ఆంధ్రప్రదేశ్ చరిత్ర


ఆంధ్రప్రదేశ్ చరిత్ర

 పాడిపంటలతో, ధన దాన్యాలతో ఎల్లప్పుడూ సశ్యశామలంగా విరసిల్లే ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.ఆంధ్రప్రదేశ్ చరిత్రను ఒకసారి తట్టి చూస్తే ఎంత ఘనమైనదో అర్ధం అవుతుంది. ఈ ప్రాంతాన్ని ఎంతో మంది ఉద్దండులు పరిపాలించి తమ ప్రాబవాన్ని చాటుకున్నారు. ఇక్కడ ప్రధానంగా మాట్లాడే భాష తెలుగు. తెలుగు గడ్డ పౌరుషానికి,దర్పానికి నిలువెత్తు చిహ్నం. పులిబిడ్డ విరనారి రాణి రుద్రమ యిద్దభూమిలో పోరాలపటిమ పల్నాటి పౌరుషం ఇలా చెపుతూ పోతే ఎన్నో మరెన్నో...
    క్రీస్తు పూర్వం నుండే ఇక్కడి సంస్కృతి, సాంప్రదాయాలు విరసిల్లాయని చరిత్ర చెబుతుంది. పూర్వ ఆధారాలు ప్రకారం ఆంధ్రులు క్రీస్తు పూర్వం 7వ శతాబ్ది కాలంలో వింధ్య పర్వత దక్షిణ భాగానికి వెళ్లి ద్రవిడులతో కలసిన ఆర్యలు అని చెబుతున్నాయి. క్రీపు 5వ శతాబ్దంలో భట్టిప్రోలు(అప్పటి ప్రతిపాలపురం)ను రాజధానిగా చేసుకుని కుబేరక రాజు పాలించాడని ఆధారాలు లభ్యమయ్యాయి.క్రీస్తు పూర్వం 232 లో అశోకుడు మరణాంతరం ఆంధ్రులు ప్రభావం మొదలైంది. అప్పటి నుంచే మన చరిత్ర మొదలైందని చరిత్ర కారుల అభిప్రాయం.
వ్యాసుడు రచించిన మహాభారతంలో ఆంధ్ర శబ్దం మనకు కనిపిస్తుంది. ఆంధ్ర అనే పదం క్రీస్తు పూర్వం 600లలో మొదటి సారిగా జతి పరంగా ఐతరేయబ్రాహ్మణంలో ఉపయోగించారు.
    ఈ ప్రాంతాన్ని ఎంతో మంది రాజులు, చక్రవర్తులు, సంస్ధానాలు వారు పరిపాలించారు. ఆంధ్ర దేశ చరిత్రను ముఖ్యంగా 2గా విభజించారు. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దకాలంకు ముందు ఉన్న కాలాన్ని చరిత్ర పూర్వ యుగము అని క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం తర్వాత వచ్చే కాలాన్ని చారిత్రక యుగమని పిలుస్తారు. చరిత్ర పూర్వ యుగానికి సంభందించిన స్పష్టమైన ఆధారాలు మనకు లభించడంలేదు. 
క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం దగ్గరనుండి ఉన్న కాలమైన చారిత్రక యుగాన్ని మరలా మూడుగా విభజించారు మన చరిత్రకాలరులు. అవి 
1.పూర్వ యుగము
2.మధ్య యుగము 
3.ఆధునిక యుగము 

ఇలా విభజించిన ప్రకారం ఇప్పటి వరకూ పరిపాలించిన రాజవంశాలను పరిశిలిస్తే.
చారిత్రక పూర్వయుగము - క్రీ"ఫూ 1500 ముందు
చారిత్రక యుగము

1.పూర్వ యుగము

మౌర్యులు - క్రీపూ 322 నుండి క్రీపూ 184 వరకు
శాతవాహనులు - క్రీపూ 200 నుండి క్రీత 200 వరకు
కళింగులు - క్రీపూ 180 నుండి క్రీత 400 వరకు
ఇక్ష్వాకులు - క్రీపూ 210 నుండి 300 వరకూ
బృహత్ పాలాయనులు - 300 నుండి 350
ఆనంద గోత్రులు - 295 నుండి 320
శాలంకాయనులు - 320 నుండి 420
విష్ణుకుండినులు - 375 నుండి 555
పల్లవులు

2.మధ్య యుగము

మహాపల్లవులు.
రేనాటి చోడులు, చాళుక్యులు,
రాష్ట్రకూటులు
తూర్పు చాళుక్యులు
పూర్వాంగాంగులు - 498 నుండి 894
చాళుక్య చోళులు - 950 నుండి 1076
కాకతీయులు - 1083 నుండి 1323
ఆర్వాచీన గాంగులు
ముసునూరి నాయకులు - 1320 నుండి 1368
ఓడ్ర గజపతులు
రేచర్ల పద్మనాయకులు - 1368 నుండి 1461
కొండవీటి రెడ్డి రాజులు
రాజబహేంద్రవరం రెడ్డి రాజులు
బహమని రాజ్యము
విజయనగర సామ్రాజ్యము - 1336 నుండి 1565

3.ఆధునిక యుగము -

ఆరవీటి వంశము - 1572 నుండి 1680
కుతుబ్షాహీ యుగము - 1518 నుండి 1687
నిజాం రాజ్యము
బ్రీటీష్ వారి కాలము
స్వతంత్ర్య సంగ్రామ కాలము - 1800 నుండి 1947
ఆంధ్రప్రదేశ్ ఆవతరణ - 1954 నుండి.....


ఆంధ్రుల చరిత్ర, సంస్కృతి (ప్రజా శక్తి)

      ఆంధ్రులకు అత్యంత ప్రాచీన చరిత్ర ఉంది. పాత రాతియుగంలోనే ఆంధ్రుల ఉనికి ఉన్నట్లు పురావస్తు తవ్వకాల్లో రాతి పనిముట్లు లభించాయి. హిమాలయాల కంటే ప్రాచీనమైన శిలాఖండాలు దక్కను పీఠభూమిలో ఉన్నాయని ఆచార్య సంకాలియా పేర్కొన్నారు. పాలార్‌ నదీలోయ(నెల్లూరు జిల్లా)కు ఉత్తరభాగంలో క్వార్ట్‌జైట్‌, కృష్ణాలోయకు ఎగువన షింగిల్‌, బళ్లారి-కడప జిల్లాల్లో హెమెటైట్‌ అనే రాళ్లు పుష్కలంగా లభించేవి. వీటితోనే పాతరాతియుగపు మానవుడు తనకవసరమైన పనిముట్లు తయారుచేసుకున్నాడని పరిశోధకులు నిర్ధారించారు. కర్నూలు జిల్లాలోని బిల్లసర్గం గుహలు, కడప జిల్లా రాయచోటి తాలూకా సరస్వతి పల్లె, మక్రావుల పల్లె, అదే జిల్లాలోని కనమలపల్లె, చిత్వేల్‌, కలసపాడులో పాతరాతి యుగపు పనిముట్లు, నిప్పును ఉపయోగించిన ఆనవాళ్లు లభించాయి. అనంతపురం జిల్లా పలుచోట్ల పాతరాతి యుగపు పనిముట్లను పురావస్తు పరిశోధకుడు బ్రూస్‌ ఫుట్‌ గుర్తించారు. నాగార్జునకొండ తవ్వకాల్లో పాతరాతి, కొత్తరాతి, ఇనుపయుగపు పనిముట్లు లభించాయి. విశాఖ జిల్లా మధురవాడలోనూ ఈ పనిముట్లు దొరికాయి. వీరికి అతి ప్రాథమికమైన చిత్రకళ కూడా తెలుసనడానికి కర్నూలు జిల్లాలోని బిల్లసర్గం గుహలే నిదర్శనం. రాయచూర్‌ జిల్లా పిక్లి హిర్‌ వద్ద కనుగొన్న బూడిదగుట్టలు పాత రాతియుగపు మానవుడు నిప్పు ఉపయోగించాడనడానికి రుజువని ఆల్చిన్‌ అనే ప్రఖ్యాత పురాతత్వవేత్త పేర్కొన్నారు. బళ్లారి వద్ద సంగనకల్లు తవ్వకాల్లో క్రీ.పూ. 900-600 మధ్యకాలానికి చెందిన ఇనుపయుగపు అవశేషాలు లభించాయి. అనంతపురం జిల్లా గుంతకల్లు, ముదిగల్లు, దేవాదుల గుట్ట, మాల్యవంతం, కొండాపురం, కడప జిల్లా ఎర్రగుంట్ల, అమిలెపల్లెల వద్ద వందలాది సమాధులు, వాటిలో శవపేటికలు కనిపించాయి. కర్నూలు జిల్లా పత్తిపాడు, బస్తిపాడుల వద్ద లభించిన పేటికల్లో బాణపు మొనలు, రంగుల గాజులు, ఎరుపు-నలుపు కుండలు, వలయాకారపు స్టాండులు లభించాయి. కృష్ణాజిల్లాలో చరిత్ర పూర్వయుగ సమాధి లభించింది. ఈ ఆధారాలను బట్టి తెలుగువారి ప్రాచీనత స్పష్టమవుతోంది.
         ఏ జాతి ఒక్కసారిగా ఉద్భవించదు. చరిత్రలో జరిగిన అనేక సాంఘిక, రాజకీయ, ఆర్థిక, స్థానచలన, సాంస్కృతిక ఘటనల ద్వారా జాతులు రూపుదిద్దుకున్నాయి. ఆంధ్రులు కూడా అలా ఆవిర్భవించినవారే. నాగులు, ఆంధ్రులు, ద్రవిడులు, తెలుగులు, యక్షులు, శబరులు వంటి వనవాస జాతులు కాలక్రమంలో వివిధ సంబంధాల ద్వారా ఆంధ్ర లేదా తెలుగు జాతిగా రూపుదిద్దుకున్నారు. బౌద్ధ, జైనాలతో ఈ జాతుల మధ్య ఏకీకరణ పూర్తిగా జరిగిందంటారు. హరప్పా, మొహంజదారో నాగరికతతో వీరికి సంబంధాలు ఉండేవాని కూడా నిరూపిస్తున్నారు. ఆంధ్రుల మొట్టమొదటిగా ఐతరేయ బ్రాహ్మణంలో కనిపిస్తుంది. విశ్వామిత్రుని సంతతివారే ఆంధ్రులని పేర్కొంది. ఇక్కడ సంతతి అంటే జనక సంతానం కాదు, కులపతి వ్యవస్థలోని శిష్యులని అర్థం చేసుకోవాలి. బౌద్ధజాతక కథల్లో ఆంధ్రాపదం, ఆంధ్రనగరి ప్రస్తావన ఉంది. క్రీ.పూ.400నాటికి కుబ్బీరుడు అనే యక్షరాజు తీరాంధ్రంలో రాజ్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. క్రీ.పూ.300లో చంద్రగుప్తుని ఆస్థానానికి వచ్చిన గ్రీకు రాయబారి మెగస్తనీసు కూడా ఆంధ్రుల గురించి ప్రస్తావించారు. అశోకుని 13వ శిలాశాసనం కూడా వీరి గురించి పేర్కొంది. ఉత్తర దేశం నుంచి సింహాళానికి వెళ్లే మార్గంలో ఆంధ్రదేశం ముఖ్యమైన మజిలీగా ఉండేది.
             శాతవాహనులతో మొదటి చారిత్రక దశ మొదలవుతోంది. వీరి తొలుత సార్థవాహులు అంటే వ్యాపారులు. రాజ్యాధికారాన్ని అందుకున్న తర్వాత వీరు బ్రాహ్మణత్వాన్ని పొందారు. గౌతమీపుత్ర శాతకర్ణి ఏక బ్రాహ్మణ బిరుదు ధరించడం ఇందుకు తార్కాణం. ఆంధ్రుల సామాజిక ఊర్ధ్వ చలనం శాతవాహనులతోనే మొదలైంది. వీరు క్రీ.పూ.200 నుంచి క్రీ.శ.200 వరకు పాలించారు. కుంతల శాతకర్ణి ఆస్థానంలోని గుణాఢ్యుడు బహృత్కథ రచించారు. ఇది ప్రాకృతంలో ఉంది. శర్మవర్మ అనే సంస్కృత పండితుని ప్రోత్సాహంతో రాజు గుణాఢ్యుడిని ఆస్థానం నుంచి బహిష్కరించాడు. బృహత్కథ కాలగర్భంలో కలిసిపోయి కొంత భాగం కథా సరిత్సాగరం పేరుతో లభిస్తున్నది. దీంతో రాజాస్థానంలో సంస్కృతం తిష్ఠ వేసింది. ఇక్ష్వాకుల కాలంలో కూడా శాసనాలు ప్రాకృతంలోనే వేశారు. ఆ తర్వాత విష్ణుకుండినుల కాలం లో సంస్కృతం శాసన భాషగా స్థిరపడింది. శాతవాహనుల తొలి రాజధాని పైథాన్‌. వీరి రాజ్యం పశ్చిమ పైథాన్‌ నుంచి ఆదిలాబాద్‌, కరీంనగర్‌ మీదుగా తూర్పున కళింగదేశం వరకు విస్తరించింది. దక్షిణాన రాయలసీమ వరకు వ్యాపించింది. మెగస్తనీసు ప్రస్తావించిన శాతవాహ నుల పాలనలోని నగరాల్లో పైథాన్‌, కదంబపూర్‌, పిధుండ, మూషిక, గాజులబండ, ఫణిగిరి, కొండాపు రం(ఇవన్నీ తెలంగాణలోనివి), ధరణికోట, వేగి, భట్టిప్రో లు, విజయపురి(ఇవి కోస్తాలోనివి) ఉన్నాయి. శాతవాహన రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి, తత్వవేత్త నాగార్జునాచార్యులకు సమకాలీనుడు. శాతవాహనులు పైథాన్‌ నుంచి ధాన్యకటకానికి రోడ్డు మార్గం నిర్మించారు. ఈకాలంలో వృత్తుల మార్పిడితోపాటు కుల మార్పిడి ఉండేది.
           శాతవాహనుల తర్వాత క్రీ.శ. 200 నుంచి 620 వరకు ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, పల్లవులు, శాలంకాయనులు, ఆనందగోత్రికులు, తదితర చిన్నచిన్న రాజులు పాలించారు. ఈ కాలంలో బౌద్ధమతంపై వైదికం, ప్రాకృతంపై సంస్కృతం దాడిచేసి ఆధిపత్యం సాధించాయి. వృత్తి విజభన కుల విభజనగా స్థిరపడిన కాలం ఇది. ఇక్ష్వాకులు తొలుత నాగార్జునకొండ వద్ద విజయపురి తర్వాత విజయవాడ రాజధానిగా చేసుకొని పాలించారు. బృహత్పాలాయనులు మచిలీపట్నం వద్ద గూడూరు రాజధ ానిగా చేసుకుని పాలించారు. ఆనందగోత్రికుల రాజధాని కందరపురం. ఇది గుంటూరు జిల్లాలోని చేజెర్ల, చేబ్రోలు, కంతేరులలో ఒకటి కావచ్చని భావిస్తున్నారు. శాలంకా యనులు వేంగి రాజధానిగా కృష్ణా-గోదావరి మండలాల ను పాలించారు. విష్ణుకుండినులు తూర్పున విశాఖ వరకు పడమట గుంటూరు, నైరుతిన గోల్కొండ వరకు వేంగి రాజధానిగా పాలించారు. మొగల్రాజపురం, ఉండవల్లి గు హాలయాలు వీరు నిర్మించినవే. భారతదేశంలో ఇనుప నాణేలు ప్రవేశపెట్టినదీ వీరే. వీరి రాజధాని ఇంద్రపురం (నల్గొండ జిల్లాలోని ఇంద్రపాలగుట్ట) కావచ్చనే అభిప్రాయం ఉంది. ఆ తర్వాత పల్లవులు ఎక్కువకాలం ఎక్కువ భూభాగాన్ని పాలించిన రాజులు. వీరు ఆంధ్ర, తమిళ, కర్నాటక ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. వీరిని తంజావూరు చోళుల జయించారు. కడప మండలం కేంద్రంగా రేనాటి చోళులు పాలన సాగించారు. వీరిదే తొలి తెలుగుశాసనం. క్రీ.శ.600కు చెందిన ఈ శాసనం కడప జిల్లా ఉత్తరప్రాంతంలో లభించింది. మొదటి తెలుగు సీస పద్యాన్ని అద్దంకిలో చాళుక్య సేనాని పండరంగడు క్రీ.శ. 850లో చెక్కించాడు. రాజరాజనరేంద్రుని ప్రోత్సాహంతో క్రీ.శ. 1025లో నన్నయ సాగించిన తెలుగు కావ్య రచనకు నాంది ఇది. ఆ తర్వాత చాళుక్యులు, రాష్ట్రకూటులు, తూర్పు చాళుక్యులు పాలించారు. తూర్పు చాళుక్యుల కాలంలో తెలుగు కవిత్వానికి ప్రోత్సాహం లభించింది. ఆ తర్వాత పూర్వగాంగులు, చాళుక్యచోళులు పాలించారు. చాళుక్య కాలంలో కులాలలో పెద్ద మార్పులు, వలసలు వచ్చాయి.
శాతవాహనుల తర్వాత కాకతీయులే యావ దాంధ్రను పాలించారు. వీరి పాలన క్రీ.శ 1000 నుంచి 1300వరకు సాగింది. వీరి కాలంలోనే తిక్కన మహాభార తాన్ని పూర్తిచేశారు. వీరి తొలినాళ్లలోనే వీర వైష్ణవం, శైవా ల మధ్య ఘర్షణలు జరిగాయి. అందుకు పరాకాష్ఠగానే పల్నాటి యుద్ధాన్ని పేర్కొనవచ్చు. కులాల మధ్య కలాహాల తో కాకతీయుల సామ్రాజ్యం పతనమైంది. దీంతో ముసు నూరు నాయకులు పాలన చేపట్టారు. వీరిని తీరాంధ్రంలో ఓడించి కొండవీటి రాజ్యం వచ్చింది. వీరి కాలంలోనే శ్రీనాథుడు, ఎర్రాప్రగడ కవులు వర్ధిల్లారు. ఆ తర్వాత బహమనీ రాజ్యం వచ్చింది. బహుమనీ సామ్రాజ్యాన్ని 1518లో కుతుబ్‌షాహీలు ఆక్రమించుకున్నారు.
ఈ బహుమనీ సామ్రాజ్యం నుంచే తెలుగువారు రెండుగా విడిపోయి వేర్వేరు పాలనల్లోకి వచ్చారు. ఇటువైపున విజయనగర సామ్రాజ్యం ఏర్పడింది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఉచ్ఛస్థితికి చేరింది. ఈయన బహమనీ రాజులతో స్నేహం చేశారు. వీరి కాలంలోనే మధుర, తంజావూర్లకు తెలుగు సంస్కృతి వ్యాపించింది. ఆయన తెలుగుభాషకు ఎనలేని సేవచేశారు. స్వయంగా ఆముక్తమాల్యద రచించారు. తళ్లికోట యుద్ధంలో విజయనగర రాజ్యపతనానికి అళియ రామరాయలు కారకుడయ్యారు. సుల్తానులు ఆక్రమించారు. గోల్కొండను పాలించిన కుతుబ్‌షాహీలు తెలుగు సాహిత్యాన్ని పోషించారు. పొన్నెకంటి తెలగన్న, అద్దంకి గంగాధర కవి, సారంగుతమ్మయ్య గొల్కొండ నవాబుల కాలం వారే. కూచిపూడి నృత్యాన్ని గుర్తించి ప్రోత్సహించిందీ వారే. ఆ తర్వాత గోల్కోండ అసఫ్‌˜్‌ జాహీల పాలనలోకి వెళ్లింది. వీరి పాలనలోనే తెలుగు ప్రాంతం రెండు ముక్కలు అయ్యింది. అదే శాశ్వతంగా చీలికకు పునాది అయింది.
            బ్రిటీష్‌ వారు 1616లో మచిలీపట్నంలో అడుగుపెట్టారు. 1766లో ఉత్తర సర్కారులు, 1800లో రాయలసీమ ప్రాంతాలను బ్రిటీష్‌ వారికి నైజాం ఇచ్చేశాడు. మద్రాసు ప్రెసిడెన్సీలో కలిసిన ఈ ప్రాంతం బ్రిటీష్‌ వారి కాలంలో విద్య, వ్యవసాయ, రవాణా రంగాల్లో కొత్త పుంతలు తొక్కింది. సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ గోదావరి, కృష్ణా నదులపై బ్యారేజీలు కట్టించి వ్యవసాయానికి ఊతమిచ్చారు. స్వాతంత్య్రోద్యమ ప్రభావం, ఆంధ్రజాతి పునరుజ్జీవనోద్య మం ఫలితంగా ఇక్కడివారిలో కొత్త చైతన్యం వచ్చింది. ఆర్థిక, రాజకీయ, వ్యాపార, సాంస్కృతిక రంగాల్లో రాణించారు. బ్రిటీష్‌ వారిపై పోరాటంలో భాగస్వామ్యుల య్యారు. ఆంధ్ర ప్రజలను కమ్యూనిస్టు ఉద్యమం సంఘటితం చేయడంతోపాటు రాజకీయ చైతన్యం పెంచింది. ఛాందస భావాలను విడిచిపెట్టి హేతువాద, సామ్యవాద భావజాలాన్ని అనుసరించేలా చేయగలిగింది. ఈ దశలో ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుకు ఉద్యమం సాగింది. పొట్టి శ్రీరాముల ఆత్మార్పణంతో 1952 అక్టోబరు 1న ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం కర్నూలు రాజధానిగా ఏర్పడింది. మరోవైపు నిజాం కోరల్లో నలిగిపోతున్న తెలంగాణ విముక్తి కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ప్రారంభమైతే.. దానికి అన్ని విధాలా అండదండలు అందించిన ఈ ప్రాంతం వారు చివరకు తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను 1956 నవంబరు1న ఏర్పాటుచేసుకోవడమైంది. ఇందుకు రెండు ప్రాంతాల్లో పెల్లుబికిన సమైక్య భావనే మూలమైంది. ఈ ఆరు దశాబ్దాల కాలంలో ఆ భావన సన్నగిల్లి ప్రత్యేక తెలంగాణ భావన బలపడడంతో అనివార్యంగా తెలుగు జాతి రెండు రాష్ట్రాలుగా జూన్‌ 2న నుంచి వేర్వేరుగా మనుగడ సాగించనున్నాయి.