నవంబరు - 1
|
¤ పిల్లల పేర్లు సంప్రదాయబద్ధంగా ఉండాలంటూ చైనా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టానికి నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ఆమోదం తెలిపింది.
|
నవంబరు - 2
|
¤ బంగ్లాదేశ్ మీడియా దిగ్గజం, జమాతే ఇస్లామీ పార్టీ అగ్రనేత మీర్ ఖాసిం అలీ (62)కి ఢాకాలోని యుద్ధ నేరాల ప్రత్యేక కోర్టు ఉరిశిక్ష విధించింది.
» 1971లో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్య్రోద్యమ సమయంలో అమానుషాలకు పాల్పడినందుకు ఈ తీర్పు వెలువరించింది.
¤ ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన భవంతి బుర్జ్ ఖలీఫా నుంచి ప్రదర్శించిన ప్రకటన గిన్నిస్‌బుక్‌లో స్థానాన్ని పొందింది.
» ఎక్కువ మందిని ఆకర్షించేలా బుర్జ్ ఖలీఫా భవంతి నుంచి 'దుబాయ్ వరల్డ్ హాస్పిటాలిటీ ఛాంపియన్‌షిష్' ప్రకటనను ప్రదర్శించారు.
» 452 మీటర్ల ఎత్తు నుంచి ప్రదర్శించిన ఈ ప్రకటన 310 మీటర్ల ఎత్తు నుంచి ప్రదర్శించిన గత ప్రకటన రికార్డును అధిగమించింది.
¤ పాకిస్థాన్‌లోని వాఘా సరిహద్దు వద్ద జరిగిన మానవ బాంబు దాడిలో 55 మంది మృతి చెందగా, 200 మంది వరకు గాయపడ్డారు. మృతుల్లో భద్రతా సిబ్బందితోపాటు పిల్లలు, మహిళలు కూడా ఉన్నారు.
» భారత్ - పాక్ సరిహద్దులోని వాఘా వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమం ముగిసిన కొద్ది నిమిషాలకే ఈ పేలుడు సంభవించింది. వాఘా సరిహద్దులో రేంజర్లు నిర్వహించే విన్యాసాలను చూసిన అనంతరం ప్రజలు తిరిగి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. వారిని లక్ష్యంగా చేసుకుని ఓ ప్రవేశ మార్గం వద్ద ఒక వ్యక్తి మానవ బాంబుగా తనను తాను పేల్చుకోవడంతో ఈ ఘోరం జరిగింది.
¤ ఫిజి ఈశాన్య దీవి ఎన్‌డోయ్‌లో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలు పై 6.8 తీవ్రతతో నమోదైంది. ఈ ఘటనలో ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు.
|
నవంబరు - 3
|
¤ పాకిస్థాన్ వాఘా సరిహద్దు వద్ద జరిగిన ఆత్మాహుతి దాడి ఘటనలో మృతుల సంఖ్య 61 కి చేరింది.
¤ అమెరికాలోని న్యూయార్క్ నగరంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్ (ఫ్రీడం టవర్)లో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.
» 2001 సెప్టెంబరు 11వ తేదీన ఉగ్రవాదుల దాడిలో ధ్వంసమైన డబ్ల్యూటీసీ (వరల్డ్ ట్రేడ్ సెంటర్) టవర్ల స్థానంలో ఈ 104 అంతస్తుల భవనాన్ని నిర్మించారు.
» 13 ఏళ్ల తర్వాత ఇక్కడ వాణిజ్య కార్యకలాపాలు మొదలయ్యాయి.
|
నవంబరు - 4
|
¤ ప్రపంచవ్యాప్తంగా కోటి మందికి ఏ దేశ జాతీయతా లేదని, వారికి చట్ట పరంగా ఆయా దేశాల్లో నివసించే హక్కు లేకపోవడం దారుణమైన పరిణామమని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది.
» వచ్చే దశాబ్దంలో జాతీయత లేనివారంటూ ఎవరూ లేకుండా చేయడం కోసం ప్రచారాన్ని ప్రారంభించింది. శరణార్థులుగా ప్రతి 10 నిమిషాలకు ఒకరు జన్మిస్తున్నారని జెనీవాలోని యూఎన్ శనణార్థి విభాగం వెల్లడించింది.
» అత్యధికంగా పాలస్తీనియన్లు పలు దేశాల్లో శరణార్థులుగా శిబిరాల్లో జీవిస్తున్నట్లు యూఎన్ శరణార్థి విభాగం వెల్లడించింది.
|
నవంబరు - 5
|
¤ అమెరికా సెనెట్ మధ్యంతర ఎన్నికల్లో అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రాతినిధ్యం వహిస్తున్న డెమోక్రటిక్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత ఎనిమిదేళ్లలో తొలిసారిగా రిపబ్లికన్ పార్టీ అమెరికా సెసెట్‌లో పట్టు సాధించింది. ప్రతినిధుల సభలోనూ సీట్ల సంఖ్యను గణనీయంగా పెంచుకుంది.
» సౌత్ కరోలినా గవర్నర్‌గా భారతీయ అమెరికన్ నిక్కీహేలీ వరుసగా రెండోసారి విజయం సాధించింది. హేలీకి 57.8 శాతం ఓట్లు రాగా, ప్రత్యర్థి డెమోక్రటిక్ పార్టీకి చెందిన విన్సెంట్ షెహీన్‌కు 40 శాతం కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. సౌత్ కరోలినాకు మొదటి మహిళా గవర్నర్ హేలీనే.
» కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా భారతీయ అమెరికన్ కమలా హారిస్ కూడా వరుసగా రెండోసారి విజయం సాధించారు.తాజా ఎన్నికల్లో విజయం సాధించిన భారతీయ అమెరికన్లు
» కొలరాడో హౌజ్ 16వ డిస్ట్రిక్ట్ నుంచి రిపబ్లికన్ అభ్యర్థి జనక్ జోషీ విజయం సాధించారు.
» 42వ స్టేట్ హౌజ్ డిస్ట్రిక్ నుంచి 23 ఏళ్ల నీరజ్ ఆంటోనీ గెలుపొందడమే కాక, అతిచిన్న వయసులోనే ఒహియో రాష్ట్ర చట్టసభకు ఎన్నికైన వాడిగా రికార్డు సృష్టించారు.
» కనెక్టికట్ హౌజ్ 31వ డిస్ట్రిక్ట్ నుంచి విశ్రాంత వైద్యుడు ప్రసాద్ శ్రీనివాసన్ రిపబ్లికన్ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
» మషిగన్ హౌజ్ 69వ డిస్ట్రిక్ట్ నుంచి శామ్‌సింగ్ డెమోక్రటిక్ అభ్యర్థిగా మరోసారి గెలుపొందారు.
» మేరీల్యాండ్‌లో హౌజ్ మెజారిటీ నాయకుడు కుమార్ భర్వే, అరుణ్ మిల్లర్ విజయం సాధించారు.
» వాషింగ్టన్ స్టేట్‌లో డెమోక్రటిక్ అభ్యర్థి పరిమళ జయపాల్ స్టేట్ సెనెట్ స్థానానికి ఎంపికయ్యారు.
» ప్రతినిధుల సభలోని మొత్తం 435 స్థానాలకు, అమెరికా సెనెట్‌లో 36 సీట్లకు, అలాగే మొత్తం 50 రాష్ట్రాల్లో 36 రాష్ట్రాలకు గవర్నర్ ఎన్నికలు జరిగాయి.
|
నవంబరు - 6
|
¤ ఎప్పటికప్పుడు రంగులు మారిపోయే కరెన్సీని చైనా పరిశోధకులు తయారు చేశారు. వాతావరణంలో తేమను బట్టి బంగారు రంగు నుంచి ఎరుపునకు, తిరిగి బంగారు రంగుకు మారే లాంగ్ హార్న్ అనే పురుగు లక్షణాన్ని బట్టి ఈ నోట్లను రూపొందించారు.
» దొంగనోట్లను అరికట్టడానికి చైనా ఈ నోట్లను తయారు చేసింది.
|
నవంబరు - 9
|
¤ చారిత్రక బెర్లిన్ గోడ కూల్చివేత ఘట్టానికి 25 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా జర్మనీలో పలు సంస్మరణ కార్యక్రమాలను, వేడుకలను నిర్వహించారు. నాడు తూర్పు జర్మనీ నుంచి పారిపోతూ మరణించిన వారి సంస్మరణార్థం బెర్లిన్‌లో నిర్మించిన బ్రాడెన్ బర్గ్ గేట్ స్మారకం వద్ద జర్మన్ ఛాన్సెలర్ ఏంజెలా మెర్కెల్ ప్రసంగించారు.
» ఏంజెలా మెర్కెల్ కమ్యూనిస్టు పాలనలో ఉన్న తూర్పు జర్మనీలో పెరిగారు.
» ప్రచ్ఛన్న యుద్ధ క్రమంలో 1961లో నాటి తూర్పు జర్మనీ ప్రభుత్వం బెర్లిన్ గోడను నిర్మించింది. తర్వాత 1989 నవంబరు 9న తూర్పు జర్మనీలోని కమ్యూనిస్టు ప్రభుత్వం పశ్చిమ జర్మనీ వెళ్లేందుకు తమ పౌరులకు అనుమతినిచ్చింది. దీంతో ఆ రోజున వేలాది మంది జర్మన్లు బెర్లిన్ గోడను కూల్చి వేశారు. నాటి పరిణామం జర్మనీ ఏకీకరణకు దారి తీసింది.
|
నవంబరు - 10
|
¤ నైజీరియాలోని యోబే రాష్ట్రం, పోటిస్కన్ పట్టణంలో ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆత్మాహుతి బాంబు దాడి ఘటనలో 48 మంది విద్యార్థులు మరణించారు.
» స్కూలు డ్రెస్‌లో వచ్చిన బోకోహరామ్ సంస్థకు చెందిన ఓ ఉగ్రవాది ప్రార్థన కోసం 2 వేల మంది విద్యార్థులు ఒక చోట చేరిన సమయంలో ఈ ఘటనకు పాల్పడ్డాడు.
|
నవంబరు - 12
|
¤ మత్తు పదార్థాలను అక్రమంగా రవాణా చేస్తున్నాడనే అభియోగంతో మహ్మద్ బిన్ అబ్దుల్‌కు శిరచ్ఛేదన ద్వారా మరణ శిక్ష విధించినట్లు సౌదీ ప్రభుత్వం తాజాగా వెల్లడించింది.
» దీంతో ఈ సంవత్సరం సౌదీలో ఇప్పటి వరకు విధించిన మరణ శిక్షలు 66కు చేరాయి.
|
నవంబరు - 15
|
¤ అమెరికాలోని అలస్కా పాప్లోవ్ అగ్నిపర్వతం బద్దలైంది.
» దాదాపు రెండేళ్లలో (2013, 2014) 40 సార్లు బద్దలైంది.
» ఈ అగ్నిపర్వతం 8,262 అడుగుల ఎత్తులో ఉండి, చుట్టుపక్కల 625 మైళ్ల వరకు జనజీవనం లేకపోవడం వల్ల పెద్దగా నష్టం జరగలేదు.
¤ ఇండోనేషియా తూర్పు ప్రాంతంలోని మలుకు దీవుల్లో భూకంపం సంభవించింది. ఇది రిక్టర్ స్కేలుపై 7.3 తీవ్రతగా నమోదైంది.
¤ లాటిన్ అమెరికా విప్లవ వీరుడు చేగువేరా మరణానంతరం ఘటనా స్థలిలో తీసిన 8 ఫొటోలు స్పెయిన్‌లోని రిక్లా అనే చిన్న పట్టణంలో ఇమానోల్ ఆర్డియా అనే వ్యక్తి వద్ద బయటపడ్డాయి. తన మామ లూయిస్ కార్డరో నుంచి ఆ ఫొటోలను ఆయన వారసత్వంగా పొందాడు.
» చేగువేరా 39 ఏళ్ల వయసులో 1967, అక్టోబరు 9న బొలీవియా సైన్యం చేతిలో మరణించాడు.
|
నవంబరు - 17
|
¤ భారత్, చైనా దేశాల సంయుక్త సైనిక విన్యాసాలు పుణెలో ప్రారంభమయ్యాయి. ఇందులో ఉగ్రవాద వ్యతిరేక వ్యూహాలపై ప్రధానంగా దృష్టి సారించారు.
¤ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్న జపాన్ ఎవరూ ఊహించని విధంగా ఆర్థిక మాంద్యం కోరల్లో చిక్కుకుంది.
» 2014 జులై - సెప్టెంబరులో జపాన్ జీడీపీ 1.6 శాతం క్షీణించింది. అంతకు ముందు త్రైమాసికంలో 7.3 శాతానికి కుంగిపోయింది. ఏదేశమైనా సరే వరుసగా రెండు త్రైమాసికాల పాటు ప్రతికూల వృద్థిని నమోదు చేస్తే ఆ దేశం మందగమనంలోకి జారిందని అంటారు.
» అబెనామిక్స్ (భారీ స్థాయి పరపతి విధానాలు, వ్యయాలు, సంస్కరణలు) తో ఆర్థిక వ్యవస్థను తిరిగి పుంజుకునేలా చేస్తామని హామీ ఇచ్చి రెండేళ్ల కిందట ప్రస్తుత ప్రధాని ఫింజో అబె అధికారంలోకి వచ్చారు. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో రెండేళ్ల ముందుగానే ప్రధాని మళ్లీ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని అంతర్జాతీయ పరిశీలకులు భావిస్తున్నారు. |
నవంబరు - 19
|
¤ అమెరికాలో ఈశాన్య ప్రాంతాన్ని మంచు తుపాను కుదిపేసింది. మంచు తుపాను ధాటికి ఏడుగురు మరణించారు.
» దేశవ్యాప్తంగా 50 రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు మైనస్‌కు పడిపోయాయి.
» 1976 తర్వాత అమెరికాలో చలి తీవ్రత ఇంత ఎక్కువగా నమోదు కావడం ఇదే తొలిసారి అని వాతావరణ శాఖ వెల్లడించింది.
|
నవంబరు - 21
|
¤ అనుమతి లేకుండా అమెరికాలో ఉంటున్న లక్షలాది మంది భారతీయులు, విదేశీయులు అమెరికాలో తాత్కాలికంగా ఉండటానికి వీలుగా చట్టబద్ధత కల్పిస్తూ అమెరికా అధ్యక్షుడు ఒబామా 'వలస విధానంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. దీన్ని వ్యతిరేకిస్తున్న అమెరికా చట్ట సభలను పక్కన పెట్టి, తనకున్న కార్యనిర్వాహక (ఎగ్జిక్యూటివ్) అధికారాన్ని ఉపయోగించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.
» దీని వల్ల దాదాపు 4.5 లక్షల మంది భారతీయులకు, 1.1 కోట్ల మంది విదేశీయులకు లబ్ధి చేకూరుతుంది. గ్రీన్ కార్డుగా పేరొందిన 'శాశ్వత చట్టబద్ధ హోదా' కోసం దరఖాస్తు చేసుకున్న హెచ్-1బీ వీసా ఉన్నవారికి, వారి భార్య/ భర్తకు, అమెరికా పౌరసత్వం కలిగిన వ్యక్తుల తల్లిదండ్రులకు తాజా నిర్ణయం వల్ల తాత్కాలికంగా అమెరికాలో నివసించడానికి, ఉద్యోగం చేయడానికి అవకాశం లభిస్తుంది. గ్రీన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్నవారికి ఇక మీదట సులభంగా వెంట తీసుకెళ్లగలిగే వర్క్ పర్మిట్ లభిస్తుంది. దీనివల్ల అమెరికాలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడం, ఉద్యోగాలు మారడం సులువు అవుతుంది. అమెరికాలో అయిదేళ్లుగా ఉంటున్న వారికి ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి. |
నవంబరు - 22
|
¤ శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్సే దేశాధ్యక్ష ఎన్నికలను ప్రకటించారు.
» శ్రీలంక అధ్యక్షుడి పదవీ కాలం 6 సంవత్సరాలు. 2010 నవంబరులో రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన రాజపక్సే మరో రెండేళ్ల పదవీ కాలం ఉండగానే మళ్లీ ఎన్నికలను ప్రకటించడం విశేషం.
» శ్రీలంక రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష పదవికి ఎవరైనా రెండు సార్లు మాత్రమే పోటీ చేయడానికి అర్హులు అవుతారు. కానీ రాజపక్సే మూడో సారి కూడా ఎన్నికవ్వాలనే కాంక్షతో రాజ్యాంగాన్ని సవరించి మళ్లీ పోటీ చేసేందుకు మార్గాన్ని సుగమం చేసుకున్నారు. నాలుగు సంత్సరాల పదవీ కాలం పూర్తి కాగానే మధ్యంతర ఎన్నికలను ప్రకటించడానికి శ్రీలంక రాజ్యాంగం వీలు కల్పిస్తుండటంతో, నాలుగేళ్ల పదవీకాలం పూర్తికాగానే రాజపక్సే అధ్యక్ష ఎన్నికలను ప్రకటించారు.
» 2005 నవంబరు 17న మొదటిసారి అధ్యక్షుడిగా ఎన్నికైన రాజపక్సే అయిదేళ్లకే అధ్యక్ష ఎన్నికలను ప్రకటించి 2010లో రెండోసారి ఎన్నికయ్యారు.
» రాజపక్సే పార్టీ 'యునైటెడ్ పీపుల్స్ ఫ్రీడం అలయన్స్'.
|
నవంబరు - 23
|
¤ టునీషియాలో భారీ బందోబస్తు మధ్య తొలిసారిగా అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. అరబ్ విప్లవం అనంతరం జరిగిన ఈ ఎన్నికల్లో 53 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
» మాజీ ప్రధాన మంత్రి బేజి కెయిడ్ ఎస్సెబ్సి సహా 27 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
» 2011లో అరబ్ విప్లవం జరిగేంత వరకు ఇద్దరు మాత్రమే దేశాధ్యక్షులుగా పరిపాలించారు.
¤ బ్రహ్మపుత్ర నదిపై చైనా తన అతి పెద్ద జలవిద్యుత్ కేంద్రాన్ని పాక్షికంగా ప్రారంభించింది.
» టిబెట్‌లో నిర్మించిన ఈ అతిపెద్ద ప్రాజెక్టు ద్వారా భారత్, బంగ్లాదేశ్ నదీతీర ప్రాంతాలకు నీటి ప్రవాహాన్ని అడ్డుకునే అవకాశం ఉంది.
» సుమారు రూ.9225 కోట్ల వ్యయంతో సముద్ర మట్టానికి 3,300 మీటర్ల ఎత్తులో నిర్మించిన ఈ జంగ్ము జలవిద్యుత్ కేంద్రంలో ఇంకా అయిదు ఉత్పత్తి యూనిట్లను నిర్మించాల్సి ఉంది. 5.10 లక్షల కిలోవాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో దీన్ని నిర్మిస్తున్నారు.
¤ కెన్యాలోని మొమ్‌బస పట్టణంలో మందేరా నుంచి నైరోబీ వెళుతున్న బస్సులోని 28 మందిని ఉగ్రవాదులు ముస్లింలు కాదన్న ఒకే ఒక్క కారణంతో కాల్చి చంపారు.
» బస్సులోని ప్రయాణికులను ఉగ్రవాదులు ఖురాన్ చదవాల్సిందిగా కోరిన నేపథ్యంలో దాన్ని ప్రయాణికులు చదవలేకపోవడంతో, వారిని ముస్లింయేతరులుగా నిర్ధారించిన ఉగ్రవాదులు అందరినీ విచక్షణా రహితంగా కాల్చి చంపారు.
|
నవంబరు - 24
|
¤ అమెరికా రక్షణ మంత్రి చక్‌హేగెల్ తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల మధ్యంతర ఎన్నికల్లో పాలక పక్షం డెమోక్రటిక్ పార్టీ సెనేట్‌లో మెజారిటీ కోల్పోవడం, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) గ్రూప్ మిలిటెంట్ల సమస్య విషయంలో బరాక్ ఒబామా నేతృత్వలోని డెమోక్రటిక్ ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదుర్కోవడం తదితర పరిణామాల మధ్య హేగెల్ పదవి నుంచి వైదొలిగారు.
» కొత్త రక్షణ మంత్రి బాధ్యతలు స్వీకరించే వరకు పదవిలో కొనసాగడానికి అంగీకరించారు. |
నవంబరు - 25
|
¤ మరణ శిక్షలు విధించడాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలనే ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ ముసాయిదా తీర్మానాన్ని భారత్ వ్యతిరేకించింది. అన్ని దేశాలకు తమ న్యాయ వ్యవస్థను నిర్ణయించుకునేందుకు, చట్టాల ప్రకారం నేరస్థులను శిక్షించేందుకు ఉన్న సార్వభౌమ హక్కును ఈ తీర్మానం విస్మరిస్తోందంటూ, దీనికి వ్యతిరేకంగా ఓటు వేసింది.
» ఈ తీర్మానానికి 114 దేశాలు అనుకూలంగా, 36 దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి. మరో 34 దేశాలు ఓటింగ్‌లో పాల్గొనలేదు.
» మరణ శిక్షలను పూర్తిగా ఎత్తి వేయాలనే కోణంలో వాటి తాత్కాలిక నిలిపివేతను ప్రోత్సహించేలా ఈ తీర్మానం ఉందని భారత్ వ్యాఖ్యానించింది.
|
నవంబరు - 26
|
¤ ఈశాన్య చైనాలోని లియానింగ్ ప్రావిన్స్‌లోని బొగ్గుగనిలో సంభవించిన అగ్ని ప్రమాదంలో 26 మంది కార్మికులు మరణించారు.
|
నవంబరు - 27
|
¤ ఆహార సబ్సిడీలు, ఆహార భద్రతకు సంబంధించి భారత్ లేవనెత్తుతున్న అంశాలకు ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) ఆమోదం తెలిపింది. దీంతో 'వాణిజ్య అమలు ఒప్పందం' (టీఎఫ్ఏ)పై భారత్ సహా పలు అభివృద్ధి చెందుతున్న దేశాలు సంతకం చేయడానికి పరిస్థితులు అనుకూలంగా మారాయి.
» డబ్ల్యూటీవో అత్యున్నత నిర్ణాయక వేదిక అయిన సాధారణ మండలి జెనీవాలో సమావేశమైంది.
» ఆహార ధాన్యాలను నిల్వ చేయడం, వాటిని చౌక ధరలకు పేదలకు అందజేయడం, ఆహారభద్రతను సాధించడం లాంటి అంశాలపై ఒక శాశ్వత పరిష్కారాన్ని కనుక్కునే వరకు 'పీస్ నిబంధన'ను కొనసాగించాలనే భారత డిమాండ్‌కు ఈ మండలి అంగీకరిస్తూ నిర్ణయం తీసుకుంది.
» బాలీ ఒప్పందం ప్రకారం పీస్ నిబంధన 2017 వరకు మాత్రమే కొనసాగుతుంది. ఆహార సబ్సిడీలపై డబ్ల్యూటీవో పదిశాతం గరిష్ఠ పరిమితిని విధించింది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఈ పరిమితి నుంచి పీస్ నిబంధన మినహాయింపునిస్తోంది.
|
నవంబరు - 28
|
¤ నేపాల్ లోని బారా జిల్లాలో 'గడియామ్ పర్వ్' ఉత్సవాన్ని నిర్వహించారు. ఇది అయిదేళ్లకోసారి జరుగుతుంది.
» ఈ ఉత్సవంలో భాగంగా లక్షలాది జంతువులను ఇక్కడ బలి ఇచ్చారు. జంతు బలితో మంచి జరుగుతుందని నమ్మి దాదాపు అయిదు లక్షల జంతువులను చంపేయడం ఇక్కడ ఆచారం.
» ఇంతటి భారీ స్థాయిలో జంతు బలులు జరిగే వేడుక ప్రపంచంలో మరొకటి లేదు.
|
నవంబరు - 30
|
¤ పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) ద్వారా సాగే ఒక కీలక రహదారి నిర్మాణ పనులను చైనా, పాకిస్థాన్ ప్రారంభించాయి.
» పాకిస్థాన్ వాయవ్య ప్రాంతంలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ వీటిని ప్రారంభించారు. రెండు దేశాలను కలిపే నాలుగు వరసల ఈ రహదారి 60 కి.మీ. పొడవు ఉంటుంది.
» 'హజారా మోటర్ వే'గా పిలిచే ఈ రోడ్డు నిర్మాణం రెండేళ్లలో పూర్తవుతుంది. రహదారి పీవోకే ద్వారా వెళ్తుందంటూ దీని నిర్మాణంపై భారత్ చైనాతో తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. కానీ ప్రాజెక్టు ప్రాంతీయ అభివృద్ధికి తోడ్పడుతుందని చైనా తన నిర్ణయాన్ని సమర్థించుకుంది.
|
|
|