జనవరి - 2014 జాతీయం


జనవరి - 1
¤ దేశ విద్యుత్ చరిత్రలో కీలక ఘట్టం ఆవిష్కృతమయింది. దేశంలోనే తొలిసారిగా ఉత్తరాది గ్రిడ్‌తో, దక్షిణాది గ్రిడ్ అనుసంధానమైంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌కు ఉత్తరాది విద్యుత్‌ను సరఫరా చేయడానికి అడ్డంకులు తొలగిపోయాయి.          

» దేశవ్యాప్తంగా ఉత్తర, తూర్పు, పశ్చిమ గ్రిడ్‌లతో పాటు ఉత్తర - తూర్పు గ్రిడ్‌లు కలిసి ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాలు కలిసి ఒక గ్రిడ్‌గా ఉన్నాయి.          

» తాజాగా అయిదు గ్రిడ్‌లు కలిసి జాతీయ గ్రిడ్‌గా ఏర్పాటైంది. రాయచూర్ - షోలాపూర్ 765 కేవీ లైన్‌ను పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనుసంధానం చేసింది. దాదాపు 208 కిలోమీటర్ల పరిధిలోని 765, 400 కేవీ సబ్‌స్టేషన్లను ఒప్పందం పరిధిలోకి తీసుకొచ్చింది. దీని వల్ల దాదాపు రూ.815 కోట్లు వ్యయం అయిందని అంచనా వేశారు.          

» దేశవ్యాప్తంగా అయిదు గ్రిడ్‌లు అనుసంధానం కావడం వల్ల రాష్ట్రాల్లో మిగులు విద్యుత్‌ను డిమాండ్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు సరఫరా చేయడానికి వీలవుతుంది. విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉన్న దక్షిణాది రాష్ట్రాలు తరచూ కోతలను ఎదుర్కొంటున్నాయి. డిమాండ్ ఎక్కువున్న కాలంలో యూనిట్ విద్యుత్‌కు రూ.7 కు పైగా వెచ్చించి మరీ కొనుగోలు చేస్తున్నాయి. తాజా అనుసంధానం వల్ల ఇకమీదట విద్యుత్ కొనుగోలు ధర బాగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు.¤ లోక్‌పాల్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.          

» బిల్లును న్యాయశాఖ అధికారిక గెజిట్‌లో ప్రచురణకు పంపించనుంది. దీంతో బిల్లు చట్టరూపం దాల్చి, లోక్‌పాల్ వ్యవస్థకు రంగం సిద్ధమవుతుంది.          

» అవినీతిని నిరోధించే లక్ష్యంతో రూపొందిన లోక్‌పాల్ బిల్లుకు 2013 డిసెంబరు 17న రాజ్యసభ, ఆ మరుసటి రోజు లోక్‌సభ ఆమోదం తెలిపాయి.¤ ఢిల్లీలో ఆప్ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలిసారిగా విధానసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి.          

» ఈ సమావేశాల్లో 70 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనీష్ సిసోడియాలు ప్రమాణం చేశారు.          

» ఆప్ ఎమ్మెల్యేలంతా ఈ సమావేశాలకు సాధారణ పౌరుల్లా బస్సులు, మెట్రో రైళ్లలో చేరుకుని అందరి దృష్టిని ఆకట్టుకున్నారు.         

» ఈ తొలి సమావేశాలకు ప్రొటెం స్పీకర్‌గా కాంగ్రెస్ సీనియర్ నేత మతిన్ అహ్మద్ వ్యవహరించారు.          

» 28 మంది ఎమ్మెల్యేలు కలిగిన ఆప్ ఎనిమిదిమంది ఎమ్మెల్యేల కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.          

» ఢిల్లీలో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించేందుకు ఆప్ ప్రభుత్వం పలు చర్యలు ప్రకటించింది. వారి కోసం ప్లాస్టిక్ గుడారాల స్థానంలో పోర్టా క్యాబిన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.¤ అగస్టా వెస్ట్‌ల్యాండ్ తో రూ.3,600 కోట్ల విలువైన వీవీఐపీ హెలికాప్టర్ల ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసుకుంది.
          

» 12 వీవీఐపీ హెలికాప్టర్లను వైమానిక దళానికి సరఫరా చేసే ఒప్పందం వెనక రూ.360 కోట్ల ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు వచ్చి, రాజకీయంగా పెను దుమారం చెలరేగిన ఏడాది తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది.
          

» ఈ ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. వైమానికదళం మాజీ అధిపతి ఎస్.పి.త్యాగి ఈ కేసులోని నిందితుల్లో ఒకరు.          

» 12 హెలికాప్టర్లలో మూడింటిని అగస్టా వెస్ట్‌ల్యాండ్ ఇప్పటికే సరఫరా చేసింది. ఒప్పందంలో భాగమైన నిజాయితీ కట్టుబాటు (ఇంటిగ్రిటీ ప్యాక్ట్)ను ప్రస్తావిస్తూ, 500 మిలియన్ యూరోలకు పైబడి నష్టపరిహారాన్ని రాబట్టుకోవాలని కూడా భారత్ యోచిస్తోంది. అగస్టా వెస్ట్‌ల్యాండ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (ఏడబ్ల్యూఐఎల్)తో 2010, ఫిబ్రవరి 8న చేసుకున్న ఒప్పందాన్ని భారత ప్రభుత్వం తాజాగా రద్దు చేసుకుంది.          
» ఒప్పందం రద్దు నేపథ్యంలో ప్రభుత్వం మధ్యవర్తి ప్రక్రియ ద్వారా మొత్తం వ్యవహారాన్ని చక్కబెట్టుకోవాలని నిర్ణయించింది. కేంద్రం తన తరపున వాదించడానికి మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.పి.జీవన్‌రెడ్డిని నియమించుకుంది. అగస్టా వెస్ట్‌ల్యాండ్ తన తరపున వాదించడానికి మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.ఎన్.శ్రీకృష్ణను నియమించుకుంది.         
 » ఒప్పందంలో లొసుగులను కాగ్ కూడా బయట పెట్టింది. ఈ ఒప్పందానికి సంబంధించి ఇటలీ ప్రభుత్వం అగస్టా వెస్ట్‌ల్యాండ్ సీఈవో గిసెప్పే ఓర్సీని ఇప్పటికే అరెస్ట్ చేసింది. అక్కడి న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది.¤ కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న కొత్త భూసేకరణ చట్టం అమల్లోకి వచ్చింది.          
» 1894 నాటి చట్టం స్థానంలో తీసుకువచ్చిన ఈ సరికొత్త భూసేకరణ చట్టంతో భూములు కోల్పోయే వారికి పూర్తిస్థాయిలో పరిహారం, పునరావాసం అందుతాయి. ఆయా విషయాల్లో ప్రభుత్వాలు పూర్తిస్థాయి పారదర్శకతను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.¤ హైదరాబాద్‌లోని రిసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్‌సీఐ)లో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.          
» ఈ వేడుకలకు రాష్ట్ర డీజీపీ బి.ప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

¤
 భారత శాస్త్రవేత్తలు రూపొందించిన'పరమ్ యువ-2' సూపర్ కంప్యూటర్ ప్రపంచంలో విద్యుత్‌ను సమర్థంగా వినియోగించుకునే కంప్యూటర్ సిస్టమ్‌లలో ఒకటిగా నిలిచింది.
         
»
 అమెరికాలోని డెన్వర్‌లో జరిగిన సూపర్ కంప్యూటింగ్ కాన్ఫరెన్స్ (ఎస్‌సీ 2013)లో ఈ మేరకు 'గ్రీన్ 500' జాబితా విడుదల చేశారు.
         
»
 కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ అడ్వాన్డ్స్ కంప్యూటింగ్ (సి-డాక్) తయారు చేసిన పరమ్ యువ-2 సూపర్ కంప్యూటర్ దేశంలో మొదటి స్థానంలో ఆసియాలో 9వ స్థానంలో, ప్రపంచంలో 44వ స్థానంలో నిలిచింది.
         
»
 విద్యుత్‌ను తక్కువగా వినియోగించుకునే కంప్యూటర్లకు 'గ్రీన్-500' ర్యాంకులను ప్రకటిస్తూ ఉంటుంది.
జనవరి - 2
¤ సౌదీ అరేబియాలో పనిచేసే భారత కార్మికుల హక్కుల పరిరక్షణకు ఆ రెండు దేశాలూ ఒప్పందం చేసుకున్నాయి. ఇందుకు సంబంధించిన పత్రాలపై న్యూఢిల్లీలో ప్రవాస భారతీయుల వ్యవహారాల మంత్రి వాయలార్ రవి, సౌదీ కార్మిక శాఖ మంత్రి అదెల్ బిన్ మహ్మద్ ఫకేయ్‌లు సంతకాలు చేశారు.          
» ఈ కార్మిక సహకార ఒప్పందం ప్రకారం సౌదీలోని యజమానులు, ఇళ్లలో పనిచేసే వారికి మధ్య ఒప్పందాలను క్రమబద్ధీకరిస్తారు. వాటికి గుర్తింపునిస్తారు. దళారుల ప్రమేయం లేకుండానే తక్కువ ఖర్చుతో పనిలో చేరడానికి, నియమియంచుకోవడానికి వెసులుబాటు కలుగుతుంది. రెండు దేశాల చట్టాలను ఉల్లంఘించే రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలపై చర్యలు తీసుకునే వీలుంటుంది. ఇకపై యజమానులు కానీ, దళారులు కానీ పనివారి జీతంలో అర్థంలేని కోతలు విధించడం కుదరదు. ఇళ్లలో పనిచేసే వారికోసం ఏ సమయంలోనైనా సహాయం అందించేందుకు ప్రత్యేక వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తారు.¤ మైనార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ తొలి అవాంతరాన్ని విజయవంతంగా అధిగమించింది. బలపరీక్షలో అవలీలగా నెగ్గింది.          
» కాంగ్రెస్ సభ్యులతో పాటు జేడీ (యు), మరో స్వతంత్ర ఎమ్మెల్యే కేజ్రీవాల్ ప్రభుత్వానికి అండగా నిలిచారు. దీంతో మొత్తం 70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆప్‌కు ఉన్న 28 ఎమ్మెల్యేలతో కలిపి మొత్తం 37 మంది సభ్యుల మద్దతు లభించినట్లయింది.          
» ప్రొటెం స్పీకర్‌గా ఉండటంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే మాతిన్ అహ్మద్ ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఆయన ఓటుతో పని లేకుండానే కేజ్రీవాల్ ప్రభుత్వం బలపరీక్ష నెగ్గింది.
¤ 'మాంగల్య లాటరీ' పేరిట ప్రవేశపెట్టనున్న నూతన పథకానికి కేరళ మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.          
» లాటరీ టిక్కెట్ల విక్రయం ద్వారా వచ్చిన ఆదాయం నుంచి దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లికి రూ.30 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది.¤ అసోంలో భారత కాలమానం (ఇండియన్ స్టాండర్డ్ టైమ్ - ఐఎస్‌టీ)కి కాలం చెల్లింది.          
» దేశమంతా పాటించే ప్రామాణిక సమయానికి భిన్నంగా 150 ఏళ్ల నాటి 'చాయ్ బగాన్' సమయాన్ని పాటించాలని అసోం ప్రభుత్వం నిర్ణయించింది.          
» దీని ప్రకారం భారత కాలమానంతో పోలిస్తే, అసోంలో సమయం గంట మేర ముందుకు జరుగుతుంది. దీనివల్ల విద్యుత్ ఆదాతో పాటు వివిధ ప్రయోజనాలు ఉంటాయని భావిస్తున్నారు.          
» చాయ్ బగాన్ సమయాన్ని బ్రిటిష్ పాలకులు 150 ఏళ్ల కిందట ప్రవేశపెట్టారు. టీ ఎస్టేట్లు, చమురు పరిశ్రమలకోసం దీన్ని ఉద్దేశించారు. అసోంలోని టీ ఎస్టేట్లు, 112 ఏళ్ల దిగ్బోయ్ చమురు శుద్ధి కర్మాగారం ఇంకా ఆ సమయాన్నే పాటిస్తున్నాయి. మిగతా రాష్ట్రమంతా భారత కాలమానాన్ని అనుసరిస్తోంది.          
» నిజానికి దేశంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే అసోంతో పాటు ఈశాన్య భారతంలో సూర్యోదయం, సూర్యాస్తమయం ముందే జరుగుతున్నాయి.
జనవరి - 3
¤ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ న్యూఢిల్లీలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. తొమ్మిదిన్నరేళ్ల యూపీఏ పాలనపై దేశ ప్రజలకు వివరణ ఇచ్చారు.

¤ ఢిల్లీ శాసనసభ స్పీకర్‌గా ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే ఎం.ఎస్.ధీర్ ఎన్నికయ్యారు.          
»  ఈ ఎన్నికలో ఎం.ఎస్.ధీర్‌కు 37 ఓట్లు రాగా, భాజపా అభ్యర్థి జగదీష్ ముఖి కి 32 ఓట్లు వచ్చాయి.          
»  దక్షిణ ఢిల్లీలోని జంగ్‌పుర శాసనసభ స్థానం నుంచి ఎం.ఎస్.ధీర్ శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.

¤  లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి అశోక్‌కుమార్ గంగూలీ (ఎ.కె.గంగూలీ) పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి నివేదనను పంపే ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో గంగూలీ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జురిడికల్ సైన్సెస్ (ఎన్‌యూజేఎస్) గౌరవ ప్రొఫెసర్ పదవికి రాజీనామా చేశారు.
జనవరి - 5
¤  కోచిలో మాతృభూమి దినపత్రిక 90వ వార్షికోత్సవాన్ని ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు.
జనవరి - 6
¤   వాహనాల వేగ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది.
          

»   ద్విచక్ర, నాలుగు చక్రాల, భారీ వాహనాల్లో ఏదైనాసరే, గంటకు 80 కిలోమీటర్ల గరిష్ఠ వేగానికే పరిమితం కావాలి. ఈ మేరకు దేశవ్యాప్తంగా నిబంధనలను కఠినతరం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ ఏడాది మార్చి నుంచి తయారయ్యే అన్ని వాహనాల వేగాన్ని పరిమితం చేస్తూ, స్పీడ్ గవర్నర్స్ ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.

¤   లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎ.కె.గంగూలీ పశ్చిమ బెంగాల్ మానవహక్కుల కమిషన్ (డబ్ల్యూబీహెచ్ఆర్‌సీ) ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు.

¤    న్యాయస్థానాన్ని, న్యాయమూర్తులను సంబోధించేటప్పుడు గౌరవసూచకంగా వాడే మాటలపై సర్వోన్నత న్యాయస్థానం స్పష్టత ఇచ్చింది.
          

»   కోర్టుల్లో జడ్జిలను గౌరవప్రదంగా సంబోధించాలని, అయితే 'మై లార్డ్', 'యువర్ లార్డ్‌షిప్', 'యువర్ ఆనర్' అనే సంబోధనలు తప్పనిసరేమీ కాదని చెప్పింది.
          

»   జడ్జిలకు 'సర్, యువర్ ఆనర్, యువర్ లార్డ్‌షిప్' అనే సంబోధనల్లో ఏదైనా సమ్మతమే అని జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే తో కూడిన ధర్మాసనం స్పష్టీకరించింది.

జనవరి - 7 
¤    కౌమారదశలో ఆరోగ్య, ఆహార, సాంఘిక సమస్యలను అధిగమించేందుకు 10-19 ఏళ్ల మధ్య వయసువారికి కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించింది.
          

»  రాష్ట్రీయ కిశోర్ స్వాస్థ్య కార్యక్రమం (ఆర్‌కెఎస్‌కె)గా పిలిచే ఈ పథకం దేశంలోని 34.3 కోట్ల మంది (జనాభాలో 21%) కౌమార బాలబాలికలకు పోషకాహారం, ప్రత్యుత్పత్తి, శారీరక-మానసిక ఆరోగ్యం, లైంగిక వేధింపులు, సాంక్రమిక వ్యాధులు, జీవనశైలి తదితర అంశాల్లో అవగాహన పెంపొందిస్తుంది.
          

»  కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి గులామ్ నబీ ఆజాద్ న్యూఢిల్లీలోని తాజ్‌ప్యాలెస్ హోటల్‌లో ఈ పథకాన్ని ప్రారంభించారు.


¤    దేశంలోని ఐఐటీ, ఎన్ఐటీ, సెంట్రల్ వర్సిటీలు, ఇతర కేంద్రీయ విద్యాసంస్థలకు చెందిన అకడమిక్ బృందాలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నూతన సంవత్సర సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా ఉన్నత విద్యలో నాణ్యతాప్రమాణాలు పెంపొందించుకోవాలని సూచించారు.
          

»  దేశవ్యాప్తంగా 400 విద్యాసంస్థల్లో రాష్ట్రపతి ప్రసంగం ప్రసారమైంది. దేశంలోని అన్ని జాతీయస్థాయి ఉన్నత విద్యాసంస్థలకు ఒకేసారి భారత రాష్ట్రపతి సందేశాన్ని ఇవ్వడం ఇదే తొలిసారి.
జనవరి - 8
¤    దేశంలో ఉన్న జైన మతస్థులకు జాతీయస్థాయిలో అల్పసంఖ్యాక వర్గాల (మైనారిటీ) హోదా కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.
          

»  ఈ గుర్తింపు లభిస్తే సుమారు 50 లక్షల మంది జైనులకు పలు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల వల్ల లబ్ధి చేకూరుతుంది.
          

»   ఈ మేరకు మైనారిటీ వ్యవహారాల శాఖ ఇప్పటికే క్యాబినెట్ నోట్ సిద్ధం చేసింది.


¤    ఒడిశా ఎన్నికల చరిత్రలో తొలిసారి హిజ్రాలకు ప్రత్యేక గుర్తింపుతో ఓటు వేసే అవకాశం లభించింది.
          

»   భువనేశ్వర్ నగరపాలక ఎన్నికల్లో హిజ్రాలు పురుషుడు, స్త్రీగా కాకుండా 'ప్రత్యేక ఓటర్లు' అనే గుర్తింపుతో ఓటు హక్కు వినియోగించుకున్నారు.


¤    ఇప్పటికే పని చేస్తున్న ఔషధ తయారీ కంపెనీల్లో (బ్రౌన్ ఫీల్డ్ ఫార్మా) 100% విదేశీ పెట్టుబడులను అనుమతించే విధానాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మన ఫార్మా కంపెనీలను విదేశీ కంపెనీలు స్వాధీనం చేసుకుంటూ ఉంటే, చవక ధరల మందులు అందుబాటులో లేకుండా పోతాయేమోననే ఆందోళనలను ప్రభుత్వం తోసిపుచ్చింది.
జనవరి - 9
¤    ఎన్నికలకు సంబంధించిన సమాచారంపై గూగుల్‌తో కలిసి పని చేయాలనే ప్రతిపాదనను కేంద్ర ఎన్నికల సంఘం విరమించుకుంది.
          

»   ఎన్నికలకు సంబంధించిన అన్వేషణ సేవలను పౌరులకు అందిస్తామని గూగుల్ ప్రతిపాదించినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. కానీ, కాంగ్రెస్, భాజపా, సైబర్ నిపుణుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవడంతో వెనక్కి తగ్గింది.


¤    వాహనాలు నడిపేవారికి అత్యంత సురక్షితమైన నగరం ముంబయి అని ట్రాఫిక్, రోడ్డు భద్రతపై ఒక బీమా సంస్థ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. రోడ్డు భద్రత విషయంలో ముంబయిదే అగ్రస్థానమని, అక్కడి ట్రాఫిక్ అత్యంత క్రమబద్ధంగా ఉంటుందని సంస్థ వెల్లడించింది.
          

»   అత్యుత్తమ రహదారులు ఉన్న నగరంగా ఢిల్లీ నిలిచింది.
          

»   ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు తదితర మహానగరాల్లో ఈ అధ్యయనం నిర్వహించారు.


¤     పాలనా యంత్రాంగంలో అవినీతిని సమూలంగా నిర్మూలించే ఉద్దేశంతో ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం 011-27357169 హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది.
          

»   విజిలెన్స్ విభాగం పర్యవేక్షణలో పనిచేసే ఈ హెల్ప్‌లైన్ ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఢిల్లీ ప్రజలకు అందుబాటులో ఉంటుంది.
జనవరి - 10
¤     ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) లోక్‌సభ ఎన్నికల్లో మరింత దూసుకుపోవాలని నిర్ణయించింది. ఈ నెల 26కల్లా కనీసం కోటిమందిని సభ్యులుగా చేర్చుకోవాలనే లక్ష్యంతో దేశవ్యాప్తంగా సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టింది.
          
»   'నేనూ సామాన్యుడినే' అనే నినాదంతో ప్రజల ముందుకు వెళుతున్నామని, తమ పార్టీ సభ్యత్వం అందరికీ ఉచితమేనని, సభ్యులుగా చేరదలుచుకున్నవారు 07798220033 ఫోన్ నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే చాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.

¤     ఫోన్ ట్యాపింగ్‌పై కేంద్ర ప్రభుత్వం తాజా ప్రామాణిక విధివిధానాలను తీసుకొచ్చింది. ఇంటర్నెట్ టెలిఫోనీ వీవోఐపీ, ఎస్ఎంఎస్, ఎంఎస్ఎస్ లను భారత టెలిగ్రాఫ్ చట్టం పరిధిలోకి తీసుకొచ్చింది.          
»   చట్టబద్ధ ఫోన్ ట్యాపింగ్ కోసం కొట్టివేతలతో వచ్చే విజ్ఞప్తులను, ఫోన్ లేదా ఫ్యాక్స్ ద్వారా వచ్చే అభ్యర్థనలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించవద్దని టెలికాం కంపెనీలను టెలికమ్యూనికేషన్ల విభాగం ఆదేశించింది.

¤     సీనియర్ దౌత్యాధికారి దేవయాని ఖోబ్రగాడే కి జరిగిన అవమానాన్ని ఉపేక్షించేది లేదని భారత్ మరోసారి తన చర్యల ద్వారా స్పష్టం చేసింది. ఆమెకు కల్పించిన పూర్తి స్థాయి దౌత్య రక్షణను ఉపసంహరించుకోవాలని అమెరికా చేసిన సూచనను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చడంతో పాటు, అమెరికా సీనియర్ దౌత్యాధికారి జార్జ్ గ్రిఫిన్‌ను బహిష్కరించింది.          
»   భారత్ దేవయానిని ఢిల్లీలోని విదేశాంగ శాఖ ప్రధాన కార్యాలయానికి బదిలీ చేయడంతో ఆమె స్వదేశానికి చేరుకున్నారు.
జనవరి - 11
¤     మాజీ ప్రధానమంత్రి లాల్‌బహుదూర్ శాస్త్రి 48వ వర్ధంతి సందర్భంగా జాతి ఆయనకు ఘన నివాళి అర్పించింది.          
» ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తదితరులు ఆయన సమాధి విజయ్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. 

¤     ఉత్తర రైల్వే సరకు రవాణా రైళ్లు సహా మొత్తం 350 రైళ్లలో పొగమంచు భద్రతా పరికరాలను అమర్చింది. శీతాకాలంలో దృశ్య స్పష్టత తక్కువగా ఉన్నప్పుడు చోటు చేసుకునే ప్రమాదాల నివారణే లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేశారు. ఈ పరికరం ఉంటే దట్టమైన పొగమంచు ఉన్నప్పటికీ డ్రైవర్ సిగ్నల్‌ని చూడగలుగుతాడు. 


¤     పంట ఉత్పత్తులను విక్రయించడానికి హోల్‌సేల్ మార్కెట్‌కు వచ్చే రైతులకు రూ.5కే పూర్తిస్థాయి భోజనం (ఫుల్‌మీల్స్) అందించే పథకానికి రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే శ్రీకారం చుట్టారు.          
» రాష్ట్రవ్యాప్తంగా తొలుత 17 మార్కెట్లలో ఈ పథకాన్ని ప్రారంభించారు.

¤     తనపై పెట్టిన వీసా అవకతవకల కేసును రద్దు చేయాలని భారత దౌత్యాధికారి దేవయాని ఖోబ్రగాడే అమెరికా న్యాయస్థానంలో విజ్ఞప్తి దాఖలు చేశారు.          
» నేర విచారణ నుంచి ఆమెకు పూర్తి స్థాయి రక్షణలు ఉన్నందున కేసు రద్దు చేయాలని ఆమె తరఫు న్యాయవాది డేనియల్ అర్షాక్ ఆ విజ్ఞాపన పత్రంలో కోరారు.          
» మరోవైపు దేవయాని మళ్లీ అమెరికాలో ప్రవేశించకుండా నిషేధం విధించారు. సాధారణ ప్రక్రియ మాదిరిగా వీసా మంజూరు చేయకుండా వీసా, ఇమ్మిగ్రేషన్ అప్రమత్తత వ్యవస్థలో ఆమె పేరును చేరుస్తామని అమెరికా విదేశాంగశాఖ వెల్లడించింది. 
జనవరి - 12
¤     స్వామి వివేకానంద 150వ జయంత్యుత్సవాల ముగింపు కార్యక్రమాన్ని న్యూఢిల్లీలో నిర్వహించారు. 

» ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మతమౌఢ్యంపై పోరాటం చేయాలని ఈ సందర్భంగా ఇరువురు నేతలూ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.
          
» 1893 షికాగోలో జరిగిన ప్రపంచ మత సమ్మేళనంలో వివేకానందుడి ప్రసంగాన్ని ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు.          
» స్వామి వివేకానందుడి 150వ జయంతి సందర్భంగా ఈ ఉత్సవాలు గతేడాది జనవరి 12న ప్రారంభమయ్యాయి.

¤     ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత భద్రతను నిరాకరించినా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 'జెడ్ కేటగిరీ' భద్రతను కల్పించింది.

¤     ఉపాధి హామీ పథకంలో గిరిజనుల పనిదినాలను 100 నుంచి 150 రోజులకు పెంచుతూ కేంద్రం నిర్ణయించింది.
జనవరి - 13
¤    రెండేళ్లకోసారి జరిగే రాజ్యసభ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం ఖరారు చేసింది. పదహారు రాష్ట్రాలకు చెందిన 55 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్ 2-12 తేదీల మధ్య ముగియనుంది.
        
 »  ఈ నేపథ్యంలో వీరి స్థానాలకు ఫిబ్రవరి 7వ తేదీన తిరిగి ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆరు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
         

»  రాష్ట్రం నుంచి టి.సుబ్బరామిరెడ్డి, నంది ఎల్లయ్య, ఎం.ఎ.ఖాన్, టి.రత్నాబాయి, కె.వి.పి.రామచంద్రరావుల పదవీకాలం ఏప్రిల్‌తో పూర్తవుతుంది. నందమూరి హరికృష్ణ రాష్ట్ర విభజనకు నిరసనగా రాజ్యసభకు రాజీనామా చేయడంతో ఆయన స్థానం ఇప్పటికే ఖాళీగా ఉంది.


¤    ఉద్యోగ భవిష్య నిధి కార్యాలయం (ఈపీఎఫ్ఓ) భవిష్య నిధి డిపాజిట్లపై 2013-14 కాలానికి వడ్డీ 8.75 శాతంగా ప్రకటించింది.
         

»  గత ఆర్థిక సంవత్సరంలో వడ్డీ 8.5 శాతంగా ఉంది. ఈపీఎఫ్ఓ నిర్ణయాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదించగానే కొత్త వడ్డీరేటు అమల్లోకొస్తుంది.


¤    హర్యానా గోరఖ్‌పూర్‌లో 2,800 మెగావాట్ల అణువిద్యుత్ కేంద్రం నిర్మాణానికి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ శంకుస్థాపన చేశారు.
         

»  700 మెగావాట్ల చొప్పున నాలుగు యూనిట్లతో ఇక్కడ నిర్మిస్తున్న అణువిద్యుత్ కేంద్రాన్ని రూ.23,502 కోట్లతో చేపట్టామనీ, 2020-21 నాటికి 1,400 మెగావాట్ల తొలిదశ పూర్తవుతుందని ప్రధాని మన్మోహన్ ప్రకటించారు.
         

»  హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్‌సింగ్ హుడా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

¤     రక్తంలో చక్కెర స్థాయిని తెలిపే చవకైన పట్టీలు, గ్లూకోమీటర్లను కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించింది. ఈ పట్టీ ధర రూ.5. గ్లూకోమీటర్ ధర రూ.500 - రూ.800 మధ్య ఉంది.
         
»  న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులాంనబీ ఆజాద్ వీటిని ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ముంబయి ఐఐటీలు స్వదేశీ పరిజ్ఞానంతో ఈ పట్టీలు, గ్లూకోమీటర్లను అభివృద్ధి చేశాయి. వీటిని బయోసైన్స్ టెక్నాలజీస్ అనే సంస్థ ఉత్పత్తి చేస్తుంది.
         

»  ఈ పరికరాల వల్ల దీర్ఘకాలంలో దేశంలో మధుమేహాన్ని చాలా ముందుగా గుర్తించడానికి వీలవుతుంది. దిగుమతి చేసుకునే పట్టీ ధర రూ.35, గ్లూకోమీటర్ ధర రూ.2,500 పైగా ఉంది.


¤     ఒడిశా, జార్ఖండ్‌లలో అక్రమ మైనింగ్‌పై జస్టిస్ షా కమిషన్ నివేదికను కేంద్ర ప్రభుత్వం ఈ నెల 27 లోగా తమకు సమర్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నివేదిక నకలును తాము నియమించిన కేంద్ర సాధికార సమితికి కూడా అందజేయాలని జస్టిస్ ఎ.కె.పట్నాయక్ నేతృత్వంలోని పర్యావరణ ధర్మాసనం ఆదేశించింది.
¤     ప్రజల కష్టసుఖాలను తెలుసుకునేందుకు నిర్వహించదలచిన జనతా దర్బార్‌లను రద్దు చేస్తున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.
         

»  ఈ నెల 11న చేపట్టిన జనతా దర్బార్‌లో తీవ్ర గందరగోళం నెలకొన్న పరిస్థితుల్లో ఈ కార్యక్రమాన్ని ఇకపై నిర్వహించబోమని ఆయన ప్రకటించారు. అయితే, ప్రత్యమ్నాయ మార్గాల్లో ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ కొనసాగుతుందని స్పష్టం చేశారు.


¤     వరుసగా మూడో ఏడాదీ దేశంలో కొత్తగా పోలియో కేసులు నమోదు కాలేదనీ, భారత్ ఈ ఏడాది కూడా పోలియోరహిత దేశంగా ఆవిర్భవించిందనీ కేంద్ర ఆరోగ్య మంత్రి గులాం నబీ ఆజాద్ న్యూఢిల్లీలో ప్రకటించారు.
         

»  ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 11న అధికారికంగా వేడుక నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. 2009లో ప్రపంచంలో గుర్తించిన పోలియో కేసుల్లో సగం భారత్‌లోనే నమోదయ్యాయి. నాలుగున్నరేళ్లలో ఈ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించినట్లు మంత్రి ప్రకటించారు.
         

»  దేశంలో చివరిసారిగా 36 నెలల క్రితం పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లాలో రెండేళ్ల చిన్నారికి పోలియో సోకినట్లు 2011 జనవరి 13న రికార్డుల్లో నమోదైంది.
జనవరి - 14
¤     మహ్మద్ ప్రవక్త జయంతిని పురస్కరించుకుని ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకునే మిలాద్-ఉన్-నబి పర్వదినాన్ని దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు.
         

»  మహ్మద్ ప్రవక్త మక్కాలో జన్మించారు. ముస్లింల క్యాలెండర్‌ను అనుసరించి 3వ నెలలో ఆయన జయంతి వేడుకలను నిర్వహిస్తారు.


¤     దేశంలో రెండో అతిపెద్ద కుంభమేళాగా పిలుచుకునే 'గంగాసాగర్' కుంభమేళా పశ్చిమబెంగాల్‌లో ప్రారంభమైంది.


¤     పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు నెలసరి పింఛన్‌ను కనీసం రూ.వెయ్యిగా నిర్ధారిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
         

»  కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 25 లక్షల మంది పింఛన్‌దారులు లాభపడనున్నారు.


¤     అయ్యప్ప భక్తులు అత్యంత పవిత్రంగా భావించే మకరజ్యోతి దర్శనం శబరిమలలో కనిపించింది.


¤     సంక్రాంతి సందర్భంగా తమిళనాడులో ఏటా జరిగే జల్లికట్టు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.


¤     పంజాబ్‌లో లోహ్రా ఉత్సవాన్ని, గౌహతిలో బిహు ఉత్సవాలను కూడా ఘనంగా నిర్వహించారు.


¤     1984లో పంజాబ్‌లోని అమృత్‌సర్ స్వర్ణ దేవాలయంలో తీవ్రవాదుల ఏరివేత సమయంలో అప్పటి భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అప్పటి బ్రిటన్ ప్రధానమంత్రి, బ్రిటన్ ఉక్కుమహిళ మార్గరెట్ థాచర్ సాయం కోరారని వివరిస్తున్న కీలక పత్రాలు బహిర్గతం కావడం వివాదాస్పదమైంది.
         

»  బ్రిటన్ ఎంపీ లార్డ్ ఇంద్రజిత్ సింగ్ ఈ ఘటనకు సంబంధించి బ్రిటన్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో బ్రిటన్ ప్రస్తుత ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్ ఈ సంఘటనపై విచారణకు ఆదేశించారు.
         

»  అమృత్‌సర్ స్వర్ణ దేవాలయంలో తీవ్రవాదుల ఏరివేతకు 'ఆపరేషన్ బ్లూస్టార్' అని పేరు పెట్టారు.
జనవరి - 16
¤     సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసే క్రమంలో ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ)తో కలిసి సివిల్ సర్వీస్ అధికారుల్లో మానవ వనరుల నిర్వహణాభివృద్ధి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది.         
»  ఇందులో భాగంగా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్‌ల కోసం సిబ్బంది, శిక్షణ వ్యవహారాలశాఖ 37 పేజీల నిఘంటువును రూపొందించింది.         
»  ప్రజలే కేంద్రంగా పాలన సాగించాలని, పేదలు - వెనుకబడిన వర్గాలవారి అభ్యున్నతికి ప్రాధాన్యం ఇవ్వాలని సివిల్ సర్వీస్ అధికారులకు కేంద్ర ప్రభుత్వం ఈ నిఘంటువులో ఉద్భోదించింది. పేదలు, అట్టడుగు వర్గాలకు మరింత సమర్థంగా, పారదర్శకంగా, బాధ్యతగా సేవలు అందిస్తేనే సుపరిపాలన సాధ్యమవుతుందని పేర్కొంది.

¤     2014 జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఏ రోజైనా ప్రజల ఆర్థిక స్థితికి సంబంధించిన వివిధ కార్యక్రమాలపై ప్రత్యేక గ్రామసభ సమావేశాలు నిర్వహించాలని భారత ప్రభుత్వ పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ దేశంలోని అన్ని గ్రామ పంచాయతీలను కోరింది.         
»  సమావేశ తేదీలను జిల్లా, బ్లాక్‌స్థాయి అధికారులు నిర్ణయిస్తారు.
జనవరి - 17
¤     ప్రఖ్యాత జైపూర్ సాహితీ ఉత్సవం (జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ - జేఎల్ఎఫ్) ను జైపూర్‌లో నిర్వహించారు.         
»  నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.

¤     అంతర్జాతీయ గుర్తింపు ఉన్న కోర్సులు చదివేందుకు వీలు కలిగించే యాప్‌ను దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టారు.         
»  ఫైనాన్స్, అకౌంట్స్‌లో నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునే ఆసక్తి ఉన్నవారికోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ కోర్సును న్యూఢిల్లీలో బ్రిటన్ మంత్రి మాథ్యూ హాంకాక్ ఆవిష్కరించారు.         
»  మాసివ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సు (ఎంవోవోసీ)గా పిలిచే దీనికి సంబంధించిన వెబ్‌సైట్www.qualt.com జాతీయ నైపుణ్యాల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రారంభించారు.         
»  ఈ కోర్సు పూర్తిగా ఉచితం. దీనికి అసోసియేషన్ ఆఫ్ అకౌంటింగ్ టెక్నిషియన్ (ఏఏటీ) గుర్తింపు ఉంది.         
»  ఈ ఏడాది మార్చి నుంచి ప్రారంభం కానున్న ఈ కోర్సును ఏఏటీ ఇండియా యాప్ సహాయంతో పొందవచ్చు.

¤     దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా అందించే ఆహార ధాన్యాల తరలింపునకు ఇకపై సముద్ర మార్గాలను కూడా వినియోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలుత ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ రేవు నుంచి కేరళలోని కోచికి ప్రతినెలా 20,000 టన్నుల ధాన్యాన్ని నౌకల్లో తరలించనుంది.
జనవరి - 19
¤     ప్రభుత్వోద్యోగి అయిన భర్త జీతభత్యాల వివరాలను తెలుసుకునే హక్కు భార్యకు ఉంటుందని కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) స్పష్టం చేసింది. ఈ వివరాలను ఆర్‌టీఐ చట్టంలోని స్వచ్ఛంద బహిర్గత క్లాజు 4(1) (బి) (ఎక్స్) కింద సంబంధిత కార్యాలయాలు బహిరంగపరచాల్సిందేనని తేల్చి చెప్పింది.

¤     ఔషధ పరీక్షల్లో పాల్గొనే వారి నుంచి అంగీకారం తీసుకునే ప్రక్రియను ఇక నుంచి శ్రవణ, దృశ్య విధానాల్లో నమోదు చేయాలని కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీఓ) మార్గదర్శకాలను జారీ చేసింది.         
»  పరీక్షల స్థితిగతులపై అవగాహన కల్పించడం, లిఖిత పూర్వక సమ్మతి తీసుకోవడం వంటివన్నీ నమోదు చేయాలని ఔషధ పరీక్షలు చేసే సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆధారాలన్నిటినీ భద్రపరచాలని ఆదేశాల్లో పేర్కొంది.         
»  గతేడాది అక్టోబరు 22న సుప్రీంకోర్టు చేసిన సూచన మేరకు సీడీఎస్‌సీఓ ఈ ఆదేశాలు జారీ చేసింది.         
»  దేశంలో గత నాలుగున్నరేళ్లలో ఔషధ పరీక్షల్లో పాల్గొన్న సుమారు 2,234 మంది మృత్యువాత పడ్డారు.

¤     ప్రపంచంలో అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్‌గా ఎన్ఎస్ఈ (నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్) తన స్థానాన్ని నిలబెట్టుకుంది. లావాదేవీల సంఖ్య పరంగా వరుసగా రెండో ఏడాదీ (2013) అగ్రస్థానంలో నిలిచింది.         
»  ఎన్ఎస్ఈ లో గతేడాది దాదాపు 145 కోట్ల ఈక్విటీ లావాదేవీలు జరిగాయి. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇవి 3% ఎక్కువ. దీంతో ప్రపంచంలోని ఇతర ప్రధాన స్టాక్ ఎక్స్ఛేంజ్‌లతో పోలిస్తే ఎన్ఎస్ఈ లోనే అత్యధిక లావాదేవీలు జరిగినట్లు వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఎక్స్ఛేంజెస్ (డబ్ల్యూఎఫ్ఈ) ప్రకటించింది.         
»  న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌వైఎస్ఈ)ని చైనాకు చెందిన షెంజెన్ ఎక్స్ఛేంజ్ అధిగమించి రెండో స్థానంలో నిలిచింది. బీఎస్ఈ (బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్) మాత్రం ఎనిమిదో స్థానంలో నిలిచింది.         
»  టాప్-10లో ఎన్‌వైఎస్ఈ (3), షాంఘై (4), నాస్‌డాక్ (5), కొరియా ఎక్స్ఛేంజ్ (6), జపాన్ ఎక్స్ఛేంజ్ గ్రూప్ - టోక్యో (7), కెనడాకు చెందిన టీఎంఎక్స్ గ్రూప్ (9), లండన్ ఎస్ఈ గ్రూప్ (10) చోటు దక్కించుకున్నాయి.
జనవరి - 20
¤     జైనులను మైనారిటీ జాబితాలో చేరుస్తూ, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 50 లక్షల మంది జైనులకు ప్రయోజనం కలుగుతుంది.


¤     రైల్వే ఛార్జీలపై రైల్వే మంత్రిత్వ శాఖకు సలహా ఇచ్చేందుకు రైల్ టారిఫ్ అథారిటీ (ఆర్‌టీఏ)ను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
         

»   నిర్వహణకు అయ్యే ఖర్చులను, మార్కెట్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ఆర్‌టీఏ ఎప్పటికప్పుడు ఛార్జీల సవరణ సిఫార్సులు చేస్తుంది. ప్రస్తుత చట్టం ప్రకారం ఆర్‌టీఏ సిఫార్సులను పాటించడం రైల్వేకు తప్పనిసరి కాదు.


¤     జాతీయ నగర ఆరోగ్య మిషన్ పథకాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులాం నబీ ఆజాద్ బెంగళూరులో లాంఛనంగా ప్రారంభించారు.
         

»   దేశవ్యాప్తంగా 779 నగరాలు, పట్టణాల్లో జాతీయ నగర ఆరోగ్య మిషన్ పథకాన్ని అమల్లోకి తెస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. కనీసం 50 వేల జనాభా ఉన్న ప్రాంతాలకు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
         

»   ఈ పథకాన్ని దశలవారీగా ఏడు మహానగరాలతో పాటు ఇతర నగరాలు, పట్టణాలకు విస్తరించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.
         

»   ఈ పథకం కింద 22 కోట్ల మందికి ఆరోగ్య సేవల్ని అందించాలనేది లక్ష్యం.
జనవరి - 21
¤    ఉరిశిక్ష కోసం సుదీర్ఘకాలం పాటు ఎదురుచూసిన వ్యక్తికి మరణశిక్ష నుంచి మినహాయింపు ఇవ్వవచ్చని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చవచ్చని తెలిపింది.
        

»    వివిధ నేరాల్లో మరణశిక్షకు గురై రాష్ట్రపతికి క్షమాభిక్ష విజ్ఞప్తులు పెట్టుకుని, ఏళ్లకేళ్లు ఎదురుచూసిన 15 మంది నేరస్థులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. మరణశిక్షను యావజ్జీవ కారాగారవాసంగా మార్చాలని వేడుకున్నారు.
        

»    ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.సదాశివం నేతృత్వంలో జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ శివకీర్తిసింగ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ జరిపి, సంచలన తీర్పును వెల్లడించింది. మరణశిక్ష పడిన ఒక నేరస్థుడి క్షమాభిక్ష విజ్ఞప్తిపై నిర్ణయం తీసుకోవడంలో ప్రభుత్వం జాప్యం చేసినపుడు సదరు మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చవచ్చని తీర్పు చెప్పింది. ఈ మేరకు 15 మంది నేరస్థుల మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది.
        

»    క్షమాభిక్ష పిటిషన్లు, మరణశిక్ష అమలు వంటి అంశాలపై సుప్రీంకోర్టు తీర్పు కొత్త నిబంధనలను నిర్దేశించింది. మరణశిక్ష కోసం సుదీర్ఘకాలంపాటు ఎదురుచూడటమనేది నేరస్థులపై అమానవీయ ప్రభావం చూపుతుందని తీర్పులో పేర్కొంది. 'శారీరకంగా, మానసికంగా వారు తీవ్రవేదనకు, ఒత్తిడికి లోనవుతారు. ఇది చిత్రహింస లాంటిదే. వారి ప్రాథమిక హక్కులకు ఇది భంగకరం. ఈ విధంగా ఖైదీల ప్రమేయం ఎంత మాత్రం లేకుండానే శిక్ష అమలులో తీవ్ర జాప్యం జరిగినపుడు మరణశిక్షను తగ్గించాల్సిందే' అని పేర్కొంది.


¤     రాజ్యసభలో ఖాళీ కానున్న 55 స్థానాలకు సభ్యులను ఎన్నుకునేందుకు ఫిబ్రవరి 7న జరగాల్సిన ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు 16 రాష్ట్రాల నుంచి సభ్యులను ఎన్నుకునేందుకు ఎన్నికల కమిషన్ ప్రకటన జారీ చేసింది.
        

»    ఏప్రిల్ 2 - 12 తేదీల మధ్య 55 మంది రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ముగియనుండటంతో ఈ ఎన్నికలు జరుపుతున్నారు.

ఏ రాష్ట్రం నుంచి ఎన్నిస్థానాలకు?
జనవరి - 22
¤     వంటగ్యాస్ సకాలంలో అందక ఇబ్బందులెదుర్కొనే వినియోగదారులు తమ పంపిణీదారుపై అసంతృప్తిగా ఉంటే వేరే పంపిణీదారు పరిధిలోకి మారిపోవడానికి అవకాశం ఏర్పడింది.
        

»   ఈ మేరకు 'ఎల్‌పీజీ కనెక్షన్ పోర్టబిలిటీ'కి కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. గత ఏడాది అక్టోబరు నుంచి ప్రయోగాత్మకంగా 13 రాష్ట్రాల్లోని 24 జిల్లాల్లో ప్రవేశపెట్టిన ఈ విధానాన్ని ఇప్పుడు దేశంలోని 480 జిల్లాల్లో అమల్లోకి తెస్తున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ ప్రకటించారు.

¤     భూగర్భ ఖనిజ వనరులను గుర్తించే హెలికాప్టర్ 'గరుడ వసుధ'ను కేంద్ర గనుల శాఖ మంత్రి దిన్షా పటేల్ బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) కాంప్లెక్స్‌లో జాతికి అంకితం చేశారు.
       
 »   అత్యాధునిక సెన్సర్‌లతో పని చేసే ఈ హెలికాప్టర్‌ను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) అవసరాలకు వినియోగించనున్నారు.


¤      44 డీమ్డ్ యూనివర్సిటీలను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చాలనే నిర్ణయాన్ని పునరాలోచించాలని, యూజీసీ సూచనలు కూడా పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. ఆయా డీమ్డ్ విశ్వవిద్యాలయాల వైఫల్యాలను సమీక్షించి, రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
        

»    దేశంలోని 44 డీమ్డ్ విశ్వవిద్యాలయాలు తొమ్మిది అంశాల్లో యూజీసీ మార్గదర్శకాలు పాటించడం లేదని, వాటిని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని పి.ఎన్.టాండన్ కమిటీ సూచించింది. టాండన్ కమిటీ దేశంలోని 126 డీమ్డ్ యూనివర్సిటీలను పరిశీలించి, వాటిని ఏ, బీ, సీ లుగా వర్గీకరించింది. ఈ 44 డీమ్డ్ యూనివర్సిటీలకు సీ కేటగిరీ ఇచ్చింది. ఏ, బీ లకు డీమ్డ్ హోదా కొనసాగించవచ్చని పేర్కొంది.
జనవరి - 23
¤      సంఘటిత రంగంలో కార్మికులకు నెలకు కనీసం రూ.వెయ్యి పింఛను అందించాలనే ప్రతిపాదనకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. దీనివల్ల 27 లక్షల పింఛన్ దారులకు వెంటనే ప్రయోజనం సిద్ధించనుంది.
       

 »   ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఫింఛన్ దారులు ప్రయోజనం పొందే అవకాశం ఉంది.
        

»   ఉద్యోగుల భవిష్యనిధి పథకం కింద ప్రస్తుమున్న వేతన పరిమితిని నెలకు రూ.6,500 నుంచి నెలకు రూ.15 వేలకు పెంచాలనే ప్రతిపాదనకు సైతం ఆర్థిక మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది.
        

»   ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత వేతన పరిమితిపై నిర్ణయం అమల్లోకి రానుంది.


¤      రైల్లో అత్యవసర పరిస్థితులు ఎదురైతే భద్రతా సిబ్బంది ఎక్కడుంటారో తెలుసుకోవడం కష్టమే. రైల్వేశాఖ ఈ సమస్యకు పరిష్కారం చూపింది.
        

»   అన్ని రైళ్లలో కోచ్ నెంబరు ఎస్-1, బెర్త్ నెంబరు 71 ని భద్రతా సిబ్బందికి కేటాయించాలని నిర్ణయించింది. భద్రతా సిబ్బందికి ఇలా ఓ బెర్తును కేటాయిస్తే ప్రయాణికులు వారిని సులభంగా చేరుకోగలిగే అవకాశం ఉంటుందనే ఆలోచనతో ఈ ఏర్పాటు చేసింది.
       

 »   ప్రస్తుతం రైల్వే రక్షకదళం (ఆర్‌పీఎఫ్) ప్రభుత్వ రైల్వే పోలీసు (జీఆర్‌పీ) సిబ్బంది 3475 రైళ్లలో ప్రయాణికులకు భద్రత కల్పిస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైన మార్గాల్లో ప్రయాణించే రైళ్లలో 18 మంది, సాధారణ రైళ్లలో నలుగురు చొప్పున భద్రతా సిబ్బంది ఉంటారు.


¤      నేతాజీ సుభాష్ చంద్రబోస్ 117వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా నిర్వహించారు.

¤       జాతీయ నవకల్పన మండలి (ఎన్ఐసీ) ఢిల్లీ కేంద్రాన్ని ఎన్ఐసీ అధ్యక్షుడు, ప్రధానమంత్రి సలహాదారు శామ్ పిట్రోడా ప్రారంభించారు. ఇప్పటికే బెంగళూరు, కోల్‌కతాల్లో ఇలాంటి హబ్‌లు ఉన్నాయి. తాజాగా ప్రారంభిన హబ్ మూడోది.
        
»   విద్యార్థులు, పరిశోధనల అవసరాలను తీర్చే లక్ష్యంతో, ఎన్ఐసీ సూచనల మేరకు 'నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం (ఎన్‌సీఎస్ఎం)' వీటిని ఏర్పాటు చేస్తోంది. దేశవ్యాప్తంగా 100 నవకల్పనా కేంద్రాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు శామ్ పిట్రోడా ప్రకటించారు.
జనవరి - 24
¤       గ్రామీణులకు న్యాయసహాయం అందించేందుకు దేశవ్యాప్తంగా 'లీగల్ ఎయిడ్ క్లినిక్‌'లను భారత ప్రధాన న్యాయమూర్తి, జాతీయ న్యాయసేవల ప్రాథికార సంస్థ ప్యాట్రన్ ఇన్ చీఫ్ జస్టిస్ పి.సదాశివం, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ జస్టిస్ ఆర్.ఎం.లోధా ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.
        

»   ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల తరహాలో దేశవ్యాప్తంగా ఈ క్లినిక్‌లను ప్రారంభించారు. మొత్తం 2,648 లీగల్ క్లినిక్‌లను ఏర్పాటు చేశారు.
        

»    మన రాష్ట్రానికి సంబంధించిన కార్యక్రమంలో హైదరాబాద్‌లో రాష్ట్ర న్యాయసేవల ప్రాథికార సంస్థ ప్యాట్రన్ ఇన్ చీఫ్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా, ఎగ్జిక్యూటివ్ ఛైర్‌పర్సన్ జస్టిస్ జి.రోహిణి తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్రంలోని వివిధ గ్రామాల్లో ఇప్పటికే 735 లీగల్ క్లినిక్‌లు ఉన్నాయని, కొత్తగా 569 క్లినిక్‌లను ఏర్పాటు చేయనున్నట్లు జస్టిస్ కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా వెల్లడించారు.
        

»   ఈ లీగల్ క్లినిక్‌లు కేవలం న్యాయ సలహాలు ఇవ్వడమే కాకుండా, రేషన్ కార్డులు, ఓటర్ గుర్తింపు కార్డులు, ఆధార్ కార్డులు, గ్యాస్ కనెక్షన్, వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయంలోనూ తోడ్పడతాయి.
జనవరి - 26
¤       65వ గణతంత్ర వేడుకలను యావత్ భారతదేశం అత్యంత ఘనంగా జరుపుకొంది.        
»   ఢిల్లీలోని రైసినా హిల్స్ నుంచి ఎర్రకోట వరకు 8 కిలోమీటర్ల దూరం రాజ్‌పథ్ మార్గంలో కొనసాగిన కవాతులు వేలాదిగా తరలివచ్చిన ప్రజలను అబ్బురపరిచాయి.        
»   జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (ఢిల్లీ), లెఫ్టినెంట్ జనరల్ సుబ్రతో మిత్ర నేతృత్వంలోని సైనిక, పోలీసు దళాల నుంచి త్రివిధ దళాధిపతి, రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
        
»   ఈ వేడుకలకు జపాన్ ప్రధానమంత్రి షింజో అబే ప్రధాన అతిథిగా హాజరయ్యారు. జపాన్ ప్రధాని భారత గణతంత్ర ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొనడం ఇదే ప్రథమం. ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తదితర ప్రముఖులు వేడుకల్లో పాల్గొన్నారు.
        
»   గణతంత్ర దినోత్సవ విశేషాలను బదిరులకు అందించే ఉద్దేశంతో మొదటిసారిగా దూరదర్శన్‌కు చెందిన మూడు ఛానెళ్లు (డీడీ న్యూస్, భారతి, ఉర్దూ) ప్రత్యేకంగా సంకేత భాషలో ప్రసారాలు చేశాయి.రాష్ట్రంలో గణతంత్ర దినోత్సవం¤       రాష్ట్ర వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్‌లో జరిగిన వేడుకల్లో గవర్నర్ నరసింహన్ పాల్గొని, ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సభాపతి నాదెండ్ల మనోహర్ సహా పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
జనవరి - 27
¤       ఆపదలో ఉన్నవారు తక్షణం రక్షణ, ఇతర సహాయం పొందేందుకు వీలుగా బీహార్ పోలీసులు వినూత్న విధానాన్ని ప్రవేశపెట్టారు.        
»   దర్భాంగా జోన్ ఐజీగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన అరవింద్ పాండే మొఘల్ చక్రవర్తి జహంగీర్ హయాంలో ఉన్న 'న్యాయగంట' స్ఫూర్తిగా దీనికి శ్రీకారం చుట్టారు. తన ఇంటితో సహా జోన్‌లోని పోలీస్ అధికారులందరి ఇళ్ల వద్ద 'జహంగీర్ గంట'లను ఏర్పాటు చేయించారు. ప్రజలు వీటిని సులభంగా గుర్తించేందుకు వీలుగా కింది భాగంలో 'జహంగీర్ గంట' అని రాయించారు.        
»   కార్యాలయ పని వేళలతో సంబంధం లేకుండా ఆపదలో ఉన్నవారు ఎప్పుడైనా వీటిని మోగించి న్యాయం పొందవచ్చని పోలీసులు వెల్లడించారు.

¤
       ఢిల్లీ, హైదరాబాద్, ముంబయి, బెంగళూరు విమానాశ్రయాలకు రెండతస్థుల విమానం 'ఎ-380' సేవలు అందుబాటులోకి రానున్నాయి.
       
»
   అయిదేళ్ల క్రితం విధించిన నిషేధాన్ని ఎత్తివేసి ఎ-380 విమానం రాకపోకలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.
        
»   ప్రభుత్వ నిర్ణయంతో సింగపూర్ ఎయిర్‌లైన్స్, ఎమిరేట్స్, లుఫ్తాన్సా వంటి విమానయాన సంస్థలు ఎ-380 విమానాలతో సేవలను అందించే వీలుంది. ఇంత పెద్ద విమానం రాకపోకలకు అనువైన మౌలిక సదుపాయాలు ఈ నాలుగు విమానాశ్రయాల్లో ఉన్నందునే అనుమతించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.       
 »   ఎకానమీ క్లాస్ మాత్రమే ఉండే ఎ-380 విమానాల్లో 850 మంది ప్రయాణించవచ్చు.

¤       పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన పార్లమెంటరీ బృందం తన నివేదికను ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సమర్పించింది.        
»   ఈ నివేదిక ప్రకారం దేశంలో 7.5 కోట్ల కుటుంబాలు విద్యుత్ వెలుగులకు నోచుకోలేదు. గ్రామీణ పాంతాల్లోని కుటుంబాల నెలవారీ తలసరి విద్యుత్ వినియోగం కేవలం ఎనిమిది యూనిట్లు. పట్టణ ప్రాంతాల్లో ఇది 24 యూనిట్లుగా ఉంది.        
»   ఈ పార్లమెంటరీ బృందంలో రాష్ట్రం నుంచి కాంగ్రెస్ ఎంపీలు జె.డి.శీలం, బొత్స ఝాన్సీలక్ష్మి కూడా ఉన్నారు.        
»   సత్వరమే 'జాతీయ శుద్ధ ఇంధన అందుబాటు పథకం' ఏర్పాటు చేయాలంటూ ఈ బృందం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
జనవరి - 28
¤       జాతీయ క్యాడెట్ కార్ప్స్ (ఎన్‌సీసీ) వార్షిక ర్యాలీని న్యూఢిల్లీలో నిర్వహించారు.
       

»   గత పదేళ్లుగా క్రమం తప్పకుండా ఈ కార్యక్రమానికి హాజరవుతున్న ప్రధాని మన్మోహన్‌సింగ్ ఈ సారీ హాజరయ్యారు.


¤       భూసార పరీక్ష కేంద్రాల ఏర్పాటుకు, ప్రస్తుతమున్న వాటి సామర్థ్యం పెంచడానికి కేంద్రం కొత్త పథకాన్ని రూపొందించింది.
       

»   'భూ ఆరోగ్య నిర్వహణ' పేరిట అమలయ్యే ఈ పథకం కింద దేశవ్యాప్తంగా ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో వంద భూసార పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. రసాయన ఎరువుల వినియోగాన్ని నియంత్రించడం ఈ కార్యక్రమం ప్రధానోద్దేశం. దీని అమలుకు, స్థానిక అవసరాల ప్రకారం మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్ర వ్యవసాయ శాఖ రాష్ట్రాలను ఆదేశించింది.
       

»   ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో 1,087 భూసార పరీక్ష కేంద్రాలున్నాయి. కొత్తగా ఏర్పాటయ్యే వందతో కలిపి ఇవి 1,187 కు పెరుగుతాయి.
జనవరి - 29
¤       మూడు దశాబ్దాల తర్వాత భారత రాష్ట్రపతి గుర్రపు బగ్గీ బహిరంగ వేడుకలో దర్శనమిచ్చింది.
      

»   రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చారిత్రక గుర్రపు బగ్గీలో గణతంత్ర దినోత్సవ ముగింపు వేడుకలకు హాజరయ్యారు.
     
»
   ఆరు గుర్రాలతో నడిచే ఈ గుర్రపు బగ్గీని బ్రిటిష్ పాలనలో వైశ్రాయ్ వాడేవారు. భద్రత కారణాల దృష్ట్యా మూడు దశాబ్దాల క్రితం గుర్రపు బగ్గీ వాడకాన్ని నిలిపివేశారు. చివరిసారిగా అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఈ బగ్గీని వినియోగించారు.

¤
       ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ న్యూఢిల్లీలో నేషనల్ వక్ఫ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌ను ప్రారంభించారు.
      »   యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
జనవరి - 30
¤       జాతిపిత మహాత్మాగాంధీ 66వ వర్థంతిని ఘనంగా నిర్వహించారు.      
»   న్యూఢిల్లీలోని మహాత్మాగాంధీ సమాధి రాజ్‌ఘాట్ వద్ద రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మన్మోహన్ సింగ్ ఘనంగా గాంధీకి నివాళులు అర్పించారు.

¤       13 రాష్ట్రాల్లో 60 కులాల చేర్పులు, తొలగింపులకు సంబంధించి ఓబీసీ కేంద్ర జాబితాలో సవరణల నిమిత్తం జాతీయ వెనుకబడిన తరగతుల సంఘం చేసిన సిఫార్సులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.      
»   ఓబీసీ కులాలకు సంబంధించిన మార్పులు చేపట్టే 13 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి.
జనవరి - 31
¤       వివిధ రాష్ట్రాల నుంచి రాజ్యసభకు 37 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్‌సీపీ అధినేత శరద్‌పవార్; కాంగ్రెస్ నేతలు మోతీలాల్ వోరా, దిగ్విజయ్‌సింగ్, మురళీ దేవ్‌రా, కుమారి సెల్జా; భాజపాకు చెందిన విజయ్‌గోయల్ తదితర ప్రముఖులు వీరిలో ఉన్నారు. మిగతా 18 స్థానాల (ఆంధ్రప్రదేశ్ 6, పశ్చిమబెంగాల్ 5, ఒడిశా 4, అసోం 3) కు ఫిబ్రవరి 7న ఎన్నికలు జరగనున్నాయి.
¤       గర్భిణులు, తల్లులు, శిశువులకు ఎప్పటికప్పుడు ఆరోగ్య జాగ్రత్తలు, టీకాల సమాచారం అందించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ న్యూఢిల్లీలో ఆధునిక మాతాశిశు సమాచార సేకరణ కేంద్రాన్ని ప్రారంభించింది.       
»   కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి గులాం నబీ ఆజాద్ ఆ కేంద్రాన్ని ప్రారంభించారు.
¤       ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ తన పదవికి రాజీనామా చేశాడు.