అక్టోబరు - 7
|
¤ చెన్నై ప్లాంటును నవంబరు 1 నుంచి మూసివేయనున్నట్లు మొబైల్ తయారీ కంపెనీ నోకియా కార్ప్ వెల్లడించింది. ఈ ప్లాంటుతో ఉన్న మొబైల్ కొనుగోలు ఒప్పందాన్ని మైక్రోసాఫ్ట్ రద్దు చేసుకోవడమే ఇందుకు కారణం. |
అక్టోబరు - 9
|
¤ ఆయా సమయాల్లో ట్రాఫిక్ పరిస్థితిపై ప్రయాణికులను అప్రమత్తం చేసే 'ఇంటెలిజెంట్ ట్రాఫిక్ సిస్టమ్ (ఐటీఎస్)'ను దేశంలోనే మొదటిసారిగా అహ్మదాబాద్‌లో ఏర్పాటు చేశారు. » జీరోసమ్ లిమిటెడ్ అనే జపాన్ సంస్థ అహ్మదాబాద్ పురపాలక సంఘంతో కలిసి ఈ పథకాన్ని చేపట్టింది. » తొలుత 132 ఫీట్ల రింగ్‌రోడ్డు మీద పది కిలోమీటర్ల దూరం వరకు ఐటీఎస్‌ను అమలు చేస్తారు. » ఈ పథకానికి జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ (జేఐసీఏ) నిధులు అందజేస్తోంది. » నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు జపాన్ పర్యటనకు వెళ్లిన సమయంలో జేఐసీఏ ప్రతినిధులను కలుసుకొని గుజరాత్‌లో ఈ ప్రాజెక్టును అమలు చేయాల్సిందిగా ఆహ్వానించారు. ¤ దేశంలోనే ఆరో పెద్ద నగరంగా పేరొందిన హైదరాబాద్ ఆర్థిక పరిస్థితిలోనూ బలమైందిగా రేటింగ్ పొందింది. » దేశ వ్యాప్తంగా పది నగరాలు 'ఏఏ' రేటింగ్ పొందగా అందులో ఒకటి హైదరాబాద్. చెన్నై, బెంగళూరు, కోల్‌కతా జనాభా హైదరాబాద్ కంటే అధికంగా ఉన్నా, ఆర్థికంగా మాత్రం బలహీనంగానే ఉన్నాయి. » జవహర్ లాల్ నెహ్రూ జాతీయ పట్టణ నవీకరణ పథకం (జేఎన్ఎన్‌యూఆర్ఎం) కింద కేంద్ర ప్రభుత్వం ఆయా నగరాల ఆర్థిక స్థితిగతులను బట్టి ఒక్కో నగరానికి 'ఏఏఏ' నుంచి 'సీ' వరకు రేటింగ్ ఇచ్చింది. ఆ ప్రకారం 'ఏఏఏ' రేటింగ్ ఏ నగరానికీ దక్కలేదు. 'ఏఏ' రేటింగ్ మాత్రం 10 నగరాలకు, 'ఏ' రేటింగ్ మరో 10 నగరాలకు ఇచ్చారు » 'ఏఏ' రేటింగ్‌కు హైదరాబాద్‌తోపాటు గ్రేటర్ ముంబయి, నవీ ముంబయి, నాసిక్, సూరత్, పుణె, న్యూఢిల్లీ, ఢిల్లీ, పింప్రి-చించ్వాడ్, థానే ఎంపికయ్యాయి. » అత్యధికంగా మహారాష్ట్ర నుంచి ఆరు నగరాలు ఈ రేటింగ్ పొందాయి. దక్షిణ భారత్‌లో హైదరాబాద్‌కు మాత్రమే 'ఏఏ' రేటింగ్ దక్కింది. » జనాభా ఎక్కువగా ఉన్న కోల్‌కతాకు 'ఏ'; చెన్నై, బెంగళూరుకు 'బీబీబీ' రేటింగ్ దక్కింది. » ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ, విజయవాడ 'ఏ' రేటింగ్‌లో నిలిచాయి.
|
అక్టోబరు - 11
|
¤ విశ్వంలో సుదూర ప్రాంతాలను కళ్ల ముందు స్పష్టంగా సాక్షాత్కరింపజేసే అత్యాధునిక 'థర్టీమీటర్ టెలిస్కోప్' (టీఎంటీ) నిర్మాణం హవాయ్‌లో ప్రారంభమైంది. ఇది పూర్తయితే విశ్వంలోని ప్రాధమిక దశలను గురించి తెలుసుకోవచ్చు. » 147 కోట్ల డాలర్ల అంచనా వ్యయంతో భారత్, అమెరికా, కెనడా, జపాన్, చైనాలకు చెందిన సంస్థలతో కూడిన కన్సార్టియం దీని నిర్మాణాన్ని చేపడుతోంది. » ఈ భారీ టెలిస్కోప్ 2020 నాటికి సిద్ధమవుతుంది. » హవాయ్‌లోని మౌనాకియాలో నిర్మిస్తున్న ఈ టెలిస్కోప్‌లో భారత భాగాస్వామ్యానికి కేంద్ర కేబినెట్ గత నెలలో ఆమోదం తెలిపింది. 2014-23 మధ్య కాలానికి రూ.1299.8 కోట్లను మంజూరు చేసింది. » భారత్ తరఫున బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ఈ ప్రాజెక్టుకు నేతృత్వం వహిస్తుంది. నైనిటాల్‌లోని ఆర్యభట్ట రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆబ్జర్వేషనల్ సైన్సెస్, పుణె లోని ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రోనమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ పాలు పంచుకుంటున్నాయి. ఈ ప్రాజెక్టులో 10 శాతం భాగస్వామ్యం భారత్‌కు ఉంటుంది. » దీని వల్ల ప్రాథమిక మిర్రర్ సెగ్మెంట్ ఫిగరింగ్ అండ్ పాలిషింగ్, మిర్రర్ సపోర్ట్ సిస్టమ్, ఎడ్జ్ సెన్సర్ అసెంబ్లీ అండ్ టెస్టింగ్, అబ్జర్వేటరీ కంట్రోల్స్‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్ వంటి అత్యాధునిక పరిజ్ఞాన అంశాల్లో భారత్ సామర్థ్యం ఇనుమడిస్తుంది.
|
అక్టోబరు - 17
|
¤ నెల్లూరు జిల్లాలోని గూడూరు పట్టణానికి సుమారు 20 కి.మీ. దూరంలో ఉన్న పుట్టంరాజువారి కండ్రిగ గ్రామాన్ని క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ అభివృద్ధి చేసేందుకు దత్తత తీసుకున్నారు. ఒక పంచాయతీలో ఆవాసంగా ఉన్న ఈ గ్రామాన్ని స్వర్ణ గ్రామంగా, సకల సౌకర్యాలతో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానన్నారు. » గాంధీజీ కలలు కన్న పల్లెసీమగా, ప్రధాని నరేంద్ర మోదీ ఆశయానికి అనుగుణంగా మేక్ ఇన్ ఇండియాలో పీఆర్ కండ్రిగ గ్రామం భాగం కాబోతుంది. దీనికి అవసరమైన నిధులను టెండూల్కర్ తన ఎంపీ కోటా నిధుల నుంచి అందించనున్నారు. మరికొన్ని సొంతంగా సమకూర్చనున్నారు. » ఈ అభివృద్ధి పనులను తిలకించేందుకు సచిన్ స్వయంగా నవంబరు 16న ఆ గ్రామాన్ని సందర్శించనున్నారు. » సుమారు 480 మంది జనాభా ఈ గ్రామంలో ఉంది. 110 నివాసాలు ఉన్నాయి.
|
అక్టోబరు - 18
|
¤ చైనాడ్రమ్ పేరిట తబలా ఆకారంలో చైనాలో నిర్మించిన 18 మీటర్ల ఎత్తున్న భవనం గిన్నిస్‌బుక్‌లో స్థానం సంపాదించింది. » 4,650 చదరపు మీటర్ల ఫ్లోర్ స్పేస్‌లో సరికొత్తగా రూ.1290 వేల కోట్లు వెచ్చించి దీన్ని నిర్మించారు. » అన్‌హుయ్ రాజధానిలోని హెఫే ప్రాంతంలో దీన్ని చైనా రియల్ ఎస్టేట్ దిగ్గజం వాండా గ్రూప్ నిర్మించింది. |
అక్టోబరు - 20
|
¤ అంతర్జాతీయంగా బల్క్ డ్రగ్స్ తయారీలో ఎదురవుతున్న పోటీని సమర్థంగా ఎదుర్కొని ఈ రంగంలో వినూత్న ఆవిష్కరణలకు బాటలు వేసేందుకు ఉద్దేశించిన జాతీయ పరిశోధన కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనికి రూ.56 కోట్లు మంజూరు చేసింది. » ప్రపంచ బల్క్ డ్రగ్స్ మార్కెట్‌లో భారత్ వాటా 10 శాతం కాగా అందులో హైదరాబాద్ కీలక భూమికను నిర్వహిస్తోంది. గత మూడు దశాబ్దాల్లో ఇక్కడ ఫార్మా పరిశ్రమ అంతర్జాతీయ గుర్తింపు పొందింది. » మన దేశం నుంచి ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులు 2004 - 05లో రూ.17,521 కోట్లు ఉండగా, 2013 - 14 కి రూ.90,339 కోట్లకు చేరింది. » భారత్ బల్క్ డ్రగ్స్‌లో తెలుగు రాష్ట్రాల వాటా 30 శాతం దాకా ఉంది. దేశవ్యాప్తంగా దాదాపు 2,500 బల్క్ డ్రగ్స్ పరిశ్రమలుండగా అందులో 500 వరకు హైదరాబాద్ లోనే ఉన్నాయి.¤ తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ కొత్తపల్లి మండలం వాకతిప్ప ఎస్సీ కాలనీలో అక్రమంగా నిర్వహిస్తున్న బాణసంచా తయారీ యూనిట్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 12 మంది కార్మికులు మరణించారు.
|
అక్టోబరు - 28
|
¤ దేశంలోనే తొలిసారిగా బెంగళూరు సిటీ రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులకు వైఫై సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. దీన్ని తొలి అరగంటపాటు ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత అరగంటకు రూ.25, గంటకు రూ.35 వసూలు చేస్తారు. |
అక్టోబరు - 31
|
¤ బహుళజాతి సంస్థ డూపాంట్ హైదరాబాద్‌లో పంటల పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించింది. » భారతదేశంలో పంటలు, భూముల తీరు తెన్నులు, వాతావరణ పరిస్థితులు, ప్రాంతీయ మార్పులు తదితర అంశాలపై విస్తృతంగా పరిశోధనలు చేసి రైతాంగానికి అనువైన వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే లక్ష్యంగా ఈ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ¤ హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో శిక్షణ పూర్తి చేసుక్ను 143 మంది ఐపీఎస్ అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. » 143 మంది ఐపీఎస్‌లలో నేపాల్ , భూటాన్, మాల్దీవులకు చెందినవారు 15 మంది ఉన్నారు. మిగతా 128 మందిలో మహిళలు 19 మంది మాత్రమే. |
|
|