ఫిబ్రవరి - 2014 జాతీయం


ఫిబ్రవరి - 1
¤  ఢిల్లీ ప్రభుత్వం చిరు వ్యాపారుల వ్యాట్ చెల్లింపు విధానాన్ని సులభతరం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రాబడిని పెంచే దిశగా ఆదేశాలు జారీ చేసింది.   
»    ఇప్పటివరకూ రూ.50 లక్షల టర్నోవర్ ఉన్న వ్యాపారులు వ్యాట్ చెల్లింపుల పరిధిలోకి వచ్చేవారు. ఇకపై కోటి రూపాయల టర్నోవర్ ఉన్న వ్యాపారుల నుంచి మాత్రమే వ్యాట్‌ను వసూలు చేయాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేశారు.

¤  దేశంలో జాతీయ ఆహార భద్రత చట్టాన్ని ప్రారంభించిన మొదటి రాష్ట్రంగా బీహార్ ఘనత సాధించింది.   
»    ఈ పథకాన్ని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రారంభించారు.

¤  కర్ణాటక లోని గుల్బర్గాలో నిర్మించిన అత్యాధునిక ఇ.ఎస్.ఐ. ఆసుపత్రిని యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ ప్రారంభించారు.

¤  ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిగా హరీష్‌రావత్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు 11 మంది మంత్రుల చేత డెహ్రాడూన్‌లోని రాజ్‌భవన్ ఆవరణలో గవర్నర్ అజీజ్ ఖురేషీ ప్రమాణం చేయించారు.

»    
ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్న విజయ్ బహుగుణ పనితీరుసరిగాలేదని విమర్శలు రావడంతో కాంగ్రెస్ పార్టీ ఆయన చేత రాజీనామాచేయించింది. 2013 జూన్ వరద బాధితులకు పునరావాస చర్యలను సక్రమంగాచేపట్టలేదని బహుగుణపై ఆరోపణలు వెల్లువెత్తాయి.

»    హరీష్ రావత్ సీఎం పదవి చేపట్టకముందు కేంద్ర జలవనరుల మంత్రిగాఉన్నారు.

¤
  వ్యవస్థలోని బలమైనపలుకుబడి గలవారికి చెందిన కుంభకోణాలను వెలికి
తీసినఉన్నతాధికారుల రక్షణ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక సంచలనాత్మక
చర్యతీసుకుంది.

 »    బలమైనపలుకుబడిగల వారిని ఎదుర్కొన్న అధికారులపై కక్షతో వారి
వార్షికపనితీరు సమీక్షా నివేదిక (పీఏఆర్)లలో వారికి వ్యతిరేకంగా ఆరోపణలు
చేయడం,వారి పనితీరును తక్కువ చేసి చూపడంప్రమోషన్లను ప్రభావితం చేసే
విధంగానివేదికలు పంపడం లాంటివి జరుగుతున్నాయివేధింపులకు గురైన
అధికారులుఇప్పుడు తమ కేడర్ అధికారులను ఆశ్రయించితమ పీఏఆర్‌లోని
లోపాలనుసరిదిద్దించుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.

»    ఇలా తొలిసారిగా ప్రభుత్వం ఎన్నో కుంభకోణాలను వెలికితీసిన ఇండియన్ఫారెస్ట్
సర్వీస్ అధికారి సంజీవ్ చతుర్వేది పీఏఆర్‌ను సవరించి అప్‌గ్రేడ్ చేసింది.ఆయన
హర్యానాలో పలు అటవీ సంబంధ కుంభకోణాలను వెలికి తీశారు.
ఫిబ్రవరి - 2
¤  కోల్‌కతాలోని 'ఇండియన్ మ్యూజియం' ద్విశతాబ్ధి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.   
»    ప్రధాని మన్మోహన్‌సింగ్ ఈ ఉత్సవాలను ప్రారంభించారు.   
»    పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఫిబ్రవరి - 4
¤  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు ఉద్దేశించిన ఏడో వేతన సవరణ సంఘం కూర్పును ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఆమోదించారు.   
»    ఈ సంఘానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అశోక్ కుమార్ మాధుర్ నేతృత్వం వహిస్తారు. ఈ సంఘంలో చమురు శాఖ కార్యదర్శి వివేక్ రే (పూర్తికాలపు సభ్యుడు), ఎన్ఐపీఎఫ్‌పీ డైరెక్టర్ రతిన్‌రాయ్ (పార్ట్ టైం సభ్యుడు), వ్యయ విభాగం ఓఎస్‌డీ మీనా అగర్వాల్ (కార్యదర్శి) తదితరులు సభ్యులుగా ఉంటారు.   
»    ఈ కమిషన్ ఇచ్చే సిఫార్సుల వల్ల దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 30 లక్షల మంది పింఛనుదారులకు ప్రయోజనం చేకూరుతుంది. ఇది రెండేళ్లలో తన నివేదికను సమర్పించాల్సి ఉంటుంది.   
»    2016 జనవరి 1 నుంచి ఈ సిఫార్సులు అమల్లోకి వస్తాయి.
ఫిబ్రవరి - 5
¤  అమర్‌నాథ్ యాత్ర-2014లో పాల్గొని ఏదైనా ప్రమాదంలో మరణించిన వారికి రూ.లక్ష బీమా సౌకర్యాన్ని జమ్ము కాశ్మీర్ ప్రభుత్వం కల్పించింది.   
»    రాష్ట్రంలో మరణించిన వారికి మాత్రమే ఈ సౌకర్యం వర్తిస్తుంది.   
»    జమ్ము కాశ్మీర్ గవర్నర్ ఎన్.ఎన్.వోహ్రా అమర్‌నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు ఛైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.

¤  నెలవారీ కనీస పెన్షన్‌ను రూ.1,000 కు పెంచాలనే ప్రతిపాదనకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) ఆమోదం తెలిపింది. పీఎఫ్ ఖాతాలో జీతాల జమకు సంబంధించి గరిష్ఠ పరిమితిని రూ.6,500 నుంచి రూ.15,000 కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.   
»    2012-2017 కాలానికి రూ.13 వేల కోట్ల పెట్టుబడితో 'నేషనల్ మిషన్ ఆన్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ అండ్ టెక్నాలజీ' అమలుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది.

¤  వివాదాస్పద మత హింస వ్యతిరేక బిల్లును కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టింది.   
»    కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే ప్రవేశపెట్టిన ఈ 'మత హింస వ్యతిరేక (సవరణ) బిల్లు-2014' ను విపక్షాలు తీవ్రస్థాయిలో వ్యతిరేకించాయి.   
»    2005 నాటి బిల్లును సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజా బిల్లుకు రూపకల్పన చేసింది.
ఫిబ్రవరి - 6
¤  ఏదైనా ఒక కేసులో అరెస్టయిన లేదా జైలుపాలై న్యాయ విచారణను ఎదుర్కొంటున్న వ్యక్తిని ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధించలేమని ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించింది. నేరం రుజువై శిక్ష అనుభవిస్తున్న నేరస్థులను మాత్రమే ఈ విధంగా ఎన్నికల నుంచి బహిష్కరించాలని స్పష్టం చేసింది.   
»    ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.   
»    ఈ తీర్పు గతేడాది జులై 10న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా ఉండటం విశేషం. జైల్లో గానీ, పోలీసు కస్టడీలో గానీ ఉన్న వ్యక్తికి ఎన్నికల్లో ఓటు వేసే హక్కు లేదు కాబట్టి, ఎన్నికల్లో పాల్గొనే అర్హత కూడా లేదని సుప్రీంకోర్టు అప్పట్లో పేర్కొంది. ఓటు వేసే హక్కు ఉన్న వాళ్లు మాత్రమే ఎన్నికల్లో పాల్గొనాలని స్పష్టం చేసింది.   
»    ఢిల్లీ హైకోర్టు ఈ తీర్పును పక్కన పెట్టి కేవలం నేరస్థులను మాత్రమే ఈ విధంగా బహిష్కరించాలి తప్ప అభియోగాల్ని ఎదుర్కొంటున్న నిందితుల్ని కాదని వివరణ ఇచ్చింది.

¤  3,497 మంది భారతీయులు వివిధ నేరాల కింద గల్ఫ్ దేశాల్లోని వివిధ జైళ్లలో మగ్గుతున్నట్లు ప్రవాస భారతీయ వ్యవహారాల శాఖ మంత్రి వాయలార్ రవి రాజ్యసభలో వెల్లడించారు.   
»    సౌదీ అరేబియా (రియాద్) జైళ్లలో అత్యధికంగా 1,400 మంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో 1,025 మంది, జెడ్డాలో 568 మంది, కువైట్‌లో 250, ఒమన్ లో 106, ఖతార్‌లో 72, బహ్రెయిన్ జైళ్లలో 76 మంది భారతీయులు ఉన్నారు.
ఫిబ్రవరి - 7
¤  ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగాల్లో వికలాంగులకు 5% రిజర్వేషన్, ఉన్నత విద్యాసంస్థల సీట్లలో రిజర్వేషన్ కల్పించే బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. వారికోసం జాతీయ కమిషన్, జాతీయ నిధి ఏర్పాటుకు ఈ బిల్లు అవకాశం కల్పిస్తుంది.   
»    వికలాంగుల జాతీయ కమిషన్‌కు చట్టబద్దమైన అధికారాలుంటాయి. ప్రస్తుతం వైకల్యాన్ని ఏడు కేటగిరీలుగా గుర్తించారు. దీన్ని 19 కేటగిరీలకు విస్తరించారు. ప్రస్తుతం వికలాంగుల కోటా 3%. శారీరక వైకల్యం, దృష్టి వైకల్యం, వినికిడి వైకల్యం ఉన్నవారికి ఒక్కోశాతం చొప్పున ఈ కోటా ఉంది. ఈ బిల్లులో కొత్తగా మానసిక వైకల్యం బహుళ వైకల్యాల కేటగిరీలను చేర్చారు.

¤  వివిధ ప్రజోపయోగ పథకాల అమల్లో పింఛన్‌దారుల సేవలను వినియోగించుకోవాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 'సంకల్ప్' అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది.   
»    కేంద్రప్రభుత్వ మాజీ ఉద్యోగులకు దీన్ని వర్తింపజేస్తారు. తొలిదశలో భాగంగా 500 మంది పింఛన్‌దారులతో దీన్ని మొదలు పెట్టనున్నారు.
ఫిబ్రవరి - 8
¤  ముంబయిలోని కిషన్‌చంద్ చెల్లారం ఆర్ట్స్, కామర్స్, సైన్స్ కళాశాల (కేసీ కాలేజ్) వజ్రోత్సవాలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించారు.   
»    ఈ ఉత్సవాల్లో మహారాష్ట్ర గవర్నర్ శంకర్ నారాయణ్, ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, అడాగ్ ఛైర్మన్ అనిల్ అంబానీ తదితరులు పాల్గొన్నారు.
   
»    ప్రస్తుతం దేశంలో 650 విశ్వవిద్యాలయాలు, 33 వేల కళాశాలలు ఉన్నాయని, భారత విద్యావ్యవస్థ ప్రపంచంలోనే రెండో అతిపెద్దదని రాష్ట్రపతి ప్రణబ్ తన ప్రసంగంలో వెల్లడించారు.
¤  తమిళనాడులోని తిరుప్పువనంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇండియన్ బ్యాంక్ ఏర్పాటు చేసిన 108 శాఖలను ఆర్థికమంత్రి పి.చిదంబరం తిరుప్పువనం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.
 ఫిబ్రవరి - 9
¤ ఫిబ్రవరి 20వ తేదీ నాటికి పది లక్షలకు మించి జనాభా ఉన్న నగరాల్లోని ప్రజారవాణా వాహనాల్లో జీపీఎస్ ఏర్పాటు తప్పనిసరని కేంద్ర ప్రభుత్వం గడువు విధించింది.   
» గతేడాది సెప్టెంబరు 30 నాటికే ఈ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ఆదేశించినా, మరోసారి గడువు పెంచారు.   
» ప్రజా రవాణాపై పటిష్ఠ నిఘాకు రూ.1,405 కోట్ల ప్రాజెక్టుకు 2014 జనవరిలో ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా ప్రజారవాణాలో మహిళలు, బాలికల భద్రత కోసం సీసీటీవీలు, జీపీఎస్ వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు.   
» మహిళల భద్రత కోసం ఉద్దేశించిన 'నిర్భయ నిధి'లో భాగంగా ఈ ప్రాజెక్ట్ చేపట్టారు.

¤ దేశంలో రూపొందించిన ప్రాంతీయ భాషలకు చెందిన ఆణిముత్యాల్లాంటి చిత్రాలను వ్యాప్తిలోకి తెచ్చేందుకు సామాజిక మీడియాను ఉపయోగించే అంశాన్ని పరిశీలించాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం సమాచార, ప్రసారశాఖను కోరింది.   
» ఈ స్థాయీ సంఘం పార్లమెంట్‌కు ఒక నివేదికను సమర్పించింది. భారత జాతీయ చలన చిత్ర ఆర్కైవ్స్ (ఎన్ఎఫ్ఏఐ) పనితీరును సమీక్షిస్తూ, భారతీయ చిత్రాలను అంతర్జాతీయంగా అందుబాటులోకి తెచ్చేందుకు వాటిని యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో ఉంచే అంశాన్ని పరిశీలించాలని సూచించింది.

¤ ఒడిశాలోని సంబల్‌పూర్ జిల్లా హిరాకుడ్ డ్యాం ప్రాంతంలో పడవ బోల్తా పడిన ఘటనలో సుమారు 30 నుంచి 40 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో 13 మంది మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు.

¤ పదో తరగతి ఉత్తీర్ణులైనా, వివిధ కారణాలతో చదువు మానేస్తున్న వారిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. వీరందరి చదువు కొనసాగాలనే సంకల్పంతో 'నేషనల్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఫ్రేమ్‌వర్క్' (ఎన్‌వీఈక్యూఎఫ్) అనే సరికొత్త పథకాన్ని అమల్లోకి తెచ్చింది.   
» పదో తరగతి ఉత్తీర్ణులై కూడా చదువు మానేసిన వారిని 2014-15 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ లేదా ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో చేర్పించడం ఈ పథకం ముఖ్యోద్దేశం. వీరికి వృత్తి విద్యా కోర్సుల్లో ప్రత్యేక శిక్షణ అందిస్తారు. తద్వారా పరిశ్రమలకు నైపుణ్యం కలిగిన యువతను సమకూర్చడం ఎన్‌వీఈక్యూఎఫ్ పథకం లక్ష్యం.

¤ జాతీయ వ్యవసాయ ప్రదర్శన 'కృషి వసంత్-2014'ను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ నాగ్‌పూర్‌లో ప్రారంభించారు.   
» ఈ ప్రదర్శన అయిదురోజుల పాటు కొనసాగనుంది.

¤ హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్‌లో 'సూరజ్‌కుండ్ ఇంటర్నేషనల్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ మేళా' ప్రారంభమైంది.   
»  15 రోజులపాటు జరిగే ఈ మేళాలో వేల రకాల హస్తకళలను ప్రదర్శించనున్నారు. 

ఫిబ్రవరి - 10
¤ లోక్‌సభ మాజీ స్పీకర్లు, సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ (స్వాతంత్య్రానికి ముందు లోక్‌సభ)
 అధ్యక్షుల చిత్రపటాలను న్యూఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో రాష్ట్రపతి ప్రణబ్ 
ముఖర్జీ ఆవిష్కరించారు.

¤
 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీఏటానిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎస్ఈకిహాజరయ్యే అన్ని కేటగిరీల అభ్యర్థులకు
మరో రెండుప్రయత్నాలను అదనంగా అనుమతించేందుకు సిబ్బందివ్యవహారాల
శాఖ ఆమోదం తెలిపింది మేరకు ఒక ఉత్తర్వువిడుదల చేసింది సడలింపు 'సివిల్ సర్వీసెస్ పరీక్షలు - 2014' నుంచి అమలవుతుంది.
   
»  డిగ్రీ ఉత్తీర్ణులైన 21 - 30 ఏళ్ల మధ్య వయసున్న జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 
ఇప్పటివరకు 4సార్లు మాత్రమే సీఎస్ఈ రాసే అవకాశముండేదితాజా నిర్ణయం ప్రకారం
 వారు 32 ఏళ్ల వయసులోపు 6 సార్లు  పరీక్ష రాయవచ్చు.
   

»  మూడేళ్ల గరిష్ఠ వయో పరిమితి సడలింపుతో ఇతర వెనుకబడిన వర్గాల వారు ఇప్పటివరకు
 7సార్లు సీఎస్ఈ రాసే వీలుందిఇకపై వారికి 9 సార్లు ప్రయత్నించే అవకాశం లభించింది.
 గరిష్ఠవయోపరిమితిలోనూ వారికి రెండేళ్ల సడలింపు వర్తిస్తుంది.
   

»  ఎస్‌సీఎస్‌టీ అభ్యర్థులు ఎన్ని సార్త్లెనా సీఎస్ఈ రాసే సౌలభ్యం ఉందిఇప్పటివరకు 
వారి గరిష్ఠవయోపరిమితిలో అయిదేళ్ల సడలింపు ఉందిఇకపై వారికి గరిష్ఠ వయోపరిమితిలో మరో రెండేళ్లసడలింపు లభిస్తుంది.
ఫిబ్రవరి - 11
¤ హెచ్ఐవీ/ ఎయిడ్స్ బాధితులకు వ్యతిరేకంగా ఎవరైనా ప్రచారం చేస్తే రెండేళ్ల కఠిన కారాగార శిక్షకు, రూ.లక్ష జరిమానాకు వీలు కలిగించే ప్రతిపాదిత 'హెచ్ఐవీ, ఎయిడ్స్ (నిరోధక, నియంత్రణ) బిల్లు 2014' ను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి గులాంనబీ ఆజాద్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు.   
»  హెచ్ఐవీ/ ఎయిడ్స్ బాధితుల హక్కులకు రక్షణ కల్పించే లక్ష్యంతో ఈ బిల్లును రూపొందించారు.బిల్లులోని ముఖ్యాంశాలు  
 »  హెచ్ఐవీ/ ఎయిడ్స్ బాధితులకు ఉద్యోగాలు ఇవ్వడానికి నిరాకరించకూడదు. వాళ్లు పని చేయడానికి అనువైన పరిస్థితులను కల్పించాలి. హెచ్ఐవీ/ ఎయిడ్స్ సోకిన మహిళలు, పిల్లల హక్కుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.   
»  హెచ్ఐవీ/ ఎయిడ్స్ బాధితుల ఫిర్యాదులను స్వీకరించడానికి వీలుగా కేంద్ర, రాష్ట్రాల స్థాయిలో అంబుడ్స్‌మన్‌తో కూడిన వ్యవస్థను ఏర్పాటు చేయాలి.   
»  హెచ్ఐవీ/ ఎయిడ్స్ బాధితుల అనుమతి లేనిదే వారికి హెచ్ఐవీ పరీక్ష నిర్వహించడానికి వీలులేదు.   
»  బాధితుల వివరాలు బయట పెట్టకుండానే చికిత్సను అందించాలి.   
»  తల్లిదండ్రులు ఇద్దరితో పాటు సంరక్షణ బాధ్యతలు చూసే వ్యక్తి కూడా ఈ బాధితుడైతే వారి పిల్లల్లో అందరికంటే పెద్ద కుమారుడు/ కుమార్తె మిగిలిన పిల్లల సంరక్షకులుగా వ్యవహరిస్తారు. విద్యాసంస్థల్లో ప్రవేశం, వైద్య చికిత్స, ఆస్తి వ్యవహారాలు, బ్యాంక్ ఖాతాల్లో పెద్ద కుమారుడు/ కుమార్తె కీలకపాత్ర పోషిస్తారు.   
»  ఎయిడ్స్‌కు సంబంధించి దక్షిణాఫ్రికా, నైజీరియా తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది.   
»  దేశంలో ప్రస్తుతం 23.9 లక్షల మంది ఎయిడ్స్/ హెచ్ఐవీ బాధితులున్నారు. సెక్స్ వర్కర్లు, పురుష స్వలింగ సంపర్కులు, ఇంజక్షన్ ద్వారా మత్తు పదార్థాలను తీసుకునే వారిలో ఇది అధికంగా ఉంది.

¤  షెడ్యూల్డ్ కులాల జాబితాలో మరో 24 కులాలను చేర్చడానికి ఉద్దేశించిన బిల్లును రాజ్యసభలో కేంద్ర సహాయ మంత్రి మాణిక్‌రావ్ గవిట్ ప్రవేశపెట్టారు.
ఫిబ్రవరి - 12
¤  ఓ సాధువుకు వచ్చిన కల ఆధారంగా వెయ్యి టన్నుల బంగారం కోసం ఉత్తరప్రదేశ్ ఉన్నవ్‌లోని రాజారావ్ రాంభక్ష్‌సింగ్ కోటలో కేంద్రం చేపట్టిన అన్వేషణలో దొరికినవి సీసం గాజులు, ఇనుప చువ్వలేనని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.   
»  రాంభక్ష్ సింగ్ కోటలో ఏం దొరికాయనే ప్రశ్నకు రాజ్యసభలో కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి చంద్రేశ్‌కుమారి కటోచ్ ఈ మేరకు సమాధానం ఇచ్చారు.   
»  2013 అక్టోబరు 18న తవ్వకాలు ప్రారంభించి, నవంబరు 14న నిలిపివేసినట్లు మంత్రి వెల్లడించారు.

¤  గతేడాది అంతర్జాలంలో 1,299 లింక్‌లను తొలగించాల్సిందిగా వేర్వేరు సామాజిక అనుసంధాన వేదికలను ఆదేశించినట్లు కేంద్ర కమ్యూనికేషన్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి కపిల్ సిబల్ వెల్లడించారు.
ఫిబ్రవరి - 13
¤  భారత పార్లమెంట్ చరిత్రలో ఎన్నడూ లేని అసాధారణ దృశ్యం లోక్‌సభలో ఆవిష్కృతమైంది. ప్రపంచాన్ని ముక్కున వేలేసుకునేలా చేసింది. మధ్యాహ్నం 12 గంటలకు ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లును హోంమంత్రి షిండే ప్రవేశపెడుతున్నపుడు దాన్ని అడ్డుకోవడానికి సీమాంధ్రకు చెందిన కొందరు ఎంపీలు ప్రయత్నించే క్రమంలో జరిగిన సంఘటనలు దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఎంపీలు బాహాబాహీకి దిగారు. కాంగ్రెస్ నుంచి సస్పెండైన ఎంపీ లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రేని గాల్లోకి చిమ్మడంతో సభ్యులు కళ్లుమండి, పరుగులెత్తారు.   
»  మధ్యాహ్నం 12 గంటలకు స్పీకర్ మీరాకుమార్ తన కుర్చీలోకి వచ్చి సభావ్యవహారాల జాబితాలో ఉన్న అన్ని విషయాలను పక్కన పెట్టి '20 ఎ' అంశంగా ఉన్న రాష్ట్ర విభజన బిల్లును ప్రవేశపెట్టడానికి హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండేను పిలిచిన నేపథ్యంలో సభలో ఘర్షణలు మొదలయ్యాయి.   
»  లోక్‌సభలో గందరగోళం, ఘర్షణ వాతావరణం నేపథ్యంలో వెల్‌లోకి వచ్చి, అనుచితంగా ప్రవర్తించారనే కారణంతో 16 మంది సభ్యులను లోక్‌సభ నిబంధన 374 (ఎ) కింద స్పీకర్ సస్పెండ్ చేశారు.   
»  స్పీకర్ తన అధికార పరిధిని ఉపయోగించి, తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా సస్పెన్షన్‌కు గురయిన ఎంపీలు అయిదు వరుస పనిదినాలు సభలో అడుగుపెట్టడానికి అర్హత కోల్పోయారు.సస్పెన్షన్‌కు గురైన ఎంపీలుసీమాంధ్ర కాంగ్రెస్: సబ్బం హరి, అనంత వెంకట్రామిరెడ్డి, రాయపాటి సాంబశివరావు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఉండవల్లి అరుణ్‌కుమార్, ఎ.సాయిప్రతాప్,
లగడపాటి రాజగోపాల్.
సీమాంధ్ర తెదేపా: నిమ్మల కిష్టప్ప, మోదుగుల వేణు గోపాల్ రెడ్డి, కొనకళ్ల నారాయణ, ఎన్.శివప్రసాద్.వైకాపా: వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి, ఎం.రాజమోహన్ రెడ్డి, ఎస్.పి.వై.రెడ్డి.తెలంగాణ కాంగ్రెస్: కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి.   
»  అత్యంత నాటకీయ, ఘర్షణ పూరిత వాతావరణం నడుమ సమకాలీన దేశ రాజకీయాల్లో అత్యంత వివాదాస్పద అంశంగా వాసికెక్కిన ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు-2014 అంతే వివాదాస్పద రీతిలో లోక్‌సభలోకి వచ్చింది. మధ్యాహ్నం 12 గంటలకు హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు.   
»  ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లును పార్లమెంటులో అసలు ప్రవేశపెట్టలేదనీ, బిల్లు ప్రవేశపెట్టినట్లు తమకు సమాచారం అందలేదనీ లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్ ప్రకటించారు.

¤  సైనిక యుద్ధ ట్యాంకులకు 'నైట్ విజన్' (రాత్రివేళలో చూడగలిగే) పరికరాలను సమకూర్చడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. రూ.1,800 కోట్ల విలువైన ఈ పరికరాల కొనుగోలు ఒప్పందానికి ఆమోదముద్ర వేసింది.   
»  టీ-90, టీ-72 ట్యాంకులకు ఇజ్రాయిల్‌లో తయారయ్యే నైట్‌విజన్ పరికరాలు కావాలంటూ, సైన్యం గతంలోనే ప్రతిపాదించగా కేంద్రం తాజాగా ఆమోదించింది.
ఫిబ్రవరి - 14
¤  ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేశారు.   
»  ఆమ్ ఆద్మీ పార్టీ 49 రోజుల 'పాలన ప్రయోగం' ముగిసింది.
   
»  ఎన్నికల హామీల్లో ఒకటైన 'జన్ లోక్‌పాల్' బిల్లును ఢిల్లీ శాసనసభలో ప్రవేశపెట్టేందుకు ఆమ్ఆద్మీ పార్టీ విఫల యత్నం చేసింది. కాంగ్రెస్, భాజపాలు కలసి గట్టిగా అడ్డుకున్నాయి. శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టే ప్రతిపాదనను 42-27 తేడాతో ఓడించాయి. ఇది జరిగిన వెంటనే కేజ్రీవాల్ మంత్రివర్గం సమావేశమై రాజీనామా నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌కు రాజీనామా లేఖను అందించారు. రాష్ట్రపతిని ఉద్దేశిస్తూ రాసిన ఆ లేఖలో 'శాసనసభను రద్దుచేసి, తాజాగా ఎన్నికలు నిర్వహించాలి' అని సిఫార్సు చేశారు. గవర్నర్ ఈ లేఖతో పాటు కేంద్రానికి నివేదిక పంపనున్నారు. దాన్ని అనుసరించి రాష్ట్రపతి పాలన విధించాలా? ఎన్నికలు నిర్వహించాలా? అనే విషయాన్ని కేంద్రం నిర్ణయిస్తుంది.   
»  కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయనతో సత్సంబంధాలు నెరిపిన లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ 'జన్ లోక్‌పాల్' బిల్లు విషయానికి వచ్చే సరికి నిబంధనలు పాటించాల్సిందేనని తేల్చి చెప్పారు. అన్ని బిల్లుల్లాగే దీనికీ కేంద్రం అనుమతి తీసుకోవాలని కుండబద్దలు కొట్టారు. అందుకు విరుద్ధంగా వెళ్లవద్దని ఏకంగా శాసనసభ స్పీకర్‌కు లేఖ రాశారు. కేజ్రీవాల్ దాన్ని లెక్క చేయకుండా తన పార్టీకే చెందిన స్పీకర్ సాయంతో సభలో బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఢిల్లీ శాసనసభలో ఉత్కంఠ భరిత సన్నివేశాలు ఆవిష్కృతమయ్యాయి. బిల్లు సభా ప్రవేశం దశలోనే కాంగ్రెస్ - భాజపాలు అడ్డుకున్నాయి.   
»  కేంద్రం అనుమతి తీసుకోవాలంటే గవర్నర్ పంపిన సందేశం మీద చర్చ జరగాలని పట్టుబట్టాయి. కేజ్రీవాల్ వారి డిమాండ్లను తోసిపుచ్చుతూ, బిల్లును సభ ముందు ఉంచారు. ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ కాంగ్రెస్, భాజపా విరుచుకుపడ్డాయి. దాంతో స్పీకర్ మధ్యేమార్గంగా బిల్లును సభ స్వీకరించాలా? వద్దా? అనే విషయమై సభ అనుమతి కోరారు. అనుకూలంగా 27 ఓట్లు, వ్యతిరేకంగా 42 ఓట్లు వచ్చాయి. బిల్లు ప్రవేశాన్ని సభ తిరస్కరించినట్లయింది.
ఫిబ్రవరి - 15
¤ దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి పాలనకు కేంద్ర మంత్రివర్గం సిఫార్సు చేసింది. ఢిల్లీ అసెంబ్లీని సుప్త చేతనావస్థలో ఉంచాలని పేర్కొంది. ప్రధాని మన్మోహన్‌సింగ్ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది.


¤ అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పుట్టినరోజు సందర్భంగా తమిళనాడు రాష్ట్రంలో 53,129 మంది రక్తదానం చేసి గిన్నిస్ రికార్డు సృష్టించారు.
   

»  గతంలో హర్యానాలో ఒకే రోజు 43,752 మంది రక్తదానం చేసి గిన్నిస్ రికార్డు సృష్టించారు.

¤ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో మొఘల్ గార్డెన్స్‌లో వార్షిక ఉద్యానవన ఉత్సవాన్ని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ప్రారంభించారు.   
»  ఫిబ్రవరి 16 నుంచి మార్చి 16వరకు సాధారణ ప్రజలను మొఘల్ గార్డెన్స్‌లోకి అనుమతించనున్నారు.
ఫిబ్రవరి - 16
¤ పేద ప్రజలకు గ్రామీణ స్థాయి నుంచి వైద్య సేవలు అందించేందుకు విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) 'ఇండియన్ హెల్త్ లైన్‌'ను ప్రారంభించింది. ఇందుకోసం టోల్ ఫ్రీ నెంబర్ 1860 2333666ను ఏర్పాటు చేసింది.   
»  ఏడాదికి ఒక కోటిమంది పేదలకు వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా వీహెచ్‌పీ ఈ హెల్త్‌లైన్‌ను స్థాపించినట్లు ప్రకటించింది.

¤ లోక్‌సభలో ఫిబ్రవరి 13న తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టే సమయంలో చోటు చేసుకున్న ఆందోళనకర సంఘటనలను పరిశీలించాలంటూ లోక్‌సభ హక్కుల సంఘాన్ని స్పీకర్ మీరాకుమార్ కోరారు. ఆ రోజు ఎంపీ లగడపాటి పెప్పర్‌స్ప్రే చల్లడం, సభ్యులు దాడులకు దిగడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో మీరాకుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సభా వ్యవహారాల నిర్వహణకు సంబంధించిన 227 నిబంధన కింద నాటి అంశాలను హక్కుల సంఘానికి మీరాకుమార్ నివేదించారు.   
»  15 మంది సభ్యుల లోక్‌సభ హక్కుల సంఘానికి పి.సి.చాకో ఛైర్మన్‌గా ఉన్నారు. హక్కుల ఉల్లంఘన, సభ ధిక్కారాలకు సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించడం ఈ సంఘం విధి. నివేదించిన ప్రతి అంశంలో నిజానిజాలను నిర్ధారించి, సిఫార్సులతో స్పీకర్‌కు ఈ సంఘం నివేదిక సమర్పిస్తుంది. హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన వారిపై బహిష్కరణ, జైలుశిక్ష విధింపు లాంటి శిక్షలను కూడా సంఘం సిఫార్సు చేయవచ్చు.

¤ మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో కూలీలకు అందజేసే దినసరి వేతనాన్ని కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఈ పెంపును ఏప్రిల్ 1 నుంచి అమలు చేయనున్నారు.   
»  దీంతో ప్రస్తుతం మన రాష్ట్రంలో ఇస్తున్న దినసరి వేతనం రూ. 149 నుంచి రూ.169 కి పెరగనుంది.   
»  ఏటా కేంద్రం రాష్ట్రానికి భారీగా నిధులు మంజూరు చేస్తున్నా, ఆంధ్రప్రదేశ్ వాటిని వినియోగించుకోలేని స్థితిలో ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.8,300 కోట్లు కేటాయించగా, ఇప్పటికి కేవలం రూ.4,300 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.
ఫిబ్రవరి - 17
¤ సమైక్యాంధ్ర నినాదాల నడుమ ఎలాంటి చర్చా లేకుండానే లోక్‌సభలో తాత్కాలిక రైల్వే బడ్జెట్ (2014-15) ఆమోదం పొందింది.   
»  రైల్వేకు సంబంధించి అనుబంధ పద్దులు (2013-14), ద్రవ్య వినిమయ బిల్లు (2014)ను ద్రవ్య శాఖ మంత్రి మల్లికార్జున ఖర్గే ప్రవేశపెట్టారు. ఈ రెండు బిల్లులూ మూజువాణి ఓటుతో ఆమోదం పొందాయి.   
»  తాత్కాలిక రైల్వే బడ్జెట్ ప్రకారం వార్షిక రైల్వేబడ్జెట్ రూ.64,305 కోట్లు కాగా, దీనికి బడ్జెట్ మద్దతు రూ.30,223 కోట్లు.
¤ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించడంతో ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించారు. శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే పార్లమెంట్ ఉభయ సభల్లోనూ ప్రకటన చేశారు.
¤ పార్లమెంట్‌లోకి ప్రవేశించే ప్రతి ఎంపీని క్షుణ్ణంగా తనిఖీ చేయాలనే డిమాండ్ వీగిపోయింది.   
»  పెప్పర్ స్ప్రే సంఘటన నేపథ్యంలో ఎంపీలందరినీ తనిఖీలు చేయాలనే డిమాండ్‌లు వెల్లువెత్తాయి. అయితే, పార్లమెంటరీ సంఘం అలాంటి సిఫార్సు చేసేందుకు నిరాకరించింది. ఈ అంశం సహా ఇతర భద్రతా చర్యల పై చర్చించేందుకు డిఫ్యూటీ స్పీకర్ కరియా ముండా అధ్యక్షతన అత్యవసరంగా సమావేశమైన 'పార్లమెంట్ ప్రాంగణంలో భద్రతా కమిటీ' ఎంపీలను తనిఖీ చేయడంపై సిఫార్సు చేయరాదని నిర్ణయించింది.
¤  కేంద్ర ప్రభుత్వోద్యోగులందరూ ఇకపై ఏటా తమ ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించడం తప్పనిసరి.   
»  అవినీతి నిర్మూలనకు ఉద్దేశించిన లోక్‌పాల్ వ్యవస్థను అమల్లోకి తెస్తూ, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ప్రభుత్వంలోని ఏ విభాగానికి చెందిన ఉద్యోగులైనా సరే తమ సర్వీసు నిబంధనల ప్రకారం వీటిని ప్రకటించాల్సి ఉంటుంది.
ఫిబ్రవరి - 18
¤   ఆంధ్రప్రదేశ్ విభజనకు లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదముద్ర వేసింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4.20 వరకు జరిగిన చర్చ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 38 సవరణలకు అధికార, ప్రతిపక్షాలు రెండూ సంపూర్ణ మద్దతు పలికాయి. దీంతో బిల్లు ఆమోదం సులువయింది.
   

»   కేంద్ర హోం మంత్రి షిండే, ప్రధాన ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్, కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి మాత్రమే పాల్గొన్న చర్చ 20 నిముషాల్లోనే ముగిసింది. ఆ తరువాత గంటపాటు షిండే, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ, తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు సౌగత్‌రాయ్‌లు ఇచ్చిన సవరణలు మాత్రమే సభ ముందుకొచ్చాయి. ఇందులో షిండే ప్రభుత్వం తరఫున ప్రవేశపెట్టిన 38 సవరణలు సభామోదం పొందాయి. మిగతా ఇద్దరు సభ్యులు చేసిన సవరణలన్నీ వీగిపోయాయి.


¤   మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ హత్య కేసులో మరణశిక్ష పడిన ముగ్గురు దోషులకు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. వారి మరణ శిక్షను యావజ్జీవ శిక్షగా మారుస్తూ తీర్పునిచ్చింది.
   

»   క్షమాభిక్ష అభ్యర్థనపై కేంద్ర జాప్యాన్ని సవాలు చేస్తూ, రాజీవ్ హత్య కేసులో దోషులైన శాంతన్, మురుగన్, పేరరివాలన్‌లు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై చీఫ్ జస్టిస్ పి.సదాశివం, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్.కె.సింగ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి, తాజా తీర్పు వెల్లడించింది.
   

»   మున్ముందు క్షమాభిక్ష అభ్యర్థనలపై సకాలంలో రాష్ట్రపతికి సలహాలిచ్చి, పరిష్కారమయ్యేలా చూడాలని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది. దీంతో అసాధారణ జాప్యాన్ని నివారించవచ్చని పేర్కొంది.
ఫిబ్రవరి - 19
¤   కౌమార న్యాయ చట్టం ప్రకారం ముస్లింలు పిల్లలను దత్తత తీసుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కౌమార న్యాయ చట్టం (జువనైల్ జస్టిస్ యాక్ట్) దేశంలోని పౌరులందరికీ వారి మతం, కులంతో సంబంధం లేకుండా వర్తిస్తుందని తెలిపింది.
   

»    ముస్లింలు కూడా తమ 'పర్సనల్ లా' తో సంబంధం లేకుండా ఈ చట్టం ప్రకారం దత్తత తీసుకోవచ్చని పేర్కొంది. ముస్లిం పర్సనల్ లా ప్రకారం పిల్లలను దత్తత తీసుకోవడం నిషిద్ధమని ఆ మత పెద్దలు చెబుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ తీర్పునివ్వడం విశేషం.


¤   2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మధ్యంతర బడ్జెట్‌ను లోక్‌సభ ఆమోదించింది. ద్రవ్య వినియోగానికి ఉద్దేశించిన రెండు బిల్లులకూ పచ్చజెండా ఊపింది. ఈ బిల్లులపై ఎటువంటి చర్చా లేకుండానే సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది.
   

»    ప్రస్తుతం అమలవుతున్న ఆదాయపు పన్ను రేట్లను యథాతథంగా ఉంచాలంటూ అత్యంత ధనవంతులు, కార్పొరేట్లపై విధిస్తున్న సర్‌ఛార్జ్ కొనసాగించాలంటూ కోరుతున్న ఆర్థిక బిల్లు-2014కు లోక్‌సభ ఆమోదం తెలిపింది.

¤    దేశంలో పనిచేస్తున్న వివిధ రకాల ట్రైబ్యునళ్ల పదవీకాలం, అధ్యక్షులు, సభ్యుల పదవీ విరమణ వయసు, భత్యాల ఏకరూపతకు ఉద్దేశించిన బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు.
   

»   దీని ప్రకారం ట్రైబ్యునళ్ల అధ్యక్షులు, సభ్యుల పదవీకాలం ఒకే తీరున గరిష్ఠంగా అయిదేళ్లు ఉంటుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు పదవీ విరమణ వయసు 75 సంవత్సరాలుగా, హైకోర్టు న్యాయమూర్తులకు 67 సంవత్సరాలుగా ఉంటుంది. పరిపాలన విభాగం నుంచి ట్రైబ్యునళ్లలో చేరిన వారి పదవీ విరమణ వయసును 65 ఏళ్లుగా ప్రతిపాదించారు.
   

»   ఈ బిల్లును న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్ సభలో ప్రవేశపెట్టారు.


¤    దేశంలో దారిద్య్ర రేఖ (బీపీఎల్) దిగువన ఉండే జనాభా 2004-2014 మధ్య గణనీయంగా తగ్గినట్లు కేంద్రం వెల్లడించింది.
   

»   పట్టణ ప్రాంతాల్లో బీపీఎల్ జనాభా 2004-05 మధ్య 25.5% కాగా, 2011-12లో అది 13.7 శాతానికి తగ్గింది.
   

»   ప్రణాళికా సంఘం విడుదల చేసిన ఈ గణాంకాలను కేంద్ర గృహకల్పన, పట్టణ పేదరిక నిర్మూలన శాఖమంత్రి గిరిజావ్యాస్ లోక్‌సభలో వెల్లడించారు.

¤     మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హంతకులు ఏడుగురిని విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి జయలలిత శాసనసభలో ఒక ప్రకటన చేశారు.
  

 »   ఇప్పటికే వారు 23 ఏళ్లు జైలు జీవితం గడిపినందున వెంటనే విడుదల చేయాలని మంత్రివర్గ ప్రత్యేక సమావేశంలో నిర్ణయించినట్లు జయలలిత వెల్లడించారు.
   
»   ప్రభుత్వ నిర్ణయంతో శాంతన్, పేరరివాలన్, మురుగన్, నళినితో పాటు మరో ముగ్గురు రాబర్ట్ పీయూష్, జయకుమార్, రవి చంద్రన్‌లకు విముక్తి లభించనుంది.

»   కేసును సీబీఐ నమోదు చేయడంతో, దోషులను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని, ఆ మేరకు వివరాలు పంపుతున్నామని జయలలిత వెల్లడించారు.

»   1991 మే 21న శ్రీ పెరంబుదూరులో రాజీవ్‌గాంధీ దారుణహత్య అనంతరం ఈ 23 ఏళ్లలో ఎన్నెన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. నాటి ఘటనలో రాజీవ్‌గాంధీ, మరో 17 మంది పౌరులు మృత్యువాత పడ్డారు. ఈ కేసులో 26 మందికి ఉరిశిక్ష విధించాలని టాడా కోర్టు తీర్పు వెలువరించింది. అయితే, సర్వోన్నత న్యాయస్థానం మరణశిక్షను అందులో నలుగురికే పరిమితం చేసింది. నళిని కుమార్తె భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆమె (నళిని) మరణశిక్షను 2000 సంవత్సరంలోనే యావజ్జీవంగా మార్చింది. మిగిలిన ముగ్గురికి తాజాగా సుప్రీంకోర్టు ఊరట కల్పించింది.

¤     సుప్రీంకోర్టు ఆవరణలో చోటు చేసుకునే లైంగిక వేధింపుల ఉదంతాలను పరిశీలిస్తున్న కోర్టు కమిటీ (జీఎస్ఐసీసీ) బాధితులు ఫిర్యాదులు చేయడానికి సులువైన మార్గాన్ని రూపొందించింది. సుప్రీంకోర్టు ఆవరణలో జరిగే ఈ వేధింపులపై పిర్యాదులను కోర్టుకు  ఇ - మెయిల్, రిజిస్టర్ పోస్ట్, కొరియర్‌ల ద్వారా పంపేందుకు అనుమతించాలని నిర్ణయించింది.
   

»    'లింగ చైతన్యం, సుప్రీంకోర్టు వద్ద మహిళలపై లైంగిక వేధింపులు (నిరోధం, నిషేధం, పరిష్కారం)'లోని 2ఎ నిబంధన ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది.
   

»    బాధితులు తమ ఫిర్యాదులను కమిటీ కార్యదర్శి, రిజిస్ట్రార్ రచనాగుప్తాకు వ్యక్తిగతంగానే కాకుండా ఆమె ఇ - మెయిల్ ఐడీ gupta.rachana@indianjudiciary.gov.in కి కూడా పంపవచ్చని ప్రకటించింది.
   

»    జీఎస్ఐసీసీ గతేడాది నవంబరులో ఏర్పడింది.
ఫిబ్రవరి - 20
¤     ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది.
   

»    లోక్‌సభలో స్వల్ప చర్చతోనే మూజువాణి ఓటుతో ఆమోదం పొందిన రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు రాజ్యసభలో కూడా మూజువాణి ఓటుతోనే ఆమోదం పొందింది.


¤     మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హంతకుల విడుదలకు తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
   

»    తమిళనాడు ప్రభుత్వ నిర్ణయంపై స్టే విధించాలని, ప్రాథమిక న్యాయసూత్రాలను సమీక్షించాలని కేంద్రం దాఖలు చేసిన అత్యవసర అభ్యర్థనపై సుప్రీంకోర్టు విచారణ జరిపి స్టే విధించింది.
   

»    చీఫ్‌జస్టిస్ పి.సదాశివం నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం రాజీవ్ హంతకుల విడుదలపై స్టే విధిస్తూ, తాము మరణశిక్షను యావజ్జీవ ఖైదుగా మార్చిన ముగ్గురు ఖైదీల విషయంలో తదుపరి చర్యలు తీసుకోకుండా యథాతథస్థితిని కొనసాగించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ముగ్గురితోపాటు తమిళనాడు ప్రభుత్వం విడుదల చేయదలచిన మరో నలుగురు హంతకుల విషయంలో కేంద్రం తన అభిప్రాయాన్ని తెలియజేయాలని సూచించింది.


¤     ఒడియాను ప్రాచీన భాషల జాబితాలో చేర్చేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
   »    ప్రాచీన భాషల జాబితాలో ఇప్పటికే సంస్కృతం, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలకు చోటు లభించింది.
ఫిబ్రవరి - 21
¤ వైద్య అవసరాలకోసం వాడే నార్కోటిక్ మందుల నిబంధనలను సరళం చేసే 'నార్కోటిక్ మందులు, మానసిక ఔషధ పదార్థాల (సవరణ) బిల్లు'ను పార్లమెంట్ ఆమోదించింది.   
» ఆర్థికశాఖ సహాయమంత్రి జె.డి.శీలం ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు.  
 » ఫిబ్రవరి 20న ఈ బిల్లును లోక్‌సభ ఆమోదించింది.   
» ఈ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో క్యాన్సర్ బాధితుల నొప్పిని తగ్గించే మార్ఫిన్ మందులు తేలిగ్గా అందుబాటులోకి రానున్నాయి. 

¤ గుండెకు కూరగాయలు ఎంతో మేలు చేస్తాయని చెబుతూ, పంజాబ్‌లోని లూథియానా రాన్‌బాక్సీ లేబోరేటరీస్ లిమిటెడ్‌కు చెందిన వైద్యులు, ఉద్యోగులు సహా వెయ్యిమంది కలిసి కూరగాయలతో రూపొందించిన భారీ ప్రేమచిహ్నం గిన్నిస్ రికార్డుల్లో చోటు పొందింది.

» 480 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 19,815 కిలోల కూరగాయలతో దీన్ని ఏర్పాటు చేసి గిన్నిస్ రికార్డు సృష్టించారు.
 

¤  15వ లోక్‌సభ చివరి సమావేశాలు ముగిశాయి.
¤  ఇకపై వైద్యులు సిఫార్సు చేసే మందులను తప్పనిసరిగా 'క్యాపిటల్' అక్షరాల్లోనే స్పష్టంగా అర్థమయ్యేలా అక్షరాలను విడివిడిగా రాయాలని భారతీయ వైద్యమండలి (ఎంసీఐ) నిర్ణయించింది. ఈ మేరకు ముసాయిదాను రూపొందించి, కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించింది.
¤  ప్రభుత్వోద్యోగులు, ప్రజాప్రతినిధుల అవినీతి, అధికార దుర్వినియోగాలపై ఉప్పందించే ప్రజావేగుల (విజిల్ బ్లోయర్స్) రక్షణకు ఉద్దేశించిన బిల్లును పార్లమెంట్ ఆమోదించింది.   
» 2011లోనే లోక్‌సభ ఆమోదించిన ఈ బిల్లుకు రాజ్యసభ తాజాగా ఆమోదం తెలిపింది.
ఫిబ్రవరి - 22
¤  వడోదర మున్సిపల్ కార్పొరేషన్ (వీఎంసీ) పేరు గిన్నిస్ పుస్తకానికి ఎక్కింది. 8 గంటల్లో 8 వేలకు పైగా వ్యక్తుల రక్తపోటు (బీపీ) కొలిచి, ఈ ప్రపంచ రికార్డు సాధించింది.   
» 2013 ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, వీఎంసీ ఆధ్వర్యంలో 227 మంది వైద్యులు 8 గంటల్లో 8,368 మంది వ్యక్తుల రక్తపోటు కొలిచారు. గతంలో 8 గంటల్లో 8,026 మంది వ్యక్తుల బీపీ నమోదు చేసిన ఫిలిప్పీన్స్  గిన్నిస్‌లో స్థానం పొందింది. వీఎంసీ దాన్ని అధిగమించింది.
ఫిబ్రవరి - 23
¤  16వ సార్వత్రిక ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన చివరి విడత ఎన్నికల జాబితా ప్రకారం దేశంలో ఓటర్ల సంఖ్య 81,45,91,184కు చేరింది. స్వాతంత్య్రానంతరం 1951 - 52లో మొదటి సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈ సంఖ్య 17,32,12,343 మాత్రమే.
   
» 1998 నుంచి జరిగిన నాలుగు సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే 2014 నాటికి ఓటర్ల సంఖ్య 34.45% పెరిగింది.   
» గత పదేళ్లలో దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో దాద్రానగర్ హవేలిలో అత్యధికంగా 53.9% ఓటర్ల పెరుగుదల కనిపించింది. ఆ తర్వాత పుదుచ్చేరిలో 39.1% పెరుగుదల నమోదైంది.   
» రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్‌లో అత్యధికంగా 31.7% ఓటర్లు పెరిగారు.   
» సంఖ్యాపరంగా ఉత్తరప్రదేశ్ తొలి స్థానంలో, లక్షద్వీప్ చివరిస్థానంలో ఉన్నాయి.   
» 2014 లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల సంఖ్య 6,23,85,949కి చేరింది.   
» 2009 సార్వత్రిక ఎన్నికల అనంతరమే దేశవ్యాప్తంగా ఓటర్ల సంఖ్య 9.76 కోట్లు పెరిగింది.   
» దేశవ్యాప్తంగా ఉన్న ఓటర్లలో ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోనే 49.1% ఓటర్లు ఉన్నారు.   
» దేశం మొత్తం ఓటర్లలో సిక్కిం, మిజోరం, అరుణాచల్‌ప్రదేశ్, గోవా, నాగాలాండ్ రాష్ట్రాల్లో 0.5% లోపే ఓటర్లు ఉన్నారు.   
» 98.27% ఓటర్లు రాష్ట్రాల్లో నివసిస్తుండగా, 1.73% కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉంటున్నారు.   
» లింగనిష్పత్తి ప్రకారం ఓటర్ల సంఖ్య 1971 నుంచే అందుబాటులోకి వచ్చింది. 1971 నుంచి ప్రతిసారీ మహిళా ఓటర్ల సంఖ్యలో 47.4% నుంచి 48% పెరుగుదల కనిపించింది.
ఫిబ్రవరి - 25
¤  కార్మికరాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐసి)కి 2014 ఫిబ్రవరి 24 నాటికి 62 ఏళ్లు పూర్తయ్యాయి. వివిధ రంగాల్లోని ఉద్యోగులకు సామాజిక భద్రత చేకూర్చేందుకు ఈ సంస్థ నిర్వహిస్తున్న ఈఎస్ఐ పథకం కూడా 62 ఏళ్లు పూర్తి చేసుకుంది.
   
» 1952 ఫిబ్రవరి 24న అప్పటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ కాన్పూర్‌లో ఈ పథకాన్ని ప్రారంభించారు. దీంతో ఫిబ్రవరి 24ను ఈఎస్ఐ దినోత్సవంగా పాటిస్తున్నారు.   
» వైద్యసేవలతో పాటు, విధి నిర్వహణలో గాయపడటం, నిరుద్యోగం, మరణం తదితర సందర్భాల్లో బాధితులకు, మృతుల కుటుంబాలకు నగదు ప్రయోజనాలు చేకూర్చడానికి ఈ సెల్ఫ్ ఫైనాన్సింగ్ పథకాన్ని ప్రవేశపెట్టారు.
ఫిబ్రవరి - 26
¤  తొమ్మిది లక్షల మందికి పైగా ఉన్న పారామిలటరీ బలగాలకు, వారి కుటుంబాలకు వైద్య సేవల నిమిత్తం కేంద్ర ప్రభుత్వం రూ.1,368 కోట్ల భారీ ప్రాజెక్టును ఆవిష్కరించింది.   
» ఇందులో భాగంగా 'కేంద్ర సాయుధ పోలీసు బలగాల వైద్య విజ్ఞాన సంస్థ (క్యాప్‌ఫిమ్స్)'గా పిలిచే ఆస్పత్రికి ప్రధాని మన్మోహన్ సింగ్ న్యూఢిల్లీలో శంకుస్థాపన చేశారు. సైన్యం తరహాలో రిసెర్చ్ అండ్ రిఫరల్ హాస్పిటల్‌ను, ఎయిమ్స్ తరహాలో ఒక వైద్య కళాశాలను ఇందులో ఏర్పాటు చేయనున్నారు.   
» దక్షిణ ఢిల్లీ మైదాన్ గర్హి ప్రాంతంలో 51.41 ఎకరాల్లో ఈ ఆస్పత్రి నిర్మితం కానుంది.

¤  జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని మూడు బొగ్గు గనుల వేలం ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ మూడు గనుల్లో దాదాపు 50 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలున్నట్లు ప్రభుత్వం అంచనా వేసింది.   
» బొగ్గు గనులకు వేలం నిర్వహించడం దేశంలో ఇదే ప్రథమం. 2004-09 మధ్య కాలంలో వేలం లేకుండానే 57 గనులను ప్రైవేటు కంపెనీలకు అప్పగించడంతో, ప్రభుత్వ ఖజానాకు రూ.1.80 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక వెల్లడించడంతో, కేంద్రం ఈ వేలాన్ని చేపట్టింది.   
» పశ్చిమ బెంగాల్‌లోని ఒక గనికి, జార్ఖండ్‌లోని రెండు గనులకు వేలం నిర్వహిస్తున్నారు.
ఫిబ్రవరి - 27
¤  మధ్యంతర బడ్జెట్‌లో ప్రకటించిన మేరకు పదవీ విరమణ సైనికోద్యోగుల్లో 'ఒకే ర్యాంక్ వారికి ఒకే పింఛన్' విధానాన్ని ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని రక్షణ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

¤  ఐఏఎస్ అధికారుల వార్షిక పనితీరు మదింపు నివేదికను నమోదు చేయడానికి ప్రభుత్వం ఆన్‌లైన్ వ్యవస్థను ప్రారంభించింది.   
» 'స్మార్ట్ పెర్‌ఫార్మెన్స్ అప్రైజల్ రిపోర్ట్ రికార్డింగ్ ఆన్‌లైన్ విండో' (స్పారో) అని పిలుచుకునే ఈ వ్యవస్థను నేషనల్ ఇన్‌ఫర్‌మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) రూపొందించింది.   
» కేంద్ర సిబ్బంది వ్యవహారాల సహాయమంత్రి వి.నారాయణ స్వామి న్యూఢిల్లీలో దీన్ని ప్రారంభించారు.   
» దేశవ్యాప్తంగా సుమారు 4,737 మంది ఐఏఎస్ అధికారులు పని చేస్తున్నారు. రాష్ట్రాల్లో నియమితులైన అధికారులతో పాటు కేంద్ర మంత్రిత్వ శాఖల్లో లేదా విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులకు ఈ వ్యవస్థ మార్చి చివరి వారం నుంచి అందుబాటులోకి రానుంది.

¤  భారత వార్తా పత్రికల సంఘం (ఐఎన్ఎస్) ప్లాటినం జూబ్లీ (75 సంవత్సరాలు) ఉత్సవాలను న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించారు.   
» రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

¤  దుష్ప్రవర్తన కారణంగా సస్పెండై, దర్యాప్తును ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వోద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ అవకాశం ఉండదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు కొత్త నిబంధనలను జారీ చేసింది.   
» సస్పెన్షన్‌కు గురై, ఛార్జిషీట్ దాఖలై, దర్యాప్తును ఎదుర్కొంటున్న ఉద్యోగి స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తానని కోరితే, ఆ విజ్ఞప్తిని ఉన్నతాధికారి నిలిపివేయవచ్చని ఈ నిబంధన పేర్కొంది.

¤  ప్రభుత్వ పథకాల అమలు తీరును పరిశీలించేందుకు స్వతంత్ర మూల్యాంకన కార్యాలయం (ఇండిపెండెంట్ ఎవల్యూషన్ ఆఫీస్ - ఐఈఓ)ను ప్రణాళికా సంఘం ప్రారంభించింది.   
» ఢిల్లీలో ప్రజా పంపిణీ ద్వారా రాయితీపై సరఫరా చేస్తున్న సరకుల్లో 57% లబ్ధిదారులకు చేరడం లేదని ఈ సంస్థ అభిప్రాయపడింది.   
» ఐఈఓ డైరెక్టర్ జనరల్ అజయ్ చిబ్బర్.
 ఫిబ్రవరి - 28
¤  కేంద్ర మంత్రివర్గం న్యూఢిల్లీలో సమావేశమై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.ముఖ్యాంశాలు   » రూ.434 కోట్లతో దేశంలోని జోర్హాట్ (అసోం), భోపాల్ (మధ్యప్రదేశ్), కురుక్షేత్ర (హర్యానా)లతోపాటు రాష్ట్రంలోని విజయవాడలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ డిజైన్ (ఎన్ఐడీ) ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో ఒక్కోదానికి రూ.108.5 కోట్లు ఖర్చు చేయనున్నారు.   
» రాష్ట్రానికి పది కేంద్రీయ విద్యాలయాలను మంత్రివర్గం మంజూరు చేసింది. వీటిలో ఏడింటిని తెలంగాణలో, మూడింటిని సీమాంధ్రలో ఏర్పాటు చేయనున్నారు. కేంద్రీయ విద్యాలయాలను తెలంగాణలోని వరంగల్, సికింద్రాబాద్, నల్గొండ, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్‌లలో; సీమాంధ్రలో కడప, గుంటూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో పాఠశాలను రూ.15 కోట్లతో ఏర్పాటు చేయనున్నారు.   
» ప్రస్తుతం దేశంలో 1,094 కేంద్రీయ విద్యాలయాలున్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొని ఆంధ్రప్రదేశ్‌కు 10 సహా, దేశవ్యాప్తంగా 54 కొత్త విద్యాలయాల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.   
» జీఎస్ఎల్‌వీ మార్క్-3 ప్రయోగం, సంబంధిత పనులకు అదనంగా రూ.464.78 కోట్లు కేటాయింపు. తాజా సవరణతో ఈ ప్రాజెక్టు బడ్జెట్ రూ.2,962.78 కోట్లకు చేరింది.   
» ఆకాశవాణి, దూరదర్శన్‌ల అభివృద్ధికి రూ.3,500 కోట్ల కేటాయింపునకు ఆమోదం.   
» 'హిమాలయాల పర్యావరణ వ్యవస్థ పరిరక్షణ' విధి విధానాలకు ఆమోదం. దీనికి పన్నెండో పంచవర్ష ప్రణాళికలో రూ.550 కోట్లు వెచ్చిస్తారు.   
» దేశంలో విద్యాపరంగా వెనుకబడిన బ్లాకుల్లో 3,500 ఆదర్శ పాఠశాలల ఏర్పాటుకు ఆమోదం.   
» చెన్నైలో సముద్రపు నీటిశుద్ధి ప్లాంట్ ఏర్పాటుకు రూ.871 కోట్ల కేంద్ర సాయం. కర్ణాటకలోని కోలార్‌లో ఆధునిక రైలు కోచ్‌ల తయారీ కర్మాగారం ఏర్పాటుకు ఆమోదం.   
» గిరిజనులకు జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనిదినాలను 150 కి పెంచారు. ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది.   
» లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల వ్యయపరిమితి పెంపునకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. పెద్ద రాష్ట్రాల్లో లోక్‌సభ అభ్యర్థి వ్యయపరిమితి రూ.70 లక్షలకు (ప్రస్తుతం రూ.40 లక్షలు), అసెంబ్లీ వ్యయ పరిమితి రూ.28 లక్షలకు (ప్రస్తుతం రూ.14 లక్షలు) పెంచారు. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, గోవా, అండమాన్ నికోబార్ దీవులు, చండీగఢ్, దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యూ, పాండిచ్చేరి, లక్షదీవుల్లో లోక్‌సభ వ్యయ పరిమితి రూ.54 లక్షలుగా నిర్దేశించారు. అరుణాచల్ ప్రదేశ్, గోవా, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, పాండిచ్చేరిలలో అసెంబ్లీ అభ్యర్థి వ్యయ పరిమితిని రూ.20 లక్షలకు పెంచారు.¤ ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో కువాకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్యామగిరి అటవీ ప్రాంతంలో పోలీసు వాహనాలపై మావోయిస్టులు మెరుపు దాడి చేసిన ఘటనలో ఎస్సై సహా అయిదుగురు పోలీసులు మృత్యువాత పడ్డారు.