అక్టోబరు - 1
|
¤ భారత సంతతి ప్రజలు (పీఐఓ - పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్) తమ మాతృభూమిని సందర్శించడానికి ఇకపై జీవితకాల వీసా తీసుకోవచ్చు. కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఈ విషయాన్ని ప్రకటిస్తూ గెజిట్ ప్రకటన వెలువరించింది. » ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో మాడిసన్ స్క్వేర్ గార్డెన్ వద్ద భారత ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్నపుడు శాశ్వత వీసాపై హామీ ఇచ్చారు. తక్షణమే దీనిపై కార్యాచరణ మొదలైంది. » పీఐఓ కార్డు ఉన్నవారు భారత దేశంలో ఎంత కాలం ఉన్నా పోలీసుల వద్దకు వెళ్లి సంతకం చేయాల్సిన అవసరం నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. » 2014 సెప్టెంబరు 30వ తేదీ కంటే ముందు జారీ అయిన పీఐఓ కార్డులు జీవితకాలం పాటు చెల్లుబాటులో ఉండేలా పరిగణిస్తారు. చెల్లుబాటులో ఉన్న పాస్‌పోర్టు వారి వద్ద ఉంటే చాలు. » గతంలో పీఐఓ కార్డుదారులకు భారత్‌లో వీసా అవసరంలేని ప్రవేశాన్ని కేవలం 15 ఏళ్లపాటు కల్పించేవారు. తర్వాత కావాలనుకుంటే పదేళ్ల చొప్పున దానిని పొడిగించేవారు. భారత్‌లో వారు 180 రోజుల కంటే ఎక్కువ కాలం బస చేయాలంటే విదేశీయుల నమోదు కార్యాలయంలో నమోదు చేసుకోవాల్సి వచ్చేది. దీన్ని తొలగిస్తామని ప్రధాని న్యూయార్క్‌లో ప్రకటించారు. » 2010 వరకు 52,264 మంది పీఐఓ కార్డులు తీసుకున్నారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్, శ్రీలంక, భూటాన్, నేపాల్ , చైనా జాతీయులకు మాత్రం ఈ కార్డులు జారీ చేయరు.¤ పార్లమెంటుపై దాడి కేసులో దోషి అఫ్జల్ గురుకు ఉరిశిక్ష అమలు చేసిన వివరాలను బహిర్గతం చేయాలని కేంద్ర సమాచార కమిషన్ తీహార్ జైలు అధికారులను ఆదేశించింది. ఉరిశిక్ష అమలుపై ఆయన కుటుంబ సభ్యులకు అందించిన సమాచారానికి సంబంధించిన వివరాలను కూడా బహిర్గతం చేయాలని పేర్కొంది. » భారత పార్లమెంటుపై 2001 డిసెంబరులో జరిగిన తీవ్రవాద దాడిలో 34 సంవత్సరాల మహ్మద్ అఫ్జల్ గురు పాత్రను నిర్ధరించి 2013 ఫిబ్రవరి 9న ఉరి తీశారు. » అఫ్జల్ గురు ఉరిశిక్ష వివరాల కోసం దరఖాస్తు చేసిన ఆర్టీఐ దరఖాస్తుదారుడు పరాస్‌నాథ్ సింగ్‌కు ఆ వివరాలను అందించాలని కమిషన్ ఆదేశించింది.¤ ఎన్నికలపై ప్రజల్లో అవగాహనను పెంచేందుకు ఎన్నికల కమిషన్ ఓ వినూత్న ప్రయత్నం చేసింది. 'గెట్ సెట్ ఓట్' పేరుతో ఒక వీడియో గేమ్‌ను ఆవిష్కరించింది. ప్రజాస్వామ్యం, ఎన్నికల ప్రక్రియపై అన్ని వయసుల వారికి అవగాహన కల్పించడం దీని ఉద్దేశం. » ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) - భారత విభాగంతో కలిసి ప్రభుత్వం దీన్ని రూపొందించింది. » ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్ www.eci.nic.in లో ఈ వీడియో గేమ్‌ను ఆడొచ్చు.¤ ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ సమీపంలో లూప్ లైన్‌లో మలుపు తిరుగుతున్న రైలును వేగంగా వస్తున్న మరో రైలు ఢీకొన్న ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. » గోరఖ్‌పూర్‌కు 7 కి.మీ. దూరంలోని నందనగర్ రైల్వే క్రాసింగ్ వద్ద లక్నో-బరౌనీ ఎక్స్‌ప్రెస్ మలుపు తిరుగుతుండగా పక్క నుంచి వచ్చిన మదువాదీ - లక్నో కృషక్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొంది.
|
అక్టోబరు - 2
|
¤ పారిశుద్ధ్య పథకం 'స్వచ్ఛ భారత్'ను గాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ న్యూఢిల్లీలో ప్రారంభించారు.ముఖ్యాంశాలు » స్వచ్ఛ భారత్ అమలుకు అయ్యే మొత్తం వ్యయం రూ.62,009 కోట్లు కాగా, కేంద్ర ప్రభుత్వం రూ.14,623 కోట్లను అందజేయనుంది. » ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 4,041 పట్టణాల్లో అయిదేళ్లపాటు వివిధ కార్యక్రమాలను చేపట్టనున్నారు. » అనారోగ్యం కారణంగా పనిచేయలేక ప్రతి భారతీయుడు ఏటా సగటున రూ.6,500 ను నష్టపోతున్నట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిందన్నారు. » గ్రామీణ ప్రాంతాల పారిశుద్ధ్యానికి సంబంధించి ఇప్పటికే ఉన్న 'నిర్మల్ భారత్ అభియాన్'ను స్వచ్ఛ భారత్‌లో కలిపివేయాలని కేంద్ర మంత్రివర్గం ఇటీవల నిర్ణయించింది. » ప్రధాని ప్రారంభించిన 'స్వచ్ఛ భారత్' కార్యక్రమం కింద దేశంలోని 2.47 లక్షల గ్రామ పంచాయతీలకు ఏటా రూ.20 లక్షలు చొప్పున అందుతాయి. » ఢిల్లీలోని వాల్మీకి బస్తీలో మోదీ స్వయంగా చీపురు పట్టి ఊడ్చారు. » ప్రధాని ప్రజలందరితో భారత్‌ను పరిశుభ్రంగా ఉంచుతామని ప్రతిజ్ఞ చేయించారు. బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. » స్వచ్ఛభారత్ ప్రచారానికి ప్రధాని మోదీ తొమ్మిది మంది ప్రముఖులను ఆహ్వానించారు. వీరిలో సచిన్ టెండూల్కర్, శశి థరూర్, అనిల్ అంబానీ, సల్మాన్ ఖాన్, ప్రియాంక చోప్రా, కమల్ హాసన్, బాబా రాందేవ్, గోవా గవర్నర్ మృదులా సిన్హాతోపాటు టీవీ సీరియల్ 'తారక్ మెహ్తా కా ఉల్టా చష్మా' బృందం ఉన్నారు. వీరిలో ప్రతి ఒక్కరూ మరో తొమ్మిది మందిని ఈ ప్రచార కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని ప్రధాని సవాల్ విసిరారు. ఆవిధంగా కొత్తగా వచ్చేవారు తమ వంతు బాధ్యతగా తొమ్మిది మందిని తీసుకురావాలని, ఈ విధంగా ఇది కొనసాగుతూనే ఉండాలని పేర్కొన్నారు. » దేశ జనాభా 125 కోట్లలో దాదాపు 72.2% మంది గ్రామాల్లోనే ఉంటున్నారు. మొత్తం గ్రామాల్లోని 16.78 కోట్ల గృహ సముదాయాల్లో కేవలం 5.48 కోట్ల ఇళ్లకే మరుగుదొడ్ల సదుపాయం ఉంది. దీనర్థం 67.3% గ్రామీణ నివాసాల్లో ఇప్పటికీ మరుగుదొడ్లు లేవు. ఇది చాలా బాధాకర విషయం అని, దీని వల్ల ప్రజారోగ్యం క్షీణిస్తుందన్నారు. » దేశంలో పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరచడానికి 1986లోనే కేంద్ర గ్రామీణ పారిశుద్ధ్య పథకం (సీఆర్ఎస్‌పీ) ఆరంభించారు. తర్వాత 1999లో సంపూర్ణ పారిశుద్ధ్య పథకం (టీఎస్‌సీ), నిర్మల్ గ్రామ్ పురస్కార్ పథకం మొదలు పెట్టారు. బహిరంగ విసర్జనను 2017 నాటికి పూర్తిగా మాన్పించాలనేది వీటి లక్ష్యం. » భారతదేశంలోనే అత్యంత విజయవంతమైన, అనుసరణీయమైన విధానాలతో స్వచ్ఛభారత్ లక్ష్యాన్ని పశ్చిమబెంగాల్‌లోని మిడ్నపూర్ జిల్లా దశాబ్దం కిందటే సాధించింది. 'సుస్వాగతం... మా గ్రామంలో ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి ఉంది. బహిరంగ మల విసర్జన లేదు' అని సాధికారతతో గ్రామాలకు స్వాగత బోర్డులను ఏర్పాటు చేసుకున్న ఘన చరిత్ర మిడ్నపూర్ జిల్లాది. దాదాపు 50 అభివృద్ధి చెందుతున్న దేశాలకు అక్కడి విధానం ఆదర్శంగా నిలిచింది. వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణ లక్ష్యానికి 1999లో శ్రీకారం చుట్టి 2004 నాటికి సాధించింది. » స్వచ్ఛ భారత్ ప్రచారానికి గాంధీజీ కళ్లద్దాలతో వినూత్నమైన లోగోను రూపొందించిన మహారాష్ట్రకు చెందిన అనంత్‌ను ప్రధాని అభినందించారు. » 'ఏక్ కదమ్ స్వచ్ఛతా కీ ఓర్' (స్వచ్ఛత వైపు ఒక ముందడుగు) అనే నినాదానికి రూపకల్పన చేసిన గుజరాత్‌కు చెందిన భాగ్యశ్రీకి ప్రధాని అభినందనలు తెలిపారు.¤ వన్య మృగాలు, పర్యావరణంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా నిర్వహించిన 'వైల్డ్ లైఫ్ క్విజ్'లో కేరళలోని తిరువనంతపురంలో ఉన్న లికోల్ చెమ్నక పాఠశాల అగ్రస్థానంలో నిలిచింది. » జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ క్విజ్‌లో దేశవ్యాప్తంగా 30 పట్టణాల నుంచి వచ్చిన పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. » డిస్కవరీ కిడ్స్, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ - ఇండియా సంయుక్తంగా ఈ క్విజ్‌ను నిర్వహించాయి. » చెన్నైకి చెందిన విద్యానికేతన్ పాఠశాల, ఢిల్లీకి చెందిన అర్వాచిన్ ఇంటర్నేషనల్ పాఠశాలలు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.¤ జాతిపిత మహాత్మాగాంధీ 145వ జయంతి సందర్భంగా యావత్ జాతి ఆయనకు ఘనంగా నివాళి అర్పించింది. » ఢిల్లీలోని మహాత్మాగాంధీ సమాధి 'రాజ్‌ఘాట్' వద్ద ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తదితరులు నివాళులు అర్పించారు.¤ మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి 110వ జయంతి సందర్భంగా జాతి ఆయనకు ఘనంగా నివాళి అర్పించింది. » ఢిల్లీలోని ఆయన సమాధి 'విజయ్ ఘాట్' వద్ద ఉపరాష్ట్రపతి, ప్రధాని, లోక్‌సభ స్పీకర్ తదితరులు నివాళులు అర్పించారు.¤ కర్ణాటక సచివాలయం 'విధాన సౌధ' వద్ద ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ భారీ కాంస్య విగ్రహాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆవిష్కరించారు. » 13 అడుగుల పీఠంతో కలిపి 27 అడుగుల ఎత్తయిన ఈ విగ్రహాన్ని ప్రఖ్యాత శిల్పి రామ్‌వన్‌జీ సుతార్ రూపొందించారు. » గాంధీజీ 145వ జయంతిని పురస్కరించుకుని ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
|
అక్టోబరు - 3
|
¤ ప్రధాని నరేంద్ర మోదీ ఆలిండియా రేడియోలో తొలిసారిగా 'మన్‌కీ బాత్' పేరుతో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. » 15 నిమిషాలపాటు సాగిన ఈ కార్యక్రమం దసరా రోజున ప్రసారమైంది. » ప్రజలు నైరాశ్యాన్ని పారదోలి, తమ శక్తిని గుర్తించాలని, నైపుణ్యాలను దేశ సౌభాగ్యానికి వెచ్చించాలని మోదీ తన ప్రసంగంలో కోరారు. జాతిపిత మహాత్మా గాంధీకి నివాళిగా ఖాదీ దుస్తులు ధరించాలని విజ్ఞప్తి చేశారు. దేశాన్ని పరిశుభ్రం చేయడానికి చేపట్టిన 'స్వచ్ఛ భారత్'తో దేశంలో వెల్లువెత్తిన ఉత్సాహాన్ని ఆ కార్యక్రమం విజయవంతం అయ్యేంత వరకూ కొనసాగించాలని మోదీ పిలుపును ఇచ్చారు.¤ బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్‌లో దసరా ఉత్సవాల ముగింపు సమయంలో జరిగిన తొక్కిసలాటలో 33 మంది మరణించారు. » రావణ దహనం తర్వాత ప్రజలు తిరిగి వెళ్లే సమయంలో తోపులాట జరిగి తొక్కిసలాటకు దారితీసింది.¤ దసరా ఉత్సవాల్లో భాగంగా విజయ దశమి రోజున మైసూరులో నిర్వహించిన జంబూ సవారీలో తెలంగాణ శకటానికి ప్రథమ బహుమతి లభించింది. » కర్ణాటకేతర విభాగంలో తెలంగాణ రాష్ట్రం నుంచి పాల్గొన్న ఆలంపూర్ జోగులాంబ శక్తి పీఠం శకటం ప్రథమ బహుమతికి ఎంపికైంది. » కర్ణాటక నుంచి పాల్గొన్న శకటాల్లో మైసూరు విభాగంలో మైసూరు, హాసన్; బెంగళూరు - తుమకూరు, శివమొగ్గ; గుల్బర్గా - బళ్లారి, కొప్పళ; బెళగావి - గదగ్, బాగల్ కోట జిల్లాల శకటాలకు వరుసగా ప్రథమ, ద్వితీయ బహుమతులు లభించాయి.
|
అక్టోబరు - 5
|
¤ రాబోయే దశాబ్ద కాలంలో సంపూర్ణ మద్య నిషేధం దిశగా వెళ్లాలని భావిస్తున్న కేరళ ప్రభుత్వం ఇకపై ఆదివారాల్లో మద్యం విక్రయాలను నిలిపివేయాలని నిర్ణయించింది. బార్లతో సహా విక్రయ కేంద్రాలన్నింటినీ మూసివేసే ఈ కార్యక్రమం అమల్లోకి వచ్చింది. » ప్రభుత్వ మద్యం అమ్మకాల సంస్థ ఆధీనంలోని 400 దుకాణాలు కూడా మూతపడ్డాయి. అయిదు నక్షత్రాల విభాగంలో మినహా ఇతర హోటళ్లకు అనుబంధంగా ఉన్న బార్లను, ఏటా 10% చొప్పున మద్యం దుకాణాలను మూసివేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. » పొగతాగేవాళ్లకు ఇకపై ఉద్యోగాలు ఇవ్వకూడదని రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగం కావాలంటే ధూమపానాన్ని, ఇతర పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని వదులుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. » తమ కమాండోల జీవన నాణ్యతను పెంచాలని, 2014ను కమాండోల ఏడాదిగా ప్రకటించాలని జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్‌జీ) నిర్ణయించింది.
|
అక్టోబరు - 6
|
¤ దేశవ్యాప్తంగా ముస్లింలు ఈద్ ఉల్ జుహా (బక్రీద్) ను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు.¤ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆయన మంత్రివర్గ సహచరులు తమ ఆస్తుల వివరాలను వెల్లడించారు. » ప్రధాని ఆస్తుల విలువ రూ.1.26 కోట్లు. » 22 మంది కేబినెట్ మంత్రుల్లో ప్రధాని మోదీ సహా 17 మంది కోటీశ్వరులు. » రక్షణ, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ రూ.72.10 కోట్ల ఆస్తులతో మంత్రులందరిలో సంపన్నుడిగా నిలిచారు. » మంత్రులందరిలోనూ తక్కువ ఆస్తులున్నది వెంకయ్యనాయుడుకే. ఆయన ఆస్తుల విలువ కేవలం రూ.20.45 లక్షలే. » మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి మేనకా సంజయ్ గాంధీ ఆస్తుల విలువ రూ.37.68 కోట్లు. » మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి నజ్మా హెప్తుల్లా ఆస్తుల విలువ రూ.29.70 కోట్లు.
|
అక్టోబరు - 7
|
¤ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కారాగార శిక్ష అనుభవిస్తున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలితకు బెయిల్ మంజూరు చేసేందుకు కర్ణాటక హైకోర్టు నిరాకరించింది. ఆమెకు పడిన నాలుగేళ్ల శిక్షను సస్పెండ్ చేసేందుకు తిరస్కరించింది. » న్యాయమూర్తి జస్టిస్ ఎ.ఎస్.చంద్రశేఖర్ ఆధ్వర్యంలోని ఏకసభ్య ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. » జయలలిత తరఫున ప్రముఖ న్యాయవాది రాంజఠ్మలానీ వాదించారు. |
అక్టోబరు - 8
|
¤ అతి తక్కువ ఖర్చుతో వైద్య పరీక్షలు జరిపి, ఫలితాలను క్షణాల్లో వెల్లడించే సరికొత్త మొబైల్ సేవలను పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ అందుబాటులోకి తెచ్చింది. » 'స్వాస్థ్య స్లేట్'గా పిలిచే ఈ పరికరంతో రూ.72కే 33 విలువైన వైద్య పరీక్షలు అందిస్తారు. మారుమూల గ్రామాల్లోనూ ఈ సేవలను వినియోగించుకోవచ్చు. » ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్‌లోని ఆరు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా దీన్ని ఉపయోగిస్తున్నారు. దీని ద్వారా జరిపే పరీక్షల్లోని కచ్చితత్వాన్ని ఎయిమ్స్ పరిశీలిస్తోంది. » 'స్వాస్థ్య స్లేట్' అనేది బ్లూటూత్‌తో పనిచేసే ఒక వైద్య పరీక్షల కిట్. ఇది ఆండ్రాయిడ్ ఆధారిత ఫోన్‌తో పనిచేస్తుంది. ఇందుకోసం రూపొందించిన ప్రత్యేక అప్లికేషన్ల ఆధారంగా ఇది పరీక్షలు నిర్వహిస్తుంది. పరీక్షలకు వచ్చిన ప్రతి రోగి వైద్య చరిత్ర, అతడి ఆరోగ్య లక్షణాలను అంచనా వేయడంతోపాటు అక్కడికక్కడే పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తుంది. రోగి ఫొటోతో పాటు అతడి వైద్య పరీక్షల వివరాలన్నీ ముఖ్య డేటా సెంటర్‌లో స్టోర్ కావడం వల్ల విధానాల రూపకల్పనకు ప్రభుత్వాలకు ఎంతో ఉపయోగకరం కానుంది. » డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్‌కు చెందిన డాక్టర్ కనవ్ కహోల్ దీన్ని రూపొందించారు. » అమెరికాకు చెందిన వాల్‌స్ట్రీట్ జర్నల్ స్వాస్థ్య స్లేట్‌ను 'సిక్స్త్ మోస్ట్ ఎఫెక్టివ్ ఇన్నోవేషన్'గా అభివర్ణించింది.
|
అక్టోబరు - 10
|
¤ బెంగళూరుకు చెందిన ఓ మహిళా వాస్తు శిల్పిపై ప్రత్యేక నిఘా (స్నూపింగ్) పెట్టారన్న వివాదంపై విచారణ చేసేందుకు గుజరాత్ ప్రభుత్వం నియమించిన జస్టిస్ సుగ్నయ భట్ కమిషన్‌ను గుజరాత్ రాష్ట్ర హైకోర్టు రద్దు చేసింది. బాధితురాలి తండ్రి అభ్యర్థన పై విచారించిన జస్టిస్ పరేష్ ఉపాధ్యాయ్ ఈ మేరకు తీర్పు వెలువరించారు. » స్పూప్ గేట్ వివాదాన్ని విచారించేందుకు గుజరాత్ ప్రభుత్వం గతేడాది నవంబరు 25న విశ్రాంత జస్టిస్ సుగ్నయ భట్, మాజీ ఫేస్ బుక్ అధికారి కేసీ కపూర్ ఆధ్వర్యంలో ద్విసభ్య కమిటీని నియమిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. » అప్పటి గుజరాత్ హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు రాష్ట్ర పోలీసులు ఒక మహిళపై స్నూపింగ్‌కు పాల్పడినట్లు కోబ్రాపోస్ట్.కామ్, గులైల్.కామ్ 2013 నవంబరు 15న వెల్లడించాయి. రాష్ట్రంలోని ముఖ్య వ్యక్తి ఒత్తిడితోనే అమిత్‌షా ఈ పని చేయించినట్లు అవి ఆరోపించాయి. ఆ ముఖ్యవ్యక్తి మోదీనే అని ప్రతిపక్షం అప్పట్లో ఆందోళనలు చేసింది.¤ జాతీయ మానసిక ఆరోగ్య విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ జాతీయ మనసిక ఆరోగ్య విధానాన్ని న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేశ ప్రజలకు మానసిక ఆరోగ్య రక్షణను అందించేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయి నుంచి చికిత్స అంద జేస్తారు. » ఇక నుంచి అక్టోబరు 10వ తేదీని జాతీయ మానసిక ఆరోగ్య దినంగా పాటించనున్నట్లు మంత్రి ప్రకటించారు.
|
అక్టోబరు - 11
|
¤ లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్ జయంతిని పురస్కరించుకుని 'ఎంపీ ఆదర్శ గ్రామ పథకం' (సంసద్ ఆదర్శ గ్రామ్ యోజన - ఎస్ఏజీవై)ను ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో ప్రారంభించారు. » ఆరోగ్యం, పారిశుద్ధ్యం, పచ్చదనం, సౌహార్ధ్ర సంబంధాలు వీటన్నిటినీ సమాజంలో పెంపొందించడానికి ఎస్ఏజీవైని 2014 స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రధాని ప్రకటించారు. » ఈ పథకం కింద ప్రతి ఎంపీ 2019 నాటికి తన నియోజకవర్గంలోని ఏవైనా మూడు గ్రామాల్లో సదుపాయాలను అభివృద్ధి చేసే బాధ్యతను తీసుకోవాల్సి ఉంటుంది. తన స్వగ్రామం, తన జీవిత భాగస్వామి స్వగ్రామం మినహా ఏ మూడు గ్రామాలనైనా ఎంపీలు ఎన్నుకోవచ్చు. ప్రధాన ప్రాంతాల్లో 3000 నుంచి 5000 జనాభా, గిరిజన ప్రాంతాల్లో 1000 నుంచి 3000 జనాభా ఉండాలి. » తెలంగాణలోని వరంగల్ జిల్లా గంగదేవిపల్లి, గుజరాత్ రాష్ట్రంలోని పన్సారీ గ్రామాలను ఆదర్శంగా తీసుకుని దేశంలోని ప్రతి పల్లె అభివృద్ధి సాధించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. » గంగదేవిపల్లి ప్రస్తుత సర్పంచి ఇట్ల శాంతి.¤ బ్రిటన్ నుంచి సుమారు రూ.2,200 కోట్లతో 20 అధునాతన 'హాక్' శిక్షణ విమానాల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందాన్ని రక్షణ శాఖ రద్దు చేసింది. మళ్లీ తాజాగా టెండరు జారీ చేసింది.
|
అక్టోబరు - 13
|
¤ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం మేరకు గడువు పొడిగించిన బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య నీటి పంపిణీకి చెందింది మాత్రమే అని కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇతర రాష్ట్రాల్లో ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపుల్లో మార్పులు చేయడానికి కాదని పేర్కొంది. ఈ మేరకు కృష్ణా జల వివాద ట్రిబ్యునల్ - 2 ఛైర్మన్‌కు రాసిన లేఖలో వెల్లడించింది. » బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తదుపరి విచారణలో నాలుగు రాష్ట్రాలను భాగస్వాములుగా చేయాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కోరుతుండగా కేంద్ర అభిప్రాయం మాత్రం దీనికి పూర్తిగా భిన్నంగా ఉంది. » 2004లో ఏర్పాటైన బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ 2013 నవంబరులో తుది నివేదికను సమర్పించింది. » ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం మేరకు బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ గడువును మరో రెండేళ్లపాటు పొడిగిస్తూ జూన్‌లో కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. » పునర్విభజన చట్టం మేరకు గడువు పొడిగించిన ట్రైబ్యునల్‌తో తమకు సంబంధం లేదని అది ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందినది మాత్రమేనని మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు స్పష్టం చేశాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మాత్రం నాలుగు రాష్ట్రాలను భాగస్వాములుగా చేయాలని కోరాయి.
|
అక్టోబరు - 14
|
¤ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జారీ చేసిన 11 శాశ్వత ఆర్డినెన్సులను, కాలం చెల్లిన మరో 102 చట్టాలను రద్దు చేయాలని లా కమిషన్ సిఫార్సు చేసింది. ఆ ఆర్డినెన్సుల్లో ఒక్కోదాన్ని విడివిడిగా రద్దుచేయాలని సిఫార్సులు చేసింది. » ఈ జాబితాలో క్విట్ ఇండియా ఉద్యమం అణచివేతకు బ్రిటిష్ ప్రభుత్వం తెచ్చిన సైనిక దళాల (ప్రత్యేక అధికారాల) ఆర్డినెన్స్ - 1942, యుద్ధ గాయాల ఆర్డినెన్స్ - 1941, ఇతర ఆర్డినెన్స్‌లు ఉన్నాయి. » 77 పాత చట్టాలను పూర్తిగా, 25 రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టాలను పాక్షికంగా తొలగించాలని ప్రభుత్వానికి సమర్పించిన తాజా నివేదికలో లా కమిషన్ సూచించింది. » పూర్తి తొలగింపునకు సిఫార్సు చేసిన చట్టాల్లో భూ విక్రయాలకు సంబంధించిన బెంగాల్ రెవెన్యూ చట్టం - 1841 కూడా ఉంది.
|
అక్టోబరు - 15
|
¤ కృష్ణా జలాల వివాదాల పరిష్కార ట్రైబ్యునల్ (కేడబ్ల్యూడీటీ - 2) పరిధి విస్తరణ, విధి విధానాలపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయాలని బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ పేర్కొంది. » న్యూఢిల్లీలో ట్రైబ్యునల్ ఛైర్మన్ జస్టిస్ బ్రిజేష్ కుమార్, సభ్యులు జస్టిస్ డి.కె.సేథ్, జస్టిస్ బి.పి.దాస్‌ల ధర్మాసనం సమావేశమై ఈ ఆదేశాలు జారీ చేసింది. » ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం తరఫున న్యాయవాదులు తమ వాదనలను వినిపించారు. ¤ సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల పెట్టెలపై 85% చోటును ఆరోగ్యపరమైన హెచ్చరికలకు కేటాయించాల్సిందేనని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. » ఈ మార్పును పొగాకు ఉత్పత్తి కంపెనీలు 2015 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి తీసుకురావాలని కేంద్రం పేర్కొంది. » పెట్టెపై 60% భాగంలో బొమ్మలు, 25% భాగంలో అక్షరాల రూపంలో హెచ్చరికను ప్రదర్శించాల్సి ఉంటుంది. » ప్రస్తుతం పొగాకు సేవించడం వల్ల కలిగే దుష్ప్రభావాలపై హెచ్చరించడానికి 40% చోటును కేటాయిస్తున్నారు. » 'ప్రపంచ చేతుల శుభ్రత దినోత్సవం' సందర్భంగా న్యూఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ఈ మేరకు ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడించారు. » పొగాకు పెట్టెలపై 85% స్థలాన్ని హెచ్చరికలకు కేటాయించడమనేది ఇంతవరకు థాయ్‌లాండ్లో ఉంది. ఇప్పుడు భారత్ దాని సరసన చేరుతోంది. ¤ హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. » హర్యానాలో రికార్డు స్థాయిలో 76% పోలింగ్ నమోదైంది. ఇది ఆ రాష్ట్ర చరిత్రలో అత్యధికం. » మహారాష్ట్రలో 64% పోలింగ్ నమోదైంది.
|
అక్టోబరు - 16
|
¤ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన 'మేక్ ఇన్ ఇండియా'ను విజయవంతం చేయడానికి కేంద్ర కార్మికశాఖవారి 'పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ శ్రమయేవ జయతే' కార్యక్రమం కింద పలు పథకాలను ప్రధాని మోదీ ఢిల్లీలో ప్రారంభించారు. » కనిష్ఠ ప్రభుత్వం గరిష్ఠ పాలనే లక్ష్యంగా ఆయన ఈ సంస్కరణల శ్రేణిని ప్రజలకు చేరువ చేశారు. » ఉద్యోగ భవిష్య నిధికి సార్వత్రిక ఖాతా సంఖ్య (యూనివర్సల్ అకౌంట్ నంబర్) తో లావా దేవీలు జరిపే వెసులుబాటుతో సహ వ్యాపారులకూ ఎంతో సులువుగా ఉండే ఏకగవాక్ష పోర్టల్‌ను సైతం అందుబాటులోకి తెచ్చారు. » 'ఇన్‌స్పెక్టర్ రాజ్'కు స్వస్తి చెబుతూ సరికొత్త సంస్కరణల శ్రేణికి శుభారంభం చేశారు. » 'మేక్ ఇన్ ఇండియా' సాకారం కావాలంటే సులువుగా వ్యాపారం చేసుకునే పరిస్థితులు ఉండటం తప్పనిసరి అని ప్రధాని పేర్కొన్నారు. » అప్రెంటిస్‌షిప్‌లో నైపుణ్యాల అభివృద్ధికి ఉద్దేశించిన 'ప్రోత్సాహన్ యోజన'కు ప్రధాని శ్రీకారం చుట్టారు. » కేంద్ర కార్మికశాఖ పరిధిలోని అధికారుల వేధింపుల నుంచి వ్యాపారులను రక్షించే లక్ష్యంతో సింగిల్ విండో పోర్టల్‌ను మోదీ ప్రారంభించారు. » 'శ్రమ సువిధ' పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో ఒకే దరఖాస్తును అందుబాటులోకి తెచ్చి 16 కార్మిక చట్టాల అమలును కార్మికశాఖ సులభతరం చేసింది. 'శ్రమ సువిధ పోర్టల్'లో ప్రతి కార్మికుడికి ఒక ప్రత్యేక కార్మిక గుర్తింపు సంఖ్య (లేబర్ ఐడెంటిఫికేషన్ నంబర్ - ఎల్ఐఎన్)ను ఇస్తారు. ¤ అయ్యప్పస్వామి కొలువై ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలను జాతీయ యాత్రా కేంద్రంగా ప్రకటించాలని కేరళ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీని కోరింది. ఈ మేరకు కేరళ సీఎం ఉమెన్ చాందీ నాయకత్వంలో మంత్రివర్గ బృందం ప్రధానికి ఒక వినతి పత్రాన్ని సమర్పించింది. |
అక్టోబరు - 17
|
¤ కర్ణాటక ప్రభుత్వం ఎనిమిదేళ్ల కిందట బెంగళూరుతో పాటు మరో 11 నగరాలు, పట్టణాల పేర్ల మార్పునకు చేసిన ప్రతిపాదనలకు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తాజాగా ఆమోదం తెలిపారు. » సర్వే ఆఫ్ ఇండియా, రైల్వేశాఖ, ఇంటెలిజెన్స్ బ్యూరో, తపాలా శాఖ నిరభ్యంతరం తెలిపిన తర్వాత హోంశాఖ ఈ ప్రతిపాదనలను ఆమోదించింది. » చారిత్రక ఆధారాలు, కన్నడ భాష ఉచ్ఛారణ ప్రాతిపదికన కర్ణాటక ప్రభుత్వం వాటి అసలు పేర్లను పునరుద్ధరించింది.
|
|
¤ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలుపాలైన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. » జయతోపాటు ఆమె సన్నిహితురాలు శశికళ, బంధువులు వి.ఎన్.సుధాకరన్, ఇళవరసిలకు కూడా బెయిల్ ఇచ్చింది.¤ 'సురక్షిత ఆహారోత్పత్తులను పండించండి' అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం ప్రచారాన్ని ప్రారంభించింది. » ఉత్పత్తుల నాణ్యత, పోషకాహార విలువల్లో రాజీపడకుండానే వ్యవసాయోత్పత్తులను పెంచడం లక్ష్యంగా ఈ కార్యక్రమానికి నాంది పలికింది. ఇందులో భాగంగానే కేంద్ర వ్యవసాయ శాఖ ఒక సర్క్యులర్‌ను విడుదల చేసింది. లైసెన్స్‌డ్ డీలర్లు, రిటైల్ వ్యాపారులకు పలు సూచనలు చేసింది. నకిలీ ఉత్పత్తులను నిల్వ చేయడం /ప్రదర్శించడం/ విక్రయించడం లాంటి వాటికి పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించింది.
|
|
అక్టోబరు - 18
|
¤ సంస్కరణల దిశగా కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం చమురు రంగానికి సంబంధించి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. డీజిల్ ధరలపై నియంత్రణను ఎత్తివేసింది. » సహజ వాయువు ధరను 46 శాతం మేర పెంచింది. దీంతో ఎరువులు, విద్యుత్, సీఎన్‌జీ, పీఎన్‌జీ వంటివాటి ధరలకు రెక్కలు రానున్నాయి. » మార్పిడి చేసిన నగదు బదిలీ పథకాన్ని తిరిగి ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. నవంబరు 10న ఈ పథకాన్ని తొలుత దేశంలోని 54 జిల్లాల్లో ప్రవేశపెడతారు. దేశవ్యాప్తంగా 2015 జనవరి 1 నుంచి ఈ పథకం అమలవుతుంది. » సహజ వాయువు ధరను ఒక మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ (ఎమ్‌బీటీయూ)కు 6.17 డాలర్లకు పెంచే ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది. ¤ మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 125వ జయంతి ఉత్సవ కమిటీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునర్‌వ్యవస్థీకరించారు. » ఈ కమిటీలో గాంధీ కుటుంబానికి ప్రాతినిధ్యం దక్కలేదు. » ప్రధాని నేతృత్వంలోని ఈ కమిటీకి హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, విదేశాంగ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్, ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, మానవ వనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ, సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్, సాంస్కృతిక వ్యవహారాల మంత్రి శ్రీపాద యశో నాయక్ సభ్యులుగా ఉంటారు. వీరితో పాటు రాజ్యసభ ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్, లోక్‌సభలో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే, మధ్యప్రదేశ్ గవర్నర్ రామ్‌నరేష్ యాదవ్ తదితరులు ఉన్నారు. » గత యుపీఏ హయాంలో ఈ జయంతి ఉత్సవ కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షుడిగా వ్యవహరించారు.
|
అక్టోబరు - 19
|
¤ మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఎన్నికల సంఘం ప్రకటించింది. రెండు రాష్ట్రాల్లో భాజపా విజయదుందుభి మోగించింది. » హర్యానాలో మొత్తం స్థానాలు 90 కాగా, భాజపా 47 స్థానాలు గెలిచి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. 48 ఏళ్ల రాష్ట్ర చరిత్రలో తొలిసారి అక్కడ అధికారాన్ని చేజిక్కించుకుంది. గతంలో కేవలం 4 స్థానాలు సాధించింది.హర్యానాలో వివిధ పార్టీలు గెలుచుకున్న స్థానాలుభాజపా-47, కాంగ్రెస్-15, ఐఎన్ఎల్డీ-19, హెచ్‌జేసీ (బీఎల్)-2, స్వతంత్రులు-5, ఇతరులు-2. » మహారాష్ట్రలో మొత్తం స్థానాలు 288 కాగా, భాజపా 122 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు మరో 23 స్థానాలు తక్కువయ్యాయి.మహారాష్ట్రలో వివిధ పార్టీలు గెలుచుకున్న స్థానాలుభాజపా-122, కాంగ్రెస్-42, శివసేన-63, ఎన్‌సీపీ-41, ఎంఎన్ఎస్-1, స్వతంత్రులు-7, ఇతరులు-12. » మహారాష్ట్రలో 4,60,741 (0.9 శాతం) మంది, హర్యానాలో 53,381 (0.4 శాతం) మంది 'నోటా'కు ఓటు వేసినట్లు ఫలితాల ద్వారా వెల్లడైంది. » మహారాష్ట్రలో మొత్తం 8,25,91,826 మంది ఓటర్లుండగా, హర్యానాలో 1,61,58,117 మంది ఓటర్లున్నారు.¤ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు రాష్ట్రంలోని బీడ్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో భాజపా దివంగత నేత, మాజీ కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే కుమార్తె ప్రీతం ముండే 6,96,321 ఓట్ల ఆధిక్యం సాధించింది. అశోక్ పాటిల్ 2,26,095 ఓట్లు మాత్రమే పొందారు. » ఇప్పటివరకు లోక్‌సభ ఎన్నికల్లో 5,92,502 ఓట్లు అత్యధిక మెజారిటీగా ఉంది. 2004 లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లోని అరంబాగ్ లోక్‌సభ స్థానం నుంచి సీపీఎం అభ్యర్థి అనిల్ బసు ఈ రికార్డ్ సాధించారు. తాజాగా ప్రీతం ముండే ఆ రికార్డును అధిగమించారు. » 2014 జూన్‌లో ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గోపీనాథ్ ముండే మరణించడంతో బీడ్ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించారు. ¤ మహారాష్ట్రలో గణపత్‌రావు దేశ్‌ముఖ్ (88) 11వ సారి ఎమ్మెల్యేగా గెలిచి చరిత్ర సృష్టించారు. » షోలాపూర్ జిల్లాలోని సాంగోలా నియోజకవర్గం నుంచి ఆయన పెజంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ (పీడబ్ల్యుపీ) తరఫున విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి షాహజి బాపు పాటిల్ (శివసేన)పై 25,224 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. » కరవు ముప్పును ఎదుర్కొనే ఈ నియోజక వర్గానికి దేశ్‌ముఖ్ రికార్డు స్థాయిలో 54 ఏళ్లు శాసనసభ్యుడిగా ఉన్నారు. » 2009లో దేశ్‌ముఖ్, డీఎంకే అధ్యక్షుడు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తర్వాత దేశంలో 10 ఎన్నికల్లో గెలిచిన రెండో అభ్యర్థి. ఇవి ఆయనకు 13వ ఎన్నికలు. తొలిసారిగా 1962లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1972, 1995 ఎన్నికలు మినహా అన్నింటిలో విజయం సాధించారు. 2012లో ఆయన మహారాష్ట్ర అసెంబ్లీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు.
|
అక్టోబరు - 21
|
¤ హర్యానాకు భాజపా తొలి ముఖ్యమంత్రిగా మనోహర్‌లాల్ ఖట్టర్ (60) ఎంపికయ్యారు. » కర్నాల్ స్థానం నుంచి ఖట్టర్ 63,736 ఓట్లతో గెలుపొందారు. ¤ పురావస్తుశాల (మ్యూజియం)ను ఎక్కువ మంది పర్యాటకులు సందర్శించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించినwww.museumsofindia.gov.in అనే వెబ్‌సైట్‌ను కేంద్ర సాంస్కృతిక - పర్యాటక శాఖ సహాయమంత్రి శ్రీపాద్ నాయక్ న్యూఢిల్లీలో ప్రారంభించారు. ¤ బొగ్గు బ్లాకులను ఈ-ఆక్షన్ ద్వారా ప్రైవేట్ కంపెనీలకు అప్పగించాలనే నిర్ణయంతో రూపొందించిన ఆర్డినెన్స్‌ను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆమోదించారు. » అవకతవకల అభియోగాలతో 1993 నుంచి జరిగిన 214 బొగ్గు బ్లాకుల కేటాయింపులను సుప్రీంకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌ను రూపొందించింది. |
అక్టోబరు - 22
|
¤ దేశంలో ఉన్నత విద్యను అందించే అన్ని విద్యాసంస్థల్లో కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ అఖిల భారతీయ సర్వేను ప్రారంభించింది. » 'ఉన్నత విద్యపై అఖిల భారతీయ సర్వే (ఏఐఎస్‌హెచ్ఈ) 2014-15'ను కేంద్ర ఉన్నత శాఖ కార్యదర్శి ఎస్.ఎన్.మహంతి ప్రారంభించారు. » విద్యార్థులు, బోధకుల నమోదు, కార్యక్రమాలు, పరీక్షల ఫలితాలు, విద్య, మౌలిక వసతుల కల్పనలకు సంబంధించిన ప్రమాణాల వివరాలను సర్వేలో సేకరిస్తారు.
|
అక్టోబరు - 24
|
¤ చైనాకు చెందిన 'జియోమి' కంపెనీ ఫోన్లను వాడొద్దంటూ భారత వైమానిక దళం (ఐఏఎఫ్) తన సిబ్బందికి సూచించింది. » 'జియోమి రెడిమి 1ఎస్' స్మార్ట్‌ఫోన్లు వినియోగదారుడి పేరు, నెంబరుతో పాటు ఫోన్‌బుక్‌లోని నెంబర్లు, సంక్షిప్త సందేశాలను బీజింగ్‌లోని సర్వర్లకు పంపుతున్నాయనే నేపథ్యంలో ఐఏఎఫ్ ఈ ఆదేశాలు జారీ చేసింది. » 'జియోమి రెడిమి 1ఎస్' ఫోన్లపై తాము చేసిన పరీక్షల్లో ఈ విషయాన్ని గుర్తించినట్లు సెక్యూరిటీ సొల్యూషన్ కంపెనీ 'ఎఫ్-సెక్యూర్' పేర్కొంది.¤ చైనాతో సరిహద్దుల వెంబడి అరుణాచల్‌ప్రదేశ్‌లో కొత్తగా 54 ఔట్ పోస్టులను ఏర్పాటు చేయనున్నట్లు భారత్ ప్రకటించింది. » అరుణాచల్‌ప్రదేశ్‌లో సరిహద్దుల భద్రతకు పటిష్టమైన చర్యలు చేపడుతూ మౌలిక వసతులను మరింతగా పెంచేందుకు రూ.175 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది.¤ భారత మొదటి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్‌పటేల్ జయంతి (అక్టోబరు 31)ని జాతీయ ఐక్యతా దినోత్సవం (రాష్ట్రీయ ఏక్తా దివస్)గా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.
|
అక్టోబరు - 25
|
¤ రక్షణ శాఖకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రూ.80 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఆరు జలాంతర్గాములను దేశీయంగా నిర్మించడంతోపాటు, 12 మెరుగుపరిచిన డోర్నియర్ నిఘా విమానాల కొనుగోలు, ఇజ్రాయెల్ నుంచి ట్యాంకు విధ్వంసక క్షిపణుల సమీకరణ లాంటివి ఇందులో ఉన్నాయి. రక్షణ మంత్రి అరుణ్‌జైట్లీ అధ్యక్షతన సమావేశమైన రక్షణ కొనుగోళ్ల మండలి (డీఏసీ) ఈ మేరకు నిర్ణయించింది. దీనికి త్రివిధ దళాల అధిపతులు, రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) చీఫ్ అవినాష్ చందర్, ఇతర అధికారులు హాజరయ్యారు. » ఇందులో అతిపెద్ద ప్రాజెక్టు రూ.50 వేల కోట్లతో ఆరు జలాంతర్గాములను నిర్మించడం. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ 'భారత్‌లో తయారీ' పిలుపుకు అనుగుణంగా వీటిని స్వదేశీయంగా తయారు చేయాలని నిర్ణయించారు. » సైన్యం కోసం రూ.3200 కోట్లతో ఇజ్రాయెల్ నుంచి 8356 'స్పైక్' ట్యాంక్ విధ్వంసక గైడెడ్ క్షిపణులను కొనుగోలు చేయడానికి ఆమోదం లభించింది. ఈ క్షిపణుల కోసం 321 లాంచర్లను కూడా కొనుగోలు చేస్తారు. » మరింత మెరుగుపరచిన 12 డోర్నియర్ నిఘా విమానాలను రూ.1850 కోట్లతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) నుంచి సేకరించేందుకు డీఏసీ ఆమోదం తెలిపింది. » రూ.662 కోట్లతో 362 పదాతిదళ పోరాట వాహనాలను మెదక్‌లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు నుంచి కొనుగోలు చేస్తారు. » రూ.662 కోట్లతో 1761 ఫైవ్ స్పోక్ 7.5 టన్ను రేడియో కంటైనర్లను కొంటారు. రూ.740 కోట్లతో సైనిక సాధనాల రవాణా కోసం 1748 వ్యాగన్లను సమకూర్చుకుంటారు. ¤ జమ్మూకాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల శాసనసభ్యుల ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. » నవంబరు 25 నుంచి డిసెంబరు 20 మధ్య అయిదు దశల్లో (నవంబరు 25, డిసెంబరు 2, 9, 14, 20) ఎన్నికలు జరగనున్నాయి. » డిసెంబరు 23న ఓట్ల లెక్కింపును చేపడతారు. » జమ్మూకాశ్మీర్ శాసనసభలో 87 సీట్లు, జార్ఖండ్ శాసనసభలో 81 సీట్లు ఉన్నాయి.
|
అక్టోబరు - 26
|
¤ హర్యానా నూతన ముఖ్యమంత్రిగా మనోహర్‌లాల్ ఖట్టర్(60) ప్రమాణ స్వీకారం చేశారు. » ఆయనతో పాటు తొమ్మిది మంది మంత్రుల చేత గవర్నర్ కప్తాన్ సింగ్ సోలంకి ప్రమాణ స్వీకారం చేయించారు. » గతానికి భిన్నంగా ఈ కార్యక్రమాన్ని పంజాబ్- హర్యానా ఉమ్మడి రాజధాని నగరమైన చండీగఢ్‌లో కాకుండా హర్యానాలోని పంచ్‌కులలో నిర్వహించారు. » మొదటిసారి శాసన సభ సభ్యుడిగా కర్నాల్ నియోజక వర్గం నుంచి ఎన్నికైన ఖట్టర్ హర్యానా ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తొలి పంజాబీ, బీజేపీ అభ్యర్థి అయ్యారు. » మంత్రివర్గంలోని ఏకైక మహిళా మంత్రి కవితా జైన్(37) అందరికంటే పిన్న వయస్కురాలు. ¤ సుశిక్షితమైన 'బెల్జియన్ మాలినోయిస్' జాతికి చెందిన 12 జాగిలాలను 'జాతీయ భద్రతా దళం(ఎన్ఎస్‌జీ)'లో చేర్చారు. ఇకపై ఇవి ఎన్ఎస్‌జీ నిర్వహించే కార్యకలాపాల్లో చురుకైన పాత్ర పోషించనున్నాయి. » పాకిస్థాన్‌లో అల్‌ఖైదా సారధి ఒసామా బిన్ లాడెన్‌ను పట్టివ్వడంలో ఈ జాతి జాగిలాలు కీలక పాత్రపోషించాయి. |
అక్టోబరు - 27
|
¤ నల్లధనం వెలికితీత చర్యల్లో భాగంగా విదేశాల్లో నల్లధనం దాచిన కేసులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో ఎనిమిది మంది పేర్లను వెల్లడించింది. వీరిలో ముగ్గురు మహిళలు. సుప్రీంకోర్టుకు తాజాగా దాఖలు చేసిన అఫిడవిట్‌లో వీరి పేర్లను పేర్కొంది. » నల్లధనానికి సంబంధించి ఇటీవలే ప్రభుత్వం ఒక అఫిడవిట్‌ను దాఖలు చేసింది. పన్ను ఎగవేతకు పాల్పడ్డారని సాక్ష్యాధారాలు లభించేంత వరకు, ఆ ఆరోపణలపై భారత్‌లో విచారణ ప్రారంభించేంత వరకు విదేశాల్లోని బ్యాంకు ఖాతాదారుల పేర్లను వెల్లడించలేమని అందులో స్పష్టం చేసింది. ఆ అఫిడవిట్‌కు అనుబంధంగా తాజాగా 16 పేజీల అఫిడవిట్‌ను దాఖలు చేసింది. అక్రమార్జన దాచిన వారు వీరే! 1. ప్రదీవ్ బర్మన్, డాబర్ ఇండియా ప్రమోటర్ 2. పంకజ్ చిమన్‌లాల్ లోథియా, బులియన్ ట్రేడర్ 3. టింబ్లో ప్రైవేట్ లిమిటెడ్, గోవాకు చెందిన గనుల సంస్థ 4. రాధా సతీష్ టింబ్లో 5. చేతన్ ఎస్ టింబ్లో 6. రోహన్ ఎస్ టింబ్లో 7. అన్నా సి టింబ్లో 8. మల్లికా ఆర్ టింబ్లో » జాబితాలోని చివరి అయిదుగురు టింబ్లో ప్రైవేటు లిమిటెడ్ డైరెక్టర్లే. » ఫ్రెంచ్ అధికారుల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా బర్మన్ పై విచారణ ప్రారంభించగా లోథియా, ఇతరులపై విచారణను ఇతర దేశాలు ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రారంభించినట్లు ప్రభుత్వం తెలిపింది. » పన్నులు ఎగవేసి విదేశాల్లో అక్రమంగా దాచుకున్న భారతీయుల నల్లధనం అంశాన్ని దర్యాప్తు చేయడం కోసం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్ - SIT)ను ఈ ఏడాది మే 26న నియమించింది. దీనికి అధ్యక్షుడు ఎం.బి.షా. » కాంగ్రెస్ నేతృత్వంలోని గత యూపీఏ సర్కారు ఈ నల్ల కుబేరుల పేర్ల వెల్లడి పక్రియకు శ్రీకారం చుట్టింది. ఐటీ శాఖ ప్రాసిక్యూషన్ మొదలుపెట్టినవారికి సంబంధించి ఎల్ఎస్‌టీ బ్యాంకులో బ్లాక్‌మనీ దాచారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న 18 మంది పేర్లను 2014 ఏప్రిల్‌లో సుప్రీంకోర్టుకు యూపీఏ ప్రభుత్వం తెలియజేసింది. ¤ అరేబియన్ సముద్రంలో ఏర్పడిన నిలోఫర్ తుపాను బలపడింది. తీవ్ర పెను తుపానుగా రూపాంతరం చెందింది. ఈ తుపాను ప్రభావం వల్ల గుజరాత్‌లోని సౌరాష్ట్ర, కచ్‌లోని తీర ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. » హుద్‌హుద్ తర్వాత అక్టోబరులో భారత్‌ను తాకిన రెండో తుపాను ఇది. ¤ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కలల ప్రాజెక్టు 'స్టాట్యూ ఆఫ్ యూనిటీ' నిర్మాణ అవకాశం ఎల్అండ్‌టీకి దక్కింది. » దేశం మొత్తాన్ని ఏకం చేసిన మొదటి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంస్య విగ్రహాన్ని 182 మీటర్ల ఎత్తుతో నిర్మించాలన్నది ప్రధాని ప్రణాళిక. » నర్మదా జిల్లాలోని సర్దార్ సరోవర్ డ్యామ్ సమీపంలో సాధు ద్వీపంలో ఈ ప్రాజెక్టును నిర్మిస్తారు. ఈ పనులకు ప్రస్తుత ప్రధాని, అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ గతేడాది అక్టోబరు 31న శంకుస్థాపన చేశారు. » రూ.2,979 కోట్ల విలువైన ప్రాజెక్టు పనులను తాజాగా ఎల్ అండ్ టీ కి అప్పగించారు. నాలుగేళ్లలో నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. రూ.1347 కోట్లతో పటేల్ విగ్రహాన్ని నిర్మిస్తారు. రూ.235 కోట్లతో ప్రదర్శనా మందిరం నిర్మించి, పటేల్ జీవిత విశేషాలపై ఆడియో, వీడియో ప్రదర్శనలు ఇస్తారు. రూ.83 కోట్లతో వంతెన నిర్మిస్తారు. » 75,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్, 5,700 టన్నుల ఉక్కు, 18,500 టన్నుల ఉక్కు కడ్డీలు, 22,500 టన్నుల కాంస్యంను ఈ ప్రాజెక్టులో వినియోగించనున్నారు. » నిర్మాణం పూర్తయ్యాక 15 సంవత్సరాలపాటు నిర్వహణకు రూ.657 కోట్లు కేటాయించారు. » ప్రస్తుతం న్యూయార్క్‌లోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఎత్తు 93 మీటర్లు. |
అక్టోబరు - 28
|
¤ విదేశాల్లో బ్యాంకు ఖాతాలున్న భారతీయుల పేర్ల జాబితాను మొత్తంగా తమకు సీల్డ్ కవరులో అక్టోబరు 29, 2014 లోగా అందించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. » సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎల్.దత్తు నేతృత్వంలోని జస్టిస్ రంజనా ప్రకాష్‌దేశాయ్, జస్టిస్ మదన్ లోకుర్ తో కూడిన ధర్మాసనం నల్లధనం అంశాలపై విచారణ చేపట్టి పై ఆదేశాలు జారీ చేసింది. నల్లధనంపై అంచనాలు ఇలా ఉన్నాయి » ఇతర దేశాల్లో భారతీయ సంపన్నులు అక్రమంగా దాచుకున్న సంపద విలువ దాదాపు రూ.28 లక్షల కోట్లు ఉంటుందని భాజపా సీనియర్ నేత ఎల్.కె.అద్వానీ 2011లో ప్రకటించారు. 'గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటెగ్రిటీ' అనే అమెరికా స్వచ్ఛంద సంస్థ పరిశోధనలో ఇది వెల్లడైందని తెలిపారు. » అదే ఏడాది భాజపా వెల్లడించిన అంచనాల ప్రకారం రూ.30 లక్షల కోట్ల నుంచి గరిష్ఠంగా రూ.84 లక్షల కోట్ల వరకు విదేశాల్లో భారతీయుల నల్లధనం ఉంది. » భారత ప్రభుత్వం 2012లో పార్లమెంటుకు సమర్పించిన శ్వేత పత్రం ప్రకారం స్విస్ బ్యాంకుల్లో ఉన్న భారతీయుల డిపాజిట్లు మొత్తం రూ.12,600 కోట్లు. » 'గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటెగ్రిటీ' ఈ ఏడాది మే లో వెలువరించిన నివేదిక ప్రకారం 2002 నుంచి 2011 మధ్య కాలంలో భారత్ నుంచి రూ.20,63,400 కోట్ల నల్లధనం విదేశాలకు వెళ్లింది. ¤ మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్(44) ఎంపికయ్యారు. ఆయన విదర్భ ప్రాంతానికి చెందినవారు. మహారాష్ట్రలో ఎంపికైన తొలి భాజపా సీఎం. » కొత్తగా ఎన్నికైన 123 మంది భాజపా శాసన సభ్యులు దేవేంద్ర ఫడ్నవీస్‌ను సీఎంగా ఎన్నుకున్నారు. » ఆయన నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. » ఫడ్నవీస్ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ఉన్న నాగ్‌పూర్ నైరుతి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. » 21 ఏళ్లకే నాగ్‌పూర్‌లో కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. ¤ భారత విశిష్ఠ గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 70 కోట్ల మందికి ఆధార్ సంఖ్యలను జారీ చేసింది. » ఆంధ్రప్రదేశ్, కేరళ, ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్‌తో సహా తొమ్మిది రాష్ట్రాల్లో 90 శాతానికి పైగా, పదహారు రాష్ట్రాల్లో 70 శాతానికి పైగా ఆధార్ సంఖ్యల జారీ పూర్తయిందని యూఐడీఏఐ ప్రకటించింది. » ఉత్తర్‌ప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఆధార్ నమోదును త్వరితగతిన చేపట్టాల్సి ఉంది. ఈ నాలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 34 కోట్ల జనాభా ఉండగా, ఇప్పటి వరకు కేవలం 8.93 కోట్ల మందికే ఆధార్ నంబర్లు జారీ అయ్యాయి. ¤ హర్యానాలోని సోనిపట్ జిల్లా గొహనా పట్టణంలో పంజాబ్ నేషనల్ బ్యాంకు ప్రధాన శాఖలో 150 అడుగుల మేర సొరంగ మార్గాన్ని తవ్వి రూ.కోట్ల విలువైన సొత్తును దొంగలు దోచుకు పోయారు. ఇందులో రూ.40 లక్షలు నగదు ఉంది. ¤ గుజరాత్‌లో తొలుత ప్రారంభించిన గిరిజనుల సంక్షేమ పథకం తరహాలో దేశవ్యాప్తంగా 'వనబంధు కళ్యాణ యోజన' పథకాన్ని గిరిజనుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. » మనవాభివృద్ధి సూచీలో గిరిజనులు, ఇతర ప్రజల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు ఈ పథకాన్ని ప్రారంభించింది. » ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో ఒక్కో గిరిజన జిల్లా చొప్పున ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. |
అక్టోబరు - 29
|
¤ విదేశీ బ్యాంకు ఖాతాలున్న 627 మంది భారతీయుల, ప్రవాస భారతీయుల పేర్లతో కూడిన జాబితాను కేంద్ర ప్రభుత్వం ఒక సీల్డ్ కవర్‌లో సుప్రీంకోర్టుకు అందజేసింది. » దీంతోపాటు ఫ్రాన్స్ అధికారులతో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలను, నల్లధనంపై ఇప్పటివరకు జరిగిన దర్యాప్తుపై నివేదికను రెండు వేర్వేరు సీల్డు కవర్లలో కోర్టుకు సమర్పించింది. » నవంబరు నెలాఖరుకు నివేదిక అందజేయాలని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. » ఖాతాదారుల వివరాలను అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ ధర్మాసనానికి సమర్పించారు. వీరందరికీ జెనీవాలోని హెచ్ఎస్‌బీసీ బ్యాంకులో ఖాతాలు ఉన్నాయని చెప్పారు. ఖాతాల వివరాలన్నీ 2006 నాటివని, ఫ్రాన్స్ ప్రభుత్వం వీటిని 2011లో కేంద్ర ప్రభుత్వానికి అందించిందని తెలిపారు. నేపథ్యం:విదేశాల్లో పోగైన భారతీయ సంపన్నుల నల్లధనంపై 2009 నుంచి సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరుగుతోంది. విదేశీ బ్యాంకుల్లో నల్లధనాన్ని దాచిపెట్టిన భారతీయుల పూర్తి వివరాలను బయట పెట్టాల్సిందేనంటూ 2011లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. కేంద్ర ప్రభుత్వం మాత్రం అక్రమాలకు పాల్పడినట్లు ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించిన ఖాతాదారుల పేర్లను మాత్రమే వెల్లడిస్తామని తెలిపింది. ఈ క్రమంలోనే 2014 అక్టోబరు 27న 8 మంది పేర్లను బహిరంగపరచింది. కానీ, విదేశీ ఖాతాదారుల పేర్లన్నింటినీ తమకు సమర్పించాల్సిందేనని సుప్రీం కోర్టు తేల్చి చెప్పడంతో కేంద్రం పూర్తి జాబితాను అందజేసింది. ¤ నిధుల కొరతతో సతమతమవుతున్న నిర్మాణ, స్థిరాస్తి రంగానికి ఊతమిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. నివాస సముదాయాలతోపాటు నిర్మాణ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)ను మరింతగా ఆకర్షించేందుకు నిబంధనలను సరళతరం చేసింది. » నిర్మాణ రంగంలో ఎఫ్‌డీఐ విధానాన్ని సవరించడానికి ఉద్దేశించిన ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. » ప్రస్తుతం అనుమతిస్తున్న 50 వేల చదరపు మీటర్ల నిర్మాణాలకే కాకుండా, ఇకపై 20 వేల చ.మీటర్ల నిర్మాణాలకూ విదేశీ నిధులను తెచ్చుకోవచ్చు. » నిర్మాణానికి కనీస పెట్టుబడిని కోటి డాలర్ల (రూ.60 కోట్లు) నుంచి 50 లక్షల డాలర్ల (రూ.30 కోట్లు)కు కుదించింది. » జీవ రక్షణపై కార్జజెనా ఒప్పందానికి సంబంధించిన నయోగా - కౌలాలంపూర్ అనుబంధ ఒప్పందానికి ఆమోదం తెలపడానికి, భారత్- అల్బేనియా మధ్య దౌత్య పాస్‌పోర్టుదారులు వీసా లేకుండా ప్రయాణించడానికి కేంద్ర కేబినెట్ అంగీకరించింది. ¤ మహారాష్ట్రలోని గోదావరినదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మహారాష్ట్ర, తెలంగాణ అధికారులు మూసివేయడంతో నీటి ప్రవాహం ఆగిపోయింది. » జులై 1 నుంచి అక్టోబరు 28 వరకు గేట్లను తెరచి ఉంచి, 29న మూసి వేయాలనే సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. |
అక్టోబరు - 30
|
¤ ఇందిరాగాంధీ హత్యానంతరం చెలరేగిన సిక్కు వ్యతిరేక అల్లర్లలో మరణించిన, బాధితులైన కుటుంబాలకు మరింత పరిహారాన్ని అదనంగా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 3,325 బాధిత కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆయా బాధితులు ఇంతకు ముందు పొందిన పరిహారానికి ఇది అదనమని పేర్కొంది. » దేశవ్యాప్తంగా మత ఘర్షణలు, ఉగ్రవాద దాడులు, నక్సలైట్ల హింసాకాండ ఘటనల్లో బాధితులకు అందజేస్తున్న నష్టపరిహారాన్ని కేంద్ర ప్రభుత్వం రూ.3లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. |
అక్టోబరు - 31
|
¤ సర్దార్ వల్లభాయ్ పటేల్ 139వ జయంతిని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఆయన జయంతిని ప్రధాని మోదీ 'జాతీయ ఐక్యతా దినం' గా ప్రకటించారు. » వల్లభాయ్ పటేల్ చదువుకున్న గుజరాత్‌లోని కరంసంద్‌లో ఉన్న ప్రాథమిక పాఠశాలను 'సర్దార్ స్మృతి శాల'గా మార్చారు. ఆయన ఇక్కడ ఒకటో తరగతి (1882 అక్టోబరు 2) నుంచి ఆరో తరగతి (1888 జూన్ 9) వరకు చదువుకున్నారు. సుమారు రూ.కోటి 20 వేలతో అద్భుతంగా తీర్చిదిద్దిన ఈ పాఠశాలను గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్ ప్రారంభించారు. సర్దార్ హాజరు పట్టికను ఈ ప్రదర్శన శాలలో ఉంచారు. ¤ మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 30వ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని ఆమె సమాధి 'శక్తిస్థల్' వద్ద సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. » రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తదితర నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ¤ మహారాష్ట్ర 18వ ముఖ్యమంత్రిగా దేవేంద్ర గంగాధర్ ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రితో పాటు ఏడుగురు కేబినెట్ మంత్రులు, ఇద్దరు సహాయ మంత్రుల చేత గవర్నర్ సి.హెచ్.విద్యాసాగర్ రావు ముంబయిలోని వాంఖడే క్రికెట్ మైదానంలో ప్రమాణ స్వీకారం చేయించారు. |
|
|