ఏప్రిల్ - 2014 వార్తల్లో వ్యక్తులు


ఏప్రిల్ - 4
¤  భారత సంతతికి చెందిన స్వతంత్ర పెట్టుబడుదారైన సునీల్‌ సభర్వాల్‌కు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎమ్‌ఎఫ్‌)లో యూఎస్‌ ప్రత్యామ్నాయ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా సునీల్‌ను అమెరికా అధ్యక్షుడు ఒబామా నామినేట్ చేసిన‌ట్లు వైట్‌ హౌస్‌ ఒక ప్రకటన చేసింది.    »    చెల్లింపుల రంగంలో ఒక స్వతంత్ర పెట్టుబడుదారుగా ఉన్న సభర్వాల్‌ యూరోపియన్ ఇ కామర్స్‌ చెల్లింపుల సేవల కంపెనీ అయిన బోర్డ్‌ ఆఫ్‌ ఓజోన్‌కు 2011 - 2013 వరకూ ఛైర్మన్‌గా వ్యవహరించారు. అంతక్రితం వివిధ కంపెనీల్లో వివిధ హోదాల్లో పనిచేశారు.    »    ద ఒహియో స్టేట్‌ యూనివర్సిటీ నుంచి బి.ఎస్‌., లండన్‌ బిజినెస్‌ స్కూల్‌ నుంచి ఎమ్‌.ఎస్‌. చేశారు.
ఏప్రిల్ - 6
¤  'ఫెమినా మిస్‌ ఇండియా - 2014' అందాల సుందరి కిరీటాన్ని జైపూర్‌కి చెందిన కోయల్‌రాణా చేజిక్కించుకున్నారు. మొదటి రన్నరప్‌గా ముంబయికి చెందిన జటలేఖా మల్హోత్రా, రెండో రన్నరప్‌గా గోవా సుందరి గేల్‌నిఖోల్‌ డిసిల్వా నిలిచారు. ముంబ‌యిలో జరిగిన కార్యక్రమంలో విజేతలకు 2013 మిస్‌ ఇండియా నవనీత్‌కౌర్‌ దిల్లాన్‌ ఈ కిరీటాలను అలంకరించారు.
ఏప్రిల్ - 12
¤ పారిశ్రామిక దిగ్గజాలు హిందూజా సోద‌రులు వ‌రుస‌గా రెండో ఏడాదీ బ్రిట‌న్‌లో అత్యంత సంప‌న్న ఆసియ‌న్లుగా నిలిచారు. 13.5 బిలియ‌న్ పౌండ్లకు (సుమారు రూ.1,36,000 కోట్లు) పైగా సంప‌ద‌తో ఆసియ‌న్ల జాబితాలో అగ్రస్థానం ద‌క్కించుకున్నారు.   »     12 బిలియ‌న్ పౌండ్ల సంప‌ద‌తో ఉక్కు దిగ్గజం ల‌క్ష్మీ మిట్టల్ రెండో స్థానంలో నిలిచారు.   »     750 మిలియ‌న్ పౌండ్లతో ఎన్నారై పారిశ్రామిక దిగ్గజం లార్డ్ స్వరాజ్‌పాల్ 10వ స్థానంలో ఉన్నారు.   »     'ఈస్టర్న్ ఐ' ప్రచుర‌ణ సంస్థ ఈ జాబితాను రూపొందించింది.
ఏప్రిల్ - 13
¤ హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ స్థాపకులు డాక్టర్ గుళ్లపల్లి నాగేశ్వరరావు అంతర్జాతీయ సంస్థ అకడమియా ఆఫ్తల్మాలోజికా ఇంటర్నేషనాలిస్ (ఏఓఐ) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.   »     కంటి వైద్య రంగంలో విశిష్ట సేవలందించిన ఈ సంస్థలో వివిధ దేశాలకు చెందిన 73 మంది వైద్య ప్రముఖులు సభ్యులుగా ఉన్నారు.   »     ఈ సంస్థకు ఇప్పటిదాకా అధ్యక్షుడిగా పనిచేసిన వారిలో అమెరికా, జపాన్, యూరప్‌లకు చెందిన వారే అధికంగా ఉన్నారు.   »     ఒక భారతీయుడు ఈ పదవి చేపట్టడం ఇదే తొలిసారి.
ఏప్రిల్ - 17
¤  ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ రోహిణికి రాష్ట్ర హైకోర్టు పూర్తి ధర్మాసనం ఘనంగా వీడ్కోలు పలికింది.   »     హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా నేతృత్వంలోని హైకోర్టు న్యాయమూర్తులందరూ జస్టిస్ రోహిణికి వీడ్కోలు పలికారు.   »     జస్టిస్ రోహిణి ఈ నెల 21న ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.¤  ఇంటర్‌నెట్ సెర్చ్ దిగ్గజం గూగుల్ తాజాగా ప్రకటించిన 'మోస్ట్ సెర్చ్‌డ్ సెలబ్రిటీ'ల్లో టాలీవుడ్ హీరో, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మొదటి స్థానంలో నిలిచారు.   »     ఇటీవల బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీతో పవన్‌కళ్యాణ్ ప్రత్యేకంగా అహ్మదాబాద్‌లో సమావేశమైన నేపథ్యంలో ఆయనకు దేశ రాజకీయాల్లో ఒక్కసారిగా గుర్తింపు లభించింది.   »     'మోస్ట్ సెర్చ్‌డ్ సెలబ్రీటీ'ల్లో పవన్ కళ్యాణ్ తరువాతి స్థానాల్లో కాంగ్రెస్ ఎంపీ, నటి రమ్య (దివ్య స్పందన), రచయిత, నటుడు కుమార్ బిశ్వాస్ (ఆప్) ఉన్నారు. ఒకనాటి బాలీవుడ్ అందాల తార నగ్మా (మీరట్ కాంగ్రెస్ అభ్యర్థి), డ్రీమ్‌గర్ల్ హేమమాలిని (మధుర బీజీపీ అభ్యర్థి) తరువాతి స్థానాల్లో నిలిచారు.   »     నటుడు, మంత్రి చిరంజీవి, హాస్యనటుడు రాజు శ్రీ వాస్తవ, భోజ్‌పురి సూపర్ స్టార్ మనోజ్ తివారీ, నటి జయప్రద, బెంగాలీ సూపర్ స్టార్ దేవ్‌లు మొదటి పది స్థానాల్లో నిలిచారు.
ఏప్రిల్ - 18
¤  మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన సుధీర్ ఖేతావత్ అర సెంటీమీటర్ కంటే తక్కువ పరిమాణం ఉన్న డైమండ్ రోజ్‌ను రూపొందించారు.   »     సుధీర్ ఖేతావత్ గతంలో మోతీ గులాబ్ (2.5 సెంటీమీటర్లు), హీరాగులాబ్ (ఒక సెంటీమీటర్) పేరిట కూడా చిట్టి గులాబీలను పూయించారు.   »     ప్రపంచంలోనే అతి చిన్న రకం గులాబీలను పూయించడంలో ఇండోర్‌కు అంతర్జాతీయంగా పేరుండటం గమనార్హం.
 ఏప్రిల్ - 19
¤  ఆర్టీసీ ఛైర్మన్ ఎం.సత్యనారాయణరావు రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది.   »     కాంగ్రెస్ సీనియర్ నాయకుడైన సత్యనారాయణరావు 2007 డిసెంబరు నుంచి ఆర్టీసీ ఛైర్మన్‌గా కొనసాగుతూ వచ్చారు. అంతకుముందు 1990 - 1994 మధ్య కాలంలో కూడా ఆయన ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు.   »     ఆర్టీసీకి సుదీర్ఘకాలం ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించిన వ్యక్తిగా సత్యనారాయణరావు రికార్డులకెక్కారు.
 ఏప్రిల్ - 20
¤  కోల్‌కతాకు చెందిన అరునాహ్వా చందా అమెరికాలోని యూనివర్సిటీల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష 'సాట్ (స్కాలిస్టిక్ అసెస్‌మెంట్ టెస్ట్)'లో వంద శాతం మార్కులు సాధించి సంచలనం సృష్టించాడు.   »     'సాట్‌'లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ విభాగాల్లో ఒక్కో దాంట్లోంచి 800 మార్కులకు ప్రశ్నలుంటాయి. గరిష్ఠ మార్కులు 2,400.   »     హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్, కొలంబియా, డ్యూక్, కార్నెల్, జార్జియా, డార్ట్‌మౌత్, ఎంఐటీ అనే 8 యూనివర్సిటీల్లో ప్రవేశం కోసం చందా దరఖాస్తు చేసుకున్నాడు. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కులు చూసి ఒక్క ఎంఐటీ మినహా మిగతా యూనివర్సిటీలన్నీ అతనికి ఉపకార వేతనంతో కూడిన సీటును ఆఫర్ చేశాయి. తన 12వ స్టాండర్డ్ పరీక్షల కారణంగా ఎంఐటీ కోరిన ఓ ప్రాజెక్టును సకాలంలో అందజేయకపోవడంతో ఎంఐటీ చందా దరఖాస్తును తిరస్కరించింది.   »     ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకంగా భావించే 7 యూనివర్సిటీలు స్కాలర్‌షిప్‌లు, ఆర్థిక సహాయం అందించి మరీ చేర్చుకుంటామంటూ స్వాగతం పలుకుతుండటంతో చందా వార్తల్లో నిలిచాడు.
ఏప్రిల్ - 21
¤  ఢిల్లీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జి.రోహిణి బాధ్యతలు స్వీకరించారు.    »     ఢిల్లీలోని రాజ్ నివాస్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ సమక్షంలో జస్టిస్ రోహిణి ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు.   »     ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సీనియర్ జడ్జి అయిన జస్టిస్ రోహిణిని ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇటీవలే నియమించారు.   »     రాష్ట్రానికి చెందిన జస్టిస్ రోహిణికి ముందు ఢిల్లీ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ ఎన్.వి.రమణ కూడా రాష్ట్రానికి చెందినవారే కావడం గమనార్హం. జస్టిస్ రమణ పదోన్నతిపై సుప్రీంకోర్టు జడ్జిగా వెళ్లారు.   »     జస్టిస్ రోహిణి 1955 ఏప్రిల్ 14న విశాఖపట్నంలో జన్మించారు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ పొందారు. 1980లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. 1995లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులయ్యారు. 2001లో అదనపు జడ్జిగా, 2002లో శాశ్వత జడ్జిగా నియమితులయ్యారు.¤  ప్రభుత్వరంగ ఖనిజ సంస్థ నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండీసీ) ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా నరేంద్ర కోఠారీ బాధ్యతలు చేపట్టారు.   »     సెయిల్‌కు చెందిన బర్న్‌పూర్ ఇస్కో స్టీల్ ప్లాంట్‌కు గత రెండేళ్లు ఆయన ఛైర్మన్‌గా పనిచేశారు.
ఏప్రిల్ - 24
¤  టైమ్ మేగజీన్ ప్రకటించిన ప్రపంచంలోని 100 మంది అత్యంత ప్రభావవంతులైన వ్యక్తుల జాబితాలో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, భాజపా ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీలకు చోటు దక్కింది.   »     ఈ జాబితాలో మోడీ, కేజ్రీవాల్‌తో పాటు మరో ఇద్దరు భారతీయులు రచయిత్రి అరుంధతీ రాయ్, కోయంబత్తూర్‌కు చెందిన సామాజిక కార్యకర్త అరుణాచలం మురుగనాథంలు ఉన్నారు.   »     '2014 టైమ్ 100' పేరిట రూపొందించిన జాబితాలో ఎవరికీ ర్యాంకులు కేటాయించలేదు.   »     అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, గాయని బియాన్స్, పోప్ ఫ్రాన్సిస్, రష్యా అధ్యక్షుడు పుతిన్, పాకిస్థాన్ బాలిక మలాలా యూసఫ్ జాయ్, ప్రజావేగు ఎడ్వర్డ్ స్నోడెన్, జపాన్ ప్రధాని షింజో అబే, జాన్‌కెర్రీ, హిల్లరీ క్లింటన్ తదితరులకూ ఈ జాబితాలో చోటు దక్కింది.¤  వెల్త్-ఎక్స్ అనే గ్లోబల్ వెల్త్ ఇంటలిజెన్స్ కంపెనీ వెల్లడించిన గణాంకాల ప్రకారం దేశీయ క్రికెట్ జట్ల యజమానుల్లో అత్యంత సంపన్నుడిగా రిలయన్స్ సీఎండీ, ముంబయి ఇండియన్స్ టీమ్ ఓనర్ ముకేష్ అంబానీ నిలిచారు. ఆయన నెట్‌వర్త్ 2,120 కోట్ల డాలర్లు.   »     సన్ రైజర్స్ హైదరాబాద్ యజమాని కళానిధి మారన్ 220 కోట్ల డాలర్ల నెట్‌వర్త్‌తో ద్వితీయ స్థానంలో నిలిచారు. సుమారు 64 కోట్ల డాలర్ల నెట్‌వర్త్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓనర్ విజయ్ మాల్యా మూడో స్థానంలో, 60 కోట్ల డాలర్ల నెట్‌వర్త్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్ యజమాని షారుక్ ఖాన్ నాలుగో స్థానంలో ఉన్నారు.   »     గ్రంథి మల్లికార్జునరావు (ఢిల్లీ డేర్ డెవిల్స్ - నెట్‌వర్త్ 27 కోట్ల డాలర్లు), మనోజ్ బడాలే (రాజస్థాన్ రాయల్స్ - 16 కోట్ల డాలర్లు), నారాయణ స్వామి శ్రీనివాసన్ (చెన్నై సూపర్‌కింగ్స్ - 7 కోట్ల డాలర్లు) ప్రీతి జింతా (కింగ్స్ లెవన్ పంజాబ్ - 3 కోట్ల డాలర్లు) తర్వాత స్థానాల్లో నిలిచారు.
ఏప్రిల్ - 25
¤  భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ రాధాకృష్ణన్ పదవీ కాలాన్ని మరోసారి పొడిగించారు. పదవీకాలం రెండేళ్ల కిందటే పూర్తయినా, ఆయన సేవలు అవసరమని అప్పట్లో పొడిగించారు.   »     ఆ గడువు ఆగస్టు నెలాఖరుకు పూర్తి కావస్తుండగా, మరో నాలుగు నెలల పాటు పొడిగించారు. ఆయన డిసెంబరు 31 వరకు ఛైర్మన్‌గా కొనసాగుతారు.¤  తన సలహా సంఘంలో ముగ్గురు భారతీయ అమెరికన్లను నియమిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రకటించారు.   »     వీరిలో అమెరికా వైమానిక దళం అధికారి లెఫ్టినెంట్ కల్నల్ రవి చౌదరి, ఆర్థికవేత్త శేఖర్ నరసింహన్, టీవీ, సినీ నటుడు మౌలిక్ పంచోలీ ఉన్నారు. ఈ ముగ్గురితో పాటు మొత్తం 14 మందితో సలహా సంఘం ఏర్పాటవుతుంది. ఆసియా అమెరికన్ల, పసిఫిక్ ద్వీప వాసుల వ్యవహారాలపై ఈ కమిటీ పని చేస్తుంది.
ఏప్రిల్ - 27
¤  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పద్మనాభస్వామి ఆలయానికి కొత్తగా ఏర్పాటు చేసిన కార్యనిర్వాహక కమిటీ ఛైర్‌పర్సన్‌గా తిరువనంతపురం జిల్లా అదనపు, సెషన్స్ న్యాయమూర్తి జస్టిస్ కె.పి.ఇందిర బాధ్యతలు స్వీకరించారు.   »     శతాబ్దాలుగా ట్రావెన్‌కోర్ రాజకుటుంబీకుల అధీనంలో ఉన్న పద్మనాభస్వామి ఆలయ నిర్వహణను జిల్లా న్యాయమూర్తి నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల కమిటీకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కె.పి.ఇందిర బాధ్యతలు స్వీకరించారు.¤  దివంగత పోప్ 23వ జాన్, పోప్ రెండో జాన్ పాల్‌లకు పోప్‌ఫ్రాన్సిస్ అధికారికంగా సెయింట్ హోదాను కల్పించారు.   »     వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ స్వ్కేర్‌లో జరిగిన కార్యక్రమంలో పోప్ ఫ్రాన్సిస్ వారికి సెయింట్ హోదాతో అరుదైన గౌరవం కట్టబెట్టారు.   »     పోప్ ఫ్రాన్సిస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రిటైర్డ్ పోప్ బెనెడిక్ట్ 16 కూడా హాజరయ్యారు. గతంలో ఎప్పుడూ పోప్, రిటైర్డ్ పోప్ ఇలాంటి బహిరంగ కార్యక్రమంలో కలిసి పాల్గొనలేదు.¤  బ్రిటన్‌లోని నెవార్క్‌కు చెందిన గ్లాజే బ్రూక్ ప్రపంచంలో అతిపెద్ద కాలిఫ్లవర్‌ను పండించి గిన్నిస్ రికార్డు సృష్టించాడు.   »     ఈ కాలీఫ్లవర్ బరువు 27.5 కిలోలు.   »     గ్లాజె బ్రూక్‌కు ఇలా ప్రత్యేకంగా భారీ సైజులో కూరగాయలు పండించడం కొత్తేమీ కాదు. ఆయన గతంలో భారీ బీట్‌రూట్, భారీ ఉల్లిగడ్డ, భారీ ఆలుగడ్డలను పండించి, గిన్నిస్ రికార్డుల్లో నిలిచాడు.
 ఏప్రిల్ - 29
¤  మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర జంతువు/ జీవులతో కూడిన ఇన్ఫో గ్రాఫిక్‌ను రూపొందించారు. వీటి ద్వారా ఏటా ఎంత మంది మానవులు చనిపోతున్నారనే వివరాలను కూడా తెలియజేశారు.   »     దోమ ద్వారా వచ్చే మలేరియా తదితర వ్యాధుల వల్ల ప్రపంచంలో ఏటా 7.25 లక్షల మంది చనిపోతున్నారు. 20 కోట్ల మంది జ్వరాలు, జబ్బుల బారిన పడుతూ, మంచానికి అతుక్కుపోతున్నారు. అందుకే బిల్‌గేట్స్ ఈ జాబితాలో దోమను తొలిస్థానంలో చేర్చారు.   »     దోమ తర్వాత ప్రమాదకర జీవి స్థానం మనిషిదే. ఒకరినొకరు చంపుకోవడం, యుద్ధాలు వంటి వాటివల్ల ఏటా 4.75 లక్షల మంది మరణిస్తున్నారు.   »     మూడో స్థానంలో పాము (50 వేల మంది మృతులు), నాలుగో స్థానంలో కుక్క (రేబిస్ వ్యాధి వల్ల 25 వేల మంది మరణిస్తున్నారు) ఉన్నాయి.   »     తర్వాతి స్థానాల్లో ఒక రకమైన ఈగ, అసాసిస్ బగ్, నత్తలు ఉన్నాయి.ఇవి ఒక్కోరకం పది వేల మందిని బలితీసుకుంటున్నాయి.   »     ఈ జాబితాలోని చివరి మూడు స్థానాల్లో సింహం (100 మంది), తోడేలు (10 మంది), షార్క్ (10 మంది మృతులు) ఉన్నాయి.
 ఏప్రిల్ - 30
¤  ఆసియాలోనే అత్యంత ధనవంతులైన పది మందిలో సన్ ఫార్మాస్యూటికల్స్ ఇండస్ట్రీస్ అధిపతి దిలీప్ సంఘ్వి కూడా ఉన్నట్లు 'వెల్త్-ఎక్స్' జాబితా వెల్లడించింది. వీరందరూ స్వయంకృషితో పైకొచ్చి సంపన్నులుగా మారిన వారే కావడం గమనార్హం.   »     జాబితాలో సంఘ్వి ఏడో స్థానంలో నిలిచారు. జాబితాలో భారత్‌కు చెందిన వారు ఆయన ఒక్కరే కావడం విశేషం.   »     సంఘ్వీ ఆస్తుల నికర విలువ 1,350 కోట్ల డాలర్లు (దాదాపు రూ.81,000 కోట్లు).   »     హాంకాంగ్‌కు చెందిన వ్యాపార దిగ్గజం లి కా-షింగ్ 2,940 కోట్ల డాలర్లతో జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు.   »     సంఘ్వీ 1983లో సన్ ఫార్మాస్యూటికల్స్‌ను స్థాపించారు.