అన్ని గ్రహాలపై రోజుకి 24 గంటలే ఎందుకుండవు?

   

ఒక పగలుని, ఒక రాత్రిని కలిపి మనం 'రోజు' అని అంటున్నాం. ఏ గ్రహానికి సంబంధించిన
 'రోజు' అయినా ఆ గ్రహం తాలూకూ ఆత్మ భ్రమణకాలం మీద, అంటే అది తనచుట్టూ 
తాను ఒకసారి పూర్తిగా తిరిగేందుకు తీసుకునే సమయం మీద ఆధారపడి ఉంటుంది.

భూమి తన చుట్టూ తాను తిరిగేందుకు (స్థూలంగా) 24 గంటల సమయాన్ని 
తీసుకుంటుంది. అందుకని ఇక్కడ ఒక పగలు, ఒక రాత్రి పూర్తయ్యేందుకు 24 గంటల 
సమయం పడుతుంది. కానీ అన్ని గ్రహాల సంగతి అలా ఉండదు.

ఉదాహరణకు గురు గ్రహం తన చుట్టూ తాను, మన భూమి కన్నా చాలా వేగంగా 
తిరుగుతుంది. అందుకని అక్కడ 10 గంటల్లో ఒకరోజు పూర్తవుతుంది. అంటే ఆ గ్రహం 
మీదా రోజు ఒక 5 గంటలు పగలైతే, మరో 5 గంటలు రాత్రన్న మాట! అలాగే కుజ గ్రహం 
తన చుట్టూ తను దాదాపు భూమి అంతటి వేగంతోనే తిరగడం వల్ల అక్కడి రోజుకి మన రోజుకి ఏమంత తేడా ఉండదు. 

మనరోజు కన్నా అక్కడి రోజుల్లో ఒక 37 నిమి షాలు ఎక్కువ ఉంటాయి అంతే. ఇక 
బుధగ్రహం మన భూమి కన్నా ఎంత నిదానంగా తిరుగు తుందంటే మన భూమ్మీద 
59 రోజులు గడిస్తేగానీ బుధ గ్రహం మీద ఒక రోజు పూర్తికాదు. అంటే అక్కడ రోజుకి 
1,416 గంటలన్న మాట! శుక్ర గ్రహం మీదైతే మరీ విచిత్రంగా 5,832 గంటలకు గానీ 
ఒకరోజు పూర్తికాదు. 

అంటే మన భూమి మీద 243 రోజులు పూర్తయితే శుక్ర గ్రహం మీద ఒకరోజు 
పూర్తయినట్లన్న మాట! అలాగే తన చుట్టూ తాను తిరిగేందుకు యురేనస్‌ 16 గంటల 
48 నిమిషాలు, నెప్ట్యూన్‌ 18 గంటలు తీసుకుంటే, ప్లూటో సుమారు 168 గంటల సమయాన్ని తీసుకుంటుంది. ఆయా గ్రహాలు సూర్యుని చుట్టూ తిరిగేందుకు తీసుకునే సమయాల్లో 
కూడా చాలా తేడా ఉంటుంది.