జులై - 2014 రాష్ట్రీయం


జులై - 2
¤  తెలంగాణ శాసనమండలి తొలి ఛైర్మన్‌గా తెరాస ఎమ్మెల్సీ కనకమామిడి స్వామిగౌడ్ ఎన్నికయ్యారు. ఓటింగ్‌లో ఆయన 21 ఓట్లతో విజయం సాధించారు. మొత్తం 35 మంది సభ్యులున్న మండలిలో 21 మంది మాత్రమే ఓటు వేయగా వాటన్నింటినీ స్వామిగౌడ్ కైవసం చేసుకున్నారు.   »    కాంగ్రెస్ పార్టీ పోటీ నుంచి విరమించుకుని, ఎన్నికను బహిష్కరించింది. తెలుగుదేశం పార్టీ వాకౌట్ చేసింది.¤  ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కొన్ని శాఖలకు వర్తించదని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.   »    రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు పదవీ విరమణ వయసు పెంపు వర్తించదని ప్రభుత్వం పేర్కొంది. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని 10వ షెడ్యూలులో ఉన్న సంస్థలు, శిక్షణ కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగులు 58 ఏళ్లకే రిటైర్ కావాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
 జులై - 4
¤  స్వాతంత్య్ర సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 117వ జయంతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు.   »    హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఉన్న ఆయన విగ్రహానికి సీఎం చంద్రబాబు నాయుడు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.   »    ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు జయంతిని రాష్ట్ర పండగగా గుర్తిస్తున్నట్లు సీఎం ప్రకటించారు.¤  రోడ్డు ప్రమాదాలపై వాహనదారుల్లో షార్ట్ ఫిల్మ్‌ల ద్వారా అవగాహన కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఈ షార్ట్ ఫిల్మ్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ క్రికెటర్ వి.వి.ఎస్.లక్ష్మణ్ వ్యవహరిస్తారు.   »    డ్రంకెన్ డ్రైవింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, సిగ్నల్ జంప్, ట్రిపుల్ రైడింగ్ తదితర అంశాలపై డిజి క్వెస్ట్ సంస్థ రూపొందించిన షార్ట్ ఫిల్ములను తెలంగాణవ్యాప్తంగా అన్ని థియేటర్లలో ప్రదర్శించాలని నిర్ణయించింది.   »    ప్రతి థియేటర్ యాజమాన్యం ఈ షార్ట్ ఫిల్ములను నెలరోజుల వ్యవధిలో కనీసం ఏడు రోజులు ప్రదర్శించాల్సి ఉంటుంది.¤  ఎయిర్ కోస్టా విమానయాన సంస్థ గన్నవరం విమానాశ్రయం నుంచి చెన్నై సర్వీసును నూతనంగా ప్రారంభించింది.¤  ఇంటర్నేషనల్ పేపర్ ఏపీపీఎం (ఐపీ - ఏపీపీఎం) 50 ఏళ్లు విజయవంతంగా పూర్తిచేసుకుంది. 1964లో 'ది ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్స్ లిమిటెడ్‌'గా తమ ప్రస్థానం ప్రారంభమైందని ఐపీ - ఏపీపీఎం ఒక ప్రకటనలో తెలిపింది.   »    గత ఆర్థిక సంవత్సరంలో సంస్థ రూ.1,091 కోట్ల టర్నోవర్‌ను సాధించింది. 2,12,193 టన్నుల కాగితాన్ని ఉత్పత్తి చేసింది.
జులై - 5
¤  తెలంగాణ రాష్ట్రంలో బొగ్గు గనులతోపాటు అపార ఖనిజ వనరులు ఉన్నాయని, వాటి ఆధారంగా తొమ్మిది జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేసి ఎక్కువ మందికి ఉపాధి కల్పించవచ్చని పరిశ్రమల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది.   »    సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పరిశ్రమల శాఖ అధికారులు గనుల శాఖను సంప్రదించి, జిల్లాల వారీగా ఖనిజ సంపద వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.                          తెలంగాణవ్యాప్తంగా ఖనిజ నిక్షేపాల తీరు
 
¤  సాంఘిక సంక్షేమ శాఖను దళితుల అభివృద్ధి శాఖగా మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.   »    శాఖ పేరు మార్చాలని ఇటీవల ఎస్సీ సంక్షేమ సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించిన నేపథ్యంలో ఈ మార్పు చేశారు.¤  ఇక నుంచి నెలకు మూడుసార్లు మంత్రివర్గ సమావేశాలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ మఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయించారు.   »    ప్రతినెలా 1, 10, 20వ తేదీల్లో మంత్రివర్గ భేటీలు జరుగుతాయని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 
జులై - 7
¤  ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ జనాభా 1.4 కోట్లకు పరిమితమైంది. ఇది జాతీయ సగటు కంటే తక్కువ. విభజన తర్వాత రాజధాని తెలంగాణకు వెళ్లడంతో పట్టణ జనాభా ఇరు రాష్ట్రాలకు సమానంగా వచ్చినప్పటికీ రాష్ట్ర జనాభాతో పోలిస్తే భారీ వ్యత్యాసం ఏర్పడింది.   »    ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ జనాభా 28.34 శాతానికి పరిమితమైంది. జాతీయ సగటుతో పోలిస్తే ఇది 2.7 శాతం తక్కువ. మరోవైపు గ్రామీణ జనాభా 71.66 శాతానికి పెరిగింది.   »    పురపాలక శాఖ అంచనా మేరకు ఉమ్మడి రాష్ట్రంలో జనాభా 8.47 కోట్లుగా ఉండగా 2.84 కోట్ల మంది నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో నివసించేవారు. రాష్ట్ర జనాభాలో పట్టణ జనాభా 33.50 శాతంగా నమోదైంది విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో మాత్రమే జనాభా 20 లక్షలు దాటింది. ఉమ్మడితో పోలిస్తే ఏపీలో పట్టణ జనాభా 5.16 శాతం తగ్గింది.   »    తెలంగాణలో పట్టణ జనాభా భారీగా పెరిగింది. ప్రస్తుతం 70 నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ పట్టణాల్లో 1.42 కోట్ల మంది ప్రజలు జీవిస్తున్నారు. తెలంగాణ మొత్తం జనాభాలో పట్టణ జనాభా శాతం 40.79గా నమోదైంది. హైదరాబాద్‌లో జనాభా మొత్తం తెలంగాణ పట్టణ జనాభాలో సగం ఉంది. ఉమ్మడి రాష్ట్ర సగటుతో పోలిస్తే 7.29 శాతం పెరిగింది.¤  తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిని ఏర్పాటు చేస్తూ అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఛైర్మన్‌గా వ్యవహరించే ఈ మండలిలో పర్యావరణ, అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి/ ముఖ్యకార్యదర్శి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణ అభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి, ఆరోగ్య, వైద్యశాఖ ముఖ్యకార్యదర్శి, పరిశ్రమల శాఖ కమిషనర్, రవాణ శాఖ కమిషనర్, తెలంగాణ పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కార్పొరేషన్, తెలంగాణ ఖనిజాభివృద్ధి కార్పొరేషన్ల ఎండీలు, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి సభ్యకార్యదర్శి సభ్యులుగా ఉంటారు.¤  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక కార్యదర్శిగా పి. రాజశేఖర్‌రెడ్డి నియమితులయ్యారు. ఈయన మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.¤  తెలంగాణ ఆయుష్ కమిషనర్‌గా కె.వీణాకుమారి నియమితులయ్యారు.¤  రోడ్లు, వంతెనల నిర్మాణం నిమిత్తం తెలంగాణ రాష్ట్రానికి నాబార్డు రూ.77.63 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో 19 పనులు చేపట్టనున్నారు. వాటిలో నాలుగు రోడ్లు, 15 బ్రిడ్జిలు ఉన్నాయి.   »    ఉమ్మడి రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్‌కు 63 పనుల కోసం రూ.250 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధుల నుంచే తెలంగాణ రాష్ట్రంలో పై పనులు చేపట్టనున్నారు.
జులై - 9
¤  రైతు బంధు పథకం కింద పంటలపై ఇచ్చే రుణ పరిమితిని రూ.లక్ష నుంచి రూ. 2 లక్షలకు పెంచుతూ తెలంగాణ మార్కెటింగ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పథకం అమల్లో పలు మార్పులు చేస్తూ మార్గదర్శకాలు వెలువరించింది.   »    రుణం తీసుకున్న తేదీ నుంచి 180 రోజుల వరకూ ఎలాంటి వడ్డీ ఉండదు. 181వ రోజు నుంచి 270 రోజుల వరకూ 12 శాతం వడ్డీ వసూలు చేస్తారు. ఆ తర్వాత కూడా పంటలు గోదాముల్లో ఉంటే వాటిని అమ్మి బకాయి కింద సొమ్ము జమ కట్టుకునే అధికారం మార్కెట్ పాలకవర్గానికి ఉంటుంది.   »    ఈ పథకం కింద రైతులకు ఇచ్చే కార్డుల కాలపరిమితిని మూడు నుంచి అయిదేళ్లకు పెంచారు. ఈ రుణాలు తీసుకోవడానికి ఇప్పటివరకూ రైతులు పొలం తాకట్టు పెట్టాల్సివచ్చేది. ఇక నుంచి భూముల తాకట్టు అవసరం లేదని నిబంధనలు సవరించారు.¤  స్వీడన్‌కు చెందిన అంతర్జాతీయ గృహోపకరణాల తయారీ సంస్థ ఐకియా (IKEA) తెలంగాణలో తమ పరిశ్రమను స్థాపించేందుకు ముందుకొచ్చింది. రూ.600 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో భారీ సముదాయం నిర్మాణంతో పాటు మహిళా సంఘాలు, జౌళి, చేతివృత్తుల వారికి ఉపాధి కల్పిస్తామని వెల్లడించింది.   »    ఐకియా సీఈవో జువెనికొ మాజెటు, సీఎఫ్‌వో ప్రీత్ దూపర్ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సచివాలయంలో కలిసి తమ ప్రతిపాదనలను సమర్పించారు.¤  ఆంధ్రప్రదేశ్‌లో రూ.1000 కోట్ల వ్యయంతో వ్యవసాయాధారిత పరిశ్రమలను నెలకొల్పేందుకు  థాయ్‌లాండ్కు చెందిన సీపీఎఫ్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ ముందుకొచ్చింది. సీపీఎఫ్ సంస్థ వాణిజ్య ప్రతినిధులు హైదరాబాద్‌లో సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు.   »    చిత్తూరు జిల్లా దిగువంశపల్లిలో చికెన్ ప్రాసెసింగ్ ప్లాంటును; నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో రూ.150 కోట్లతో రొయ్యల ప్రాసెసింగ్, ఎగుమతి ప్లాంటు; తూర్పుగోదావరి జిల్లా ఎర్రవరం, పశ్చిమ గోదావరి జిల్లా సారిపల్లి గ్రామాల్లో రూ.600 కోట్లతో చేప, రొయ్యలదాణా మిల్లులను అందుబాటులోకి తేనున్నట్లు సంస్థ వెల్లడించింది.
జులై - 11
¤  ఆంధ్రప్రదేశ్‌కు ఒక బ్రాండ్ నేమ్ తీసుకురావాల్సిన అవసరముందని, ఈ దృష్ట్యా ఆంధ్రప్రదేశ్‌కు 'సన్‌రైజ్ కంట్రీ'గా బ్రాండ్ నేమ్‌ను ఎంపిక చేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇదే పేరుతో ఇక ముందు రాష్ట్రాన్ని ప్రపంచ దేశాల ముందుకు తీసుకెళతామని పేర్కొన్నారు.   »    రాష్ట్రాభివృద్ధికి ఎనిమిది నుంచి 9 ప్రగతి వాహకాలను (గ్రోత్ ఇంజిన్లు) ఏర్పాటు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు.   »    పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో 500 ఎకరాల్లో మెగా ఫుడ్‌పార్క్, రాజమండ్రిలో పెట్రోలియం విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లాలో మెరైన్ విశ్వవిద్యాలయం, గుంటూరులో టెక్స్‌టైల్ కారిడార్, అనంతపురం - చిత్తూరు జిల్లాల్లో హార్టికల్చర్ కారిడార్, విశాఖపట్నంలో ఫార్మా కారిడార్‌ను ఏర్పాటు చేయనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.
జులై - 12 
¤  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక ప్రణాళికకు రూ.32 వేల కోట్లు అవసరమని రాష్ట్ర ఆర్థికశాఖ అంచనా వేసింది.   »    విభజన తర్వాత ఏపీ భారీ రెవెన్యూ లోటులో కూరుకుంది. దీంతో వార్షిక ప్రణాళికకు కూడా నిధుల లభ్యత తక్కువగా ఉంది. ఇందుకు అవసరమైన నిధుల కోసం కేంద్ర ప్రభుత్వం అనుమతికి మించి అదనంగా రూ.26 వేల కోట్లు అప్పు చేయాల్సి వస్తుందని ఆర్థికశాఖ తేల్చింది.¤  గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) నిర్మాణానికి కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించింది.
జులై - 15
¤  ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక, గృహావసరాలను తీర్చేందుకు గ్యాస్ గ్రిడ్ ఏర్పాటు చేయడానికి గెయిల్ నిర్ణయించింది.   »    హైదరాబాద్‌లో సీఎం చంద్రబాబు, గెయిల్ సీఎండీ బి.సి.త్రిపాఠి మధ్య ఈమేరకు ఒక అవగాహన ఒప్పందం కుదిరింది.   »    ఇందులో భాగంగా శ్రీకాకుళం - కాకినాడ - నెల్లూరు మధ్య గ్యాస్ పైప్ లైన్ నిర్మించాలని నిర్ణయించారు.
జులై - 16
¤  ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు వరాల జల్లు కురిపించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని మంత్రిమండలి 43 అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంది.ముఖ్యాంశాలు:   »    రూ.లక్ష వరకూ వ్యవసాయ రుణాల మాఫీ. బంగారం పై రుణాలకూ ఇది వర్తింపు. దీనివల్ల 39,07,409 రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వంపై రూ.17 వేలకోట్ల నుంచి రూ.19 వేల కోట్ల భారం పడనుంది.   »    తెలంగాణ ఉద్యమంలో 1969 నుంచి ప్రాణత్యాగాలు చేసిన అమరవీరుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం. అమరుల పిల్లలకు ఉచిత విద్య, వైద్యం, గృహవసతి లేనివారికి కొత్త ఇల్లు. వారు భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు చెందినవారైతే మూడెకరాల భూమి.   »    వృద్ధులు, వితంతువులకు ఇకపై నెలసరి పింఛను రూ.వెయ్యి, వికలాంగులకు రూ.1500 చొప్పున అమలు.   »    తెలంగాణలోని దళిత, గిరిజన అమ్మాయిల పెళ్లి కోసం 'కళ్యాణ లక్ష్మి' పథకం కింద రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం.   »    తెలంగాణ విద్యార్థుల కోసం ఫాస్ట్ (ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ) ఏర్పాటుకు సుముఖం. బడుగు, బలహీన వర్గాలతోపాటు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు సాయం. 1956 కంటే ముందు నివాసం ఉన్నవారికే ఇది వర్తింపు.   »    రాష్ట్రంలోని 500 జనాభా ఉన్న అన్ని తండాలు, గిరిజన గూడాలను పంచాయతీలుగా మార్పు.   »    నిరుపేద దళిత కుటుంబాలకు మూడెకరాల భూమి.   »    బతుకమ్మ, బోనాలుకు రాష్ట్ర పండగల హోదా.   »    ప్రొఫెసర్ జయశంకర్ పేరిట తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు.   »    మాజీ ప్రధాని పీవీ పేరుతో పశువైద్య విశ్వవిద్యాలయం.   »    తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఏర్పాటు.   »    రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటుకు చర్యలు.   »    మర మగ్గాల కార్మికుల రుణాలు రూ.6.50 కోట్ల మాఫీ.   »    ఆంధ్రప్రదేశ్ పేరుతో ఉన్న చట్టాలను తెలంగాణ రాష్ట్రం పేరుతో మార్పులు.   »    రాష్ట్ర విభజన చట్టం 9వ షెడ్యూలులో ఉన్న ఉమ్మడి సంస్థలకు తెలంగాణ రాష్ట్రం పేరు.   »    శాసనమండలికి నల్గొండ జిల్లాకు చెందిన కర్నె ప్రభాకర్ పేరును గవర్నర్‌కు సిఫారసు చేస్తూ నిర్ణయం.
జులై - 17
¤   భారీ వర్షాలు, తుపానులు లాంటి విపత్తులకు పంటలు పాడైన మండలాల జాబితాలో మరో 78 మండలాలను చేర్చాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రీషెడ్యూల్‌కు అర్హమయ్యే మండలాల సంఖ్య 415కు పెరగనుంది.   »    విపత్తు జాబితాలో కొత్తగా చేర్చిన మండలాల్లో ఆదిలాబాద్ జిల్లాలో 39, నిజామాబాద్ జిల్లాలో 22, కరీంనగర్ జిల్లాలో 7, మహబూబ్‌నగర్ జిల్లాలో 7, వరంగల్ జిల్లాలో 3 మండలాలు ఉన్నాయి.
జులై - 19 
¤   తెలంగాణలో రుణ మాఫీ పథకం అమలుకు రాష్ట్రప్రభుత్వం ఉన్నతాధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.   »    ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి వి.నాగిరెడ్డి ఛైర్మన్‌గా ఉన్న ఈ కమిటీలో మరో 10 మంది అధికారులను సభ్యులుగా నియమించింది.
జులై - 20
¤   ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించింది.   »    కమిటీ ఛైర్మన్‌గా పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ ఉంటారు. సభ్యులుగా రాజ్యసభ సభ్యుడు యలమంచలి సత్యనారాయణ చౌదరి (వై.ఎస్.చౌదరి), గుంటూరు లోక్‌సభ సభ్యుడు గల్లా జయదేవ్, కావలి మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు, జీవీకే గ్రూపునకు చెందిన జి.వి.సంజయ్‌రెడ్డి, జీఎంఆర్ గ్రూప్ నుంచి బొమ్మిడాల శ్రీనివాస్, నూజీవీడు సీడ్స్ లిమిటెడ్ ఛైర్మన్ ఎం.ప్రభాకర్ రావు, పీపుల్ క్యాపిటల్ ఛైర్మన్ చింతలపాటి శ్రీనివాసరాజు ఉంటారు.   »    ఈ కమిటీకి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి డి.సాంబశివరావు సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు.
జులై - 21
¤   ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి రైతు కుటుంబానికీ రూ.1.50 లక్షల వ్యవసాయ రుణ మాఫీని సీఎం చంద్రబాబు ప్రకటించారు.   »    అది పంట రుణమైనా, బంగారం రుణమైనా సరే ఒక్కో కుటుంబానికి రూ. లక్షన్నర వరకు లబ్ధి చేకూరుతుంది. దీనివల్ల రాష్ట్రంలోని 96.27 శాతం మంది రైతుల రుణాలన్నీ పూర్తిగా మాఫీ అవుతాయి. మరో 3.73 శాతం మందికి రూ.1.50 లక్షల లబ్ధి చేకూరుతుంది. తద్వారా రాష్ట్రంలోని వందశాతం మంది రైతులు లాభపడతారు.   »    మార్చి 31, 2014 వరకు అప్పులు కట్టినవారికీ, కట్టని వారికీ రుణ మాఫీ వర్తిస్తుందని సీఎం ప్రకటించారు.   »    రైతు రుణ మాఫీ విధానం, ఆర్థిక వనరుల సమీకరణ కోసం ఏర్పాటు చేసిన కోటయ్య కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం తరఫున సీఎం ఈ విధాన ప్రకటన చేశారు.   »    డ్వాక్రా సంఘాలకు లక్ష రూపాయల వరకు రుణ మాఫీ చేస్తున్నట్లు కూడా చంద్రబాబు ప్రకటించారు.¤   ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య అఖిల భారత (సివిల్) సర్వీసు పోస్టుల విభజనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసి నోటిఫికేషన్ జారీ చేసింది.   »    ఐఏఎస్ పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్‌కు 211, తెలంగాణకు 163.   »    ఐపీఎస్ పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్‌కు 144, తెలంగాణకు 112.   »    అటవీ సర్వీసు (ఐఎఫ్ఎస్) పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్‌కు 82, తెలంగాణకు 65 కేటాయించింది.   »    రెండు రాష్ట్రాలకు కేటాయించిన మొత్తం ఐఏఎస్ పోస్టుల్లో 33.3 శాతం పదోన్నతుల ద్వారా భర్తీ చేసుకోవాలి. మిగిలిన పోస్టులు నేరుగా నియామకాల విధానంలో కేంద్రం నియమిస్తుంది.¤   ఈ ఏడాది ఖరీఫ్‌లో దెబ్బతిన్న పంటలకు పరిహారం పొందేలా గ్రామం యూనిట్‌గా పంటల బీమా పథకాన్ని వర్తింపజేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.   »    ఈ ప్రకారం ఆదిలాబాద్ జిల్లాలో సోయాబీన్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో మొక్కజొన్న; కరీంనగర్, నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో వరి పంటలకు బీమా కల్పించారు.
జులై - 23
¤   ఉపాధి హామీ పథకంలో కూలీల కనీస వేతనాన్ని రూ.169 గా నిర్ణయిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.   »    గతంలో కనీస వేతనం రూ.149గా ఉండేది.¤   ఆంధ్రప్రదేశ్ పూర్తిస్థాయి డీజీపీగా జాస్తి వెంకట రాముడు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఆయన తాత్కాలిక ప్రాతిపదికన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.    »    1981 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన రాముడును పూర్తిస్థాయి డీజీపీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
జులై - 24
¤   హైదరాబాద్ బోయిన్‌పల్లిలోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ మార్కెట్ యార్డు ఆవరణలో రైతులకు రూ.5కే భోజనాన్ని అందించే 'సుభోజనం' పథకాన్ని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల, మార్కెటింగ్‌శాఖ మంత్రి టి.హరీష్‌రావు ప్రారంభించారు.   »    మార్కెటింగ్ పనులకు వచ్చే రైతులకు తక్కువ ధరకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించినట్లు మంత్రి ప్రకటించారు.¤   బతుకమ్మను తెలంగాణ రాష్ట్ర పండగగా ప్రకటించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయంలో బతుకమ్మ పండగకు ఉన్న ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది.
జులై - 25
¤   'బడి పిలుస్తోంది' పేరిట రాష్ట్రవ్యాప్త కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనంతపురం జిల్లా కుటాగుళ్లలో అధికారికంగా ప్రారంభించారు.   »    ఆంధ్రప్రదేశ్‌లో విద్యాహక్కు చట్టాన్ని వందశాతం అమలు చేసే క్రమంలో 'బడి పిలుస్తోంది' కార్యక్రమాన్ని రూపొందించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. బడిఈడు పిల్లలను బడిలో చేర్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది.   »    ఆంధ్రప్రదేశ్‌లో బడి బయట ఉన్న 1.59 లక్షల మంది చిన్నారులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చుతామని సీఎం ప్రకటించారు.
జులై - 28
¤   తెలంగాణ ప్రభుత్వ రాజముద్రలో స్వల్ప మార్పులు చేశారు. ఈ మార్పులతో కూడిన ముద్రనే వినియోగించాలని అన్ని శాఖల ముఖ్యకార్యదర్శులు, శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.   »    తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే కొత్త రాజముద్రను ఎంపిక చేసి కేంద్రానికి పంపించారు. అందులో కొన్ని లోపాలున్నాయని, వాటిని సవరించాలని కేంద్రం ఆదేశించింది. ఇటీవల జరిగిన మంత్రిమండలి సమావేశంలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు.   »    పాతముద్రలో సత్యమేవ జయతే అక్షరాలు రాజముద్ర బయట ఉండేవి. కొత్త రాజముద్రలో నాలుగు సింహాల కింది భాగంలో సత్యమేవ జయతే అక్షరాలను చేర్చారు. పాత ముద్రలో చార్మినార్‌లోని మూడు మినార్లు మాత్రమే కనిపించేవి. కొత్త ముద్రలో నాలుగు మినార్లు కనిపించేలా మార్చారు.¤   తెలంగాణలోని పాఠశాలల పని సమయాన్ని ఒక గంట పాటు పొడిగించారు.   »    విద్యాహక్కు చట్టంతోపాటు హైకోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్రంలోని పాఠశాలలకు కొత్త అకడమిక్ క్యాలెండర్‌ను రూపొందించారు.   »    కొత్త క్యాలెండర్ ప్రకారం ఇక నుంచి హైదరాబాద్ మినహా అన్ని ప్రాంతాల్లోని పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4.30 దాకా పని చేయాల్సి ఉంటుంది. అంటే రోజుకు ఏడున్నర గంటల సమయం, 9 పీరియడ్లు ఉంటాయి. ప్రాథమిక పాఠశాలలకైతే 8 పీరియడ్లు.   »    ఇన్నాళ్లూ పాఠశాలల పనివేళలు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 : 30 దాకా ఉండేవి.   »    విద్యాహక్కు చట్టం ప్రకారం రోజుకు ఏడున్నర గంటలు నడపాలంటూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలవడంతో ప్రభుత్వం చట్టాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.   »    9 పీరియడ్లలో ఒకదాన్ని అనుబంధ సబ్జెక్టులకు (జీవన నైపుణ్యాలు/ విలువల విద్య తదితరాలు) కేటాయిస్తారు.   »    వీటితోపాటు ఫార్మేటివ్ అసెస్‌మెంట్‌కు సంబంధించి కూడా వారానికి రెండు పీరియడ్లు కేటాయిస్తున్నారు. దీనిలో భాగంగా పుస్తక పఠనం, ల్యాబ్ రికార్డులు రాయడం, సామాజికాంశాలపై సమీక్ష తదితరాలుంటాయి.
జులై - 30
¤   హైదరాబాద్‌లో ఉన్న ప్రతిష్ఠాత్మక నల్సార్ (NALSAR - నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రిసెర్చ్) తరహా న్యాయ విశ్వవిద్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిలో ఏర్పాటుకు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.   »    ప్రతి రాష్ట్రంలో నేషనల్ లా స్కూల్ తరహా న్యాయ కళాశాల ఉండాలని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎ.అహ్మదీ నేతృత్వంలోని కమిటీ సిఫారసు చేసింది. దాని ప్రకారమే ఏపీ ప్రభుత్వం నల్సార్ తరహా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.¤   తెలంగాణలో 1956 నవంబరు 1 నాటికి స్థిరపడిన కుటుంబాల విద్యార్థులకే ఫాస్ట్ (తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సాయం) పథకం అమలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.   »    ఈ పథకానికి అవసరమైన మార్గదర్శకాల జారీకి ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.
జులై - 31
¤   ఆంధ్రప్రదేశ్‌లో వినియోగదారులందరికీ 24 గంటలపాటు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని, అక్టోబరు 2వ తేదీ (గాంధీ జయంతి) నుంచి వ్యవసాయానికి రోజుకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.   »    కేంద్ర ప్రభుత్వ సహకారంతో అనంతపురం, గుంటూరులో 1300 మెగావాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ పార్కులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.   »    ఏపీ జెన్‌కో ఆధ్వర్యంలో పోలవరం జల విద్యుత్ కేంద్రం (960 మెగావాట్లు) నిర్మించాలని నిర్ణయించారు.¤   జాతీయ గ్రామీణ తాగునీటి సరఫరా కార్యక్రమంలో భాగంగా విశ్రాంత ఇంజినీర్ ఇన్ చీఫ్ (పంచాయతీరాజ్ శాఖ) ఆర్.కొండలరావును గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య విభాగం, పంచాయతీరాజ్, ఉపాధి హామీ పథకాలకు సంబంధించి సాంకేతిక సలహాదారుగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.¤   ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని విభజించి తెలంగాణకు ప్రొఫెసర్ జయశంకర్ పేరుతో ప్రత్యేక వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.   »    ప్రస్తుతమున్న ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పేరు ఇకనుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యవసాయ వర్సిటీగా కొనసాగుతుంది.   »    మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు పేరుతో తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం తిరుపతిలో ఉన్న శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయాన్ని విభజించి తెలంగాణకు ప్రత్యేకంగా వర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.¤   హైకోర్టు ఆదేశాల మేరకు విద్యా హక్కు చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రభుత్వ పాఠశాలల పని వేళలను ఒక గంటపాటు పెంచారు.   »    రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, జడ్పీ, ఎయిడెడ్, మున్సిపల్ పాఠశాలలకు ఈ నియమం వర్తిస్తుంది.   »    ఇకపై అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పనిచేస్తాయి.