నవంబరు - 1
|
¤ రోదసీలోకి పర్యాటకులను చేరవేసేందుకు ఉద్దేశించిన 'స్పేస్‌షిప్ టూ' వ్యోమనౌకను కాలిఫోర్నియాలోని మొజావీ ఎడారిలో ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నపుడు నేల కూలింది.
¤ సౌరశక్తిని ఉపయోగించి మరింత మెరుగ్గా విద్యుత్ ఉత్పత్తిని వాడుకోవడానికి సౌరకాంతిని ఒకేచోట కేంద్రీకరించే నానో రేణువు ఆధారిత పదార్థాన్ని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది గ్రహించే సూర్యరశ్మిలో 90 శాతాన్ని ఉష్ణంగా మార్చగలదు. ఈ వేడిని విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి వాడొచ్చు.
¤ అంతరిక్షరంగంలో చైనా మరో మైలురాయిని చేరుకుంది. చంద్రుడి మీదకు తమ వ్యోమగామిని పంపించి తిరిగి భూమిని చేరుకోవడానికి ఉద్దేశించిన యాత్రలో విజయం సాధించింది. ఈ ఘనతను సాధించిన మూడో దేశం చైనా.
» అక్టోబరు 24న చైనా ఈ ఆర్బిటార్‌ను లాంగ్‌మార్చ్ 3సీ రాకెట్ ద్వారా ప్రయోగించింది. ఈ ఆర్బిటార్ 8.4 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించి చంద్రుడిని చుట్టి చిత్రాలను తీసి, ఇన్నర్ మంగోలియా స్వయం ప్రతిపత్తి ప్రాంతంలోని సిజివాంగ్ బ్యానర్‌లో నేలకు దిగింది.
» చైనీస్ సోషల్ నెట్‌వర్క్‌లో ఈ ఆర్బిటార్‌ను 'జియావోఫెయ్' అని పిలుస్తున్నారు.
» 2017లో చంద్రుడి పైకి దిగే చాంగే-5 అనే వ్యోమనౌక కోసం అవసరమైన ఉష్ణ కవచం, మార్గం రూపకల్పన లాంటి వాటికోసం తాజా ఆర్బిటార్‌ను చైనా ఇంజినీర్లు పరీక్షించారు.
» చైనా తన తొలి వ్యోమగామిని 2003లో అంతరిక్షంలోకి పంపింది. దీంతో రష్యా, అమెరికా తర్వాత మానవ సహిత రోదసి యాత్ర చేపట్టిన మూడో దేశంగా రికార్డు సృష్టించింది.
» 2008లో షెంజౌ-7 వ్యోమనౌకలో రోదసీలోకి చేరిన వ్యోమగాములు ఆ దేశం తరఫున తొలి స్పేస్ వాక్‌ని నిర్వహించారు.
» చైనా తమ శాశ్వత అంతరిక్ష కేంద్రాన్ని 2022 నాటికి సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
|
నవంబరు - 2
|
¤ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన లేజర్ ఆధారిత ఆయుధ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించినట్లు చైనా ప్రకటించింది. ఇది ముఖ్యంగా తక్కువ ఎత్తులో ఎగిరే మానవ రహిత విమానాల (డ్రోన్లు) ను నేల కూల్చేందుకు ఉపయోగపడుతుందని తెలిపింది.
» రెండు కిలోమీటర్ల వ్యాసార్ధంలోని ప్రాంతంలో సంచరించే వివిధ రకాల చిన్నపాటి విమానాలను ఈ లేజర్ ఆయుధం కూల్చగలదని చైనా ప్రకటించింది.
¤ గుండెస్థితిని ఎప్పటికప్పుడు గమనించే ప్రత్యేక పరికరాన్ని భారత శాస్త్రవేత్త శ్రీనివాసన్ మురళీ అభివృద్ధి చేశారు. ఇది వైద్య, భావోద్వేగాల పరంగా హృదయ ఆరోగ్యం పై దృష్టి పెడుతుంది.
» ఈ పరికరం పేరు 'ది ఇన్నర్ యూ'. స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేసే స్మార్ట్ కార్డియాకు శ్రీనివాసన్ సీఈఓగా వ్యవహరిస్తున్నారు.
¤ భూమికి 2300 కాంతి సంవత్సరాల దూరంలో ఒక గ్రహాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని ద్రవ్యరాశి, సాంద్రత చాలా తక్కువగా ఉన్నాయి.
|
నవంబరు - 4
|
¤ భారత నావికా దళానికి చెందిన ఐఎన్ఎస్ సింధుకీర్తి జలాంతర్గామిని హిందుస్థాన్ షిప్‌యార్డు బిల్డింగ్ డాక్‌లో జల ప్రవేశం(ఫ్లోట్) చేశారు.
» ఎనిమిదేళ్ల నుంచి చేపడుతున్న ఈ జలాంతర్గామి పనులు పూర్తయ్యాయని, మరో అయిదారు నెలల్లో నౌకాదళానికి అప్పగిస్తామని షిప్‌యార్డు ప్రకటించింది.
¤ మన పాలపుంత(మిల్కీవే) గెలాక్సీ మధ్యలో ఉన్న 'జీ2' అనే ఓ భారీ ప్రకాశవంతమైన వస్తువుకు సంబంధించిన రహస్యం వీడింది.
» ఇది హైడ్రోజన్ వాయువులతో కూడిన భారీ మేఘాల సమూహమై ఉంటుందని కొందరు ఖగోళ శాస్త్రజ్ఞులు భావించేవారు. కాని, జంటగా ఉన్న రెండు నక్షత్రాలు ఒక దానితో ఒకటి కలిసిపోయి ఏర్పడిన భారీ నక్షత్రమే 'జీ2' అని తాజాగా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్మియా, లాస్ ఏంజెల్స్ శాస్త్రవేత్తలు తేల్చారు.
|
నవంబరు - 6
|
¤ యాంటీ బయోటిక్‌లకు తొలిసారిగా ప్రత్యామ్నాయ మందులను లండన్ శాస్త్రవేత్తలు రూపొందించారు. ఇది మందులను తట్టుకుని మొండి ఇన్‌ఫెక్షన్‌తో పోరాడటానికి తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు ప్రకటించారు.
» మెథిసిలిన్ - రెసిస్టెంట్ స్టాఫీ లోకోకస్ ఆరియస్ (ఎంఆర్ఎస్ఏ) అనే మొండి సూక్ష్మ క్రిములను కూడా కొత్త మందు సమర్థంగా నిర్మూలించినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.
|
నవంబరు - 8
|
¤ అక్టోబరులో అంగారకుడి వాతావరణాన్ని రాసుకుంటూ వెళ్లిన తోక చుక్క సైడింగ్ స్ప్రింగ్ అద్భుతమైన తారాజువ్వలాంటి వెలుగులను చిమ్మినట్లు నాసా శాస్త్రవేత్తలు తెలిపారు.
¤ భారత్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధ విమానం 'తేజస్ ప్రొటోటైప్ వెహికల్(పీవీ)-6' గగనతలంలో తొలిసారిగా ప్రయాణించింది. ఈ ప్రయోగం విజయవంతమైంది.
» తేజస్ యుద్ధ విమానాల్లో తుది రకం శిక్షణ విమానం అయిన రెండు సీట్ల తేజస్ పీవీ-6ను దిల్లీలోని గ్రూప్ కెప్టెన్‌లు వివర్త్ సింగ్, అనూప్ కబడ్వాల్ విజయవంతంగా నడిపారు.
» రెండు దశాబ్దాల కాలంలో మొత్తం 15 వెర్షన్ల తేజస్ విమానాలు 2,500 సార్లకు పైగా నింగికి ఎగరగా, ఇది చివరిదైన 16వ వెర్షన్‌కు చెందింది.
» అన్ని తేజస్ విమానాల్లోనూ ఉన్న ప్రధాన సాంకేతికతలను తేజస్ పీవీ-6లో పొందుపరిచారు. దీనిలో ఆధునిక కమ్యూనికేషన్, రాడార్ వ్యవస్థలు, ఈడబ్ల్యూ సెన్సర్లు, ఆటోమేటిక్ ల్యాండింగ్ కోసం కొత్త నేవిగేషన్ వ్యవస్థలు ఉన్నాయి.
» పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఓ యుద్ధ విమానాన్ని రూపొందించే లక్ష్యంతో 1983లో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) తేలికపాటి యుద్ధ విమానం తేజస్ కార్యక్రమాన్ని చేపట్టింది.
» తేజస్ విమానానికి ప్రాథమిక అనుమతి 2013లో లభించింది. ఈ శిక్షణ విమానం తయారీని త్వరలో ప్రారంభించనున్నారు.
|
నవంబరు - 9
|
¤ అణ్వస్త్ర సామర్ధ్యమున్న మధ్య శ్రేణి క్షిపణి అగ్ని-2ను భారత్ విజయవంతంగా ప్రయోగించింది.
» 2 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల ఈ అస్త్రాన్ని ఒడిశా తీరంలోని వీలర్ ఐలాండ్ నుంచి ప్రయోగించారు. వినియోగ పరీక్షలో భాగంగా సైన్యం దీన్ని నిర్వహించింది.
» అగ్ని-2 మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి (ఐఆర్‌బీఎం) తరగతి కిందికి వస్తుంది. దీన్ని హైదరాబాద్‌లోని డీఆర్‌డీవోకు చెందిన సిస్టమ్స్ లేబొరేటరీ (ఏఎస్ఎల్) అభివృద్ధి చేసింది. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) ఉత్పత్తి చేసింది. ఈ క్షిపణిని ఇప్పటికే సైన్యం అమ్ములపొదిలో ప్రవేశపెట్టారు.
¤ విప్లవాత్మక రీతిలో రెక్కల ఆకృతిని మార్చుకునే విమానాన్ని నాసా విజయవంతంగా పరీక్షించింది. దీంతో తేలికైన, నిశ్శబ్దంగా ప్రయాణించే, ఇంధనాన్ని పొదుపుగా వాడుకునే విమానాల రూపకల్పన దిశగా కీలక ముందడుగు పడింది.
» ఈ ప్రాజెక్టు పేరు అడాప్టివ్ కాంప్లియెంట్ ట్రైలింగ్ ఎడ్జ్ (ఏసీటీఈ). దీన్ని నాసా, అమెరికా వైమానిక దళ ప్రయోగశాల సంయుక్తంగా చేపట్టాయి.
» విమానంలో సంప్రదాయ అల్యూమినియం ఫ్లాప్స్‌ను తొలగించి ఆకృతిని మార్చుకునే విడిభాగాలను ఏర్పాటు చేశారు. వీటివల్ల ఏరోడైనమిక్ సామర్థ్యం మెరుగు పడటంతో పాటు టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో తలెత్తే భారీ ధ్వని తగ్గుతుందని పరిశోధకులు నిర్ధరించారు.
|
నవంబరు - 10
|
¤ 'శాన్ 5' అనే బ్రాండ్ పేరుతో పెంటా వాలెంట్ వ్యాక్సిన్‌ను శాంతా బయోటెక్నిక్స్ సంస్థ దేశీయ మార్కెట్లో విడుదల చేసింది.
» చిన్నపిల్లల్లో డిఫ్తీరియా, టెటనస్, పెర్టుసిస్, హిబ్, హెపటైటిస్ - బి వ్యాధులను నివారించేందుకు ఈ వ్యాక్సిన్‌ను వినియోగిస్తారు.
» ఈ వ్యాక్సిన్‌ను శాంతా బయోటెక్నిక్స్, దాని మాతృసంస్థ సనాఫి పాశ్చర్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.
» ఈ వ్యాక్సిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నుంచి 'ప్రీ - క్వాలిఫికేషన్' హోదా లభించింది. దీని వల్ల శాంతా బయోటెక్నిక్స్ 'శాన్5' పెంటా వాలెంట్ వ్యాక్సిన్‌ను 50 దేశాలకు సరఫరా చేయగలుగుతుంది.
» భారత్‌లో ఏటా జన్మిస్తున్న 2.7 కోట్ల మంది పిల్లల ఆరోగ్యాన్ని సంరక్షించడానికి ఈ వ్యాక్సిన్ దోహదపడుతుంది.
|
నవంబరు - 11
|
¤ ప్రాణాంతకంగా మారుతున్న టైఫాయిడ్ నుంచి రక్షణ కల్పించే ఓ జన్యు పరివర్తనాన్ని ఫ్రాన్స్ శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. ఈ జన్యువు టైఫాయిడ్ నుంచి అయిదంచెల రక్షణ కల్పిస్తుంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఏటా లక్షలాది మరణాలకు కారణమవుతున్న టైఫాయిడ్‌కు సమర్థమంతమైన వ్యాక్సిన్‌ను రూపొందించవచ్చని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
» ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం టైఫాయిడ్‌తో ఏటా 2 నుంచి 6 లక్షల మంది మృత్యువాత పడుతున్నారు.
» కలుషితమైన నీరు, ఆహారం తీసుకోవడం వల్ల సాల్మొనెల్లా టైఫీ, పారాటైఫీ బ్యాక్టీరియాలు శరీరంలోకి ప్రవేశించి టైఫాయిడ్‌కు కారణమవుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది.
¤ పర్యావరణంలోని యాంత్రిక ప్రకంపనాల నుంచి శక్తిని ఒడిసిపట్టడం ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేసే సరికొత్త విధానాన్ని ఫిన్లాండ్‌లోని వీఐటీ టెక్నికల్ రిసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
|
నవంబరు - 12
|
¤ గురుగ్రహం మీద ఎర్రగా కనిపించే 'గ్రేట్ రెడ్ స్పాట్' రహస్యం వీడింది. ఈ గ్రహం మబ్బుల కింద ఉండే రసాయనాల మూలంగా కాకుండా, సూర్య కాంతి ప్రభావాల వల్ల ఏర్పడుతున్నట్లు నాసా అధ్యయనం పేర్కొంది.
» నాసాకు చెందిన క్యాసినీ మిషన్ విశ్లేషణ ప్రకారం గురు గ్రహం మీద వాతావరణంలో సూర్యకాంతి ప్రభావంతో రసాయనాలు విడిపోవడం వల్ల ఈ మచ్చ ఏర్పడుతున్నట్లు వెల్లడైంది.
¤ ఆవు పాలలోని క్యాసిన్ అనే ప్రొటీన్‌ను హెచ్ఐవీ/ ఎయిడ్స్ చికిత్సలో వాడే యాంటీ రిట్రోవైరల్ మందుకు అంటుకునేలా చేయడంలో పరిశోధకులు విజయం సాధించారు. ఇది హెచ్ఐవీ/ ఎయిడ్స్‌తో బాధపడుతున్న శిశువులకు, పిల్లలకు మరింత సమర్ధంగా చికిత్స అందించడానికి ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
» హెచ్ఐవీ ఇన్‌ఫెక్షన్‌ను నిరోధించడానికి, చికిత్సకు ఎక్కువగా 'రిటోనావిర్' మందును వాడుతుంటారు. నీటిలో అంతగా కరగని ఈ మందు వల్ల దుష్ప్రభావాలతో పాటు దీన్ని నోటి ద్వారా తీసుకోవడంలో ఇబ్బందులున్నాయి. జీర్ణాశయ ద్రవాల్లో నెమ్మదిగా కరగడం వల్ల శరీరం మందును సరిగా గ్రహించలేదు.
» హెచ్ఐవీ బాధిత శిశువులకు ఇచ్చే ద్రవరూప ఔషధంలో 43% ఇథనాల్‌ను కలుపుతారు. ఇది చేదుగా, పుల్లగా, మండుతున్నట్లుగా ఉంటుంది. జీర్ణాశయంలోకి చేరుకున్నాక వికారం, వాంతి లాంటి సమస్యలు వస్తాయి. అందువల్ల రిటోనావిర్ మందును నీటిలో త్వరగా కరిగేలా చేసేందుకు పెన్సిల్వేనియా స్టేట్ విశ్వవిద్యాలయానికి చెందిన ఫెడెరికో హర్టే బృందం ఆవుపాలలోని క్యాసిన్స్ ప్రొటీన్లపై అధ్యయనం చేసింది. ఈ ప్రోటీన్లు తల్లి నుంచి శిశువులకు అమైనో ఆమ్లాలు, క్యాల్షియంను చేరవేస్తాయి. ఇవి రిటోనావిర్ మందు అణువులను సైతం మోసుకెళ్లగలవని గుర్తించింది. మందుకు అంటుకు పోయేలా అత్యధిక పీడన ప్రక్రియతో ఈ ప్రొటీన్లను మార్పు చేసింది
¤ ఖగోళ చరిత్రలో మరో అద్భుతఘట్టం అవిష్కృతమైంది.
» '67పీ/ చుర్యుమోవ్-గెరాసిమెంకో' అనే తోకచుక్కను వెంటాడుతూ పదేళ్లుగా అంతరిక్షంలో ప్రయాణించిన ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈసా)కు చెందిన రోసెట్టా వ్యోమనౌక ఫీలే ల్యాండర్‌ను తోకచుక్కపైకి జార విడిచింది.
» దీంతో ఓ తోక చుక్కపై తొలిసారిగా వ్యోమనౌకను దింపిన ఘనతను ఈసా సొంతం చేసుకుంది.
» తోక చుక్కలపై అధ్యయనం ద్వారా 450 కోట్ల ఏళ్ల కిందట సౌర కుటుంబం ఏర్పడినప్పుటి పరిస్థితులు గురించి తెలుసుకోవచ్చు. అందుకే సుమారు 160 కోట్ల డాలర్ల ఖర్చుతో ఈసా ఈ ప్రయోగం చేపట్టింది.
» ప్రతి ఆరున్నరేళ్లకోసారి సూర్యుడిని చుట్టి వస్తున్న '67పీ' తోక చుక్క సెకనుకు 18 కి.మీ. వేగంతో ప్రయాణిస్తూ 12 గంటలకోసారి తనచుట్టూ తాను తిరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆ తోకచుక్క సమీపంలోకి వెళ్లి, దాని చూట్టూ తిరుగుతూనే ల్యాండర్ దానిపై పడేలా జారవిడవటం అతి క్లిష్టమైన ప్రక్రియ.
|
నవంబరు - 13
|
¤ జే - 31 జెట్ ఫైటర్ విమానాన్ని చైనా సైన్యం తొలిసారిగా ప్రపంచానికి పరిచయం చేసింది. చైనా సైన్యం నిర్వహించిన సైనిక విన్యాసాల్లో ఇది తన విన్యాసాలతో అలరించింది.
» అమెరికా అత్యాధునిక జెట్‌ఫైటర్ ఎఫ్ - 35 కి ధీటుగా చైనా జే - 31 ని అభివృద్ధి చేసింది.
» రాడార్ నిఘాకు అందకుండా శత్రుసేనల లక్ష్యాలను ఛేదించడం దీని ప్రత్యేకత.
» చైనా సైన్యం దీనికి 'ఫాల్కన్ ఈగల్' అని పేరు పెట్టింది.
¤ భారత్‌లోని పలు నగరాలను లక్ష్యంగా చేసుకోగల అణుక్షిపణిని పాకిస్థాన్ విజయవంతంగా పరీక్షించింది.
» 1500 కి.మీ. దూరంలోని లక్ష్యాలను అవలీలగా ఛేదించగల ఈ క్షిపణికి అణు, సంప్రదాయ వార్‌హెడ్లను మోసుకెళ్లగల సామర్థ్యం ఉంది.
» హతాఫ్- 6 గా కూడా పిలిచే ఈ మధ్య శ్రేణి క్షిపణిని అరేబియా సముద్రం నుంచి పరీక్షించినట్లు పాక్ సైన్యం వెల్లడించింది.
¤ వేగంగా కదులుతున్న తోకచుక్క మీదకు మొదటిసారిగా 'ఫిలే' ల్యాండర్‌ను దింపి చరిత్ర సృష్టించిన యూరోపియన్ అంతరిక్ష సంస్థ ఈసా ఆ అంతరిక్ష వాహనం తీసిన తొలి ఫొటోను విడుదల చేసింది.
» 'ఫిలే' దానికి మూడు అడుగుల దూరంలోని రాళ్లతో కూడిన ఉపరితలానికి సంబంధించిన ఫొటోను తీసి భూమికి పంపించింది.
» మున్ముందు 'ఫిలే', రోసెట్టా అంతరిక్ష నౌకతో కలిసి 21 పరికరాల సాయంతో తోకచుక్కను విశ్లేషించే పనిలో నిమగ్నమవుతుంది. |
నవంబరు - 14
|
¤ అణ్వస్త్ర సామర్థ్యమున్న పృథ్వి - 2, ధనుష్ బాలిస్టిక్ క్షిపణులను భారత్ ఒడిశాలోని చాందీపుర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్‌రేంజ్ (ఐటీఆర్)లో విజయవంతంగా పరీక్షించింది.
|
నవంబరు - 15
|
¤ యావోగాన్-23 రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహ పరీక్షను చైనా విజయవంతంగా నిర్వహించింది.
» లాంగ్‌మార్చ్-2సీ రాకెట్ ద్వారా దీన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశ పెట్టింది.
» ప్రకృతి వనరులు, పంట దిగుబడుల అంచనా, శాస్త్ర పరిశోధనలు, వైపరీత్య ఉపశమన చర్యల్లో ఈ ఉపగ్రహం సేవలు ఉపయోగపడతాయి.
» సామాజిక, ఆర్థిక ప్రయోజనాల కోసం ఇలాంటి 120 ఉపగ్రహాలను ప్రయోగించనున్నట్లు చైనా ఇటీవలే ప్రకటించింది.
¤ బ్రిటన్‌కు చెందిన థాంప్సన్ అండ్ మోర్గాన్ సంస్థ టమ్‌టాటో పేరిట జన్యుమార్పిడి లేని సరికొత్త మొక్కను అభివృద్ధి చేసింది.
» ఈ మొక్క ఏకకాలంలో టమోటాలు, బంగాళాదుంపలను ఉత్పత్తి చేస్తుంది.
|
నవంబరు - 16
|
¤ ప్రమాదకరమైన ఎబోలా వైరస్‌తోపాటు ఇతర వ్యాధులను వేగంగా నిర్ధారించేందుకు అత్యంత సున్నితమైన ఒక బయోసెన్సర్‌ను ఆస్ట్రేలియా విద్యార్థుల బృందం రూపొందించింది. ఇందులో భారత సంతతికి చెందిన అనిరుధ్ బాలచందర్ కూడా ఉన్నారు.
» డీఎన్ఏ ఆధారిత ఈ నానో యంత్రం చాలా చిన్నగా ఉంటుంది. స్మార్ట్‌ఫోన్/ పోర్టబుల్ యంత్రంలో రక్తం నమూనా ఉంచడం ద్వారా వ్యాధి నిర్ధారణకు ఇది వీలు కల్పిస్తుంది. బ్యాక్టీరియా లేదా వైరస్‌కు సంబంధించిన నిర్దిష్ట డీఎన్ఏ పోగును తాకగానే అది లైట్‌లా వెలుగుతుందని పరిశోధకులు వెల్లడించారు.
» 'వ్యాధి ఉనికి గురించి శాస్త్రవేత్తలు, పరిశోధకులను వేగంగా అప్రమత్తం చేసే చవకైన విధానం ఇది' అని పరిశోధకులు వెల్లడించారు.
|
నవంబరు - 17
|
¤ దేశీయ పరిజ్ఞానంతో రూపొందిన ఆకాష్ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది.
» ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల ఈ అస్త్రాన్ని ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్)లో పరీక్షించారు. వైమానిక దళం ఈ ప్రయోగాన్ని చేపట్టింది.
» శత్రు విమానాలను కూల్చడానికి ఉపయోగపడే మధ్య శ్రేణి క్షిపణి ఆకాష్. ఇది 25 కి.మీ. దూరంలోని లక్ష్యాలను తాకగలదు. 60 కిలోల వార్‌హెడ్‌ను మోసుకెళ్లగలదు. ఏకకాలంలో అనేక లక్ష్యాలను పరిశీలిస్తూ, వాటిపై దాడి చేయగల సామర్థ్యం ఈ వ్యవస్థకు ఉంది. యుద్ధ విమానాలతోపాటు క్రూయిజ్ క్షిపణులు, ఆకాశం నుంచి ఉపరితలం లోకి ప్రయోగించే క్షిపణుల లాంటి వాటిని కూడా ఇది నేలకూలుస్తుంది.
» ఆకాష్‌ను ఇప్పటికే వైమానిక దళం తన అమ్ముల పొదిలో చేర్చింది. సైన్యానికి సంబంధించిన వెర్షన్ కూడా త్వరలోనే సిద్ధం కానుంది.
¤ అణ్వస్త్రాన్ని మోసుకేళ్లే సామర్థ్యం ఉన్న షహీన్ - 1ఎ క్షిపణిని పాకిస్థాన్ విజయవంతంగా పరీక్షించింది. ఇది 900 కి.మీ. దూరంలోని లక్ష్యాలను తాకగలదు. దీని పరిధిలోకి భారత్‌కు చెందిన అనేక నగరాలు వస్తాయి.
» షహీన్ - 1ఎ ను హతాఫ్ 4 అని కూడా పిలుస్తారు. |
నవంబరు - 18
|
¤ ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల, దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన ఆకాష్ క్షిపణిని భారత్ వరుసగా రెండోరోజు కూడా దిగ్విజయంగా పరీక్షించింది.
» ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించారు.
|
నవంబరు - 21
|
¤ భారత్ చేపట్టిన 'మంగళ్‌యాన్'ను 2014 సంవత్సరపు అత్యుత్తమ ఆవిష్కరణగా టైమ్ పత్రిక అభివర్ణించింది. అలాగే సాంకేతిక అద్భుతంగా కూడా పేర్కొంది.
» 'తొలి యత్నం లోనే అంగారక కక్ష్యలోకి చేరుకోవడం అనితర సాధ్యమైన విషయం. దీన్ని అమెరికా చేయలేకపోయింది. రష్యా కానీ, ఐరోపా దేశాలు కానీ సాధించలేకపోయాయి. అయితే 2014 సెప్టెంబరు 24న భారత్ దీన్ని సుసాధ్యం చేసింది. ఇప్పటి వరకు ఏ ఆసియా దేశం సాధించని అద్భుతం' అని టైమ్ పేర్కొంది.
» మంగళ్‌యాన్‌ను 'సూపర్ స్మార్ట్ వ్యోమనౌక'గా టైమ్ అభివర్ణించింది. 2014లో సాధించిన 25 అత్యుత్తమ ఆవిష్కరణల్లో మంగళ్‌యాన్ ఒకటని తెలిపింది. ఇందులో మంగళ్‌యాన్‌తో పాటు ఇద్దరు భారతీయులు సాధించిన రెండు అద్భుత ఆవిష్కరణలు ఉన్నాయి. ఒంటరిగా ఉండే ఖైదీకి జైలు సెల్‌లోనే ఆహ్లాదకర వాతావరణం మధ్య ఉన్నట్లనిపించే 'బ్లూరూమ్' (నీలి వర్ణపు గది)ని సృష్టించిన నళినీ నడకర్ణి, పిల్లలను మైమరపింపజేసే 'ఓస్మో' అనే ట్యాబ్లెట్ బొమ్మను తయారు చేసిన ప్రమోద్ శర్మ ఆవిష్కరణలను టైమ్ ప్రశంసించింది.
¤ ఆలివ్ నూనెను క్రమం తప్పకుండా తీసుకుంటే గుండె జబ్బుల ముప్పు తగ్గుతుందని గ్లాస్గో, లిస్బన్ విశ్వివిద్యాలయాలు, జర్మనీలోని మొజాయిక్స్ డయాగ్నస్టిక్స్ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో తేలింది. |
నవంబరు - 24
|
¤ ధ్వనులను విశ్లేషించి, వాటికి స్పందించే తీరు కుక్కల్లో కూడా మనుషుల్లానే ఉంటుందని హంగేరి శాస్త్రవేత్తలు వెల్లడించారు. పరిసరాల్లోని శబ్దాలకు శునకాలు ఎలా స్పందిస్తున్నాయి? వాటి మెదళ్లలో ఏయే శబ్దాలకు ఎలాంటి స్పందనలు కలుగుతున్నాయి? అనే కోణాల్లో వారు పరిశోధించారు.
» వీరి పరిశోధనల్లో శునకాల్లో కూడా మనుషుల్లో మాదిరిగానే మెదడులోని 'ప్రైమరీ ఆడిటరీ కార్టెక్స్' భాగం స్పందిస్తోందని గుర్తించారు. |
నవంబరు - 26
|
¤ అమెరికాకు చెందిన విమానాల తయారీ కంపెనీ బోయింగ్ భారత్‌కు ఆరో 'పీ-8ఐ' సముద్ర గస్తీ విమానాన్ని అప్పగించింది.
» 2009లో కుదిరిన ఒప్పందం ప్రకారం ఆ కంపెనీ 8 విమానాలను అందజేయాల్సి ఉంది.
» తమిళనాడు సమీపంలోని నేవీకి చెందిన రాజాలి స్థావరానికి ఈ ఆరో విమానం చేరుకుంది.
» మిగిలిన రెండు విమానాలు వచ్చే ఏడాది అందనున్నాయి.
¤ త్రీడీ ముద్రణ పరిజ్ఞానాన్ని ఉపయోగించి భార రహిత స్థితిలో తొలిసారిగా ఒక వస్తువును అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్తలు రూపొందించారు. కక్ష్యలో తిరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఈ ఘనత సాధించారు.
» దీంతో దీర్ఘకాల అంతరిక్ష యాత్రల దిశగా కీలక ముందడగు పడింది. ఈ త్రీడీ ప్రింటర్ వల్ల భూమి నుంచి వివిధ వస్తువులను తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండానే అంతరిక్షంలోనే అప్పటికప్పుడు తయారు చేసుకునే వీలు కలిగింది.
|
నవంబరు - 27
|
¤ ఎబోలా వైరస్‌ను నివారించడానికి ప్రయోగాత్మకంగా రూపొందించిన 'ఎన్ఐఏఐడీ/జీఎస్‌కే ఎబోలా టీకా' సురక్షితంగా పని చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు.
» మనుషులపై ప్రయోగ పరీక్షల్లో భాగంగా దీన్ని 20 మందికి ఇవ్వగా, టీకాను బాగా తట్టుకున్నట్లు, అందరిలోనూ రోగ నిరోధక వ్యవస్థ ప్రతిస్పందనలు ఉత్పత్తి అయినట్లు వెల్లడైంది. అమెరికాలోని మేరీ ల్యాండ్‌లో ఉన్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌లో 18-50 ఏళ్ల వారిపై ఎబోలా టీకా ప్రయోగ పరీక్షను నిర్వహించారు. నాలుగు వారాల్లో వారిలో యాంటీ-ఎబోలా యాంటీబాడీలు పుట్టుకొచ్చినట్లు తేలింది.
» నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌కు చెందిన ఎన్ఐఏఐడీ టీకా పరిశోధన కేంద్రం, గ్లాక్సో స్మిత్ క్లైన్ పరిశోధకులు సమష్టిగా రెండు ఎబోలా వైరస్ జాతుల నుంచి సేకరించిన వైరస్ జన్యు పదార్థ భాగాలతో ఈ టీకాను రూపొందించారు.
¤ భూమికి 11,600 కి.మీ. ఎత్తులో ఒక అదృశ్య కవచాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. సౌర తుపాన్ల సమయంలో వ్యోమగాములు, ఉపగ్రహాలకు హాని కలిగించే ప్రమాదకర ఎలక్ట్రాన్లను ఇది అడ్డుకుంటుందని తెలిపారు. వాన్ అలెన్ రేడియోధార్మిక వలయాల్లో దీన్ని గుర్తించారు.
» రోదసీ నుంచి అత్యంత వేగంగా వస్తున్న ఎలక్ట్రాన్లు మరింత ముందుకెళ్లి భూ వాతావారణంలోకి ప్రవేశించకుండా ఒక గాజు గోడలా ఈ కవచం అడ్డుపడుతోందని చెప్పారు.
|
నవంబరు - 29
|
¤ మెదడులోని 'ఎ-3 గ్రాహకం'ను ఉత్తేజితం చేయడం ద్వారా నొప్పుల నుంచి ఉపశమనం కలిగించ వచ్చని అమెరికాలోని సెయింట్ లూయిస్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. ప్రయోగశాలలో ఎలుకలపై నిర్వహించిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది.
» 'ఎ-3 గ్రాహకం' ఉత్తేజితమవడానికి సహజమైన అడెనోసిన్ పరమాణువును లేదా దానికి సమానమైన కృత్రిమ మందును చిన్నమోతాదులో వాడొచ్చని వారు పేర్కొన్నారు. |
నవంబరు - 30
|
¤ మానవ, ఆహార వ్యర్థాలతో తయారు చేసిన ఇంధనంతో నడిచే బస్సును తొలిసారిగా బ్రిటన్‌లోని బ్రిస్టన్, బేధ్‌ల మధ్య ప్రారంభించారు. దీనిలో 40 మంది ప్రయాణించవచ్చు.
» సాధారణ డీజిల్‌తో పనిచేసే ఇంజిన్ల నుంచి వెలువడే కాలుష్యంతో పోలిస్తే ఇది చాలా తక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తుంది.
» బ్రిస్టన్‌లోని 'జెన్ఎకో' సంస్థ మానవ, ఆహార పదార్థాల వ్యర్థాలతో బయోమీథేన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆ వాయువునే దీనికి ఇంధనంగా వాడుతున్నారు.
¤ నీటిని వాడాల్సిన అవసరం లేని చర్మ శుద్ధి ప్రక్రియను 'సెంట్రల్ లెదర్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్' (సీఎల్ఆర్ఐ) కనుక్కుంది. నీటి వినియోగంతో నిమిత్తం లేకుండా, హానికారక రసాయనాల వాడకం అవసరం లేకుండా, సులువుగా శుద్ధి చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని సీఎల్ఆర్ఐ రూపొందించింది. ఇలా నీటిని ఉపయోగించకుండా క్రోమియం సల్ఫేటుతో శుద్ధి చేసే ఈ ప్రక్రియ వల్ల సమయం కూడా కలిసి వస్తుంది.
|
|
|