన యంత్రాలు (digital computers), సారూప్య కలన యంత్రాలు (analog computers). మధ్యలో కొన్నాళ్ళపాటు సంకర కలన యంత్రాలు (hybrid computers) వచ్చాయి. పోటీలో అంక కలన యంత్రాలు గెలవటం వల్ల ఇప్పుడు 'అంక' అన్న విశేషణాన్ని తీసేసి మామూలుగా కలన యంత్రం అని కానీ, కంప్యూటర్ అని కానీ అంటున్నారు. ఈ మధ్య కాలములో కంప్యూటరు "సంగణకము" అనే పేరుతో ప్రాచుర్యము పొందుతోంది. |
ఈ రోజుల్లో ఎక్కువ వాడుకలో ఉన్న కంప్యూటర్‌ను పోలిన యంత్రాలు మొట్టమొదట రెండవ ప్రపంచ యుద్ధం అంతం అయ్యే రోజులలో వెలిసేయి. పూర్వం ఈ కలన యంత్రాలు చాల భారీగా ఉండేవి. ఒకొక్క యంత్రానికి ఒకొక్క పెద్ద గది కావలసి వచ్చేది. పైపెచ్చు ఒక్కొక్కటి కోట్ల కొద్ది రూపాయలు ఖరీదు చేసేది. ఎంతో వ్యయ ప్రయాసలతో కూడిన అధిస్థాపన (establishment) కనుక ఈ యంత్రాన్ని ఎంతోమంది ఉమ్మడిగా వాడుకొనే వారు. ఇటువంటి ఉమ్మడి యంత్రాలు ఇప్పుడూ ఉన్నాయి. ఈ రోజుల్లో ఇటువంటి వాటిని ప్రత్యేక వైజ్ణానిక అవసరాలకు ఉపయోగించుతున్నప్పుడు సూపరు కంప్యూటరు అని, పెద్దపెద్ద సంస్థల వ్యాపార లావాదేవీలు (transactions) సంవిధానం (processing) చేస్తున్నప్పుడు మెయిన్ ఫ్రేము కంప్యూటరు అని సంభోదిస్తూ ఉంటారు. ఇవి అపరిమితమయిన గణన సౌకర్యాలు కలిగి ఉంటాయి. |
ఈ రోజుల్లో కంప్యూటర్లు బాగా శక్తివంతమూ అయేయి, చవకా అయేయి; పైపెచ్చు బాగా చిన్నవీ అయేయి. దాని వల్ల భారీ యంత్రాల వాడుక పడిపోయింది; ఎవరి కంప్యూటరు వారే సొంతంగా కొనుక్కోగలిగే స్థాయికి ఎదిగేం. ఈ సొంత కంప్యూటర్లనే ఆంగ్లంలో personal computer అనీ, హ్రస్వంగా PC అనీ, తెలుగులో వ్యక్తిగత కంప్యూటరు అనీ అంటున్నారు. ఈ సొంత కంప్యూటర్లు బల్లమీద పెట్టుకునే రకాలు (desktop), ఒళ్ళో పెట్టుకునే 'ఉరోపరి' (laptop), చేత్తో పట్టుకునేవి (hand-held) అలా రకరకాల ప్రమాణాల్లో వస్తున్నాయి. పుస్తకం సైజులో ఉన్నవాటిని నోటుబుక్కు కంప్యూటరు అని పిలుస్తారు. ఇతర వస్తువులను నియంత్రించుటకు ఉపయోగించే వాటిని embedded computers అంటారు. ఉదాహరణకు డిజిటలు కెమెరాలు, ఉతికే యంత్రాలు (వాషింగు మెషీనులు) మొదలగు వాటిలో వాడే కంప్యూటర్లు ఎంబెడెడు కంప్యూటర్లు. అంతేకాదు పెద్ద విమానాలను సైతం నడిపే కంప్యూటర్లను ఎంబెడెడు కంప్యూటర్లు అనవచ్చు. పెద్దదైనా, చిన్నదైనా కంప్యూటరు పనిచేసే పద్ధతి ఒక్కటే. సిద్ధాంతమూ ఒక్కటే. |
ఇంకా కొత్త కొత్త రకాల కంప్యూటర్లు పరిశోధన స్థాయిలో ఉన్నాయి.
క్వాంటం శాస్త్రపు సూత్రాలని ఉపయోగించి నిర్మాణం జరిగితే అవి క్వాంటం
కంప్యూటర్లు. అలాగే DNA (అంటే జీవ కణాలలోని వారసవాహికలు) లో నిబిడీకృతమైన
సూత్రాలని ఉపయోగించి నిర్మాణం జరిగితే అవి DNA కంప్యూటర్లు. |
కంప్యూటర్లు చెయ్యగలిగే పనులు |
ఈ రోజుల్లో కంప్యూటర్ల చేత మనం చేయించలేని పనులు లేవు. కంప్యూటర్ల సహాయం లేకుండా రైల్వే రిజర్వేషన్లు జరగవు, విమానాలు నడవవు, రాకెట్లు ఎగరవు, బేంకులో డబ్బు ధరావరతు కాదు, కార్లు నడవవు, కర్మాగారాలు నడవవు, టెలిఫోనులు పని చెయ్యవు, ఆఖరికి కంప్యూటర్ల సహాయం లేకుండా కొన్ని శస్త్ర చికిత్సలు కూడ జరగవు. కంప్యూటర్లు ఆగిపోతే ఆధునిక సమాజం ఆగిపోతుంది. కంప్యూటర్లు ఇంత ప్రతిభ చూప గలుగుతున్నాయంటే దానికి కొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయి. అవి: |
కంప్యూటర్లు అత్యంత వేగంతో పని చేస్తాయి. |
అలుపు లేకుండా చేసిన పనినే పదే పదే చెయ్యగలవు. |
చేసే పని తప్పులు లేకుండా చేస్తాయి. |
వచ్చిన చిక్కల్లా కంప్యూటర్లు ఎప్పుడు ఏ పని చెయ్యాలో అంతా మనం అరటిపండు ఒలిచినట్లు విడమర్చి చెప్పాలి. మనం చెప్పటంలో తప్పుంటే కంప్యూటరు తప్పు చేస్తుంది కాని తనంత తాను తప్పు చెయ్యదు. |
కంప్యూటరు ఎప్పుడు ఏమిటి చెయ్యాలో విడమర్చి చెప్పే ఆదేశాలని ఇంగ్లీషులో instructions అని కాని commands అని కాని అంటారు. ఇలా ఆదేశాలని ఒక క్రమంలో రాసినప్పుడు దానిని తెలుగులో 'క్రమణిక' అనిన్నీ ఇంగ్లీషులో ప్రోగ్రామ్ (program) అని అంటారు. ఇలా ప్రోగ్రాములు రాసే ప్రక్రియని ప్రోగ్రామింగ్ (programming) అంటారు. ఈ ప్రోగ్రాములు రాసే వ్యక్తిని ప్రోగ్రామర్ (programmer) అంటారు. కంప్యూటర్‌లో రకరకాల పనులు చెయ్యటానికి రకరకాల క్రమణికలు వాడతారు. ఒకొక్క రకం ప్రోగ్రాము కి ఒకొక్క పేరు ఉంటుంది. ఉదాహరణకి ఎసెంబ్లర్, కంపైలర్, ఆపరేటింగ్ సిస్టమ్, మొదలైనవి కొన్ని రకాల ప్రోగ్రాములు. ఈ ప్రోగ్రాములన్నిటిని కలిపి ఇంగ్లీషులో సాఫ్‌ట్‌వేర్ (software) అంటారు. ఇలా ప్రోగ్రామర్లు రాసిన సాఫ్‌ట్‌వేర్ ని కంప్యూటర్ లోనే ఒకచోట భద్రపరుస్తారు. ఇలా భద్రపరచిన ప్రదేశాన్ని కొట్టు (store or memory) అంటారు. ఈ కొట్టు గదిలో దాచిన సాఫ్‌ట్‌వేర్ లోని ఆదేశాలని ఒకటీ ఒకటి చొప్పున కంప్యూటరు బయటకి తీసి, చదివి, అర్ధం చేసుకొని, ఆ ఆదేశాన్ని ఆచరణలో పెడుతుంది. ఇదంతా దరిదాపు విద్యుత్‌వేగంతో జరిగిపోతుంది. సెకెండుకి మిలియను ఆదేశాలని ఆచరణలో పెట్టగలిగే కంప్యూటర్లు సర్వసామాన్యం. |
కంప్యూటర్లని రెండు విభిన్న కోణాల నుండి అధ్యయనం చెయ్య వచ్చు. మనిషికి స్థూలమైన భౌతిక శరీరం, కంటికి కనిపించని సూక్ష్మమైన ఆత్మ ఉన్నట్లే కంప్యూటర్లకి స్థూలకాయం (హార్డ్‌వేర్), సూక్ష్మకాయం (software) అని రెండు భాగాలు ఉన్నాయి. సూక్ష్మ కాయం నివసించడానికి స్థూలకాయం కావాలి. అలాగే సూక్ష్మ కాయం లేక పోతే స్థూలకాయం ప్రాణం లేని కట్టె లాంటిది. |
సిద్ధాంతపరంగా చూస్తే ఎటువంటి సమాచారమునయినా సంవిధానపరుచుటకు మనము కంప్యూటర్లను ఉపయోగించవచ్చు. చర్చి-టూరింగు సిద్దాంతంప్రకారం, ఒక నిర్దేశిత కనీస సామర్థ్యము ఉన్న కంప్యూటరుతో - అది పాకెటు డైరీ కానీవండి లేదా పెద్ద సూపరు కంప్యూటరు కానీయండి - మనము చేయగలిగే ఎటువంటి కార్యమునయినా నియంత్రించవచ్చు. కాబట్టి ఒకే రూపకల్పనను మనము వివిధ కార్యములను నెరవేర్చేటందుకు మలచవచ్చు. అవి కంపెనీలో జీతాల జాబితాలను నియంత్రించేది కావచ్చు లేదా ఫ్యాక్టరీలలో యంత్రాలను పనిచేయించే రాబోటులను నియంత్రించేవి అయినా అవచ్చు |
కంప్యూటర్ లో భాగాలు |
గణిత-తర్క విభాగము - అరిత్‌మెటిక్ అండ్ లాజికల్ యూనిట్ (ఏ ఎల్ యు) |
ఏ ఎల్ యు. ఇది రెండు రకాల పనులు నిర్వర్తించును: గణిత కార్యకాలాపాలు అనగా కూడికలు (additions), తీసివేతలు (subtractions), గుణింతములు (multiplications), భాగాహారములు (divisions). రెండవ రకమయిన కార్యములు తర్కమునకు (logic) సంబంధించినవి. ఇది సెంట్రల్ ప్రోసెసింగ్ యూనిట్ లో (సి.పి.యు) ముఖ్యమైన భాగం |
నియంత్రించు విభాగము - కంట్రోలు యూనిట్ |
నియంత్రణ వ్యవస్త. దీనికి కేటాయించిన ముఖ్యమయిన పనులు: ఆదేశములను మరియు డేటాను మెమరీ నుండి లేదా ఐ/ఓ నుండి చదవటం, ఆ ఆదేశములను అర్ధం చేసుకోవటం, ఏ ఎల్ యు కు ఆదేశానుసారము సరిఅయిన సంఖ్యలను అందించటం, ఏ ఎల్ యు కు ఆ సంఖ్యలతో ఏమి చేయాలో చెప్పటం, వచ్చిన ఫలితములను తెరిగి మెమరీ వద్దకు గానీ ఐ/ఓ వద్దకు గానీ పంపించటం. ఈ విభాగములో కౌంటరు అను ఒక లెక్కపెట్టే పరికరము ప్రస్తుత ఆదేశము నిల్వ ఉన్న చిరునామా యొక్క జాడను ఎల్లప్పుడూ తెలుపుతూ ఉంటుంది. సాధారణంగా ఒక ఆదేశము నిర్వర్తించగానే ఈ కౌంటరు యొక్క లెక్క పెరుగును. దీని వలన తరువాతి ఆదేశమును చదువుటకు వీలగును. అప్పుడప్పుడు ప్రసుత ఆదేశమే తరువాతి ఆదేశము యొక్క చిరునామాను తెలుపును. అటువంటి సమయాలలో కౌంటరు యొక్క లెక్కను సరిచేయటమే ఆదేశముగా భావించవలెను. 1980ల నుండి ఏ ఎల్ యు మరియు నియంత్రించు విభాగము భౌతికంగా ఒకే చిన్న ఇంటిగ్రేటెడ్ సర్క్యూటులో ఉంచబడినవి. దానిని కేంద్రీయ సంవిధాన విభాగము - సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ (సి పి యు) అంటారు. |
మెమొరీ యూనిట్ |
కంప్యూటరు యొక్క జ్ణాపకశక్తిని వరుసగా పేర్చిన గదుల పెట్టెలుగా భావించవచ్చు. ప్రతీ గదికీ ఒక ప్రత్యేక సంఖ్య చిరునామాగా ఉంటుంది. ప్రతీ గదిలో సమాచారమును భద్రపరచవచ్చు. ఈ సమాచారము కంప్యూటరుకు ఇవ్వవలసిన ఆదేశములు అయి ఉండవచ్చు, లేదా దత్తాంశాలు (డేటా, అంటే ఆదేశాలను నిర్వర్తించుటకు కావలిసిన సమాచారము) అయినా అయిఉండవచ్చు. శాస్త్ర ప్రకారం మనము ఆదేశాలను కానీ దత్తాంశాలను కానీ భద్రపరుచుటకు ఏ గది నయినా ఉపయోగించవచ్చు. |
ఇన్‌పుట్ /ఔట్‌పుట్ యూనిట్ -(ఐ/ఓ) |
ఈ విభాగము బయట ప్రపంచము నుండి సమాచారము సేకరించుటకు, మరియు ఫలితములను బయట ప్రపంచమునకు తెలుపుటకు ఒక సాధనముగా ఉపయోగపడును. ఒక మామూలు వ్యక్తిగత కంప్యూటరులో సమాచారమును ప్రవేశపెట్టుటకు కీబోర్డు మరియు మౌసులను, బహిర్గపరుచుటకు కంప్యూటరు మానిటరు, ప్రింటరు మొదలగు వాటిని ఉపయోగిస్తాము. ఇవి కాక ఇంకా ఎన్నో సాధనములను కంప్యుటరుకు బయట ప్రపంచమునకు మధ్య మార్పిడికి ఉపయోగిస్తారు. |
సాధారణముగా ఇటువంటి కంప్యూటరు యొక్క పనిచేయు విధానము చాలా సూటిగా ఉంటుంది. కౌంటరు యొక్క లెక్క పెరిగిన ప్రతీసారి ఒక క్రొత్త ఆదేశమును, దానికి సంబందించిన డేటాను మెమరీ నుండి చదివి దానిని నిర్వర్తించడము, తిరిగి ఫలితములను మెమరీలో బద్రపరచటం, మళ్ళీ తరువాతి ఆదేశమును స్వీకరించటం. ఈ విధముగా హాల్ట్ (ఆగుము) అను ఆదేశము వచ్చు వరకు జరుగుతూనే ఉంటుంది. |
పెద్ద పెద్ద కంప్యూటర్లలో ఈ నమూనాలో కొంచం తేడా ఉండును. వాటిలో ఒక సిపియు బదులుగా అనేక మయిన సిపియులు ఉండును. సూపరు కంప్యూటర్లలో ఈ నిర్మాణము మరింత తేడాగా ఉండును. వాటిలో కొన్ని వేల సిపియులు ఉండును, అట్టి నిర్మాణములు ప్రత్యేకమయిన కార్యములకు మాత్రమే ఉపయోగించుతారు. |
కంప్యూటర్ అభివృద్దిక్రమం |
కంప్యూటర్ ముఖ్యంగా లెక్కలు చేసేందుకు ఉపయోగించుట కొరకు తయారు చేయబడినది. క్రీస్తు పూర్వం చైనీయులు అబాకస్ అనే సాధనాన్ని లెక్కలు చేసేందుకు వినియోగించేవారు. జాన్ నేపియర్ అను స్కాట్‌లాండ్ దేశ గణిత శాస్త్రజ్ఞుడు గుణకారములను సులభముగా చేయుటకు నేపియర్ బోన్స్ అనే ఎముకలతో తయారు చేయబడిన సాధనమును ఉపయోగించాడు. అదే జాన్ పియర్ తరువాత 1617లో లూగరిధమిక్ టేబుల్స్ను గుణకారములను భాగహారములను చేసేందుకు తయారు చేసి ఉపయోగించాడు. 1620వ సంవత్సరంలో లూగరిధమ్స్ టేబుల్ ద్వారా కొంత అభివృద్ది చేసి స్లైడ్ రూల్కనుగొన్నాడు. అయితే ఇవన్నీ మానవ శక్తితో పనిచేసేవే. |
వీటి తదనాంతరం రూపుదిద్దుకొన్నదే పాస్కల్ ఇది గేర్లు ఇనుప చక్రములు వినియోగించి చేసిన మొదటి యంత్రమనవచ్చు. 1671వ సంవత్సరంలోగాట్ఫ్రెడ్ లైబెంజ్ అను అతడు పాస్కల్ యంత్రానికి మార్పులు చేర్పులు చేసి కూడికలు తీసివేతలతోపాటు గుణకారములు, భాగహారములు కూడా సులభముగా చేయగల్గే లీబ్ నిడ్జ్ అనే యంత్రమును తయారు చేసాడు. 1823వ సంవత్సరంలో కంప్యూటర్ పితామహుడుగా పిలవబడే చార్లెస్ బాబేజ్అను గణిత శాస్త్రజ్ఞుడు ఆల్జీబ్రా ఈక్వేషన్స్ కూడా చేయగల డిఫరెన్సియల్ ఇంజన్ అనే యంత్రపరికరాన్ని తయారు చేసాడు. |
ఇతని కాలంలోనే కావలసిన విడి భాగాలు లభించి ఉంటే కంప్యూటర్ తయారయ్యి ఉండేదని అంటారు. ఎందువలనంటే డిఫెన్సియల్ ఇంజనుపై గడించిన అనుభవంతో నిముషానికి అరవై కూడికలు చేయగలిగి విలువలను మెమొరీలో దాయగల అవకాసం గల ఎనలిటికల్ ఇంజన్ రూపకల్పన చేయగలిగాడు. కాని అతని అవసరానికి సరిపడు క్వాలిటీ గల విడిభాగాలు తయారు చేయగల సామర్ధ్యం కలిగిన పరిశ్రమలు ఆనాడు లేకపోవుటచే ఎనలిటికల్ ఇంజన్ తయారు చేయలేక పోయాడు. తరువాత కంప్యూటర్ అభివృద్దికి హార్మన్ హోల్ రీత్ కృషిచేసి తను తయారు చేసిన కంప్యూటర్లను అవసరం కలిగిన కొన్ని కంపెనీలకు విక్రయించగలిగాడు. ప్రసిద్ది గాంచిన కంప్యూటర్ల సంస్థ ఐ.బి.యమ్(I.B.M) హోల్ రీత్ స్థాపించినదే. మొదటి ఎనలాగ్ కంప్యూటర్ రకానికి చెందిన లార్డ్ కెల్విన్ అభివృద్ది చేసాడు. దీని తరువాత మార్క్-1 (MARK-1) అనే కంప్యూటర్ 1948లో ఐ.బి.యమ్. సంస్థ సహకారంతో రూపొందించాడు. ఈ కంప్యూటరునే అసలైన కంప్యూటరుగా పేర్కొంటారు. దీని తరువాత వాల్వులు ఉపయోగించి కంప్యూటర్లు తయారు చేయబడినాయి. |
కంప్యూటర్ల వర్గీకరణ |
కంప్యూటర్లు అవి పనిచేసే సూత్రము బట్టి కొన్ని వర్గాలుగా విభజించారు. |
ఎన్లాగ్ కంప్యూటర్స్ |
ఇందులో భౌతికంగా మారుతుండే విలువలయిన ఉష్ణోగ్రత మరియు పీడనముల విలువలను తీసుకొని అందుకు అనుగుణమైన విద్యుత్ రంగాలను విశ్లేషించుట ద్వారా మానిటరుపై ఫలితము తెలియచేయబడుతుంది. |
డిజిటల్ కంప్యూటర్స్ |
డిజిటల్ కంప్యూటర్లలో రెండు రకాలు కలవు. సాధారణ అవసరాలు అనగా విద్య, వ్యాపారం, పారిశ్రామికం, డిజైనింగ్ లాంటి వాటిలో మొదటి రకం వాడుతుంటారు. రెండవ రకం కర్మగారములలో, భారీ సంస్థలలో, అధిక డేటా ఉండే సర్వర్లకు, మిలటరీ అవసరాలకు, అంతరిక్ష పరిశోధనా సంస్థలలో రోబోట్ లను నియంత్రించేందుకు ఇలా కొన్ని ప్రత్యేక అవసరాలను దృష్టిలో పెట్టుకొని తయారు చేయబడతాయి. మనం నిత్యం ఉపయోగించు సాధారణమైన కంప్యూటర్లను డిజిటల్ కంప్యూటర్లంటారు. డిజిట్ అంటే అంకె అనే అర్ధంతో వీటిని అలా పిలుస్తున్నారు. డిజిటల్ కంప్యూటర్లు సంఖ్య లకు సంభందించినవి. ఇన్ పుట్ ఏరూపముగా ఇవ్వబడిననూ దానిని సంఖ్యారూపములోకి మార్చుకొంటాయి. డిజిటల్ కంప్యూటర్లు సంఖ్యలను ఒక మానం నుండి వేరొక మానంలోకి (బ్రైనరీ కోడ్) గా మార్చుకొంటూ కేవలం కూడికలు తీసివేతల ద్వారా ఇన్ పుట్ను విశ్లేషిస్తూ తమ పనులను నిర్వర్తించి పలితాలను తెలియపరుస్తూఉంటాయి. ఇవి ఒక గది అంత విస్తీర్ణము నుండి అరచేతిలో ఇమిడిపోయేంత(పామ్ టాప్ కంప్యూటర్) చిన్నగా కూడా ఉంటాయి. ఇవి ఎన్లాగ్ కంప్యూటర్లతో పోలిస్తే ఖర్చు తక్కువ మరియు వేగం కూడా ఎక్కువగా ఉంటాయి. |
హైబ్రీడ్ కంప్యూటర్స్ |
కొన్ని ప్రత్యేక అవసరాలకు ఎన్లాగ్ మరియు డిజిటల్ కంప్యూటర్లను కలిపి తయారు చెస్తారు. వీటిలో కొన్ని లెక్కలు ఎన్లాగ్ కంప్యూటర్ విభాగంలోనూ మరికొన్ని డిజిటల్ విభాగంలోనూ జరుగుతాయి. ఉదాహరణకు హాస్పిటల్లలో ఐసియు విభాగాలలో వీటిని వాడుతుంటారు. ఇవి రోగి యొక్క గుండె కొట్టుకొనే రేటును ఎన్లాగ్ ద్వారా తీసుకొని మారుతూ ఉండే విలువలను డిజిటల్ సిగ్నల్స్ రూపంలో విశ్లేషించి రోగికి అపాయమేర్పడినపుడు హెచ్చరిస్తుంది. |
కంప్యూటర్ల సామర్ధ్యమును బట్టి మూడు రకాలుగానూ, వాడకమును బట్టి మూడు రకములుగాను విడగొట్టవచ్చు వాటిలో |
మొదటి రకం. |
మైక్రో కంప్యూటర్స్ |
మెయిన్ ప్రేమ్ కంప్యూటర్స్ |
సూపర్ కంప్యూటర్స్ |
రెండవరకం |
హోమ్ కంప్యూటర్లు |
మల్టీ మీడియా కంప్యూటర్లు |
ఎడ్యుకేషనల్ కంప్యూటర్లు |
కంప్యూటర్ తరాలు |
మొదటి తరం కంప్యూటర్స్ (1945-1960) |
మొదటి తరం కంప్యూటర్లలో వాక్యూం ట్యూబులను వాడి తయారు చేసేవారు. వీటిని వాడి తయారు చేసిన మొట్ట మొదటి ఎలెక్ట్రానిక్ కంప్యూటర్ ఎనియాక్(ENIAC). ఇది రిలేలతో తయారయిన కంప్యూటర్ల కంటే వేగంగా పనిచేయగలదు. సెకనుకు 5000 కూడికలు చేయగలదు. 1946లో తయారయిన ఎనియాక్లో కంప్యూటర్లో మెమొరీ ఉండేదికాదు. దీని తయారీలో 18.000 వాక్యూం ట్యూబులు, 70.000 రెసిస్టర్లు, 1000 కెపాసిటర్లు, 6000 స్విచ్చులు వాడారు. దీనిని ఉంచేందుకు చాలా ఎక్కువ స్థలము అవసరమవడమే కాక దీనిని నడిపించేందుకు 150 కె,డబ్ల్యు ల విద్యుత్ అవసరమయ్యేది. అధిక శక్తి వినియోగించుట వలన ఎక్కువ వేడి పుడుతుండేది. 1946లో జాన్ వాన్ న్యూమన్ కంప్యూటరులో ప్రోగ్రాములను దాచే విధానాన్ని ప్రతిపాదించాడు. ఈ విధానంలో ఎడ్సాక్ (EDSAC), ఎడ్వాక్ (EDVAC), యునివాక్ (UNIVAC) అనే కంప్యూటర్లు తయారయినవి. మొదటి తరం కంప్యూటర్లు పంచ్ కార్డు ద్వారా డేటాను తీసుకొనేవి. ఐ,బి,యం - 650 (I B M - 650), మరియు ఐ,బి,యం - 701 (I B M - 701) మొదలగునవి మొదటి తరం కంప్యూటర్లు |
రెండవతరం కంప్యూటర్స్(1960-1965) |
రెండవ తరం కంప్యూటర్లలో వాక్యూం ట్యూబులకు బదులు ట్రాన్సిస్టర్స్ వాడడం మొదలెట్టారు. ఇది పరిమాణంలో చిన్నదిగా ఉండటమే కాక వేగంగా పని చేస్తూ తక్కువ వేడిని విడుదల చేస్తుండేది. ఈ కంప్యూటర్లను సాంకేతిక రంగాలలోనే కాక వ్యాపార అవసరములకు కూడా వినియోగించేవారు. ఈ కంప్యూటర్లను వాడుకొనుటకై ఫోర్ట్రాన్, కోబాల్, ఆల్గాల్, స్కోబాల్ అను భాషలు ప్రత్యేకంగా అభివృద్ది చేయబడినవి. ఇవి ఇంగ్లీషు భాష మాదిరిగా ఉపయోగించుటకు తేలికగా ఉండే భాషలు. |
మూడవతరం కంప్యూటర్స్(1965-1975) |
మూడవ తరం కంప్యూటర్స్ చిప్ ఆధారంగా పనిచేయు కంప్యూటర్స్. లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ ద్వార 1000 కంటే ఎక్కువ ట్రాన్సిస్టర్లను, రెసిస్టర్లను, కెపాసిటర్లను కాప్స్యూల్ సైజుకు లేదా అంతకంటే చిన్నగా చిప్ లేదా ఐ సి(ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్)గా తయరు చేయవచ్చు. ఇలాంటి చిప్పులను వాడడం ద్వారా కంప్యూటర్స్ పరిమాణం తగ్గించి మినీ కంప్యూటర్లుగా తయారు చేయడం మొదలైంది. |
ఈ చిప్పులను ఉపయోగించి తయారైన మెయిన్ ప్రేమ్ కంప్యూటర్లు మరింత శక్తివంతముగా మరాయి. వీటిని విద్యాసంస్థలలో, ప్రభుత్వకార్యాలయాలలో ఉపయోగించుట మెదలెట్టారు. ఈ కాలంలో అత్యంత శక్తివంతమైన ప్రొసెసింగ్ యూనిట్లు, శక్తివంతమైన మెమొరీ, అధిక సామర్ధ్యం కలిగిన చిప్స్ అభివృద్ది చేయబడ్డాయి. ఈ కాలంలోనే అయస్కాంతత్వ టేపుల స్థానంలో డిస్కులు వినియోగంలోకి వచ్చాయి. ఈ తరం కంప్యూటర్లలో చెప్పదగిన అభివృద్ది కలిగిన శక్తివంతమైన కంప్యూటర్లు రావడంతో వాటికి అనుసంధానంగా పి,యల్-1, ఫోర్ట్రాన్-4 మొదలగు భాషలు వచ్చాయి. ఈ తరం కంప్యూటర్లలో కొన్ని ఐబియమ్ 360 (IBM-360), ఐబియమ్ 370 (IBM-370), ఐసిఎల్ 2900 (ICL-2900) మొదలగునవి. |
నాలగవ తరం కంప్యూటర్స్(1976- ప్రస్తుతం) |
మైక్రో ప్రొసెసరునుపయోగించి తయారు చేయబడిన వాఅటిని నాల్గవ తరం కంప్యూటర్లు అనవచ్చు. కంప్యూటరుకు అవసరమైన సర్క్యూట్ మొత్తమును ఒకే సిలికాన్ చిప్ మీద "పరీలార్జ్ ఇంటిగ్రేషన్" టెక్నాలజీ సహాయంతో సూక్ష్మీకరించి తయారు చేసిన వీటిని చిప్ లేదా 'ఐసిపి' మైక్రో ప్రొసెసరు అంటారు. ఇంటెల్ సంస్థవారిచే తయారు కాబడిన 8080 మైక్రో ప్రొసెసర్ ఉపయోగించి ఎడ్వర్డ్ రాబర్ట్ మొదటి మైక్రో కంప్యూటరు తయారు చేసాడు. దీని పేరు ఆల్ టెయిరీ. ఐబియమ్ సంస్థ వారూ మైక్రో ప్రొసెసర్ ఉపయోగించి 1981లో పర్సనల్ కంప్యూటర్ తయారు చేసారు. వీటి ధరలు తక్కువగా ఉండటంతో ఇవి ఎక్కువ ప్రజాధరణ పొందుతున్నాయి. వీటికి ఉదాహరణలు- జెడ్ ఎక్ష్ స్పెక్ట్రం, పిసి ఎట్ పెంటియం. |
లాంగ్వేజీలు |
మనుషుల మధ్య సమచార ప్రసారానికి ఒక మాద్యమం అవసరం. భాష లేకపోతే సమాచర వ్యవస్థ స్థంభించి పోతుంది. అలాగే కంప్యూటర్లతో మాట్లాడలన్నా ఒక భాష అవసరం. కంప్యూటరు కోసం వాడే భాషలను ప్రోగ్రామింగ్ భాష అంటారు. అలాంటి భాషలలో కొన్ని. |
బేసిక్ |
"బిగినర్స్ ఆల్ పర్పస్ సింబాలిక్ ఇన్స్ట్రక్షన్స్ కోడ్" అనేదానికి సంక్షిప్త రూపమే బేసిక్. 1960లో డార్ట్ మౌత్ దీనిని సృష్టించాడు. 1975లో రొపొందించినఅల్టయిర్ కంప్యూటరు యొక్క ప్రోగ్రామింగ్ భాష ఇదే. ఐబియమ్ వారు పర్సనల్ కంప్యూటర్లలో సైతం ఇదే భాషను వాడారు. కొత్తగా నేర్చుకొనే వారికి సులభంగా అర్ధమయ్యేలా దీనిలో సూచనలు దాదాపు ఆంగ్ల భాష మాదిరిగానే ఉంటాయి. |
ఫోర్ట్రాన్ |
"ఫార్ములా ట్రాన్సులేషన్"కు సంక్షిప్త రూపమే ఫోర్ట్రాన్. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ భాషలలో అతి పురాతనమైన భాష. క్లిష్టతరమైన గణిత సంభద సమస్యలు పరిష్కరించేందుకు ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు. 1954వ సంవత్సరంలో జాన్ బాకస్ తదితరులు దీనిని అభివృద్ది చేసారు. అనేక మార్పులు జరిగిన తరువాత 1977లో ఫోర్ట్రాన్-77గానూ 1991లో ఫోర్ట్రాన్-90గానూ 1995లో ఫోర్ట్రాన్-95గానూ మార్కెటులో విడుదల చేయబడినది. |
కోబాల్ |
"కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజి" అనేదానికి సంక్షిప్తరూపం కోబాల్. వాణిజ్య అవసరాలకు ఉపయొగపడే దీనిని 1964లో రూపొందించారు.1964లో అమెరికాలోని అమెరికన్ నేషనల్ స్టాండర్డ్స్ ఇనిస్టిట్యూట్ వారిచే ఆమోదించబడినది. దీనిని డేటా ప్రొసెసింగ్ కొరకు వాడతారు. |
పాస్కల్ |
జూరిచ్ దేశానికి చెందిన నికొలస్ విర్త్ రూపొందించిన లాంగ్వేజ్ ఇది. దీనిని ఆదునిక పర్సనల్ కంప్యూటర్ల కొరకు మార్పులు చేసి టర్బో పాస్కల్రూపొందించారు. బోర్లాండ్ కంపెనీ పాస్కల్ భాషకు రకరకాల అభివృద్ది చేస్తూ పాస్కల్ భాషను చరిత్రలో కలసిపోకుండా చేస్తుంది. వీటిలో కొత్తది డెల్ఫీ ఇది విజువల్ బేసిక్‌తో పోటీ పడుతున్నది. |
సీ(C) |
సీ ప్లస్ ప్లస్(C++) |
జావా |