అక్టోబరు - 3
|
¤ హాంకాంగ్ విద్యార్థుల 'ఆక్యుపై సెంట్రల్' ఉద్యమం తారాస్థాయికి చేరింది.
» 2017 ఎన్నికలను సార్వత్రిక ఓటింగ్ హక్కుతో నిర్వహిస్తామన్న చైనా మాట తప్పిందని విద్యార్థులు వాదిస్తుండగా, అన్న మాట ప్రకారమే సార్వత్రిక ఓటింగ్ హక్కును ఇస్తున్నామంటూ చైనా నేతలు చెప్పడంతో ఉద్యమం మొదలైంది.
» హాంకాంగ్ పరిపాలకుడు (సీఈవో) లుంగ్ చున్ ఇంగ్ విద్యార్థులు, నిరసనకారులతో చర్చలకు అంగీకరించినా, అతడితో చర్చలు జరిపే ప్రసక్తే లేదని నిరసనకారులు స్పష్టం చేయడంతో ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది.
¤ విద్యార్థుల డిమాండ్ అసమంజసమని , ఉద్యమం విఫలం కాక తప్పదని చైనా కమ్యూనిస్టు పార్టీ పత్రిక పీపుల్స్ డైలీ పేర్కొంది.
» బ్రిటన్ 99 ఏళ్ల లీజు తర్వాత హాంకాంగ్‌ను 1997 జులై 1న చైనాకు తిరిగి అప్పగించింది. 2047 వరకు చైనాకు భిన్నంగా హాంకాంగ్‌లో 'ఒకే దేశం రెండు వ్యవస్థలు' విధానాన్ని అనుసరించడానికి నాటి చైనా నేత డెంగ్ బ్రిటన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రారంభం నుంచి హాంకాంగ్‌పై పూర్తి ఆధిపత్యాన్ని చైనా ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి. 1997 నాటి మౌలిక రాజ్యాంగం సైతం 'హాంకాంగ్ ప్రత్యేక పరిపాలనా ప్రాంతానికి పరిపాలకుడిని (సీఈవో) ఎన్నికల ద్వారా లేదా కేంద్ర ప్రభుత్వం స్థానికులతో సంప్రదింపుల ద్వారా ఎంపిక చేస్తారు' అని పేర్కొంది.
¤ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులు మరొక బ్రిటన్ పౌరుడికి శిరచ్ఛేదం చేశారు. ఆ దృశ్యాలున్న వీడియోను ఇంటర్‌నెట్‌లో పెట్టారు.
» బ్రిటన్‌కు చెందిన అలెన్ హెన్నింగ్ అనే టాక్సీడ్రైవర్ ఓ స్వచ్ఛంద సంస్థ సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవడానికి ఇటీవల సిరియా వెళ్లారు. అతడిని బందీగా పట్టుకున్న ఐఎస్ మిలిటెంట్లు దారుణంగా నరికి చంపారు.
|
అక్టోబరు - 4
|
¤ పవిత్ర హజ్ యాత్రలో ఈ ఏడాది 20,85,238 మంది యాత్రికులు పాల్గొన్నట్లు సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రకటించింది. వీరిలో 13,89,053 మంది విదేశీయులు ఉండగా వారిలో భారతీయులు సుమారు లక్షా 50 వేల మంది ఉన్నట్లు సౌదీ ప్రభుత్వం వెల్లడించింది.
» హజ్ యాత్ర ముగింపు సందర్భంగా మీనా లోయలో సైతాన్‌పై రాళ్లు విసిరే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
» మీనా ప్రాంతాన్ని చేరుకునేందుకు భారీ వ్యయంతో నిర్మించిన జమ్రాత్ వంతెనను కొత్తగా అందుబాటులోకి తెచ్చారు.
» బంగ్లాదేశ్, సూడాన్, సోమాలియా, మాల్దీవుల అధ్యక్షులు ఈ ఏడాది హజ్ యాత్రకు హాజరైన ప్రముఖుల్లో ఉన్నారు.
|
అక్టోబరు - 5
|
¤ స్వీడన్‌లోని ఉమియా విశ్వవిద్యాలయానికి చెందిన పర్యావరణ శాస్త్రవేత్తలు హై రిజల్యూషన్ ఉపగ్రహ డేటా, సూపర్ కంప్యూటర్లను ఉపయోగించి భూమిపై ఉన్న సరస్సుల సంఖ్యను 11.7 కోట్లుగా నిర్ధారించారు. వీటిలో చాలావరకు మానవులు ఆవాసం ఉండని ప్రదేశాల్లో ఉన్నాయని తమ అధ్యయనంలో తేల్చారు.
» గతంలో సరస్సులను ఒక్కొక్కటిగా లెక్కించడానికి బదులు గణాంక పరమైన అంచనాల ద్వారా వాటి సంఖ్యను పేర్కొన్నారు. 2006లో వేసిన ఇలాంటి అంచనాల ప్రకారం భూమిపై 30.4కోట్ల సరస్సులు ఉన్నాయి.
» భూ ఉపరితలంలో వీటి వాటా 3.7 శాతం (50 లక్షల చదరపు కిలోమీటర్లు) అని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
» చాలా సరస్సులు భూమి ఉత్తరార్ధ గోళంలో 45 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుంచి 75 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య ఉన్నాయని గుర్తించారు. |
అక్టోబరు - 6
|
¤ పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు పాల్పడింది. జమ్మూ, పూంచ్ సెక్టార్లలో అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వెంబడి భారీగా మోర్టార్లతో దాడులు చేసి, కాల్పులు జరిపింది. పాక్ దుశ్చర్యతో సరిహద్దు గ్రామాల్లోని భారత పౌరులు అయిదుగురు మరణించారు.
» 10 సరిహద్దు పోస్టుల వద్ద, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జమ్మూ జిల్లాలోని ఆర్నియా ప్రాంతంలో జనావాస ప్రాంతాలపై పాక్ దళాలు దాడులకు పాల్పడ్డాయి.
» గత నాలుగు రోజుల్లో పాకిస్థాన్ పన్నెండు సార్లకు పైగా కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలకు పాల్పడింది.
¤ అంగారక గ్రహ కక్ష్యలోకి భారత్ దిగ్విజయంగా ప్రవేశపెట్టిన మామ్ ఉపగ్రహ ప్రయోగాన్ని పరిహసిస్తున్నట్లుగా 'ది న్యూయార్క్ టైమ్స్' కార్టూన్‌ను ప్రచురించింది. తర్వాత ఈ వ్యవహారంపై ఆ పత్రిక పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ, క్షమాపణ చెప్పింది.
» భారత్‌ను చిన్నబుచ్చాలన్నది తమ ఉద్దేశం కాదనీ, రోదసీ కార్యక్రమాలు, ప్రయోగాలు ఇప్పుడిక సుసంపన్న, పాశ్చాత్య దేశాలకు ప్రత్యేకించిన వ్యవహారమేమీ కాదని మాత్రమే తమ కార్టూన్ ద్వారా తెలియజెప్పాలనుకున్నట్లు న్యూయార్క్ టైమ్స్ వివరించింది.
» సెప్టెంబరు 28న ప్రచురించిన ఆ కార్టూన్‌లో మోకాళ్లపైకి పొట్టి పంచె, చొక్కా ధరించి ఉన్న ఓ వ్యక్తి, ఒక ఎద్దుతోపాటు వెళ్లి 'ఎలైట్ స్పేస్ క్లబ్' అని రాసి ఉన్న ఒక గది తలుపు తడుతున్నట్లుగా బొమ్మ వేశారు. ఆ వ్యక్తి ధరించిన చొక్కాపై 'ఇండియా' అని రాసి ఉంటుంది.
¤ మారిషెస్అధ్యక్షుడు కైలాష్ పర్యాగ్ ఆ దేశ పార్లమెంట్‌ను రద్దు చేశారు. దీంతో తిరిగి ఆరు నెలల్లోగా దేశంలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.
|
అక్టోబరు - 7
|
¤ యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) కంటే అమెరికాలోని విద్యా సంస్థలో చదువుకోవడానికే భారతీయ పోస్ట్‌గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని బ్రిటీష్ కౌన్సిల్ వెల్లడించింది.
» ఇప్పటివరకు యూకేకు విద్యార్థులను పంపిచడంలో చైనాది మొదటి స్థానం, భారత్‌ది రెండో స్థానం. ఇప్పుడు భారత స్థానాన్ని నైజీరియా తీసుకోనుంది.
» బ్రిటీష్ కౌన్సిల్ వెల్లడించిన వివరాల ప్రకారం 2024 నాటికి యూకేలో చదివే విదేశీ విద్యార్థుల సంఖ్య 2.41 లక్షలకు చేరనుంది. |
అక్టోబరు - 9
|
¤ ఎబోలా వ్యాధిపై పోరు కోసం ఐక్యరాజ్య సమితికి అత్యధిక విరాళాలు అందిస్తున్న అయిదు దేశాల్లో భారత్ కూడా నిలిచింది.
» అత్యధికంగా 11.38 కోట్ల డాలర్లను అమెరికా అందించింది. తర్వాతి స్థానాల్లో యూరోపియన్ యూనియన్ (5.5 కోట్ల డాలర్లు), కెనడా (3.1 కోట్ల డాలర్లు), నెదర్లాండ్స్ (2.1 కోట్ల డాలర్లు) ఉన్నాయి.
» భారత్ 1.25 కోట్ల డాలర్ల విరాళంతో అయిదో స్థానంలో నిలిచింది.
¤ యెమెన్‌లో జరిగిన రెండు వేర్వేరు ఆత్మాహుతి దాడుల్లో దాదాపు 70 మంది మరణించారు.
» రాజధాని సనాలో ర్యాలీ కోసం సిద్ధమౌతున్న షియాహౌతి మద్దతుదారుల గుంపులో చేరిన ఓ దుండగుడు తనను తాను పేల్చుకోవడంతో దాదాపు 50 మంది ప్రాణాలు కోల్పోయారు. » మరో ఘటన హదర్ మాట్ రాష్ట్రంలోని ముక్కాలా నగరంలో ఒక భద్రతా ఔట్ పోస్టును ఆత్మహుతి దళ సభ్యుడు కారుతో ఢీ కొనడంతో 20 మంది సైనికులు చనిపోయారు.
» రాజధాని సనాను షియాహౌతి తీవ్రవాదులు గత నెల స్వాధీనం చేసుకున్న తర్వాత వారిపై సున్నీల నేతృత్వంలోని అల్‌ఖైదా దాడులకు పాల్పడుతోంది. |
అక్టోబరు - 17
|
¤ లాహోర్‌లో పాకిస్థాన్ ప్రభుత్వం కొత్తగా నిర్మించిన 'నేవల్ వార్ కాలేజ్' భవనాన్ని పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ప్రారంభించారు.
|
అక్టోబరు - 21
|
¤ బ్రిటన్‌లో పెనుతుపాను (హరికేన్) గొంజా తీవ్ర ప్రభావం చూపింది. గొంజా తీవ్రతకు ముగ్గురు మరణించారు. |
అక్టోబరు - 22
|
¤ కెనడా పార్లమెంటుపై గుర్తు తెలియని దుండగుడు దాడి చేశాడు. పార్లమెంటు భవనం వెలుపలా, లోపలా తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ దాడిలో ఒక సైనికుడు మరణించాడు. అనంతరం భద్రతా బలగాలు ఆ దుండగుడిని మట్టుబెట్టాయి. |
అక్టోబరు - 23
|
¤ అమెరికా విదేశాంగశాఖ తొలిసారిగా దీపావళి వేడుకలను నిర్వహించింది. అమెరికా విదేశాంగశాఖ కార్యాలయంలోని చారిత్రక బెంజమిన్ ఫ్రాంక్లిన్ గదిలో అమెరికా విదేశాంగశాఖ మంత్రి జాన్‌కెర్రీ తొలిసారిగా దీపావళి వేడుకలు నిర్వహించారు.
» భారత సంతతికి చెందిన ఎంపీలు, వ్యాపారవేత్తలతో కలిసి లండన్‌లో బ్రిటన్ ఉప ప్రధాని నిక్‌క్లెగ్ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.
¤ పశ్చిమ ఆఫ్రికాలో ఎబోలా వైరస్ సోకిన వారి సంఖ్య దాదాపు 10 వేలకు చేరువలో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) వెల్లడించింది.
» గినియా, లైబీరియా, సియర్రా లియోన్ దేశాల్లో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉందని తెలిపింది.
» ఎబోలా వైరస్‌ను అరికట్టే అంశంపై జెనీవాలో జరిగిన సమావేశంలో డబ్ల్యుహెచ్ఓ ఈ వివరాలను వెల్లడించింది.
» ఎబోలా వైరస్‌ను అరికట్టే వ్యాక్సిన్‌ను రూపొందించడానికి 200 మిలియన్ డాలర్లను ఖర్చు చేయనున్నట్లు అమెరికాకు చెందిన ఔషధ తయారీ కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ ప్రకటించింది.
¤ హాంకాంగ్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించడంతోపాటు స్వతంత్ర న్యాయవ్యవస్థ ఏర్పాటుకు హమీ ఇస్తున్నట్లు చైనా అధికార కమ్యూనిస్టు పార్టీ ప్రకటించింది. |
అక్టోబరు - 24
|
¤ అమెరికాలో ఒక వైద్యుడికి ప్రమాదకరమైన ఎబోలా వ్యాధి సోకింది. న్యూయార్క్‌లో ఈ వ్యాధి వచ్చిన మొదటి వ్యక్తి ఆయనే.
» క్రెయిగ్ స్పెన్సర్ (33) గినియాలో ఎబోలా వ్యాధి వచ్చిన ఓ వ్యక్తికి చికిత్స చేసి, గత వారం న్యూయార్క్‌కు తిరిగొచ్చారు. ప్రస్తుతం ఆయన బెల్లెవ్యూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. న్యూయార్క్ రాష్ట్రంలో ఎబోలాకు చికిత్స అందించడానికి నిర్దేశించిన 8 ఆసుపత్రుల్లో ఇది ఒకటి.
¤ ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) ఏర్పాటుకు సంబంధించిన ఒప్పంద పత్రంపై బీజింగ్‌లోని గ్రేట్ హాల్ ఆఫ్ ద పీపుల్‌లో భారత్ సహా మరో 20 సభ్యదేశాలు సంతకం చేసి 'వ్యవస్థాపక సభ్యదేశాలు'గా అవతరించాయి.
» ఆసియా దేశాల్లో మౌలిక సదుపాయాల కల్పనా ప్రాజెక్టులకు సాయం చేయడమే ఈ బ్యాంక్ ఏర్పాటు లక్ష్యం. ఇప్పటివరకు పాశ్చాత్యుల ఆధిపత్యం ఉన్న అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంక్ పైనే ఈ దేశాలన్నీ ఆధారపడుతున్నాయి.
» బీజింగ్ కేంద్రంగా ఏర్పాటవుతున్న ఏఐఐబీ వచ్చే ఏడాది కార్యకలాపాలు ప్రారంభిస్తుందని అంచనా.
» ఈ బ్యాంక్ సెక్రటరీ జనరల్‌గా చైనా ఆర్థిక శాఖ ఉపమంత్రి జిన్ లిక్విన్ నియమితులయ్యారు.
» చైనా, భారత్‌తోపాటు వియత్నాం, ఉజ్బెకిస్థాన్, థాయ్‌లాండ్, శ్రీలంక, సింగపూర్, ఖతార్, ఒమన్, ఫిలిప్పీన్స్ , పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్, బ్రూనై, కంబోడియా, కజకిస్థాన్, కువైట్, లావోస్, మలేషియా, మంగోలియా, మయన్మార్ ఏఐఐబీలో సభ్యదేశాలుగా ఉన్నాయి.
» ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ)లో అమెరికాతో కలిసి కీలకపాత్ర పోషిస్తున్న జపాన్ సహా ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, ఇండోనేషియా దేశాలు బ్యాంక్ ఏర్పాటుకు జరిగిన ఒప్పంద కార్యక్రమంలో పాల్గొనకపోవడం గమనార్హం.
» తాజా ఒప్పందం ప్రకారం ఏఐఐబీ అధీకృత మూలధనం 100 బిలియన్ డాలర్లు (సుమారు రూ.6,00,000 కోట్లు) కాగా, ప్రారంభంలో 50 బిలియన్ డాలర్లు (సుమారు రూ.3,00,000 కోట్లు) సమకూరుతుందని భావిస్తున్నారు. పెయిడ్ ఇన్ రేషియో 20 శాతంగా ఉంటుంది. సభ్యదేశాలు చర్చించుకుని, ఓటింగ్ హక్కులను నిర్ణయించుకుంటాయి. జీడీపీ, ఆయా దేశాల ద్రవ్య సంబంధ విలువను ఇందుకు ప్రామాణికంగా తీసుకుంటారు. దీని ప్రకారం చూస్తే చైనా తర్వాత పెద్ద వాటాదారు భారత్ అవుతుంది. |
అక్టోబరు - 27
|
¤ బ్రెజిల్‌అధ్యక్ష పగ్గాలు మరోసారి వామపక్ష మహిళా నేత, వర్కర్స్ పార్టీకి చెందిన దిల్మా రౌసెఫ్‌కే దక్కాయి.
» ప్రత్యర్థి ఏసియోనెవెస్ పై రౌసెఫ్ విజయం సాధించారు.
» రౌసెఫ్ కు 51.6 శాతం ఓట్లు లభించగా, ఏసియోనెవెస్‌కు 48.4 శాతం ఓట్లు లభించాయి.
» 2003 నుంచి వర్కర్స్ పార్టీ అధికారంలో కొనసాగుతోంది. ఓటర్లు వరుసగా నాలుగోసారి వర్కర్స్ పార్టీకే పట్టం కట్టారు. రెండోసారి దిల్మాకు అధికారం ఇచ్చారు. |
అక్టోబరు - 28
|
¤ హిందుత్వంపై ఎన్‌సైక్లోపీడియా తొలి ప్రతిని లండన్‌లో బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరన్ విడుదల చేశారు.
¤ మొదటిసారిగా పూర్తి సౌరశక్తితో ప్రపంచ యాత్ర చేయనున్న విమానం భారతదేశంలో రెండు చోట్ల ఆగనుంది. వచ్చే ఏడాది మార్చిలో ఈ యాత్ర మొదలవుతుంది. మొత్తం 12 చోట్ల ఈ విమానం దిగనుండగా వాటిలో వారణాసి, అహ్మదాబాద్ ఉన్నాయి.
» సౌర ప్రచోదనం (సోలార్ ఇంపల్స్) పేరుతో సాగే ఈ యాత్ర 2015 మార్చి ఒకటో తేదీన అబుధబిలో మొదలై భారత్ మీదుగా మధ్య ప్రాచ్య దేశాలకు చేరుకుంటుంది. అక్కడి నుంచి పసిఫిక్ సముద్రం మీదుగా అమెరికాకు చేరుతుంది. అట్లాంటిక్ సముద్రం మీదుగా కూడా ప్రయాణించి 2015 జులైలో అబుధబిలో ఈ యాత్ర ముగుస్తుంది.
» పగలు సౌరశక్తితో, రాత్రి సౌరశక్తితో నింపిన బ్యాటరీలతో విమానానికి ఇంధనం అందుతుంది. జంబో జెట్ కంటే పెద్దదైన విమానం రెక్కల్లో 1700కు పైగా సౌర ఘటాలు ఉంటాయి.
» ఈ యాత్రను బెర్ట్రాండ్ పికార్డ్, ఆండ్రే బోర్ష్‌బర్గ్ తలపెట్టారు. |
అక్టోబరు - 29
|
¤ యుద్ధ నేరాలకు సంబంధించి బంగ్లాదేశ్ ఛాందసవాద జమాత్-ఎ-ఇస్లామీ అధ్యక్షుడు ఎం.రహ్మాన్ నిజామి (71)కి ప్రత్యేక ట్రైబ్యునల్ మరణ శిక్ష విధించింది.
» దేశ స్వాతంత్య్రం కోసం 1971లో పాకిస్థాన్‌తో యుద్ధం చేసిన సమయంలో ఆయన తన మద్దతుదారులు, పోలీసులకు మధ్య హింసాత్మక ఘర్షణలు చెలరేగేలా ప్రోత్సహించాడు. |
అక్టోబరు - 30
|
¤ పాలస్తీనాను స్వీడన్ అధికారికంగా గుర్తించింది. స్వీడన్ విదేశాంగ మంత్రి మార్గోట్ వాల్‌స్ట్రోమ్ తమ ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడించింది.
¤ శ్రీలంకకు మాదక ద్రవ్యాలు తీసుకొచ్చారనే ఆరోపణలపై అరెస్టై, శ్రీలంక జైల్లో ఉన్న తమిళనాడులోని రామేశ్వరం జిల్లాకు చెందిన అయిదుగురు జాలర్లకు శ్రీలంక న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది.
¤ శ్రీలంకలో బదుల్లా జిల్లాలోని మిరియా బెడ్డా టీ ఎస్టేట్‌లో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో సుమారు 160 మంది సజీవ సమాధి అయ్యారు. |
అక్టోబరు - 31
|
¤ ఫిలిప్పీన్స్ లోని మక్తాన్ సెబూ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్వహణ బాధ్యతలను జీఎంఆర్ మెగావైడ్ సెబీ ఎయిర్ పోర్ట్ కార్పొరేషన్ చేపట్టింది. |
|
|
|