సెప్టెంబరు - 1
|
¤ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన అలనాటి నలందా విశ్వవిద్యాలయంలో 821 సంవత్సరాల తర్వాత తరగతులు ప్రారంభం అయ్యాయి. » బీహార్‌లోని రాజ్‌గిర్‌లో ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రాంగణంలో తరగతులు మొదలయ్యాయి. » దాదాపు 40 దేశాలకు చెందిన వెయ్యిమందికి పైగా విద్యార్థులు ప్రవేశం కోరినప్పటికీ, తొలివిడతగా పర్యావరణ శాస్త్రంపై తరగతులను 11 మంది అధ్యాపకులు, 15 మంది విద్యార్థులతో ప్రారంభించినట్లు ఉపకులపతి గోపా సభర్వాల్ ప్రకటించారు. » మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ల చొరవతో పాటు కేంద్ర ప్రభుత్వం, సింగపూర్, థాయ్‌లాండ్, ఆస్ట్రేలియా తదితర దేశాలు సమకూర్చే నిధులతో నలందా విశ్వవిద్యాలయానికి సుమారు 12 కి.మీ. దూరంలో అధునాతన విశ్వవిద్యాలయాన్ని 455 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. కొత్త భవనాలు పూర్తయ్యే వరకు తరగతులను బీహార్‌లోని ప్రముఖ బౌద్ధ క్షేత్రమైన రాజ్‌గిర్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. ¤ గుజరాత్ అసెంబ్లీ మాజీ స్పీకర్ వజూభాయ్ వాలా కర్ణాటక రాష్ట్ర గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేశారు. కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.హెచ్.వాఘేలా రాజ్‌భవన్‌లో వజూభాయ్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ¤ దేశవ్యాప్తంగా ఇకపై దూరవిద్య కేంద్రాల స్థానంలో ఈ-పాఠశాలలను తీసుకురావాలని విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) నిర్ణయించింది. ఇందులో భాగంగా దూరవిద్యకు సంబంధించిన ఫ్రాంచైజీలకు స్వస్తి పలకాల్సిందిగా రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాలను యూజీసీ కోరింది. » సెంట్రల్ 'ఈ-పాఠశాల' విజయవంతం కావడంతో, దూరవిద్య కేంద్రాలకు స్వస్తి చెప్పాలని యూజీసీ నిర్ణయించుకుంది. ఇక నుంచి ఈ-పాఠశాలను సంబంధిత ఇంటర్నెట్ కేంద్రాలకు అనుసంధానిస్తారు. |
సెప్టెంబరు - 3
|
| ¤ ప్రఖ్యాత భారత శాస్త్రీయ సంగీత విద్వాంసుల సేవలకు గుర్తుగా న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఎనిమిది తపాలా బిళ్లలను విడుదల చేశారు. » భారత శాస్త్రీయ సంగీత వాగ్గేయకారులైన పండిట్ రవిశంకర్, పండిట్ భీంసేన్ జోషి, డి.కె.పట్టమ్మాళ్, పండిట్ మల్లిఖార్జున్ మన్సూర్, గంగూబాయి హంగల్, పండిట్ కుమార్ గంధర్వ, ఉస్తాద్ విలాయత్ ఖాన్, ఉస్తాద్ అలీ అక్బర్‌ఖాన్‌పై తపాలా శాఖ వీటిని రూపొందించింది.¤ విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహకాల బోర్డు (ఎఫ్ఐపీబీ) 22 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. వీటి మొత్తం విలువ రూ.3249 కోట్లు. |
సెప్టెంబరు - 4
|
| ¤ ఉత్తరప్రదేశ్‌లో ఉర్దూను రెండో అధికార భాషగా చేయాలన్న నిర్ణయానికి సుప్రీంకోర్టు ఆమోద ముద్ర వేసింది. ఉర్దూను ద్వితీయ అధికార భాషగా చేస్తూ తీసుకొచ్చిన ఉత్తరప్రదేశ్ అధికార భాషా (సవరణ) చట్టం - 1989ని సుప్రీంకోర్టు సమర్థించింది.¤ పర్యావరణ నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులపై ఆచరణకు కేంద్రం నలుగురు మంత్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. » రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ; రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి అనంతకుమార్; విద్యుత్, బొగ్గు శాఖ మంత్రి పీయుష్ గోయల్, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ఈ కమిటీలో సభ్యులు. » ప్రతిపాదిత పర్యావరణ నియంత్రణ సంస్థ నిర్మాణం ఎలా ఉండాలో ఈ కమిటీ సూచిస్తుంది.¤ భారతీయ సంప్రదాయ వైద్య పద్ధతులు, హోమియోపతి వైద్యానికి బంగ్లాదేశ్‌లో ప్రాచుర్యం కల్పించేందుకు ఉద్దేశించిన ఒక అవగాహన ఒప్పందాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. » ఈ ఒప్పందం అమల్లోకి వస్తే ఉభయ దేశాల మధ్య సంప్రదాయ వైద్య విధానాలు, హోమియోపతిలో సహకారానికి నిర్మాణాత్మక వ్యవస్థ ఏర్పడుతుంది. |
సెప్టెంబరు - 5
|
¤ పాస్‌పోర్టుల్లో చిప్‌ను ఏర్పాటు చేయడానికి కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ అంగీకరించింది. సంబంధిత భారత అధికారులు జారీ చేసే పాస్‌పోర్టుల్లో చిప్ ఉండాలంటూ 'అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసీఏవో)' ఎప్పటినుంచో డిమాండ్ చేస్తుండగా, భారత సర్కారు ఇప్పటికి సుముఖత వ్యక్తం చేసింది. ఐసీఏవో ప్రమాణాల మేరకు ఈ చిప్‌ను తయారుచేస్తారు. ఈ ఏర్పాటు వల్ల నకిలీ పాస్‌పోర్టును సులభంగా గుర్తించవచ్చు. ఈ చిప్‌లో సంబంధిత వ్యక్తి ఆధార్, పాన్ నెంబర్లు, సంతకం తదితరాలన్నీ నిక్షిప్తమై ఉండటం వల్ల తేడాలేమైనా ఉంటే ఇట్టే గుర్తించి చిప్ వెంటనే అధికారులను అప్రమత్తం చేస్తుంది. » నాసిక్‌లో ఈ చిప్‌లను తయారుచేస్తారు. 2015 సంవత్సరాంతం నుంచి వీటి తయారీ మొదలవుతుంది. 2016 తర్వాత జారీ అయ్యే అన్ని పాస్‌పోర్టుల్లోనూ ఈ స్మార్ట్ చిప్ ఉంటుంది.
|
సెప్టెంబరు - 6
|
| ¤ భారీ వర్షాలు, వరదలు, కొండ చరియలు విరిగి పడటం వల్ల జమ్ము కాశ్మీర్‌లోని 450 గ్రామాలు నీట మునిగాయని ప్రభుత్వం ప్రకటించింది.¤ వ్యవసాయ పంపుసెట్లకు ఉచిత విద్యుత్‌ను అందించడం పెనుభారంగా మారడంతో సౌర పంపుసెట్లను పంపిణీ చేయాలని, కర్ణాటక ప్రభుత్వం 'సౌర రైత' అనే పథకాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టాలని నిర్ణయించింది. » ఒక్కో సౌర పంపుసెట్టు కనెక్షన్‌కు రూ.5 లక్షల వరకు ఖర్చు అవుతుందని, ఇందులో రూ.4 లక్షలు సబ్సిడీగా లభిస్తుందని, మిగిలిన లక్ష మొత్తాన్ని బ్యాంకుల నుంచి రుణాల రూపంలో రైతులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. » దీని ద్వారా రైతుల అవసరాలు తీరడమే కాకుండా, అదనంగా ఉత్పత్తి అయ్యే సౌర విద్యుత్‌ను ప్రభుత్వానికి విక్రయించుకునే అవకాశం వారికి లభించనుంది. |
సెప్టెంబరు - 7
|
¤ భారీ వర్షాలు, వరదల ధాటికి జమ్మూకాశ్మీర్ తీవ్ర ఇబ్బందులకు గురైంది. ఈ విపత్తులో మృతుల సంఖ్య 145కి చేరింది. వేల మంది జల దిగ్బంధంలో చిక్కుకున్నారు. » ప్రధాని నరేంద్రమోడీ రూ.1000 కోట్ల సాయాన్ని ప్రకటించారు. దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించారు. » ప్రస్తుత వైపరీత్యం నేపథ్యంలో రాష్ట్ర విపత్తు సహాయ నిధి నుంచి కూడా రూ.1100 కోట్ల సాయం ప్రకటించారు. ¤ కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ), మానవహక్కుల జాతీయ కమిషన్ (ఎన్‌హెచ్ఆర్‌సీ) లాంటి చట్టబద్ధ సంస్థల్లోని నియామకాల విషయంలో లోక్‌సభ విపక్షనేత లేకుండానే ముందుకెళ్లాలని కేంద్రం నిర్ణయించింది. |
సెప్టెంబరు - 8
|
| ¤ కేరళ పులయార్ మహా సభ (కేపీఎంఎస్) ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన అయ్యంకలి 152వ జయంతి సభలో ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.¤ నోయిడాలోని నిఠారి గ్రామంలో వరస హత్యల కేసుల్లో దోషిగా ఉన్న సురీందర్ కోలి ఉరిశిక్ష అమలును వారం రోజులు నిలిపివేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. » మీరట్‌లోని జిల్లా కారాగారంలో ఉన్న కోలిని ఈ నెల 12న ఉరి తీయాల్సి ఉంది.¤ శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖకు చెందిన విభాగాల్లో పని చేస్తున్న 5 వేల మంది నిష్ణాతులైన శాస్త్రవేత్తలంతా దేశంలోని స్కూళ్లు, కాలేజీల్లో పాఠాలు చెప్పడాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. » పాఠాలు చెప్పినందుకు ఎటువంటి పారితోషికం ఉండదు. తమ విధుల్లో భాగంగానే విద్యార్థులకు ప్రతి శాస్త్రవేత్త కనీసం 12 గంటలు పాఠాలు చెప్పాల్సి ఉంటుంది. » శాస్త్ర విజ్ఞానానికి సంబంధించి లింగ వివక్షను రూపుమాపేలా మహిళల కోసం ప్రత్యేకంగా "కిరణ్ - KIRAN" అనే పథకాన్ని ప్రారంభించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. |
సెప్టెంబరు - 9
|
| ¤ ప్రయాణికులకు మరింత చేరువ కావడం కోసం ఎయిరిండియా కొత్త సదుపాయాలకు రూపకల్పన చేసింది. » 'మీ హక్కులను తెలుసుకోండి' (నో యువర్ రైట్స్) అనే పేరుతో రూపొందించిన ఒక పోర్టల్‌ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఈ పోర్టల్ పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ (డీజీసీఏ)కు అనుబంధంగా పని చేస్తుంది. ప్రయాణికులకు అవసరమైన సమగ్ర సమాచారాన్ని ఇస్తుంది. విమాన సర్వీసుల్లో జాప్యం, సర్వీసుల రద్దు, టికెట్ల బుకింగ్, టికెట్ ధరలు, ఫిర్యాదులు తదితర అంశాల గురించి ఈ పోర్టల్‌లో వివరాలు ఉంటాయి. » పోర్ట్ బ్లెయిర్‌లోని వీర్ సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద కొత్త టెర్మినల్‌ను రూ.374 కోట్ల వ్యయంతో నిర్మించనున్నామని మంత్రి వెల్లడించారు. |
సెప్టెంబరు - 10
|
| ¤ దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో 'ప్రపంచ ఇంటర్నెట్ సొసైటీ'లో 'గోల్డ్ క్యాటగిరీ' సభ్యత్వం కోసం కేంద్ర ప్రభుత్వం దరఖాస్తు చేసింది. » గోల్డ్ క్యాటగిరీ సభ్యత్వం లభిస్తే ఇంటర్నెట్ వినియోగం, ఆంక్షలను నియంత్రించే అంతర్జాతీయ నిబంధనల రూపకల్పనలో భాగస్వామ్యం లభిస్తుంది. నెట్ రంగంలో దేశ ప్రయోజనాలను కాపాడుకునే అవకాశం ఉంటుంది. » మనదేశంలో నెట్ వినియోగం గత పదేళ్లుగా ఏటా 26.1 శాతం వేగంతో పెరుగుతోంది. ఇది ప్రపంచంలోనే అత్యధికం. » 2020 నాటికి భారత్‌లో నెట్ వినియోగదారుల సంఖ్య 60 కోట్లకు దాటుతుందనే అంచనా ఉంది. » విశిష్ట గుర్తింపు సంఖ్య (ఆధార్) ప్రాజెక్టు అయిదో దశను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. అయిదో దశ కింద ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్టును చేపడతారు.¤ కోస్తా తీర ప్రాంత నౌకాయానాన్ని ప్రోత్సహించేలా రూపొందిన నూతన మార్గదర్శకాలకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. » విశాఖపట్నం ఓడరేవు సహా దేశంలో 12 ప్రధాన ఓడరేవులను ఎంపిక చేసి, అక్కడ ప్రత్యేక విరామ స్థలాలను (బెర్తులు) చూపాల్సిందిగా వాటికి సూచించారు. |
సెప్టెంబరు - 12
|
| ¤ అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల్లో వికలాంగులకు మూడు శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇది ఐఏఎస్‌ల నియామకాలు, ప్రమోషన్లలోనూ ఉండాలని పేర్కొంది.¤ బూజు పట్టిన చట్టాలను రద్దు చేసేందుకు మోడీ ప్రభుత్వం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో, కాలం చెల్లిన 72 చట్టాలను రద్దు చేయాల్సిందిగా లా కమిషన్ సిఫార్సు చేసింది. » ఈ మేరకు లా కమిషన్ న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు మధ్యంతర నివేదికను సమర్పించింది. » లా కమిషన్, రద్దు చేయాల్సిందిగా సిఫార్సు చేసిన చట్టాల్లో 1836 నాటి బెంగాల్ జిల్లా చట్టం ఒకటి. ఇంకా పలు చట్టాలు 1838 నుంచి 1898 మధ్య నాటివి ఉన్నాయి. » 32 చట్టాల రద్దుకు ఉద్దేశించిన బిల్లును ఎన్‌డీఏ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల్లో లోక్‌సభలో ప్రవేశపెట్టింది. చట్టాల రద్దుకు న్యాయ మంత్రిత్వశాఖ కసరత్తు చేయడం 2001 తర్వాత ఇదే మొదటిసారి. » కొన్ని చట్టాలను రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేయాల్సి ఉంటుందని, మరికొన్నింటిని పార్లమెంటు రద్దు చేయాల్సి ఉంటుందని లా కమిషన్ పేర్కొంది.¤ మహారాష్ట్ర, హర్యానా శాసనసభ ఎన్నికల షెడ్యూలు వెలువడింది. ఒకే దశలో అక్టోబరు 15న ఎన్నికలు జరగనున్నాయి. 19న ఓట్ల లెక్కింపు ఉంటుంది. » 90 మంది సభ్యులున్న హర్యానా శాసనసభ పదవీకాలం అక్టోబరు 27న, 288 మంది సభ్యులున్న మహారాష్ట్ర శాసనసభ గడువు నవంబరు 8న ముగియనుంది. |
సెప్టెంబరు - 13
|
¤ కేంద్ర ప్రభుత్వం రోడ్డు భద్రత కోసం కఠినమైన నిబంధనలతో ముసాయిదా బిల్లును రూపొందించింది. శిక్షలు, జరిమానాలను తీవ్రస్థాయిలో విధించేలా 'రోడ్డు భద్రత, రవాణా ముసాయిదా బిల్లు-2014' ను సిద్ధం చేసింది. » రోడ్డు భద్రత, రవాణా రంగంలో ముందంజలో ఉన్న అమెరికా, కెనడా, బ్రిటన్, సింగపూర్, జర్మనీ, జపాన్‌ను అనుసరించే ఉత్తమ విధానాలను మనదేశంలోని అవసరాలకు తగినట్లుగా వర్తింపజేస్తూ ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించింది.
|
సెప్టెంబరు - 14
|
¤ స్మార్ట్ నగరాల ప్రాజెక్ట్‌లో విద్య, వైద్యానికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యతను ఇచ్చింది. ఎంపిక చేసిన నగరాల్లో స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ పూర్తయ్యేలోగా ఆయా విభాగాల్లో ప్రభుత్వం ప్రతిపాదించిన పథకాలను అమలుచేసి, ప్రజలకు విద్య, వైద్యంలో ఇబ్బందులు లేకుండా చూడాలని నిర్ణయించింది.స్మార్ట్ సిటీ - వైద్యరంగం స్మార్ట్ సిటీల్లోని ప్రజల వైద్యానికి సంబంధించి అత్యవసర కేసులను 30 నిమిషాల్లోనే పరిష్కరించాలని భావిస్తోంది. ప్రతి లక్ష జనాభాకు అన్ని ఆసుపత్రుల్లో కలిపి దాదాపు 1210 పడకలు అందుబాటులోకి రానున్నాయి. ఇక్కడి పౌరులందరికీ నూరు శాతం టెలి మెడిసిన్ సౌకర్యంతో పాటు, 15 వేల కుటుంబాలకు ఒక డిస్పెన్సరీని ఏర్పాటు చేస్తుంది. 50 వేల జనాభాకు డయాగ్నస్టిక్ సెంటర్‌తో పాటు, 100 వరకు కుటుంబ సంక్షేమ కేంద్రాల ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది.స్మార్ట్ సిటీ - విద్యారంగం స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌లో కీలకమైన ప్రాథమిక, ఉన్నత విద్యకు ప్రాధాన్యం ఇచ్చారు. విద్యలో ప్రమాణాలు మెరుగుపరచడంతో పాటు, అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు కల్పిస్తారు. నగరంలోని ప్రతి 10 లక్షల జనాభాకు ఒక ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలను అందుబాటులోకి తీసుకురానుంది. అలాగే ఒక ప్రొఫెషనల్, పారామెడికల్, పశు వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తుంది. ప్రతి 1.25 లక్షల జనాభాకు ఒక కళాశాలను ఏర్పాటు చేయాలని, స్మార్ట్ సిటీకి యూనివర్సిటీ ఉండాలని అభివృద్ధి సూచిక కింద కేంద్రం పేర్కొంది.స్మార్ట్ సిటీ లక్ష్యాలు: 2500 కుటుంబాలకు ఒక నర్సరీ పాఠశాల. 5 వేల కుటుంబాలకు ఒక ప్రాథమిక పాఠశాల (1 నుంచి 5వ తరగతి). 7500 కుటుంబాలకు ఒక సీనియర్ సెకండరీ పాఠశాల (6 నుంచి 12వ తరగతి). ప్రతి లక్ష జనాభాకు సమీకృత పాఠశాల (1 నుంచి 12వ తరగతి). 45 వేల కుటుంబాలకు ఒక సాధారణ వికలాంగుల పాఠశాల. 10 లక్షల జనాభాకు మానసిక వికలాంగుల పాఠశాల.
|
సెప్టెంబరు - 15
|
¤ మణిపూర్ తాత్కాలిక గవర్నర్‌గా మేఘాలయ గవర్నర్ కె.కె. పాల్ బాధ్యతలు చేపట్టారు. మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మీకాంత్ మహాపాత్ర ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.¤ దేశంలోని భారీ యంత్ర పరికరాల ఉత్పత్తి రంగంలో అంతర్జాతీయ స్థాయి పోటీతత్వాన్ని ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి అవసరమైన చర్యలను తొలిదశలో రూ. 930 కోట్ల వ్యయంతో చేపట్టాలని నిర్ణయించింది. తర్వాత కాలంలో మరింత భారీ స్థాయిలో ఖర్చు చేయనుంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న 'మేక్ ఇన్ ఇండియా' (భారత్‌లో తయారు చేయండి) కార్యక్రమంలో భాగంగా ఈ చర్యలను కేంద్రం చేపట్టనుంది. » యంత్రపరికరాల ఉత్పత్తి రంగంలో మెషిన్ టూల్స్, వస్త్ర పరిశ్రమ, నిర్మాణ రంగం, గనుల తవ్వకం తదితర యంత్రాలు ఉంటాయి. మన దేశంలోని పరిశ్రమలు ప్రపంచస్థాయి పోటీని ఎదుర్కోవడానికి వీలుగా ప్రభుత్వం అయిదంచెల వ్యూహాన్ని అమలు చేయనుంది. తొలిదశలో భాగంగా దేశంలోని ఐఐటీలు, ఇతర ఉన్నత విద్య పరిశోధనా సంస్థల తోడ్పాటుతో అత్యాధునిక సాంకేతిక కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. » రెండో దశలో మెషిన్ టూల్ పార్కుల నిర్మాణాన్ని చేపడుతుంది. » మూడో దశలో వస్త్ర తయారీ యంత్రాల ఉత్పత్తి కోసం స్థానిక పరిశ్రమలతో కలిసి ఉమ్మడి ఇంజినీరింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. దీంట్లో ప్రయోగశాలలు, డిజైన్ సెంటర్లు తదితర సౌకర్యాలను కల్పిస్తారు. » నాలుగోదశలో టిప్పర్లు, క్రేన్లు, జేసీబీలు లాంటి ఎర్త్ మూవింగ్ యంత్రాల తయారీకి ప్రాధాన్యం ఇస్తారు. వీటి నాణ్యతను పరీక్షించి ధ్రువీకరణ పత్రాలు ఇచ్చే ప్రకియను ప్రారంభిస్తారు. » తుదిదశలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకోవడం కోసం అవసరమైన ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తారు. ఈ నిధి ద్వారా భారతీయ యంత్ర తయారీ పరిశ్రమలకు ఆర్థికసాయం అందజేస్తారు.ఆయుష్‌కు ప్రోత్సాహం¤ దేశంలో వైద్య సేవలను మరింత విస్తరించడం కోసం 'జాతీయ ఆయుష్ (ఆయుర్వేద, యోగ, నేచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి) మిషన్' ను ప్రారంభించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. దీంట్లో భాగంగా ఆయుష్ వైద్య సేవలకు ప్రోత్సాహం కల్పించడం, విద్య సంస్థలను ఏర్పాటు చేయడం లాంటి చర్యలను చేపట్టనున్నారు.¤ అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరా, పంపిణీలకు రూ. 4,754 కోట్ల వ్యయంతో మెరుగుపరిచే పథకానికి కూడా కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర నేసింది.
|
సెప్టెంబరు - 16
|
¤ లోక్‌సభ నైతిక విలువల కమిటీ అధ్యక్షుడిగా భాజపా అగ్రనేత ఎల్.కె.అద్వానీ నియమితులయ్యారు. స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. » మరో 11 మంది సభ్యులుగా ఉండే ఈ కమిటీ లోక్‌సభ సభ్యుల నైతిక ప్రవర్తనను పరిశీలిస్తుంది. అభ్యంతరకర ప్రవర్తనలపై ఈ కమిటీ సుమోటోగా దర్యాప్తు చేయవచ్చు. సిఫార్సులు చేసిన నిబంధనలను రూపొందించవచ్చు. » అధికారుల ప్రొటోకాల్ నిబంధనల ఉల్లంఘన, ఎంపీలతో వారి ప్రవర్తనకు సంబంధించి కూడా స్పీకర్ ఒక కమిటీని ఏర్పాటు చేశారు. తెదేపా ఎంపీ రాయపాటి సాంబశివరావు ఛైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో 13 మంది లోక్‌సభ ఎంపీలు సభ్యులుగా ఉంటారు. |
సెప్టెంబరు - 17
|
¤ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు నేతలకు కీలకమైన రక్షణ శాఖ ప్యానల్‌లో చోటు దక్కింది. » కేంద్ర ఆర్థిక, రక్షణశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ నేతృత్వంలోని 'రక్షణశాఖ సలహా సంఘం'లో లోక్‌సభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే, ఉపనేత కెప్టెన్ అమరీందర్ సింగ్ సభ్యులుగా నియమితులయ్యారు. » 12 మంది లోక్‌సభ సభ్యులు, 9 మంది రాజ్యసభ సభ్యులతో ఇటీవలే ఈ కమిటీని ఏర్పాటు చేశారు. » విజయ్ మాల్యా, రాజ్యసభలో స్వంతంత్ర సభ్యుడు అమర్‌సింగ్‌కూ ఇందులో స్థానం కల్పించారు. భాజపాకు చెందిన ఎనిమిది మంది ఎంపీలు, తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన సాగత్ రాయ్ తదితరులూ ఇందులో ఉన్నారు.¤ 'సుఖ మంగళ యాత్ర' పేరుతో ప్రత్యేక పర్యటక రైలును 'ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటిసీ)' ప్రకటించింది. » బెంగళూరు నుంచి మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు ఈ ప్రత్యేక రైలు వెళుతుంది. » అక్టోబరు 25 నుంచి నవంబరు 3 వరకు పదిరోజుల పాటు సాగే ప్రయాణంలో కర్ణాటక, మహారాష్ట్రలోని ముఖ్య క్షేత్రాలు, పర్యటక ప్రాంతాలు, చారిత్రక కట్టడాలను సందర్శించవచ్చు.¤ నదులపై అధ్యయనానికి ప్రత్యేకంగా ఒక కేంద్ర విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. » ఈ విశ్వవిద్యాలయంలో నదీ ప్రవాహాల్లో మార్పులు, నదీ జలాల్లో కాలుష్యం స్థాయి, తీర ప్రాంతాల్లో పారిశ్రామిక యూనిట్ల ఏర్పాటుతో కలిగే ప్రభావం, తాగునీటికి, సాగుకు జలాలను వినియోగించుకునే అవకాశం తదితర అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేస్తారు. దేశంలోని అన్ని నదుల స్థితిగతులపై విద్యార్థులు పరిశోధనలు జరుపుతారు. » నదీ జలాల శాస్త్రంపై ప్రత్యేకంగా ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం ప్రపంచవ్యాప్తంగా ఇదే మొదటిసారి. » గంగానది ప్రక్షాళనకు ప్రధాని మోడీ అత్యంత ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలోనే ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. » ఈ అరుదైన విశ్వవిద్యాలయాన్ని వారణాసిలో గంగానది పేరు మీదుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచన ప్రాయంగా నిర్ణయించింది. |
సెప్టెంబరు - 18
|
| ¤ దేశవ్యాప్తంగా పారిశ్రామిక కారిడార్‌ల అభివృద్ధి, పర్యవేక్షణకు జాతీయ స్థాయిలో ప్రత్యేకంగా 'జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి సంస్థ' ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. » ప్రస్తుతమున్న ఆరు జాతీయ కారిడార్లు ఢిల్లీ - ముంబాయి, చైన్నె - బెంగళూరు, బెంగళూరు - ముంబాయి, చైన్నై - విశాఖ, అమృత్‌సర్ - కోలకతా, ఈశాన్య కారిడార్ - మయన్మార్‌తో పాటు ఎనిమిది పారిశ్రామిక స్మార్ట్ సిటీలను ఈ సంస్థ ఆధ్వర్యంలోనే అభివృద్ధి చేస్తారు. » నిర్ణీత గడువులోగా ప్రాజెక్టులు పూర్తి చేసి, పారిశ్రామిక ప్రగతితో పాటు యవతకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. |
సెప్టెంబరు - 22
|
| ¤ గంగానది ప్రక్షాళనపై సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వం స్వల్పకాలిక (3 సంవత్సరాలు), మధ్యకాలిక (5 సంవత్సరాలు) , దీర్ఘకాలిక (పది సంవత్సరాలు) కార్యాచరణ ప్రణాళికలతో కూడిన బ్లూప్రింట్‌ను సమర్పించింది. » ప్రాజెక్టు పూర్తికి 18 ఏళ్ల సమయం పడుతుందని, రూ.51వేల కోట్లు ఖర్చు అవుతుందని తెలియజేసింది. » వ్యర్థజలాల శుద్ధి, ఘనవ్యర్థాల శుద్ధి సహా మొత్తం పారిశుద్ధ్యాన్ని సాధించేందుకు మొదటి లక్ష్యంగా గంగానది ఒడ్డున ఉన్న 118 పట్టణాలను గుర్తించినట్లు వెల్లడించింది. » 2,500 కి.మీ. పొడవున విస్తరించి ఉన్న గంగా పరివాహకంలోని రాష్ట్రాలను సంప్రదించాకే ప్రస్తుతం నడుస్తున్న ప్రాజెక్టులకు గడువు నిర్ధారించినట్లు వెల్లడించింది. మల విసర్జన ద్వారా జరిగే కాలుష్యాన్ని అరికట్టేందుకు నది ఒడ్డున ఉన్న 1649 గ్రామ పంచాయతీలను గుర్తించినట్లు ప్రభుత్వం కోర్టుకు వెల్లడించింది. ప్రవాస భారతీయులు సహా వివిధ వర్గాల ప్రజలను ఈ ప్రాజెక్టులో భాగస్వాములను చేయనున్నట్లు తెలిపింది. |
సెప్టెంబరు - 23
|
¤ 205వ ఆస్కార్ ఎంట్రీ కోసం ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో భారత్ నుంచి 'లయర్స్ డైస్'ఎంపికైంది. మొత్తం ఈ ఎంట్రీ కోసం 30 సినిమాలు పోటీపడ్డాయి. » తప్పిపోయిన తన భర్తను వెతుక్కుంటూ బయలుదేరిన ఓ గిరిజన మహిళ కథ ఇది. గీతాంజలిథాపా, నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రలు పోషించారు. » ఈ చిత్రంలోని నటనకు గీతాంజలి థాపాకు ఉత్తమ నటిగా, రాజీవ్ రవికి ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా జాతీయ అవార్డు దక్కింది. » ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎఫ్ఐ) దేశంలోని వివిధ ప్రాంతాలు, భాషలకు చెందిన సినీ ప్రముఖులతో నియమించిన 12 మంది సినీ ప్రముఖుల జ్యూరీ ఈ చిత్రాన్ని ఆస్కార్ ఎంట్రీకి ఎంపిక చేసింది. » ప్రముఖ మలయాళ నటి, దర్శకురాలు గీతూ మోహన్ దాస్ లయర్స్ డైస్‌కు దర్శకత్వం వహించారు. |
సెప్టెంబరు - 24
|
¤ బొగ్గుక్షేత్రాల కేటాయింపులపై సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పు వెలువరించింది. ఆగస్టు 25న వెలువరించిన తీర్పునకు కొనసాగింపుగా తుది నిర్ణయాన్ని ప్రకటించింది. కార్పొరేట్ రంగం కంగుతినేలా 1993 నుంచి 2010 వరకూ వివిధ కంపెనీలకు కేటాయించిన మొత్తం 218 క్షేత్రాల్లో 214 క్షేత్రాల కేటాయింపులను రద్దు చేసింది. అక్రమంగా కేటాయింపులు పొందినందుకు ప్రభుత్వానికి వాటిల్లిన నష్టానికి టన్నుకు రూ.295 చొప్పున పరిహారం చెల్లించాలని ఆయా కంపెనీలకు ధర్మాసనం ఆదేశించింది. ఈ మొత్తం రూ.7,900 కోట్లు అని అంచనా. జరిమానా మూడు నెలల్లోగా చెల్లించాలని ఆదేశించింది.¤ ప్రధానమంత్రి నరేంద్రమోడీ సంకల్పించిన 'స్వచ్ఛ భారత్' కార్యక్రమానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. » అక్టోబరు 2 నుంచి ఆరంభమయ్యే ఈ కార్యక్రమం అయిదేళ్లపాటు కొనసాగుతుంది. ఇందులో భాగంగా ఆరుబయట మలవిసర్జన నిర్మూలించడం, వ్యక్తిగత, సామాజిక మరుగుదొడ్లను నిర్మించడం లాంటివి చేపడతారు. » పౌరులు, ప్రవాస భారతీయులు, భారత సంతతికి చెందినవారి నుంచి విరాళాలతో 'పరిశుభ్ర గంగా నిధి'ని ఏర్పాటు చేయడానికీ కేబినెట్ ఆమోదం తెలిపింది. » ప్రధాని మోడీ అమెరికా పర్యటన నేపథ్యంలో ఆ దేశంతో కుదుర్చుకున్న 6 అవగాహన ఒప్పందాలకు (ఎంవోయూ) కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
|
సెప్టెంబరు - 26
|
¤ మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ తన పదవికి రాజీనామా చేశారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) మద్దతు ఉపసంహరించుకోవడంతో కాంగ్రెస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం మైనార్టీలో పడింది. ఈ నేపథ్యంలో సీఎం పదవి నుంచి చవాన్ వైదొలిగారు. » చవాన్ తన రాజీనామా లేఖను గవర్నర్ సి.హెచ్.విద్యాసాగర్‌రావుకు అందజేశారు. » మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు అక్టోబరు 15న జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో చెరో 144 స్థానాల్లో పోటీ చేద్దామని, సీఎం పదవిని చెరో రెండున్నరేళ్లపాటు తీసుకుందామని ఎన్సీపీ చేసిన ప్రతిపాదనకు కాంగ్రెస్ అంగీకరించలేదు. దీంతో ఎన్సీపీ తన మద్దతును ఉపసంహరించుకుంది. ఫలితంగా ప్రభుత్వం కూలిపోయింది.
|
సెప్టెంబరు - 27
|
¤ ఆదాయన్ని మించిన ఆస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జె.జయలలిత (66 సంవత్సరాలు)కు బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానం నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధించింది. » ఈ కేసులో మరో ముగ్గురు నిందితులు శశికళ (జయ స్నేహితురాలు), ఇళవరసి (శశికళకు సమీప బంధువు), సుధాకరణ్ (శశికళకు మేనల్లుడు, జయకు దత్తపుత్రుడు)లను దోషులుగా తేల్చిన న్యాయస్థానం 4 ఏళ్ల కారాగార శిక్ష, రూ.10 కోట్ల చొప్పున జరిమానా విధించింది. » బెంగళూరు శివార్లలోని పరప్పన్ అగ్రహార కేంద్ర కారాగారం ఎదుట ఉన్న ప్రత్యేక న్యాయస్థానంలో ప్రత్యేక జడ్జి జాన్ మైఖేల్ డికున్హా తీర్పు ఇచ్చారు. అనంతరం పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం ఆమెను పరప్పన్ అగ్రహారలోని కేంద్ర కారాగారానికి తరలించారు. » జైలు పాలై అనర్హత వల్ల సీఎం పదవిని కోల్పోయే పరిస్థితి ఏర్పడ్డ తొలి నేత జయనే.¤ మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కేంద్ర కేబినెట్ సిఫార్సు చేసింది. » ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో ఉండటంతో ఆయన స్థానంలో హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన కేబినెట్ సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది.
|
సెప్టెంబరు - 28
|
¤ సుప్రీంకోర్టు 42వ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ హెచ్.ఎల్.దత్తు ప్రమాణస్వీకారం చేశారు. » రాష్ట్రపతి భవన్ దర్బార్ హాల్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. » ఆయన పూర్తి పేరు హండ్యాల లక్ష్మీనారాయణ స్వామి దత్తు. 1950 అక్టోబరు 3న కర్ణాటకలోని హందిహళ్‌లో జన్మించారు. 1975లో న్యాయవాదిగా పేరు నమోదు చేయించుకున్నారు. బెంగళూరులో సివిల్, క్రిమినల్, పన్ను వివాదాలు, రాజ్యాంగ సంబంధిత కేసుల్ని ఎక్కువగా వాదించారు. 1983 నుంచి కర్ణాటక హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా, 1995లో అదే కోర్టులో న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. పదోన్నతిపై ఛత్తీస్‌గఢ్, కేరళ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తిగానూ సేవలందించారు. » 2008 డిసెంబరులో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2జి కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న ధర్మాసనానికి ప్రస్తుతం జస్టిస్ దత్తు నేతృత్వం వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం తలెత్తిన అంశాలపై విచారిస్తున్న ధర్మాసనానికీ ఆయనే నేతృత్వం వహిస్తున్నారు. » 14 నెలల పాటు ఆయన ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించి డిసెంబరు 2, 2015న పదవీ విరమణ చేయనున్నారు.¤ మహారాష్ట్రలో రాష్ట్రపతిపాలన విధించారు. సంబంధిత ప్రకటనపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతకం చేశారు. » ఎన్‌సీపీ (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ) మద్దతు ఉపసంహరణతో అక్కడి ప్రభుత్వం మైనారిటీలో పడటంతో, సీఎం పృథ్వీరాజ్ చవాన్ (కాంగ్రెస్) రాజీనామా చేశారు. కేంద్ర కేబినెట్ సిఫారసుతో రాష్ట్రపతి పాలన విధించారు.
|
సెప్టెంబరు - 29
|
¤ తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ఒ.పన్నీర్ సెల్వం చెన్నైలోని రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. » అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జైలుపాలు కావడంతో పదవి కోల్పోయారు. ఆమె స్థానంలో ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వంతో గవర్నరు కె. రోశయ్య ప్రమాణం చేయించారు. జయ మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా ఉన్న పన్నీర్ సెల్వం గతంలోనూ జయ జైలుకెళ్లినప్పుడు కొన్ని నెలలపాటు ముఖ్యమంత్రిగా పని చేశారు. » జయలలిత మంత్రివర్గంలో ఉన్న మంత్రులే యథాతథంగా మళ్లీ ప్రమాణ స్వీకారం చేశారు. వారి శాఖల్లో కూడా మార్పుల్లేవు. ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అంతకుముందు తాను చూసే ఆర్థికశాఖను కూడా తనవద్దే ఉంచుకున్నారు. » గతంలో జయలలిత సహా మొత్తం 32 మంది మంత్రివర్గంలో ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 31కి తగ్గింది.¤ ఆశించిన ప్రగతి లేకపోవడంతో 9 ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్‌లు)కు అనుమతులను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. » హిందాల్కో ఇండస్ట్రీస్, ఎస్సార్, అదానీ గ్రూప్‌లకు కేటాయించిన సెజ్‌లు కూడా వీటిల్లో ఉన్నాయి.¤ విద్యార్థులు సమర్పించే మార్కుల పత్రాలు, జనన, నివాస ధ్రువీకరణ పత్రాలు, ఇతర ముఖ్యమైన పత్రాల ప్రతులకు తప్పనిసరిగా గెజిటెడ్ అధికారి సంతకంతో 'అటెస్టేషన్' ఉండాలనే నిబంధనను తొలగించాలని విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) దేశ వ్యాప్తంగా అన్ని విశ్వ విద్యాలయాల ఉపకులపతులకు ఆదేశాలు జారీ చేసింది. » నిబంధనల సరళీకరణలో భాగంగా 'అటెస్టేషన్' స్థానంలో స్వీయ ధ్రువీకరణ విధానాన్ని ప్రవేశపెట్టాలని రెండో పరిపాలనా సంస్కరణల కమిషన్ సిఫార్సు చేసింది. ఈ సిఫార్సుకు అనుగుణంగా తాజా నిర్ణయం తీసుకున్నారు. ఈ విధానం ప్రకారం విద్యార్థులు ప్రవేశాల తుదిదశలో అసలు ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
|
సెప్టెంబరు - 30
|
¤ మావోయిస్టు ప్రభావిత ప్రాంత విద్యార్థుల కోసం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం రాయపూర్‌లో ఏర్పాటు చేసిన 'ప్రయాస్ ఆశ్రమ పాఠశాలలో ఇకపై ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సహా ఇతర ఐఏఎస్ అధికారులు కూడా పాఠాలు చెప్పాలని ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ ఆదేశాలు జారీ చేశారు. వారంలో ఒక్కసారైనా ఇక్కడ తప్పనిసరిగా బోధించాలని సీఎం ఆదేశించారు. » విద్యార్థుల్లో స్ఫూర్తి నింపి ఉజ్వల భవిష్యత్తు వైపు అడుగులు వేసేలా చేయడమే ఈ కార్యక్రమ లక్ష్యం. » మావోయిస్టు ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం ప్రభుత్వం 2010లో ప్రయాస్ ఆశ్రమ పాఠశాలను ఏర్పాటు చేసింది. 2012లో అఖిల భారత ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష (ఏఐఈఈఈ)లో ఈ పాఠశాలకు చెందిన ఎక్కువ మంది విద్యార్థులు అర్హత సాధించడంతో ఇది వార్తల్లోకి వచ్చింది.¤ భవిష్యనిధి పింఛన్‌దారుల కోసం ఉద్దేశించిన నెలకు కనీసం రూ.వెయ్యి పింఛను పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. » దీని అమలుకు రూ.1200 కోట్లు అవసరమనే అంచనాతో ప్రభుత్వం ఉంది. ఈపీఎఫ్ఓ అధికారుల అంచనా ప్రకారం రూ.వెయ్యి లోపు పింఛను తీసుకుంటున్న దాదాపు 32 లక్షల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. » దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న 37 ఉద్యోగ భవిష్యనిధి కార్యాలయాల్లో కేంద్ర మంత్రులు, ఎంపీలు దీన్ని ఏక కాలంలో ప్రారంభించారు. » మహారాష్ట్ర, హర్యానాల్లో ఎన్నికల నేపథ్యంలో ఈ పథకాన్ని ప్రారంభించ లేదు.
|
|
|