బంగారంతో నగలు ఎలా తయారు చేస్తారు? మీకు తెలుసా?




బంగారమన్నా, బంగారు నగలన్నా ఈ ప్రపంచంలో చాలా మందికి మహా ఇష్టం. అయితే అందులో అంతో ఇంతో వేరే పదార్థాన్ని కలపనిదే బంగారంతో చేసే వస్తువులు, నగలు గట్టిగా ఉండవన్న సంగతి మాత్రం చాలా మందికి తెలీదు.


మామూలు ఉష్ణోగ్రత వద్ద ఇనుము లాగా గట్టిగా కాకుండా బంగారం...చ్యూయింగ్‌ గమ్‌లాగా మెత్తగా, మృదువుగా వుంటుంది. అది ఎంత మెత్తగా ఉంటుందంటే దాన్ని మన చేతులతోనే ఇష్టం వచ్చినట్లుగా మలచవచ్చు. అంటే ఒక మట్టిముద్దతో బొమ్మలు చేసినట్లుగా మనం బంగారంతో కూడా బొమ్మలు చేయవచ్చన్న మాట. అయితే ఇది వంద శాతం శుద్ధంగా వుండే బంగారం విషయంలో మాత్రమే వర్తిస్తుంది. అందులో ఏమాత్రం మలినాలు ఉన్నా, లేక ఇతర పదార్థాలు దానితో కలిసి ఉన్నా ఈ సూత్రం వర్తించదు.



బంగారం ఇలా మృదువుగా ఉంటుంది కనుకే, నగలు, నాణేలు, వగైరాలు తయారు చేసేందుకు దానిలో కొంత మొత్తంలో రాగిని గాని, వెండిని గాని లేదా ఇంకేదైనా ఇతర మూలకాన్ని గాని కలుపుతారు. ఇలా కలపడం వలన బంగారం 'గట్టిగా' తయారవుతుంది. 18 క్యారట్లు, 20 క్యారట్లు, 22 క్యారట్లు అనే మాటలను విూరు వినే వుంటారు. ఈ క్యారట్లు అనే మాట శుద్ధమైన బంగారంలో ఎంత మొత్తంలో వేరే లోహం కలపబడింది అన్న విషయాన్ని చెప్పకనే చెబుతుంది.



ఇతర పదార్థాలు ఏవీ కలపని పరిశుద్ధమైన బంగారాన్ని 24 క్యారట్ల బంగారం అని అంటారు. దీనిని ప్రమాణికంగా తీసుకుని 20 క్యారట్ల బంగారం అంటే.....20 వంతుల శుద్ధమైన బంగారం, మరో 4 వంతుల ఇతర లోహం కలసిన పదార్థం అని మనం అర్థం చేసుకోవాలి. అలాగే మిగతా క్యారట్ల విషయం కూడా....



బంగారానికి సంబంధించిన మరొక విశిష్టమైన లక్షణం ఏమిటంటే.... ఇది చాలా బాగా సాగుతుంది. సాగే లక్షణం దీనిలో ఎంతగా వుంటుందంటే ఒక ఔన్సు బంగారంతో 80 కి.విూ.ల పొడవు తీగను మనం తయారు చేయవచ్చు. అన్నట్లు బంగారం ఎంతో విలువైన లోహమే అయినప్పటికీ ప్లాటినం లాగా, యురేనియం లాగా అది మరీ అంత అపురూపంగా దొరికే పదార్థమేవిూ కాదు. మన భూమిలో ఉన్న బంగారమంతటినీ తీసి నేలవిూద పరిస్తే అది మన భూగోళం విూది ఖండాలన్నిటినీ ఒక అడుగు మందం దాకా ఆక్రమిస్తుందని అంచనా వేశారు!



0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment