మార్చి - 2014 అంతర్జాతీయం


మార్చి - 2
¤ ఉక్రెయిన్‌ను ఆక్రమించుకునే హక్కు తమకుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించడం వివాదాస్పదమైంది. 

 »   ఈ నేపథ్యంలో రష్యాతో యుద్ధానికి తామూ సిద్ధమేనని ఉక్రెయిన్ ప్రధానమంత్రి ఆర్సెనీ యత్సెన్‌యుక్ ప్రకటించారు.
మార్చి - 3
¤ ఉక్రెయిన్‌పై సైనికదాడికి దిగిన రష్యా దళాలు క్రిమియా పట్టణానికి సమీపంలోని నౌకాస్థావరాన్ని స్వాధీనం చేసుకున్నాయి. కెర్చ్ అనే పట్టణంలో ఈ స్థావరం ఉంది. క్రిమియాపై రష్యా దళాలు ఇప్పటికే పూర్తి నియంత్రణ సాధించాయి. అక్కడి విమానాశ్రయాలను, ఇతర ముఖ్యమైన ప్రాంతాలను, కార్యాలయాలను తమ అధీనంలోకి తీసుకున్నాయి. 

 »   ఈ సంక్షోభాన్ని నివారించడానికి నాటో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. 

»   రష్యా దాడిని అమెరికా తీవ్రంగా ఖండించింది. ఈ ఆక్రమణను తక్షణం ఉపసంహరించుకోవాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు అమెరికా విదేశాంగ మంత్రి జాన్‌కెర్రీ సూచించారు. ఉక్రెయిన్‌లో ఉన్న రష్యన్ల భద్రత కోసమే తాము దాడికి దిగినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. 

 »   ఉక్రెయిన్‌కు మద్దతుగా బ్రిటన్ కూడా తన విదేశాంగ మంత్రిని ఉక్రెయిన్‌కు పంపించింది.

¤ పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని ఓ న్యాయస్థానంలో చొరబడిన సాయుధులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపిన ఘటనలో న్యాయమూర్తి సహా 11 మంది ప్రాణాలు కోల్పోయారు.
మార్చి - 4
¤ ఉక్రెయిన్‌పై రష్యా సైనిక జోక్యానికి నిరసనగా అమెరికా రష్యాతో సైనిక సహకారాన్ని నిలిపివేసింది. సైనిక విన్యాసాలు, భేటీలు, పర్యటనలను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఉక్రెయిన్‌కు వందకోట్ల డాలర్ల (రూ.6 వేల కోట్ల) ఇంధన రాయితీని కూడా అమెరికా ప్రకటించింది.
మార్చి - 5
¤ ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యాన్ని కలిగిన చైనా తన వార్షిక రక్షణ బడ్జెట్‌ను భారీగా 12.2% పెంచుతున్నట్లు ప్రకటించింది. 2011 తర్వాత ఇదే అతిపెద్ద పెంపు.

  »   దేశ పార్లమెంట్ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (ఎన్‌పీసీ)కి సమర్పించిన బడ్జెట్ ప్రతిపాదనల్లో రక్షణకు రూ.8,18,400 కోట్లు (132 బిలియన్ డాలర్లు/ 808.2 బిలియన్ యువాన్‌లు) కేటాయిస్తున్నట్లు చైనా ప్రధానమంత్రి లీ కెకియాంగ్ ప్రకటించారు.

  »   రక్షణ రంగానికి చైనా గతేడాది సుమారుగా రూ.7,29,740 కోట్లు (117.7 బిలియన్ డాలర్లు) ఖర్చు పెట్టింది.  

»   చైనా ప్రస్తుత బడ్జెట్ భారత రక్షణ బడ్జెట్‌తో పోలిస్తే నాలుగు రెట్లు ఎక్కువ. 

 »   చైనాలోని ప్రధాన నగరాలను ముంచెత్తుతున్న విషవాయువులపై పోరాటానికి రూ.2 లక్షల కోట్లకు పైగా కేటాయించింది. గతేడాది కంటే ఇది 7.1% ఎక్కువ.
మార్చి - 6
¤ ప్రజల శృంగార జీవితాలను నేరమయం చేయడాన్ని ప్రభుత్వాలు ఆపాలని మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కోరింది. సొంత శరీరాలను నియంత్రించుకునే హక్కును పరిరక్షించాలని వివరించింది.. 

 »   శృంగార, పునరుత్పత్తి హక్కులపై ప్రభుత్వ నియంత్రణకు వ్యతిరేకంగా 'నా శరీరం.. నా హక్కులు' అనే రెండేళ్ల ప్రచార ఉద్యమాన్ని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రారంభించింది. 

 »   ప్రజలు తమ శరీరాలు, జీవితాలు, శృంగారం, పునరుత్పత్తి జీవితానికి సంబంధించిన నిర్ణయాలను తీసుకునే హక్కులను ప్రభుత్వాలతో పాటు వైద్య నిపుణులు, బంధువులు కాలరాస్తున్నారని సంస్థ విమర్శించింది.  

»   '21వ శతాబ్దంలో కూడా కొన్ని దేశాలు బాల్య వివాహాలను, వైవాహిక అత్యాచారాలను ఆమోదిస్తుండటం గమనార్హం. మరికొన్ని దేశాలు గర్భస్రావం, వివాహేతర శృంగారం, స్వలింగ సంపర్కాన్ని నిషేధిస్తున్నాయి. కొన్నిచోట్ల అయితే మరణశిక్ష కూడా విధిస్తున్నారు' అని సంస్థ విమర్శించింది. 

 »   'నా శరీరం, నా హక్కులు' ఉద్యమంలో భాగంగా సామాజిక మీడియా ద్వారా యువతను లక్ష్యంగా చేసుకోనున్నట్లు సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా అల్జీరియా, బుర్కినాఫాసో, బల్ సాల్వెడార్, ఐర్లాండ్, మొరాకో, నేపాల్, ట్యునీషియాలపై దృష్టి పెట్టనున్నట్లు వివరించింది.  

»   అల్జీరియా, ట్యునీషియా, మొరాకోలలో బాధితురాలిని వివాహం చేసుకోవడం ద్వారా రేపిస్టులు శిక్షను తప్పించుకునే వీలుందని సంస్థ తెలిపింది. మొరాకోలో రోజుకు వంద మంది అత్యాచారానికి గురవుతున్నారని సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది. ఐర్లాండ్‌లో గర్భస్రావాలను అనుమతించాలంటూ ఉద్యమం చేపట్టనున్నట్లు ప్రకటించింది. గర్భస్రావానికి నిరాకరించడం వల్ల భారత్‌కు చెందిన సవిత హలప్పన్ అనే వైద్యురాలు మరణించిన సంగతిని సంస్థ గుర్తు చేసింది.  

»   ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ ప్రస్తుత సెక్రటరీ జనరల్ సలీల్ షెట్టి. ఆయన భారత్‌కు చెందినవారు

¤ ఢిల్లీలో ఘోర అత్యాచారానికి గురైన పారా మెడికల్ విద్యార్థిని 'నిర్భయ' ఇతివృత్తం ఆధారంగా రూపొందించిన నాటకాన్ని లండన్‌లో ప్రదర్శించారు.  

»   అంతర్జాతీయంగా పేరొందిన దర్శకుడు యేల్ ఫార్బర్ దీన్ని రూపొందించారు.  

»   గతేడాది దీన్ని స్కాట్లాండ్‌లో ప్రదర్శించినపుడు 'ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఫ్రీడం ఆఫ్ ఎక్స్‌ప్రెషన్' అవార్డు లభించింది.  

»   నాటకంలో భారత్‌కు చెందిన నటీనటులు, సృజన బృందం భాగస్వాములుగా ఉన్నారు.

¤ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని (మార్చి 8) పురస్కరించుకుని 606 పదాలతో బెల్జియంరూపొందించిన తపాలా బిళ్ల గిన్నిస్ ప్రపంచ రికార్డును సృష్టించింది.  

»   అమ్మాయి ఆకారంలో కనిపించేలా 606 పదాలను డిజైన్ చేశారు. బెల్జియం కు చెందిన పోస్ట్ సంస్థ ముద్రించే ఈ స్టాంప్‌ను యాన్ బెస్సిమెన్స్ అనే గ్రాఫిక్ డిజైనర్ రూపొందించారు.
మార్చి - 9
¤ అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ, రష్యా దళాలు ఉక్రెయిన్‌లోని క్రిమియాపై పట్టు బిగించాయి. తాజా సాయుధ చర్యలో క్రిమియా పశ్చిమంవైపు నుంచే ఉక్రెయిన్ సరిహద్దు పోస్ట్‌ను రష్యన్లు అధీనంలోకి తీసుకున్నారు.
మార్చి - 12
¤ అమెరికా జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఎస్ఏ), భారత టెలిమాటిక్స్ అభివృద్ధి కేంద్రం (సీడీటీ), బ్రిటన్‌లోని జీసీహెచ్‌క్యూ తీవ్రస్థాయిలో ఆన్‌లైన్ గూఢచర్యం (ఇ - మెయిల్, అంతర్జాలంలో ఇతర వ్యక్తిగత వ్యవహారాలను రహస్యంగా చూడటం) చేస్తున్నట్లు స్వచ్ఛంద సంస్థ రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ పేర్కొంది.


  »   ఈ మూడు సంస్థలనూ అంతర్జాతీయ అంతర్జాల శత్రువులుగా ఆ సంస్థ విమర్శించింది. ఈ దేశాల్లో 'స్వేచ్ఛ'కు గౌరవం లభిస్తున్నప్పటికీ ఆన్‌లైన్ గూఢచర్యం విషయంలో మాత్రం పరిస్థితి దారుణంగా ఉందని అభిప్రాయపడింది. 

 »   ముఖ్యంగా ఎన్ఎస్ఏ, జీపీహెచ్‌క్యూ కోట్లమంది పౌరుల, పాత్రికేయుల ఆన్‌లైన్ వ్యవహారాలను ఆరా తీస్తున్నాయని, ఇందుకోసం ఆ సంస్థలు వ్యక్తుల పరికరాల్లోకి పలురకాల సాఫ్ట్‌వేర్లను పంపుతున్నాయని ఆరోపించింది.  

»   సైబర్ సెన్సర్‌షిప్ వ్యతిరేక దినం సందర్భంగా రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ ఈ వివరాలను వెల్లడించింది.
మార్చి - 17
¤ క్రిమియా త‌న‌ను తాను స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకుంది. ఇక మీద‌ట ఉక్రెయిన్ చ‌ట్టాలు త‌మ‌కు వ‌ర్తించ‌వ‌ని స్పష్టం చేసింది. త‌మ‌ను ఒక భాగ‌స్వామ్య దేశంగా చేర్చుకోవాలని కోరుతూ ర‌ష్యా స‌మాఖ్యకు విజ్ఙప్తి చేసింది. స్వయంప్రతిప‌త్తితో ఉక్రెయిన్‌లోనే కొన‌సాగాలా? ర‌ష్యాలో చేరాలా? అనే అంశంపై జ‌రిగిన అభిప్రాయ సేక‌ర‌ణ (రిఫ‌రెండమ్‌) అనంత‌రం క్రిమియా ఈ ప్రక‌ట‌న‌ను జారీ చేసింది.

  »   ఇక మీద‌ట స్వతంత్ర స‌ర్వస‌త్తాక రాజ్యంగా, 'క్రిమియా రిప‌బ్లిక్' గా ఉంటుంద‌ని సుప్రీం కౌన్సిల్ వెల్లడించింది.

 »   ఈ తీర్మానాన్ని 100 సీట్ల క్రిమియా అసెంబ్లీలో హాజ‌రైన 85 మందీ అంగీక‌రించార‌ని క్రిమియా పేర్కొంది.


  »   ఇక నుంచి ఉక్రెయిన్ చ‌ట్టాలు వ‌ర్తించ‌వ‌ని, ర‌ష్యా మ‌ద్దతిచ్చిన ఉక్రెయిన్ అధ్యక్షుడు విక్టర్ య‌నుకోవిచ్ గ‌త నెల‌లో అధికార పీఠాన్ని కోల్పోయిన నాటి నుంచి ఆ దేశ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు త‌మ వ‌ద్ద అమ‌లు కావ‌ని స్పష్టం చేసింది.  

»   త‌మ భూభాగంపై ఉన్న ఉక్రెయిన్ ప్రభుత్వ సంస్థల కార్యక‌లాపాలు ఇక‌పై నిలిచిపోతాయ‌ని, ఆయా సంస్థల ఆస్తులు, వాటి బ‌డ్జెట్‌లు క్రిమియా ప్రభుత్వానికే చెందుతాయని తెలిపింది.  

»   త‌మ‌ను స్వతంత్ర రాజ్యంగా గుర్తించాల‌ని ఐక్యరాజ్యస‌మితికి, ప్రపంచ దేశాల‌కు విజ్ఞాప‌న చేసింది.
మార్చి - 18
¤ క్రిమియాను ర‌ష్యా ప‌టంలో చేర్చే ఒప్పందంపై ర‌ష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంత‌కం చేశారు. గ‌తంలో జ‌రిగిన అన్యాయాన్ని స‌రిదిద్దిన‌ట్లు ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు.  

»   ఉక్రెయిన్‌లోని ఇత‌ర ప్రాంతాల‌పై దాడిచేసే ఉద్దేశం లేద‌నీ, దాన్ని విభ‌జించాల‌నీ కోరుకోవ‌డం లేద‌ని పుతిన్ చెప్పారు.  

»   ఈ ప‌రిణామాల‌పై అమెరికా, ఐరోపా ర‌ష్యాపై మ‌రిన్ని ఆంక్షలు విధించ‌గ‌ల‌వ‌ని అమెరికా ఉపాధ్యక్షుడు జో బిడెన్ హెచ్చరించారు.  

»   క్రిమియా వ్యవ‌హారంలో జ‌పాన్ ర‌ష్యాపై కొన్ని ఆంక్షలు విధించింది. వీసా నిబంధ‌న‌ల స‌ర‌ళీక‌ర‌ణ‌, పెట్టుబ‌డులు, అంత‌రిక్ష అన్వేష‌ణ‌, సైనిక స‌హ‌కారంపై చ‌ర్చల‌ను ర‌ద్దు చేసింది.
మార్చి - 24
¤ మార్చి 8న కౌలాలంపూర్ నుంచి బీజింగ్‌కు బ‌య‌లుదేరిన మ‌లేసియా ఎయిర్‌లైన్స్ విమానం 'ఎంహెచ్ 370' ద‌క్షిణ హిందూ మ‌హాస‌ముద్రంలో కూలిపోయింద‌ని మలేసియా ప్రధాన‌మంత్రి న‌జీబ్ ర‌జాక్ ప్రక‌టించారు. 26 దేశాల బృందాలు అన్వేషించాక ఉప‌గ్రహం ద్వారా ల‌భించిన స‌మాచారంతో విమానం ద‌క్షిణ‌ హిందూ మ‌హాస‌ముద్రంలో ప‌డి మునిగిపోయింద‌ని నిర్ధరించారు.  

»   ఈ విమానంలో 220 మంది ప్రయాణికులు, 13 మంది సిబ్బంది ఉన్నారు. ప్రయాణికుల్లో అత్యధికులు (154 మంది) చైనీయులే. ఇత‌రుల్లో మ‌లేసియా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, అమెరికా, కెన‌డా దేశ‌స్థుల‌తో పాటు అయిదుగురు భార‌తీయులు కూడా ఉన్నారు.  

»   ప్రమాదానికి గ‌ల కార‌ణాల‌ను తెలుసుకోవ‌డానికి దర్యాప్తు కొన‌సాగుతుంద‌ని మ‌లేసియా ఎయిర్‌లైన్స్ తెలిపింది.
మార్చి - 26
¤ ఏటా పాకిస్థాన్‌కు ఇచ్చే 1.5 బిలియ‌న్ డాల‌ర్ల నుంచి 10 మిలియ‌న్ డాల‌ర్ల కోత విధించాల‌ని అమెరికా నిర్ణయించింది. ఈ మొత్తాన్ని ఉక్రెయిన్‌కు అందించ‌నుంది. ఉక్రెయిన్ స్వతంత్రత‌, స్థిర‌త్వాన్ని తాము కోరుకుంటున్నామ‌ని స్పష్టం చేసింది. సంక్షోభంలో ఉన్న ఉక్రెయిన్ స‌హాయార్థం రూపొందించిన ఈ బిల్లు ప్రతినిధుల స‌భ ఆమోదం పొందాల్సి ఉంది.¤ గ‌త ఏడాది ప్రకృతి వైప‌రీత్యాలు, మ‌నిషి సృస్టించిన విల‌యాల కార‌ణంగా ప్రపంచ‌వ్యాప్తంగా సుమారు రూ.8 ల‌క్షల 40 వేల కోట్ల మేర‌కు తీవ్ర న‌ష్టం వాటిల్లింద‌ని 'స్విస్ రే' బీమా సంస్థ వార్షిక అధ్యయ‌నంలో వెల్లడైంది.  

»   2012తో పోలిస్తే 2013లో జ‌రిగిన న‌ష్టం త‌క్కువేన‌ని ఈ సంస్థ పేర్కొంది.  

»   2013లో మ‌ధ్య, తూర్పు ఐరోపాల‌ను మే, జూన్ నెల‌ల్లో ముంచెత్తిన భారీ వ‌ర‌ద‌లు అత్యధిక న‌ష్టానికి కార‌ణ‌మ‌య్యాయ‌ని తెలిపింది.

¤ హ‌రిత విప్లవ పితామ‌హుడు నార్మన్ బోర్లాగ్ విగ్రహాన్ని అమెరికా కాంగ్రెస్ ప్రాంగ‌ణంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భార‌త్‌లో అమెరికా రాయ‌బారి నాన్సీ పావెల్‌, విదేశీ వ్యవ‌హారాల స‌హాయ మంత్రి (ద‌క్షిణ, మ‌ధ్య ఆసియా) నిషా దేశాయ్ బిస్వాల్‌, స్పీక‌ర్ జాన్ బోయ్‌న‌ర్‌, డెమోక్రటిక్ పార్టీ నేత నాన్సీ పెలోసి, మంత్రివ‌ర్గ సభ్యులు, ఇత‌ర ప్రతినిధులు పాల్గొన్నారు. 

»   వ్యవ‌సాయంలో అధికోత్పత్తి కోసం కృషి చేసి, కొన్ని కోట్ల మంది ఆక‌లిని తీర్చిన యోధుడిగా బోర్లాగ్‌ను వారు కొనియాడారు.

¤ క‌జ‌కిస్థాన్‌లోని బైక‌నూర్ అంత‌రిక్షకేంద్రం (ఐఎస్ఎస్‌) నుంచి బ‌య‌లుదేరిన 'సోయ‌జ్' రాకెట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీనిలో ర‌ష్యాకు చెందిన అలెగ్జాండ‌ర్ స్క్వోర్త్‌సోవ్‌, ఆర్టెమ్యేవ్‌, నాసా వ్యోమ‌గామి స్టీఫెన్ స్వాన్సన్ ఉన్నారు. ఈ యాత్రను అమెరికా, రష్యా సంయుక్తంగా చేపట్టాయి.   

»   వ్యోమ‌నౌక దృక్కోణ వ్యవ‌స్థ విఫ‌లం కావ‌డ‌మే దీనికి కార‌ణ‌మ‌ని ర‌ష్యా అంత‌రిక్ష సంస్థ 'రోస్‌కాస్మోస్' అధిప‌తి ఒస్టాపెంకో చెప్పారు. దీనివల్ల వ్యోమ‌గాముల‌కు ఎలాంటి ఇబ్బంది లేద‌ని ప్రక‌టించారు.  

»   భూమికి ఎగువున 418 కిలోమీట‌ర్ల ఎత్తులో ఉన్న ఐఎస్ఎస్‌తో సోయ‌జ్ అనుసంధాన‌మ‌వుతుంది.
మార్చి - 27
¤ ఉక్రెయిన్‌కు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) 1,400 -1,800 కోట్ల డాలర్ల వరకూ రుణ సాయం చేయనుంది. ఉక్రెయిన్‌లో వ్యవస్థాపూర్వక మార్పులకు ఈ రుణాన్ని వినియోగిస్తారు. రుణ భారంతో ఉక్రెయిన్‌ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే స్థితికి చేరింది. ఈ తరుణంలో రుణ సాయం చేయడానికి ఐఎంఎఫ్‌ హామీ ఇచ్చింది.  

»   అధ్యక్షుడు విక్టర్‌ యనుకొవిచ్‌ దేశం విడిచి పోవడంతో ఉక్రెయిన్‌లో మూడు నెలల ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం ఫిబ్రవరి చివర్లో తారస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌కు చెందిన క్రిమియా ద్వీపకల్పాన్ని ఆక్రమించుకునేందుకు రష్యా ప్రయత్నిస్తోంది.