జనవరి - 3
|
¤ ఉద్యోగం, వ్యాపారం నిమిత్తం విదేశాల్లో ఉన్న కుటుంబ సభ్యులు పంపే నగదును
ప్రధాన నగరాల్లో కుటుంబాలు రోజువారీ అవసరాలకు వినియోగించడం తగ్గిందనీ,
ప్రతిఫలం వచ్చే పెట్టుబడుల్లోకి ఈ సొమ్మును మళ్లించడం పెరిగిందనీ రిజర్వ్‌బ్యాంక్
నివేదిక వెల్లడించింది.
ముఖ్యాంశాలు
గత ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి ప్రైవేటు వ్యక్తులు పంపిన మొత్తం
6,76,270 డాలర్లు. ఇందులో గల్ఫ్ దేశాల నుంచి 2,49,340 డాలర్లు, ఉత్తర
అమెరికా నుంచి 2,32,200 డాలర్లు వస్తున్నాయి. ఐరోపా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా,
తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి దేశాల నుంచి మిగిలిన మొత్తాలు వస్తున్నాయి.
రాష్ట్రానికి చేరుతున్న నగదులో 83% డాలర్ల రూపంలో, 9% యూరో రూపేణా,
3% బ్రిటన్ పౌండ్ల కింద వస్తున్నాయి. ఇతర దేశాల కరెన్సీ 4% వస్తోంది. ఈ విషయంలో
ఒడిశా మాత్రమే 94% డాలర్లు అందుకుంటూ, మన రాష్ట్రంకంటే ముందుంది. దేశీయ
సగటు 57 శాతమే.
రాష్ట్రానికి అమెరికా నుంచి 64%, ఐరోపా నుంచి 11%, గల్ఫ్ నుంచి 10%, దక్షిణ
అమెరికా నుంచి 8%, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల నుంచి 3% , ఆఫ్రికా నుంచి 2% తూర్పుఆసియా నుంచి 2% చొప్పున ఈ సొమ్ము వస్తోంది. |
జనవరి - 9
|
¤ రాష్ట్ర విభజన కీలకమైన దశకు చేరుకున్న తరుణంలో విభజన వల్ల కలిగే
పరిణామాలపై అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా
(అసోచామ్) ఒక నివేదికను విడుదల చేసింది.
» రాష్ట్రం విడిపోతే ఆర్థికంగా ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు రెండూ లాభపడతాయనేది
ఈ నివేదిక సారాంశం. మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు విడిపోయి మూడు
కొత్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఆయా రాష్ట్రాల్లో మెరుగైన వృద్ధి నమోదైనట్లు నివేదికలో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనతోనూ మేలు జరుగుతుందని అభిప్రాయపడింది.
» రెండు రాష్ట్రాల్లోనూ ఆర్థికాభివృద్ధితోపాటు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయని, మౌలిక సదుపాయాలు విస్తరిస్తాయని నివేదికలో వివరించారు.
అసోచామ్ సెక్రటరీ జనరల్ డి.ఎస్.రావత్ హైదరాబాద్‌లో నివేదికను విడుదల చేశారు.
|
ముఖ్యాంశాలు |
» విభజన తర్వాత మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు ఆర్థికంగా మెరుగైన
వృద్ధిరేటును నమోదు చేశాయి. ఛత్తీస్‌గఢ్ వృద్ధి రేటు మధ్యప్రదేశ్ కంటే మెరుగ్గా
ఉంది.
» కొత్తగా ఏర్పాటైన మూడు రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్ మిగిలిన వాటికంటే మెరుగైన
వృద్ధిని సాధించింది. దీని మాతృరాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కంటే కూడా ఉత్తరాఖండ్ వృద్ధి
మెరుగ్గా ఉంది.
» బీహార్ విషయంలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. కొత్తగా ఏర్పడిన
జార్ఖండ్‌లో సహజవనరులకు కొదవలేదు. అక్కడ పరిశ్రమలు కూడా అధికం.
అయినప్పటికీ విడిపోయిన తర్వాత జార్ఖండ్ కంటే బీహార్ మెరుగైన స్థితిలో
నిలిచింది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లతో పోల్చి చూసినా, బీహార్ వృద్ధి గణాంకాలు
ఆకర్షణీయంగా ఉన్నాయి.
» విడిపోకముందు మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల స్థూల వృద్ధిరేటు
జాతీయ సగటు వృద్ధిరేటు కంటే తక్కువగా ఉంది. విడిపోయిన తర్వాత బీహార్,
ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్‌ల వృద్ధిరేట్లు జాతీయ సగటును మించిపోయాయి
. కేవలం ఉత్తరప్రదేశ్, జార్ఖండ్‌లు మాత్రమే వెనుక ఉన్నాయి. మూడు కొత్తరాష్ట్రాల
ఏర్పాటు తర్వాత మొత్తం ఆరు రాష్ట్రాల్లో తలసరి ఆదాయం, తలసరి వ్యయం బాగా
పెరిగాయి.
» ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్రాల విభజన ఆర్థికంగా లాభదాయ
కమనేది స్పష్టమవుతోందని, ఆంధ్రప్రదేశ్ విషయంలోనూ ఇదే జరుగు
తుందని అసోచామ్ అభిప్రాయపడింది. |
¤ అందరికీ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తేవాలనేది రిజర్వ్‌బ్యాంక్ లక్ష్యం.
ఇందుకు తగిన సూచనలిచ్చేందుకు ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఐసీఐసీఐ
బ్యాంక్ కార్వనిర్వాహక సంచాలకుడి(ఈడీ)గా పనిచేసిన నచికేత్ మోర్ నేతృత్వంలో
గతంలో ఒక బృందాన్ని నియమించారు. నాలుగు నెలలు తిరగకముందే ఈ బృందం
తన నివేదికను సమర్పించింది. ఇందులో కొన్ని కీలకమైన సిఫార్సులు కిందివిధంగా ఉన్నాయి.
» 2016 జనవరి ఒకటో తేదీకల్లా 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ
సురక్షితమైన, పూర్తిస్థాయిలో సేవలు లభించే ఎలక్ట్రానిక్ బ్యాంక్ ఖాతా ఉండేలా
చూడాలి.
» తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాల అవసరాలను తీర్చే విధంగా
ప్రత్యేక బ్యాంకులను ఏర్పాటు చేయాలి.
» దేశంలో ఎక్కడైనా సరే, ఓ పావుగంట నడిస్తే చాలు నగదు జమచేసే,
తీసుకునే సదుపాయం అందుబాటులో ఉండాలి.
» ఆటోమేటిక్‌గా బ్యాంక్ ఖాతాను తెరవడానికి ఆధార్ కార్డును ఉపయోగించు
కోనివ్వాలి.
» మౌలిక సదుపాయాలకు నిధులందించేందుకు ప్రత్యేకంగా ఒక బ్యాంక్ ఉండాలి. |
జనవరి - 15
|
¤ చర్మంపై రాసుకునే ఫెయిర్‌నెస్ క్రీముల్లో విషపూరిత భార లోహాలు, లిప్‌స్టిక్‌లలో క్యాన్సర్ కారక క్రోమియం ఉన్నట్లు సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్ఈ) సంస్థ నివేదికలో వెల్లడైంది. |
|
» 32 ఫెయిర్‌నెస్ క్రీములను పరీక్షించగా 44% క్రీముల్లో పాదరసం ఉందనీ, 30 లిప్‌స్టిక్ నమూనాలను పరీక్షంచగా 43% లిప్‌స్టిక్‌లలో నికెల్ ఉందనీ వెల్లడైంది. 14 ఫెయిర్‌నెస్ క్రీముల్లో పాదరసం మోతాదు 0.10 పీపీఎం నుంచి 1.97 పీపీఎం వరకు ఉంటోందని సీఎస్ఈ నివేదిక పేర్కొంది.
» ఔషధ, సౌందర్య సాధనాల చట్టాలు, నిబంధనల మేరకు సౌందర్య సాధనాల్లో పాదరసాన్ని వినియోగించడం నిషిద్ధం. పాదరసం కిడ్నీలను దెబ్బతీసే అవకాశముంది. చర్మంపై దద్దుర్లు, మచ్చలు ఏర్పడొచ్చు. చర్మం రంగు కూడా మారవచ్చు. ఇవి ఆందోళన, కుంగుబాటు వంటి సమస్యలకూ దారి తీయవచ్చు.
» 30 లిప్‌స్టిక్‌లను పరీక్షించగా 15 లిప్‌స్టిక్‌ల్లో క్రోమియం మోతాదు 0.45 పీపీఎం నుంచి 17.83 పీపీఎం వరకు ఉన్నట్లు బయటపడింది. అలాగే 13 లిప్‌స్టిక్‌లలో నికెల్ మోతాదు 0.57 పీపీఎం నుంచి 9.18 పీపీఎం వరకు ఉన్నట్లు వెల్లడైంది.
» అయితే చర్మం ముడతలు తగ్గించే క్రీములు, లిప్ బామ్‌ల్లో మాత్రం భార లోహాలేవీ కనపడలేదు. అలాగే లిప్‌స్టిక్‌లలో సీసం, కాడ్మియం ఆనవాళ్లు కూడా బయట పడలేదు.
» ప్రముఖ పర్యావరణవేత్త సునీతా నారాయణ్ సీఎస్ఈ డైరెక్టర్ జనరల్‌గా ఉన్నారు.
¤ ద ఎనర్జీ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్ (టెరీ), టెరీ యూనివర్సిటీ, ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ క్లీన్ ట్రాన్స్‌పోర్టేషన్ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో వాహనాల నుంచి వచ్చే ఉద్గారాల వల్ల మన దేశంలోని నగరాల్లో వాతావరణ కాలుష్యం తీవ్రంగా పెరుగుతోందని వెల్లడైంది.
» వాహనాల నుంచి విడుదలవుతున్న కాలుష్యాల వల్ల మన ఆరోగ్యానికే కాకుండా, వాతావరణానికి కూడా తీవ్ర ముప్పు పొంచి ఉందని ప్రముఖ పర్యావరణ వేత్త, ద ఎనర్జీ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్ (టెరీ) డైరెక్టర్ జనరల్ ఆర్.కె.పచౌరీ హెచ్చరించారు. వాహనాలు విడుదల చేసే కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, ఏట్రిక్యులేట్ మ్యాటర్ వంటివి వాతావరణంలోకి చేరుకున్న తర్వాత పరస్పరం చర్యపొంది, అత్యంత ప్రమాదకరంగా తయారవుతున్నాయని ఈ అధ్యయనంలో తేలింది.
» ద ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్‌ను గతంలో టాటా ఎనర్జీ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ అని పిలిచేవారు. |
జనవరి - 21
|
¤ 90 దేశాల్లో మానవ హక్కుల పరిస్థితిపై హ్యూమన్ రైట్స్ వాచ్ 667 పేజీల నివేదికను వెలువరించింది.
» అమెరికా తన నిఘా కార్యక్రమాల ద్వారా ప్రపంచానికే ప్రమాదకర ఉదాహరణగా మారిందని సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. గోప్యత హక్కును గౌరవించని అమెరికా జాతీయ భద్రత సంస్థ ధోరణి దమన నీతిని అనుసరించే దేశాలకు కూడా అవకాశంగా మారిందని పేర్కొంది. అవన్నీ దేశీయంగా ఉత్పత్తయ్యే సమాచారాన్ని సరిహద్దులు దాటకుండా చూసుకోవడం ద్వారా భావవ్యక్తీకరణ స్వేచ్ఛ మీద ఉక్కుపాదం మోపుతున్నాయని తెలిపింది.
» ప్రపంచ ఇంటర్నెట్ ట్రాఫిక్‌లో ఎక్కువ శాతం అమెరికా మీదుగా పోవడమో, అమెరికా కంపెనీ సర్వర్ల నుంచి పోవడమో జరుగుతున్నందువల్ల ఇంటర్నెట్ సమాచారంపై నిఘా వేయడంలో అమెరికా అగ్రస్థానంలో ఉందని హ్యూమన్ రైట్స్ వాచ్ తెలిపింది.
» ఇంటర్నెట్ స్వేచ్ఛకు ప్రతీకగా మారిన అమెరికాయే ఇప్పుడు ఇంటర్నెట్ నిఘాకు మారుపేరుగా మారిందని నివేదిక తెలిపింది. చైనా, రష్యాలతో పాటు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ కూడా అమెరికా అడుగుజాడల్లో నడుస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. |
జనవరి - 24
|
¤ భారత వృద్ధిరేటు 2014లో 5.35% ఉంటుందని 'ఐక్యరాజ్య సమితి - 2014 ప్రపంచ ఆర్థిక పరిస్థితి, అవకాశాలు' పేరిట ఐక్యరాజ్య సమితి నివేదిక విడుదల చేసింది.
» 2015లో ఈ రేటును 5.7%గా అంచనా వేసింది. అయితే, భారత వృద్ధిరేటు ఊహించిన దానికంటే తక్కువగా ఉండవచ్చని విశ్లేషించింది.
» భారత్ ద్రవ్యలోటును 2013-14లో జీడీపీలో 4.8% వద్ద కట్టడి చేయలేకపోవచ్చని అంచనా వేశారు.
¤ ఫోర్బ్స్ మేగజైన్ రూపొందించిన అమెరికాలోని 100 అత్యుత్తమ విశ్వసనీయ కంపెనీల జాబితాలో భారతీయ సంతతి వ్యక్తులు స్థాపించిన, వారి అధీనంలో ఉన్న 7 కంపెనీలకు చోటు దక్కింది.
» ఏడాదికి 25 కోట్ల డాలర్లలోపు ఆదాయాలున్న ఇలాంటి కంపెనీల జాబితాను ఫోర్బ్స్ రూపొందించడం ఇది మూడోసారి.
|
కంపెనీల వివరాలు |
1. వెడ్డింగ్‌వైర్: ఈ సంస్థ మేరీల్యాండ్ కేంద్రంగా ఈవెంట్ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఇది 27వ స్థానంలో నిలిచింది. దీన్ని సోనీ గంగూలీ స్థాపించి, నిర్వహిస్తున్నారు.
2. ప్రి పే నేషన్: ఈ కంపెనీ వాల్యూయాడెడ్ మొబైల్ సర్వీసులను అందిస్తుంది. 52వ స్థానంలో నిలిచింది. అనురాగ్ జైన్, అజయ్ వికాస్ గోయల్ నిర్వహిస్తున్నారు.
3. హెచ్‌బ్లూమ్: సోనూపండా ఆధ్వర్యంలో ఉన్న ఈ సంస్థ 61వ స్థానంలో నిలిచింది.
4. గెయిన్‌సైట్: నిక్ మెహతా, శ్రీధర్ పెద్దినేని నిర్వహిస్తున్న గెయిన్‌సైట్ ఐటీ కంపెనీ 63వ స్థానంలో నిలిచింది.
5. పబ్లిక్‌స్టఫ్: సూర్య యలమంచిలి అధిపతిగా ఉన్న ఈ సంస్థ 85వ స్థానంలో ఉంది.
6. మిక్స్‌పో: అనుపమ్ గుప్తా నిర్వహిస్తున్న ఈ సంస్థకు 93వ స్థానం లభించింది.
7. పెర్నిక్స్ డేటా: 100వ స్థానంలో నిలిచిన ఈ సంస్థను పూజన్ కుమార్, సత్యం వంఘాని నిర్వహిస్తున్నారు. |
జనవరి - 29
|
¤ ఉద్యోగం చేయడానికి అత్యుత్తమమైన కంపెనీగా గూగుల్ అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో సాఫ్ట్‌వేర్ కంపెనీ ఎస్ఏఎస్, తర్వాతి స్థానంలో ప్రముఖ సలహా సేవల సంస్థ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నిలిచాయి.
| |
¤ పని చేయడానికి అనువైన 100 కంపెనీల జాబితాను ఫార్చ్యూన్ పత్రిక రూపొందించింది. ఈ జాబితాలో గూగుల్ అగ్రస్థానం దక్కించుకుంది. గూగుల్ ఇలా పైచేయి సాధించడం వరుసగా ఇది అయిదో ఏడాది. జాబితాలో చోటు సంపాదించడం ఇప్పటికిది ఎనిమిదోసారి. 'గత ఏడాది గూగుల్ షేర్ ధర 1,000 డాలర్లు దాటింది. ఇది సిబ్బందికి ఒక వరం లాంటిదే. ఎందుకంటే, ఆ సంస్థలోని ఉద్యోగులంతా కంపెనీలో వాటాదార్లే (షేర్ హోల్డర్లే)' అని ఫార్చ్యూన్ పేర్కొంది. తన వద్ద పనిచేసే ఉద్యోగులకు గూగుల్ అందిస్తున్న అదనపు ప్రయోజనాలు ఆ కంపెనీని అగ్రస్థానంలో నిలబెట్టేలా చేశాయని పత్రిక వివరించింది.
¤ క్వాల్‌కామ్‌కు 32వ స్థానం లభించింది. గోల్డ్‌మన్ శాక్స్ గ్రూప్ 45, సిస్కో 55, హయాత్ హోటల్స్ 95 స్థానాల్లో నిలిచాయి. జాబితాను రూపొందించడానికి 'గ్రేట్ ప్లేస్ టు వర్క్' ఇన్‌స్టిట్యూట్‌తో కలిసి ఫార్చ్యూన్ ఆయా కంపెనీల్లో పని చేస్తున్న 2,52,000 మందికి పైగా ఉద్యోగుల అభిప్రాయాలను సేకరించి వడపోసింది.
¤ దేశంలో అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్‌గా శామ్‌సంగ్ నిలిచింది. తర్వాత స్థానాలను సోనీ, టాటాలు సొంతం చేసుకున్నాయని 'బ్రాండ్ ట్రస్ట్ రిపోర్ట్ 2014' నివేదిక తెలిపింది. గత ఏడాది ఈ మూడూ వరుసగా రెండు, మూడు, అయిదో స్థానాల్లో ఉన్నాయి. గత నాలుగేళ్లుగా ప్రతి ఏడాదీ ట్రస్ట్ రిసెర్చ్ అడ్వైజరీ (టీఆర్ఎ) ఈ నివేదికను విడుదల చేస్తోంది. ఇందులో 100 కంపెనీలకు ర్యాంకులు ఇస్తోంది. దక్షిణ కొరియాకు చెందిన మరో కంపెనీ ఎల్‌జీ నాలుగో స్థానంలో, నోకియా అయిదో స్థానంలో ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. హ్యూలెట్ ప్యాకార్డ్ 14 స్థానాలు ఎగబాకి, ఆరో స్థానాన్ని ఆక్రమించింది. హీరో 79 స్థానాలు దాటి, ఏడో స్థానానికి చేరింది. మొదటి పది స్థానాల్లో ఉన్న కంపెనీల్లో హోండా, రిలయన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా ఉన్నాయి. |
|
|
|