జులై - 2014 సైన్స్ అండ్ టెక్నాలజీ



జులై - 1
¤  గూగుల్‌కు చెందిన తొలి సోషల్ నెట్‌వర్క్ 'ఆర్కుట్‌'ను సెప్టెంబరు 30 నుంచి మూసేయాలని గూగుల్ నిర్ణయించింది.   »    గూగుల్ 2004లో ఆర్కుట్‌ను ప్రారంభించింది. ఆర్కుట్‌కు భారత్, బ్రెజిల్‌లలో మంచి పేరు లభించినస్పటికీ మిగతా ప్రాంతాల్లో గొప్పగా రాణించలేకపోయింది. ఫేస్‌బుక్ లాంటి పోటీదార్లకు జవాబు కాలేకపోయింది.   »    ఆర్కుట్ ప్రారంభమైన 2004 సంవత్సరంలోనే ఫేస్‌బుక్ కూడా మొదలైంది. 128 కోట్ల మంది వినియోగదార్లతో ప్రస్తుతం ఫేస్‌బుక్ ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ నెట్‌వర్క్‌గా ఉండటం విశేషం.
జులై - 2
¤  వాతావరణంలో కార్బన్‌డయాక్సైడ్ (సీఓ2) మోతాదును ఎప్పటికప్పుడు అంచనా వేసే ప్రత్యేక ఉపగ్రహాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) రోదసిలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది.   »    ఈ ఉపగ్రహానికి 'ఆర్బిటింగ్ కార్బన్ అబ్జర్వేటరీ - 2 (ఓసీఓ - 2)' అని పేరుపెట్టారు.   »    భూమ్మీద సీఓ2 ఏయే ప్రాంతాల నుంచి అధికంగా వాతావరణంలోకి విడుదలవుతుందో తెలుసుకోవడం కోసం ఓసీఓ - 2 ఉపగ్రహాన్ని పంపిచామని నాసా వెల్లడించింది. దీనిద్వారా ప్రపంచవ్యాప్తంగా సీఓ2 మోతాదును రోజూ దాదాపు లక్షసార్లు లెక్కించవచ్చని తెలియజేసింది.
జులై - 6
¤  నక్షత్రాలు ఏర్పడిన తీరును తెలుసుకునేందుకు ఒక గగనతల అబ్జర్వేటరీని నాసా రూపొందిస్తోంది. ఇందుకోసం బోయింగ్ విమానానికి మార్పులు చేపట్టి, అందులో 17 టన్నుల పరారుణ టెలిస్కోపును అమరుస్తోంది. ఈ అబ్జర్వేటరీ పేరు స్ట్రాటోస్ఫియరిక్ అబ్జర్వేటరీ ఫర్ ఇన్‌ఫ్రారెడ్ ఆస్ట్రోనమీ (సోఫియా).   »    ఇందుకోసం వాడుతున్న ప్రత్యేక విమానం వాతావరణం అంచుల వరకూ ప్రయాణించగలదు. అందువల్ల భూతలం మీదున్న అబ్జర్వేటరీల కంటే మెరుగ్గా విశ్వాన్ని ఈ టెలిస్కోప్ వీక్షించగలదు.   »    విమానం 12 గంటల పాటు గాల్లో ఉండగలదు. 6,625 నాటికల్ మైళ్ల దూరం ప్రయాణించగలదు. తద్వారా పరారుణ టెలిస్కోపునకు విశ్వానికి సంబంధించిన దృశ్యాలు కనిపిస్తాయి. వచ్చే ఏడాది దీని ద్వారా 100 పరిశీలనలు జరపాలని నాసా భావిస్తోంది.
జులై - 8
¤  బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణికి సంబంధించిన అత్యాధునిక వెర్షన్‌ను ఒడిశా తీరంలోని చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుంచి విజయవంతంగా పరీక్షించారు.   »    290 కి.మీ. దూరాన్ని 500 సెకన్లలో ప్రయాణించి, లక్ష్యాన్ని గురితప్పకుండా ఇది ఛేదించింది.   »    దీనివల్ల పర్వతాలు, భవనాల మాటున దాగిన శత్రు లక్ష్యాలను కూడా అత్యంత కచ్చితత్వంతో ఢీకొట్టే సామర్థ్యం మన దేశానికి లభించింది.
జులై - 11
¤  ఎయిడ్స్ వ్యాధికి చికిత్స చేయడానికి మార్గాలను అన్వేషిస్తున్న శాస్త్రవేత్తలకు ఎదురుదెబ్బ తగలింది.   
»    తీవ్రస్థాయి ఔషధ చికిత్స ద్వారా వ్యాధి నయమైందని భావిస్తున్న అమెరికాకు చెందిన ఒక చిన్నారిలో మళ్లీ వ్యాధికారక వైరస్ కనిపించింది. ఇది గుర్తించదగ్గ మోతాదులో ఉందని శాస్త్రవేత్తలు ప్రకటించారు.   
»    ఈ చిన్నారిని 'మిసిసిప్పీ బేబీ'గా పిలుస్తుంటారు. మరో రెండునెలల్లో ఆ పాప నాలుగో పుట్టిన రోజును జరుపుకోనుంది. హెచ్ఐవీ ఉన్న తల్లికి ఆమె జన్మించింది. గర్భిణిగా ఉన్నప్పుడు యాంటీ రిట్రో వైరల్ ఔషధాలను ఆ తల్లి తీసుకోకపోవడం వల్ల చిన్నారికి ఈ వ్యాధి వచ్చింది.
జులై - 12 
¤  నిండు చంద్రుడు పున్నమినాటి కంటే 14 శాతం పెద్దగా, 30 శాతం ప్రకాశవంతంగా వెలుగుతూ 'సూపర్ మూన్‌'గా దర్శనమిచ్చాడు.  
 »    చంద్రుడు తన కక్ష్యలో తిరుగుతూ భూమికి దగ్గరగా రావటమే 'సూపర్ మూన్‌'కు కారణం. దీన్ని సాంకేతిక భాషలో 'పెరిజి మూన్‌'గా వ్యవహరిస్తారు. 
  »    సూపర్‌మూన్ అనే పేరును 1979లో రిచర్డ్ నోల్ అనే ఆస్ట్రాలజర్ సూచించారు.
¤  యాంటీ సబ్‌మెరైన్ యుద్ధ నౌక ఐఎన్ఎస్ కమోర్తా ను కోల్‌కతాలో జరిగిన కార్యక్రమంలో గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అధికారులు లాంఛనంగా నౌకాదళానికి అందజేశారు.  
 »    స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ యుద్ధనౌక జలాంతర్గాముల పని పడుతుంది.
జులై - 18
¤  భూగర్భంలోని ఖనిజాల గుర్తింపునకు జాతీయ భూభౌతిక పరిశోధనా కేంద్రం (ఎన్‌జీఆర్ఐ) '3డీ-హై రిజల్యూషన్ సీస్మిక్ సర్వే' విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ విధానంతో 10 రెట్లకు పైగా ఖర్చు తగ్గడమే కాకుండా వనరులను సమర్థంగా గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు ప్రకటించారు.  
 »    3డీ హై రిజల్యూషన్ సీస్మిక్ సర్వే విధానానికి అవసరమైన పరికరాలకు సుమారు రూ.30 కోట్లు ఖర్చు చేసి, అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నారు. దీంట్లో వైబ్రేటర్, సెన్సర్లు ఇతర పరికరాలుంటాయి.  
 »    ఇప్పటి వరకూ ఈ తరహా పరిజ్ఞానాన్ని ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తదితర దేశాల్లో మాత్రమే ఉపయోగిస్తున్నారు. భారత్‌లో 2010లో సింగరేణి గనుల ప్రాంతంలో దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించి, బాగా పని చేస్తున్నట్లు నిర్ధరించారు. తాజాగా ఒడిశాలోని జార్సుగూడ ప్రాంతంలో బొగ్గు నిల్వల గుర్తింపునకు పూర్తి స్థాయిలో దీన్ని వినియోగిస్తున్నారు.
జులై - 22
¤  'చంద్ర ఎక్స్‌రే నక్షత్రశాల' 15వ వార్షికోత్సవ స్మారకంగా నాసా
'జి 292.0 + 1.8' అనే సూపర్ నోవా అవశేషాలతో కూడిన చిత్రాన్ని విడుదల చేసింది.
   
»    విస్ఫోటం చెందే తారల శిథిలాలను, విస్ఫోటం వల్ల విశ్వంలో గంటకు లక్షల మైళ్ల వేగంతో వ్యాపించే ప్రకంపనలను గుర్తించడంలో 'చంద్ర ఎక్స్‌రే నక్షత్రశాల' ఖ్యాతిగాంచింది.¤  బీహార్‌లోని భాగల్పూర్ జిల్లాలో ఉన్న బీహార్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (బీఏయూ) పరిశోధకులు టెంక లేని మామిడిపండును అభివృద్ధి చేశారు.   
»    ఈ సరికొత్త మామిడి రకానికి 'సింధు' అని పేరు పెట్టారు. రత్నా, అల్ఫాన్సో హైబ్రిడ్ రకాల నుంచి దీన్ని సృష్టించారు.

¤  మనకు సుమారు వెయ్యి కాంతి సంవత్సరాల దూరంలో ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతున్న 'కెప్లర్ - 421 బి' అనే గ్రహాన్ని నాసా కెప్లర్ టెలిస్కోప్ కనుక్కుంది.   
»    యురేనస్ (వరుణ గ్రహం) అంత సైజులో ఉన్న ఈ గ్రహం తన నక్షత్రానికి 17.70 కిలోమీటర్ల దూరంలో తిరుగుతోంది.   
»    భూమి సూర్యుడి చుట్టూ ఒకసారి తిరగడానికి 365.25 రోజులు పడుతుండగా ఈ నూతన గ్రహానికి మాత్రం 704 రోజులు పడుతుందని పరిశోధకులు పేర్కొన్నారు.
జులై - 25
¤  విపత్తులు, ప్రమాదాల సమయంలో వ్యవస్థలు కుప్పకూలినచోట అండగా నిలిచే అత్యాధునిక సమాచార వ్యవస్థ దిశానెట్ (ఇన్ఫర్మేషన్ నెట్‌వర్క్ ఫర్ న్యాచురల్ డిజాస్టర్ మిటిగేషన్ అండ్ రికవరీ ప్రాజెక్ట్)ను భారత్, జపాన్ శాస్త్రవేత్తలు సమష్టిగా రూపొందించారు. సమాచార వ్యవస్థలు అందుబాటులో లేని చోట కూడా ఉపయోగపడటం దీని ప్రత్యేకత.   
»    ఆపదలో ఉన్నవారికి ఆసరాగా నిలవడమే కాకుండా బాధితులు, బంధువులకు సాంత్వన కలిగించడంలో, సహాయ కార్యక్రమాలు చేపట్టడంలో ఇది కీలకం కానుంది.   
»    జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా) సాయంతో చేపట్టిన ఈ పరిశోధనలో హైదరాబాద్ ఐఐటీ, చెన్నై ఐఐటీ, ఎన్‌జీఆర్ఐతో పాటు టోక్యో, కియో విశ్వవిద్యాలయాలకు చెందిన పలువురు శాస్త్రవేత్తలు పాలుపంచుకున్నారు. తమ నాలుగేళ్ల పరిశోధన ఫలితాన్ని వారు హైదరాబాద్‌లో ప్రదర్శించారు.
జులై - 26
¤  నీటిలో నివసించే కీటకాల్లో అతిపెద్ద కీటకాన్ని చైనా శాస్త్రవేత్తలు కనుక్కున్కారు.  
 »    రెక్కలు పెద్దగా ఉండే కీటకాల క్రమం 'మెగాలోపెర్టా'కు చెందిన ఈ కీటకాన్ని చైనాలోని చెంగ్డులో ఓ పర్వతం వద్ద కనుక్కున్నారు. రెక్కలు విప్పితే ఇది 8.3 అంగుళాల పొడవు ఉంటుంది.  
 »    ఇప్పటివరకు దక్షిణ అమెరికాలో కనుక్కున్న 'హెలికాప్టర్ డామ్స్ ప్లై' అనే కీటకమే అతిపెద్దది. రెక్కలు విప్పితే దాని పొడవు 7.5 అంగుళాలు ఉంటుంది.
జులై - 27
¤  'లిటిల్ బాక్స్ ఛాలెంజ్' పేరిట గూగుల్ ఒక పోటీ ప్రకటన చేసింది.   
»    సౌరశక్తి, గాలి మొదలైన ప్రత్యామ్నయ ఇంధన వనరులతో పనిచేసే బుల్లి ఇన్వర్టర్‌ను రూపొందించిన వారికి రూ.6 కోట్ల బహమతిని ఇస్తామంటూ గూగుల్ ప్రకటించింది.   
»    ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్స్ (ఐఈఈఈ)తో కలిసి గూగుల్ ఈ పోటీని నిర్వహిస్తోంది.   
»    విద్యుత్‌శక్తి భవిష్యత్‌నే ఈ తరహా ఇన్వర్టర్ కొత్త మలుపు తిప్పుతుందని గూగుల్ విశ్వసిస్తోంది.  
 »    విజేతను 2016 జనవరిలో ప్రకటిస్తారు.

¤  డెంగీ వ్యాధికి కళ్లెం వేసేందుకు బ్రిటన్‌కు చెందిన ఆక్సిటెక్ అనే సంస్థ జన్యుమార్పిడి దోమను సృష్టించింది.  
 »    దీనిపై క్షేత్రస్థాయి ప్రయోగాలకు అనుమతి ఇవ్వాలని ఆక్సిటెక్ భారత ప్రభుత్వాన్ని కోరింది.  
 »    జన్యుమార్పిడి చేసిన ఈ మగదోమకు ఆక్సిటెక్ '513 ఎ' అని పేరు పెట్టింది. ఇందులో ఉండే ఒక ప్రత్యేక జన్యువు వల్ల దాని సంతానం పెద్దయ్యేసరికి (2 - 5 రోజుల్లో) చనిపోతాయి. దీనివల్ల దోమల వ్యాప్తిని అడ్డుకుని, డెంగీని నియంత్రించడానికి వీలవుతుంది.   
»    ఈ దోమను ఇటీవల ప్రపంచకప్ ఫుట్‌బాల్ పోటీల సమయంలో బ్రెజిల్‌లో పరీక్షించారు. కేమన్ దీవుల్లోనూ పరిశోధించారు.   
»    ప్రస్తుతం భారత్‌కు చెందిన జీబీఐటీ అనే ప్రైవేటు కంపెనీతో కలిసి ఆక్సిటెక్ పనిచేస్తోంది.   
»    ఈ జన్యుమార్పిడి దోమలు కేవలం డెంగీని వ్యాపింపజేసే ఆడదోమలతోనే సంక్రమణం జరుపుతాయని, అందువల్ల మిగతా కీటకాలపై దాని ప్రభావం ఉండదని శాస్త్రవేత్తలు ప్రకటించారు. అవసరమైతే ఈ జన్యువు ప్రభావాన్ని టెట్రాసైక్లిన్ మందుతో నిర్వీర్యం చేయవచ్చని శాస్త్రవేత్తలు ప్రకటించారు.

¤  మేలు రకం ముర్రా జాతి ఎద్దు వీర్యాన్ని భద్రపరచి దాని నుంచి క్లోనింగ్ ప్రక్రియ ద్వారా ఒక కోడెదూడను సృష్టించడంలో ఎన్‌డీఆర్ఐ (నేషనల్ డెయిరీ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్) శాస్త్రవేత్తలు విజయం సాధించారు.

»    'హ్యాండ్ - గైడెడ్ క్లోనింగ్' ప్రక్రియ ద్వారా ప్రాణం పోసుకున్న ఈ దూడకు 'రజత్' అని పేరు పెట్టారు.


  »    'రజత్' జన్మకు కారణమైన ముర్రాజాతి ఎద్దు ఎప్పుడో పదేళ్ల క్రితమే మరణించింది. దాని నుంచి సేకరించి భద్రపరిచిన వీర్యమే ఇప్పుడు 'రజత్‌'కు ఊపిరి పోసిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. 
  »    జులై 23న ఈ దూడ జన్మించింది. 
  »    ఎన్‌డీఆర్ఐ డైరెక్టర్ - డాక్టర్ ఎ.కె.శ్రీవాస్తవ

¤  సముద్ర విజ్ఞాన పరిశోధనలే లక్ష్యంగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఆర్.వి.సింధు సాధన నౌకను విశాఖ పోర్టులో ప్రారంభించారు.  
 »    విశాఖపట్నం నుంచి అండమాన్ వరకు సముద్రగర్భం, ఉపరితలం పైన పరిస్థితులను అధ్యయనం చేసేందుకు ఇది తన పయనం మొదలుపెట్టింది.

¤  కంటిచూపు లేని వారికోసం బ్రెయిలీ లిపి మరింత స్పష్టంగా తెలిసేలా ఐఐటీ ఢిల్లీకి చెందిన మెకానికల్ విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టుకు జాతీయ ఆవిష్కరణల పోటీ 'టెక్ టాప్ - 2014'లో ప్రథమ బహుమతి లభించింది.
జులై - 28
¤  శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్), ఇనాక్స్ (బరోడా) సహకారంతో స్వదేశీ పరిజ్ఞానంతో అతిపెద్ద ద్రవ హైడ్రోజన్ నిల్వ ట్యాంకును రూపొందించింది.  
 »    ఈ ట్యాంకులో 40 కిలోలీటర్ల లిక్విడ్ హైడ్రోజన్‌ను నిల్వ చేసే వీలుంది. మనదేశంలో మొదటిసారిగా దీన్ని తయారుచేశారు. 
  »    ఇస్రో 16 ఏళ్ల కిందట ఇలాంటి ట్యాంకును రష్యా నుంచి రూ. 6 కోట్లకు కొనుగోలు చేసింది. తాజా ట్యాంకుకు రూ. 3 కోట్లు మాత్రమే ఖర్చు అయ్యింది.
జులై - 29
¤  అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) కు చెందిన 'కేసిని' వ్యోమనౌక శని చుట్టూ పరిభ్రమిస్తున్న ఉపగ్రహం ఎన్‌సెలాడస్ మంచు ఉపరితలంపై 101 విభిన్న 'గీజర్లు' ఉన్న స్థానాన్ని గుర్తించింది.   
»    దాదాపు ఏడేళ్లపాటు కేసిని కెమెరాలు ఎన్‌సెలాడస్ దక్షిణ ధ్రువ ప్రాంతాన్ని సర్వే చేశాయి. ఆ ప్రాంతం చాలా విభిన్నంగా ఉంది. పులిచారలను పోలిన నాలుగు పగుళ్లు శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించాయి. అక్కడ సూక్ష్మస్థాయి మంచు రేణువులు, నీటి ఆవిరిని వెదజల్లే గీజర్లను పదేళ్ల కిందటే గుర్తించారు. తాజాగా వాటిపై సర్వే చేసి ఒక మ్యాప్‌ను తయారుచేశారు. అక్కడ 101 గీజర్లు ఉన్నట్లు గుర్తించారు.