నవంబరు - 4
|
¤ తీరప్రాంత రక్షణకు సుశిక్షతమైన సిబ్బందిని తయారు చేయడానికి మచిలీపట్నం
మండలం పెదపట్నంలో జాతీయ మెరైన్ పోలీసు అకాడమీని ఏర్పాటు చేయాలని కేంద్రప్రభుత్వం
నిర్ణయించింది.
|
నవంబరు - 6
|
¤ ప్రపంచంలో ఎత్తయిన గాలి మరను గుజరాత్‌లోని కచ్ జిల్లా, నానిబెర్ గ్రామంలో ఆ రాష్ట్ర సీఎం ఆనందిబెన్ పటేల్ ప్రారంభించారు. » ఈ గాలి మరను సుజ్లాన్ కంపెనీ ఏర్పాటు చేసింది. » 14 ఏళ్ల కిందట 4,000 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ లోటులో ఉన్న గుజరాత్, ప్రస్తుతం 15,000 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో ఉంది. సంప్రదాయేతర పద్ధతుల్లో విద్యుదుత్పత్తిలో గుజరాత్ కొత్త పుంతలు తొక్కింది.
|
నవంబరు - 12
|
¤ అంతర్జాతీయ సమాచార సాంకేతిక ప్రదర్శనను బెంగళూరులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రారంభించారు. » 35 దేశాలకు చెందిన మూడు వందల సంస్థలు తమ బ్రాండ్ల ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శించాయి.
|
నవంబరు - 13
|
¤ ఒడిశాలోని చిలుకా సరస్సుకు అంతర్జాతీయ ఖ్యాతి దక్కింది. ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యటక సంస్థ దాన్ని 'డెస్టినేషన్ ఫ్లైవే' (పర్యటక గమ్యస్థానం)గా గుర్తించింది. » అక్కడి సహజ సంపద, జీవ వైవిధ్యాన్ని పరిగణనలోకి తీసుకుని చిలుకా సరస్సుకు ఆ హోదాను ఇచ్చింది. ¤ ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన సైకత శిల్పాన్ని బ్రెజిల్‌లోని నిటెరాయ్ నగరంలోని సముద్రతీరంలో రూపొందించారు. » ఈ సైకత శిల్పం ఎత్తు 39 అడుగులు. దీని నిర్మాణంలో 20 ట్రక్కుల ఇసుకకు వాడారు. » అమెరికాకు చెందిన సైకత శిల్పి రస్టీక్రాఫ్ట్ దీన్ని రూపొందించారు. ¤ అరుదుగా లభించే కాశ్మీర్ ఇంద్రనీల వజ్రం జెనీవాలో సోతెబీ సంస్థ నిర్వహించిన వేలంలో సుమారు రూ.36.91 కోట్ల ధర పలికింది. ఇది అంతకు ముందున్న రికార్డులను తిరగ రాసి సరికొత్త రికార్డును సృష్టించింది. » అరుదైన ఈ 27.54 క్యారెట్ల వజ్రాన్ని ఆసియాకు చెందిన ఓ వ్యాపారి సొంతం చేసుకున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.
|
నవంబరు - 16
|
¤ ఉత్తర ప్రదేశ్‌లోని పవిత్ర పట్టణం వృందావన్‌లో చేపట్టిన ప్రపంచంలోనే ఎత్తయిన శ్రీకృష్ణ దేవాలయ నిర్మాణానికి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ప్రత్యేక పూజలు నిర్వహించి శంకుస్థాపన చేశారు. » చంద్రోదయ మందిర్ పేరిట ఇస్కాన్ (ISKCON: ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్) నిర్మిస్తున్న ఈ ఆలయం ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిందిగా రికార్డులకు ఎక్కనుంది. » 218 మీటర్ల ఎత్తుతో, రూ.300 కోట్ల అంచనా వ్యయంతో ఈ ఆలయాన్ని నిర్మించనున్నారు. దిల్లీలో 72.5 మీటర్ల ఎత్తున్న కుతుబ్‌మినార్ కంటే ఇది మూడింతలు ఎక్కువ. ¤ శబరిమలలోని అయ్యప్ప ఆలయాన్ని భక్తుల కోసం తెరిచారు. సంవత్సరంలో కొద్దికాలం మాత్రమే ఈ ఆలయం తెరిచి ఉంటుంది.
|
నవంబరు - 17
|
¤ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి 'ఆదర్శ గ్రామం' కింద పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గం మొగల్తూరు మండలం పేరుపాలెం (దక్షిణ) గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. » 'సంసద్ ఆదర్శ గ్రామ యోజన' కింద ఎంపీ నిధులతో ఈ గ్రామాన్ని తీర్చిదిద్దనున్నట్లు ఆయన ప్రకటించారు.
|
నవంబరు - 19
|
¤ దిల్లీలోని ఖాన్ మార్కెట్ దేశంలోనే అత్యంత ఖరీదైన కిరాయి ప్రాంతంగా నిలిచింది. ఇక్కడ అంగడి పెట్టాలంటే నెలకు ఒక్కో చదరపు అడుగుకి రూ.1250 సగటున అద్దె చెల్లించాలి. » ప్రపంచవ్యాప్తంగా చూస్తే అత్యంత ఖరీదైన కిరాయి ప్రాంతాల్లో ఖాన్ మార్కెట్ 31వ స్థానంలో నిలిచింది. » ప్రపంచంలో అత్యంత ఖరీదైన ప్రాంతంగా న్యూయార్క్‌లోని అప్పర్ ఫిఫ్త్ అవెన్యూ నిలిచింది. తర్వాతి స్థానాల్లో వరుసగా హాంకాంగ్‌లోని కాజ్ వే, పారిస్‌లోని అవెన్యూ దస్ చాంప్స్ ఎలిసీస్, లండన్ న్యూబాండ్ స్ట్రీట్, సిడ్నీ పిట్ స్ట్రీట్ మాల్ ఉన్నాయి. » ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఖాన్ మార్కెట్‌కు 10వ స్థానం దక్కింది. » మొత్తం 65 అత్యంత ఖరీదైన రిటైల్ ప్రాంతాల్లో, భారత్ ర్యాంకింగ్‌లో అత్యంత ఖరీదైన తొలి మూడు ప్రాంతాలు దిల్లీలోనే ఉన్నాయి. కనాట్ ప్లేస్ (2వ స్థానం), సౌత్ ఎక్స్‌టెన్షన్; ముంబయిలోని లింకింగ్ రోడ్‌లు సంయుక్తంగా మూడో స్థానం దక్కించుకున్నాయి.
|
నవంబరు - 20
|
¤ గోవా రాజధాని పనాజీలో 45వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాన్ని (ఇఫీ - IFFI) కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రారంభించారు. » రజనీకాంత్‌కు 'సెంటెనరీ అవార్డు' ను, హాంకాంగ్‌కు చెందిన వాంగ్ కార్ వాయ్‌కు జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ఈ కార్యక్రమంలో ప్రదానం చేశారు. |
నవంబరు - 23
|
¤ అఫ్గానిస్థాన్‌లో ఉగ్రవాదులు వాలీబాల్ టోర్నమెంట్‌ను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతికి తెగబడిన ఘటనలో సుమారు 50 మంది మృతి చెందారు. » పాకిస్థాన్ సరిహద్దుకు సమీపంలో పక్తికా ప్రావిన్స్‌లోని యాహ్యాఖైల్ జిల్లాలో ఈ దుర్ఘటన జరిగింది. ¤ ఒంటి నిండా ఆభరణాలు ధరంచి ఉన్న నాలుగువేల సంవత్సరాల నాటి 'మమ్మీ'ని స్పెయిన్ పురాతత్వ శాస్త్రవేత్తలు దక్షిణ ఈజిప్టులోని నైల్ నదీ తీరంలో కనుక్కున్నారు. చాలా నగలు ధరించి ఉండటంతో ఈ మహిళా మమ్మీకి శాస్త్రవేత్తలు 'లేడీ ఆఫ్ ది జ్యువెల్స్' అని పేరు పెట్టారు. » ఈ మహిళ మరణించేనాటికి 30 ఏళ్ల వయసులో ఉన్నట్లు విశ్లేషించారు. |
నవంబరు - 24
|
¤ హిందూ మహాసముద్రంలో అరుదైన ఖనిజ సంపద అపారంగా ఉందని హైదరాబాద్‌లోని జాతీయ భూ భౌతిక పరిశోధనా సంస్థ (ఎన్‌జీఆర్ఐ) శాస్త్రవేత్తలు గుర్తించారు. » హిందూ మహాసముద్రంలో అండమాన్ దీవుల సమీపంలో నీటి లోపల అఫానాసియా నికితిన్ సీమౌంట్స్ (ఏఎన్ఎస్) పర్వతాలు ఉన్నాయి. దాదాపు 4 కిలోమీటర్ల లోతు నుంచి ఆ పర్వతాలపై కోబాల్ట్ పొరల నమూనాలు సేకరించారు. వాటిని ప్రయోగశాలలో పరీక్షించగా సెరియమ్ అనే అరుదైన మూలకం ఉన్నట్లు తేలింది. గ్రాము కోబాల్ట్ పొరలో 1.2 మిల్లీ గ్రాములు సెరియమ్ ఉంది. ఇది చాలా ఎక్కువని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. » ఎన్‌జీఆర్ఐ శాస్త్రవేత్తలు గుర్తించిన సెరియమ్‌ను గ్లాస్, సిరామిక్ పరిశ్రమల్లో వాడతారు. ప్రస్తుతం వీటిని ఎక్కువగా చైనా ఉత్పత్తి చేస్తోంది. |
నవంబరు - 25
|
¤ ఐక్యరాజ్య సమితి దక్షిణాసియా మహిళా సుహృద్భావ ప్రచారకర్తగా సానియా మీర్జా ఎంపికయ్యారు.
|
నవంబరు - 26
|
¤ దేశంలోనే అతి ఎత్తయిన, ప్రపంచంలోనే రెండో అతి పొడవైన విద్యుత్ పంపిణీ టవర్లను పశ్చిమ బెంగాల్‌లో హల్దియా ఎనర్జీ లిమిటెడ్ (హెచ్ఈఎల్) ఏర్పాటు చేసింది. » 236 మీటర్ల పొడవు, 6 వేల మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఈ జంట టవర్లను హల్దియా, రైచాక్‌ల మధ్య హుగ్లీ నదిపై హెచ్ఈఎల్ నిర్మించింది. » ప్రపంచంలోనే అతి ఎత్తయిన విద్యుత్ టవర్ చైనాలోని మౌంట్ డమావోషన్ వద్ద ఉంది. ఆ టవర్ ఎత్తు 370 మీటర్లు.
|
నవంబరు - 28
|
¤ నేషనల్ జియోగ్రాఫిక్‌కు చెందిన 'ట్రావెలర్' మ్యాగజీన్ తన వార్షిక సంచికలో '2015లో చూడాల్సిన ప్రపంచంలోని అత్యుత్తమ 20 ప్రదేశాలు' అనే పేరుతో ఒక జాబితాను ప్రచురించింది. దీనిలో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. తొలిస్థానం అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉన్న ప్రెసీడియా పార్కుకు దక్కింది. » ఈ జాబితాలో వీటితోపాటు స్విట్జర్లాండ్‌లోని జెర్మాట్, వాషింగ్టన్‌లోని నేషనల్ మాల్, ఫ్రాన్స్‌లోని కోర్సికా, పెరూ లోని చోక్యుక్విరా, జపాన్‌లోని కొయాసాన్, ఓక్లహామా నగరం, రోమేనియాలోని మారామ్యూర్స్ తదితర ప్రాంతాలున్నాయి. » ఈ పత్రిక హైదరాబాద్ నగరాన్ని వర్ణిస్తూ 'ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరైన ఉస్మాన్ అలీఖాన్ ఈ నగరంలోనే జీవించారు. హైదరాబాద్‌ను పాలించిన చివరి నిజాం ఆయన' అని పేర్కొంది. హైదరాబాద్‌కు కవితాత్మకమైన చరిత్ర ఉందని గుర్తు చేసింది. ఒకప్పటి రాచ నగరమైన హైదరాబాద్ నేడు అనేక అంతర్జాతీయ ఐటీ కంపెనీలకు కేంద్రంగా మారిందని, సుసంపన్నమైన ఫలక్‌నుమా ప్యాలెస్, ఇరానీ కేఫ్‌లు, అయిదోతరం ముత్యాల వర్తకులు, ఇంకా అనేక ఆకర్షణలు హైదరాబాద్ సొంతమని ఆ మ్యాగజీన్ పేర్కొంది.
|
|
|