ఫిబ్రవరి - 2014 నివేదికలు - సర్వేలు


ఫిబ్రవరి - 10
¤  గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ (జీఐఐ)-2013 ప్రకటించిన 142 దేశాల జాబితాలో భారత్ 66వ స్థానంలో నిలిచింది. 2012లో ఈ జాబితాలో భారత్ 64వ స్థానంలో ఉంది.

¤  ఆస్ట్రేలియా నుంచి తాత్కాలిక వర్క్ వీసాలు పొందుతున్న వారిలో భారతీయుల సంఖ్య అధికమని ఆస్ట్రేలియా ఇమ్మిగ్రేషన్ అధికారులు విడుదల చేసిన తాజా నివేదిక వెల్లడించింది.

   »    నివేదిక ప్రకారం 2013 జులై - డిసెంబరు మధ్య జారీచేసిన వీసాల్లో 23.4% భారతీయులవే. తరువాతి స్థానాల్లో 18.6%తో బ్రిటన్, 7.9%తో ఐర్లాండ్ ఉన్నాయి.
ఫిబ్రవరి - 18
¤   ప్రపంచంలో అత్యంత విలువైన 500 బ్రాండ్లపై బ్రాండ్ ఫైనాన్స్ సంస్థ 'గ్లోబల్ 500' పేరుతో నివేదికను వెలువరించింది.
ముఖ్యాంశాలు
   »    ప్రపంచవ్యాప్తంగా చూస్తే అమెరికాకు చెందిన ఆపిల్ కంపెనీ అత్యంత ఖరీదైన బ్రాండ్‌గా తనకున్న అగ్రస్థానాన్ని ఈ యేడూ నిలబెట్టుకుంది. ఆ బ్రాండ్ విలువ 105 బిలియన్ డాలర్లు (రూ.6,51,000 కోట్లు).

   »    ఆపిల్ తర్వాతి స్థానంలో శాంసంగ్ నిలిచింది. దీని బ్రాండ్ విలువ 79 బిలియన్ డాలర్లు.


   »    తొలి పది స్థానాల్లో ఆపిల్, శాంసంగ్, గూగుల్, మైక్రోసాఫ్ట్, వెరిజోన్, జీఈ, ఏటీఅండ్‌టీ, అమెజాన్, వాల్‌మార్ట్, ఐబీఎంలు ఉన్నాయి.

   »    ఆపిల్ బ్రాండ్ వరుసగా మూడో సంవత్సరం కూడా ప్రపంచంలో అత్యంత విలువైన బ్రాండ్‌గా ఉంది. అయితే కొరియాకు చెందిన శాంసంగ్ తన బ్రాండ్ విలువను 20 బిలియన్ డాలర్ల మేరకు పెంచుకోవడం విశేషం.



   »    ఇటలీకి చెందిన కార్ల తయారీ కంపెనీ 'ఫెరారీ'ని ప్రపంచంలో అత్యంత శక్తిమంత బ్రాండ్‌గా జాబితాలో పేర్కొన్నారు. ఒక్క ఫెరారీకి మాత్రమే ఏఏఏ ప్లస్ బ్రాండ్ రేటింగ్‌తో పాటు, మొత్తంమీద అత్యధిక గణన (స్కోర్) లభించింది.

   »    జాబితాలో ఎక్కువ సంఖ్యలో ఉన్న (185) బ్రాండ్లు అమెరికావే. జపాన్ (42 బ్రాండ్లు), ఫ్రాన్స్ (37), బ్రిటన్ (35), జర్మనీ (32), చైనా (27), స్విట్జర్లాండ్ (19) ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. 5 బ్రాండ్లతో భారత్ ఈ కేటగీరీలో 17వ ర్యాంక్ సంపాదించింది.

   »    ఒక దేశానికి చెందిన కంపెనీల మొత్తం బ్రాండ్ విలువ పరంగా చూసినపుడు 294 బిలియన్ డాలర్లతో అమెరికా అగ్రస్థానంలో ఉంది. ఈ కేటగిరీలో 35.7 బిలియన్ డాలర్ల విలువతో భారత్ 18వ స్థానంలో నిలిచింది.


   »   భారతదేశంలో అత్యంత ఖరీదైన బ్రాండ్‌గా టాటా గ్రూప్ తన స్థాయిని నిలబెట్టుకుంది. టాటాల బ్రాండ్ విలువ 18.2 బిలియన్ డాలర్ల నుంచి 21.1 బిలియన్ డాలర్ల (రూ.1,30,820 కోట్ల)కు పెరిగింది.


   »   టాటా గ్రూప్ ప్రపంచ ర్యాంకింగ్‌లో గత సంవత్సరం 39వ స్థానంలో ఉండగా, తాజాగా 34వ స్థానానికి ఎగబాకింది.
ఫిబ్రవరి - 20
¤    వచ్చే ఆర్థిక సంవత్సరం 2014-15లో భారత వృద్ధిరేటు అధికంగా 5.4% వరకూ ఉండవచ్చని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా వేసింది.

   »   2013-14కు 4.6 శాతంగా ఉండే వృద్ధిరేటు, వచ్చే ఆర్థిక సంవత్సరానికి 5.4 శాతానికి పుంజుకుంటుందని ఐఎంఎఫ్ తాజా నివేదిక వెల్లడించింది.


   »   భారత ప్రభుత్వ అధికారిక అంచనాలను బట్టి చూస్తే వృద్ధిరేటు 2013-14లో 4.9 శాతంగా నమోదు కావచ్చు. 2012-13లో ఆర్థికవృద్ధి రేటు 4.5 శాతమే ఉంది. అయితే 2014-15లో వృద్ధి మెరుగు పడొచ్చని ప్రభుత్వం ఆశిస్తోంది.
ఫిబ్రవరి - 25
¤    'గ్లోబల్ ఆక్యుపెన్సీ కాస్ట్స్-ఆఫీసెస్' పదిహేడో నివేదికను ప్రపంచ స్థిరాస్తి సలహా సంస్థ డీటీజడ్ విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా 138 మార్కెట్లలో ప్రధాన కార్యాలయ భవనాల అద్దె ఖర్చులు ఎలా ఉన్నాయి? ఇకముందు ఎలా ఉండవచ్చు? అనే అంశాలను ఈ నివేదికలో విశ్లేషించారు.

   »   ప్రపంచంలో అతి తక్కువ కిరాయికి కార్యాలయ భవన వసతి దొరుకుతున్న పది ప్రాంతాల్లో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. రూపాయి మారకం విలువ తగ్గడం, రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో అద్దెలు క్షీణించడం దీనికి కారణమని డీటీజడ్ సంస్థ తన నివేదికలో వెల్లడించింది. హైదరాబాద్‌లోని ఒక్కో పని ప్రదేశం అద్దె సంవత్సరానికి 1,250 డాలర్లుగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.

   »   నివేదికలో రెండో స్థానంలో ఇండోనేషియాలోని సురబాయా నిలిచింది. చెన్నై, పుణే, బెంగళూరు వరుసగా 3, 4, 5 స్థానాల్లో నిలిచాయి.

   »   లండన్‌లోని వెస్ట్ఎండ్, హాంకాంగ్ అతి ఖరీదైన భవన వసతి మార్కెట్లుగా నివేదికలో చోటు పొందాయి. ఈ రెండు నగరాల్లో ఏడాదికి ఒక పని ప్రదేశం కిరాయి 20,000 డాలర్ల కంటే ఎక్కువగా ఉంది.

   »   అతి ఖరీదైన మార్కెట్లలో ఢిల్లీ 49వ స్థానం, ముంబయి 63వ స్థానం దక్కించుకున్నాయి.
 ఫిబ్రవరి - 28
¤ మనదేశంలో మూడోతరగతి విద్యార్థుల్లో 66% మాత్రమే లెక్కలకు సరైన సమాధానం చెబుతున్నట్లు ఎన్‌సీఈఆర్‌టీ రూపొందించిన 'జాతీయ ప్రగతి గణన' నివేదిక పేర్కొంది.

   » ఈ నివేదికను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి ఎం.ఎం.పళ్లంరాజు న్యూఢిల్లీలో విడుదల చేశారు.

   » 30% విద్యార్థులు తేలికైన గుణకారాలు సైతం చేయలేకపోతున్నారు. భాషా సంబంధ ప్రశ్నలకు 64% సమాధానాలు చెబుతున్నారు. 65% పిల్లలు విని, స్పందించగలుగుతున్నారు. చూపించిన చిత్రాలను 86% విద్యార్థులు గుర్తించగలుగుతున్నారు.