జనవరి - 2014 సైన్స్ అండ్ టెక్నాలజీ


జనవరి - 3
¤ అంగారక గ్రహానికి తిరుగు ప్రయాణం లేని యాత్ర (మార్స్ వన్-వే ట్రిప్ మిషన్) కోసం జరిపిన తొలి వడపోతలో 1,058 మంది ఎంపికయ్యారు. వీరిలో అత్యధికంగా అమెరికా నుంచి 297 మంది ఎంపికయ్యారు. భారతీయులు 62 మంది ఉన్నారు. వీరిని మరింత వడపోసి, చివరికి ఇద్దరు స్త్రీలను, ఇద్దరు పురుషులను యాత్రకు ఎంపిక చేస్తారు. వీరు 2024లో అంగారక గ్రహానికి పయనమవుతారు.
జనవరి - 4
¤ ఊపిరితిత్తుల్లోని ఒక రకం కణాలకు ముక్కులాగా కాఫీ, సిగరెట్ వాసనలను పసిగట్టే శక్తి ఉందని వాషింగ్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనుక్కున్నారు.          

» అయితే, ముక్కులోని వాసన గ్రాహకాలకు, ఊపిరితిత్తుల్లోని గ్రాహకాలకు మధ్య తేడా ఉందని వీరు వెల్లడించారు. ముక్కులో వాసన గ్రాహకాలు నాడీకణాల పొరల్లో ఉంటే ఊపిరితిత్తుల్లో మాత్రం శ్వాసమార్గంలో ఉంటాయి. వీటినే పల్మనరీ న్యూరో ఎండోక్రైన్ కణాలంటారు. ఇవి మెదడుకు నాడీ సంకేతాలను పంపడానికి బదులుగా ఆ వాసనను గ్రహించేందుకు వీలు కల్పిస్తాయి. దీంతో సమీపంలో ఎవరైనా సిగరెట్ తాగుతుంటే వెంటనే పల్మనరీ ఎండోక్రైన్ కణాలు హార్మోన్లను విడుదల చేస్తాయి. దాంతో శ్వాసమార్గం మూసుకున్నట్లు అవుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
జనవరి - 5
¤ అంతరిక్షాన భారత్ కీర్తిపతాక మరోసారి రెపరెపలాడింది. రెండు దశాబ్దాల పాటు అందని ద్రాక్షలా ఉన్న క్రయోజెనిక్ ఇంజిన్ పరిజ్ఞానంపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఎట్టకేలకు పట్టు సాధించింది. సంక్లిష్టమైన పరిజ్ఞానాన్ని మనకు అందకుండా చేయాలనుకున్న అగ్రరాజ్యాల కుతంత్రాలను తుత్తునియలు చేసింది.
         
 » స్వదేశీ సామర్థ్యంతో రూపొందిన క్రయో ఇంజిన్‌తో జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (జీఎస్ఎల్‌వీ) - డి5 సగర్వంగా రోదసీలోకి దూసుకెళ్లింది. విజయవంతంగా జీశాట్-14 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టింది. క్రయోజెనిక్ ఇంజిన్ కలిగిన అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జపాన్, చైనా సరసన భారత్ చేరింది. ఈ విజయంతో అంతరిక్ష రవాణా రంగంలో మన దేశం పూర్తిస్థాయి స్వయం ప్రతిపత్తిని సాధించినట్లయింది.

         
 » నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలోని రెండో ప్రయోగ వేదికపై నుంచి జీఎస్ఎల్‌వీ-డీ5 ను విజయవంతంగా ప్రయోగించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన క్రయోజెనిక్ ఇంజిన్‌ను ఇందులో ఉపయోగించారు. ఇలా మన దేశ క్రయోఇంజిన్‌ను వినియోగించడం ఇది రెండోసారి.

          
» 2010 ఏప్రిల్ 15న జీఎస్ఎల్‌వీ-డీ3 లో ఇలాంటి ఇంజిన్‌ను తొలిసారిగా వినియోగించారు. కానీ, రాకెట్ విఫలమైంది. అదే ఏడాది డిసెంబరు 25న మరోసారి రష్యా క్రయోజెనిక్ ఇంజిన్ల ద్వారా జీఎస్ఎల్‌వీ-ఎఫ్6 వాహకనౌకను నింగిలోకి పంపగా అదికూడా విఫలమైంది. ఆ తర్వాత నిరుడు జీఎస్ఎల్‌వీ-డీ5 ను ప్రయోగించేందుకు సిద్ధపడగా చివరి నిమిషాల్లో రెండో దశలో ఇంధనం లీక్ కావడంతో ప్రయోగాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ చేదు అనుభవాలన్నింటినీ వెనక్కి నెట్టేస్తూ జీఎస్ఎల్‌వీ-డీ5 ప్రయాణాన్ని ఇస్రో విజయవంతం చేసింది.
          
» 1982 కిలోల బరువున్న జీశాట్-14 సమాచార ఉపగ్రహాన్ని భూమికి 179 × 35,950 కిలో మీటర్ల మధ్యంతర భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగంతో 2.2 టన్నుల బరువున్న సమాచార ఉపగ్రహాలను భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టే సామర్థ్యం భారత్‌కు సమకూరినట్లయింది.          

» 2001 నుంచి ఇప్పటి వరకూ ఎనిమిది సార్లు జీఎస్ఎల్‌వీ రాకెట్లను ప్రయోగించగా, నాలుగుసార్లు విజయవంతమయ్యాయి. లోగడ సఫలమైన ప్రయోగాలన్నింటిలోనూ రష్యా నుంచి దిగుమతి చేసుకొన్న క్రయోజెనిక్ ఇంజిన్లను ఉపయోగించారు.          » జీఎస్ఎల్‌వీలో మూడు దశలు ఉన్నాయి. ఈ వాహక నౌక ఎత్తు 49.13 మీటర్లు, బరువు 414.75 టన్నులు. మొదటి దశలో ఘన ఇంధనాన్ని, రెండో దశలో ద్రవ ఇంధనాన్ని ఉపయోగించారు. కీలకమైన మూడో దశ (క్రయోజెనిక్ దశ)లో ద్రవీకృత హైడ్రోజన్, ఆక్సిజన్‌లను వాడారు.          

» జీఎస్ఎల్‌వీ-డీ5 వాహక నౌక ప్రయోగానంతరం 1,027 సెకన్లు ప్రయాణించి, భూమధ్య రేఖకు 19.3 డిగ్రీల వాలులో దీర్ఘ వృత్తాకారపు భూస్థిర కక్ష్య (జీటీవో) లోకి ఉపగ్రహం చేరింది. దీని పెరిజీ (కక్ష్యలో భూమికి చేరువగా ఉండే బిందువు) 179 కి.మీ. కాగా, అపోజీ (భూమికి దూరంగా ఉండే బిందువు) 35,950 కి.మీ. అక్కడి నుంచి కర్ణాటకలోని హసన్‌లో ఉన్న మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ (ఎంసీఎఫ్) శాస్త్రవేత్తలు ఉపగ్రహాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. ఉపగ్రహంలోని మోటార్లను దశలవారీగా మండించడం ద్వారా భూమధ్య రేఖకు 74 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద 36,000 కి.మీ. దూరంలో వృత్తాకార భూస్థిర కక్ష్యలో ఉపగ్రహాన్ని చేరవేస్తారు.

జీశాట్-14 ప్రయోజనాలు
 జీశాట్-14 సమాచార ఉపగ్రహం జీవితకాలం 12 ఏళ్లు. ఇందులో 6 కేయూ ట్రాన్స్‌పాండర్లు, 6సీ బ్యాంక్ ట్రాన్స్‌పాండర్లు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలను అనుసంధానం చేసి సామాన్యులకు సైతం వైద్యం లాంటి పలు సేవలను జీశాట్ ఉపగ్రహాలు అందుబాటులోకి తీసుకొచ్చాయి. నిజానికి మనకు 400 ట్రాన్స్‌పాండర్లు అవసరం. ప్రస్తుతం 200 వరకు ఉన్నాయి. వాటిని 500 వరకు తీసుకొచ్చేందుకు ఇస్రో కృషి చేస్తోంది. ప్రస్తుతం దేశంలోని 300 ఛానళ్లకు మాత్రమే మనదేశ ట్రాన్స్‌పాండర్లు ఉపయోగిస్తున్నారు. మిగిలినవి విదేశీ ఉపగ్రహాల ద్వారా పనిచేస్తున్నాయి. తాజా ఉపగ్రహ తయారీకి, ప్రయోగానికి దాదాపు రూ.350 కోట్లు వ్యయమైంది.
జనవరి - 6
¤   కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్-14 కక్ష్య పెంపును భారత అంతరిక్ష పరిశోధన సంస్థ విజయవంతంగా నిర్వహించింది.
          

»  ఉపగ్రహంలోని అపోజీ మోటార్‌ను 3,134 సెకన్ల పాటు మండించారు. ఫలితంగా ఉపగ్రహ పెరిజీ (కక్ష్యలో భూమికి చేరువగా ఉండే బిందువు) 8,966 కిలోమీటర్లకు, అపోజీ (కక్ష్యలో భూమికి దూరంగా ఉండే బిందువు) 35,744 కిలోమీటర్లకు పెరిగింది.
జనవరి - 7
¤   మనకు 200 కాంతి సంవత్సరాల దూరంలో భూమి లాంటి ఓ గ్రహాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. వాయువులతో కూడిన ఈ గ్రహం భూమికి సమానమైన ద్రవ్యరాశితో, భూమికంటే 60% అధిక వ్యాసంతో ఉంది. ఈ గ్రహంలో వాయువులు అత్యధిక స్థాయిలో నిండి ఉంటాయనీ, అందుకే ఎక్కువ వ్యాసంతో ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
         

»  నాసాకు చెందిన కెప్లర్ వ్యోమనౌక ఆధారంగా హార్వర్డ్ - స్మిత్‌సోనియన్ ఖగోళ భౌతికశాస్త్ర కేంద్రం పరిశోధకులు ఈ కొత్తగ్రహం గురించి తెలుసుకున్నారు. దీనికి కేఓఐ-314సి అనే సంకేతనామం పెట్టారు.
         

»  ఇది ఒక మరుగుజ్జు నక్షత్రం చుట్టూ తిరుగుతోంది. ఒకసారి పూర్తిగా తిరిగి రావడానికి 23 రోజులు పడుతుంది. గ్రహం ఉష్ణోగ్రత 104 డిగ్రీల సెల్సియస్ వరకూ ఉంటుందని, ఇంతటి వేడిలో జీవం ఉనికిలోఉండటానికి అవకాశం లేదని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన డేవిడ్ కిప్సంగ్ ప్రకటించారు.


¤   ప్రపంచంలోనే తొలిసారిగా సూక్ష్మజీవనాశక (యాంటీ బ్యాక్టీరియల్) టచ్‌స్క్రీన్‌ను అమెరికాకు చెందిన కార్నింగ్ సంస్థ రూపొందించింది.
        

 »  అయానిక్ సిల్వర్ అనే సూక్ష్మజీవనాశక పదార్థం చేర్చిన గొరిల్లా గ్లాస్ ఉపయోగించి, ఈ తెరలను తయారు చేశారు. దీనివల్ల ఈ తెరలపై బ్యాక్టీరియా, బూజు, శిలీంధ్రాలు చేరవు. దీన్ని ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లులాంటి ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులకూ ఉపయోగించవచ్చు.

¤    అణ్వస్త్రాన్ని మోసుకెళ్లగల పృథి-2 క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది.
        

 »   ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్)లో సంచార లాంచర్ నుంచి దీన్ని ప్రయోగించారు.
        

 »   శిక్షణ అభ్యాసంలో భాగంగా సైన్యంలోని వ్యూహాత్మక దళాల కమాండ్ ఈ పరీక్షను నిర్వహించింది.
        

 »   పరీక్ష పూర్తిస్థాయిలో విజయవంతమైంది. బంగాళాఖాతంలోని నిర్దేశిత ప్రాంతంలో ఈ క్షిపణి పడింది.
        

 »   పృథ్వీ-2 ను సమీకృత క్షిపణి అభివృద్ధి కార్యక్రమం కింద డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు రూపొందించారు.

        
 »  దీన్ని 2003లో సైన్యంలో ప్రవేశపెట్టారు. ఇది ఉపరితలం నుంచి ఉపరితలంపై ఉన్న లక్ష్యాలను ఛేదించగలదు. 350 కిలోమీటర్ల దూరానికి వెయ్యి కిలోల వార్‌హెడ్‌ను మోసుకెళ్లగలదు.
జనవరి - 9
¤    ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన పలుచటి పొర కలిగిన సేంద్రియ ట్రాన్సిస్టర్‌ను అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ పరిజ్ఞానంతో ఇప్పటివరకూ అభివృద్ధి చేసిన ఇతర ట్రాన్సిస్టర్ల కంటే ఇది అయిదురెట్లు వేగంగా పనిచేయడం విశేషం.
         

»   నెబ్రస్కా-లింకన్ విశ్వవిద్యాలయం, స్టాన్‌ఫోర్డ్ వర్సిటీలకు చెందిన శాస్త్రవేత్తలు దీన్ని రూపొందించారు.


¤    తేయాకు, పసుపు, పచ్చగోబీపువ్వు(బ్రకోలీ)ల్లో ఉండే ఫైటో రసాయనాలు క్యాన్సర్ చికిత్స (కీమోథెరపీ) దుష్ప్రభావాలను నియంత్రిస్తున్నట్లు కోల్‌కతాలోని చిత్తరంజన్ నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ (సీఎన్‌సీఐ) శాస్త్రవేత్తలు గుర్తించారు.
         

»   కీమోథెరపీతోపాటు ఈ ఫైటోకెమికల్స్‌నూ కలిపి ఇస్తే క్యాన్సర్ మందుల సామర్థ్యం గణనీయంగా పెరుగుతున్నట్లు వీరి అధ్యయనంలో బయటపడింది.


¤    పులి, సింహం, చిరుత లాంటి జంతువుల్లో కృత్రిమ గర్భధారణకు సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ)కి చెందిన లేబోరేటరీ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ ఎన్‌డేంజర్డ్ స్పీసీస్ (లాకోన్స్) శాస్త్రవేత్తలు నడుం బిగించారు.

        »   తొలుత చిరుతలపై ప్రాజెక్టును చేపట్టారు. ముందుగా సేకరించి, భద్రపరిచిన శుక్రకణాలను ప్రత్యేకంగా రూపొందించిన ట్యూబ్ ద్వారా నేరుగా ఆడచిరుతల గర్భాశయంలోని అండాల వరకు చేర్చవచ్చని లాకోన్స్ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
జనవరి - 10
¤    అధిక రక్తపోటు ఉన్నవారికి అనువైన రీతిలో మూడు ఔషధాలు కలిసిన మిశ్రమ ట్యాబ్లెట్‌ను డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీ దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది.        

»   'ఆప్టిడోజ్' అనే బ్రాండ్ పేరుతో హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో దీన్ని విడుదల చేశారు.       

 »   ఇందులో ఆమ్లోడిపిన్ (2.5 ఎం.జి.), టెల్మిసార్టాన్ (20 ఎం.జి.), హైడ్రోక్లోరో థియాజైడ్ (6.25 ఎం.జి.) ఔషధాలు కలిసి ఉంటాయి.

¤    గురుగ్రహానికి రెట్టింపు బరువున్న భారీ గ్రహాన్ని పైసీజ్ అనే నక్షత్ర మండలంలో ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు.       

 »   మన సౌరమండలంలాగా ఈ గ్రహం సమీపంలో ఒకే ఒక నక్షత్రం తప్ప మరేవీ లేవు. అంతరిక్షంలో ఇలా ఏక నక్షత్ర మండలాలు చాలా అరుదు.

¤    హైదరాబాద్ ఈసీఐఎల్‌లోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ (టీఐఎఫ్ఆర్) బెలూన్ ఫెసిలిటీ విభాగం అంతర్జాతీయ స్థాయిలో ముందడుగు వేసింది.        

»   తాజాగా ఈ సంస్థ చేపట్టిన పాలిథిన్ బెలూన్ ప్రయోగం విజయవంతమయింది. 'హై ఆల్టిట్యూడ్ అసెంట్ - 3 ప్రాజెక్ట్' పేరుతో చేపట్టిన ఈ ప్రయోగంలో బెలూన్ 2 గంటల 9 నిముషాల్లో 51.661 కి.మీ.ల ఎత్తు పయనించి, రికార్డు సృష్టించింది.       

 »   ఇలాంటి ప్రయోగం చేసిన అమెరికా, జపాన్ తరువాత మూడో స్థానంలో భారత్ నిలిచింది. పర్యావరణ పరిశోధనలకు ఈ ప్రయోగం దోహదపడుతుంది.
 జనవరి - 11
¤    118 రోజుల్లో హెక్టారుకు అత్యధికంగా 11,567 కిలోల దిగుబడి ఇచ్చే కొత్త వరి వంగడాన్ని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవిష్కరించింది.       

 » 'టీపీఎస్ - 5' గా పిలిచే ఈ రకాన్ని నమక్కల్ జిల్లా మొహనూర్‌లో ఇప్పటికే ప్రయోగాత్మకంగా పండించి విజయం సాధించారు.        

» హెక్టారుకు 1,679 కిలోల దిగుబడి ఇచ్చే 'ఏండీయూ - 1' రకం నల్ల పెసలు, ఏడాదికి 227 టన్నుల దిగుబడి ఇచ్చే 'సీవో 31' రకం సజ్జ వంగడాలను కూడా కనుక్కుంది.

¤    విస్ఫోటనం చెందిన ఓ నక్షత్రం నుంచి ప్రకాశవంతమైన అపరిమిత పదార్థం అంతరిక్షంలోకి ఎగసిపడింది. ఒక చేయి మాదిరిగా నీలి, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లో ఉన్న ఎక్స్ కిరణాలతో కూడిన వర్ణ శోభిత దృశ్యం ఆవిష్కృతమైంది. 
        
» ఈ ఖగోళ అద్భుతం 'దేవుడి చేయి'ని తలపిస్తున్న నేపథ్యంలో ఈ నక్షత్ర పేలుడు (సూపర్ నోవా)కు నాసా శాస్త్రవేత్తలు 'హ్యాండ్ ఆఫ్ గాడ్‌'గా నామకరణం చేశారు. 


¤    ప్రపంచంలో తొలిసారిగా అంతరిక్షం నుంచి ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు బ్రిటన్‌కు చెందిన ఛానల్ - 4 ప్రకటించింది.        

» భూకక్ష్య నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని (ఐఎస్ఎస్) అనుసరిస్తూ చిత్రించిన దృశ్యాలను 170 దేశాల్లో నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది.
జనవరి - 16
¤    వెలుగులు విరజిమ్మే మొక్కను అమెరికా శాస్త్రవేత్తలు రూపొందించారు.        

» 'నికోటియానా అలాటా' అనే మొక్కలో బయోల్యుమినిసెంట్ బ్యాక్టీరియా జన్యువులను ప్రవేశ పెట్టి 'స్టార్ లైట్ అవతార్' అనే ఈ మొక్కను అమెరికాలోని 'బయో గ్లో' సంస్థ శాస్త్రవేత్తలు రూపొందించారు.

       
 » చీకటి గదిలో ఈ మొక్కను ఉంచితే అందులోని కాంతి మెల్లమెల్లగా గది అంతటికీ
వ్యాపిస్తుంది.


¤    అంతరిక్షంలో పరిశోధనలు చేసే వ్యోమగాముల కోసం యూరోపియన్ ఆస్ట్రోనాట్కేంద్రం
 (ఈఏసీ కొత్త సూట్ ను తయారు చేసింది.
       

 » అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం మూలంగా ఎముకలనిర్మాణం,
 క్షీణతల మధ్య సమతుల్యత దెబ్బతింటుందిదీని ప్రభావం వల్లవ్యోమగాముల ఎముకల

 ద్రవ్యరాశి నెలరోజుల్లో 3 శాతం తగ్గిపోతుందని శాస్త్రవేత్తలువివరించారు.
        

»  ఇబ్బందిని అధిగమించడానికి  కొత్త స్కిన్ సూట్ఉపయోగపడుతుంది.
ఇది శరీరాన్ని గట్టిగా పట్టుకొని ఎముకల ఆకృతి మారకుండాకాపాడుతుందని శాస్త్రవేత్తలు
ప్రకటించారుసుదీర్ఘ కాలంలో ఆసుపత్రిలో చికిత్సతీసుకుంటూ బెడ్‌పై ఉన్న రోగులు కూడా
దీన్ని వాడొచ్చని వారు తెలిపారు.
        

» పరిశోధనకు సైమన్ ఈవెట్స్ నేతృత్వం వహించారు.


¤    వంశపారంపర్యంగా సంక్రమించే అంధత్వంలో 'కొరోయ్ డెరిమియా' అరుదైంది.దీన్ని
నిరోధించేందుకు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు సరికొత్త జన్యుచికిత్సను
అభివృద్ధి చేశారు.
        »  వ్యాధిగస్థుల రెటీనాలోకి  జన్యువును ప్రవేశ పెట్టడం ద్వారా దీన్నినిరోధించవచ్చని
శాస్త్రవేత్తలు వెల్లడించారు.
జనవరి - 17

¤    మన మెదడు కేవలం 13 మిల్లీసెకన్ల సేపు చూసిన దృశ్యాలను సైతం గుర్తు పట్టగలదని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) శాస్తవేత్తలు పేర్కొన్నారు.        

» మెదడు ఇంత వేగంగా విశ్లేషించగలదని గమనించడం ఇదే మొదటిసారి.

¤    వలస వెళ్లే మిడతల జన్యు పటాన్ని చైనా శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. దీంతో పంటలను నాశనం చేసే ఈ జీవులను ఎదుర్కొనేందుకు కొత్త విధానాలను కనిపెట్టడానికి వీలవుతుందని భావిస్తున్నారు.        

» పరిశోధన బృందానికి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జువాలజీకి చెందిన లీ కాంగ్ నేతృత్వం వహించాడు.



¤    గ్రాఫీన్ త్రీడీ రకాన్ని శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. దీనివల్ల మరింత వేగవంతమైన ట్రాన్సిస్టర్లు, సమర్థమైన హార్డ్‌డ్రైవ్‌లను తయారు చేయడం సాధ్యమవుతుంది. అమెరికాలోని లారెన్స్ బర్కిలీ జాతీయ ప్రయోగశాలకు చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధన జరిపారు.        

» సోడియం బిస్మథేట్ త్రీడీ టోపోలాజికల్ డిరాక్ సెమీ మెటల్ (త్రీడీ టీడీఎస్) అనే క్వాంటం పదార్థం రూపంలో సహజంగా ఉనికిలో ఉంటుందని వీరు కనుక్కున్నారు. త్రీడీ టీడీఎస్ అనే స్థితి ఒకటి ఉంటుందని ఈ ఆవిష్కరణ ద్వారా తొలిసారిగా రుజువయింది.

¤    మన పేగుల్లోని సూక్ష్మక్రిముల (బ్యాక్టీరియా) సమతౌల్యాన్ని కాపాడుకుంటే జీవితకాలం పెరిగే అవకాశం ఉందని అమెరికాలోని 'బక్ ఇన్‌స్టిట్యూట్' అధ్యయనంలో బయటపడింది.        

» పేగుల లోపలి గోడల మీద ఉండే కణాలపొర, బ్యాక్టీరియా మధ్య పరస్పర ఆధార సంబంధాన్ని సరిదిద్దడం ద్వారా ఆరోగ్యం మెరుగు పడటంతో పాటు జీవితకాలం కూడా పెరుగుతున్నట్లు ఈగలపై చేసిన అధ్యయనంలో వెల్లడయింది.
జనవరి - 18

¤    హిందువులకు పవిత్రమైన, అనేక ఔషధ గుణాలు ఉన్న తులసి మొక్క జన్యు మార్పిడికి అమెరికా పరిశోధకులు ప్రయత్నాలు ప్రారంభించారు.
       


»  తులసి మొక్కలో 'యూజెనాల్' అనే పదార్థం పెరిగేలా శాస్త్రవేత్తల బృందం పరిశోధనలు ప్రారంభించింది. రొమ్ము క్యాన్సర్‌ను నియంత్రించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని తేలింది.
       
»  పరిశోధకుల బృందానికి భారతీయ అమెరికన్ చంద్రకాంత్ ఈమని నాయకత్వం వహిస్తున్నారు. ఆయన పశ్చిమ కెంటకి విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా వ్యవహరిస్తున్నారు.
జనవరి - 19
¤    చర్మం సూర్యకాంతికి లోనవడంవల్ల రక్తపోటు తగ్గుతుందనీ, గుండెపోటు, పక్షవాతం ముప్పు తగ్గుతుందనీ తాజా అధ్యయనంలో గుర్తించారు.      

 »  సూర్యకాంతి చర్మం, రక్తంలోకి నైట్రిక్ ఆక్సైడ్ స్థాయుల్లో మార్పులకు దారితీసి, రక్తపోటును తగ్గిస్తున్నట్లు సౌతాంప్టన్, ఎడిన్‌బరో విశ్వవిద్యాలయాలకు చెందిన పరిశోధకులు గుర్తించారు. సూర్యకాంతికి లోనైనప్పుడు నైట్రిక్ ఆక్సైడ్ చర్మం నుంచి రక్త ప్రసరణలోకి వెళ్లి, రక్తనాళాలపై ప్రభావం చూపి, రక్తపోటును తగ్గిస్తుందని, దీనివల్ల గుండెపోటు, పక్షవాతం ముప్పు తగ్గుతాయని పరిశోధకులు వివరించారు.

¤    మానవ శరీరంలో ప్రయాణించ గలిగే శుక్రకణం తరహా 'బయోబాట్' లను శాస్త్రవేత్తలు రూపొందించారు. సూక్ష్మదర్శినులు వెళ్లలేని ప్రాంతాల లోపలిదాకా వేళ్లేందుకు వీలుగా వీటిని రూపొందించారు.      

 »  పొడవైన తోకలుండే ఏకకణజీవులు ఫ్లాగెల్లా తరహాలో బయోబాట్‌ను ఇలినాయిస్ విశ్వవిద్యాలయ పరిశోధకులు తీర్చిదిద్దారు. వీటి తల, తోక కలిసే చోట గుండె కణాలను కల్చర్ ద్వారా వృద్ధి చేశారు. అవి వాటంతటవే కలిసి, కొట్టుకుంటూ బయోబాట్ ముందుకు సాగేందుకు తోకకు సమాచారమిస్తాయి.
జనవరి - 20
¤     అణ్వస్త్రాన్ని మోసుకెళ్లగల వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణి అగ్ని-4ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. దేశీయ పరిజ్ఞానంతో తయారైన ఈ క్షిపణి 4 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు.
       

»   ఒడిశా తీరానికి చేరువలో ఉన్న వీలర్ ఐలాండ్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుంచి అగ్ని-4 ప్రయోగం విజయవంతంగా జరిగింది.

       
»   రోడ్డుపై ప్రయాణించగల లాంచర్ నుంచి దీన్ని ప్రయోగించారు. ఈ లాంచర్‌ను కూడా దేశీయ పరిజ్ఞానంతోనే తయారు చేశారు.
       

»   పరీక్ష సందర్భంగా క్షిపణి 850 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లింది. తన గరిష్ఠ పరిధిని 20 నిమిషాల్లో చేరింది.
       

»   ప్రయోగ బృందానికి ప్రాజెక్ట్ డైరెక్టర్ టెస్సీ థామస్ నాయకత్వం వహించారు.
       

»    అగ్ని-4కు ఇది మూడో పరీక్ష. తాజా ప్రయోగంతో ఈ క్షిపణి అభివృద్ధి దశ పూర్తయిందని, ఇక ఈ క్షిపణుల ఉత్పత్తిని ప్రారంభిస్తామని దీన్ని రూపొందించిన డీఆర్‌డీవో తెలిపింది.
       

»   కాంపోజిట్ ఘన ఇంధన రాకెట్ మోటార్ పరిజ్ఞానంతో అగ్ని-4 పని చేస్తుంది. క్షిపణిలోని అత్యాధునిక అయిదోతరం కంప్యూటర్, విభజిత ఏవియానిక్స్ నిర్మాణం, వేగవంతమైన కమ్యూనికేషన్ వ్యవస్థ, పూర్తిస్థాయి డిజిటల్ నియంత్రణ వ్యవస్థ ఉన్నాయి. ఇవి ఈ అస్త్రాన్ని విజయవంతంగా లక్ష్యం దిశగా నడిపిస్తాయి. ప్రయాణ సమయంలో తలెత్తే అవరోధాలను సొంతంగా సరిదిద్దుకునే ఏర్పాటు కూడా ఇందులో ఉంది. కచ్చితత్వం కోసం అగ్ని-4లో పరిమాణాన్ని బాగా కుదించిన ఏవియానిక్స్‌ను ఏర్పాటు చేశారు. ఇది అత్యాధునికమైంది. రింగ్ లేజర్ జైరో ఆధారిత ఇనర్షియల్ నేవిగేషన్ వ్యవస్థ, సూక్ష్మ నేవిగేషన్ వ్యవస్థ ఇందులో ఉన్నాయి. ఇవి పరస్పరం సహకరించుకుంటూ, దిశానిర్దేశం సక్రమంగా సాగేలా చూస్తాయి.
జనవరి - 21
¤     తోకచుక్కపై దిగి పరిశోధనలు సాగించేందుకు భూమి నుంచి బయలుదేరి వెళ్లిన 'రొసెట్టా'వ్యోమనౌక మూడేళ్ల తర్వాత భూమికి సంకేతాలు పంపింది. దీంతో తొలిసారిగా ఒక తోకచుక్కపై వ్యోమనౌకను దించడానికి మార్గం సుగమం అయింది.
      

»   'రొసెట్టా'ను ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ) దాదాపు పదేళ్ల కిందట ప్రయోగించింది. అందులోని ఇంధనాన్ని ఆదా చేయడానికి శాస్త్రవేత్తలు 2011లో పరికరాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ దీని యోగక్షేమాలపై సమాచారం లేదు.
      

»   తాజాగా వ్యోమనౌకను 67 పి/ చుర్యుమోవ్-గెరాసిమెంకో అనే తోకచుక్క వద్దకు చేర్చే దిశగా తుది సన్నాహాలను చేపట్టేందుకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఇన్నేళ్ల నిద్రాణదశ తర్వాత ఏ ఇబ్బందీ లేకుండా భూమికి 80 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న రోసెట్టా నుంచి 45 నిముషాల్లోనే సంకేతాలు వెలువడ్డాయి.
జనవరి - 23
¤      ప్రపంచంలోనే అత్యంత నిక్కచ్చిగా నడిచే అణు గడియారాన్ని అమెరికాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ (ఎన్ఐఎస్‌టీ) పరిశోధక బృందం ఆవిష్కరించింది.
      
»    ఇది 5 బిలియన్ సంవత్సరాల్లో ఒక్కక్షణం ఎక్కువా కాదు, ఒక్క క్షణం తక్కువా కాదు. 'స్ట్రోంటియమ్ ల్యాటిస్ క్లాక్‌'గా వ్యవహరించే ఈ గడియారం నిక్కచ్చిగా పనిచేయడంలో, స్థిరత్వంలో సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది.

¤       బ్రాడ్‌బ్యాండ్ వేగంలో శాస్త్రవేత్తలు సరికొత్త రికార్డు నెలకొల్పారు. సెకనుకు 1.4 టెరాబిట్ల వేగాన్ని సాధించారు. ఈ వేగంతో 44 హై డెఫినిషన్ సినిమాలను ఒక్క ఉదుటున ప్రసారం చేయగలిగారు.
      

»    ఫ్రెంచ్ నెట్‌వర్కింగ్ ఎక్విప్‌మెంట్ కంపెనీ 'అల్కాటెల్ - ల్యూసెంట్' తో కలిసి బ్రిటిష్ టెలికాం నిపుణులు ఈ వేగాన్ని ఆచరణ సాధ్యం చేయగలిగారు. లండన్‌లోని ఫైబర్ నెట్‌వర్క్‌లో ఈ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు. దీనివల్ల ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు ప్రయోజనం కలగనుంది.
జనవరి - 25
¤       దేశీయ అత్యాధునిక సూపర్ కంప్యూటర్ 'ధ్రువ - 3'ని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) చీఫ్ అవినాష్ చందర్ హైదరాబాద్‌లో ప్రారంభించారు.     

 »    రక్షణ పరిశోధన రంగ అవసరాల కోసం హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో ప్రయోగశాలైన అడ్వాన్డ్స్ న్యూమరికల్ రిసెర్చ్ అండ్ అనాలసిస్ గ్రూప్ (అనురాగ్)కు చెందిన శాస్త్రవేత్తలు ఈ కంప్యూటర్‌ను అభివృద్ధి చేశారు.     

 »    క్షిపణుల డిజైన్లు, వివిధ రకాల లోహాల తయారీ, మానవ రహిత విమానాల రూపకల్పన కోసం అనురాగ్ ఏర్పాటైంది.
జనవరి - 27
¤       కొన్ని రకాల మౌత్‌వాష్‌ల వల్ల నోటిలోని మంచి బ్యాక్టీరియా కూడా నశిస్తుందని, దీనివల్ల రక్తపోటు, గుండెపోటు, పక్షవాతం వచ్చే ప్రమాదం పెరుగుతుందని లండన్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తల బృందం తమ అధ్యయనంలో వెల్లడించింది.     

»    యాంటీసెప్టిక్ క్లెరెక్సీడిన్ అనే రసాయనాన్ని కలిగి ఉన్న మౌత్ వాష్‌లతో ప్రమాదం ఉంటుందని దీని ద్వారా తెలిసింది. రక్తనాళాలపై ఒత్తిడి తగ్గించే బ్యాక్టీరియాను ఈ రసాయనం చంపుతుందని, ఫలితంగా రక్తపోటు పెరుగుతుందని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన అమ్నిత ఆహ్లువాలియా వెల్లడించారు.

¤       గనుల్లో విలువైన ఖనిజాలను కేవలం రెండు నిముషాల్లో గుర్తించగల పరికరాన్ని లండన్‌లోని లీసెస్టర్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తల బృందం రూపొందించింది.      

»    చేతిలో పట్టే ఈ పరికరం ఎక్స్‌రే డిఫ్రాక్షన్, ఎక్స్‌రే ఫ్లోరెసెన్స్ అనే సాంకేతికత ఆధారంగా పని చేస్తుంది.      

»    పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త: డాక్టర్ హన్స్‌ఫర్డ్.
జనవరి - 28
¤      అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) చంద్రుడి పైకి వాణిజ్య ప్రాతిపదికన ల్యాండర్లను పంపేందుకు కంపెనీల నుంచి ప్రతిపాదనలను ఆహ్వానించింది.
     

 »    ఈ కార్యక్రమానికి 'లూనార్ కెటాలిస్ట్' అని పేరు పెట్టింది.

     
 »    నాసా ఇప్పటికే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు సరుకులను రవాణా చేసే బాధ్యతను స్పేస్ఎక్స్, ఆర్బిటల్ సైన్సెస్ కార్పొరేషన్ అనే రెండు ప్రైవేటు సంస్థలకు అప్పగించింది.