కరెన్సీని మొట్ట మొదట ఎవరు ఉపయోగించారు? ద్రవ్యం - నిర్వచనం - రకాలు ?


కరెన్సీని  మొట్ట మొదట ఎవరు ఉపయోగించారు

-    సమాజాభివృద్ధికి ఊతమిచ్చే ఈ ద్రవ్యం పూర్వకాలంలో వాడుకలో లేదు. ద్రవ్యం వినియోగంలోకి రాకముందు వస్తు వినిమయ పద్ధతి ఉండేది. దీన్నే వస్తుమార్పిడి పద్ధతి, బార్టర్ పద్ధతి అని పిలిచేవారు.
 


-    ఒక వ్యక్తి తన దగ్గరున్న ఒక వస్తువును ఇంకొకరికి ఇచ్చి దానికి బదులుగా అతని దగ్గరున్న తనకు కావాల్సిన మరొక వస్తువును పొందడాన్ని వస్తుమార్పిడి పద్ధతి అంటారు. ఇందులో ఇద్దరు వ్యక్తులు తమకు కావాల్సిన వస్తువులను పరస్పరం మార్చుకుంటారు. ఆధునిక కాలంలో ప్రతిరంగంలో ఆర్థిక కార్యకలాపాలు విస్తృతంగా పెరిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో వస్తుమార్పిడి పద్ధతి ఆచరణలో అసౌకర్యంగా ఉండడం వల్ల పరస్పర మార్పిడి కోసం ద్రవ్యమనే ఉమ్మడి కొలమానాన్ని ప్రవేశపెట్టారు.
 
 ద్రవ్యం- నిర్వచనం
 ద్రవ్యాన్ని ఆంగ్లంలో మనీగా పిలుస్తారు. మనీ అనే పదం ‘మానెటా’ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. రోమన్లు తమ ఆరాధ్యదేవతైన జునో మొనేటా ఆలయంలో నాణేలను ముద్రించడం వల్ల ఆ లాటిన్ పదం ఉత్పన్నమైందని తెలుస్తోంది. ద్రవ్యమంటే మార్పిడి మాధ్యమంగా, విలువల కొలమానంగా అందరూ అంగీకరించి ఉపయోగించేది. అంటే ద్రవ్యాన్ని ఉపయోగించే వారందరితో అది ఆమోదం పొంది ఉండాలి.
 

-    సెలిగ్‌మేన్ అనే ఆర్థికవేత్త ప్రకారం సర్వాం గీకారం పొందిందే ద్రవ్యం.
 

-    వాకర్ అభిప్రాయం ప్రకారం ద్రవ్యవిధులను నిర్వహించేదే ద్రవ్యం. (Money is what money does)
 


ద్రవ్యం- పరిణామక్రమం
 పురాతన కాలం నుంచి ద్రవ్యం వివిధ రూపాలుగా రూపాంతరం చెందుతూ చలామణీలో ఉంది.
     


వస్తురూప ద్రవ్యం: తొలిగా వస్తువు ద్రవ్య రూపంగా ఉండేది. ధాన్యం, పండ్లు, గవ్వ లు, బట్టలు, జంతువుల చర్మాలు, దంతాలను ద్రవ్యంగా వాడేవారు. ప్రపంచంలో చాలాచోట్ల ఇవి వాడుకలో ఉండేవి. మన దేశంలో ఆర్య నాగరికత (వేద నాగరికత) కాలంలో గోవులను ‘గోధనం’గా భావించి ద్రవ్యంగా ఉపయోగించేవారు. వీటిని వినిమయ సాధనాలుగా భావించేవారు.
     


లోహ ద్రవ్యం: లోహ పరిజ్ఞానం అభివృద్ధి చెందిన తర్వాత లోహాలతో చేసిన నాణేలు అందుబాటులోకి వచ్చాయి. మొట్టమొదటగా క్రీ.పూ.700లో లిబియా ప్రాంతంలో నాణేలను ద్రవ్య రూపాలుగా జారీ చేశారు. రోమన్లు ‘బిసాంత్’ అనే బంగారు నాణేలను, మౌర్యులు ‘పానా’ అనే వెండి నాణేన్ని ద్రవ్యంగా వాడేవారు. కాలక్రమంలో ఇత్తడి, రాగి, కంచు, నికెల్, స్టీల్ నాణేలను ప్రవేశపెట్టారు.
     


కాగితం ద్రవ్యం: ప్రస్తుతం వాడుకలో ఉన్న కరెన్సీ ‘కాగితం’. ప్రపంచమంతా కాగితం ద్రవ్యమే అమలులో ఉంది. వీటితో పాటు నాణేలు (coins) కూడా ఉపయోగిస్తున్నారు. ఇంతకుముందు దేశంలో బంగారు నిల్వల ఆధారంగా ఆ దేశ కేంద్ర బ్యాంక్ నోట్లను ముద్రించి విడుదల చేసేది. ప్రస్తుతం బంగారంతో సంబంధం లేకుండానే ద్రవ్యాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. మధ్యయుగం నాటి చైనాలో ‘సుంగ్’ వంశ రాజుల కాలంలో మొదటిసారిగా కాగితం ద్రవ్యం చలామణీలోకి వచ్చింది.
     


పరపతి ద్రవ్యం (Credit money): దీనినే అప్పు ద్రవ్యం అంటారు. ఈ ద్రవ్యాన్ని బ్యాంకులు సృష్టిస్తాయి. అందువల్ల బ్యాంక్ ద్రవ్యం అని కూడా అంటారు. ఇంతకు ముందు బంగారం నిల్వ ఉంచుకొని కరెన్సీ విడుదల చేసే విధంగానే బ్యాంకులు కరెన్సీని నిల్వ (బ్యాంక్ డిపాజిట్లు) గా ఉంచుకొని పరపతి ద్రవ్యాన్ని జారీ చేస్తాయి. చెక్కులు, డిమాండ్ డ్రాఫ్టులను ఈ ద్రవ్యానికి ఉదాహరణలుగా చెప్పవచ్చు.
     


సమీప ద్రవ్యం: ద్రవ్యానికి బదులుగా ద్రవ్యత్వం కల్పించేవాటిని సమీప ద్రవ్యం అంటారు. హుండీలు, ట్రెజరీ బిల్లులు, బాండ్లు మొదలైనవాటికి ద్రవ్యం ఆపాదించడం వల్ల అవి ద్రవ్యానికి ప్రత్యామ్నాయాలుగా మారతాయి. వీటికి ద్రవ్యానికి ఉండే లక్షణాలే ఉంటాయి.
 
 ద్రవ్యం రకాలు: ద్రవ్యాన్ని ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించారు.
 


1.     న్యాయాత్మకమైన టెండర్ ద్రవ్యం
     కేంద్ర బ్యాంక్ (ఖఆఐ) జారీ చేసిన ద్రవ్యాన్ని న్యాయాత్మకమైన టెండర్ ద్రవ్యంగా భావించవచ్చు. ఇది చట్టసమ్మతమైంది. అంటే దీన్ని చెల్లింపుల మాధ్యమంగా ఎవరూ తిరస్కరించడానికి వీలు లేదు. ఈ న్యాయాత్మకమైన టెండర్ ద్రవ్యం రెండు రకాలు.
 
     

2  పరిమిత చట్టబద్ధ ద్రవ్యం: ద్రవ్యాన్ని కొంత పరిమితి వరకే అంగీకరించేది పరిమిత చట్టబద్ధ ద్రవ్యం. ఆ పరిమితిని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. పరిమితికి మించి ద్రవ్యాన్ని ఆమోదించమని ఒత్తిడి చేయడం నేరం. ఉదా॥భారతదేశంలో తక్కువ విలువ ఉన్న నాణేలైన 5, 10, 20, 25 పైసల నాణేలను * 25 పరిమితికి మించి తీసుకొమ్మని ఎవరినీ బలవంతం చేయకూడదు. వినియోగదారుడు అమ్మకందారుడికీ *25 రూపాయలకు మించి చిల్లర నాణేలు ఇస్తే అమ్మకందారుడు అంగీకరించాల్సిన అవసరం లేదు.
     

3. అపరిమిత చట్టబద్ధ ద్రవ్యం: ఈ ద్రవ్యాన్ని ఎంతమొత్తమైనా, ఎలాంటి పరిమితి లేకుండా వినిమయానికి అందరూ అంగీకరించాలి. అంగీకరించకపోతే నేరం. ఉదా॥భారతదేశంలో * 50 పైసలకు మించిన విలువ గల నాణేలను, 1 రూపాయి నుంచి * 1000 నోటు వరకు ఉన్న కరెన్సీని ఎంత మొత్తమైనా స్వీకరించాలి.
 
 2.    ఇచ్ఛాపూర్వక ద్రవ్యం (చట్టబద్ధం కాని ద్రవ్యం): ఈ ఐచ్చిక ద్రవ్యానికి చట్ట సమ్మతి లేదు. ఇది నమ్మకం, విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. ఈ ద్రవ్యాన్ని అంగీకరించకపోయినా నేరం కాదు. చెక్కులు, డ్రాఫ్టులు, డిబెంచర్లు, షేర్లు, క్రెడిట్ కార్డులు, హుండీలు (బిల్ ఆఫ్ ఎక్స్ఛేంజ్) మొదలైన వాటిని ఐచ్చిక ద్రవ్యంగా పరిగణించవచ్చు. ఈ ద్రవ్యాన్ని బ్యాంక్ ద్రవ్యం, దగ్గర ద్రవ్యం అని కూడా అంటారు.
     


చెక్కులు: ఖాతాదారుడు (వినియోగదారు డు) తన బ్యాంకులో జమచేసిన సొమ్ము నుంచి తనకు, తను సూచించిన వ్యక్తికి తను కోరిన సొమ్మును జారీ చేయమని కోరడమే చెక్కు. ఖాతాదారుడు తన అకౌంట్‌లో తగినంత ద్రవ్యం ఉన్నప్పుడే చెక్కులు చెల్లుతాయి. లేకపోతే బ్యాంకులు చెక్కులను తిరస్కరిస్తాయి. వినిమయ మాధ్యమంగా చెక్కులు ఉపయోగపడుతున్నాయి.
     


డ్రాఫ్టులు: వీటిని బ్యాంకులు జారీ చేస్తాయి. వ్యక్తులు, సంస్థల నుంచి  సొమ్మును, దానికి నిర్ధారించిన కొంత కమిషన్ సొమ్మును తీసుకున్న బ్యాంకులు, వారు కోరిన విధంగా, కోరిన వారి పేరుపై, వారు చెల్లించిన సొమ్ము మేరకు డ్రాఫ్టులు జారీ చేస్తాయి. వినియోగదారుడు (డ్రాఫ్టులపై పేరు గలవారు) తన బ్యాంక్‌లో ఆ డ్రాఫ్ట్‌ను సమర్పించి అంతే సొమ్మును డిమాండ్ చేసి తీసుకోవచ్చు. అందుకే దాన్ని డిమాండ్ డ్రాఫ్ట్ (డి.డి) అంటారు. చెక్కుల కంటే డ్రాఫ్టులు ఆమోదయోగ్యమైనవి. ఎందుకంటే సొమ్మును ముందే చెల్లిస్తారు కాబట్టి బ్యాంకుల నుంచి చెల్లింపులు నిర్ధారణగా జరుగుతాయి.
     


బాండులు: ద్రవ్యం మూల్యనిధి కాబట్టి ప్రజలు తమ వద్ద కొంత డబ్బును నిల్వ ఉంచుకుందామని ఆశపడతారు. డబ్బును ఆర్థిక సెక్యూరిటీల రూపంలోనైనా భద్రపరుచుకోవాలని అనుకొంటారు. అందుకు బాండు సరైన ఆర్థిక సెక్యూరిటీ ఇస్తుంది. బాండు అంటే బేరరు (వినియోగదారుడు)కు కొంత నిర్ణీతకాలం తర్వాత నిర్ణీత వడ్డీతో కలిపి చెల్లిస్తామని వాగ్దానం చేసే కాగితం పత్రం. అవసరమైతే వీటిని బ్యాంకుల్లో కుదవపెట్టి దానిపై రుణాలను తీసుకోవచ్చు. వీటిని మన దేశంలో ఆర్‌బీఐ లేదా దాని అనుమతి పొందిన సంస్థలు, తపాలా కార్యాలయాలు (N పత్రాలు, ఇందిరా వికాస పత్రాలు) జారీ చేస్తాయి.
 


డిబెంచర్లు: ఇవి కూడా బాండ్లలాంటివే. వీటిని కంపెనీలు, సంస్థలు ఒక నిర్ణీత వడ్డీతో జారీ చేస్తాయి. డబ్బు అవసరమైనప్పుడు బేరర్ వాటిని ఇతరులకు అమ్మవచ్చు. వాటిని గుర్తించిన సంస్థల్లో తనఖాపెట్టి  అప్పు కూడా తీసుకోవచ్చు.
     


బ్యాంక్ క్రెడిట్ కార్డులు:  బ్యాంకులు ఎంపిక చేసిన కొంతమంది ఖాతాదారులకు, వారి కోరికమేరకు క్రెడిట్ కార్డులను జారీ చేస్తాయి. ఈ కార్డుదారులు ఎంపిక చేసిన వ్యాపార సంస్థల్లో బిల్లులు చెల్లించడానికి వీటిని ఉపయోగిస్తారు. వారు బిల్లు మొత్తాన్ని  ద్రవ్యరూపంలో చెల్లించరు. కార్డును దుకాణదారు  వద్ద నున్న చిన్న మిషన్‌లో స్వైప్ చేసి, ఆ బిల్లుపై సంతకం చేస్తారు. అప్పుడు బిల్లును బ్యాంకు చెల్లించి తర్వాత వినియోగదారుడి నుంచి ఆ సొమ్మును వసూలు చేస్తుంది. నిర్ణీత కాలంలో సొమ్మును వినియోగదారుడు చెల్లించకపోతే వడ్డీతో సహా జరిమానా వేసి  కార్డును జారీ చేసిన సంబంధిత బ్యాంక్ నగదు వసూలు చేస్తుంది. అయితే ఖాతాదారుడు తన అకౌంటులో ఏ మాత్రం సొమ్ము లేకపోయినా బ్యాంక్ నిర్ధారించిన మేరకు సొమ్మును ఈ క్రెడిట్ కార్డును ఉపయోగించి ఖర్చు చేసుకోవచ్చు.

 
     ఆధునిక ఆర్థిక లావాదేవీల్లో ఎక్కువగా ఐచ్చిక ద్రవ్యాన్నే ప్రధానమైన ద్రవ్య వినిమయంగా ఉపయోగిస్తున్నారు. అది  సులువుగా అందరికీ అందుబాటులో ఉండడం వల్ల సౌకర్యవంతమైన సాధనంగా మారింది. పైన పేర్కొన్న ఐచ్చిక ద్రవ్యంతోపాటు బిల్ ఆఫ్ ఎక్స్ఛేంజ్, హుండీలు కూడా ద్రవ్య వినిమయంగా ఉన్నాయి. ద్రవ్యం ద్రవ్యవినిమయంగానేకాకుండా విలువల కొలమానంగా, భవిష్యత్తులో చెల్లింపుల కొలమానంగా, మూల్యనిధి లేదా విలువల నిధిగా వివిధ విధులను నిర్వర్తిస్తుంది. ఈ ద్రవ్యాన్ని ముద్రించడానికి, ద్రవ్య విధానాన్ని రూపొందించడానికీ మనదేశంలో 1934 చట్టం ద్వారా రిజర్‌‌వ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)ను ఏర్పాటు చేశారు. దేశంలో ద్రవ్యాధికారం ఉన్న ఏకైక కేంద్ర బ్యాంక్  ఆర్‌బీఐ.




 

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment