జనవరి - 2014 రాష్ట్రీయం


జనవరి - 1
¤ ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు 'ఈ గవర్నెన్స్‌'ను విస్తృతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. అన్ని ప్రభుత్వ శాఖలు, జిల్లా కార్యాలయాలను దీని పరిధిలోకి తెచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేసింది.
          
» 'మీ సేవ' కేంద్రాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాటికి అదనంగా 2014 మార్చి నుంచి మరో 150 రకాల సేవలను తీసుకురావడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

¤ సంక్షేమ శాఖల ద్వారా చేపట్టనున్న స్వయం ఉపాధి పథకాల్లో గరిష్ఠ రాయితీని రూ.లక్ష గా నిర్ణయిస్తూ, ప్రభ్వుతం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం 30% - 40% వరకు ఉన్న రాయితీని 50% - 60% కు మార్చింది. సబ్సిడీ, ఇతర అంశాలపై మార్గదర్శకాలను వెలువరించింది. ఎస్సీ, ఎస్టీల ఉపాధి పథకంలో రూ.లక్ష పరిమితితో 60% సబ్సిడీ, బీసీల పథకంలో రూ.లక్ష పరిమితితో 50% సబ్సిడీ ఇవ్వాలని సూచించింది. 21-45 ఏళ్ల మధ్య వయసున్నవారు ఈ పథకాలకు అర్హులు.

¤ రాష్ట్రంలో 2013 సంవత్సరానికి స్త్రీశక్తి పురస్కారాల కోసం మంత్రి సునీతా లక్ష్మారెడ్డి అధ్యక్షతన ఎంపిక కమిటీ ఏర్పాటైంది.
జనవరి - 2
¤ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి తన నుంచి శాసనసభ వ్యవహారాల శాఖను తప్పించిన తీరుకు తీవ్ర మనస్తాపం చెందిన పౌరసరఫరాల శాఖ మంత్రి దుద్దిళ్లశ్రీధర్‌బాబు మంత్రి పదవికి రాజీనామా చేశారు.

¤ రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు 27% మధ్యంతర భృతి (ఐఆర్)ని ప్రభుత్వం ఖరారు చేసింది.          
» కొత్త వేతనాలను స్థిరీకరించేవరకూ ఆయా ఉద్యోగుల మూలవేతనం, పింఛన్ దారుల మూల పింఛన్‌లో 27% ప్రతినెలా అదనంగా ఐఆర్‌గా అందుతుంది. ఈ పెంపు 2014 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఐఆర్ కారణంగా ప్రభుత్వం అదనంగా ఏటా రూ.7,681 కోట్లను భరించాల్సి ఉంటుంది.          
» ఐఆర్‌ను 27 శాతంగా ఇవ్వడం రాష్ట్రంలో ఇదే మొదటిసారి. 
జనవరి - 3
¤ శాసనసభలో రాష్ట్ర విభజన చర్చపై అనుకూల, వ్యతిరేక వర్గాల వ్యూహాల మధ్య మలివిడత సమావేశాలు మొదలయ్యాయి.          
» సభ్యుల తీవ్ర నిరసనల మధ్య ఎలాంటి చర్చలూ చేపట్టకుండానే శాసనసభ, శాసనమండలి సమావేశాలు మరుసటి రోజుకు వాయిదా పడ్డాయి.

¤ రాష్ట్ర ప్రభుత్వం 2013 ఏడాదికి 119 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించింది.
జనవరి - 6
¤  రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ) వేతనాన్ని పెంచడానికి రెవెన్యూ శాఖ నిర్ణయించింది.
          

»   గ్రామ సేవకుల వేతనం మూడు వేల నుంచి అయిదు వేల రూపాయలకు పెంచుతూ రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి దస్త్రంపై సంతకం చేశారు.
         
» 
 ప్రభుత్వ నిర్ణయంతో 51 వేల మందికి పైగా ప్రయోజనం చేకూరుతుంది.
జనవరి - 8
¤    రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో ఎట్టకేలకు చర్చ ప్రారంభమైంది. వైకాపా సభ్యుల ఆందోళన మధ్య, స్పీకర్ మనోహర్ ఆదేశాల మేరకు మంత్రి వట్టి వసంతకుమార్ బిల్లుపై చర్చను ప్రారంభించారు.
          
»  ఆయన ప్రసంగిస్తుండగానే వైకాపా సభ్యులు బిల్లు ప్రతులను చించి, నినాదాలు చేస్తూ ఆటంకం కలిగించడంతో సభను స్పీకర్ తదుపరి రోజుకు వాయిదా వేశారు.
          

»  రాష్ట్ర విభజన బిల్లును తాను వ్యతిరేకిస్తున్నానని మంత్రి వసంతకుమార్ తెలిపారు. రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా, ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాల ప్రజల మనోభావాలకు విరుద్ధంగా విభజన జరుగుతోందని తెలిపారు. విభజనతో ఆర్థికంగా, నదీ జలాల విషయంలో తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెప్పారు. సీమాంధ్ర ప్రజలు దీన్ని ఆమోదించరన్నారు.


¤     ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించ తలపెట్టిన గేమింగ్, యానిమేషన్, మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ (GAME - గేమ్) ప్రాజెక్టుకు హైదరాబాద్‌లోని రాయదుర్గంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
          

»  30 ఎకరాల స్థలంలో దీన్ని నిర్మిస్తున్నారు. రూ.350 కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుతో 15 వేల మందికి ఉపాధి లభించనుంది.
జనవరి - 10
¤     నెల్లూరుజిల్లా దుగరాజపట్నం భారీ ఓడరేవు నిర్మాణానికి పర్యావరణ అనుమతి లభించింది. ఇందుకోసం చరిత్రాత్మక పులికాట్ సరస్సు హరిత రక్షిత ప్రాంతం (బఫర్ జోన్) పరిధిని కుదించేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది.          
»  ప్రస్తుతం ఉన్న 10 కిలోమీటర్ల పరిధిని రెండు కిలోమీటర్లకు కుదించాలనే ప్రతిపాదనపై ప్రకటన జారీ చేసింది. ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం తుది ఉత్తర్వులు ఇవ్వాలని నిర్ణయించింది.          
»  ఇటీవలే కేంద్ర పర్యావరణ శాఖ మంత్రిగా బాధ్యలు చేపట్టిన వీరప్పమొయిలీ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశం ఈ ఓడరేవు నిర్మాణానికి పర్యావరణ అనుమతి మంజూరు చేయాలని నిర్ణయించింది.
జనవరి - 11
¤  హైదరాబాద్‌లో హైటెక్ సిటీ సమీపంలోని ఖానామెట్ వద్ద 185 ఎకరాల్లో ఒక మినీ నగరాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.          
»  అంతర్జాతీయ ప్రమాణాలతో, కాలుష్య రహితంగా రూ.2 వేల కోట్లతో రవాణా ఆధారిత అభివృద్ధి (ట్రాన్సిట్ ఓరియెంటెడ్ డెవలప్‌మెంట్ - టీవోడీ) ప్రాజెక్టుల్లో భాగంగా దీన్ని అభివృద్ధి చేయాలని భావిస్తోంది. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ), హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టును నిర్మించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

¤  శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో పక్షుల పండగను నిర్వహించారు.
జనవరి - 13
¤  గుట్కా, పాన్ మసాలా, నమిలే పొగాకు వంటి ఉత్పత్తులపై విధించిన నిషేధాన్ని, రాష్ట్ర ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. ఖైనీ, ఖారా, సుగంధ (సెంటెడ్/ ఫ్లేవర్డ్) పొగాకు వంటివి కూడా ఈ జాబితాలో ఉన్నాయి. వీటి ఉత్పత్తి, నిల్వ, పంపిణీ, విక్రయం వంటివన్నీ నిషిద్ధాలే. దీన్ని ఉల్లంఘించినవారు చట్టప్రకారం శిక్షార్హులు.
          

»  ఆహారభద్రత, ప్రమాణాల చట్టం-2006ను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం 2013 జనవరి 9 నుంచి రాష్ట్రంలో గుట్కా, పాన్ మసాలాపై సంవత్సరంపాటు నిషేధం విధించింది. ఆ గడువు ముగియడంతో నిషేధాన్ని మరో ఏడాది పొడిగిస్తూ ఆహార భద్రత విభాగం కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
జనవరి - 16
¤  బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్ తీర్పుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ట్రైబ్యునల్ తీర్పువల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని, దీనిపై తమ వాదన వినిపించుకునేందుకు అవకాశం కల్పించాలని కోరింది. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పు అంతర్‌రాష్ట్ర జల వివాద చట్టంలోని అనేక నిబంధనలను ఉల్లంఘించిందని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్.ఎల్.పి.)లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

¤  'మీ సేవ' పరిధిలోకి కేంద్ర విద్యుత్ పంపిణీ సంస్థ (సీపీడీసీఎల్)కు చెందిన 11 సేవలను తాజాగా తీసుకువచ్చారు.          
»  ఇకపై కొత్త విద్యుత్ కనెక్షన్, పేరు మార్పు, సామర్థ్యం పెంపు, కేటగిరీలో మార్పు, వ్యవసాయ కనెక్షన్లు తదితరాలను 'మీ సేవ' కార్యాలయాల్లో పొందవచ్చు. దీంతో మొత్తం సేవల సంఖ్య 233కు చేరింది.
జనవరి - 18
¤   రాష్ట్రంలో ఆరు భారీ పరిశ్రమలకు పారిశ్రామిక రాయితీలను ఇచ్చేందుకు పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్.ఐ.పి.బి.) అనుమతి ఇచ్చింది. 50% వ్యాట్ మినహాయింపుతో పాటు పారిశ్రామిక విధానం కింద ఇతర రాయితీలను ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది.
          

»  ఈ పరిశ్రమల ద్వారా రూ.6,500 కోట్ల పెట్టుబడులను, 18,500 మందికి ఉపాధిని అంచనా వేసింది.
          

»  ఈ పరిశ్రమల్లో మూడు చిత్తూరు జిల్లా శ్రీ సిటీలో ఏర్పాటు అవుతున్నాయి. శ్రీ సిటీలో క్యాడ్‌బరీ రూ.2,500 కోట్లు, పెప్సికో రూ.1,200 కోట్లు, కోల్గేట్ రూ.275 కోట్ల పెట్టుబడులను ప్రతిపాదించాయి. జాన్సన్ అండ్ జాన్సన్ మహబూబ్‌నగర్ జిల్లాలో రూ.400 కోట్లు, అనంతపురం జిల్లా గెర్డావులో రూ.1,270 కోట్ల పెట్టుబడులను ప్రతిపాదించింది. ఖమ్మం జిల్లా భద్రాచలంలో ఐటీసీ రూ.828 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమను విస్తరించనుంది.
          

»  2010-15 పారిశ్రామిక విధానం కింద వీటికి రాయితీలు ఇచ్చేందుకు సమావేశం తీర్మానించింది.
జనవరి - 20
¤    తిరుపతి చుట్టుపక్కల ఉన్న 42 మురికివాడలను అభివృద్ధి చేయడానికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆమోదముద్ర వేసింది. దీనికి రాజీవ్ ఆవాస్ యోజన (రే) కింద నిధులు ఇవ్వనుంది. ఈ 42 మురికివాడల్లో 7 వేల ఇళ్ల నిర్మాణానికి ఒక్కోదానికి రూ.4 లక్షల చొప్పున పట్టణాభివృద్ధి శాఖ మంజూరు చేయనుంది. ఆధ్యాత్మిక నగరం తిరుపతి అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.


¤     రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని గవర్నర్ నరసింహన్ ఆవిష్కరించారు.
          
»   జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం పక్కనే నెలకొల్పిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో గవర్నర్‌తో పాటు సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి, స్పీకర్ నాదెండ్ల మనోహర్, శాసనమండలి ఛైర్మన్ చక్రపాణి, శాసనమండలి సభానాయకుడు సి.రామచంద్రయ్య, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శైలజానాథ్, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు తదితరులు పాల్గొన్నారు.
జనవరి - 21
¤     మెదక్ జిల్లా జహీరాబాద్‌లో మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ ఏర్పాటు చేస్తున్న తేలికపాటి వాణిజ్య, ప్రయాణ వాహనాల పరిశ్రమకు వందశాతం పన్ను రాయితీకి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


¤      గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ) వేతనం రెట్టింపైంది. రూ.3 వేలుగా ఉన్న వారి వేతనాన్ని రూ.6 వేలకు పెంచుతూ రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి బి.ఆర్.మీనా ఉత్తర్వులు జారీ చేశారు.
         

»   పెంపు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. దీనివల్ల 56 వేల మంది వీఆర్ఏ లకు ప్రయోజనం కలుగుతుంది.
జనవరి - 22
¤     జాతీయ పట్టణ ఆరోగ్య పథకం (ఎన్‌యూహెచ్ఎం) కింద పట్టణ ప్రాంతాల్లో వైద్య సేవలను మెరుగుపరచడానికి అయ్యే వ్యయంలో 25% నిధులను ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
        

»   2013-14 ఆర్థిక సంవత్సరంలో దీనికోసం రూ.26.70 కోట్లు మంజూరు చేస్తూ, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
జనవరి - 23
¤      గతేడాది అక్టోబరు నెలలో రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన పైలిన్ తుపాను ప్రభావం వల్ల దెబ్బ తిన్న మండలాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. 17 జిల్లాల్లోని 801 మండలాలను ఇందుకు ఎంపిక చేశారు.
జనవరి - 26
¤      రాష్ట్రం మొత్తం అప్పులు రూ.1.94 లక్షల కోట్లుగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. దీన్ని ప్రస్తుత రాష్ట్ర జనాభా 8.46 కోట్లకు విభజిస్తే తలసరి అప్పు రూ.22,938 గా తేలింది.        
»   రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్‌లో చూపించిన మొత్తంతో పోలిస్తే ఈ తలసరి అప్పు రూ.1,705 ఎక్కువ.        
»   రాష్ట్ర ప్రస్తుత బడ్జెట్ ప్రకారం మార్చి నెలాఖరుకు అప్పులు రూ.1.79 లక్షల కోట్లకు చేరతాయి. ఆర్థిక సంస్థలకు బాండ్లు విక్రయించి తెచ్చే మొత్తాలు, కేంద్ర రుణాలు, చిన్న పొదుపు మొత్తాలు, ఉద్యోగుల భవిష్యనిధి, విదేశీ అప్పులు తదితరాలు వీటిలో చేరి ఉన్నాయి. దీని ప్రకారం తలసరి అప్పు రూ.21,233 గా తేలుతుంది.        
»   ఆర్‌బీఐ తాజా విశ్లేషణ ప్రకారం దేశంలో అధిక అప్పుల భారం ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో ఉంది. మొదటి మూడు స్థానాల్లో వరుసగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ నిలిచాయి.
జనవరి - 27
¤      కృష్ణాజిల్లాలోని కొండపల్లి, ఇబ్రహీంపట్నం గ్రామ పంచాయితీల్లో పట్టణ స్థాయి సౌకర్యాలు కల్పించే ప్రొవిజన్ ఆఫ్ అర్బన్ ఎమినిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్ (PURA - పుర) పథకం అమలు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చాయి.        
»   ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టే రూ.157 కోట్ల పథకానికి సంబంధించిన అవగాహన ఒప్పందంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ప్రతినిధులు న్యూఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేష్, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ సమక్షంలో సంతకాలు చేశారు.

¤      జపాన్‌కు చెందిన ప్రసిద్ధ వాహన తయారీ సంస్థ ఇసుజు మోటార్స్ చిత్తూరు జిల్లా శ్రీసిటీలో ఏర్పాటు చేయనున్న ప్లాంట్‌కు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి హైదరాబాద్‌లోని ఒక హోటల్‌లో శంకుస్థాపన చేశారు.
        

»   107 ఎకరాల్లో రూ.3,000 కోట్ల పెట్టుబడితో ఏటా 1.20 లక్షల ట్రక్కులు, తేలికపాటి వాణిజ్య వాహనాల తయారీ సామర్థ్యం ఉన్న సంస్థను ఇసుజు నిర్మించనుంది. ఇందులో 3,000 మందికి ఉపాధి లభిస్తుంది.

        
»   రాష్ట్రంలో ఏర్పాటవుతున్న మొదటి వాహన తయారీ సంస్థ ఇదే కావడం విశేషం.        
»   ఇసుజు మోటార్స్ అధ్యక్షుడు సుసుము హుసాయ్        
»   సంస్థ భారత్ విభాగం సీఎండీ టకాషి కికుచి.

¤      ప్రతిష్ఠాత్మక ట్రిపుల్ ఐటీ శిలాఫలకాన్ని కాకినాడ జేఎన్‌టీయూ క్రీడామైదానంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఎం.ఎం.పళ్లంరాజు ఆవిష్కరించారు.        
»   తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలంలో సుమారు రూ.180 కోట్లతో దీన్ని ఏర్పాటు చేయనున్నారు.        
»   దేశవ్యాప్తంగా కొత్తగా 20 ట్రిపుల్ ఐటీలు ఏర్పాటు కానున్నాయి.
జనవరి - 28
¤      మన రాష్ట్రం నుంచి సైన్యంలో చేరి, శత్రువులతో పోరాటంలో అమరులైన వారికి ఇచ్చే పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచింది. ఇప్పటివరకూ పోరాటంలో కన్నుమూసిన వారికి రూ.1 లక్ష పరిహారంగా ఇస్తున్నారు. ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.5 లక్షలకు పెంచారు.
       

»     రెండు అవయవాలు పోగొట్టుకుని శాశ్వత వైకల్యాన్ని పొందినవాళ్లు, చూపు కోల్పోయినవాళ్లకు ఇప్పటివరకూ రూ.40 వేలు ఇస్తున్నారు. ఆ మొత్తాన్ని రూ.3 లక్షలు చేశారు. ఒక అవయవం పోగొట్టుకున్నవాళ్లకీ, ఒక కంటి చూపు దూరమైన వాళ్లకీ, వేళ్లు, పాదాలు దెబ్బతిన్నవాళ్లకి ఇస్తున్న రూ.20 వేలను ఇకపై రూ.2 లక్షలకు పెంచాలని నిర్ణయించారు. పోరాటంలో తుపాకీ తూటా గాయాలైన వాళ్లు, ఒళ్లు కాలిన వాళ్లు, ఇతరత్రా ప్రమాదాల పాలైన వారికి రూ.10 వేలు ఇస్తున్నారు. ఆ మొత్తాన్ని ఇకపై రూ.1 లక్షకు పెంచారు.
జనవరి - 29
¤       హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మౌలిక సదుపాయాల అభివృద్ధికి జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ 1,336 కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించింది.
      

»     ఈ ఏడాది ప్రారంభంలో భారత్, జపాన్ ప్రధానుల మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా ఈ రుణం అందుబాటులోకి వస్తుంది.
జనవరి - 30
¤       ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును శాసనసభ, శాసనమండలి తిరస్కరించాయి. బిల్లును తిరస్కరించమని కోరుతూ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఇచ్చిన నోటీసు ఆధారంగా శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది.      
»     శాసనమండలిలోనూ మంత్రి రామచంద్రయ్య ఇచ్చిన నోటీసు ఆధారంగా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఛైర్మన్ చక్రపాణి మండలి ముందు ఉంచగా, ఆమోదం లభించింది.      
»     దీంతో సభ్యులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, రాతపూర్వకంగా ఇచ్చిన సవరణలతో పాటు, బిల్లును తిరస్కరిస్తూ, ఉభయసభలు చేసిన తీర్మానాలు రాష్ట్రపతికి వెళ్లనున్నాయి.      
»     శాసనసభ్యుల అభిప్రాయం తెలపాలని కోరుతూ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పంపిన ఆంధ్రప్రదేశ్ పునర్య్వవస్థీకరణ ముసాయిదా బిల్లు-2013 ను డిసెంబరు 16న శాసనసభలో ప్రవేశపెట్టారు.

¤       ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్‌లో ఏటా నిర్వహించే నాగోబా జాతర ప్రారంభమైంది.
జనవరి - 31
¤       మూడు రోజుల పాటు నిర్వహించే చిరుధాన్యాల పండుగను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మినారాయణ హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఆచార్య ఎన్.జి.రంగా విశ్వవిద్యాలయంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో జొన్న, సజ్జ, రాగి, కొర్ర, వరి, సామ, గోధుమ తదితర చిరు ధాన్యాలను వినియోగించే విధానాన్ని తెలియజేశారు.