ఫిబ్రవరి - 2014 వార్తల్లో వ్యక్తులు


ఫిబ్రవరి - 2
¤  స్వాతంత్య్రానంతరం 1952లో కొలువుదీరిన మొదటి లోక్‌సభకు ఎంపికై, ఇప్పుడు కూడా పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతూ, అరుదైన రికార్డు సొంతం చేసుకున్న 95 సంవత్సరాల రిషాంగ్ కీషింగ్ ఇక రాజకీయాల నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించాడు.
   »    రిషాంగ్ కీషింగ్ ప్రస్తుతం రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.ఆయన రాజ్యసభ పదవీకాలం ఏప్రిల్‌తో ముగియనుంది.
   »    సోషలిస్టు పార్టీ టికెట్‌పై 1952లో లోక్‌సభకు ఎన్నికైన కీషింగ్, నెహ్రూ ఆహ్వానం మేరకు 1962లో కాంగ్రెస్‌లో చేరాడు. అప్పటి నుంచి కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నాడు. మణిపూర్ సీఎంగా కూడా పనిచేశాడు.
ఫిబ్రవరి - 3
¤  అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఛైర్‌పర్సన్‌గా ప్రముఖ ఆర్థికవేత్త జెనెత్ ఎలెన్ (67) ప్రమాణస్వీకారం చేశారు.
   »    ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్థికవ్యవస్థకు చెందిన కేంద్రబ్యాంక్ ఛైర్‌పర్సన్ బాధ్యతలను ఒక మహిళ చేపట్టడం ఇదే తొలిసారి.
   »    ఈ పదవిలో ఎలెన్ నాలుగేళ్లు ఉంటారు.
   »    అమెరికా ఆర్థికవ్యవస్థ మళ్లీ సంక్షోభంలో చిక్కుకోకుండా, ఉద్దీపనల భారాన్ని తగ్గించడం ఎలెన్ భుజస్కందాలపై ఉన్న అత్యంత కీలకమైన బాధ్యత.   »    బెన్ బెర్నాంకే స్థానంలో ఆమె నియమితులయ్యారు.
ఫిబ్రవరి - 4
¤  గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలేనికి చెందిన దొంతా రవితేజ నేతృత్వంలో రూపొందించిన కారు మనీలా మారథాన్ పోటీలకు ఎంపికైంది.   »    ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ఈ నెల 6 నుంచి 9 వరకు జరగనున్న 'షెల్ ఎకో మారథాన్ 2014' పోటీల్లో దేశ విదేశాలకు చెందిన విద్యార్థులు తమ నూతన పరిశోధనల ద్వారా రూపొందించిన కార్లను పోటీలో ప్రదర్శించనున్నారు.   »    2009 నుంచి ఆసియాలో షెల్ ఎకో మారథాన్ పోటీలను నిర్వహిస్తున్నారు. డీజిల్, పెట్రోల్, హైడ్రోజన్, బ్యాటరీ.. ఇలా వివిధ ఇంధనాలతో ఎక్కువ దూరం ప్రయాణించే కార్లను రూపొందించి, ఏటా ఈ మారథాన్‌లో ప్రదర్శిస్తారు.   »    దేశవ్యాప్తంగా 80 మంది పోటీల్లో పాల్గొనగా, 17 మంది మనీలాలో జరిగే పోటీలకు ఎంపికయ్యారు. వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రవితేజ ఆధ్వర్యంలోని ఆరుగురు సభ్యుల బృందం కూడా ఉంది.   »    రవితేజ ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రంలోని అంబేద్కర్ యూనివర్సిటీలో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. రవితేజ తన బృందంతో కలిసి మూడు నెలలపాటు కష్టపడి 'దక్ష్' అనే పేరుతో కారును రూపొందించాడు.
ఫిబ్రవరి - 5
¤  లోక్‌సభలో బీజేపీ పక్షనాయకురాలు సుష్మాస్వరాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'చప్పిడి ముక్కులు' అంటూ ఈశాన్య రాష్ట్రాల ప్రజలను అవమానించేలా వ్యాఖ్యలు చేశారు.   »    ఢిల్లీలో హత్యకు గురైన అరుణాచల్‌ప్రదేశ్ కు చెందిన విద్యార్థి నిడో తానియమ్ తరపున ఆమె మాట్లాడుతూ 'ఢిల్లీ ప్రజల బాగోగుల కంటే రోడ్డెక్కి ధర్నా చేయడమే వారికి ప్రధానమైపోయింది' అని కేజ్రీవాల్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ సమయంలోనే 'పొడవు ముక్కుల వారిలాగే, చప్పిడి ముక్కుల వారూ ఈ దేశ పౌరులే' అని వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తన తప్పు తెలుసుకుని ఈశాన్య భారతీయులకు సుష్మాస్వరాజ్ క్షమాపణలు చెప్పారు.   »    పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే లోక్‌సభలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఫిబ్రవరి -  7
¤  ప్రపంచంలో అత్యంత శక్తిమంత 50 మంది వ్యాపార మహిళలతో ఫార్చ్యూన్ పత్రిక రూపొందించిన జాబితాలో భారత్‌కు చెందిన పెప్సికో సీఈఓ ఇంద్రానూయి, ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) చందాకొచ్చర్‌లకు స్థానం లభించింది.
 మేరీబారా
   »    ఫార్చ్యూన్ వ్యాపార మహిళల జాబితాలో రెండోస్థానంలో ఐబీఎం ఛైర్మన్, సీఈఒ ప్రెసిడెంట్ జిన్నీ రొమెట్టీ ఉన్నారు.
   »    జాబితాలో ఇంద్రానూయికి 3వ స్థానం కొచ్చర్‌కు 18వ స్థానం దక్కింది.¤  సెబీ ఛైర్మన్‌గా ఉన్న యు.కె.సిన్హా పదవీకాలన్ని ప్రభుత్వం మరో రెండేళ్లపాటు పొడిగించింది.   »    పదవీకాలం పొడిగింపు ఫిబ్రవరి 18 నుంచి అమల్లోకి రానుంది. సిన్హా గత మూడేళ్లుగా సెబీ ఛైర్మన్‌గా ఉన్నారు.   »    ఇప్పటివరకు డి.ఆర్.మెహతా మాత్రమే సెబీకి అత్యధిక కాలం (1995-2002) ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు.   »    సెబీ ఛైర్మన్‌గా సిన్హా స్టాక్ మార్కెట్లలో అనేక కీలక సంస్కరణలు తీసుకొచ్చారు.
ఫిబ్రవరి -  10
¤  ప్రతిష్ఠాత్మక సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ సంచాలకులుగా మన రాష్ట్ర కేడర్‌కు చెందిన అరుణా బహుగుణ బాధ్యతలు చేపట్టారు.   »    1979 బ్యాచ్‌కు చెందిన అరుణా బహుగుణా ఇప్పటివరకు సీఆర్‌పీఎఫ్ ప్రత్యేక సంచాలకులుగా ఢిల్లీలో విధులు నిర్వర్తించారు.
   »    ఐపీఎస్ అధికారులకు శిక్షణ ఇచ్చే హైదరాబాద్‌లోని ఈ సంస్థకు సంచాలకులుగా ఒక మహిళా అధికారి నియమితులు కావడం ఇదే ప్రథమం.¤  భారత్‌లో రసాయన శాస్త్ర విద్యాభివృద్ధి కార్యక్రమానికి 'సిప్లా' ఛైర్మన్ యూసుఫ్ హమీద్ రూ.8 కోట్లు విరాళంగా ఇచ్చారు.
ఫిబ్రవరి -  15
¤ ఉత్తరాఖండ్‌కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి అభిలాష్ సెంవాల్ బాంబులను గుర్తించే ఒక చిప్‌ను రూపొందించాడు. ఈ చిప్ మొబైల్‌లో వినియోగిస్తే మొబైల్ బాంబ్ డిటెక్టర్‌గా మారుతుందని వెల్లడించాడు.
   »    ఈ ఆవిష్కరణకుగాను ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ రూ.5 లక్షల నగదు బహుమతిని అభిలాష్‌కి ప్రకటించారు.
 
ఫిబ్రవరి -  17
¤   రాష్ట్ర ఉప లోకాయుక్తగా మహబూబ్‌నగర్ జిల్లాజడ్జి టి.గంగిరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.   »    లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు.¤   సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలుగుతేజం జస్టిస్ నూతలపాటి వెంకట రమణ ప్రమాణ స్వీకారం చేశారు.   »    ఆయనతో పాటు మరో జడ్జి రాజేశ్‌కుమార్ అగర్వాల్ చేత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివం ప్రమాణ స్వీకారం చేయించారు.   »    వీరిద్దరి చేరికతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 31కి చేరింది.   »    జస్టిస్ వెంకట రమణ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, జస్టిస్ అగర్వాల్ మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తూ, పదోన్నతి పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు.
ఫిబ్రవరి -  20
¤   బ్రహ్మకుమారీల సంయుక్త చీఫ్ రాజయోగిని దాదీ రతన్మోహినీజీ కి గుల్బర్గ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.

 
¤   భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త రీతూపర్ణ బోస్ అమెరికాలో చరిత్ర పూర్వయుగం నాటి జీవజాలాన్ని పునర్నిర్వచించేలా ఒక కీలక పరిశోధన నిర్వహించారు.
   »     ఓహియో, మిచిగన్ ప్రాంతాల్లో లభించిన శిలాజాలపై అధ్యయనం చేసిన ఆమె ఆ శిలాజాలు సుమారు 40 కోట్ల ఏళ్లనాటివని గుర్తించారు.
   »    ఈ శిలాజాలను గుర్తించేందుకు 'జియోమెట్రిక్ మార్ఫోమెట్రిక్స్' పేరుతో సరికొత్త పద్ధతిని ఆమె ఆవిష్కరించారు.
   »     సాధారణంగా డీఎన్ఏ సీక్వెన్సింగ్ ద్వారా శిలాజాలను గుర్తించడం కచ్చితత్వంతో కూడి ఉంటుంది. కానీ, చాలా శిలాజాల్లో డీఎన్ఏ సేకరించడం కష్టమవుతుంది. కాబట్టి, అలాంటి వాటికి తాను ఆవిష్కరించిన పద్ధతి ఉపయుక్తంగా ఉంటుందని ఆమె ప్రకటించారు.
   »     రీతూపర్ణ ఆవిష్కరించిన పద్ధతిని పలు అంతర్జాతీయ జర్నల్‌లు, యూనివర్సిటీలు ప్రశంసించాయి.
ఫిబ్రవరి - 21
¤ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్‌పర్సన్ అర్చనా భార్గవి తన పదవికి రాజీనామా చేశారు.
   » మొండిబకాయిల వెల్లడికి సంబంధించి ఈ ప్రభుత్వ రంగ బ్యాంక్‌పై దర్యాప్తు మొదలైన నేపథ్యంలో ఆమె రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఫిబ్రవరి - 23
¤ దాదాపు 3 లక్షల మంది సిబ్బందితో దేశ భద్రతలో ప్రధాన భూమిక పోషిస్తున్న కేంద్ర పారామిలిటరీ బలగాల (సీఆర్‌పీఎఫ్) సేవలను కొనియాడుతూ, ప్రఖ్యాత బాలీవుడ్ రచయిత జావేద్ అక్తర్ ప్రత్యేక గీతాన్ని రచించారు.
   » 'హం హే దేశ్‌కే రక్షక్' అంటూ సాగే ఈ గీతాన్ని సీఆర్‌పీఎఫ్ 75వ ఆవిర్భావ దినోత్సవమైన ఫిబ్రవరి 28న రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆవిష్కరించనున్నారు.
¤ మాదక ద్రవ్యాల మాఫియా డాన్ జోక్విన్ అలియాస్ గజ్‌మాన్‌ను మెక్సికో సముద్ర తీర దళం అరెస్టు చేసింది.
   » జోక్విన్ మెక్సికోలోని 'సినాలోవా' అనే ప్రాంతంలో మాఫియా సంస్థను నడుపుతున్నాడు. పదేళ్లుగా పలు నేరాలకు పాల్పడి, ప్రపంచంలోనే అత్యంత శక్తిమంత, వ్యవస్థీకృత నేరాల నిర్వాహకుడిగా, కిరాయి హంతకుడిగా పేరుగాంచాడు.   » ఫోర్బ్స్ మ్యాగజీన్ ప్రకటించిన వందల కోట్ల విలువైన ఆస్తి ఉన్న ధనవంతుల జాబితాలో జోక్విన్ చోటు సంపాదించాడు. ఇతడు వందల కోట్ల డాలర్ల విలువైన కొకైన్, మారిజువానా, ఇతర మాదక ద్రవ్యాలను అమెరికాకు అక్రమంగా తరలించాడు.¤ ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) పరిపాలనా ట్రైబ్యునల్ అధ్యక్షురాలిగా లక్ష్మీస్వామినాథన్ ఎన్నికయ్యారు. ఈ కీలక పదవికి ఎన్నికైన తొలి భారతీయురాలు ఆమే.   » 1991లో ఏర్పాటైన ఏడీబీ పరిపాలనా ట్రైబ్యునల్‌లో లక్ష్మీస్వామినాథన్ కంటే ముందు ఈ పదవిని చేపట్టిన వారిలో ఇద్దరు అమెరికన్లు, ఇద్దరు ఫిలిప్పీన్స్ దేశస్థులు, శ్రీలంక, బ్రిటన్ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.   » 2010లో లక్ష్మీస్వామినాథన్ ట్రైబ్యునల్ సభ్యురాలిగా నియమితులయ్యారు. 2013 నుంచి తాత్కాలిక అధ్యక్షురాలిగా విధులు నిర్వర్తించారు.   » లక్ష్మీ స్వామినాథన్ గతంలో కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ ప్రధాన ధర్మాసనం వైస్ ఛైర్‌పర్సన్‌గా కూడా పనిచేశారు.
ఫిబ్రవరి - 26
¤ నావికాదళం అధిపతి అడ్మిరల్ డి.కె.జోషి తన పదవికి రాజీనామా చేశారు. గత ఏడు నెలల్లో నావికాదళంలోని పలు యుద్ధ నౌకలు ప్రమాదాలకు గురి కావడంతో నైతిక బాధ్యత వహిస్తూ, ఆయన రాజీనామా చేశారు. జోషికి మరో 15 నెలల సర్వీస్ ఉంది.   » జోషి రాజీనామాను అంగీకరించిన రక్షణమంత్రి ఎ.కె.ఆంటోని వైస్ చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ అడ్మిరల్ ఆర్.కె.ధోవాన్ కు తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు.
ఫిబ్రవరి - 27
¤ ప్రముఖ న్యాయనిపుణులు ఫాలినారిమన్ లోక్‌పాల్ సెర్చ్ కమిటీలో భాగస్వామి అయ్యేందుకు నిరాకరించారు.   » ఎనిమిది మందితో కూడిన ఈ కమిటీయే లోక్‌పాల్ ఛైర్‌పర్సన్, దాని సభ్యుల నియామకాల కోసం వచ్చే దరఖాస్తులను పరిశీలించి, అర్హులనుకున్న వారి పేర్లను ఎంపిక కమిటీ (సెలక్షన్ కమిటీ)కి సిఫార్సు చేయాల్సి ఉంటుంది.
 ఫిబ్రవరి - 28
¤ ఇటలీకి చెందిన అటురో లికాటాను గిన్నిస్ సంస్థ ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వ్యక్తిగా గుర్తించింది.   » ఫ్రిబ్రవరి 28 నాటికి ఆయన వయసు 111 సంవత్సరాల 302 రోజులు.