ఏప్రిల్ - 2014 అంతర్జాతీయం


ఏప్రిల్ - 2
¤ ఉత్తర చిలీలోని పసిఫిక్‌ తీర ప్రాంతాలను తీవ్ర భూకంపం అత‌లాకుత‌లం చేసింది. భారీ సునామీ అలల తాకిడి సృష్టించిన బీభత్సంలో కనీసం ఆరుగురు మరణించారు. రిక్టరు స్కేలుపై 8.2గా భూకంపం తీవ్రత నమోదైంది.
 ఏప్రిల్ - 5
¤ సాల్మన్‌ దీవులను ముంచెత్తిన వరదల్లో కనీసం 16 మంది మరణించారు. మరో 40 మంది గల్లంతయ్యారు. ఈ విపత్తు వల్ల 49 వేల మంది నిర్వాసితులయ్యారని అధికారులు తెలిపారు. గల్లంతైనవారిలో ఎక్కువ మంది చిన్నారులేనని సహాయ సిబ్బంది చెప్పారు. తుపాను తీవ్రతకు రాజధాని హొనియారాలోని ప్రధాన నది మటానికావ్‌ కట్టలు తెంచుకుని ప్రవహించింది. పక్కనే ఉన్న ఇళ్లు, వంతెనను నేల మట్టం చేసింది. 
 ఏప్రిల్ - 12
¤ క‌ర్బన ఉద్గారాల‌ను త‌గ్గించ‌డం కోసం ఐక్యరాజ్యస‌మితి సిఫారసుల‌తో రూపొందించిన నివేదిక‌ను వివిధ దేశాల ప్రభుత్వాల ప్రతినిధులు బెర్లిన్‌లో జ‌రిగిన స‌ద‌స్సులో ఆమోదించారు.         
»  వాతావ‌ర‌ణ మార్పుల వ‌ల్ల ఎదుర‌య్యే స‌వాళ్లను స‌మ‌ర్థంగా ఎదుర్కోవ‌డానికి అవ‌స‌ర‌మైన విస్తృత ప్రత్యామ్నాయాల‌తో ఈ నివేదిక‌ను రూపొందించారు.
ఏప్రిల్ - 13
¤ లిబియా ప్రధాని అబ్దుల్లా అల్‌థాని పదవి నుంచి వైదొలిగారు. తనపై, తన కుటుంబంపై సైన్యం ద్రోహపూరిత దాడి చేసిన నేపథ్యంలో పదవి నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు.

¤ సామాజిక మీడియా ఫేస్‌బుక్‌లోని సమాచారానికి కత్తెర వేయాలని విజ్ఞప్తులు చేయడంలో భారత్ ప్రపంచంలోనే మొదటిస్థానంలో ఉన్నట్లు ఫేస్‌బుక్ వెల్లడించింది.         
»  స్థానిక చట్టాలకు విరుద్ధంగా ఉన్నాయంటూ కంటెంట్‌ను అడ్డుకోవడానికి భారత అధికారుల నుంచి గత ఏడాది జులై నుంచి డిసెంబరు మధ్య కాలంలో 4,765 విజ్ఞప్తులు వెళ్లాయి. మతం లేదా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పెట్టిన కొన్ని పోస్ట్‌లు చట్టాలను ఉల్లంఘిస్తున్నాయని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (ఐసీఈఆర్‌టీ), ప్రభుత్వ అధికారుల నుంచి విజ్ఞప్తుల మేరకు తాము సంబంధిత కంటెంట్‌ను తొలగించినట్లు ఫేస్‌బుక్ వివరించింది.         
»  భారత్ తర్వాత ఇలాంటి విజ్ఞప్తులు పంపిన దేశాల్లో టర్కీ (2,014), పాకిస్థాన్ (162), ఇజ్రాయిల్ (133), జర్మనీ (84) ఫ్రాన్స్ (80) ఉన్నాయి.         
»  వినియోగదారులకు సంబంధించిన సమాచారాన్ని కోరడంలో అమెరికా ప్రథమస్థానంలో ఉంది. అమెరికా 12,598 మంది గురించి ఆరా తీసినట్లు ఫేస్‌బుక్ వెల్లడించింది. ఈ విషయంలో భారత్ రెండో స్థానంలో (4,711 మంది) ఉంది.         
»  భారత్‌లో 10 కోట్ల మంది వినియోగదారులు ఉన్నట్లు ఫేస్‌బుక్ సంస్థ వెల్లడించింది.

¤ ఒక భారీస్థాయి త్రీడీ ప్రింటర్‌తో చైనాలోని ఓ నిర్మాణ సంస్థ కేవలం 24 గంటల వ్యవధిలో పది ఇళ్లను నిర్మించింది. షాంఘైలోని క్వింగ్‌పూ జిల్లాలో వీటిని నిర్మించారు.         
»  పారిశ్రామిక నిర్మాణ వ్యర్థ పదార్థాలను శుద్ధిచేసి, కాంక్రీట్‌గా ఉపయోగించి, ఈ ఇళ్లను నిర్మించడం విశేషం.         
»  ఇళ్ల నిర్మాణానికి ఉపయోగించిన ప్రింటర్ 500 అడుగుల పొడవు, 33 అడుగుల వెడల్పు, 20 అడుగుల ఎత్తులో భారీ స్థాయిలో ఉంది.

¤ దక్షిణ అమెరికా దేశమైన చిలీలోని వాల్పరైసో పట్టణ సమీపంలోని అడవిలో ఏర్పడిన కార్చిచ్చు పట్టణంలోని ఇళ్లకు వ్యాపించిన ఘటనలో 11 మంది సజీవదహనమయ్యారు. మంటల తీవ్రతకు పట్టణంలోని 500 ఇళ్లు కాలి బూడిదయ్యాయి.

ఏప్రిల్ - 14
¤  నైజీరియా రాజధాని అబూజా శివార్లలోని న్యాన్యా బస్‌స్టేషన్‌లో బాంబు పేలిన ఘటనలో 71 మంది మృతి చెందారు.         
»   బోకో హరామ్ తీవ్రవాద సంస్థకు చెందిన ఇస్లామిస్ట్‌లు ఈ దుశ్చర్యకు కారణమని పోలీసులు నిర్ధారించారు.         
»   నైజీరియా అధ్యక్షుడు గుడ్‌లక్ జొనాథన్.
ఏప్రిల్ - 16
¤  దక్షిణ కొరియాలో భారీ దుర్ఘటన చోటు చేసుకుంది. 459 మందితో కూడిన 'ఎం.వి.సియోల్' అనే ఓడ ఇంచియాన్ పట్టణం నుంచి జెజూ ద్వీపానికి వెళ్తుండగా, బ్యోంగ్‌పంగ్ అనే ద్వీపం వద్ద ప్రమాదానికి గురై సముద్రంలో మునిగి పోయింది.

¤  2014 తొలి త్రైమాసికంలో చైనా వృద్ధిరేటు 7.4 శాతంగా నమోదైంది. ఇది 18 నెలల కనిష్ఠం కావడం గమనార్హం. 2012 మూడో త్రైమాసికంలో జీడీపీ 7.4 శాతంగా నమోదయింది. 2013 నాలుగో త్రైమాసికంలో అది 7.7 శాతానికి చేరింది. సంస్కరణలు, పునరుద్ధరణ చర్యలు చేపట్టినా, మళ్లీ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 7.4 శాతానికి దిగివచ్చింది.         
»   2013కు చైనా వృద్ధి రేటు 7.7 శాతంగా నమోదైంది. అధికారిక లక్ష్యమైన 7.5 శాతంతో పోలిస్తే ఇది ఎక్కువ. ఈ ఏడాదికూడా జీడీపీ లక్ష్యాన్ని 7.5 శాతంగానే నిర్ణయించారు. చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ఈ గణాంకాలను వెల్లడించింది.
ఏప్రిల్ - 20
¤  ఈస్టర్ పర్వదినాన్ని ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులు ఘనంగా నిర్వహించారు.         
»   క్రైస్తవులకు పరమ పవిత్రమైన వాటికన్ సిటీలో సెయింట్ పీటర్స్ స్వ్కేర్ వద్ద ఈస్టర్ సందర్భంగా పోప్ ఫ్రాన్సిస్ ప్రజలకు ఆశీర్వాదాలు అందించారు. ఉక్రెయిన్, సిరియా దేశాల్లో శాంతి వెల్లివిరియాలని ఫ్రాన్సిస్ తన సందేశంలో ఆకాంక్షించారు.
 ఏప్రిల్ - 22
¤  భారత్‌లో ఎన్నికల తరువాత ఏర్పడే కొత్త ప్రభుత్వం, నాయకత్వంతో సత్సంబంధాలు నెరపాలని అమెరికా నిర్ణయించింది. ఈ మేరకు కొత్త ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లదగిన అంశాలను గుర్తించాలని ఆ దేశంలోని అన్ని శాఖలకూ ఒబామా కార్యాలయం సూచించింది.
ఏప్రిల్ - 25
¤  విలేకరుల కోసం ఫేస్‌బుక్ ప్రత్యేకంగా 'ఎఫ్‌బీ న్యూస్‌వైర్' పేరుతో ఒక కొత్త సదుపాయాన్ని ప్రారంభించింది. దీంట్లో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలకు సంబంధించిన వార్తా కథనాలు ఉంటాయి.         
»   ప్రతి రోజూ దాదాపు వందకోట్లకు పైగా తమ ఖాతాదారులు ఫొటోలు, వార్తలు, వీడియోలను ఫేస్‌బుక్‌లో పొందుపరుస్తుంటారని, వీటిలోంచి ముఖ్యమైన పరిణామాలను న్యూస్‌వైర్‌లో నిక్షిప్తం చేస్తామని ఫేస్‌బుక్ వెల్లడించింది.
ఏప్రిల్ - 27
¤  ఇటీవల ఒక ప్రయాణికుల నౌక మునిగిపోయిన ఘటన నేపథ్యంలో దక్షిణ కొరియా ప్రధాని ఛంగ్ హాంగ్ వాన్ తన పదవికి రాజీనామా చేశారు.         
»   ఈ ప్రమాదంలో సుమారు 300 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. వీరిలో పలువురు మృతి చెందగా, అనేక మంది ఆచూకీ లేకుండా పోయారు.         
»   మునిగిపోతున్న నౌకనుంచి ప్రయాణికులను రక్షించడంలో ప్రభుత్వం సరిగా స్పందించలేదని ప్రజలనుంచి ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో ఛంగ్ హాంగ్ వాన్ పదవి నుంచి తప్పుకున్నారు. సహాయక చర్యలను సమర్థంగా నిర్వహించలేకపోయానని ఆయన అంగీకరించారు. ప్రధాన మంత్రిగా ఈ వైఫల్యానికి తాను పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఏప్రిల్ - 28
¤  అమెరికా, బంగ్లాదేశ్‌లలో తుపాన్లు బీభత్సం సృష్టించాయి.         
»   దక్షిణ-మధ్య అమెరికాలో సంభవించిన తుపాన్ (టోర్నడో)వల్ల 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రచండమైన గాలుల వేగానికి కార్లు, నివాసాలు, భారీ చెట్లు ఎగిరి పడ్డాయి. విలోనియా అనే పట్టణంలోని భవనాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. గ్యాస్‌లైన్లు, పైప్‌లైన్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి.         
»   బంగ్లాదేశ్‌లో కూడా భారీ తుపాను విధ్వంసం సృష్టించింది. దేశంలోని ఉత్తర వాయవ్య జిల్లాల్లో భారీ నష్టం కలగజేసింది. తుపాను ప్రభావానికి మొత్తం 16 మంది మరణించారు. దాదాపు వెయ్యి గృహాలు దెబ్బతిన్నాయి.

¤  ముస్లిం బ్రదర్‌హుడ్ సంస్థ అధిపతి మహ్మద్ బేడీ, ఆయనకు సంబంధించిన 682 మంది ఇస్లామిక్ మద్దతుదారులకు మరణశిక్ష విధిస్తూ, ఈజిప్టు కోర్టు తీర్పు వెలువరించింది.         
»   గతేడాది ఆగస్టు 14న దక్షిణ మిన్యా ప్రావిన్స్‌లో హత్యలు, పోలీసులపై హత్యాయత్నం అభియోగాలను దోషులపై మోపారు. ఆ రోజున పదవీచ్యుత అధ్యక్షుడు మహ్మద్ మోర్సీకి మద్దతుగా బ్రదర్‌హుడ్ కార్యకర్తలు నిర్వహించిన ధర్నాలను పోలీసులు బల ప్రయోగం ద్వారా భగ్నం చేశారు. నాటి ఘటనలో వందలమంది చనిపోయారు. దీనికి సంబంధించి మిన్యాలోని కోర్టు తాజాగా 683 మందికి మరణశిక్షను విధించింది.         
»   ఈ శిక్షలను చట్ట ప్రకారం దేశ అత్యున్నత ఇస్లాం సంస్థ గ్రాండ్ ముఫ్తీకి న్యాయమూర్తి నివేదించారు. మరణశిక్షలను ఈ సంస్థ ఆమోదించాల్సి ఉంటుంది.

¤  ఫలాల్లో 'రాజు'గా పేరొందిన భారత 'అల్ఫాన్సో' మామిడి పండ్ల దిగుమతులపై యురోపియన్ యూనియన్ (ఈయూ) మే 1 నుంచి అమల్లోకి వచ్చేలా తాత్కాలిక నిషేధాన్ని విధించింది.         
»   ఈయూలో 28 దేశాలకు సభ్యత్వం ఉంది. అల్ఫాన్సో రకం మామిడి పండ్లతోపాటు వంకాయ, చేమ దుంప, కాకర, పొట్లకాయల దిగుమతి పైన కూడా తాత్కాలిక నిషేధాన్ని యూరోపియన్ కమిషన్ ప్రతిపాదించగా ఈయూకి చెందిన మొక్కల స్వస్థత స్థాయీ సంఘం ఆ ప్రతిపాదనను ఆమోదించింది. గతేడాది భారత్‌నుంచి ఈయూకు దిగుమతి అయిన పండ్లు, కాయగూరలు కొన్నిరకాల కీటకాలవల్ల కలుషితం అయినట్లు గుర్తించి, ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.         
»   భారత్‌నుంచి ఈయూకు వస్తున్న మొత్తం తాజా పండ్లు, కాయగూరల్లో నిషేధిత అవశేషాలు 5 శాతం కంటే తక్కువే అయినప్పటికీ, ఈయూ వ్యవసాయ ఉత్పత్తులకు హాని వాటిల్లకూడదనే ఈ చర్య తీసుకున్నట్లు స్థాయీ సంఘం వివరించింది.