ఆగస్టు - 2014 సైన్స్ అండ్ టెక్నాలజీ



ఆగస్టు - 2 
¤ ప్రపంచంలోనే అత్యంత లోతైన ప్రదేశంలో ఉన్న ప్రయోగశాల విస్తరణ పనులను చైనా ప్రారంభించింది. చైనాలోని నైరుతి సిచువాన్‌ రాష్ట్రంలో ఉన్న జిన్‌పింగ్‌ జలవిద్యుదుత్పత్తి కేంద్రం అడుగున 2,400 మీటర్ల లోతున ఒక ప్రయోగశాలను చైనా నిర్మిస్తోంది. 2010లో మొదలైన నిర్మాణ పనులు ప్రస్తుతం రెండోదశలోకి అడుగుపెట్టాయి. 2015లో ఈ ప్రయోగశాల నిర్మాణం పూర్తికానుంది.       » సైన్స్‌ చరిత్రలోనే అతిపెద్ద చిక్కుముడిగా ఉన్న కృష్ణపదార్థం గురించి తెలుసుకోవడానికి ఈ ల్యాబ్‌లో ప్రయోగాలు జర‌గనున్నాయి. అత్యంత లోతైన ప్రాంతంలో ఉండటం వల్ల పరిశోధనలపై కాస్మిక్‌ కిరణాల ప్రభావం పడదు.¤ ప్రాథమిక శక్తి వనరైన సూర్యుడి నుంచి కాంతిని జీవజాలం గ్రహిస్తున్న తీరును ఫ్రాన్స్‌ శాస్త్రవేత్తలు వెలుగులోకి తెచ్చారు. కొన్ని లిపిడ్లతో కూడిన మిశ్రమం ఇందుకు దోహదపడుతుందని తేలింది. ఇవి సూర్యకాంతిని ఒడిసిపట్టి, శక్తిగా మార్చడంలో సాయపడుతున్నాయని వెల్లడైంది.        » ఫొటోవోల్టాయిక్‌ ప్రభావాన్ని 1839లో అలెగ్జాండ్రే ఎడ్మండ్‌ బెక్వరల్‌ అనే శాస్త్రవేత్త కనుక్కున్నారు. జీవులు కాంతిని గ్రహించి, శక్తిగా మార్చడంలో కొన్ని లిపిడ్లతో కూడిన సహజసిద్ధ మిశ్రమం పాత్ర పోషిస్తున్నట్లు శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు.
ఆగస్టు - 3

¤ చైనా డాంగ్‌ఫెంగ్ - 41 (డీఎఫ్ - 41) అనే కొత్త తరం ఖండాంతర క్షిపణి (ఐసీబీఎం)ని రూపొందించింది. ఇది 12వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. మూడు అణు వార్‌హెడ్లను మోసుకెళ్లగలదు. ఇంత సుదీర్ఘశ్రేణి అస్త్రాలను కలిగిన అతికొద్ది దేశాల సరసన చైనా కూడా చేరింది.
ఆగస్టు - 5
¤ సముద్ర స్థితిగతులపై కచ్చితమైన తాజా సమాచారాన్ని అందించేందుకు హైదరాబాద్‌లోని భారత జాతీయ సముద్ర సమాచార కేంద్రం (ఇన్‌కాయిస్) ఆధునిక పరికరాలను ఏర్పాటు చేసింది. దీనివల్ల ఓడరేవులకు, మత్స్యకారులకు 48 గంటల ముందుగా సమాచారం అందుతుంది.       » సముద్రాల్లో భూకంపాలు, సునామీలను పసిగట్టి సమాచారం ఇచ్చేందుకు ఇన్‌కాయిస్ దేశ సముద్ర జిల్లాల్లో సెన్సార్లతో కూడిన పరికరాలను అమర్చింది. నీటిపై తేలియాడే వేవ్ రైడర్ మూరుడ్ బోయిస్ అనే పరికరాలను 10 చోట్ల ఏర్పాటు చేసింది. విశాఖపట్నం, పాండిచ్చేరి, కాలికట్, ట్యుటికోరన్ తదితర ప్రదేశాల్లో వీటిని ఏర్పాటు చేశారు.       » 12వ పంచవర్ష ప్రణాళికలో మొత్తం 16 మూరుడ్ బోయిస్‌లను అమర్చాలన్నది లక్ష్యం కాగా ఇప్పటివరకు 10 చోట్ల ఏర్పాటు చేశారు. నూతనంగా ఏర్పాటుచేయనున్న ఆరింటిలో ఒకదాన్ని కాకినాడ వద్ద అమర్చనున్నారు.¤ సౌరశక్తితో నడిచే నౌకల్లో ప్రపంచంలో పెద్దదిగా గుర్తింపు పొందిన 'ఎంఎస్ టరనర్ ప్లానెట్ సోలార్' అనే నౌక ఏథెన్స్‌లోని జియా హార్బర్‌కు చేరుకుంది.
ఆగస్టు - 9
¤ శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించడానికి, ప్రకృతి విపత్తుల సమయంలో ముందస్తు హెచ్చరికలు చేయడానికి చైనా 'యావోగాన్ - 20' అనే రిమోట్‌సెన్సింగ్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది.
       » లాంగ్ మార్చ్ 4సి వాహకనౌక ద్వారా ఈ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టారు
.
       » గోబీ ఎడారిలోని జియుక్వాన్ ఉపగ్రహ ప్రయోగకేంద్రం నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించారు
.
       » లాంగ్ మార్చ్ రాకెట్ శ్రేణికి ఇది 190వ ప్రయోగం కావడం విశేషం
.
¤ భవిష్యత్తులో అంగారకుడి ఉపరితలంపైకి భారీ బరువులను తీసుకెళ్లే ఉద్దేశంతో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఒక వినూత్న పరీక్షను విజయవంతంగా నిర్వహించింది
.
       » సాసర్ లాంటి ఒక వాహనాన్ని భూమి నుంచి చాలా ఎత్తులో పరీక్షించింది. ఈ వాహనం పేరు 'లో డెన్సిటీ సూపర్‌సోనిక్ డెసెలరేటర్ (ఎల్‌డీఎస్‌డీ)'. ఇది ధ్వని కంటే నాలుగు రెట్ల వేగంతో 57,900 మీటర్లు ప్రయాణించి, అంగారకుడిపై ల్యాండింగ్ పరిస్థితులను కృత్రిమంగా కళ్లకు కట్టింది
.
       » హవాయ్‌లోని అమెరికా నౌకాదళ పసిఫిక్ మిసైల్ రేంజ్ ఫెసిలిటీ వద్ద ఈ ప్రయోగం జరిగింది.
ఆగస్టు - 12
¤ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఆకాష్ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది.       »   ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) వద్ద భారత వైమానిక దళం ఈ పరీక్షను నిర్వహించింది.       »   ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల ఈ క్షిపణి 25 కి.మీ. దూరం ప్రయాణించగలదు. 60 కిలోల వార్‌హెడ్లను మోసుకెళ్లగలదు.       »   ఐటీఆర్ డైరెక్టర్ ఎం.వి.కె.వి.ప్రసాద్.¤ జపాన్ పరిశోధకులు ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కెమెరాను రూపొందించారు. ఇది సెకనుకు 44,000 కోట్ల ఫ్రేమ్‌లను చిత్రిస్తుంది.       »   సాధారణంగా వేగవంతమైన కెమెరాలు 'పంప్ ప్రోబ్' విధానంపై పనిచేస్తాయి. కానీ దీనిలో ఉన్న సాంకేతిక పరిమితుల కారణంగా ఇవి అంతగా వినియోగంలోకి రాలేదు.       »   ఈ నేపథ్యంలో జపాన్‌లోని కీయో, టోక్యో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మోషన్ ఆధారిత 'ఫెమ్టోగ్రఫీ' అనే పద్ధతిని ఆధారంగా చేసుకొని కొత్త కెమెరాను తయారు చేశారు. ఇది ఆప్టికల్ మ్యాపింగ్ సాంకేతికతను ఉపయోగించుకుంటూ పనిచేస్తుంది.
ఆగస్టు - 13
¤ దేశీయంగా అభివృద్ధి చేసిన ఆకాష్ క్షిపణిని భారత్ వరుసగా రెండో రోజూ విజయవంతంగా పరీక్షించింది. చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుంచి ఈ పరీక్షను నిర్వహించారు.       »   వినియోగదారు పరీక్షల్లో భాగంగా వైమానిక దళమే పూర్తిగా ఈ ప్రయోగాన్ని నిర్వహించింది.
ఆగస్టు - 15
¤ గున్యా నుంచి రక్షణకు అమెరికా శాస్త్రవేత్తలు టీకాను అభివృద్ధి చేశారు. తీవ్రమైన కీళ్లనొప్పులు, తలనొప్పి, జ్వరంతో కూడిన గున్యాకు ప్రస్తుతం సమర్థవంతమైన ఔషధాలు గానీ టీకాలు గానీ లేవు.       »   ఈ నేపథ్యంలో అమెరికాలోని 'నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్‌ఫెక్షియస్ డిసీజెస్' సంస్థ పరిశోధకులు కొత్త టీకాను రూపొందించారు.¤ రోదసిలో రెండు కొత్త గ్రహ శకలాలను ఢిల్లీకి చెందిన నలుగురు పాఠశాల విద్యార్థులు కనుక్కున్నారు. వీరిలో చిన్మయ విద్యాలయకు చెందిన ఆర్యన్ మిశ్రా, కీర్తివర్ధన్ కనుక్కున్న గ్రహ శకలానికి '2014 00372' అని; బాలభారతి పబ్లిక్ స్కూల్‌కు చెందిన అక్షత్ శర్మ, క్షితిజ్ జిందాల్ గుర్తించిన ఖగోళ వస్తువుకు '2014 ఓయూ6' అని తాత్కాలికంగా నామకరణం చేశారు. వీటిని ప్యారిస్‌లోని అంతర్జాతీయ ఖగోళ సంఘం నిర్వహిస్తోన్న ప్రపంచ అధికార క్యాట్‌లాగ్‌లో చేర్చడమే తరువాయి. ఆ గ్రహశకలాల ఉనికిని నిర్ధరిస్తే, వాటికి పేరు పెట్టే అవకాశం ఈ చిన్నారులకు లభిస్తుంది.       »   గ్రహ శకలాల గుర్తింపు కార్యక్రమాన్ని ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ సెర్చ్ కొలాబరేషన్ (ఐఏఎస్‌సీ) సాయంతో 'స్పేస్' అనే భారతీయ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం కింద అమెరికాలోని ఆస్ట్రోనామికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ అబ్జర్వేటరీ సేకరించిన డేటాను చిన్నారులకు అందిస్తారు. దీన్ని విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకుని, ప్రత్యేక సాఫ్ట్‌వేర్ సాయంతో గ్రహశకలాల కోసం విశ్లేషించాల్సి ఉంటుంది. 2010 నుంచి 'స్పేస్' సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
ఆగస్టు - 16 
¤  సహజ హంతక కణాలుగా పేరుపొందిన ప్రత్యేకమైన రోగ నిరోధక కణాలు 'మెలనోమా' అనే క్యాన్సర్ కణాలను తుదముట్టించడంలో కీలకపాత్ర పోషిస్తాయని తాజా అధ్యయనంలో తేలింది. శరీరంలో విస్తరించిన క్యాన్సర్లను వీటి సాయంతో అంతమొందించవచ్చని పరిశోధకులు తెలిపారు. ఎముక మజ్జ మార్పిళ్లను శరీరం తిరస్కరించేలా చేయడంలోనూ ఈ హంతక కణాలు కీలకపాత్ర పోషిస్తున్నట్లు తేల్చారు.       »   ఆస్ట్రేలియాలోని వాల్టర్ అండ్ ఎలీజా హాల్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన నిర్వహించారు.¤  స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన అతిపెద్ద యుద్ధనౌక ఐఎన్ఎస్ కోల్‌కతాను ప్రధాని నరేంద్ర మోడీ ముంబయిలో నౌకాదళంలో ప్రవేశపెట్టారు.       »   ఐఎన్ఎస్ కోల్‌కతా గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ యుద్ధ నౌక. దీన్ని మజగావ్ డాక్ యార్డ్ నిర్మించింది. ఈ తరగతి కిందే ఐఎన్ఎస్ కోచి, ఐఎన్ఎస్ చెన్నై అనే మరో రెండు నౌకలను భవిష్యత్తులో సిద్ధం చేస్తారు. ఐఎన్ఎస్ కోల్‌కతా నిర్మాణం 2003 సెప్టెంబరులో ప్రారంభమైంది. 2006లో దీన్ని సాగరంలోకి ప్రవేశపెట్టారు. 2010లోనే నౌకాదళంలోకి చేర్చాలనుకున్నా జాప్యం జరిగింది. పరీక్షల సమయంలో నౌకలో ప్రమాదం జరిగి ఒక అధికారి మరణించారు. ఇప్పటికీ ఈ నౌక పూర్తిస్థాయిలో సిద్ధం కాలేదు. వైమానిక దాడుల నుంచి నౌకను రక్షించే ప్రధాన గగనతల రక్షణవ్యవస్థ ఇంకా పరీక్షల దశలోనే ఉంది.       »   ఐఎన్ఎస్ కోల్‌కతా బరువు 6800 టన్నులు. పొడవు 164 మీటర్లు కాగా, వెడల్పు 18 మీటర్లు. పూర్తిస్థాయిలో సామగ్రిని మోసుకెళితే దాని బరువు 7400 టన్నులు ఉంటుంది. ఇందులోని శక్తిమంతమైన నాలుగు గ్యాస్ టర్బైన్ల కారణంగా 30 నాట్ల కంటే ఎక్కువ వేగంతో నౌక ప్రయాణిస్తుంది. నౌకలో 4.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తవుతుంది. ఇది ఒక చిన్న పట్టణంలో విద్యుత్ అవసరాలను తీర్చగలదు. ఈ యుద్ధ నౌకలో 30 మంది అధికారులు, 300 మంది సిబ్బంది ఉంటారు.       »   ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి అరుణ్‌ జైట్లీ, మహారాష్ట్ర గవర్నర్ కె.శంకర్ నారాయణన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.కె.ధోవన్ తదితరులు పాల్గొన్నారు. 
ఆగస్టు - 17
¤  విశ్వంలో ఒక భారీ కృష్ణబిలం చుట్టూ జరుగుతున్న అరుదైన ఘటనను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) టెలిస్కోప్ చిత్రీకరించింది.       »   కృష్ణబిలం వద్ద 'కరోనా' అనే చిన్నపాటి ఎక్స్‌రే వనరు ఉంటుంది. అది కొద్ది రోజుల వ్యవధిలోనే కృష్ణబిలానికి చేరువ కావడాన్ని 'న్యూక్లియర్ స్పెక్ట్రోస్కోపిక్ టెలిస్కోపిక్ అర్రే' (నుస్టార్) గమనించింది. గతంలోనూ ఇలాంటి పరిణామాలను గుర్తించినా ఇంత వివరంగా ఎప్పుడూ వెలుగు చూడలేదు.       »   గెలాక్సీల మధ్యలో భారీ కృష్ణబిలాలు ఉంటాయని అంచనా. ఇందులో కొన్ని చాలా భారీగా ఉండటంతో పాటు చాలా వేగంగా తిరుగుతుంటాయి.       »   తాజాగా భూమికి 324 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న 'మార్కేరియన్ 335' అనే కృష్ణబిలాన్ని నుస్టార్ పరిశీలించింది.¤  పర్వత ప్రాంతాల్లో సైన్యం అవసరాల కోసం అమెరికా నుంచి కొనుగోలు చేయదలచిన 145 'హోవిట్జర్' తేలికపాటి తుపాకుల విషయంలో ముందుకు వెళ్లలేమని భారత్ తేల్చిచెప్పింది. వాటి ధర పెంపు దృష్ట్యా ఈ పరిస్థితి ఏర్పడిందని అమెరికాకు స్పష్టం చేసింది.       »   ఎం - 777 హోవిట్జర్ల సరఫరాకు రూ.3600 కోట్లు ఖర్చవుతుందని 2013 తొలినాళ్లలో అంచనా వేశారు. ఒప్పందం ఖరారులో జాప్యం కారణంగా మరో రూ.300 కోట్లు చెల్లించాలని గతేడాది ఆగస్టులో అమెరికా వర్గాలు భారత్‌ను కోరాయి.
ఆగస్టు - 18 
¤  అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) బయట రష్యన్ వ్యోమగాములు అలెగ్జాండర్ స్క్వోర్త్ సోవ్, ఒలెగ్ అర్టెమియేవ్ స్పేస్ వాక్ నిర్వహించారు. వీరు పెరూ కు చెందిన ఒక నానో ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి విడిచిపెట్టనున్నారు. దీని బరువు కిలో కంటే తక్కువే ఉంటుంది. సాంకేతిక అభ్యాసం కోసం లిమాలోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఇంజినీరింగ్ దీన్ని రూపొందించింది. 
ఆగస్టు - 19
¤  అమెరికాలోని మేరీలాండ్ యూనివర్సిటీకి చెందిన ఆస్ట్రానమీ విద్యార్థి, భారత సంతతికి చెందిన ధీరజ్‌పాశం, అతడి సహచరులు ఒక కృష్ణబిలం ఉనికిని కచ్చితంగా గుర్తించడంతోపాటు దాని పరిమాణాన్ని కూడా లెక్కగట్టారు.       »   భూమికి కోటీ 20 లక్షల కాంతి సంవత్సరాల దూరంలోని మెస్సియర్ - 82 గెలాక్సీలో ఉన్న ఈ 'ఎం 82 ఎక్స్ 1' కృష్ణబిలం సూర్యుడికి దాదాపు 400 రెట్ల పరిమాణంలో ఉందని వారు వెల్లడించారు. నాసాకు చెందిన చంద్ర ఎక్స్‌రే అబ్జర్వేటరీ, రోస్సి ఎక్స్‌రే టైమింగ్ ఎక్స్‌ప్లోరర్‌ల సహాయంతో తాము ఆ కృష్ణబిలాన్ని పరిశీలించినట్లు ధీరజ్ వెల్లడించారు.       »   అంతరిక్షంలోని భారీ నక్షత్రాలు వాటిల్లోని ఇంధనం అయిపోయాక కృష్ణబిలాలుగా మారతాయి. వాటి దగ్గరికి వచ్చిన దేనినైనా తమలోకి లాగేసుకుంటాయి. చివరికి కాంతి కూడా వాటి నుంచి తప్పించుకోలేదు. దీంతో అక్కడ ఏముందో ఏం జరుగుతుందో తెలియదు. ఏమీ కనిపించదు. అలాంటి కృష్ణబిలంపై పరిశోధనలు చేసిన ధీరజ్ పాశం వార్తల్లో నిలిచాడు.¤  ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి పెట్రోలియం ఉత్పత్తులను తయారుచేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని డెహ్రాడూన్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం (ఐఐపీ) శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.       »   కేవలం అభివృద్ధి చెందిన దేశాలకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఐఐపీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేయడం విశేషం.       »   ఈ పరిజ్ఞానంతో ప్లాస్టిక్ వ్యర్థాలను ఉత్ప్రేరకాల సాయంతో గ్యాసోలైన్, డీజిల్, గ్యాస్‌ను ఉత్పత్తి చేయవచ్చని శాస్త్రవేత్తలు వెల్లడించారు.       »   ఐఐపీ డైరెక్టర్ ఎం.ఒ.గార్గ్.
ఆగస్టు - 23
¤ విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ జెట్టీలో జలాంతర్గామి విధ్వంసక యుద్ధనౌక ఐఎన్ఎస్ కమోర్టాను కేంద్ర రక్షణ మంత్రి అరుణ్‌జైట్లీ జాతికి అంకితం చేశారు.
       »   ఐఎన్ఎస్ కమోర్టా తయారీలో 90 శాతం స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. నౌకాదళ అధికారులే నౌక డిజైన్‌ను రూపొందించారు.
       »   శత్రుదేశాల రాడార్లకు దొరక్కుండా వారి జలాంతర్గాములను, యుద్ధ నౌకలను రాకెట్లు, టార్పడోలు, మిస్సైళ్లు తదితర అత్యాధునిక ఆయుధాలతో ధ్వంసం చేయగల ఐ.ఎన్.ఎస్. కమోర్టా విశాఖ కేంద్రంగానే కార్యకలాపాలు నిర్వహిస్తుంది.
       »   110 మీటర్ల పొడవు, 14 మీటర్ల వెడల్పు, 3500 టన్నుల బరువు ఉన్న ఈ నౌక 25 నాట్ల వేగంతో ఏకధాటిగా 3,450 నాటికల్ మైళ్ల వరకు ప్రయాణిస్తుంది. శత్రుదేశాల జలాంతర్గాములను కనిపెట్టడానికి 'రేవతి' అనే రాడార్‌ను దీనిలో ఏర్పాటు చేశారు
.
       »   గతంలో 'ఐఎన్ఎస్ కమోర్టా' అనే పేరుతోనే ఉన్న ఒక యుద్ధనౌకను సోవియట్ యూనియన్ నుంచి దిగుమతి చేసుకుని వినియోగించారు
.
       »   యాంటీ సబ్‌మెరైన్ వార్‌షిప్ (ఏఎస్‌డబ్ల్యు) కొర్వెట్టే తరహాలో నిర్మించ తలపెట్టిన నాలుగు అత్యాధునిక కొర్వెట్టే యుద్ధనౌకల్లో తాజాగా నిర్మించిన ఐ.ఎన్.ఎస్. కమోర్టా మొదటిది. ఐఎన్ఎస్ కమోర్టాకు 2013లో సీ ట్రయల్స్ నిర్వహించారు. 2014 జులై 12న గార్డెన్ రీచ్‌ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ లిమిటెడ్ (జీఆర్ఎస్ఈ) నావికాదళానికి అప్పగించింది
.
       »   ఐఎన్ఎస్ కమోర్టా మీద నుంచి గాలిలో లక్ష్యాలను ఛేదించడానికి వీలుగా క్షిపణులు మోహరించి ఉంటాయి
.
       »   యుద్ధనౌక ముందుభాగంలోని మెయిన్ గన్ 16 నాటికల్ మైళ్ల లక్ష్యాలను ఛేదించగలదు. ముందుభాగంలోనే ఉండే సోనార్ లక్ష్యాలను సులభంగా గుర్తించగలుగుతుంది
.
       »   దీనిలో 13 మంది అధికారులు, 173 మంది నావికులు కమాండర్ మనోజ్‌ఝా నేతృత్వంలో నిరంతరం సేవలందిస్తారు
.
       »   1971లో ఐఎన్ఎస్ విక్రాంత్‌కు మార్గనిర్దేశం చేసిన విమాన వాహక నౌక కమోర్టా పేరును ఈ యుద్ధనౌకకు పెట్టారు
.
       »   అండమాన్ నికోబార్ ద్వీప సముదాయంలోని ఓ ద్వీపం పేరే కమోర్టా
.
       »   ఐఎన్ఎస్ కమోర్టా తరహా నౌక తొలుత 1965లో యూఎస్ఎస్ఆర్ నుంచి సబ్‌మెరైన్ చేజర్స్ నౌకగా భారత నావికాదళంలో చేరింది. అది 1971 పాక్ యుద్ధంలోనూ, 1987 అమన్ ఆపరేషన్స్, 1989 పవన్ ఆపరేషన్స్, 1991 తషా ఆపరేషన్స్ తదితరాల్లో పాల్గొని 1991 అక్టోబరు 31న సేవలు విరమించింది
.
       »   తాజాగా జరిగిన కార్యక్రమంలో భారత నౌకాదళ అధిపతి అడ్మిరల్ ఆర్.కె.ధోవన్, తూర్పు నౌకాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ సతీష్ సోనీ, నౌకను నిర్మించిన కోల్‌కతాకు చెందిన గార్డెన్ రీచ్‌ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ లిమిటెడ్ (జీఆర్ఎస్ఈ) సీఎండీ రియర్ అడ్మిరల్ ఎ.కె.వర్మ, ఐఎన్ఎస్ కమోర్టా కమాండింగ్ అధికారి కమాండర్ మనోజ్‌ఝా తదితరులు పాల్గొన్నారు.
       »   నౌకాదళానికి అవసరమైన 90 యుద్ధనౌకలను దేశంలోని వివిధ షిప్‌యార్డుల్లోనే నిర్మించాలని నిర్ణయించినట్లు మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు.
¤ దేశంలో తొలిసారిగా ఇథనాల్‌తో నడిచే పర్యావరణహిత బస్సును కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ నాగ్‌పూర్‌లో ప్రారంభించారు. హరిత బస్సుగా దీనికి నామకరణం చేశారు. ఇథనాల్‌ను ఇంధనంగా వాడటం వల్ల కాలుష్యకారక వాయు ఉద్గారాలు చాలావరకు తగ్గుతాయి
.
¤  కాలం చెల్లిన విమానాల జీవిత కాలాన్ని మరికొంత పొడిగించేందుకు వీలు కల్పించే అధ్యయనాన్ని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న డీఆర్‌డీవోకు చెందిన రక్షణ ధాతు విజ్ఞాన పరిశోధన ప్రయోగశాల (డీఎంఆర్ఎల్) తాజాగా చేపట్టింది. కోరాపుట్‌లోని హెచ్ఏఎల్‌తో కలిసి పరిశోధన బాధ్యతలను అధికారికంగా చేపట్టింది
.
       »   రక్షణపరంగా, పౌర అవసరాలకు సంబంధించి ఇప్పటికే పలు ఆవిష్కరణలు చేసిన డీఎంఆర్ఎల్ విమాన ఇంజిన్ల జీవిత కాలాన్ని పెంచే 'లైఫ్ ప్రిడిక్షన్ టెక్నాలజీ' అధ్యయనాన్ని ప్రారంభించింది. జీవిత కాలాన్ని 1500 గంటల వరకు పొడిగించే దిశగా శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. ఎన్ని పని గంటలు పొడిగించవచ్చనేది ఇంజిన్‌ను మైక్రోస్కాన్ చేసిన అనంతరం నిర్ణయిస్తారు.
ఆగస్టు - 24
¤  సమస్త సమాచారాన్ని ఒక చోట నిక్షిప్తం చేసేందుకు ఇంటర్నెట్ సెర్చింజిన్ 'గూగుల్' నడుంబిగించింది. వెబ్ ప్రపంచంలో ఉన్న మానవ విజ్ఞానాన్ని అంతటినీ ఒక చోటుకి తీసుకొస్తూ అతిపెద్ద విజ్ఞాన భాండాగారాన్ని ఏర్పాటు చేస్తోంది. దీన్ని 'నాలెడ్డ్ వాల్ట్‌'గా వ్యవహరిస్తోంది. ప్రపంచం గురించి అన్ని విషయాలను ఈ భాండాగారం అందుబాటులో ఉంచుతుంది. ఈ డేటాను మనుషులే కాదు, యంత్రాలు కూడా గుర్తించవచ్చు.       »   గూగుల్ వద్ద ప్రస్తుతమున్న విజ్ఞాన కోశాన్ని 'నాలెడ్జ్ గ్రాఫ్‌'గా పిలుస్తారు. ఇందులో సమాచారాన్ని చేర్చడానికి క్రౌడ్ సోర్సింగ్‌పై ఆధారపడతారు. ఇందులో డేటాను పొందుపరచడం మనుషులకు మాత్రమే వీలవుతుంది. ఈ నేపథ్యంలో ఆటోమేటిక్‌గా సమాచారాన్ని నిక్షిప్తం చేసే ప్రక్రియను చేపట్టాలని గూగుల్ నిర్ణయించింది.       »   ఒక అల్‌గారిథం సాయంతో వెబ్‌లో ఉన్న డేటాను వినియోగించడానికి వీలైన రూపంలోకి మార్చి 'నాలెడ్జ్ వాల్ట్‌'ను గూగుల్ ఏర్పాటు చేస్తోంది. ఈ భాండాగారంలోకి ఇప్పటివరకు 160 కోట్ల వివరాలు వచ్చాయని 'న్యూ సైంటిస్ట్' పత్రిక వెల్లడించింది.¤  ప్రపంచవ్యాప్తంగా కరవు తీవ్రతను అంచనా వేసేందుకు ఉపయోగపడే కొత్త ఉపగ్రహాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.       »   సాయిల్ మాయిశ్చర్ యాక్టివ్ పాసివ్ (ఎస్ఎంఏపీ) అనే ఈ ఉపగ్రహం తయారీలో భారత సంతతి శాస్త్రవేత్త నరేంద్రదాస్ కీలక పాత్ర పోషించారు.       »   త్వరలో ప్రయోగించనున్న ఈ ఉపగ్రహం ప్రపంచవ్యాప్తంగా రైతులు అధిక పంట దిగుబడులను పొందేందుకు తోడ్పడుతుందని పరిశోధకులు ప్రకటించారు.
ఆగస్టు - 26
¤  ట్యాంకులను పేల్చివేసే అత్యాధునిక 'హెచ్.జె. - 12' అనే క్షిపణిని చైనా అభివృద్ధి చేసింది. ఈ అస్త్రాన్ని సైనికులు ఎక్కడికైనా సులువుగా మోసుకెళ్లవచ్చు. ఇది నాలుగు కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు.       »   అమెరికా, రష్యా ఉత్పత్తి చేస్తున్న ఆధునిక క్షిపణులను ఇది పోలి ఉంది. హెచ్.జె. - 12ను చైనాలోని నార్త్ ఇండస్ట్రీస్ గ్రూప్ కార్పొరేషన్ రూపొందించింది. హెచ్.జె. - 12లో స్వీయ నియంత్రణ వ్యవస్థలు, ఆటోమేటిక్ పరికరాలు ఉన్నాయి. భవనాలు, బంకర్ల నుంచి కూడా దీన్ని సురక్షితంగా ప్రయోగించవచ్చు.¤  కొందరు చాలా దూరంలో ఉన్న వస్తువులను కూడా గుర్తించగలుగుతారు. వీరి కంటిలో పసుపు వర్ణద్రవ్యం అధికంగా ఉంటుందని, దీనివల్లే వారి చూపు ఇతరుల కంటే మెరుగ్గా ఉంటుందని జార్జియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ పసుపు వర్ణద్రవ్యాన్ని 'మాక్యులర్ పిగ్మెంట్ (ఎంపీ)' అని పిలుస్తారు. పొగమంచు లాంటి వాతావరణ ప్రతికూలతల్లో కూడా కంటిచూపు బాగా ఉండటానికి ఎంపీ దోహదపడుతుందని, ఇది ఒక వడపోత పరికరంలా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎంపీ వల్ల ల్యూటీన్, జీగ్జాంథీన్ లాంటి పోషకాలు కంటిలో సమృద్ధిగా ఉంటాయి.
ఆగస్టు - 29 
¤  పశ్చిమ ఆఫ్రికా దేశాలను వణికిస్తున్న ప్రాణాంతక ఎబోలా వైరస్‌కు విరుగుడుగా శాస్త్రవేత్తలు తయారుచేసిన ప్రయోగాత్మక ఔషధం కోతుల్లో సత్ఫలితాలను ఇచ్చింది.       »   ఎబోలా సోకిన 18 కోతులకు 'జీమ్యాప్' అనే మందును ఇవ్వగా ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా అవన్నీ కోలుకున్నట్లు అధ్యయనంలో తేలింది.       »   ఈ అధ్యయనంలో భాగంగా పరిశోధకులు వైరస్ సోకిన కోతులకు ప్రతి మూడు రోజులకు ఒకసారి మందును అందించారు.