జనవరి - 1
|
¤ కొత్త సంవత్సరం సందర్భంగా పోప్ ఫ్రాన్సిస్ వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ స్వ్కేర్ వద్ద ప్రపంచ ప్రజలకు సందేశం ఇచ్చారు. ప్రజలు విరోధులను కూడా తమ సోదరులుగానే భావించాలని ఆకాంక్షించారు. 'మనమంతా దేవుడి బిడ్డలం, ఒకే మానవ కుటుంబానికి చెందిన వాళ్లం' అని పేర్కొన్నారు.
» ఈ నేపథ్యంలో కేథలిక్ చర్చి జనవరి 1ని శాంతిని ప్రోత్సహించడానికి అంకితం చేసింది.
¤ కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా దుబాయ్లో బాణసంచా వెలుగులు గిన్నిస్ రికార్డు సృష్టించాయి. ఆరు నిముషాల పాటు 5 లక్షలకు పైగా టపాసులు పేలాయి. ఈ వెలుగుల కోసం పది నెలల పాటు కృషి చేశారు. |
|
» నగరవ్యాప్తంగా అంటే 94 కి.మీ.కు పైగా ఈ టపాసులను అమర్చారు. సముద్ర తీరంలో ఈ టపాసులతో కృత్రిమ సూర్యోదయాన్ని సృష్టించారు. |
¤ బంగ్లాదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు పాలకపక్షానికే మళ్లీ పట్టం కట్టారు. ప్రధానమంత్రి హసీనా నేతృత్వంలోని అవామీలీగ్ 147 స్థానాలకు 95 స్థానాలను గెలుచుకుంది. జతియా పార్టీ (జేపీ)కి 12 స్థానాలు దక్కగా, ఇతర పార్టీలు, స్వతంత్రులు 13 స్థానాల్లో గెలిచారు.
» షేక్ హసీనా గోపాల్‌గంజ్, రంగ్‌పూర్ స్థానాల నుంచి గెలుపొందారు. | |
జనవరి - 7
|
¤ బంగ్లాదేశ్ పార్లమెంట్‌కు ఇటీవల జరిగిన వివాదాస్పద ఎన్నికల్లో ప్రధానమంత్రి షేక్ హసీనా నేతృత్వంలోని అవామీలీగ్ పార్టీ ఘనవిజయం సాధించింది. ఏకంగా నాలుగింట మూడొంతుల మెజార్టీతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది.
» ప్రతిపక్షాలు బహిష్కరించిన ఈ ఎన్నికల్లో విపరీతమైన హింస, గొడవలు చోటు చేసుకున్నాయి. మొత్తం 300 స్థానాలకు ఎన్నికలు జరగ్గా అవామీలీగ్ 232 స్థానాల్లో జయకేతనం ఎగరవేసింది. బంగ్లాదేశ్ ఎన్నికల కమిషన్ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. అవామీలీగ్ మిత్రపక్షమైన జతియా పార్టీ 33 స్థానాలను సొంతం చేసుకుంది.
» అధికార కూటమిలోని వర్కర్స్ పార్టీ, సమాజ్ తాంత్రిక్ దళ్, జతియా పార్టీ (మంజు)లు 12 స్థానాలను గెలుచుకున్నాయి. స్వతంత్రులు 13 చోట్ల గెలుపొందారు. మరో మూడు స్థానాలను చిన్నాచితకా పార్టీలు గెలుచుకున్నాయి. |
జనవరి - 8
|
¤ అమెరికాను అతిశీతల గాలులు చుట్టుముట్టాయి. ఉత్తర ధ్రువం నుంచి విరుచుకుపడుతున్న అత్యంత చల్లని పవనాలు అగ్రరాజ్యాన్ని వణికించాయి. మంచు తుపాను, ఉత్తర ధ్రువ అతిశీతల గాలుల ప్రభావంతో అమెరికా అంతటా ఉష్ణోగ్రతలు అత్యల్పస్థాయికి పడిపోయాయి. దీనికి హిమపాతం తోడవటంతో పరిస్థితి భీతావహంగా మారింది. |
|
» ఇళ్ల పైకప్పులూ, కార్లు, చెట్టుచేమలన్నిటి మీదా మంచు పేరుకుంది. స్కూళ్లు, కార్యాలయాలు మూతపడ్డాయి. విమానాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. ఈ ప్రభావంతో గత నాలుగు రోజుల్లో 21 మంది మృతి చెందారు. |
» గత నలభైయ్యేళ్లలో ఎన్నడూ లేనంతగా పలు రాష్ట్రాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బర్మింగ్‌హామ్, అలబామాల్లో ఉష్ణోగ్రత మైనస్ 14 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు పడిపోయింది. ఇక్కడ 1970లో మైనస్ 11.7 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదయింది. ఇప్పుడు అంతకంటే తక్కువకు పడిపోయింది. వాషింగ్టన్‌లో 1988 నాటి కనిష్ఠ ఉష్ణోగ్రత మైనస్ 13 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఇంకా తక్కువగా ఇప్పుడు మైనస్ 17 డిగ్రీలు నమోదైంది.
» అంగారకుడిపై ప్రస్తుతం మైనస్ 25 నుంచి మైనస్ 31 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉష్ణోగ్రతలు ఉండగా, దాదాపు అదేస్థాయిలో అమెరికాలోని కొన్నిరాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. |
|
జనవరి - 11
|
¤ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తమ దేశంలో లేడని పాకిస్థాన్ ప్రకటించింది.
» దావూద్ పాకిస్థాన్‌లోనే ఉన్నాడని భారత్ ఆరోపించిన నేపథ్యంలో పాకిస్థాన్ ఈ ప్రకటన చేసింది. |
జనవరి - 12
|
¤ బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా షేక్ హసీనా (66) ప్రమాణ స్వీకారం చేశారు.
» సైనిక పాలన ముగిసి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించిన తరువాత ఈ రెండు దశాబ్దాల్లో హసీనా ప్రధాని పీఠాన్ని అధిరోహించడం ఇది మూడోసారి.
» ఢాకాలోని బంగ్లాదేశ్ అధ్యక్షుడి నివాసం బంగ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హసీనాతో పాటు మరో 48 మంత్రులతో అధ్యక్షుడు అబ్దుల్ హమీద్ ప్రమాణ స్వీకారం చేయించారు. |
జనవరి - 14
|
¤ థాయ్‌లాండ్ప్రధానమంత్రి ఇంగ్లక్ షినవత్ర పదవి నుంచి తప్పుకోవాలంటూ దేశంలో నిరసనలు ఉద్ధృతమయ్యాయి.
» వేలాదిమంది నిరసనకారులు ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. దేశంలో పెరిగిపోతున్న అవినీతిని అరికట్టాలంటే షినవత్ర పదవి నుంచి తప్పుకోవడమే ఏకైక మార్గమని నిరసనకారులు నినదించారు. |
జనవరి - 15
|
¤ భారత దౌత్యాధికారి దేవయాని ఖోబ్రగాడే అరెస్టుతో రెండు దేశాల మధ్య దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించే యత్నాలను అమెరికా ప్రారంభించింది.
» సుహృద్భావ సంబంధాలను పెంపొందించే చర్యల్లో భాగంగా ఇరు దేశాలూ రక్షణ, ఉగ్రవాద నిరోధక చర్యలు, పౌర అణుశక్తి రంగాల్లో సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని అమెరికా ప్రతిపాదించింది.
» భారత్‌లో చోరీ అయి తమ దేశానికి చేరుకున్న పురాతన కాలం నాటి మూడు దేవతా శిల్పాలను అమెరికా తిరిగి అప్పగించింది. వీటి విలువ రూ.93 కోట్లు ఉంటుందని అంచనా. దేవయాని వివాదం తర్వాత భారత్‌తో సత్సంబంధాలను పునరుద్ధరించుకోవాలని కోరుకుంటున్న అమెరికా దానికి మార్గాన్ని సుగమం చేసే చర్యల్లో భాగంగానే విగ్రహాలను అందజేసినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
¤ ఇరాక్‌లో ఉగ్రవాదులు భారీ విధ్వంసాలకు తెగబడ్డారు. రాజధాని బాగ్దాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో వరుస పేలుళ్లకు మొత్తం 73 మంది మరణించారు. మిలిటెంట్లు ఎనిమిది కారు బాంబులను పేల్చడంతో బాగ్దాద్‌లోనే 37 మంది చనిపోయారు. |
జనవరి - 17
|
¤ అమెరికాకు చెందిన జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఎస్ఏ) ప్రపంచవ్యాప్తంగా రోజూ 20 కోట్ల సెల్‌ఫోన్ మెసేజ్‌లను అక్రమంగా సేకరించినట్లు ఆ సంస్థలో ఉద్యోగిగా పని చేసి, ప్రస్తుతం రష్యాలో శరణార్థిగా ఉన్న ప్రజావేగు ఎడ్వర్డ్ స్నోడెన్ బయట పెట్టినట్లు కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి.
» వినియోగదారుల క్రెడిట్‌కార్డుల వివరాలు, పలు సంస్థల మధ్య జరిగిన సంభాషణలు, లావాదేవీలను తెలుసుకునేందుకు 'డిష్‌ఫైర్' పేరుతో 2012లోనే ఎన్ఎస్ఏ ఈ రహస్య కార్యక్రమాన్ని చేపట్టినట్లు మీడియా సంస్థలు ఆరోపించాయి.
» అంతర్జాతీయంగా ఫోన్‌లో జరిగే సంభాషణలను, సందేశాలను పరిశీలించేందుకు 'ప్రిఫర్' పేరుతోనూ ఆ సంస్థ ఫోన్‌కాల్స్, మెసేజ్ అలర్ట్స్‌పై నిఘా పెట్టిందని ఆరోపించారు.
¤ ప్రపంచంలోనే అత్యధికంగా పోలియో కేసులు పాకిస్థాన్‌లోని పెషావర్‌లో నమోదవుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది.
» 2013లో పాకిస్థాన్‌లో నమోదైన 91 పోలియో కేసుల్లో 83 పెషావర్‌తో సంబంధమున్నవేనని 'రీజినల్ రెఫరెన్స్ లేబొరేటరీ ఫర్ పోలియో' గణాంకాలు స్పష్టం చేశాయి.
» అఫ్గానిస్థాన్‌లో గత ఏడాది నమోదైన 13 కేసుల్లో 12 పెషావర్ నుంచి వ్యాపించిన వైరస్ వల్లే వచ్చినట్లు గుర్తించారు.
» తాలిబన్ల అనాగరిక కట్టుబాట్లు, నిరక్షరాస్యతల వల్ల పాకిస్థాన్‌ను పోలియో పట్టి పీడిస్తోంది. తాలిబన్లు పోలియో టీకాపై నిషేధం విధించడంతో, పాక్‌లో ఈ కార్యక్రమం సజావుగా సాగడంలేదు. |
జనవరి - 20
|
¤ వృద్ధికి ఊతమిచ్చేందుకు కఠిన సంస్కరణ విధానాలను అమలు పరిచినా, మొండి బకాయిల నియంత్రణకు చర్యలు చేపట్టినా, 2013లో చైనా వృద్ధి రేటు 7.7 శాతానికే పరిమితమైంది. ఇది 14 ఏళ్ల కనిష్ఠం కావడం గమనార్హం. 1999 తర్వాత అతి తక్కువగా నమోదైన వృద్ధి రేటు ఇదేనని అధికారిక గణాంకాలు వెల్లడించాయి.
» జీడీపీ 56.88 ట్రిలియన్ యాన్‌ల (9.31 ట్రిలియన్ డాలర్ల)కు చేరిందని చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ తెలిపింది. |
జనవరి - 26
|
¤ చైనాలో ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త, గ్రామీణ చిన్నారులకు పట్టణాల్లో చదివే హక్కు కల్పించాలని, అధికారులు తమ ఆస్తులు ప్రకటించాలని పోరాడుతున్న ప్రముఖ న్యాయవాది జు జియాంగ్‌కు అక్కడి న్యాయస్థానం నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో చైనాలో అర్థవంతమైన రాజకీయ మార్పు వస్తుందనే ఆశలు క్షీణించినట్లయింది.
» నోబెల్ బహుమతి గ్రహీత ల్యూ ను 2009లో జైలుకు పంపించిన తర్వాత ఆ స్థాయి ఉద్యమకారులకు శిక్ష విధించిన సంఘటన ఇదే. |
జనవరి - 28
|
¤ అధికార పీఠం నుంచి తనను కూలదోసేందుకు కుట్ర చేశారనే ఆరోపణలపై తన మేనత్త భర్త జాంగ్ సాంగ్ థెక్‌కు మరణశిక్ష విధించిన ఉత్తర కొరియా అధిపతి, 31 ఏళ్ల కిమ్ జాంగ్ ఉన్ తాజాగా, జాంగ్ సాక్‌థెక్ రక్త సంబంధీకులందరినీ మట్టుబెట్టినట్లు దక్షిణ కొరియాకు చెందిన యోనాప్ వార్తాసంస్థ సంచలనాత్మక కథనాన్ని ప్రచురించింది. |
|
|