ఒక్కొక్క రాశిలో గురువు ప్రవేశించేటప్పుడు ప్రతీ నదికి పుష్కరాలు జరుపుతారు. అందుకే 12 నదులను పుష్కర నదులని, 12 రోజుల పాటు జరిగే ప్రక్రియను పుష్కరాలని జరుపుకుంటారు. నవగ్రహాల్లో ఒకటైన గురుగ్రహం సంవత్సరానికి ఒకసారి చొప్పున 12 రాశుల్లో తిరుగుతూ ఉంటుంది. చాంద్రమానం ప్రకారం నక్షత్రాలు 27, తొమ్మిది పాదాలు కలిసి ఒక రాశి ఏర్పడతాయి.
ప్రతి సంవత్సరం గురువు ఆయా రాశుల్లో ప్రవేశించినప్పుడు.. అంటే గురువు మేషరాశిలో ప్రవేశించినప్పుడు గంగానదికి, వృషభరాశిలో ప్రవేశించినప్పుడు నర్మదానదికి, మిథునరాశిలో ప్రవేశించినప్పుడు సరస్వతి నదికి, కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు యమునా నదికి, సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరి నదికి, కన్యారాశిలో ప్రవేశించినప్పుడు కృష్ణానదికి, తులారాశిలో ప్రవేశించినప్పుడు కావేరి నదికి, వృశ్చిక రాశిలో ప్రవేశించినప్పుడు భీమరథీ నదికి, ధనూరాశిలో ప్రవేశించినప్పుడు పుష్కరవాహిని (తపతి) నదికి, మకర రాశిలో ప్రవేశించినప్పుడు తుంగభద్ర నదికి, కుంభరాశిలో ప్రవేశించినప్పుడు సింధూనదికి, మీనరాశిలో ప్రవేశించినప్పుడు ప్రాణహిత నదికి పుష్కరాలు వస్తాయి.
ఇలా గంగా, నర్మద, సరస్వతి, యమున, గోదావరి, కృష్ణ, కావేరి, భీమరథి, తపతి, తుంగభద్ర, సింధు, ప్రాణహిత వంటి జీవనదులను పుష్కర నదులని పిలుస్తారు. ఒక్కోనదికి ఒక్కో రాశి అధిష్టానమై ఉంటుంది. పుష్కర సమయంలో ఆ నదిలో సకల దేవతలు కొలువై వుంటారు. అందుకే ఆ సమయంలో నదిని చేరుకోవడం వల్ల ఆ దేవతలందరిని పూజించినట్లవుతుందని భక్తుల విశ్వాసం.
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment