మీరు రైల్వే రిక్రూట్మెంట్ పరిక్షలకు ప్రిపేర్ అవుతున్నారా
అయితే పరిక్షలు ఎలా ఉంటాయో తెలుసుకోండి ?
రాతపరీక్షా విధానం:
----------------
కమర్షియల్ అప్రెంటీస్, ఎంక్వైరీ కమ్ రిజర్వేషన్ క్లర్క్, గూడ్స్ గార్డ్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకు రెండు స్టేజిల్లో రాతపరీక్ష ఉంటుంది. రాతపరీక్షలో జనరల్ అవేర్‌నెస్, అర్థమెటిక్, జనరల్ ఇంటలిజన్స్ అండ్ రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్ ఉంటాయి. రాతపరీక్ష ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటుంది. పరీక్షలో 100-120 ప్రశ్నలిస్తారు. సమయం 90 నిమిషాలుంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కు తగ్గిస్తారు. రాతపరీక్ష తెలుగులో కూడా ఉంటుంది.
అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ పోస్టులకు ముందుగా రాతపరీక్ష ఉంటుంది. దీని తరువాత ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. రాతపరీక్షల్లో జనరల్ అవేర్‌నెస్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అర్థమెటిక్, అనలిటికల్ అండ్ క్వాంటిటేటివ్ స్కిల్స్ ఉంటాయి. రాతపరీక్ష ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటుంది. పరీక్షలో 100-120 ప్రశ్నలిస్తారు.
సమయం 90 నిమిషాలుంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కు తగ్గిస్తారు. రాతపరీక్ష తెలుగులో కూడా ఉంటుంది.
జనరల్ అవేర్‌నెస్:
----------------
ఈ విభాగంలో వర్తమాన సంఘటనలు, దైనందిన విషయాల పట్ల అతనికి గల పరిజ్ఞానం, విద్యావంతుడిగా వాటి పట్ల అతనికి గల శాస్ర్తియ దృక్పథాలను పరీక్షించటానికి ప్రశ్నలు రూపొందాయి. భారతదేశం, దాని చుట్టుప్రక్కల దేశాల శాస్త్ర, సాంకేతిక, వైజ్ఞానిక పరిశోధన, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ రంగాలకు సంబంధించిన ప్రశ్నలు కూడా ఈ విభాగంలో ఉంటాయి. ఈ విభాగంలో అభ్యర్థి దైనందిన జీవితంలో తారసిల్లే సంఘటనలు, వర్తమాన విశేషాలు, ఇతర తత్సంబంధిత పరిజ్ఞానాన్ని పరీక్షించటానికి ఉద్దేశించబడటంతో, కరెంట్ అఫైర్స్‌తోపాటు ‘స్టాక్’ జనరల్ నాలెడ్జి అంశాలపై కూడా ప్రశ్నలు అడగబడతాయి.
జనరల్ అవేర్‌నెస్ విభాగానికి సిలబస్ అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. కనుక జనరల్ నాలెడ్జికి సంబంధించిన పరిధి విస్తృతంగా ఉంటుంది. కాబట్టి జనరల్ నాలెడ్జి అంటే భయపడిపోయి, ఏమి చదవాలో అర్థంకాక అవస్థ పడేవారు చాలామంది ఉన్నారు. కనుక జనరల్ అవేర్‌నెస్ విభాగాన్ని సులువుగా అర్థంచేసుకుని గత రాత పరీక్షలలో వచ్చిన ప్రశ్నల ఆధారంగా సిలబస్‌ను రూపొందించుకొని, ఏయే అంశాలకు సంబంధించిన ప్రశ్నలు తరచుగా వస్తున్నాయో గమనించి ఆ అంశాలకు సంబంధించిన ప్రశ్నలను అధ్యయనం చేయటం ద్వారా ఎక్కువ మార్కులను సంపాదించవచ్చు. గత ప్రశ్నాపత్రాలలో వచ్చిన ప్రశ్నలను పరిశీలించి అవి ఏ అంశాలపైన ఎక్కువగా రావటం జరిగిందో గమనించి ఆ అంశాలకు సంబంధించిన ప్రశ్నలను, ఆ అంశాలకు అనుబంధంగా ఉన్న అంశాలకు సంబంధించిన ప్రశ్నలను అధ్యయనం చేయటంవలన ఎక్కువ మార్కులు సాధించవచ్చు. గత ప్రశ్నాపత్రాలలో జనరల్ అవేర్‌నెస్ విభాగంలో వచ్చిన కొన్ని ప్రశ్నల ఆధారంగా జనరల్ అవేర్‌నెస్‌కి సంబంధించి చదవ వలసిన అంశాలు ఇలా ఉన్నాయి.
ప్రపంచ విషయాలు:
----------------
జనరల్ అవేర్‌నెస్ పరీక్షలో దేశాలు- రాజధానులకు సంబంధించి ఒకటి, రెండు ప్రశ్నలు వుంటున్నాయి. అందువల్ల వివిధ దేశాల రాజధానులను చదివి గుర్తుంచుకోవాలి. అందు లో ముఖ్యంగా ఇరుగు పొరుగు దేశాలు, వార్తలలోని దేశాలు చదివి గుర్తుంచుకోవటం ఎంతో అవసరం.
అంతర్జాతీయ సంస్థలు:
-------------------
అంతర్జాతీయ సంస్థలలో ప్రధానమైనవి ఐక్యరాజ్యసమితి, దాని అనుబంధ సంస్థలు. ఈ సంస్థలను గురించి ప్రశ్నలు ఉంటున్నాయి.
ప్రపంచ భూగోళం:
--------------
ప్రపంచ భూగోళశాస్త్రంపై కూడా ప్రశ్నలు వస్తున్నాయి. ఖగోళ శాస్త్రానికి సంబంధించిన అంశాలను కూడా ఇందులో చేర్చవచ్చు.
దేశాలు- కరెన్సీలు:
----------------
వివిధ దేశాల కరెన్సీలను కూడా జనరల్ అవేర్‌నెస్‌లో అడుగుతున్నారు. అందువల్ల వివిధ దేశాల కరెన్సీలను కూడా చదివి గుర్తుంచుకోవాలి.
దేశాలు- పాత పేర్లు- కొత్త పేర్లు:
---------------------------
కొన్ని దేశాల పేర్లు మారుతున్నాయి. వాటిని గురించి కూడా ప్రశ్నలు అడగవచ్చు. అందువల్ల దేశాల పాత పేర్లను, కొత్త పేర్లను కూడా చదువుకోవాలి. అంతేకాక మన దేశంలో కూడా కొన్ని రాష్ట్రాల పేర్లు, నగరాల పేర్లు కూడా మారినవి. వాటిని కూడా చదువుకోవాలి.
దేశాలు- మారుపేర్లు:
------------------
కొన్ని దేశాలకు వాటి విశేషాలనుబట్టి కొన్ని మారుపేర్లు పెట్టబడినవి. వాటి మీద కూడా జనరల్ అవేర్‌నెస్‌లో ప్రశ్నలు వస్తున్నాయి.
భారతదేశానికి సంబంధించిన విషయాలు:
జాతీయ చిహ్నాలు:
----------------
మన జాతీయ చిహ్నాలైన జాతీయ పతాకం, జాతీయ చిహ్నం, జాతీయ గీతం, జాతీయ గేయం, జాతీయ జంతువు, జాతీయ పక్షి, జాతీయ వృక్షంపై ప్రశ్నలు వస్తున్నాయి. అందువల్ల జాతీయ చిహ్నాలను గురించి తెలుసుకోవాలి. వాటికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి.
భారత భౌగోళిక పరిస్థితులు:
-----------------------
భారత భౌగోళిక పరిస్థితులు అంటే ఉనికి, వైశాల్యం, నైసర్గిక స్వరూపం, రాష్ట్రాలు- రాజధానులు తదితర అంశాలపై కూడా ప్రశ్నలు వస్తున్నాయి. అందువల్ల భారతదేశ భౌగోళిక పరిస్థితులను గురించి తెలుసుకోవాలి.
భారతదేశ చరిత్ర- సంస్కృతి:
------------------------
భారతదేశ చరిత్రలోని ప్రధాన ఘట్టాలపై కూడా ప్రశ్నలు వస్తున్నాయి. అందువల్ల భారతదేశ చరిత్రలోని ప్రధాన ఘట్టాలను గురించి, స్వాతంత్య్రోద్యమం గురించి చదవాలి.
భారత రాజ్యాంగం- రాజకీయ వ్యవస్థ:
భారత రాజ్యాంగం మీద రాజకీయ వ్యవస్థ మీద కూడా ప్రశ్నలు ఉంటున్నాయి. భారత రాజ్యాంగ సంస్థలు- విధులు, రాజ్యాంగ అధికారాలు, రాజ్యాంగ సవరణలు, షెడ్యూళ్లు తదితర అంశాలను గురించి తెలుసుకోవాలి.
భారత ఆర్థిక వ్యవస్థ- పంచవర్ష ప్రణాళికలు:
-------------------------------------
భారత ఆర్థిక వ్యవస్థకు ప్రధాన దిక్సూచికలు పంచవర్ష ప్రణాళికలు. భారత ఆర్థిక వ్యవస్థపైన పంచవర్ష ప్రణాళికల మీద ప్రశ్నలు ఉంటున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థలోని ముఖ్యాంశాలు, పంచవర్ష ప్రణాళికలు- వాటి కాలాలు, వాటి ఉద్దేశాలు వంటి విషయాలను చదువుకోవాలి. భారతదేశానికి సంబంధించిన చదవ వలసిన ఇతర విషయాలు, భారతదేశానికి సంబంధించిన చదవవలసిన ఇతర విషయాలలో ముఖ్యమైనవి: రాష్ట్రాలు- రాజధానులు, నదులు- ప్రాజెక్టులు, పరిశోధనా సంస్థలు, జాతీయ ఉద్యానవనాలు- పార్కులు, రాష్ట్రాలు- కళారీతులు, రక్షణ వ్యవస్థ, దర్శనీయ స్థలాలు, కమిషన్లు, ఖనిజాలు- లభించు ప్రాంతాలు, రాష్టప్రతులు, ఉప రాష్టప్రతులు, ప్రధానమంత్రులు, లోక్‌సభ స్పీకర్లు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, త్రివిధ దళ ప్రధానాధిపతులు మొదలైన విషయాలు ఈ విషయాలపై ప్రశ్నలు కూడా వచ్చే అవకాశం ఉంది.
జనరల్ సైన్స్: జనరల్ సైన్స్‌కు సంబంధించినంతవరకు శాస్త్రాలు- అధ్యయన అంశాలు, శాస్త్ర పరికరాలు, శాస్త్ర ప్రమాణాలు, ఆవిష్కరణలు, అంతరిక్ష పరిశోధనలు, కంప్యూటర్ ప్రాథమిక విజ్ఞానం, విటమిన్లు, సైన్స్‌లో వర్తమాన విషయాలు అంశాలపై ప్రశ్నలు వస్తున్నాయి.క్రీడా రంగంపై కూడా ప్రశ్నలు వస్తున్నాయి. దాదాపు ప్రతి పరీక్షలోనూ క్రీడలపై ఒకటి రెండు ప్రశ్నలు వస్తున్నాయి. అంతేకాక క్రీడలకు సంబంధించి క్రీడా పదాలు, క్రీడలు- కొలతలు, క్రీడలు- ఆడేవారి సంఖ్య, క్రీడా స్థలాలు, క్రీడలు- కప్‌లు- ట్రోఫీలు, ఒలింపిక్ క్రీడలు, కామన్‌వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడలు, టెన్నిస్ టోర్నమెంట్స్, ఫుట్‌బాల్ టోర్నమెంట్స్, క్రికెట్ విశేషాలు చదివి గుర్తుంచుకోవాలి.
అవార్డులు- బహుమతులు:
------------------------
ప్రముఖ అవార్డులు- బహుమతుల మీద కూడా ఒకటి, రెండు ప్రశ్నలు వస్తున్నాయి. అందువల్ల ముఖ్యంగా నోబెల్ ప్రైజ్ గ్రహీతలు, జ్ఞానపీఠ అవార్డుల గ్రహీతలు, దాదాసాహెబ్ పాల్కే అవార్డు గ్రహీతలు తదితర ప్రధాన బహుమతుల గ్రహీతల పేర్లను బాగా గుర్తుంచుకోవాలి.జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలను గురించి కూడా ఒకటి రెండు ప్రశ్నలు వస్తున్నాయి. జాతీయ, అంతర్జాతీయ దినోత్సవాలను తేదీల వారీగా చదివి గుర్తుంచుకోవాలి. అదే విధంగా వారోత్సవాలను, ప్రత్యేక సంవత్సరాలను, దశాబ్దాలను కూడా తెలుసుకోవాలి.
కరెంట్ అఫైర్స్:
-------------
కరెంట్ అఫైర్స్ అంటే వర్తమాన విషయాలు. ఒక విధంగా ఇది లేటెస్ట్ జనరల్ నాలెడ్జి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్‌లో ప్రధానంగా లేటెస్ట్ క్రీడలు, అవార్డులు- బహుమతులు, సభలు- సమావేశాలు, గ్రంథాలు- గ్రంథకర్తలు, అబ్రివేషన్స్, తదితర అంశాలను చదివి గుర్తుంచుకోవాలి. జనరల్ నాలెడ్జిని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలంటే కరెంట్ అఫైర్స్‌ను ఫాలో అవుతుండాల్సిందే. కరెంట్ అఫైర్స్‌కు సంబంధించినంత వరకు క్రీడలు, అవార్డులు- బహుమతులు వంటి విషయాలతోపాటు, సమకాలీన రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ సంఘటనలను కూడా చదువుకోవాలి. పోటీ పరీక్షలలో ప్రతి మార్కు ఇంపార్టెంట్ కాబట్టి పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులందరూ జనరల్ అవేర్‌నెస్‌ని ప్రత్యేక శ్రద్ధతో చదవాలి. జనరల్ అవేర్‌నెస్ ప్రిపరేషన్ ఇతర ఉద్యోగ పరీక్షలకు కూడా ఉపకరిస్తుంది. పోటీ పరీక్షలలో రాణించాలనుకున్న ప్రతివారు జనరల్ అవేర్‌నెస్‌లో మంచి పరిజ్ఞానం కలిగి ఉండటం అవసరం.
ముఖ్యమైన పుస్తకాలు
ఆబ్జెక్టివ్ జనరల్ ఇంగ్లీష్- వికాస్ అగర్వాల్, అడ్వాన్స్‌డ్ ఆబ్జెక్టివ్ జనరల్ నాలెడ్జ్- ఆర్.ఎస్. అగర్వాల్
క్విక్ అర్థమెటిక్- విలే పబ్లిషర్స్, ఆబ్జెక్టివ్ అర్థమెటిక్- ఆర్.ఎస్.అగర్వాల్, క్వికర్ రీజనింగ్ టెస్ట్- ఎం.బి.లాల్ అండ్ ఎ.కె.సింగ్
అర్థమెటిక్:
---------
అర్థమెటిక్‌లో ఈ కింది అంశాల నుండి ప్రశ్నలు వస్తాయి. అవి. నంబర్ సిస్టమ్స్, ఫ్రాక్షన్స్, డెసిమల్స్, శాతాలు, లాభనష్టాలు, బారువడ్డీ/ చక్రవడ్డీ, డిస్కౌంట్, రేషియో అండ్ ప్రపోర్షన్, కాలం- పని, కాలం- దూరం, వయస్సులు. జనరల్ అర్థమెటిక్ విభాగంలో పూర్ణ సంఖ్యలు, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, దశాంశాలు, భాగాహారాలు, నంబర్ల మధ్య సంబంధం కనుగొనడంలో అభ్యర్థి వ్యూహాత్మక దశలు గమనిస్తాడు. వీటితోపాటు భిన్నాలు, శాతం, నిష్పత్తి- అనుపాతం, సగటు, బారువడ్డీ, చక్రవడ్డీ, లాభనష్టాలు, వైశాల్యాలు, కాలం-దూరం, కాలం- పని, భాగస్వామ్యాలు, క్షేత్ర గణితం వంటి అంశాలపై ప్రశ్నలు వస్తాయి. అన్ని రకాల లెక్కలనూ వీలయినంత వరకూ రఫ్ వర్క్ చేయకుండా నోటితో చేయడాన్ని ప్రాక్టీస్ చేయాలి. కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగాహారాలపై అభ్యర్థికి ప్రాథమిక అవగాహన ఉండాలి. జనరల్ అర్థమెటిక్ విభాగంలోని సూత్రాలను తెలుసుకున్నట్లయితే ప్రశ్నలను షార్ట్‌కట్‌లో చేసి జవాబులు గుర్తించవచ్చు. ఈ విభాగంలో ప్రశ్నలకు సరయిన జవాబులను గుర్తించడానికి ఎక్కువ సాధన అవసరం. అర్థమెటిక్ ప్రిపరేన్‌కు 8 నుండి 10వ తరగతి వరకు గల గణితం పుస్తకాలు ఎంతగానో దోహదపడతాయి.
జనరల్ ఇంటలిజన్స్ అండ్ రీజనింగ్, అనలిటికల్ అండ్ క్వాంటిటేటివ్స్ స్కిల్స్:
ఆర్.బి.ఐ. ఎగ్జామ్‌లో జనరల్ ఇంటలిజెన్స్ ప్రశ్నలన్నీ దాదాపు వెర్బల్ రీజనింగ్ మీద ఉంటాయి. ఇందులో కోడింగ్ విత్ క్యారక్టర్స్, అడ్‌హాక్ నెంబరింగ్ ఆఫ్ లెటర్స్, బ్యాక్‌వర్డ్ సీక్వెన్సీ నంబరింగ్, ఫార్వార్డ్ సీక్వెన్సీ నంబరింగ్, రాండమ్ సీక్వెన్సీ నంబరింగ్, కోడింగ్ విత్ స్పెసిఫిక్ ప్యాటర్న్, అనలాజికల్ కోడింగ్ విత్ నెంబర్స్, నెంబర్ కోడింగ్, కోడింగ్ బై రిజర్వింగ్ లెటర్స్, కోడింగ్/ డీకోడింగ్, బ్యాక్‌వర్డ్ సీక్వెన్సీ పేటర్న్, ఫార్వాడ్ సీక్వెన్సీ పేటర్న్, కోడింగ్ విత్ ఏ స్పెసిఫిక్ పేటర్న్, కోడింగ్ అండ్ డీ కోడింగ్ టెస్ట్, లాజికల్ డయాగ్రమ్, డైరెక్షన్ టెస్ట్, బ్లడ్ రిలేషన్, పజిల్ టెస్ట్, వెర్బల్ ఎనాలజీ, స్టేట్‌మెంట్ అండ్ కన్‌క్లూజన్స్, ఆడ్‌మెన్ అవుట్, ఫిగర్ ఎనాలజీ, మిస్సింగ్ నెంబర్స్ ఉంటాయి.
జనరల్ ఇంగ్లీష్:
-------------
ఆర్.ఆర్.బి. ఎగ్జామ్‌లోని జనరల్ ఇంగ్లీష్ విభాగంలో ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ మల్టిపుల్ ఛాయిస్ టైప్‌లో ఉంటాయి. ఇంగ్లీషు విభాగంలో సాధారణంగా ఈ క్రింది అంశాలపై ప్రశ్నలుంటాయి.* కాంప్రహెన్షన్, క్లోజ్ టెస్ట్, సినానిమ్స్, యాంటానిమ్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, స్పెల్లింగ్ కరెక్షన్/ స్పాటింగ్ ది ఎర్రర్స్, సెంటెన్స్ కరెక్షన్/ సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్., వన్ వర్డ్ సబ్‌స్టిట్యూషన్స్, రీ అరేంజ్‌మెంట్స్ ఆఫ్ జంబుల్డ్ వర్డ్స్. ఆర్.ఆర్.బి. ఎగ్జామ్స్‌లో ఇంగ్లీషు విభాగానికి శ్రద్ధగా ప్రిపేర్ కావలసి ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్ విభాగాన్ని సరిగా రాయడానికి వ్యాకరణం తెలుసుకుని ఉండడం ఎంతో అవసరం. పదకోశం ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగా భాషను ఉపయోగిస్తారు. ఇంగ్లీషు పదజాలంలో మంచి పట్టు సంపాదించటానికి ప్రతిరోజు ఇంగ్లీషు వార్తా పత్రికను చదవటం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంగ్లీష్‌ను అర్థం చేసుకోగలిగిన వారెవరైనా ఈ విభాగాన్ని తేలికగా చేయవచ్చు. స్వల్ప కృషితో మంచి మార్కులు సాధించవచ్చు. ఈ విభాగం ప్రిపరేషన్ విషయంలో గ్రామర్‌తోపాటు ఒకాబ్యులరీ, కాంప్రహెన్షన్‌లు కూడా కీలకమని గుర్తించాలి. స్పాట్ ఎర్రర్స్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ మొదలైనవి అభ్యాసం చేస్తే మంచి మార్కులు సాధించవచ్చు.
ప్రిపరేషన్ ప్లాన్:
-------------
పరీక్షలో నిర్ణీత సమయంలో వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. ఇది సరైన ప్రాక్టీస్ ఉన్నప్పుడే సాధ్యపడుతుంది. ఈ ప్రాక్టీస్‌కోసం మీరు వీలైనన్ని ఎక్కువ గత ప్రశ్నలను సాధనచేయాలి. పోటీ పరీక్షలకు గత ప్రశ్నపత్రాలను పరీక్ష వాతావరణంలో ప్రాక్టీస్ చేయటం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందువల్ల వచ్చినవి ఏమిటో రానివి ఏమిటో స్పష్టంగా తెలుస్తుంది. రాని వాటిని ఇంకోసారి రివిజన్ చేసుకోవచ్చు. పరీక్షలో స్పీడ్ అండ్ యాక్యురసీ ఎంతో అవసరం. ఇది ప్రాక్టీస్ మీద ఆధారపడి ఉంటుంది. రాతపరీక్షలో 90 నిమిషాల్లో 120 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. అంటే ప్రతి ప్రశ్నకు 45 సెకన్ల సమయం ఉంటుంది. ఇందుకోసం సాధన అవసరం. ఇలా ప్రణాళికాయుతంగా ప్రిపరేషన్ సాగించినట్లయితే రైల్వే పరీక్షల్లో విజయం మీదే అవుతుంది.
ప్రయత్నిస్తే విజయం మనదే ...
సదా మీ సేవలో మీ GK SEVA.....
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment