అంకెల శాస్త్రమే అంకగణితం. అంకెల అర్థం, వాటి సంకేతాలు, వాటిని ఉపయోగించే
విధాలకు సంబంధించిన శాస్త్రమే అంకగణితం.
నిజానికి అంకగణితం ఎవరో ఒకరు కనిపెట్టినది కాదు. మనిషి అవసరాల కోసం
దానిని అభివృద్ధి పరిచారు. లెక్కింపులో కాక తొలుత రాశుల పరిణామాలతో
పనిపడింది.
కానీ కాలక్రమంలో మనిషికి అంకెలు, వాటి పేర్ల ఆవశ్యకత కలిగింది. పశువుల కాపర్లకి
వారి మందలో అన్ని జంతువులు ఉన్నాయో లేవో తెలుసుకొనేందుకు వాటిని
లెక్కించవలసిన అవసరం ఏర్పడింది.
ఋతువుల సంగతి తెలుసుకోవలసిన అవసరం రైతులకు కలిగింది. కనుక
పూర్వకాలంలో, ఎప్పుడో తెలియని కాలంలో అంకెలను, వాటి పేర్లను రూపొందించారు.
ఇప్పుడు పూర్ణ సంఖ్యలు లేదా సహజ సంఖ్యలు అనే పేరుతో లెక్కించే అంకెలు అవే!
తర్వాత ఒకటి కంటే తక్కువ అంకెలు, సంఖ్యల మధ్య అంకెలు అవసరమయ్యాయి.
దాంతో భిన్నాలను అభివృద్ధిపరిచారు. తర్వాత చాలా కాలానికి ఇతరరకాల అంకెలు
వాడుకలోకి వచ్చాయి. -2 వంటి ఋణ అంకెలు అటువంటివే!
ఋణ అంకెలను రూపొందించడం క్లిష్టమైన అంశమే! 7 నుంచి 5 తీసేస్తే మిగిలేది 2 అని తెలుసుకోవడం సులువే! కానీ 5 నుంచి 7ను తీసేయడం కుదురుతుందా? గ్రీకులు
ఇది సాధ్యం కాదని నిర్ధారించారు. సున్నా కంటే చిన్న అంకె ఉంటుందని 1500 దాకా
ప్రజలకు తెలియలేదు.
ఉదాహరణకు 5 నుంచి 7 తీసేస్తే మనకు మిగిలేది ఋణ విలువ అయిన '-2'!
లెక్కించడం అత్యంత ప్రాథమిక అవసరం కనుక మనిషి కూడికలు, తీసివేతలు,
గుణకారాలు, భాగాహారాలు నేర్చుకున్నాడు.
ఇవే అంకగణితపు నాలుగు ప్రధాన విభాగాలు. '0' (సున్నా) కనిపెట్టింది భారతీయులే
అని, 1,2,3,.... అంకెలు కనిపెట్టింది అరబ్బులని నిర్ధారణ అయ్యింది.