సెప్టెంబరు - 2014 నియామకాలు


సెప్టెంబరు - 3
¤  కేంద్ర పభుత్వం జస్టిస్ పి.సదాశివంను కేరళ గవర్నరుగా నియమించింది.    »     కేరళ గవర్నరుగా ఉన్న షీలా దీక్షిత్ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. వెంటనే కొత్త గవర్నర్‌గా సదాశివం నియామకానికి ఆమోదముద్ర వేశారు.    »     జస్టిస్ సదాశివం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఈ ఏడాది ఏప్రిల్‌లో పదవీ విరమణ చేశారు.    »     భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి అంతకంటే తక్కువ హోదాతో కూడిన పదవిని చేపట్టడం ఇదే తొలిసారి.
సెప్టెంబరు - 5
¤  భారత సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ హెచ్.ఎల్.దత్తు నియమితులయ్యారు. 2014, సెప్టెంబరు 28 నుంచి సీజేఐగా జస్టిస్ దత్తు నియామకం అమల్లోకి వచ్చేలా రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన 14 నెలలపాటు ఈ పదవిలో కొనసాగుతారు.    »     ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి ఆర్.ఎం.లోధా సెప్టెంబరు 27న పదవీ విరమణ చేయనున్నారు.    »     42వ సీజేఐగా బాధ్యతలు స్వీకరించనున్న జస్టిస్ దత్తు 2015, డిసెంబరు 2న పదవీ విరమణ చేస్తారు.
సెప్టెంబరు - 9
¤  న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీలో నమోదైన ఇంటర్నేషనల్ పేపర్ (ఐపీ)కు చెందిన ఐపీ ఇండియాకు ప్రెసిడెంట్‌గా రామ్ ప్రవీణ్ స్వామినాథన్ నియమితులయ్యారు. ఐపీకి వైస్ ప్రెసిడెంట్‌గా కూడా కొనసాగుతారు.
సెప్టెంబరు - 10
¤  సీనియర్ ఐఏఎస్ అధికారి సుభాష్‌చంద్ర గార్గ్ ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ)గా నియమితులయ్యారు.    »     పదవీ కాలం మూడు సంవత్సరాలు.    »     ఆయన రాజస్థాన్ కేడర్‌కు చెందిన 1983 బ్యాచ్ ఐఏఎస్ అధికారి.¤  ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్ ఫౌండేషన్ (ఐబీఎఫ్) అధ్యక్షుడిగా స్టార్ ఇండియా సీఈఓ ఉదయ్‌శంకర్ ఎన్నికయ్యారు.    »     ఉపాధ్యక్షులుగా పునిత్ గోయెంకా, రజత్‌శర్మ, ఎన్.పి.సింగ్, కోశాధికారిగా డిస్కవరీ నెట్‌వర్క్స్ ఆసియా పసిఫిక్ జనరల్ మేనేజర్ రాహుల్ జోహ్రీ ఎన్నికయ్యారు.¤  టీవీఎస్ మోటర్ కంపెనీ సంయుక్త మేనేజింగ్ డైరెక్టరు (జీఎండీ)గా సుదర్శన్ వేణు నియమితులయ్యారు.
సెప్టెంబరు - 17
¤  జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) ఛైర్‌పర్సన్‌గా లలితా కుమార మంగళం నియమితులయ్యారు.    »     ఆమె ప్రస్తుతం భాజపా జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా ఉన్నారు. తమిళనాడుకు చెందిన లలితా కుమారమంగళం 'ప్రకృతి' అనే స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు.    »     ఎన్‌సీడబ్ల్యూకు ఛైర్‌పర్సన్‌గా ఉన్న మమతా శర్మ ఆగస్టు1, 2014న పదవీ విరమణ చేశారు.    »     లలితా కుమార మంగళం దివంగత మోహన కుమార మంగళం కుమార్తె.
సెప్టెంబరు - 18
¤  ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి మెట్రో ప్రాజెక్టులకు ప్రధాన సలహాదారుగా ఢిల్లీ మెట్రో రూపశిల్పి డాక్టర్ ఇ.శ్రీధరన్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.    »     ఈ నెల ఒకటో తేదీ నుంచి ఇ.శ్రీధరన్ నియామకం అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది.    »     ఆయన సేవలకు ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం రూ.1.5 లక్షల గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించింది.
సెప్టెంబరు - 23 
¤ ఏపీ రాష్ట్ర వ్యవసాయ నిర్వహణ, విస్తరణ శిక్షణా సంస్థ (ఎస్ఎఎంఈటీఐ - సమేటీ) జనరల్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
¤ కేజీ బేసిన్ వివాదంలో ఆర్బిట్రేటర్‌గా ఆస్ట్రేలియా హైకోర్టు రిటైర్డ్ జడ్జి మైఖేల్ కిర్బేను సుప్రీంకోర్టు నియమించింది. ముగ్గురు సభ్యుల ఆర్బిట్రేషన్ బృందానికి ఛైర్మన్‌గా కిర్బే వ్యవహరిస్తారు.
    » కేంద్రం-రిలయన్స్ ఇండస్ట్రీస్ మధ్య వివాదాన్ని ఆర్బిట్రేషన్ విచారిస్తుంది.
    » ఆర్బిట్రల్ ట్రైబ్యునల్‌లో భారత మాజీ ప్రధాన న్యాయమూర్తులు ఎస్.పి.బారుచా (రిలయన్స్ తరఫున), వి.ఎన్.ఖరే (కేంద్రం తరఫున) ఉన్నారు.
    » కేజీ బేసిన్‌లోని సహజ వాయువు క్షేత్రం అభివృద్ధికి సంబంధించి వ్యయ రికవరీపై నెలకొన్న వివాదంపై ఈ ఆర్బిట్రేషన్ ప్రక్రియ జరగనుంది.
 
సెప్టెంబరు - 30 
¤ కేంద్ర నిఘా కమిషన్ (సీవీసీ) తాత్కాలిక ముఖ్య అధికారిగా రాజీవ్‌కు బాధ్యతలు అప్పగిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది.    » ప్రస్తుత సీవీసీ చీఫ్ ప్రదీప్ కుమార్ పదవీ కాలం పూర్తికావడంతో సీవీసీ చీఫ్ నియామకం జరిగే వరకూ రాజీవ్‌ను ఆ బాధ్యతలు చేపట్టాల్సిందిగా పేర్కొంది.