సెప్టెంబరు - 4
|
¤ మన పాలపుంత గెలాక్సీకి కొత్త చిరునామా వచ్చింది. లానిమాకియా అనే సూపర్ క్లస్టర్ అంచుల్లో ఇది ఉన్నట్లు తేల్చారు. హవాయ్ విశ్వవిద్యాలయానికి చెందిన బ్రెంట్ టల్లీ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఈ పరిశోధన నిర్వహించింది. » హవాయ్ భాషలో లానిమాకియా అంటే భారీ స్వర్గం అని అర్థం. దీని వ్యాసం 50 కోట్ల కాంతి సంవత్సరాలు. ఇందులో 100 మిలియన్ బిలియన్ సూర్యుల పరిమాణంలో ద్రవ్యరాశి ఉంది. లక్ష సమూహాలు ఉన్నాయి. విశ్వంలో భారీ నిర్మాణాల్లో సూపర్ క్లస్టర్లు ఒకటి. అందులో డజన్ల కొద్దీ గెలాక్సీలతో కూడిన స్థానిక విభాగాలు ఉంటాయి. వందలాది గెలాక్సీలతో కూడిన భారీ క్లస్టర్లు ఉంటాయి. ఇవన్నీ ఫిలమెంట్లతో పరస్పరం అనుసంధానం అవుతుంటాయి. వీటి సరిహద్దులను గుర్తించడం అంత తేలిక కాదు. » అమెరికా నేషనల్ సైన్స్ ఫౌండేషన్‌కు చెందిన గ్రీన్ బ్యాంక్ టెలిస్కోప్ (జీబీటీ), ఇతర రేడియో టెలిస్కోపులను ఉపయోగించి మన స్థానిక విభాగంలోని గెలాక్సీల వేగాన్ని గుర్తించారు. తద్వారా సూపర్ క్లస్టర్ ఆధిపత్యం వహించే ప్రాంతాన్ని నిర్వచించారు. దానికి లానిమాకియా అని పేరు పెట్టారు. ఆ సూపర్ క్లస్టర్ అంచుల్లో మన గెలాక్సీ ఉన్నట్లు గుర్తించారు. ఈ సూపర్ క్లస్టర్ విస్తృతిని కూడా తొలిసారిగా మ్యాప్ చేశారు.¤ తూర్పు తీర భద్రతను మరింత పటిష్ఠం చేసేందుకు ఉపయోగపడే ఐఎన్ఎస్ సుమిత్రను భారత నౌకాదళం చీఫ్ అడ్మిరల్ ఆర్.కె.ధోవన్ చెన్నైలో జాతికి అంకితం చేశారు. » ఐఎన్ఎస్ సుమిత్రను గోవా నౌకా నిర్మాణ కేంద్రంలో రూపొందించారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న నౌకల్లో 'సుమిత్ర' నాలుగోది. 2,200 టన్నులున్న ఈ నౌక 105 మీటర్ల పొడవు, 13 మీటర్ల వెడల్పు ఉంది. |
సెప్టెంబరు - 6
|
¤ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) రక్షణ కోసం మినీ రోబోలను తయారు చేసినట్లు మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) శాస్త్రవేత్తలు ప్రకటించారు. తమకు తాముగా నియంత్రించుకునేలా రూపొందించిన ఈ రోబోల్లో శక్తిమంతమైన స్పెన్సర్లను, త్రీడీ కెమెరాను నిక్షిప్తం చేశారు. » అంతరిక్షంలోని వ్యర్థాల వల్ల ఐఎస్ఎస్ కు ప్రమాదం కలగకుండా చూసే బాధ్యతను ఈ రోబోలు నిర్వహిస్తాయి.¤ ప్రపంచంలో అత్యంత వేగంగా ప్రయాణించే బైక్‌ను ఇవా హాకన్సన్ అనే మెకానికల్ ఇంజినీర్ రూపొందించాడు. » ఈ బైక్ పేరు 'కిల్లా జౌల్'. దీని బరువు 700 కిలోలు, పొడవు 5.6 మీ., వెడల్పు 0.53 మీ., ఎత్తు 0.96 మీ. ఈ బైక్‌ను పర్యావరణ హితంగా రూపొందించారు.¤ భారత అణువిద్యుత్ కార్యక్రమం మరో మైలురాయిని అధిగమించింది. రాజస్థాన్ అణువిద్యుత్ కర్మాగారం రాజస్థాన్ అటామిక్ పవర్ స్టేషన్ (రాప్స్) లోని అయిదో యూనిట్ అరుదైన ఘనతను సాధించింది. నిరంతరాయంగా 765 రోజులపాటు పనిచేయడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఆ ఘనత సాధించిన రెండో రియాక్టర్‌గా గుర్తింపు పొందింది. » రాప్స్ కర్మాగారం రాజస్థాన్‌లోని రావత్ భట్టా లో ఉంది. » నిరంతరాయంగా 894 రోజులు పని చేయడం ద్వారా కెనడాలోని పికెరింగ్ అణు కర్మాగారంలోని ఏడో యూనిట్ ప్రపంచ రికార్డును స్థాపించింది. |
సెప్టెంబరు - 8
|
¤ యాగాన్-21, టయాంటునో-1 అనే రెండు ఉపగ్రహాలను చైనా విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. » యాగాన్-21 రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం ప్రకృతి వనరులు, విపత్తుల నిర్వహణ, పంటల దిగుబడి అంచనాలో సాయపడుతుంది. » టయాంటునో-1 అనే మరో ఉపగ్రహం స్మార్ట్ ఉపగ్రహాల ప్రయోగాలకు ఉద్దేశించింది. దీన్ని జాతీయ రక్షణ పరిజ్ఞాన విశ్వవిద్యాలయం రూపొందించింది. » ఈ రెండు ఉపగ్రహాలను టైయువాన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి లాంగ్ మార్చ్ - 4బి రాకెట్ ద్వారా ప్రయోగించారు.¤ విశ్వంలో అన్ని రకాల పదార్థాలకూ ద్రవ్యరాశి, ఆకారం, పరిమాణాలు సమకూరేందుకు కారణమని భావిస్తున్న దైవకణం (హిగ్స్ బోసన్) జోలికి వెళితే విశ్వవినాశనం తప్పదని బ్రిటన్‌కు చెందిన ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ హెచ్చరించారు. » ప్రముఖ శాస్త్రవేత్తలు, ఖగోళ పరిశోధకుల ప్రసంగాల సంకలనంతో ప్రచురించిన 'స్మార్ట్' అనే పుస్తకం ముందు మాటలో స్టీఫెన్ హాకింగ్ ఈ మేరకు పలు విషయాలు వివరించారు. |
సెప్టెంబరు - 10
|
¤ పశ్చిమాఫ్రికాలో ప్రాణాంతక ఎబోలా వైరస్ ప్రబలిన ప్రాంతాల్లో అత్యవసర సేవలు అందించేందుకు, ఎబోలా వైరస్ నివారణ కోసం బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ రూ.300 కోట్లు నిధులు ప్రకటించింది. » ఎబోలా నివారణకు కృషి చేస్తున్న ఐరాస, ఇతర అంతర్జాతీయ సంస్థలకు ఈ నిధులు అందనున్నాయి. |
సెప్టెంబరు - 11
|
¤ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన అగ్ని-1 క్షిపణిని సైన్యం విజయవంతంగా ప్రయోగించింది. » 700 కి.మీ. దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించగల ఈ క్షిపణికి అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం ఉంది. » ఒడిశాలోని బాలాసోర్‌కు వంద కి.మీ. దూరంలో ఉన్న 'ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. |
సెప్టెంబరు - 12
|
¤ అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రయోగించిన క్యూరియాసిటీ రోవర్ అంగారకుడిపై ఉన్న మౌంట్‌షార్ట్ పర్వత ప్రాంతానికి చేరుకుంది. విస్తారమైన గాలే కార్టర్ మధ్యలో ఉన్న ఈ పర్వత ప్రాంతంలో క్యూరియాసిటీ తన తదుపరి అన్వేషణను ప్రారంభించనుంది. » సుమారు రెండేళ్ల తర్వాత, తొమ్మిది కి.మీ. ప్రయాణించిన అనంతరం క్యూరియాసిటీ మౌంట్‌షార్ట్ బేస్‌కు చేరింది.¤ లక్షలాది మంది వికలాంగులకు నడిచే అవకాశం కలిగించిన జైపూర్ కృత్రిమ కాలు ఇప్పుడు జంతువులకు సైతం సాయం అందించనుంది. » కాళ్లు లేక ఇబ్బందులు ఎదుర్కొనే ఆవుల కోసం జైపూర్‌లోని భగవాన్ మహావీర్ వికలాంగ సమితి దేశంలోనే తొలిసారిగా కృత్రిమ అవయవాలను అమర్చడానికి ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. |
సెప్టెంబరు - 13
|
¤ ప్రపంచంలోనే తొలిసారిగా జపాన్ శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో పెంచిన మూల కణాలను 70 ఏళ్ల మహిళ రెటీనాలోకి విజయవంతంగా మార్పిడి చేశారు. ఆమె వయసు రీత్యా దృష్టి మందగించే 'మాక్యులార్ డీ జనరేషన్' సమస్యతో బాధపడుతోంది. » కోబె సిటీ మెడికల్ సెంటర్ జనరల్ ఆస్పత్రికి చెందిన యసువో కురిమోటో నేతృత్వంలోని వైద్య బృందం ఈ ఘనత సాధించింది. |
¤ ప్రపంచంలోనే అతిపెద్ద రాకెట్ వెల్డింగ్ కేంద్రాన్ని అమెరికాలో ప్రారంభించారు. » అమెరికాలోని న్యూ ఆర్లాన్స్‌లో ఉన్న మికౌడ్ రాకెట్ అనుసంధాన కేంద్రంలో ఏర్పాటు చేసిన ఈ 'వర్టికల్ అసెంబ్లీ సెంటర్ (వాక్)'ను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఆవిష్కరించింది. » 170 అడుగుల ఎత్తు, 78 అడుగుల వెడల్పుతో ఉన్న వాక్‌లో ప్రపచంలోనే అత్యంత శక్తిమంతమైన, తర్వాతి తరం అమెరికా రాకెట్ అయిన 'స్పేస్ లాంచ్ సిస్టమ్ (ఎస్ఎల్ఎస్)' కు వెల్డింగ్, అనుసంధానం చేయనున్నారు. దీంతో పాటు ఇంధన ట్యాంకులు, డోమ్‌లు, ఇతర నిర్మాణాల పటిష్టతను కూడా పరీక్షించనున్నారు.¤ 'రోడియోలా' అనే అద్భుత మొక్కను భారత శాస్త్రవేత్తలు హిమాలయాల్లో కనుక్కున్నారు. 'డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్ రిసెర్చ్ (DIHAR - దిహార్)' లో ఈ మొక్కపై పరిశోధనలు చేశారు. » ఈ మొక్కను లడఖ్ వాసులు 'సోలో'గా పిలుస్తారు. దీనికి ఇమ్యునో-ఆడ్యులేటరీ (రోగ నిరోధక శక్తిని పెంపొందించే), అడాప్టోజెనిక్ (ఎత్తైన ప్రదేశాల్లో ఉండే క్లిష్టమైన వాతావరణాలకు త్వరగా అలవాటు పడే శక్తిని ఇచ్చే), రేడియో ప్రొటెక్టింగ్ (అణుధార్మికత నుంచి కాపాడే) శక్తులున్నాయని దిహార్ డైరెక్టర్ ఆర్.బి.శ్రీవాత్సవ పేర్కొన్నారు. |
సెప్టెంబరు - 15
|
¤ రక్తాన్ని శుద్ధి చేసే సరికొత్త పరికరాన్ని ఫ్రాన్స్ శాస్త్రవేత్తలు తయారు చేశారు. అయస్కాంత ప్రభావంతో పనిచేసే ఈ పరికరం సాయంతో రక్తంలో ఉండే ప్రమాదకర బ్యాక్టీరియా, ఫంగస్ ఇతర విషపదార్థాలను తొలగించవచ్చు. » దీని పనితీరు శరీరంలోని ప్లీహాన్ని పోలి ఉంటుంది. ఈ కృత్రిమ ప్లీహం రక్తంలో ఉండే బ్యాక్టీరియాలను విజయవంతంగా వేరు చేస్తుంది.
|
సెప్టెంబరు - 22
|
¤ అంగారకుడిపై పరిశోధన కోసం భారత్ మొదటిసారిగా ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) ఆ గ్రహ కక్ష్యలోకి ప్రవేశించి, చరిత్ర సృష్టించేందుకు మార్గం సుగమమైంది. » ఉపగ్రహంలో 10 నెలలుగా నిద్రాణంగా ఉన్న ద్రవ అపోజీ మోటార్ (లామ్) దిగ్విజయంగా పనిచేసింది. » ఇస్రో లామ్‌ను ప్రయోగాత్మకంగా 3.968 సెకన్ల పాటు మండించింది. అనుకున్నట్లుగానే ఇది విజయవంతంగా పని చేసింది. » తాజా పరిణామాన్ని ఇస్రో ఛైర్మన్ కె.రాధాకృష్ణన్ బెంగళూరులోని టెలీమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ (ఇస్ట్రాక్)లో వీక్షించారు. » మామ్ అంగారకుడి గురుత్వాకర్షణ శక్తి ప్రభావ వలయంలోకి ప్రవేశించింది. 66.6 కోట్ల కిలోమీటర్ల ప్రయాణంలో భాగంగా ఇది గత ఏడాది డిసెంబరు 1న భూ గురుత్వాకర్షణ శక్తి పరిధి నుంచి దాటి వెళ్లింది.¤ అమెరికాకు చెందిన మార్స్ అట్మాస్పియర్ అండ్ వోలటైల్ ఎవల్యూషన్ (మావెన్) ఉపగ్రహం దిగ్విజయంగా అంగారక కక్ష్యలోకి ప్రవేశించింది. » ఒకప్పుడు నీరు, ఉష్ణ వాతావరణాన్ని కలిగి ఉన్న అరుణ గ్రహం కాలక్రమేణా శీతలంగా, పొడిగా ఎందుకు మారిందన్నది ఇది నిగ్గు తేల్చనుంది. » మావెన్ అంతరిక్షంలో దాదాపు 10 నెలలపాటు 71.1 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించి అంగారకుడికి చేరువైంది. ఆ గ్రహం ఎగువ వాతావరణంపై పరిశోధన కోసం పంపిన మొదటి ఉపగ్రహం ఇదే. » ఈ ఉపగ్రహం తన జీవితకాలంలో ఎక్కువగా 3730 మైళ్ల ఎత్తులో ఉన్న కక్ష్యలో తిరుగుతుంది. » అంగారకుడిపై పరిశోధన కోసం నాసా ఇప్పటికే పలు రోవర్లు, ఉపగ్రహాలను పంపింది. క్యూరియాసిటీ అనే అత్యాధునిక రోవర్ అక్కడి గేల్ బలంపై పరిశోధనలు సాగిస్తోంది. |
సెప్టెంబరు - 24
|
¤ ఇస్రో శాస్త్రవేత్తలు ప్రపంచ రోదసి పరిశోధనల చరిత్రలో తమదైన అధ్యయనాన్ని లిఖించారు. యావత్ ప్రపంచానికి అసాధ్యంగా పరిణమించిన కార్యాన్ని మన శాస్త్రవేత్తలు సుసాధ్యం చేశారు. భారత్ తన మొదటి ప్రయత్నంలోనే అంగారక గ్రహాన్ని చేరుకుని చరిత్ర సృష్టించింది. 2013 నవంబరు 5న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్‌వీ సీ25 రాకెట్ ద్వారా ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) 66.6 కోట్ల కి.మి.లు ప్రయాణించి తన లక్ష్యాన్ని చేరుకుంది. తొలి ప్రయత్నంలో అరుణగ్రహాన్ని చేరుకోవడం ప్రపంచంలో ఇప్పటి వరకూ ఏ దేశానికీ సాధ్యం కాలేదు. అనేక విఫల ప్రయత్నాల తర్వాత అమెరికా, రష్యా, యూరోపియన్ యూనియన్, చైనా, జపాన్ ఆ లక్ష్యాన్ని చేరుకోగలిగాయి. » మామ్ (మంగళ్‌యాన్ అని కూడా పిలుస్తున్నారు) ప్రయోగానికి జరిగిన వ్యయం రూ.450 కోట్లు. అంగారకుడిపైకి నాసా పంపిన 'మావెన్ మిషన్' కోసం అమెరికా చేసిన ఖర్చులో ఇది పదో వంతు. చైనా 2011లో 'ఇంగ్ హ్యూ-1' పేరుతో చేపట్టిన ప్రయోగం విఫలమైంది. 1998లో జపాన్ చేపట్టిన ఉపగ్రహ ప్రయోగం కూడా ఇంధనం అయిపోవడంతో విఫలయత్నంగా నిలిచింది. ఈ విధంగా అరుణ గ్రహాన్ని చేరుకోవడానికి ఇప్పటి వరకూ 51 ప్రయత్నాలు జరిగితే వాటిల్లో 21 మాత్రమే విజయం సాధించాయి. » అరుణ గ్రహానికి చేరుకోవడానికి భూమి చుట్టూ 9.25 లక్షల కిలో మీటర్ల వ్యాసార్థంలో ఉన్న ప్రాంతాన్ని దాటి హీలియో సెంట్రిక్ దశలోకి ప్రవేశించడం, అందులో 10 నెలల పాటు ప్రయాణించి ఎట్టకేలకు అంగారకుడిని చేరుకోవడం అత్యంత సవాళ్లతో కూడుకున్న వ్యవహారం. ఉపగ్రహంలోని లిక్విడ్ అపోగీ మోటార్ (లామ్)ను విజయవంతంగా మండించడం సంక్లిష్టమైన అంశం. ఈ దశలో ఉపగ్రహానికి సంకేతాలు పంపడానికి 12.8 నిమిషాలు పడుతుంది. అక్కడి నుంచి వచ్చే సంకేతాన్ని అందుకోవడానికి కూడా అంత సమయం పడుతుంది. అందువల్ల ఉపగ్రహాన్ని అప్పటికప్పుడు నియంత్రించడం సాధ్యంకాదు. ఉపగ్రహం తనంతట తానే ఇదంతా నిర్వహించాలి. లోగడ అనేక ప్రయోగాలు ఈ దశలో విఫలమయ్యాయి. » 1350 కిలోల బరువున్న మామ్ అంగారకుడి ఉపరితలాన్ని, అక్కడి ఖనిజ సంపదను, వాతావరణాన్ని అత్యంత సునిశిత కెమెరాలతో ఫొటోలు తీసి శాస్త్రవేత్తలకు అందజేస్తుంది. వీటిని అధ్యయనం చేయడం ద్వారా ఆ గ్రహం గురించి పరిశోధకులు తెలుసుకుంటారు.మామ్ లక్ష్యాలు జీవం ఆవిర్భవించడానికి కీలక ఆధారమైన మీథేన్‌ను అంగారకుడిపై అన్వేషించడం. అరుణగ్రహంపై ఒకప్పుడు నీటి వనరులు పుష్కలంగా ఉండేవని ఇప్పటికే రుజువైంది. ఆ నీరంతా ఎలా మాయమైందో తెలుసుకోవడం. అంగారకుడి ఉపరితలాన్ని, అక్కడి మూలకాలను, ఖనిజాలను, వాతావరణాన్ని అధ్యయనం చేయడం. గ్రహాంతర అంతరిక్ష ప్రయోగాలను విజయవంతంగా చేపట్టడానికి అవసరమైన సాంకేతికను, ప్రణాళికలను అభివృద్ధి చేయడం.మామ్ పరికరాలులైమన్ ఆల్ఫా ఫొటోమీటర్ (ఎల్ఏపీ): ఇది ఆబ్సార్షన్ సెల్ ఫొటో మీటర్. అంగారకుడి ఎగువ వాతావరణంలో లైమన్-ఆల్ఫా ఉద్గారాన్ని బట్టి డ్యూటీరియం, హైడ్రోజన్ నిష్పత్తిని లెక్కిస్తుంది. దీనివల్ల అంగారకుడిపై నీరు ఎలా మాయమైందో స్పష్టమవుతుంది. ఈ పరికరంలో అతినీలలోహిత డిటెక్టర్ కూడా ఉంది.మార్స్ కలర్ కెమెరా (ఎంసీసీ): ఇది మూడు రంగుల కెమెరా. అంగారకుడి ఉపరితలం, దానిలో ఉన్న పదార్థాలకు సంబంధించిన చిత్రాలు, సమాచారాన్ని అందిస్తుంది. వాతావరణాన్ని, అంగారకుడి రెండు ఉపగ్రహాలైన ఫోబోస్, డైమోస్‌లనూ పరిశీలిస్తుంది. మిగతా సైన్స్ పరికరాలకు సందర్భోచిత సమాచారాన్ని అందిస్తుంది.మీథేన్ సెన్సర్ ఫర్ మార్స్ (ఎంఎస్ఎం):ఇది అంగారకుడి వాతావరణంలో మీథేన్‌ను బిలియన్‌లో భాగాల (పార్ట్ పర్ బిలియన్) కచ్చితత్వంతో లెక్కిస్తుంది. పరావర్తనం చెందిన సౌర రేడియో ధార్మికతను మాత్రమే కొలిచే సామర్థ్యం ఉండటం వల్ల ఇది సూర్యకాంతితో వెలిగే ప్రాంతాల్లోనే డేటాను సేకరిస్తుంది.మార్స్ ఎక్సోస్పియరిక్ న్యూట్రల్ అనలైజర్ (ఎంఈఎస్ఎన్ఏ): ఇది క్వాడ్రాపుల్ మాస్ స్పెక్ట్రోమీటర్. 1 నుంచి 300 అటామిక్ మాస్ యూనిట్ (ఏయంయూ) విస్తృతిలో యూనిట్ మాస్ రిజల్యూషన్‌తో న్యూట్రల్ కంపోజిషన్‌ను లెక్కిస్తుంది. చంద్రయాన్-I లో ఉపయోగించిన ఆల్టిట్యూడినల్ కంపోజిషన్ ఎక్స్‌ప్లోరర్ పరికరం ఆధారంగా దీన్ని రూపొందించారు.థర్మల్ ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్ (టీఐఎస్):ఇది ఉష్ణ ఉద్గారాలను లెక్కిస్తుంది. రాత్రి, పగలు పని చేస్తుంది. ఉష్ణ ఉద్గారాల నుంచి ఉష్ణోగ్రత, ఉష్ణ ఉద్గార సామర్థ్యం లాంటి అంశాలను అంచనా వేయవచ్చు. ఉపరితలంలోని మూలకాలు, అంగారకుడి ఖనిజాలను మ్యాప్ చేస్తుంది.మెరైనర్-4 » అంగారకుడి వద్దకు మొదటిసారిగా దిగ్విజయంగా వెళ్లిన ఘనత అమెరికాకు చెందిన మెరైనర్-4కు దక్కుతుంది. 1965 జులైలో అది అరుణ గ్రహానికి చేరువగా వెళ్లింది. 22 ఫొటోలను తీసింది.ప్రస్తుతం అంగారకుడిని శోధిస్తున్న వ్యోమనౌకలు మార్స్ రికాన్‌సెన్స్ ఆర్బిటర్ ఆపర్చునిటీ రోవర్ క్యూరియాసిటీ రోవర్ మార్స్ ఒడిస్సీ మార్స్ ఎక్స్‌ప్రెస్ మావెన్ మామ్¤ నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు (ఎన్‌డీడీబీ) అనుబంధ సంస్థ అయిన ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ దేశంలోనే తొలిసారిగా 'బ్లూ టంగ్' వ్యాధికి వ్యాక్సిన్ తయారు చేసింది. » మన దేశంలో అయిదు రకాల లక్షణాలతో 'బ్లూటంగ్' వ్యాధి కనిపిస్తుంది. గొర్రెలు అధికంగా ఈ వ్యాధి బారిన పడుతుంటాయి. పశువులు, ఒంటెలు, మేకల్లోనూ 'బ్లూ టంగ్' వ్యాధి వైరస్ వ్యాప్తి వల్ల సోకుతుంది. » హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ సంస్థ వెటర్నరీ వ్యాక్సిన్ల తయారీలో అగ్రగామిగా ఉంది. తమిళనాడు యూనివర్సిటీ ఆఫ్ వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్, ఇకార్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్) సహకారంతో ఈ వ్యాక్సిన్‌ను ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ తయారు చేసింది. » ఈ వ్యాక్సిన్‌ను 'రక్ష-బ్లూ' పేరుతో విడుదల చేసింది.
|
సెప్టెంబరు - 26
|
¤ ఉపరితలం నుంచి ఉపరితలంలోని లక్ష్యాలను ఛేదించే స్వల్పశ్రేణి హతాఫ్-9 క్షిపణిని పాకిస్థాన్ విజయవంతంగా పరీక్షించింది. 60 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఇది ఛేదిస్తోంది.
|
సెప్టెంబరు - 29
|
¤ అంగారకుడిపై పరిశోధన కోసం ఆ గ్రహ ఉపరితలంపై దిగిన క్యూరియాసిటీ రోవర్ అక్కడి షార్ప్ పర్వతం దిగువ భాగంలో డ్రిల్లింగ్‌ను చేపట్టింది. ఆరు చక్రాలతో నడిచే ఈ రోవర్ ప్రధాన గమ్యస్థానం ఆ ప్రాంతమే. తాజా డ్రిల్లింగ్ సందర్భంగా రోవర్ 2.6 అంగుళాల లోతైన రంధ్రాన్ని చేసింది. రాతిపొడి నమూనాను సేకరించి, దాన్ని రోవర్ ప్రస్తుతానికి రోబోటిక్ హస్తంలోని నమూనా నిర్వహణ వ్యవస్థలో భద్రపరిచింది. » క్యూరియాసిటీ రోవర్ 2012 ఆగస్టులో అంగారకుడిపై దిగింది. షార్ప్ పర్వతం దిశగా తన ప్రయాణాన్ని ప్రారంభించే ముందు ల్యాండింగ్ ప్రదేశానికి సమీపంలోని ఎల్లోనైఫ్ బే ప్రాంతంలో పరిశోధన జరిపింది. శిలలను డ్రిల్ చేసి, అక్కడ ఒకప్పుడు నీరు ప్రవహించినట్లు ఆనవాళ్లు ఉన్నాయని గుర్తించారు. ఎల్లోనైఫ్ బే నుంచి షార్ప్ పర్వతం దిగువ భాగాన్ని చేరుకోవడానికి 15 నెలల్లో 8 కిలోమీటర్ల దూరాన్ని క్యూరియాసిటీ ప్రయాణించింది.¤ అంగారకుడి ఉత్తరార్థ గోళంలో ధూళి తుపానుకు సంబంధించిన ఫొటోలను భారత మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) పంపించింది. వాటిని అరుణ గ్రహ ఉపరితలానికి 74,500 కిలోమీటర్ల ఎత్తు నుంచి తీసినట్లు ఇస్రో పేర్కొంది. » ఉపగ్రహంలోని మార్స్ కలర్ కెమెరా వీటిని ఫొటోలు తీసింది. » సెప్టెంబరు 24న అంగారక కక్ష్యలోకి చేరిన మామ్ సెప్టెంబరు 25నే తొలివిడత ఫొటోలను పంపింది.
|
సెప్టెంబరు - 30
|
¤ అంగారకుడిపై ఒకప్పుడు హిమానీ నదాలు ఉన్నాయనడానికి శాస్త్రవేత్తలు ఖనిజపరమైన ఆధారాలు సంపాదించారు. ఈ గ్రహంపై ఉన్న పెద్ద లోయ 'గ్రాండ్ కేనియాన్ ద్వారా ఇది ప్రవహించిందనివారు తెలిపారు. » అంగారకుడిపై 3218 కిలోమీటర్ల పొడవైన లోయ (వేలెస్ మెరైనరీస్) ఉంది. దీన్ని 'గ్రాండ్ కేనియన్ ఆఫ్ మార్స్‌గా పిలుస్తారు. దీని ద్వారా హిమానీ నదాలు ప్రవహించి ఉంటాయని శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా అంచనా వేస్తున్నారు. ఉపగ్రహ చిత్రాలను ఉపయోగించి, వారు ఒకప్పటి హిమానీ నదాల కారణంగా ఏర్పడ్డ ఆకృతులను గుర్తించారు. » అమెరికాలోని బ్రిన్‌మార్ కళాశాల, బెర్లిన్‌లోని ఫ్రెయీ విశ్వవిద్యాలయ పరిశోధకులు తాజా పరిశోధనలో పాల్గొన్నారు. అంగారకుడిపై సల్ఫేట్ ఖనిజాలతో కూడిన మిశ్రమాన్ని కనుక్కున్నారు. భూమి మీద ఆర్కిటిక్ మహా సముద్రంలోని స్వాల్‌బార్డ్‌లో ఉన్న హిమానీనదాల్లో కూడా ఇదే రకమైన పరిస్థితి ఉన్నట్లు వారు వెల్లడించారు.
|
|
|