మార్చి - 2014 జాతీయం

మార్చి - 1
¤ షెడ్యూల్డ్ కులాలు, సఫాయి కర్మచారీలు, వెనుకబడిన తరగతులకు చెందిన వ్యక్తులు, ప్రత్యేకంగా సమర్థులైన వారికోసం సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ రూపొందించిన 'స్వావలంబన్' కార్యక్రమాన్ని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత, రైల్వే శాఖల మంత్రి మల్లికార్జున్ ఖర్గే బెంగళూరులోని కోదండరాంపురంలో ప్రారంభించారు.
   
»    'స్వావలంబన్' కార్యక్రమంలో భాగంగా వ్యక్తిగత పారిశుద్ధ్య కార్మికులకు పునరావాసం, నైపుణ్య శిక్షణ ఆఫర్లు, స్వయం ఉపాధి రుణం, చెక్కుల పంపిణీ లాంటి పనులు చేపడతారు.
మార్చి - 2
¤  రాష్ట్ర విభజన బిల్లు చట్టరూపం దాల్చిన మరుసటి రోజే కేంద్ర ప్రభుత్వం దానికి రెండు సవరణలు ప్రతిపాదించింది. వాటితో పాటు ఫిబ్రవరి 20వ తేదీన రాజ్యసభలో సీమాంధ్రకు ప్రత్యేక హోదా కల్పిస్తూ ప్రధానమంత్రి ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని మంత్రివర్గం ప్రణాళికా సంఘాన్ని నిర్దేశించింది.కేంద్ర కేబినెట్ తీసుకొన్న మూడు నిర్ణయాలు: పోలవరం ప్రాజెక్టు కింద ముంపునకు గురయ్యే గ్రామాల స్థానంలో దాదాపు 7 మండలాలను సీమాంధ్రలో కలపడం.

 ఆంధ్రప్రదేశ్‌లోని కేంద్ర ప్రభుత్వరంగ విద్యుత్ సంస్థల్లో ఉత్పత్తయ్యే 85% విద్యుత్‌ను గాడ్గిల్ ఫార్ములా ప్రకారం 2 రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదికన పంపిణీ చేయడం, ఎవరికీ కేటాయించని (అన్ అలకేటెడ్) మిగిలిన 15% విద్యుత్‌ను గత అయిదేళ్లలో జరిగిన వినియోగం ఆధారంగా పంపిణీ చేయడం.

 సీమాంధ్ర ప్రాంతానికి అయిదేళ్లపాటు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పిస్తూ, ప్రధానమంత్రి రాజ్యసభలో చేసిన ప్రకటన అమలును మొదలుపెట్టాలని ప్రణాళికా సంఘానికి నిర్దేశం.

¤ షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ) ప్రజలపై వేధింపుల నిరోధానికి ఉద్దేశించిన చట్టానికి కేంద్ర ప్రభుత్వం మరిన్ని అధికారాలు కల్పించాలని నిర్ణయించింది.

¤ బీహార్‌కు ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ధర్నాకు దిగారు.  
 »    ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం సీమాంధ్రకు ప్రత్యేక హోదా కల్పించినట్లే, బీహార్‌కూ కల్పించాలని కోరుతూ బీహార్‌లో అధికార జేడీయూ బంద్ నిర్వహించింది. పాట్నాలోని గాంధీ మైదాన్ వద్ద నితీష్ కుమార్ అయిదు గంటలపాటు ధర్నా చేపట్టారు.

¤ జాట్ కులస్థులను ఓబీసీ జాబితాలోకి చేర్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల 9 రాష్ట్రాల్లోని జాట్ కులస్థులకు కేంద్ర ప్రభుత్వోద్యోగాల్లో, కేంద్ర విద్యాసంస్థల ప్రవేశాల్లో ఓబీసీ కేటగిరీ కింద రిజర్వేషన్లు పొందే వీలు కలుగుతుంది.   
»    తొమ్మిది (బీహార్, గుజరాత్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ) రాష్ట్రాల్లో 9 కోట్ల మంది ఓబీసీ పరిధిలోకి వస్తారు.
మార్చి - 3
¤ వెయిటింగ్ లిస్ట్‌లోని టికెట్లు ఖాయమయితే ఆ ప్రయాణికుడి సెల్‌ఫోన్‌కు సమాచారం అందించే విధానాన్ని రైల్వే శాఖ సహాయమంత్రి అధీర్ రంజన్ చౌధురి న్యూఢిల్లీలో లాంఛనంగా ప్రారంభించారు.   
»    నూతన విధానంలో రైలు బయలుదేరడానికి మూడు గంటల ముందు ప్రయాణికుడి సెల్‌ఫోన్‌కు సమాచారం వస్తుంది. ఒకవేళ టికెట్ ఖాయమవ్వకపోతే మాత్రం సమాచారం రాదు.  
 »    ఈ సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను రైల్వే సాంకేతిక విభాగం (సీఆర్ఐఎస్) అభివృద్ధి చేసింది.

¤ లండన్‌కు చెందిన రోల్స్‌రాయిస్‌తో భారత్ అన్ని ఒప్పందాలనూ నిలిపివేసింది.   
»    ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)కు రూ.10 వేల కోట్ల విలువైన విమానాలు, హెలికాప్లర్ల ఇంజిన్లను సరఫరా చేసే కాంట్రాక్టుకు సంబంధించి, ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు రావడంతో రక్షణశాఖ మంత్రి ఎ.కె.ఆంటోనీ సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడంతో పాటు రోల్స్‌రాయిస్ ఈ కాంట్రాక్టులో ఏజెంట్లకు చెల్లించిన కమిషన్‌ను కూడా రికవరీ చేయాలని నిర్ణయించారు.

¤ కలుషిత వాతావరణం నుంచి రక్షించే మాస్క్‌ల తయారీలో తమిళనాడు కోవై విద్యార్థినులు ప్రపంచ రికార్డు నెలకొల్పారు.   
»    300 మంది విద్యార్థినులు 30 నిమిషాల వ్యవధిలో 2,493 మాస్క్‌లు తయారుచేసి ఈ రికార్డు సృష్టించారు.
మార్చి - 4
¤ తపాలా కార్యాలయాల్లో చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) పథకాలపై వడ్డీరేటును 0.2% పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది.   
»    పీపీఎఫ్ వడ్డీ రేటు మాత్రం మారలేదు. 8.7 శాతంగానే ఉంది.   
»    ఏడాది, రెండేళ్ల కాలానికి చేసే ఎఫ్‌డీలపై ప్రస్తుతం 8.2% ఉన్న వడ్డీ రేటు 8.4% కు పెరుగుతుంది. మూడు, అయిదేళ్ల కాలపరిమితి ఉన్న ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 0.1% పెరిగింది. ప్రస్తుతం 8.3% ఉండగా, అది 8.4% కానుంది.   
»    చిన్నమొత్తాల పొదుపు పథకాలపై ప్రకటించిన కొత్త వడ్డీరేట్లు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి.
మార్చి - 5
¤ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.   
»    543 స్థానాలున్న 16వ లోకసభకు గతంలో ఎన్నడూలేని విధంగా తొమ్మిది దశల ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
   
»    న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఎన్నికల సంఘం కమిషనర్లు హెచ్.ఎస్.బ్రహ్మ, నజీం జైదీలతో కలిసి ప్రధాన ఎన్నికల కమిషనర్ వి.ఎస్.సంపత్ పోలింగ్ తేదీలను ప్రకటించారు. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌నూ వెల్లడించారు.
  
 »    మొత్తం 35 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో లోక్‌సభ ఎన్నికలతో పాటు, 3 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, 8 రాష్ట్రాల్లోని 23 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయి.
  

 »    విభజన అంచున ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు ఉమ్మడిగా షెడ్యూల్ ప్రకటించినా, పోలింగ్ మాత్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో వేర్వేరుగా రెండు దశల్లో జరగనుంది. తెలంగాణ (లోక్‌సభ స్థానాలు 17, అసెంబ్లీ స్థానాలు 119)లో ఏప్రిల్ 30న, సీమాంధ్రలో (లోక్‌సభ స్థానాలు 25, అసెంబ్లీ స్థానాలు 175) మే 7న పోలింగ్ నిర్వహించనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జరుగుతున్న చిట్టచివరి ఎన్నికలు ఇవే కావడం విశేషం.   
»    స్వతంత్ర భారతావనిలో మొదటి సారిగా 1951-52 నాటి సాధారణ ఎన్నికల్లో పాల్గొన్న ఓటర్ల సంఖ్య 17.32 కోట్లు కాగా, తాజాగా దేశంలో ఓటర్ల సంఖ్య 81.4 కోట్లకు చేరింది.   
»    దేశవ్యాప్తంగా ఎనిమిది లక్షల పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, 19 లక్షల ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియోగం, కోటి మందికి పైగా సిబ్బంది నియామకం... ఈ తరహా బ్యాలెట్ పోరు ప్రపంచంలో మరెక్కడా ఉండదు.

¤ ఉద్యోగుల భవిష్య నిధి డిపాజిట్లపై 2013-14 ఆర్థిక సంవత్సరానికి 8.75% వడ్డీ ఇచ్చేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

¤ అయిదు కేజీల మినీ ఏల్‌పీజీ సిలిండర్‌ను ఫోన్ చేసి బుక్ చేసుకునే 'డయల్ ఎ మినీ ఎల్‌పీజీ' సౌకర్యాన్ని పెట్రోలియం శాఖ అందుబాటులోకి తెచ్చింది.   
»    1800 22 4344 నంబర్‌కు ఫోన్ చేస్తే అయిదు కేజీల సిలిండర్‌ను నేరుగా ఇంటికి పంపిణీ చేస్తారు. ఇదే నంబర్‌కు ఫోన్ చేసి కొత్త కనెక్షన్ సైతం తీసుకోవచ్చు.
   
»    ఈ సర్వీస్‌ను తొలిసారిగా ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్‌లలో ప్రారంభించారు.   
»    మినీ సిలిండర్ ధర రూ.543. కనెక్షన్ కోసం రూ.వెయ్యి చెల్లించాలి.
మార్చి - 6
¤ మీరట్‌లో చదువుతున్న దాదాపు 60 మంది కాశ్మీరీ విద్యార్థులపై ఉత్తర ప్రదేశ్ పోలీసులు దేశద్రోహం అభియోగం, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పాకిస్థాన్ క్రికెట్ జట్టును ప్రోత్సహించినందుకు, భారత్‌పై ఆ జట్టు విజయం సాధించడంతో వేడుక చేసుకున్నందుకు ఈ చర్యలు తీసుకున్నారు. ఈ ఘటన కాశ్మీర్‌లో ఆందోళనలకు దారితీసింది.   
»    ఉత్తరప్రదేశ్ మీరట్‌లోని స్వామి వివేకానంద సుభార్తి విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్, లా కోర్సులు చదువుతున్న కొందరు విద్యార్థులు మార్చి 2న భారత్ - పాక్ జట్ల మ్యాచ్‌లో పాక్ విజయాన్ని వేడుక చేసుకున్నారు.   
»    ఈ నేపథ్యంలో తమ రాష్ట్ర విద్యార్థులపై దేశద్రోహం కేసు నమోదు చేయడాన్ని జమ్ముకాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తప్పుపట్టారు. ఈ అంశంపై యూపీ సీఎం అఖిలేష్ యాదవ్‌తో మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని, ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరారు. అయితే విద్యార్థులు చేసింది తప్పేనని ఆయన పేర్కొన్నారు.   
»    ఈ నేపథ్యంలో యూపీ ప్రభుత్వం విద్యార్థులపై దేశ ద్రోహం అభియోగాన్ని ఉపసంహరించుకుంది.

¤ తమ రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులను కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదని, ఎన్ని సార్లు అడిగినా ఆపన్న హస్తం అందించలేదని ఆరోపిస్తూ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ భోపాల్‌లో నాలుగు గంటలపాటు నిరాహారదీక్ష చేశారు.
మార్చి - 7
¤ న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో 'వార్షిక ఆవిష్కరణల ప్రదర్శనశాల' ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించారు.   
»    జాతీయ ఆవిష్కరణల మండలి నిర్వహిస్తున్న ఈ ప్రదర్శన మార్చి 7 నుంచి 13వ తేదీ వరకు కొనసాగుతుంది.

¤ ముంబయిలోని మజగావ్ డాక్ లిమిటెడ్ (ఎండీఎల్)లో నిర్మాణంలో ఉన్న 'ఐఎన్ఎస్ కోల్‌కతా' అనే యుద్ధనౌకలో గ్యాస్ లీకైన దుర్ఘటనలో ఒక అధికారి మరణించారు.   
»    నౌకాదళంలో గత ఏడు నెలల్లో ఇది 11వ ప్రమాదం కావడం గమనార్హం.
మార్చి - 8
¤ ఎరువుల వాడకాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎస్ఎస్ఎన్ఎమ్ - సైట్ స్పెసిఫిక్ న్యూట్రియంట్ మేనేజ్‌మెంట్ (నిర్దిష్ట క్షేత్ర పోషకాల నిర్వహణ) అనే కొత్త కార్యక్రమాన్ని రూపొందించింది.
   
»     వచ్చే జూన్ నుంచి మొదలయ్యే కొత్త ఖరీఫ్ సీజన్‌లో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించేలా చూడటమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం ప్రకటించింది.   
»     కేంద్ర ఎరువుల శాఖ రూపొందించిన ఈ కార్యక్రమంలో మొత్తం 19 రాష్ట్రాల్లోని 170 జిల్లాలపై ప్రధానంగా దృష్టి పెట్టాలని నిర్ణయించారు.

¤ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బెంగళూరు నగర శివారులోని టైటాన్ చేతి గడియారాల తయారీ పరిశ్రమకు చెందిన మహిళా ఉద్యోగులు నిర్వహించిన 12 వేర్వేరు ప్రదర్శనలు గిన్నిస్ రికార్డు సృష్టించాయి.  
 »     382 మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
మార్చి - 9
¤ ఈశాన్య భారత్‌లో విధి నిర్వహణకు వందమంది సరిహద్దు భద్రతాదళం (బీఎస్ఎఫ్) మహిళా కానిస్టేబుళ్లు నియమితులయ్యారు.   
»     ఈశాన్య రాష్ట్రాల్లో బంగ్లాదేశ్‌తో సరిహద్దు వెంబడి విధులు నిర్వహించేందుకు వీరు నియమితులయ్యారు.   
»     వందమందిలో 70 మంది మహిళా కానిస్టేబుళ్లను అసోం ప్రాంతాల్లో సరిహద్దు వెంబడి, 30 మందిని త్రిపుర ప్రాంతాల్లో సరిహద్దు వెంబడి నియమించారు.   
»     ఈశాన్య రాష్ట్రాల్లో చొరబాట్ల సందర్భంగా స్త్రీలను తనిఖీ చేయడం కష్టంగా మారడంతో ఆయా ప్రాంతాల్లో మహిళా కానిస్టేబుళ్లను నియమించారు.

¤ పాకిస్థాన్ కోసం గూఢచర్యం నిర్వహిస్తూ, పట్టుబడిన అప్పటి సైనికాధికారుల సర్వీసులను రద్దు చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది.  
»     1978లో ఈ అధికారుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీన్ని 'సాంబా' గూఢచర్యం కేసుగా వ్యవహరిస్తున్నారు.   
»     తమ సర్వీసులను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదంటూ మాజీ సైనికాధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈ కేసును విచారించిన జస్టిస్ బి.ఎస్.చౌహాన్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం కేంద్ర నిర్ణయం తప్పని నిరూపించేందుకు ఎలాంటి సాక్ష్యాధారాలూ లేకపోవడంతో కేంద్ర నిర్ణయాన్ని సమర్థిస్తున్నట్లు తీర్పు వెలువరించింది.
మార్చి - 12
¤ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటర్లకు మరో రెండు గంటల అదనపు సమయం కేటాయించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.   
»     నక్సల్స్ ప్రభావం లేని ప్రాంతాల్లో ఈ వెసులుబాటు కల్పించనున్నారు. దీంతో ప్రస్తుతం 9 గంటలు ఉన్న పోలింగ్ సమయం 11 గంటలకు పెరగనుంది.
  
 »     రెండు గంటల సమయం పెంపుతో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటలవరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. అదే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.  
 »     ఓటర్ల సంఖ్య బాగా పెరగడం, ఇటీవలి ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు ఓటు హక్కుని వినియోగించుకోవడం, సాయంత్రం వరకు బూత్‌ల వద్ద ఓటర్లు బారులు తీరి ఉండటం లాంటి పరిణామాలు దృష్ట్యా తాజా నిర్ణయం తీసుకున్నారు.

¤ కాశ్మీర్‌లో గతంలో ఇంతకు ముందెప్పుడూ లేనివిధంగా పెద్ద ఎత్తున మంచు కురిసింది. దీంతో మంచు చరియలు విరిగిపడి ఇద్దరు జవాన్లు సహా 10 మంది మృతి చెందారు.   
»     కొద్ది రోజులుగా విపరీతంగా కురుస్తున్న మంచుతో కాశ్మీర్ లోయను కలిపే రోడ్డు, వాయు మార్గాలు మూసుకుపోయాయి.


¤ మలయాళ మనోరమ 125వ వార్షికోత్సవాలను న్యూఢిల్లీలో నిర్వహించారు.
   
»     ప్రధాని మన్మోహన్‌సింగ్, కేంద్ర సమాచార, ప్రసార శాఖా మంత్రి మనీష్ తివారీ, రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోనీ, మలయాళ మనోరమ ప్రధాన సంపాదకుడు మామెన్ మాథ్యూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మార్చి - 13
¤  దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన 'నిర్భయ' సామూహిక అత్యాచార‌, హ‌త్య ఘ‌ట‌న‌లో న‌లుగురు దోషుల‌కు మ‌ర‌ణ‌శిక్ష విధించ‌డాన్ని ఢిల్లీ హైకోర్టు స‌మ‌ర్థించింది. ఇది అత్యంత అసాధార‌ణ‌, క్రూర‌మైన నేర‌మ‌ని జ‌స్టిస్ రెవా ఖేత్రపాల్‌, జ‌స్టిస్ ప్రతిభా రాణితో కూడిన ధ‌ర్మాస‌నం వ్యాఖ్యానించింది. శిక్ష కూడా అదే స్థాయిలో ఉండాల‌ని పేర్కొంది.
   

»     దేశాన్ని కుదిపేసిన నిర్భయ కేసుకు సంబంధించిన నిందితుల్లో రామ్‌సింగ్ గ‌తేడాది తీహార్ జైల్లో ఆత్మహ‌త్యకు పాల్పడ్డాడు. ఆరో నిందితుడు బాలుడు కావ‌డంతో అత‌డిని బాల నేర‌స్థుల న్యాయ‌మండ‌లిలో విచారించారు. గ‌త ఏడాది ఆగ‌స్టు 31న అత‌డిని మూడేళ్లపాటు సంస్కర‌ణ గృహంలో ఉంచాల్సిందిగా బోర్డు తీర్పు చెప్పింది. మిగిలిన నిందితుల‌కు గ‌త ఏడాది సెప్టెంబ‌రు 13న మ‌ర‌ణ‌శిక్ష విధించింది.

¤
  భార‌త దౌత్యాధికారి దేవ‌యానికి న్యాయ‌స్థానంలో పెద్ద ఊర‌ట ల‌భించింది. వీసా మోసం కేసులో అరెస్టయి, దుస్తులు విప్పి సోదాల‌కు గురైన దేవ‌యాని ఖోబ్రగ‌డేపై మోపిన నేరారోప‌ణ‌ల‌ను అమెరికాలోని ఫెడ‌ర‌ల్ కోర్టు కొట్టేసింది. దేవ‌యానికి సంపూర్ణ దౌత్య ర‌క్షణ ఉన్నట్లు జిల్లా జడ్జి షీరా షీండ్లిన్ తీర్పునిచ్చారు.
మార్చి - 14
¤  ఏప్రిల్ 7న జ‌రిగే లోక్‌స‌భ తొలిద‌శ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్‌ను రాష్ట్రప‌తి ప్రణ‌బ్ ముఖ‌ర్జీ విడుద‌ల చేశారు. తొలిద‌శ‌లో అస్సాంలోని 5 నియోజ‌క‌వ‌ర్గాల‌తో పాటు త్రిపుర‌లోని ఒక నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఏప్రిల్ 7న పోలింగ్ ఉద‌యం 7 నుంచి సాయంత్రం 5 వ‌ర‌కూ జ‌ర‌గ‌నుంది.
మార్చి - 15
¤  మ‌థుర జిల్లాలోని బృందావ‌నం (వృందావ‌న్‌)లో 'వృందావ‌న్ చంద్రోద‌య మందిర్‌'గా పిలిచే 70 అంత‌స్తుల శ్రీకృష్ణ ఆల‌యాన్ని నిర్మించ‌బోతున్నారు. 62 ఎక‌రాల సువిశాల ప్రాంగ‌ణంలో రూ.300 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించ‌నున్నారు. అత్యద్భుత‌మైన నాగ‌ర శిల్పశైలికి ఆధునిక‌త‌ను జోడించి ఈ భ‌వ‌నాన్ని నిర్మిస్తారు. ఈ ప్రాంగ‌ణంలో ఒక హెలిపాడ్‌ను సైతం ఏర్పాటు చేస్తున్నారు.

¤  ఏప్రిల్ 9, 10 తేదీల్లో జ‌రిగే లోక్‌స‌భ రెండు, మూడో ద‌శ ఎన్నిక‌ల‌కు రాష్ట్రప‌తి నోటిఫికేష‌న్ జారీ చేశారు. ఈ రెండు ద‌శ‌ల కింద ఢిల్లీ స‌హా 18 రాష్ట్రాల్లోని 93 నియోజ‌క‌వ‌ర్గాల‌కు పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఏప్రిల్ 9న 5 రాష్ట్రాల్లోని ఏడు నియోజ‌క‌వ‌ర్గాల్లో, 10న ప‌ద‌మూడు రాష్ట్రాల్లోని 86 స్థానాల్లో ఓట‌ర్లు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకోనున్నారు.
మార్చి - 19
¤  సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ వెబ్‌సైట్లలో రాజకీయ ప్రకటనలను ప్రచురించడానికి సంబంధించి ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీ చేసింది. ట్విట్టర్‌, ఫేస్‌బుక్ లాంటి వెబ్‌సైట్లలో పెట్టేముందు సంబంధిత అంశానికి ఎన్నికల సంఘం నుంచి ధ్రువీకరణ తీసుకోవాల‌ని సూచించింది.
   
»     రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రకటనలపై చేసే వ్యయ వివరాలను నమోదు చేయాలని సామాజిక నెట్‌వర్కింగ్‌ సైట్లకు ఎన్నికల సంఘం సూచించింది. తాము ఎప్పుడు అడిగితే అప్పుడు ఆ వివరాలను సమర్పించాలని తెలిపింది.   
»     ఆయా సైట్లలో ఉంచే అంశాలు చట్టవిరుద్ధంగా, ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించే విధంగా ఉండరాదని స్పష్టం చేసింది.

¤  సార్వత్రిక ఎన్నిక‌ల‌కు సంబంధించి దేశ‌వ్యాప్తంగా ఓట‌ర్లను చైత‌న్యం చేయ‌డానికి ఎన్నిక‌ల సంఘం (ఈసీ) బాలీవుడ్ న‌టుడు అమీర్‌ఖాన్‌ను ప్రచార‌క‌ర్తగా నియ‌మించింది. మాజీ రాష్ట్రప‌తి అబ్దుల్ క‌లాం, క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ ధోనీ, బాక్సర్ మేరీ కోమ్‌, బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌తో క‌లిసి అమీర్ ఖాన్ ప్రచారం చేయ‌నున్నారు.   
»     చెల్లని ఓట్లను త‌గ్గించ‌డానికి, ఓటింగ్ శాతం పెంచ‌డానికి 'ఓట‌రు విజ్ఞాన విధానం, ఎన్నిక‌ల ప్రక్రియ‌లో భాగ‌స్వామ్యం' కార్యక్రమం ద్వారా వీరంతా ప్రజ‌ల్లోకి వెళ్లనున్నారు. 
మార్చి - 24
¤  ప్రభుత్వ ప‌థ‌కాల ప్రయోజ‌నాల‌ను పొంద‌డానికి ఆధార్ కార్డును త‌ప్పనిస‌రి చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులు ఏవైనా ఉంటే వాటిని త‌క్షణ‌మే ఉప‌సంహ‌రించుకోవాల‌ని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
   
»     గ్యాస్‌, విద్యుత్తు, కుళాయి క‌నెక్షన్లు లాంటి నిత్యావ‌స‌ర సేవ‌లు పొంద‌డానికి ఆధార్ కార్డు చ‌ట్టబ‌ద్ధ అవ‌స‌ర‌మేమీ కాద‌ని జ‌స్టిస్ బి.ఎస్‌.చౌహాన్‌, జ‌స్టిస్ చ‌ల‌మేశ్వర్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం అభిప్రాయ‌ప‌డింది.    
»     ఒక అత్యాచారం కేసు ద‌ర్యాప్తు విష‌యంలో పౌరుల ఆధార్ స‌మాచారాన్ని సీబీఐతో పంచుకోవాల‌ని బాంబే హైకోర్టు గోవా బెంచి ఇచ్చిన ఆదేశాల‌పై స్టే ఉత్తర్వులు ఇస్తూ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.   
»     ప్రభుత్వ సేవ‌ల‌ను మ‌రింత స‌మ‌ర్థంగా అందించ‌డం కోసం 2009 జ‌న‌వ‌రి 28న ఆధార్ కార్డులు జారీ చేసే 'యునిక్ ఐడెంటిఫికేష‌న్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ)' ఏర్పాటైంది. వివ‌రాలు ఇచ్చిన ప్రతి వ్యక్తికి ఈ సంస్థ 12 అంకెల నెంబరు ఇస్తుంది. చిరునామా, ఫొటో తదిత‌ర వివ‌రాల‌తో పాటు ప‌దివేళ్ల ముద్రలు, క‌ళ్ల ఐరిస్ ను సేక‌రిస్తుంది.   
»     ఈ మొత్తం ప్రక్రియ‌కు ఎలాంటి చ‌ట్టబ‌ద్ధత లేద‌ని, జాతి భ‌ద్రత‌కు స‌వాలుగా మారుతుందంటూ హైకోర్టు మాజీ న్యాయ‌మూర్తి జ‌స్టిస్ కె. పుట్టుస్వామి, సైన్యం ప్రధాన కార్యాల‌యంలో క్రమ‌శిక్షణ‌, నిఘా విభాగం అద‌న‌పు డైర‌క్టర్ జ‌న‌ర‌ల్‌గా ప‌నిచేసి ప‌ద‌వీ విర‌మ‌ణ పొందిన మేజ‌ర్ జ‌న‌ర‌ల్ ఎస్.జి.వోంబాత్కెర్ తదిత‌రులు సుప్రీంకోర్టులో పిటిష‌న్లను దాఖ‌లు చేశారు. కేవ‌లం ప‌రిపాల‌నాప‌ర‌మైన ఉత్తర్వు ద్వారా ఏర్పాటైన ఈ సంస్థకు రాజ్యాంగ‌బ‌ద్ధత కూడా లేద‌ని పిటిష‌న్‌దారులు ఆరోపించారు.   
»     దేశంలో ఆధార్ ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌డానికి ప్రభుత్వం ఇప్పటికే రూ.45,000 కోట్లు కేటాయించింది.
మార్చి - 26
¤  ప్రధాని మన్మోహన్‌సింగ్‌, మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌ ఆంటోనీ, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, సీడబ్ల్యూసీ సభ్యులు, కేంద్రమంత్రుల సమక్షంలో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ 2014 సార్వత్రిక ఎన్నిక‌ల‌ మేనిఫెస్టోను విడుదల చేశారు. 'మీ వాణి - మా హామీ' (యువర్‌ వాయిస్ - అవర్‌ ప్లెడ్జ్‌) పేరుతో 49 పేజీల్లో రూపొందించిన ఈ మేనిఫెస్టోలో సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రజలకు మరిన్ని హక్కులను కల్పిస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. ఈ హక్కులతో ప్రభుత్వంపై ఆధారపడకుండానే పేదలు తమ జీవితాలను మెరుగుపర్చుకోవచ్చని పేర్కొంది. దేశ సామాజిక -ఆర్థిక, రాజకీయ ముఖచిత్ర మార్పును ఆకాంక్షిస్తూ 15 సూత్రాల అజెండాను చేర్చింది. 10 కోట్ల మంది యువతకు శిక్షణ ఇచ్చి అయిదేళ్లలో ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న హామీతో ప్రత్యేక యువ -విద్యార్థి అజెండాను చేర్చింది. 2009 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో 90 శాతం నెరవేర్చినట్లు ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పేర్కొంది.   
»     మేనిఫెస్టో కవర్‌ పేజీపై రాహుల్‌గాంధీ ఫొటో ప్రముఖంగా కనబడుతుండగా సోనియా, మన్మోహన్‌ ఫొటోలు చిన్న పరిమాణంలో ఉన్నాయి. మేనిఫెస్టో రూపకల్పనకు చేసిన కసరత్తు గురించి లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. రాహుల్‌ గాంధీ 27 ప్రాంతాల్లో పదివేల మందిని సంప్రదించి వారి నుంచి సేకరించిన 100 ఆలోచనలను ఈ మేనిఫెస్టోలో చేర్చినట్లు అందులో వివరించారు.మేనిఫెస్టోలోని ప్రధానాంశాలు   వైద్యసేవల హక్కు, స్వగృహ వసతి హక్కు, సామాజిక భద్రత హక్కు   మహిళల జీవనోపాధికి రూ.లక్షవరకు రుణం   అయిదేళ్లలో ప్రతి భారతీయుడికీ బ్యాంకు ఖాతా   మూడేళ్లలో 8 శాతం వృద్ధి రేటు   తయారీ రంగంలో 10 శాతం వృద్ధి; చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రత్యేక ప్రాధాన్యం   మౌలిక సదుపాయాల రంగంలో రూ.60 లక్షల కోట్ల పెట్టుబడులు   తదుపరి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో జీఎస్‌టీ బిల్లు, ప్రత్యక్ష పన్నుల స్మృతి బిల్లులకు ఆమోదం   ప్రాజెక్టుల్లో జాప్యాన్ని నివారించేందుకు ప్రధాని ఆధ్వర్యంలో జాతీయ పెట్టుబడుల శాశ్వత సంస్థ ఏర్పాటు   18 నెలల్లో అన్ని పంచాయతీలూ బ్రాడ్‌బ్యాండ్‌, ఇంటర్నెట్‌తో అనుసంధానం   సాగునీటి రంగంలో పెట్టుబడుల పెంపు ద్వారా వ్యవసాయ ఉత్పాదకత, రైతుల ఆదాయం పెంపు   కార్మిక చట్టాలన్నింటినీ ఒకటే చట్టం కిందకు తీసుకొచ్చే అవకాశాలను పరిశీలించేందుకు కమిషన్‌   పాకిస్థాన్‌లో ఇటీవల ఏర్పాటైన కొత్త ప్రభుత్వం... భారత్‌తో మెరుగైన సంబంధాలు కోరుకుంటున్నామంటూ చేసిన విధాన ప్రకటనను ప్రోత్సహించే విధంగా చర్యలు. అదే సమయంలో, పాక్‌ భూభాగంపై ఉగ్రవాదుల శిబిరాలు కొనసాగకుండా, ముంబయి దాడులకు పాల్పడ్డవారిపై న్యాయవిచారణ జరిగేలా ఆ దేశంతో చర్చలు.   తమిళులకు సమానహక్కులు లభించేలా... ముఖ్యంగా ఉత్తర, తూర్పు రాష్ట్రాలకు స్వయంప్రతిపత్తి లభించేలా శ్రీలంక ప్రభుత్వంపై ఒత్తిడి. మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డ శ్రీలంక సైనికదళాలపై ఆ దేశప్రభుత్వం నిష్పాక్షిక దర్యాప్తును చేపట్టేలా ఇతర దేశాలతో కలిసి యత్నాలు.   చైనాతో వాణిజ్య సంబంధాలను పెంపొందించుకుంటూనే సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవడానికి కృషి.
మార్చి - 27
¤  దర్యాప్తు విషయంలో సహకరించనందుకు భారత కాంపిటీషన్‌ కమిషన్‌ (సీసీఐ) ప్రముఖ ఇంటర్నెట్‌ సంస్థ గూగుల్‌కు కోటి రూపాయల జరిమానా విధించింది. కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. భారత్‌లో గూగుల్‌ అవకతవక వాణిజ్య విధానాలు అవలంబిస్తోందన్న ఆరోపణలపై దర్యాప్తు సందర్భంగా అడిగిన సమాచారాన్ని అందించడంలో విఫలమైనందుకు ఈ జరిమానా విధించినట్లు సీసీఐ డైరక్టర్‌ జనరల్‌ తెలిపారు.    
»     ఆన్‌లైన్‌ ప్రకటనలు తదితర అంశాలపై మార్కెట్‌ శక్తిని గూగుల్‌ దుర్వినియోగం చేసిందంటూ మాట్రిమొని డాట్‌కామ్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌, కన్స్యూమర్‌ యూనిటీ అండ్‌ ట్రస్ట్‌ సొసైటీ (సీయుటీఎస్‌) చేసిన ఫిర్యాదు మేరకు సీసీఐ దర్యాప్తు నిర్వహించింది.    
»     సీసీఐ (కాంపిటీష‌న్ క‌మిష‌న్ ఆఫ్ ఇండియా) అనేది వాణిజ్య విధానాలపై అనుక్షణం అప్రమత్తంగా కన్నేసి ఉంచే అధీకృత సంస్థ. 

¤  ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌వో) భార‌త్‌ను పోలియోర‌హిత దేశంగా అధికారికంగాక‌టించింది. పోలియో వైరస్‌ రహితమైనవిగా ప్రకటించిన ఆగ్నేయాసియాలోని 11 దేశాల్లో భారత్‌ కూడా ఒకటి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అందించిన అధికారిక పత్రాన్ని కేంద్రమంత్రి గులాంనబీ ఆజాద్ న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో స్వీకరించారు.   
»     2011 జనవరి నుంచి భారత్‌ పోలియో రహితంగానే ఉంద‌నీ, 1995 నుంచి భారత ప్రభుత్వం పోలియో నిర్మూలనకు ముమ్మరంగా కార్యక్రమాలు చేపట్టిందని ఆజాద్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అంతకు ముందు భారత్‌లో ఏటా కనీసం 50 వేల మంది చిన్నారులు పోలియో మహమ్మారి బారిన పడేవారని మంత్రి వివరించారు.

¤  శ్రీలంకకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం (యూఎన్‌హెచ్‌ఆర్‌సీ)లో ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్‌కు భారత్‌ గైర్హాజరైంది. శ్రీలంకకు వ్యతిరేకంగా అమెరికా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. 2009లో ఎల్‌టీటీఈతో జరిగిన పోరాటం ఆఖరి దశల్లో శ్రీలంకలో చోటు చేసుకున్న దారుణ యుద్ధనేరాలపై అంతర్జాతీయ స్థాయిలో విచారణ జరిపించాలన్న ఈ తీర్మానాన్ని 23 ఓట్లతో యూఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆమోదించింది.   
 »     ఈ తీర్మానంపై ఓటింగ్‌కు గైర్హాజరైన వారిలో భారత్‌ సహా రష్యా, చైనా, పాకిస్థాన్‌ తదితర 12 దేశాలున్నాయి. పాకిస్థాన్‌ ఈ తీర్మానాన్ని మొత్తానికే వ్యతిరేకించింది. శ్రీలంకలో యుద్ధనేరాలు, దారుణరీతిలో మానవహక్కుల ఉల్లంఘన తదితర అంశాలపై మానవహక్కులపై ఐక్యరాజ్యసమితి హైకమిషనర్‌ క్షుణ్ణమైన విచారణ చేయాలని ఈ తీర్మానం పేర్కొంది.
మార్చి - 30
 ¤ ఒపీనియన్‌ పోల్స్‌పై స్వయంగా నిషేధం విధించడానికి ఎన్నికల సంఘం విముఖత వ్యక్తం చేసింది. నిషేధంపై ప్రభుత్వమే చట్టం తీసుకొస్తే సబబుగా ఉంటుందని న్యాయమంత్రిత్వశాఖకు తెలియజేసింది.   
»   రాజ్యాంగంలోని అధికరణ 324 కింద దఖలు పడిన అధికారాలను ఉపయోగించి ఒపీనియన్‌ పోల్స్‌పై నియంత్రణ విధించవచ్చని కొద్ది రోజుల క్రితం న్యాయమంత్రిత్వశాఖ ఎన్నికల సంఘానికి సూచించింది. అయితే ఇది న్యాయపరంగా నిలవదని ఈసీ అభిప్రాయపడింది. ఎగ్జిట్‌ పోల్స్‌పై నియంత్రణ విధిస్తూ చట్టం తీసుకొచ్చినందున ఒపీనియన్‌ పోల్స్‌ విషయంలోనూ ఇదే ప్రక్రియను అనుసరించవచ్చని ఈసీ పేర్కొంది.


¤ న్యూఢిల్లీలో జరిగిన 'ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్ (ఐఐపీఏ)' వజ్రోత్సవ వేడుకలను రాష్ట్రప‌తి ప్రణబ్‌ ముఖర్జీ ప్రారంభించారు. పారదర్శక విధానాలు పాటిస్తూ ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించే దిశగా ఐఐపీఏ చేస్తున్న కృషిని ప్రణ‌బ్‌ కొనియాడారు.

»   అనంతరం ఐఐపీఏ ప్రచురించిన 'ఇండియన్‌ గవర్నెన్స్‌ రిపోర్ట్ - 2012, జవహ‌ర్‌లాల్‌ నెహ్రూ అండ్‌ ఇండియన్‌ అడ్మినిస్ట్రేషన్‌' పుస్తకాలను రాష్ట్రపతి విడుదల చేశారు.

»   ఈ కార్యక్రమంలో ఐఐపీఏ ఛైర్మన్‌ టి.ఎన్‌.చతుర్వేది, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ ఐఆర్‌ఎస్‌ అధికారి, ఐఐపీఏ ఉపాధ్యక్షుడు బి.వి.కృష్ణకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. కృష్ణమోహన్‌ ఈ వేడుకలకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
మార్చి - 31
¤ కైలాస మానస సరోవర్‌ యాత్ర జూన్‌లో ప్రారంభం కానున్నట్లు ఇండో - టిబెటన్‌ సరిహద్దు భద్రతా దళం (ఐటీబీపీ) తెలిపింది. మానస సరోవర్‌ వార్షిక యాత్ర జూన్‌ 8న మొదలై సెప్టెంబరు 9 వరకు కొనసాగుతుందని ఐటీబీపీ వర్గాలు చెప్పాయి. ఈ యాత్రకు వెళ్లాలనుకునే భక్తులు ఢిల్లీలోని ఐటీబీపీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.   
»     గతేడాది ఉత్తరాఖండ్‌లో జూన్‌లో వచ్చిన వరదల కారణంగా ఈ యాత్రను నిలిపివేశారు.

¤ కీలకమైన కేజీ బేసిన్‌ను సహజవాయువు వెలికితీయడానికి అనువుగా తీర్చిదిద్దడానికి అవుతున్న ఖర్చును భర్తీ చేయడంపై రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌)కు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య నడుస్తున్న వివాదానికి తుది పరిష్కారాన్ని కనుక్కోవ‌డానికి ఒక అంతర్జాతీయ మధ్యవర్తిని నియమించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. దీనికోసం ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌ వేల్స్‌ మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేమ్స్‌ స్పీగల్‌మాన్‌ను మూడో ఆర్బిట్రేటర్‌గా ఎంపిక చేసింది. మధ్యవర్తిత్వ విచారణ సంఘం (ఆర్బిట్రల్‌ ట్రైబ్యునల్‌) ఛైర్మన్‌గా జస్టిస్‌ స్పీగల్‌మాన్‌ వ్యవహరించనున్నారు. ఇప్పటికే ఈ ట్రైబ్యునల్‌లో మరో ఇద్దరు భారత మాజీ ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్‌ ఎస్‌.పి.భరుచా, జస్టిస్‌ వి.ఎన్‌.ఖరే సభ్యులుగా ఉన్నారు. జస్టిస్‌ భరుచాను ఆర్‌ఐఎల్‌ నామినీగానూ, జస్టిస్‌ ఖరే కేంద్ర ప్రభుత్వ నామినీగానూ ఉన్నారు.   
 »     కేజీ - డీ6 బ్లాకులో నుంచి తవ్వి తీసే గ్యాస్‌కు ఎంత ధరను చెల్లించాలనే వివాదంలో అందరికీ ఆమోదయోగ్యం కాగల పరిష్కారం సాధించడానికి జస్టిస్‌ స్పీగల్‌మాన్‌ కృషి చేస్తారు. అంతే కాకుండా ఈ బ్లాకులో ఉత్పత్తి దానంతట అది క్షీణించిందా లేక‌ కంపెనీయే ఉద్దేశపూర్వకంగా తక్కువ గ్యాస్‌ను వెలికితీసిందా అనేది కూడా ఆయన పరిశీలించనున్నారు.

¤ భారత్‌లో అమెరికా రాయబారి నాన్సీ పావెల్‌ రాజీనామా చేశారు. 'తన రాజీనామాను అధ్యక్షుడు ఒబామాకు సమర్పించినట్లుగా నాన్సీ పావెల్‌ ప్రకటించారు' అని అమెరికా రాయబార కార్యాలయ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. 

¤ ఖలిస్థాన్‌ తీవ్రవాది దేవీందర్‌ పాల్‌సింగ్‌ భుల్లార్‌కు అంతకుముందు విధించిన మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మారుస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. చీఫ్ జస్టిస్‌. పి.సదాశివం సారథ్యంలోని నలుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. అంతకుముందు క్షమాభిక్ష కోసం భుల్లార్‌ చేసుకున్న అభ్యర్థనపై నిర్ణయం తీసుకునే విషయంలో ప్రభుత్వం వైపు నుంచి జరిగిన జాప్యం, ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయానికి వచ్చినట్లు సుప్రీం కోర్టు ధర్మాసనం తెలిపింది.   
»     1993లో ఢిల్లీలో జరిగిన బాంబు పేలుడు సంఘటనలో భుల్లార్‌ ప్రధాన నిందితుడు. ఈ బాంబు పేలుళ్లలో తొమ్మిది మంది మరణించగా పాతికమంది గాయపడ్డారు.