ఫిబ్రవరి - 2014 కమిటీలు - కమిషన్లు


ఫిబ్రవరి - 6
¤  రైల్వేలపై ఏర్పాటైన 31 మంది సభ్యుల పార్లమెంటరీ కమిటీ మహిళల రక్షణకు తీసుకోవాల్సిన చర్యల్లో భాగంగా పలు సిఫార్సులు చేసింది.   »    ఈ కమిటీకి డీఎంకే పార్లమెంట్ సభ్యుడు టి.ఆర్.బాలు నేతృత్వం వహించారు.ముఖ్యమైన సూచనలు   »    ప్రతి రైలు కంపార్ట్‌మెంటులో సీసీటీవీ కెమెరాలుండాలి. అత్యవసర పరిస్థితుల్లో సాయంకోసం అప్రమత్తం చేసేందుకు కచ్చితంగా ఎమర్జెన్సీ అలారం గంటలను కూడా ఏర్పాటు చేయాలి.   »    ఈ అలారంలను ఇంజిన్ పైలట్, గార్డు క్యాబిన్‌లకు అనుసంధానించాలి.   »    నిరక్షరాస్యులైన మహిళలు కూడా సులువుగా గుర్తుపట్టేలా వారికి ప్రత్యేకించిన బోగీలన్నీ అన్ని రైళ్లలో ఒకే రకమైన రంగులో ఉండాలి.   »    గుర్తింపు లేని చిరు వ్యాపారులు, భిక్షగాళ్లు, ఇతరత్రా పోకిరీల వంటి వారు మహిళల బోగీల్లోకి ప్రవేశించకుండా చర్యలు చేపట్టాలి.   »   అన్ని రైల్వే స్టేషన్లలోనూ తగినంత భద్రతా సిబ్బంది సదా అందుబాటులో ఉండాలి.   »    అన్ని రైళ్లలోని మహిళా ప్రయాణికుల కోసం ప్రత్యేక హెల్స్‌లైన్‌ను ఏర్పాటు చేయాలి.   »   ఆర్‌పీఎఫ్‌లో మహిళా క్యాడెట్ల సంఖ్యను పెంచాలి.
ఫిబ్రవరి - 7
¤  రానున్న 15 సంవత్సరాల్లో దేశంలో వృద్ధుల సంఖ్య (7.5% నుంచి 12.4 శాతానికి) పెరగనున్న నేపథ్యంలో ఉద్యోగ విరమణ వయసును 65 సంవత్సరాలకు పెంచాలని పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసింది. ఉద్యోగ విరమణ వయసు పెంపు, విశ్రాంత ఉద్యోగులకు తిరిగి అవకాశాల కల్పన, ఆదాయపు పన్ను మినహాయింపు, వైద్య సౌకర్యాల మెరుగుదల వంటి వాటిపై సామాజిక న్యాయం, సాధికారికత మంత్రిత్వ శాఖ దృష్టి సారించాలని హేమానంద్ బిశ్వాల్ నేతృత్వంలోని కమిటీ సూచించింది.   »   కమిటీ తన నివేదికను లోక్‌సభకు సమర్పించింది.
ఫిబ్రవరి - 21
¤ గ్లోబల్ డిపాజిటరీ రిసిట్స్ (జీడీఆర్), ఫారిన్ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్స్ (ఎఫ్‌సీసీబీ) జారీ నిబంధనలను పూర్తిస్థాయిలో హేతుబద్ధీకరించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం సాహూ కమిటీని ఏర్పాటు చేసింది.
ఫిబ్రవరి - 25
¤  కొత్త బ్యాంక్ లైసెన్సుల కోసం అందిన దరఖాస్తులను పరిశీలించిన ఉన్నత స్థాయి సలహా సంఘం బిమల్‌జలాన్ కమిటీ తన నివేదికను రిజర్వ్ బ్యాంక్‌కు అందజేసింది.   »   ఈ నివేదికలో బ్యాంక్ లైసెన్సులు అందుకోవడానికి అర్హత ఉన్న కంపెనీల పేర్లున్నాయి.   »   కమిటీ సభ్యుల్లో ఆర్‌బీఐ పూర్వ డిప్యూటీ గవర్నర్ ఉషా థోరట్, సెబీ పూర్వ ఛైర్మన్ సి.బి.భావే, ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌కు చెందిన నచికేత్ మోర్ ఉన్నారు.   »   ఇండియా పోస్ట్, ఐఎఫ్‌సీఐ తదితర ప్రభుత్వరంగ సంస్థలతోపాటు ప్రైవేట్ రంగంలో అనిల్ అంబానీ గ్రూప్, ఆదిత్య బిర్లా గ్రూప్, బజాజ్ ఫైనాన్స్, ముత్తూట్ ఫైనాన్స్, రెలిగేర్ ఎంటర్ పైజెస్, శ్రీరాం కేపిటల్ సహా మొత్తం 25 సంస్థలు బ్యాంక్ లైసెన్సుల కోసం దరఖాస్తులు పెట్టుకున్నాయి.