మే - 1
|
| ¤ తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారికి హెచ్‌సీఎల్ అధినేత శివనాడార్ రూ.2 కోట్ల విరాళం అందజేశారు. |
మే - 3
|
| ¤ బ్రిటన్‌లోని గ్లాస్గో యూనివర్సిటీలో పరిశోధనలు సాగిస్తున్న రవీందర్ దహియా అనే భారత శాస్త్రవేత్త సుమారు రూ. 10.83 కోట్ల విలువైన 'ఇంజినీరింగ్ ఫెలోషిప్స్ ఫర్ గ్రోత్' గెలుచుకున్నాడు. » అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్, రోబోటిక్ అండ్ అటానమస్ సిస్టమ్స్, సింథటిక్ బయాలజీ రంగాల్లో పరిశోధనలకు ప్రభుత్వ నిధులందించే ఇంజినీరింగ్ అండ్ ఫిజికల్ సైన్సెస్ రిసెర్చ్ కౌన్సిల్ (ఈపీఎస్ఆర్‌సీ) రవీందర్‌ను ఈ ఫెలోషిప్‌కు ఎంపిక చేసింది. |
మే - 4
|
| ¤ ఫిఫా ప్రపంచకప్ పతకాన్ని చేతబూని రిలేలో పాల్గొనే అవకాశం ఇద్దరు ఢిల్లీ చిన్నారులకు దక్కింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఈ అవకాశం కోసం 500 మంది విద్యార్థులు పోటీ పడగా, మిహిర్ బత్రా, జాసెస్ మోజెస్ విజేతలుగా ఎంపికయ్యారు. దేశంలోని ఇతర నగరాల నుంచి మరో నలుగురిని ఎంపిక చేసి, బ్రెజిల్‌లోని రియోలో జరిగే ప్రపంచకప్ ఆరంభోత్సవానికి పంపిస్తారు. |
మే - 5
|
¤ ప్రపంచ నెంబర్‌వన్ టెన్నిస్ క్రీడాకారుడు, స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్‌ను స్పెయిన్ రాజధాని నగరం మాడ్రిడ్ తమ దత్తపుత్రుడిగా ప్రకటించింది. » ఎవరినైనా దత్తపుత్రుడిగా లేదా దత్తపుత్రికగా స్వీకరించడమనేది మాడ్రిడ్ సిటీ దృష్టిలో అతి పెద్ద అవార్డు. » మాడ్రిడ్ నగర మేయర్ అనా బొటెల్లా ఈ అవార్డును నాదల్‌కు ప్రదానం చేసింది. » ఇటీవల స్పెయిన్‌లో జరిగిన ఓటింగ్‌లో రఫెల్ నాదల్ మాడ్రిడ్ దత్తపుత్రుడిగా ఏకగ్రీవంగా ఎంపికయ్యాడు. |
మే - 6
|
| ¤ క్రికెట్ దిగ్గజం, భారత మాజీ కెప్టెన్ సచిన్ టెండూల్కర్‌కు మరో గౌరవం దక్కింది. » దుబాయ్లోని ప్రముఖ గోల్ఫ్ క్లబ్ 'ఎల్స్'లో సచిన్‌కు శాశ్వత సభ్యత్వం దక్కింది. » ఈ క్లబ్‌లో ప్రపంచ నంబర్‌వన్ గోల్ఫ్ క్రీడాకారుడు రోరీ మెకిల్ రాయ్, హాలీవుడ్ నటుడు విల్‌స్మిత్, డెన్మార్క్ ఫుట్‌బాల్ జట్టు మాజీ గోల్‌కీపర్ పీటర్ ఘమికిల్‌కు శాశ్వత సభ్యత్వం ఉంది. |
మే - 7
|
¤ సింగపూర్‌లోని పదిమంది అగ్రశ్రేణి రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లో భారత మూలాలున్న ఇద్దరు వ్యక్తులకు చోటు దక్కింది. » రాయల్ హోల్డింగ్స్ ఆర్గనైజేషన్ యజమాని రాజ్‌కుమార్ హీరా నందాని 140 కోట్ల డాలర్ల సంపదతో రెండో స్థానంలో నిలిచాడు. » రాయల్ గ్రూప్ ఛైర్మన్ అశోక్ కుమార్ హీరా నందాని 120 కోట్ల డాలర్ల సంపదతో ఏడో స్థానంలో ఉన్నాడు. » ఈ జాబితాలో ఫార్ ఈస్ట్ ఆర్గనైజేషన్‌కు చెందిన ఫిలిప్ నాగ్ చెటాట్ మొదటి స్థానంలో నిలిచాడు. » వెల్త్-ఎక్స్ సంస్థ వెల్లడించిన ఈ జాబితాలోని పదిమంది వ్యక్తుల సంపద 1557 కోట్లు డాలర్లుగా ఉంది. ¤ దేశ ప్రథమ ఓటరు శ్యాంశరణ్ నేగి (97) తనలోని ఓటు స్ఫూర్తిని చాటుతూ ఎనిమిదో దశ సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసి అందరినీ ఆకర్షించారు. ఆయన భార్య హీరామణి (92) కూడా ఓటు వేశారు. » వీరిద్దరూ హిమాచల్‌ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లా కల్పాలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. కిన్నౌర్ శాసన సభ స్థానం మండీ లోక్‌సభ పరిధిలో ఉంది. » 1951 అక్టోబరు 25 నుంచి 1952 ఫిబ్రవరి వరకు దశలవారీగా జరిగిన దేశ తొలి సాధారణ ఎన్నికల్లో ఆయన తొలి ఓటు వేశారు. అప్పుడు ఉపాధ్యాయుడిగా ఉన్న నేగి వయసు 34 ఏళ్లు. ఆనాడు తొలి పోలింగ్ కేంద్రాన్ని కల్పాలో ఏర్పాటు చేశారు. అక్కడే ఎన్నికల విధుల్లో ఉన్న నేగి అక్టోబరు 25, 1951న తొలుత తానే ఓటేశారు. దీంతో ఎన్నికల సంఘం ఆయనను భారత తొలి ఓటరుగా గుర్తించింది. అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో ఆయన తప్పకుండా ఓటు వేస్తూనే ఉన్నారు. » లోక్‌సభ ఎన్నికల్లో నేగి 17వ సారి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. » ఈసారి గిరిజన ప్రాంతాల్లో ఓటు హక్కుకు సంబంధించిన ప్రచారకర్తగా శ్యాంశరణ్ నేగిని ఎన్నికల సంఘం ఎంపిక చేయడం విశేషం. |
మే - 8
|
¤ సీబీఐ తొలి మహిళా అదనపు సంచాలకులుగా ఐపీఎస్ అధికారిణి అర్చనా రామసుందరం బాధ్యతలు స్వీకరించారు. » అయితే, తమిళనాడు కేడర్‌కు చెందిన 1980 బ్యాచ్ అధికారిణి అయిన ఆమెను బాధ్యతలు స్వీకరించిన కొన్ని గంటల్లోపే తమిళనాడు ప్రభుత్వం సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. » సీబీఐలో ఈ పదవిని చేపట్టే ముందు పాటించాల్సిన కొన్ని నిబంధనలను అర్చన అనుసరించలేదన్న ఆరోపణలతో ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.¤ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రవేశపెట్టిన ఆరోగ్య సంరక్షణ చట్టంపై అవగాహన కల్పించడంలో విజేతలుగా నిలిచారంటూ ఇద్దరు భారతీయ అమెరికన్లను శ్వేతసౌధం ఘనంగా సత్కరించింది. » 'అఫర్డబుల్ కేర్ యాక్ట్'పై ఆసియా అమెరికన్లు, పసిఫిక్ ద్వీపాల ప్రజలను చైతన్యవంతం చేసిన మంజుషా కులకర్ణి, రంజనా పైంతాల్‌కు అమెరికా ప్రభుత్వం ఈ సందర్భంగా ప్రత్యేక గౌరవం కల్పించింది.¤ అంగారకుడిపై శాశ్వత ఆవాసం కోసం నెదర్లాండ్స్‌కు చెందిన 'మార్స్ వన్' సంస్థ నిర్వహించిన మరో వడపోతలో 44 మంది భారతీయులు ఎంపికయ్యారు. వీరిలో 17 మంది మహిళలు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన వారి సంఖ్య 705. » 2024 నాటికి అంగారకుడిపై ఆవాసం ఏర్పాటు చేయాలని మార్స్‌వన్ తలపోస్తోంది. ఇందులో భాగంగా నలుగురిని తొలుత అక్కడికి పంపాలని ప్రణాళిక రూపొందించింది. ఇది తిరుగు ప్రయాణం లేని యాత్ర. అంగారక గ్రహానికి వెళ్లినవారు తమ జీవితకాలమంతా అక్కడే ఉండాలి. ఇందుకు అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు ఆ సంస్థ ప్రపంచవ్యాప్తంగా దరఖాస్తులు ఆహ్వానించింది. దాదాపు 2 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వాటిలో నుంచి 1058 మందిని గత డిసెంబరులో ప్రాథమికంగా ఎంపిక చేశారు. అందులో 62 మంది భారతీయులు ఉన్నారు. |
మే - 9
|
¤ సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ డాక్టర్ సి.హెచ్.మోహనరావుకు కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. » మే 12న జరిగే కేయూ 20వ స్నాతకోత్సవంలో మోహనరావుకు రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేయనున్నారు.¤ రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ కార్యదర్శి ఎమ్.టి.కృష్ణబాబును విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఛైర్మన్‌గా నియమించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించింది. » ఆయన 1993 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. |
మే - 10
|
| ¤ వారం రోజుల్లో దేశం విడిచి వెళ్లాలని పాకిస్థాన్ ప్రభుత్వం భారత్ కు చెందిన పాత్రికేయులు మీనా మీనన్ (ది హిందూ), స్నేహేష్ అలెక్స్ ఫిలిప్(పీటీఐ)లను ఆదేశించింది. » ఫిలిప్, మీనన్ లు గతేడాది ఆగస్టులో పాకిస్థాన్ వెళ్లారు. వారి వీసాలను మూడు మాసాలకోసారి పునరుద్ధరించుకోవాలి. వీసాల గడువు మార్చి 9 తో ముగిసింది. |
మే - 12
|
¤ భారత కొత్త సైన్యాధిపతిగా ప్రస్తుత ఉప అధిపతి లెఫ్టినెంట్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ పేరును మంత్రివర్గ నియామకాల సంఘం (ఎ.సి.సి.) పరిశీలనకు రక్షణ మంత్రిత్వ శాఖ పంపింది. » ప్రస్తుత సైన్యాధిపతి జనరల్ బిక్రంసింగ్ జులై 31వ తేదీన ఉద్యోగ విరమణ చేయనున్నారు. సంప్రదాయం ప్రకారం రెండు నెలల ముందుగా ఆయన వారసుడిని నియమించాల్సి ఉంది. కానీ భాజపా వ్యక్తం చేసిన అభ్యంతరాలతో ఈ నియామకం వివాదంలో పడింది. » తాజాగా ఈ విషయంలో ప్రభుత్వం ముందుకు వెళ్లవచ్చని ఈసీ తెలిపింది.¤ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) పి.కె.మహంతి స్వచ్ఛంద పదవీ విరమణకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. |
మే - 13
|
| ¤ భారత తదుపరి సైన్యాధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ ఎంపికయ్యారు. » చిత్తోర్‌గఢ్‌లోని సైనిక్ స్కూల్‌లో చదివిన సుహాగ్ 1970లో ప్రతిష్ఠాత్మక నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ) ద్వారా సైన్యంలో చేరారు. శిక్షణ అనంతరం 1974 జున్‌లో '4/5 గూర్ఖా రైఫిల్స్' రెజిమెంట్‌లో అధికారి అయ్యారు. » 1987లో శ్రీలంకలో భారత శాంతిసేన నిర్వహించిన ఆపరేషన్‌లలో ఆయన పాల్గొన్నారు. కాశ్మీర్ లోయలో ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల్లో నిమగ్నమైన 53వ ఇన్‌ఫ్యాంట్రీ బ్రిగేడ్‌కు ఆయన 2003 జులై నుంచి 2005 మార్చి వరకూ నాయకత్వం వహించారు. 2007 అక్టోబరు నుంచి 2008 డిసెంబరు వరకూ కార్గిల్‌లోని 8వ పర్వత విభాగానికి కమాండర్‌గా పని చేశారు. తర్వాత తూర్పు విభాగానికి నేతృత్వం వహించారు. గతేడాది డిసెంబరు నుంచి సైన్యానికి ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. » ప్రస్తుతం లెఫ్టినెంట్ జనరల్ ర్యాంక్ అధికారులందరిలోకి ఆయనే అత్యంత సీనియర్. |
మే - 15
|
| ¤ పితృత్వ వివాదాన్ని ఎదుర్కొని, చివరకు డీఎన్ఏ పరీక్షలో అసలు విషయం తేలడంతో, రోహిత్ శేఖర్‌ను తన కుమారుడిగా అంగీకరించిన కాంగ్రెస్ సీనియర్ నేత, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌ల మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఎన్.డి.తివారీ మళ్లీ పెళ్లి చేసుకున్నారు. రోహిత్ తల్లి ఉజ్వలా శర్మను ఎనభై తొమ్మిదేళ్ల తివారీ వివాహమాడారు. » రోహిత్‌ను తనతో కలిసి ఉండేందుకు ఇంతకు ముందే అంగీకరించిన తివారీ ఇటీవల ఉజ్వల ధర్నా చేయడంతో, ఆమెనూ తన ఇంట్లోకి అనుమతించారు. » తివారీ కుమారుడినంటూ రోహిత్ 2007లో కేసు దాఖలు చేశారు. ఆరేళ్ల న్యాయ పోరాటం అనంతరం ఢిల్లీ హైకోర్టు ఆ విషయాన్ని ధ్రువీకరిస్తూ తీర్పు ఇచ్చింది.¤ 2014 సార్వత్రిక ఎన్నికలు మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ట్విట్టర్‌లో 5 కోట్ల 60 లక్షల ట్వీట్లు చోటు చేసుకోగా, వాటిలో నరేంద్ర మోడీ గురించి ఏకంగా 1.11 కోట్ల ట్వీట్లు పోలయ్యాయి. ఈ సైట్‌లో ఎన్నికల సంబంధిత ట్రాఫిక్‌లో ఇది 20%తో సమానం. » 82 లక్షల ట్వీట్లతో (15%) ఆమ్ ఆద్మీ పార్టీ, 60 లక్షల ట్వీట్లతో(11%) బీజేపీలు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. » తరువాతి స్థానాల్లో అరవింద్ కేజ్రీవాల్(50 లక్షల ట్వీట్లు - 9%), భారత జాతీయ కాంగ్రెస్ (27 లక్షల ట్వీట్లు - 5%), రాహుల్ గాంధీ (13 లక్షల ట్వీట్లు - 2%) నిలిచారు. |
మే - 17
|
¤ పదేళ్ల పాటు ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన మన్మోహన్ సింగ్ ఆ పదవి నుంచి వైదొలిగారు. » మన్మోహన్ సింగ్ తన మంత్రివర్గ రాజీనామాను న్యూఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి అందజేశారు. ప్రణబ్ వారి రాజీనామాను ఆమోదించి, కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకూ కొనసాగాలని సూచించారు. » ప్రస్తుత 15వ లోక్‌సభను రద్దు చేయాలని కేంద్ర మంత్రిమండలి రాష్ట్రపతికి సూచించింది. ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలో చివరిసారిగా సమావేశమైన మంత్రిమండలి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.¤ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియా, సంఘంలోని సభ్యుడు బి.కె.చతుర్వేది తమ పదవులకు రాజీనామా చేశారు. » ప్రభుత్వంతో పాటే ప్రణాళికా సంఘం సభ్యుల పదవీ కాలం కూడా ముగుస్తుంది. ఇందులో భాగంగా సార్వత్రిక ఎన్నికలు ముగిసిన వెంటనే ఉపాధ్యక్షుడు, సభ్యులు ప్రధానమంత్రికి రాజీనామాలు సమర్పిస్తారు.¤ బీహార్ ముఖ్యమంత్రి, జేడీ(యు) అగ్రనేత నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. » తాజాగా వెలువడిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో పార్టీ ఘోర పరాజయం పాలవడంతో పాటు, పార్టీలో అసమ్మతి పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే అసెంబ్లీ రద్దుకు మాత్రం ఆయన సిఫార్సు చేయలేదు. గవర్నర్ డి.వై.పాటిల్‌కు నితీష్ రాజీనామా లేఖను సమర్పించగా ఆయన ఆమోదించారు. |
మే - 19
|
¤ ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ఓడిపోవడంతో ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (పీఎంఈఏసీ) ఛైర్మన్ పదవికి సి.రంగరాజన్ రాజీనామా చేశారు. » పీఎంఈఏసీ లో సౌమిత్రా చౌధురి, వి.ఎస్.వ్యాస్, పులిన్ బి.నాయక్, దిలీప్ ఎం.నచానే సభ్యులుగా ఉన్నారు. వీరంతా ఇప్పటికే రాజీనామా చేశారు. » ప్రధాని పదవీ కాలానికి సమానంగా పీఎంఈఏసీ సభ్యుల పదవీకాలం ఉంటుంది.¤ ఇటీవలే మళ్లీ పెళ్లి చేసుకున్న ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఎన్.డి.తివారీ ఆ వివాహాన్ని లక్నోలోని రిజిస్ట్రార్ కార్యాలయంలో నమోదు చేయించారు. » లక్నోలోని రిజిస్ట్రార్ కార్యాలయానికి భార్య ఉజ్వలా శర్మతో వచ్చి అవసరమైన పత్రాలు సమర్పించారు.¤ మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి 101వ జయంతిని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంజీవరెడ్డికి నివాళులు అర్పించారు. » నీలం సంజీవరెడ్డి 1913 మే 19న అనంతపురం జిల్లా ఇల్లూరు గ్రామంలో జన్మించారు. |
మే - 20
|
| ¤ బెంగళూరుకు చెందిన నూర్జహాన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ (ఆర్గానిక్ కెమిస్ట్రీ)లో ఆరు గోల్డ్‌మెడల్స్ సాధించి వార్తల్లో నిలిచారు. » బెంగళూరు వర్సిటీ 49వ స్నాతకోత్సవంలో కర్ణాటక గవర్నర్ భరద్వాజ్ ఆరు గోల్డ్ మెడల్స్‌ను నూర్జహాన్‌కు ప్రదానం చేశారు. » నూర్జహాన్ తల్లిదండ్రులు నిరుపేదలు. తండ్రి మాంసం విక్రేత, తల్లి గృహిణి. |
మే - 21
|
¤ రిలయన్స్ ఇండస్ట్రిస్ అధిపతి ముకేష్ అంబానీ వరుసగా ఆరో ఏడాది కూడా తన వార్షిక వేతనంలో పెంపు కోరుకోలేదు. రూ.15 కోట్లకే పరిమితం అయ్యారు. అదే సమయంలో ఇతర కీలక ఉన్నతాధికారుల వేతనాల్లో మాత్రం పెరుగుదల కనిపించింది. » భారత్‌లోనే అత్యంత ధనవంతుడైన ముకేష్ అంబానీ 2008-09 నుంచి కంపెనీ చైర్మన్ హోదాలో వేతనం, ఇతర భత్యాలు, కమిషన్‌లను కలుపుకొని రూ.15 కోట్లు తీసుకుంటున్నారు. » వాటాదారుల అనుమతి ప్రకారం ముకేష్ రూ.38.86 కోట్ల వేతనం తీసుకునేందుకు అర్హత ఉంది. అయితే యాజమాన్య వేతన స్థాయులను మరీ పైకి తీసుకెళ్లడం మంచిది కాదనే అభిప్రాయాన్ని ప్రతిబింబిస్తూ రూ.15 కోట్లు మాత్రమే తీసుకుంటున్నారు. ¤ ఓ సంస్థ చేపట్టిన ఆస్తుల సర్వే ప్రకారం హాలీవుడ్, బాలీవుడ్ నటుల్లో అత్యంత ధనవంతుల జాబితాలో షారుక్‌ఖాన్ చోటు పొందాడు. » షారుఖ్‌ఖాన్ 600 మిలియన్ డాలర్లతో రెండో స్థానం పొంది, మన దేశం నుంచి ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక నటుడిగా నిలిచాడు. » జాబితాలో తొలిస్థానంలో హాలీవుడ్ హాస్యనటుడు జెర్రీ సీన్ ఫీల్డ్ నిలిచాడు. ఆయన ఆస్తి ఏకంగా 820 మిలియన్ డాలర్లు. » జాబితాలో వరుసగా మూడు, నాలుగు, అయిదు స్థానాల్లో టామ్‌క్రూజ్ (480 మిలియన్ డాలర్లు), టైలర్ పెర్రీ (450 మిలియన్ డాలర్లు), జానీ డెప్ (450 మిలియన్ డాలర్లు) ఉన్నారు. |
మే - 22
|
| ¤ నేషనల్ జియోగ్రాఫిక్ ఛానెల్ అమెరికాలో నిర్వహించిన 26వ వార్షిక క్విజ్ పోటీలో ప్రవాసాంధ్ర విద్యార్థి రేకులపల్లి అఖిల్ విజేతగా నిలిచాడు. అఖిల్ వర్జీనియా రాష్ట్రంలోని యాష్‌బర్న్ స్టోన్‌హిల్ మిడిల్ స్కూల్‌లో చదువుతున్నాడు. విజేతకు దాదాపు రూ.30 లక్షల కాలేజీ ఉపకార వేతనంతోపాటు గాలపోగాస్ దీవులకు విహార యాత్ర, నేషనల్ జియోగ్రాఫిక్ సంస్థలో జీవితకాల సభ్యత్వం బహుమతులుగా లభించాయి. అఖిల్ తండ్రి డాక్టర్ ప్రసాద్ కాకతీయ వైద్య కళాశాలలో చదివారు. |
మే - 23
|
| ¤ గుజరాత్ ప్రభుత్వంలో పనిచేస్తున్న బంట్రోతులు, డ్రైవర్ల కుమార్తెల చదువుల కోసం సంచిత నిధిని సృష్టించడానికి కాబోయే ప్రధానమంత్రి నరేంద్రమోడీ రూ.21 లక్షల విరాళం ఇచ్చారు. తాను సొంతంగా దాచుకున్న డబ్బుల్లోంచి ఈ మొత్తాన్ని ఇచ్చినట్లు ట్విట్టర్ సందేశంలో మోడీ వెల్లడించారు. » ఈ సంచిత నిధి నిర్వహణకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఒక ఫౌండేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. » గుజరాత్‌లో బాలికల విద్యను ప్రోత్సహించడానికి మోడీ గతంలో 'కన్యా కేలావని' కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రిగా తనకు లభించిన బహుమతులను వేలం వేసి రూ.89.96 కోట్లను సేకరించిన మోడీ ఆ మొత్తాన్ని కన్యా కేలావని నిధికి ఇచ్చారు. |
మే - 25
|
¤ రాష్ట్రానికి చెందిన మాలావత్ పూర్ణ, సాధనపల్లి ఆనంద్ కుమార్‌లు ప్రపంచంలోనే ఎత్త్తెన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి సరికొత్త చరిత్ర సృష్టించారు. శిఖరాగ్రంపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి భారత కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పారు. » 13 సంవత్సరాల 11 నెలల వయసున్న మాలావత్ పూర్ణ ఎవరెస్ట్‌ను అధిరోహించిన అతిపిన్న వయస్కురాలిగా ప్రపంచ రికార్డును తిరగరాసింది. ప్రభుత్వ విద్యా సంస్థల తరపున తొలిసారిగా ఈ ఘనత సాధించిన ఖ్యాతి కూడా వీరిదే. » విద్యార్థులను చదువుతో పాటు అన్ని రంగాల్లో తీర్చిదిద్దే లక్ష్యంతో గురుకుల విద్యాలయాల సంస్థ టెన్సింగ్ నార్కే అవార్డు గ్రహీత బి.శేఖర్‌బాబుతో పర్వతారోహణలో వీరికి శిక్షణ ఇప్పించింది. ఎవరెస్ట్ అధిరోహణకు అయ్యే రూ.68 లక్షలను ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికల నిధుల నుంచి ప్రభుత్వం కేటాయించింది. » గత ఏప్రిల్ 10న పూర్ణ, ఆనంద్‌ల యాత్ర మొదలైంది. తాజాగా వీరు 29,035 అడుగుల ఎత్త్తెన పర్వతం పైకి విజయవంతంగా చేరుకున్నారు. గతంలో పద్నాలుగేళ్ల నేపాలీ బాలిక పేరిట ఉన్న రికార్డును పూర్ణ తిరగరాసింది. అతిచిన్న వయసులో ఎవరెస్ట్ అధిరోహించిన బాలికగా రికార్డు సృష్టించింది. » ఆనంద్ కుమార్ సొంత ఊరు ఖమ్మం జిల్లా చర్ల మండలం కలివేరు కాగా, పూర్ణ స్వగ్రామం నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం పాకాల తండా. |
మే - 28
|
¤ ఇన్ఫోసిస్ బోర్డు సభ్యుడు, ప్రెసిడెంట్ బి.జి.శ్రీనివాస్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా జూన్ 10 నుంచి అమల్లోకి వస్తుంది.¤ ఫోర్బ్స్ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన 100 మంది మహిళల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో అయిదుగురు భారతీయులకు చోటు దక్కింది.
» పెప్సీకో అధిపతి ఇంద్రానూయి 13వ స్థానంలో, ఎస్‌బీఐ ఛైరపర్సన్ అరుంధతీ భట్టాచార్య 36వ స్థానంలో, ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ చందా కొచ్చర్ 43వ స్థానంలో, సిస్కో చీఫ్ టెక్నాలజీ, స్ట్రాటజీ ఆఫీసర్ పద్మశ్రీ వారియర్ 71వ స్థానంలో, బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా 82వ స్థానంలో నిలిచారు. » జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ జాబితాలో అగ్రస్థానాన్ని చేజిక్కించుకున్నారు. మొత్తం మీద 11 సార్లు ఫోర్బ్స్ ఈ జాబితాను విడుదల చేయగా 10 సార్లు అందులో ఆమె చోటు దక్కించుకున్నారు. అందులో 9 సార్లు తొలిస్థానంలోనే ఉండటం విశేషం. » ఏంజెలా మెర్కెల్ తర్వాత యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఛైర్ పర్సన్ జానెట్ యెలెన్ (2వ స్థానం), దాతృశీలి మిలిండా గేట్స్ (3), అమెరికా మాజీ మంత్రి హిల్లరీ క్లింటన్ (6), జనరల్ మోటార్స్ తొలి మహిళా సీఈఓ మేరీ బర్రా (7), అమెరికా తొలి పౌరురాలు మిషెల్లీ ఒబామా (8), ఫేస్‌బుక్ సీఓఓ షెరిల్ శాండ్ బర్గ్ (8)లు తొలి 10 స్థానాల్లో ఉన్నారు. ¤ ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్‌లో ప్రజలు అత్యధిక ఆసక్తి చూపే వందమంది వ్యక్తుల్లో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ ఉన్నారు. » వికీపీడియా పేజీలు, ఇతరత్రా ఆన్‌లైన్ వేదికల నుంచి సేకరించిన సమాచారంపై అధ్యయనం చేసి ప్రఖ్యాత టైమ్ పత్రిక ఈ జాబితాను రూపొందించింది. ఇందులో 23.88 పాయింట్లతో సచిన్ 68వ స్థానంలో, 22.07 పాయింట్లతో షారుఖ్ 88వ స్థానంలో నిలిచారు. » 65.6 పాయింట్లతో అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి బుష్ ప్రథమ స్థానంలో, ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా 45.3 పాయింట్లతో ద్వితీయ స్థానంలో నిలిచారు.¤ బీహార్‌కు చెందిన తపాలా బిళ్లల సేకరణ కర్త ప్రదీప్ జైన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై తనకున్న ప్రత్యేక అభిమానంతో రూపొందించిన నాలుగు రకాల తపాలా బిళ్లలు, ప్రత్యేక కవర్‌ను బీహార్ రాష్ట్ర తపాలా శాఖ ముద్రించింది. » 'మై స్టాంప్' సిరీస్‌లో భాగంగా వీటిని బీహార్ తపాలా శాఖ నరేంద్ర మోడీ బాధ్యతలు తీసుకున్న రోజునే (మే 26న) సిద్ధం చేసింది. |
మే - 30
|
¤ ఈ ఏడాది కూడా విశ్వవిఖ్యాత 'స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ' ఛాంపియన్‌షిప్‌ను భారత సంతతి విద్యార్థులే సొంతం చేసుకున్నారు. వరుసగా భారతీయులు ఈ బహుమతి సాధించడం ఇది ఏడోసారి. » ఈసారి ఇద్దరు భారత సంతతి విద్యార్థులు సంయుక్తంగా ఈ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుని రికార్డు సృష్టించారు. శ్రీరాం జె.హథ్‌వార్ (14), అన్‌సున్‌సుజో (13) ల మధ్య ఈ పోటీలో టై నెలకొనడంతో ఇద్దరూ విజేతలుగా నిలిచారు. » బహుమతి కింద ఇద్దరికీ చేరో 18 లక్షల రూపాయలు, ట్రోఫీ, ఇతర బహుమతులు లభించాయి. |
మే - 31
|
| ¤ యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ హెల్త్ సైన్స్ సెంటర్‌కు చెందిన భారత సంతతి ప్రొఫెసర్ అనిల్ కులకర్ణికి ప్రఖ్యాత ఫుల్ బ్రైట్-నెహ్రూ ఫెలోషిప్ లభించింది. » ఫుల్ బ్రైట్-నెహ్రూ ఫెలోషిప్ పొందిన అమెరికా ఫ్యాకల్టీ సభ్యులు, పరిశోధకులు, వృత్తి నిపుణులు భారత్‌లోని సంస్థల్లో బోధించడానికి అవకాశం కలుగుతుంది. |
|
|