అక్టోబరు - 2014 నియామకాలు


అక్టోబరు - 4
¤ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఛైర్మన్‌గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ గ్రంథి భవానీ ప్రసాద్ నియమితులయ్యారు.      » రాష్ట్ర విభజన తర్వాత ఏపీఈఆర్‌సీకి తొలి ఛైర్మన్ జస్టిస్ భవానీ ప్రసాద్.      » అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా 2006 జనవరి 4న ప్రమాణ స్వీకారం చేసిన ప్రసాద్, శాశ్వత జడ్జిగా 2007 డిసెంబరు 19న నియమితులయ్యారు. 2013 ఏప్రిల్ 8న పదవీ విరమణ చేశారు.
అక్టోబరు - 16
¤ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్థిక మంత్రిత్వ శాఖలోకి కొత్త జట్టును తీసుకొచ్చింది.      » ఆర్థిక కార్యదర్శి, ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి పదవులను నిర్వహించిన అరవింద్ మాయారామ్‌ను అకస్మాత్తుగా పర్యాటక శాఖకు బదిలీ చేసి, అమెరికా కేంద్రంగా పని చేస్తున్న అరవింద్ సుబ్రమణియన్‌ను ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ)గా నియమించింది. 3 ఏళ్లపాటు ఈ పదవిలో ఉంటారు. ఆయనకు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి హోదా, జీతభత్యాలుంటాయి.
      » రాజీవ్ మహర్షిని కొత్త ఆర్థిక కార్యదర్శిగా నియమించారు.
      » బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఎంఫిల్ చదివిన అరవింద్ సుబ్రమణియన్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎమ్ఎఫ్)లో ఆర్థికవేత్తగా పనిచేశారు.
      » హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ వి.బాలకృష్ణారెడ్డి నియమితులయ్యారు.
¤ కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ సలహాదారుగా తెలంగాణ(నల్గొండ జిల్లా)కు చెందిన వదిరె శ్రీరామ్ నియమితులయ్యారు.
      » గంగానది ప్రక్షాళన, నదుల అనుసంధానం, సురక్షిత తాగునీటి వసతుల కల్పన, వ్యవసాయానికి సాగునీటి ఏర్పాట్లు తదితర అంశాల్లో కేంద్ర ప్రభుత్వానికి ఆయన సలహాలు ఇవ్వనున్నారు.
      » 'వాటర్‌గ్రిడ్ ఫర్ తెలంగాణ, ఏపీ యూజింగ్ రివర్స్ గోదావరి, కృష్ణా' అనే పేరుతో శ్రీరామ్ రాసిన పుస్తకం ప్రజాదరణ పొందింది.
      » ఆయన ఇటీవల రాసిన 'గుజరాత్ సక్సెస్ స్టోరీ ఇన్ వాటర్ మేనేజ్‌మెంట్' పుస్తకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు.
అక్టోబరు - 17
¤ దేశ రాజధాని ఢిల్లీలో మానవ నిర్మిత, ప్రకృతి సంబంధమైన కళాకృతులను పరిరక్షించే, పర్యవేక్షించే 'ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్' ఛైర్మన్‌గా డాక్టర్ పి.ఎస్.ఎన్.రావును కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ నియమించింది.      » ఈయన ప్రస్తుతం 'స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్' లో హౌసింగ్ విభాగం అధిపతిగా ఉన్నారు.      » ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ సభ్యులుగా సొనాలి భగవతి, సోనాలీ రస్తోగి, సమీర్ మాథుర్, దుర్గా శంకర్ మిశ్రాను ప్రభుత్వం నియమించింది. 
అక్టోబరు - 24 
¤ వాల్‌మార్ట్ ఇండియా ముఖ్య కార్యకలాపాల అధికారి (సీఓఓ)గా మురళి లంకా నియమితులయ్యారు. డిసెంబరు 1 నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుంది.      » వాల్‌మార్ట్ ఇండియా అధ్యక్షుడు, సీఈఓ క్రిష్ అయ్యర్ నేతృత్వంలో మురళి పనిచేస్తారు.      » బెస్ట్ ప్రైస్ పేరుతో వాల్‌మార్ట్ ఇండియా మన దేశంలో 9 రాష్ట్రాల్లో 20 విక్రయ కేంద్రాలను నిర్వహిస్తోంది. 
అక్టోబరు - 26
¤ సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌గా తెలుగు తేజం వి.ఎస్.ఆర్.అవధాని నియమితులయ్యారు.
      » గుంటూరు జిల్లా నరసరావు పేటకు చెందిన అవధాని 1980 నుంచి 1987 వరకు నరసరావు పేటలో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. 1987లో మెజిస్ట్రేట్‌గా ఎంపికై నంద్యాలలో విధులు నిర్వహించారు. 2002లో జిల్లా న్యాయమూర్తిగా పదోన్నతి పొంది ప్రకాశం, ఆదిలాబాద్ జిల్లాల్లో పని చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు జ్యుడీషియల్ రిజిస్ట్రార్‌గా పదోన్నతి పొందారు.
అక్టోబరు - 28
¤ సీనియర్ పాత్రికేయుడు ఎ.సూర్య ప్రకాష్ ప్రసార భారతి బోర్డు ఛైర్మన్‌గా నియమితులయ్యారు. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.
      » ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ నేతృత్వంలోని, ప్రెస్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ మార్కండేయ కట్జూ, సమాచార ప్రసార శాఖ కార్యదర్శి బిమల్ జుల్కాతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీ సిఫార్సు మేరకు ఈ నియామకం చేపట్టినట్లు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది
.
      » సూర్య ప్రకాష్‌కు టీవీ, పత్రికా రంగంలో సుదీర్ఘ అనుభవం ఉంది. జీ న్యూస్ ఎడిటర్‌గా, ద పయొనీర్‌లో కార్యనిర్వాహక సంపాదకుడిగా, ఈనాడు పత్రిక కాలమిస్టుగా, న్యూఢిల్లీలోని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ బ్యూరో చీఫ్‌గా సేవలందించారు
.
¤ ఆంధ్రప్రదేశ్ 'పర్యావరణ ప్రభావ్ అంచనా సాధికార సంస్థ' ఛైర్మన్‌గా విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎస్.బాల సుబ్రహ్మణ్యంను కేంద్రం నియమించింది
.
      » 'బి' కేటగిరీ పరిశ్రమలు, ప్రాజెక్టుల ప్రారంభానికి ఈ సంస్థ నుంచి పర్యావరణ అనుమతులు పొందాల్సి ఉంటుంది
.
      » ఈ సంస్థ సభ్యులుగా ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జి.ఎం.జగన్నాథరాజును నియమించారు. ఈ కమిటీకి ప్రొఫెసర్ వి.ఎస్.ఆర్.కె.ప్రసాద్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.
అక్టోబరు - 30
¤ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి మండలి (ఏపీఎస్ఎస్‌డీసీ) ఛైర్మన్ గా జీఎంఆర్ గ్రూప్ అధినేత గ్రంధి మల్లికార్జునరావు నియమితులయ్యారు.
      » కేంద్రం ఏర్పాటు చేసిన జాతీయ నైపుణ్య అభివృద్ధి మండలి (ఎన్ఎస్‌డీసీ) తరహాలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏపీఎస్ఎస్‌డీసీ ని ఏర్పాటు చేసింది.
అక్టోబరు - 31
¤ నల్లధనంపై దర్యాప్తు జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) సలహాదారుడిగా సీబీడీటీ (ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు) మాజీ ఛైర్మన్ కె.వి.చౌదరిని కేంద్ర ప్రభుత్వం నియమించింది.