ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానికి అమరావతి పేరే ఎందుకు?





>> కొత్త రాజధానికి అమరావతి పేరు పెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఉగాది రోజున తుళ్లూరులో పంచాంగ శ్రవణం నిర్మించినప్పుడే రాజధాని పేరు ప్రకటించాల్సి ఉందని, అయితే సమయాభావం వల్ల అది జరగలేదన్నారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు తుది నిర్ణయం తీసుకొని అధికారిక ప్రకటన చేస్తారని చెప్పారు.


అమరావతి కోసం చిత్ర ఫలితం

>> ఏపీ రాజధానికి అమరావతి పేరు దాదాపు ఖరారైంది. చంద్రబాబు అమరావతి పేరు పైన చాలా రోజులుగా ఆరా తీస్తున్నారు. అమరావతికి చారిత్రక నేపథ్యం ఉండటం, కృష్ణా ఒడ్డున వెలిసి ఉన్న నేపథ్యంలో ఆ పేరు వైపు చంద్రబాబు చూశారని అంటున్నారు. సింగపూర్ ప్రభుత్వం బృహత్ ప్రణాళిక అందచేసిన తర్వాత జూన్‌లో రాజధానికి శంకుస్థాపనం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు.

>> రాజధానికి రెండు, మూడు పేర్లు ప్రతిపాదనకు వచ్చినా, చారిత్రక ప్రాశస్త్యం దృష్ట్యా అమరావతి పేరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు మొగ్గు చూపుతున్నారు. విజయవాడ - గుంటూరు నగరాల మధ్య కృష్ణా నది ఒడ్డున కొత్త రాజధాని నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం భూ సేకరణ చేసిన విషయం తెలిసిందే. ఇదే ప్రాంతంలో పూర్వ కాలంలో ఆంధ్రుల రాజధాని నగరం ధాన్య కటకం విలసిల్లినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. తర్వాత దాని పేరు అమరావతిగా మారింది.

>> నవ్యాంధ్ర రాజధాని ప్రాంతమైన తుళ్లూరుకు అతి సమీపంలోనే అమరావతి ఉంటుంది. ఈ నేపథ్యంలో కొత్త రాజధానికి అమరావతి పేరు పెడితే చారిత్రక ప్రాధాన్యం కల్పించినట్లు అవుతుందని, తెలుగువారి గత కీర్తిని చాటినట్లు అవుతుందన్న ఆలోచనలో ప్రభుత్వ వర్గాలు ఉన్నాయి. అయితే, ఈ ప్రాంతానికి ఎన్టీఆర్ పేరును కూడా జోడించాలన్న అభిప్రాయంతో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది.

>> తెలుగువారి కీర్తి ప్రతిష్ఠలను ఇనుమడింపచేసిన ఎన్టీఆర్‌ పేరును కొత్త రాజధానికి ఏదో రూపంలో పెట్టాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారని తెలుస్తోంది. కోర్‌ రాజధాని ప్రాంతాన్ని ఒక జిల్లాగా చేసి దానికి ఎన్టీఆర్‌ జిల్లాగా పేరు పెట్టాలని, రాజధాని పేరును అమరావతిగా నిర్ణయించాలని కొందరు సూచించారు. తారకరామ పురి అన్న పేరు పెట్టాలని మరికొందరు ప్రతిపాదించారు. అయితే, చంద్రబాబు మాత్రం అమరావతి పేరు వైపు మొగ్గు చూపుతున్నారు.

>> అమరావతి ప్రసిద్ధ క్షేత్రం. క్రీస్తుశకం రెండో శతాబ్దంలో ఇది ఆంధ్రుల రాజధానిగా విలసిల్లింది. ధాన్యకటకం పేరుతో శాతవాహనుల చివరి రాజైన గౌతమీపుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణి దక్షిణ భారతాన్ని పాలించారు.

>> 1795లో చింతపల్లి జమీందార్‌ ధరణి కోటలో ఉన్న అమరేశ్వరస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసి, సమీపంలో రాజధానిగా అమరావతిని నిర్మించారు. శాతవాహనుల రాజధానిగానూ ప్రపంచ ప్రఖ్యాత బౌద్ధారామంగానూ అమరావతికి అంతర్జాతీయంగా ప్రఖ్యాతి ఉంది. అమరావతి పైన పురాతన గాథలు కూడా ఉన్నాయి.

అమరావతి పురాణ గాథ

>> హిరణ్యాక్షులు, బలి చక్రవర్తి, నరకాసురుడు, రావణుడు తదితర రాజులను మహా విష్ణువు వివిధ అవతారాలతో సంహరించాడు. తమ పూర్వీకులందర్నీ మహా విష్ణువు సంహరించినందున, ఆయనపై పగ సాధించాలని అదే వంశానికి చెందిన తారకాసురుడు నిర్ణయించుకున్నాడు. 

>> మహా విష్ణువుతో యుద్ధం చేయడానికి తన బలం చాలదని గ్రహించి పరమశివుడి కోసం ఘోర తపస్సు చేశాడు. పరమేశ్వరుని మెప్పించి ఎవరితోనూ, ఎట్టి ఆయుధముతోనూ, ఎప్పుడూ సంహరించకుండా ఉండేలా వరం కోరాడు. 

>> దాంతో, దేవదానవులు సముద్రాన్ని మథించినప్పుడు ఉద్భవించిన అమృత లింగాన్ని ఈశ్వరుడు తారకాసురుడికి ఇచ్చాడు. అది యథాతథంగా ఉన్నంత వరకు నీ ప్రాణానికి ముప్పు లేదని వరమిచ్చాడు. అనంతరం తారకాసురుడు దేవతలపై యుద్ధం ప్రకటించాడు. 

>> అతడి నుంచి కాపాడాలని దేవతలు మొరపెట్టుకున్నారు. వారికి సైన్యాధిపతిగా కుమారస్వామి తారకాసురునిపై దండెత్తి అతని కంఠంలో వేలాడుతున్న అమృత లింగాన్ని ఛేదించాడు. 

>> దాంతో, అమృత లింగం ఐదు ప్రదేశాల్లో పడింది. వాటిలో పెద్ద ముక్క పడిన ప్రదేశమే అమరావతి. ఇక్కడ స్వర్గలోకాధిపతి ఇంద్రుడు లింగాన్ని ప్రతిష్టించడంతో దానికి అమరారామంగా, ఆయన రాజధాని అయిన అమరావతిగా పేరు వచ్చింది. 

>> కాగా, ఆంధ్రప్రదేశ్‌ రాజధానికి అమరావతి పేరు పెట్టాలని ప్రభుత్వం యోచిస్తుండడంపై గుంటూరు జిల్లాలో హర్షం వ్యక్తమవుతోంది.




0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment