ఫైర్‌ ఇంజన్‌ - మంటలనార్పే యంత్రం. ప్రమాదవశాత్తు


ఫైర్‌ ఇంజన్‌ - మంటలనార్పే యంత్రం. ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుంటే ఉవ్వెత్తున 
ఎగసే మంటలను అదుపులోకి తీసుకురావడంలో, ఎంతోమంది ప్రాణాలను రక్షించడంలో, 
భారీ ఆస్తి నష్టం జరగకుండా కాపాడే ఫైర్‌ ఇంజన్‌కు పెద్దచరిత్ర ఉంది. మంటలనార్పడానికి
 ఒకప్పుడు అమెరికాలో బకెట్‌బ్రిగేడ్‌ అని ఉండేవారు. ప్రతీ ఇంటిముందు తప్పనిసరిగా ఓ 
పెద్దబకెట్‌ నీళ్ళు ఉండి తీరాలని నిబంధన ఉండేది. 

అగ్నిప్రమాదం ఏమైనా సంభ విస్తే మంటలు అదుపు చేయడానికి బకెట్‌బ్రిగేడ్‌ ఇళ్ళ 
ముందున్న బకెట్ల నీటి సహాయాన్ని తీసుకునేవారు. 19వ శతాబ్దం వరకూ తోపుడు
బండ్లనే అగ్నిమాపక సిబ్బంది నడిపించుకుంటూ ఘటనా స్థలానికి చేరుకునేవారు. 

ఆ తర్వాత గుర్రాలను వినియోగించారు. సిబ్బందికి మాత్రం ఈ బండ్లలో కూర్చునే సౌకర్యం
 ఉండేది కాదు. 18వ శతాబ్దంలో ఆవిరితో నడిచే బండిని కనుగొన్నారు. అప్పుడు కూడా 
అగ్నిమాపక సిబ్బంది ఆ బండి వెనకాల నిల్చుని వచ్చే వారట! ఆ ప్రయాణంలో ఒక్కోసారి 
వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లేది. 

ఇప్పటి మాదిరిగా వారికి కూర్చునే సౌకర్యం లేదు. ఇక మంటలు అదుపు చేయడానికి 
వాడే పరికరాలలో మామూలు నిచ్చెనలు, నీటిగొట్టాలే ఉండేవి. అగ్నిప్రమాదాల 
నివారణకు నీటిగొట్టాల వాడకం 15వ శతాబ్దంలోనే మొదలైనా 17వ శతాబ్దం వరకూ 
పూర్తిగా వినియోగంలోకి రాలేదని చెప్పాలి. 

క్రమంగా యాంత్రికంగా పనిచేసే నిచ్చెనలు, నీటి గొట్టాలు అందుబాటులోకి వచ్చాయి. 
రెండవ ప్రపంచయుద్ధం తర్వాత కాలంలో అగ్నిమాపక సిబ్బంది చేరుకోలేని ప్రమాదకర 
ప్రాంతాల్లో నీటిని జల్లేందుకు గుండ్రంగా తిరుగాడే నిచ్చెనలు, యాంత్రికమైన వాటంగల 
బకెట్‌ను అమర్చే పద్ధతులు వచ్చాయి. 

19వ శతాబ్దంలో చివరివరకూ మోటారుతో నడిచే అగ్నిమాపక యంత్రాలు రాలేదు. 
ప్రస్తుతం మరెన్నో ఆధునిక పద్ధతులలో యంత్రాలు అలాగే అగ్నిమాపక సిబ్బందికి కూడా
 అత్యంత వేడిని, పొగను తట్టుకునేందుకు వీలుగా రకరకాల పరికరాలు అందుబాటులోకి 
వచ్చాయి. ఇవాళ ఈ అంశం గుర్తుకు రావడానికి ఓ సందర్భం ఉంది. 

1944లో నాటి బొంబాయి నేటి ముంబాయి ఓడరేవులో జరిగిన అగ్నిప్రమాదంలో 66 
మంది అధికారులు, సిబ్బంది, అనేకమంది సామాన్య ప్రజలు మరణించారు. ఈ ఘటన 
స్మృత్యర్థం ప్రతిఏటా ఏప్రిల్‌ 14న అగ్నిమాపక దళ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.