ఏదైనా
వస్తువు, ఉదాహరణకు తిరుగుతున్న బొంగరం, ఒక అక్షం ఆధారంగా తన చుట్టూ తాను
తిరుగుతుంటే, అది పరిభ్రమణం చేస్తుందని అంటాం. అంతరిక్షంలోని నక్షత్రాలు, గ్రహాలు ఇలా పరిభ్రమణాలు చేస్తుండడానికి కారణాన్ని భౌతిక శాస్త్ర నియమం “కోణీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమం ద్వారా వివరించవచ్చు. ఈ నియమం ప్రకారం పరిభ్రమణం చేస్తున్న వస్తువు ఏ కారణం లేకుండా దానంతట ఆగిపోదు. పరిభ్రమణం చేస్తున్న బొంగరం కొంతసేపటికి ఆగిపోవడానికి కారణం దాని ములుకుకు నేలకు మధ్య ఉన్న ఘర్షణ ప్రభావమే. ఆ ఘర్షణ లేకుంటే పరిభ్రమణంలో ఉన్న బొంగరం ఆగకుండా అలా తిరుగుతూనే ఉంటుంది. |
ఇక
నక్షత్రాలు, గ్రహాల పరిభ్రమణ విషయానికి వస్తే, అవి తమ చుట్టూ తాము
పరిభ్రమిస్తున్న వాయుధూళి సముదాయం ఘనీభవించడం వల్ల ఏర్పడినవే. ఈ వాయు మేఘాలు
గురుత్వ ప్రభావం వల్ల క్రమేపి తమలోకి తాము కుంచించుకుపోవడంతో కాలక్రమేణా
నక్షత్రాలు, వాటి చుట్టూ గ్రహ వ్యవస్థలు ఏర్పడ్డాయి. ఈ వాయు మేఘాలు కుంచించుకుపోయే కొలది వాటి భ్రమణ వేగాలు ఎక్కువయ్యాయి. ఐస్‌పై స్కేటింగ్ చేస్తూ తమ చుట్టూ తాము తిరుగుతున్న స్కేటర్లు తాము దూరంగా బార చాపిన చేతులను తమ శరీరానికి దగ్గరగా తెస్తున్నప్పుడు వారి పరిభ్రమణ వేగం ఎక్కువవుతున్నట్లు. |
ఇలా
పరిభ్రమిస్తున్న వాయు మేఘాలు క్రమేపి నక్షత్రాలుగా మారుతున్నప్పుడు ఆ మేఘాలలోని
అతికొద్ది శాతం పరిభ్రమణ చలనం మాత్రమే నక్షత్రాలకు బదిలీ అవుతుంది. లేకపోతే ఆ
చలనవేగానికి నక్షత్రాలు తునాతునకలైపోతాయి. ఇలా జరగకుండా నిరోధించడానికే ఆ నక్షత్రాల నుంచి గ్రహాలు ఏర్పడి, వాయు మేఘాల తొలి పరిభ్రమణ వేగం అంటే తొలి కోణీయ ద్రవ్యవేగాన్ని తలాకొంచెం పంచుకున్నాయి. అందువల్లే నక్షత్రాలు, గ్రహాలు తవ ు చుట్టూ తాము తిరుగుతుంటాయి |