ఆంధ్రప్రదేశ్ బడ్జెట్: 2014 - 15 - Andhra Pradesh Budget: 2014 - 15




ఆంధ్రప్రదేశ్ బడ్జెట్: 2014 - 15
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ - ముఖ్యాంశాలు 

   రాష్ట్ర విభజన అనంతరం రూ.1.11 లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్ తొలి బడ్జెట్‌ను ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ఆగస్టు 20న అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

                                   ap budget కోసం చిత్ర ఫలితం

   గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మినహాయించి ఇతరత్రా సామాజిక వర్గాల పేరున కేటాయింపులు ఉండేవి కావు. ఈసారి తొలిసారిగా కాపులు, బ్రాహ్మణ సమాజ సంక్షేమానికి ప్రత్యేక కేటాయింపులు చేసి కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు.
    రాష్ట్రంలో 10 - 12 స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.
   వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, ఎయిడ్స్ బాధితులకు పింఛన్‌ను రూ.200 నుంచి రూ.1000 కు పెంచుతూ రూ.741 కోట్లు; వికలాంగుల పింఛన్లను రూ.500 నుంచి రూ.1500 కు పెంచుతూ రూ.303 కోట్లు కేటాయించారు. మొత్తంగా వీటికి రూ.1044 కోట్లను ఈ బడ్జెట్‌లో కేటాయించారు.
   అన్ని గ్రామాలకు 365 రోజులు తాగునీరు అందించేందుకు 'వాటర్ గ్రిడ్ కార్పొరేషన్‌'ను ఏర్పాటు చేయనున్నట్లు బడ్జెట్‌లో పేర్కొన్నారు. ఎన్టీఆర్ సుజల పథకం కింద ఈ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తారు. ఎన్టీఆర్ సుజలకు ఈ బడ్జెట్‌లో రూ.5.4 కోట్లు కేటాయించారు. 
   'ఇందిర జలప్రభ' పేరును 'నవ్యాంధ్ర జలప్రభ'గా మార్చారు.
   మరుగుదొడ్ల నిర్మాణానికి రాష్ట్ర వాటాగా రూ.69.5 కోట్లు కేటాయించారు. మరుగుదొడ్లు లేని ఇళ్లల్లోనూ, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల వద్ద మరుగుదొడ్లు నిర్మిస్తామని పేర్కొన్నారు.
   వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పథకం కింద కేంద్రం నుంచి రానున్న రూ.91 కోట్లను బడ్జెట్‌లో చూపించారు. విజయనగరం, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాలు ఈ పథకం కిందికి వస్తాయి. ఆమ్ ఆద్మీ పథకం కింద రూ.16 కోట్లు కేటాయించారు.
   ఆంధ్రప్రదేశ్‌లో రైతు రుణ విముక్తి (రుణ మాఫీ) పథకానికి ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్‌లో రూ.5 వేల కోట్లు ప్రతిపాదించారు. ఇందులో రూ.4 వేల కోట్లను ప్రణాళికా వ్యయంలోనూ, రూ.వెయ్యి కోట్లు ప్రణాళికేతర వ్యయంలోనూ చూపారు. ఈ మొత్తంలో రూ.805 కోట్లు ఎస్సీలకు, రూ.250 కోట్లు ఎస్టీలకు నిర్దేశించారు. ఒక్కో రైతు కుటుంబానికి రూ.లక్షన్నర చొప్పున రుణమాఫీ చేయడానికి రూ.35 వేల కోట్లు అవసరమని ప్రభుత్వం అంచనా వేస్తోంది. 
   బీసీల ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా కాపులను బీసీల్లో చేర్చేందుకు కమిషన్ ఏర్పాటు.
   ఎస్సీ నిరుద్యోగ యువత స్వయం ఉపాధి కోసం ఏపీ ఎస్సీ సహకార ఆర్థిక సొసైటీ ద్వారా రాయితీపై ఆర్థిక సాయం. ఎస్సీ జనాభా 17.1 శాతానికి తగ్గట్లు ఉప ప్రణాళికకు రూ.2,657 కోట్లు కేటాయింపు. ఎస్టీలకు రూ.1150 కోట్లు.
   బీసీల సంక్షేమానికి రూ.3130 కోట్లు, మైనార్టీల సంక్షేమానికి రూ.371 కోట్లు, స్త్రీ శిశు సంక్షేమానికి రూ.1049 కోట్లు. వికలాంగులు, వృద్ధుల సంక్షేమానికి రూ.65 కోట్లు.
   రూ.100 కోట్ల కేంద్ర సాయంతో కృష్ణా, అనంతపురం జిల్లాల్లో భారీ (మెగా) పర్యాటక సర్క్యూట్లు. శ్రీకాకుళం, గుంటూరుల్లో కొత్త పర్యాటక సర్క్యూట్లు.
   శ్రీకాళహస్తిలో శ్రవణ, వర్ణ కాంతి ప్రదర్శన (సౌండ్ అండ్ లైట్ షో), పశ్చిమ గోదావరి జిల్లా పేరుపాలెంలో బీచ్ రిసార్ట్ ఏర్పాటు. కాకినాడ, ఏలూరు, విజయవాడ, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో శిల్పారామాల ఏర్పాటు.
   తిరుపతిలో రూ.50 కోట్లతో పాకశాస్త్ర సంస్థ, రూ.117 కోట్లతో అంతర్జాతీయ సమావేశ కేంద్రం (ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్).
   రూ.12 కోట్ల అంచనా వ్యయంతో తిరుపతి, కాకినాడల్లో హోటల్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్లు.
   గ్రామీణ పేదల గృహనిర్మాణం కోసం రూ.808 కోట్లు.
   అల్పాదాయ వర్గాల కోసం తక్కువ ధరకు ఆహారాన్ని అందించడం కోసం 'అన్న' క్యాంటీన్లు.
   రేషన్ కార్డులు ఆధార్ నంబర్‌కు అనుసంధానం. దారిద్య్రరేఖకు దిగువనున్న మహిళలందరికీ 'దీపం' కనెక్షన్లు.
   అక్టోబరు 2 నుంచి వృద్ధులు, వితంతువులకు రూ.1000, వికలాంగులకు రూ.1500 పింఛను.
   పాఠశాల విద్యకు రూ.12,595 కోట్లు, ఇంటర్మీడియట్ విద్యకు రూ.812 కోట్లు, ఉన్నత విద్యకు రూ.2,275 కోట్లు కేటాయింపు.
   రాష్ట్రంలో 33 శాతం అటవీ విస్తీర్ణానికి గాను 25.64 శాతమే ఉంది. మరో 7.36 శాతం విస్తీర్ణంలో పెద్దఎత్తున మొక్కల పెంపకం.
   కాకినాడలో రెండో పెద్ద నౌకాశ్రయం నెలకొల్పాలి. దీంతోపాటు కాకినాడలో ప్రైవేటు రంగంలో మరో వాణిజ్య పోర్టు.
    ఆంధ్రప్రదేశ్ గ్యాస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌కు కేజీ బేసిన్‌లో 4 బ్లాకులకు అనుమతి.
   వేలం ప్రక్రియ ద్వారా 1,000 మెగావాట్ల సౌర విద్యుత్తు కొనుగోలు. గుంటూరు, అనంతపురంలో వెయ్యి మెగావాట్ల చొప్పున 2 సోలార్ పార్కులు.
   రైతులకు సోలార్ పంపుసెట్లు. ఇళ్ల పైకప్పుల మీద సోలార్ విద్యుత్తు వ్యవస్థల ఏర్పాటు.
    అన్ని గ్రామాలు గిగాబిట్‌తో అనుసంధానం. ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తినైనా డిజిటల్ అక్షరాస్యుడిగా తయారుచేసి, రాష్ట్రాన్ని డిజిటల్ ఆంధ్రప్రదేశ్‌గా మార్చడం.
   కర్నూలులో రూ.412 కోట్లతో గ్రేహౌండ్స్ హబ్, ఆరు ఏపీఎస్‌పీ బెటాలియన్ల ఏర్పాటు.
    2014 - 15 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కాలానికి మొత్తం బడ్జెట్ రూ.1,11,824 కోట్లు.

                     రూపాయి రాక (బ్రాకెట్లలో అంచనా మొత్తం రూ.కోట్లలో)
       1. రాష్ట్ర పన్నులు, సుంకాలు  -  40.61 పైసలు (37,397.67)
       2. కేంద్ర పన్నుల్లో వాటా        -  18.29 పైసలు (16,838.77)
       3. పన్నేతర ఆదాయం           -  35.87 పైసలు (33,028.76)
       4. వడ్డీ వసూళ్లు                    -  5.23 పైసలు (4,813.02)


                     రూపాయి పోక (బ్రాకెట్లలో అంచనా మొత్తం రూ.కోట్లలో)
       1. అభివృద్ధి వ్యయం               -   64.80 పైసలు (67,528.16)
       2. రుణాలపై వడ్డీ చెల్లింపులు   -  9.78 పైసలు (10,186.46)
       3. పరిపాలన ఖర్చు                -   7.99 పైసలు (8,330.35)
       4. పన్ను వసూళ్ల వ్యయం       -   0.82 పైసలు (852.8)
       5. ఇతరత్రా వ్యయం                 -  10.79 పైసలు (11,244.05)
       6. లోటు 5.82 పైసలు             -  (6,063.60).




0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment