బేలూరు కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ జిల్లాలో ఓక పట్టణం. జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ప్రసిద్ధి చెందిన చెన్నకేశావాలయం ఉంది. హొయసల శైలి శిల్పకళకు ఈ దేవాలయం ఒక నిలువుటద్దం.
బేలూరును పూర్వం వేలా పురీ అనే వారు. క్రమంగా వేలూరుగా చివరికి బేలూరు గా మారింది. ఈ పట్టణం యాగాచి నది ఒడ్డున ఉంది. ఈ బేలూరు ఒకనాడు హొయసల రాజుల రాజధాని.
బేలూరు ఒకనాడు హొయసలుల రాజధాని. ఆ తర్వాత ఇక్కడ నుండి హళేబీడుకు రాజధానిని మార్చారు. ఈ హళేబీడు బేలూరుకు 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ రెండు పట్టణాలు హాసన్ జిల్లాలోనే ఉన్నాయి. వీటిని జంట పట్టణాలుగా పిలుస్తారు.
బేలూరులో వైష్ణవాలయాన్ని నిర్మిస్తే,హళేబీడులో శైవాలయాన్ని నిర్మించారు. ఇక్కడ ప్రధానంగా చూడదగ్గది చెన్నకేశవాలయం. దీనిని హొయసల రాజు విష్ణువర్ధనుడు నిర్మించాడు. క్రీ.శ. 1117లో పశ్చిమ చాళక్యులపై విజయ సూచికగా ఈ ఆలయాన్ని నిర్మిచినట్లు తెలుస్తుంది.
ఈ ఆలయ సముదాయంలో ప్రధానాలయం కేశవాలయం. ఈ కేశవాలయానికి చుట్టూ రంగనాయకి ,కప్పే చేన్నగరాయ ఆలయాలు ఉన్నవి. చెన్నకేశవాలయంలో రోజూ పూజాదికాలు నిర్వహిస్తారు. ఇక్కడ ఆంజనేయస్వామి, నరసింహస్వామి విగ్రహాలను చూడవచ్చు. ఆలయ ప్రవేశ మార్గం దగ్గర హొయసలుల రాజముద్ర కనిపిస్తుంది. ఆలయాన్ని ద్రావిడ శైలిలో నిర్మించారు.
ఈ ఆలయాన్ని సబ్బురాతి(Chloritic Schist )తో నిర్మించారు. ఇది తేలిక అకుపచ్చ రంగులో ఉంటుంది. ఈ శిల సబ్బు వలె అతి మెత్తగా ఉండి, కావలసిన తీరుగా మలచడానికి అనువుగా ఉంటుదట. అందుకే ఈ దేవాలయంపై గల శిల్పాలు అతి సూక్ష్మంగా ఉండి, అద్భుత సౌందర్యంతో అలరారుతాయి. దేవాలయ గోడలపై, పై కప్పు భాగంలో, వివిధ రకాలైన పక్షులు, జంతువులు, లతలు, వివిధ భంగిమలలోని నర్తకిల శిల్పాలు, ద్వారాల దగ్గర ద్వారపాలకుల శిల్పాలు ఆకట్టుకుంటాయి.
దర్పణ సుందరి, భస్మ మోహిని అనునవి చెప్పుకోదగిన ఆకర్షణీయ శిల్పాలలో కొన్ని. ఆలయం బయట నలభై రెండడుగుల ధ్వజస్తంభం ఉంది. దీని విశేషమేమిటంటే ఈ స్తంభం ఓక వైపు ఆధారం నేలను తాకి ఉండదు. మూడు వైపుల ఆధారం మీద నిలిచి ఉంటుంది.
రాజగోపురానికి కుడివైపు పుష్కరిణి ఉంది. నేటికీ భక్తులు ఉపయోగిస్తుంటారు. హొయసల శైలి కట్టడాలకు ఈ ఆలయం ఓ మచ్చుతునక. శ్రావణబెళగొలా,హళేబీడుతో పాటు బేలూరును కూడా ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది.
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment