హిరోషిమా, నాగసాకీ అణు యుద్ధాలు


 జపాన్‌ దేశం 1945వ సంవత్సరంలో వణికినంతగా మరెన్నడూ వణకలేదు. 
యుద్ధం అంటే ఇలా కూడా ఉంటుందా అనేటట్టు హిరోషిమా, నాగసాకీలపై వేసిన 
అణుబాంబులు చరిత్రలో రెండే రెండు అణుబాంబు యుద్ధాలుగా మిగిలిపోయాయి.

 రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా మొదట జపాన్‌లోని 67 నగరాలపై సాధారణ
 బాంబుల దాడి జరిపింది. ఆ తరువాత జపాన్‌ను యుద్ధంలో ఓటమి అంగీకరించమని, 
లేకపోతే భారీ ఎత్తున నష్టాలు జరుగుతాయని అమెరికా హెచ్చరించింది. 

ఆనాడు హ్యార్రీ ట్రూమన్‌ అమెరికా అధ్యక్షుడు. అయితే అమెరికా హెచ్చరికలను జపాన్‌ 
కొట్టిపారేసింది. దాంతో, 1945 ఆగస్టు 6న విమానంపై నుండి అమెరికా వాసులు 
హిరోషిమా నగరంపై 'లిటిల్‌ బాయి' అనే అణుబాంబును వేశారు. తిరిగి 1945 ఆగస్టు 9న
 అదేవిధంగా నాగసాకీ నగరంపై 'ఫ్యాట్‌ మ్యాన్‌' అనే అణుబాంబును వేశారు. 
ఈ రెండు సంఘటనలు అమెరికాను చూసి ప్రపంచమంతా గడగడలాడేలా చేశాయి. 


హిరోషిమాలో 90,000 - 1,66,000 మంది చనిపోగా, నాగసాకీలో 60,000- 80,000 మంది 
అనుకోని మరణం పొందారు. రెండు నగరాల్లో అణుబాంబులు వేసిన రోజున సగం మందే మరణించారు. వారిలో 60% శరీరం కాలిపోవడం వల్ల, 30% పేలిన పదార్థాలు మీద పడడం 
వల్ల, 10% ఇతర కారణాల వల్ల మరణించారు. 

మిగతా సగం మంది కొన్ని నెలల తరువాత మరణించారు. దానికి కారణం కాలిన శరీరాలు,
 హానికర కిరణాలు, ఇతర గాÄయాలు, వ్యాధులు. ఎంతో మంది క్యాన్సర్‌ బారిన పడి, 
మృతి చెందారు. ఇంత జరిగాక చేసేదేమీ లేక జపాన్‌ 1945 ఆగస్టు 15న లొంగిపోయింది. 
దీనితో సెప్టెంబర్‌ 5న రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది.