ఆగస్టు - 1
|
¤ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. హైదరాబాద్ లేక్‌వ్యూ అతిథిగృహంలో జరిగిన కేబినెట్ భేటీ అనంతరం ఆ వివరాలను రాష్ట్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ వెల్లడించారు.ముఖ్యాంశాలు » నూతన ఇసుక విధానానికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. రాష్ట్రంలోని 7.6 లక్షల డ్వాక్రా సంఘాలు, అందులో సభ్యులుగా ఉన్న 75 లక్షలమంది మహిళలకు ఇసుక తవ్వకం బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించారు. ఏపీఎండీసీతోపాటు మహిళలకూ భాగస్వామ్యం కల్పించి ఇసుక క్రయ, విక్రయ లావాదేవీలను వారికే అప్పగించనున్నారు. ఇసుక విక్రయం ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో 25 శాతాన్ని మహిళా సంఘాలకు ఇస్తారు. » కాపులను బీసీల్లో చేర్చేందుకు కొత్త బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలని, అగ్రవర్ణ పేదలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వడానికి కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. » అనంతపురం జిల్లా నంబూలపూలకుంట మండలం పి.కొత్తపల్లిలో వంద మెగావాట్ల సామర్థ్యంఉన్న సౌర విద్యుత్తు పార్కు ఏర్పాటు చేస్తారు. ఇందుకు అవసరమైన 500 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇంధన శాఖకు కేటాయించారు. » చిత్తూరు జిల్లా ఎస్.ఆర్.పురం మండలం చిన్నతయారులో 600 ఎకరాల భూమి, కొక్కిరాలకొండలో 502.32 ఎకరాలు కలిపి మొత్తం 1102.32 ఎకరాలు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) ప్రాజెక్టు స్థాపనకు కేటాయించారు. » అనంతపురం, గుంటూరు జిల్లాల్లో వరుసగా 1000, 300 మెగావాట్ల సామర్థ్యంతో రెండు సౌరవిద్యుత్తు పార్క్‌లు ఏర్పాటు చేస్తారు. » 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం కింద మూడు నెలలపాటు ప్రతి మంగళ, బుధవారాల్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు రైతుల వద్దకు వెళ్లాలని నిర్ణయించారు. దిగుబడి పెంచడంతోపాటు, ఉత్పత్తులకు లాభదాయకమైన ధరలు వచ్చేలా చేయాలని నిర్ణయించారు. పండ్ల తోటలు, పాడి, మత్స్య పరిశ్రమలకు చేయూతనివ్వాలని తీర్మానించారు. బిందు, తుంపర్లులాంటి సూక్ష్మసేద్యాన్ని ప్రోత్సహించనున్నారు. » విశాఖపట్నం, విజయవాడ -గుంటూరు - తెనాలి -మంగళగిరి మధ్య మెట్రోరైల్ ప్రాజెక్టును వేగవంతంగా చేపట్టడానికి రెండు ప్రత్యేక స్పెషల్ పర్పస్ వెహికిల్స్ ఏర్పాటు చేస్తారు. » వచ్చే అయిదేళ్లలో రాష్ట్రాన్ని కరవు రహిత ప్రాంతంగా తీర్చిదిద్దడానికి వీలుగా కొత్తగా 'నీరు - చెట్టు' కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. విధివిధానాల రూపకల్పనకు మంత్రులతో ఉపకమిటీ ఏర్పాటు చేశారు. కొత్త పథకం కింద రాష్ట్రంలోని చిన్ననీటివనరులన్నింటినీ పునరుద్ధరిస్తారు. తూములకు మరమ్మతు చేస్తారు. » తక్కువ ధరకే ఆహారాన్ని అందించడానికి ఎన్టీఆర్ క్యాంటీన్లు, తక్కువ ధరకే ఇంగ్లిష్ ఔషధాలు అందించే జనరిక్ దుకాణాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనిపై అధ్యయనానికి ఉపకమిటీ రూపొందించారు.¤ తెరాస సిద్ధాంతకర్త, తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతిని ఆగస్టు 6న అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. » హైదరాబాద్‌లో ఆచార్య జయశంకర్ స్మారకార్థం విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. వరంగల్, హైదరాబాద్‌లలో ఆయన స్మారక కేంద్రాలుంటాయని పేర్కొన్నారు.¤ తెలంగాణలో ఆగస్టు 19న 'సమగ్ర కుటుంబ సర్వే'ను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒకే రోజు నిర్వహించే ఈ కార్యక్రమంలో తెలంగాణలోని 4 లక్షల మంది ఉద్యోగులు పాల్గొంటారు. సర్వేలో పాల్గొనే ఉద్యోగులకు ఆ రోజు విధులను ఆన్‌డ్యూటీగా పరిగణిస్తారు. సర్వే పూర్తయినట్లు ఇంటిపై స్టిక్కర్ అతికించడం లేదా ముద్ర వేయడం చేస్తారు. సర్వే కోసం జిల్లాకు రూ.2 కోట్లను ప్రభుత్వం అందజేస్తుంది. హైదరాబాద్‌లోనూ ఈ నెల 19నే సర్వే నిర్వహించాలని నిర్ణయించారు. » ఈ సర్వే ద్వారా రాష్ట్రంలోని 84 లక్షల కుటుంబాలకు సంబంధించిన ఆర్థిక, సామాజిక సమాచారం సేకరిస్తారు. » కుటుంబం, కుటుంబ సభ్యుల వివరాలు; ఇంటి విద్యుదీకరణ, వికలాంగులుంటే వారి వివరాలు, వ్యవసాయ భూములు, దీర్ఘకాలిక వ్యాధులు, పశుసంపద, సొంత చరాస్తుల వివరాలకు సంబంధించి 70కిపైగా అంశాలపై సమాచారాన్ని సర్వేలో సేకరిస్తారు. » కులం, ఆదాయం, గ్యాస్, బ్యాంకు ఖాతాలు, పొందుతున్న ప్రభుత్వ ప్రయోజనాల వివరాలు, ఇంట్లోని ఎలక్ట్రానిక్ పరికరాలు, వాహనాల సమాచారాన్నీ పొందుపరుస్తారు. » ఈ సర్వేకు రెవెన్యూ శాఖ నోడల్ సంస్థగా వ్యవహరిస్తుంది. |
ఆగస్టు - 2
|
¤ ఏపీ హజ్ కమిటీని 'తెలంగాణ హజ్ కమిటీ'గా మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన చట్టం పదో షెడ్యూలులోని నిబంధనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.¤ తెలంగాణ రాష్ట్రంలోనూ ఉన్నత విద్యామండలి ఆవిర్భవించింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని పదో షెడ్యూల్‌లో ఉన్న ఈ మండలిని విభజిస్తూ చట్టప్రకారం తెలంగాణకు కొత్త మండలిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. » మండలికి ఛైర్మన్, ఒక వైస్ ఛైర్మన్ (ఆంధ్రప్రదేశ్‌కు ఇద్దరు వైస్ ఛైర్మన్లు ఉన్నారు), ఒక కార్యదర్శి ఉంటారు. వీరితో పాటు ఉస్మానియా, కాకతీయ, జేఎన్‌టీయూ, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, శాతవాహన విశ్వవిద్యాలయాల ఉపకులపతులు సభ్యులుగా వ్యవహరిస్తారు. ¤ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) దాదాపు 1800 కిలోల బంగారాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జమచేసింది. గత రెండేళ్లుగా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి భక్తులు ఆభరణాలు, కానుకల రూపంలో హుండీలో సమర్పించిన బంగారాన్ని టీటీడీ జమ చేసింది. » తిరుపతి వచ్చిన ఎస్‌బీఐ ఛైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య డిపాజిట్ కింద బంగారాన్ని స్వీకరించినట్లు ధ్రువీకరణ పత్రాన్ని టీటీడీ కార్యనిర్వహణ అధికారికి అందజేశారు. » 1800 కిలోల బంగారంపై ఎస్‌బీఐ వడ్డీ కింద ఒకశాతం బంగారాన్ని చెల్లిస్తుంది. » టీటీడీ డిపాజిట్ చేసిన బంగారాన్ని ముంబయిలోని ప్రభుత్వ మింట్‌లో కరిగించి స్వచ్ఛమైన బంగారాన్ని వేరుచేస్తారు. ఇందుకయ్యే ఖర్చులన్నీ ఎస్‌బీఐ భరిస్తుంది. » ఇదికాకుండా టీటీడీకి ఎస్‌బీఐ, కార్పొరేషన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుల్లో మొత్తం 4,335 కిలోల స్వచ్ఛమైన బంగారం డిపాజిట్ల కింద ఉంది. |
ఆగస్టు - 3
|
¤ తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి నిర్వహించనున్న స్వాతంత్య్ర దినోత్సవాన్ని చారిత్రక గోల్కొండ కోట వద్ద జరపాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. » 1956లో ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో స్వాతంత్య్ర దిన వేడుకలు జరుగుతున్నాయి. » కాకతీయుల కాలంలో నిర్మించిన గోల్కొండ కోట కుతుబ్‌షాహీల హయాంలో రాజధానిగా వందల ఏళ్లపాటు ఉంది. ఇక్కడ శ్రీజగదాంబిక, పోచమ్మ ఆలయాలు ఉన్నాయి. తెలంగాణలో బోనాల ఉత్సవాలు ప్రారంభం, ముగింపు ఇక్కడే జరుగుతాయి. భక్తరామదాసు బందీఖానాతో పాటు దర్బార్ హాలు, కుతుబ్‌షాహీల మంత్రులు అక్కన్న, మాదన్న కార్యాలయాలు; రాణిమహల్ లాంటి నిర్మాణాలు ఉన్నాయి. |
ఆగస్టు - 6
|
¤ గోదావరి నది యాజమాన్య బోర్డు తొలి సమావేశం హైదరాబాద్‌లో జరిగింది. » ఈ సమావేశానికి బోర్డు ఛైర్మన్ మహేంద్రన్ అధ్యక్షత వహించగా, ఆంధ్రప్రదేశ్ తరఫున నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, ఇంజినీర్ ఇన్ చీఫ్ వేంకటేశ్వరరావు, జెన్‌కో డైరెక్టర్ ఆదిశేషు, గోదావరి బోర్డు సభ్య కార్యదర్శి చంద్రశేఖర్ అయ్యర్, కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి ఆర్.కె.గుప్తా హాజరయ్యారు. తెలంగాణ తరఫున నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.కె.జోషి, ట్రాన్స్‌కో సీఎండీ రిజ్వి తదితరులు హాజరయ్యారు. |
ఆగస్టు - 8
|
¤ విశాఖపట్నం జిల్లా చోడవరంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో 'పొలం పిలుస్తోంది'
కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. » 'పొలం పిలుస్తోంది' కార్యక్రమంలో భాగంగా అధికారులు క్షేత్రస్థాయిలో అన్ని గ్రామాల్లో
పర్యటించి సీజన్ల వారీగా రైతులకు ఉత్పాదక శక్తి ఎలా పెంచాలో సూచనలు ఇస్తారు. |
ఆగస్టు - 10
|
¤ ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని (ఆగస్టు 28) రాష్ట్ర పండగగా గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.¤ ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పల్లెలకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. పూర్తిగా కేంద్ర నిధులతో రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చేలా ఫైబర్ ఆప్టిక్ కేబుల్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. |
ఆగస్టు - 12
|
¤ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన రాజధాని నిర్మాణం పూర్తయ్యేవరకు విజయవాడ నగరాన్ని తాత్కాలిక రాజధానిగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. » ప్రజలతో నిత్యం సంబంధాలు ఉండే, ప్రజోపయోగమైన, ప్రధాన పరిపాలనా విభాగాలను వెంటనే అక్కడికి తరలించాలని నిర్ణయించింది. |
ఆగస్టు - 13
|
¤ ఆంధ్రప్రదేశ్‌లో రెండు మెట్రో రైళ్ల ప్రాజెక్టుల్లో ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ రెండు ప్రాజెక్టులను వేగంగా చేపట్టేందుకు అవసరమైన కసరత్తు మొదలు పెట్టింది. » ఇందులో భాగంగా గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ, విజయవాడ - గుంటూరు - మంగళగిరి - తెనాలి పట్టణాభివృద్ధి సంస్థ (వీజీటీఎం)ల్లో మెట్రో రైళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం ప్రత్యేక సంస్థలను ఏర్పాటు చేసింది.¤ కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బి.ఇ.ఎల్.) రక్షణ రంగ అవసరాల కోసం అనంతపురం జిల్లాలో రూ.1500 కోట్లతో భారీ పరిశ్రమ ఏర్పాటుకు సిద్ధమైంది. పెనుకొండలో సుమారు 1000 ఎకరాల భూమి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. బెంగళూరులోని బెల్ కార్యాలయానికి దీన్ని అనుసంధానం చేస్తామని తెలిపింది. » మచిలీపట్నంలోని బెల్ పరిశ్రమ విస్తరణకు 500 ఎకరాలను కేటాయించాలని కూడా బెల్ సంస్థ ప్రభుత్వాన్ని కోరింది.¤ రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) ప్రాజెక్టు ఏర్పాటుకు చిత్తూరు జిల్లాలో 1102.30 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. » అనంతపురం జిల్లా పి.కొత్తపల్లి గ్రామ పరిధిలో ఉన్న 500 ఎకరాల భూమిని నూతన, సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (నెడ్‌క్యాప్)కు లీజ్‌కు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.¤ విశాఖపట్నంలో ప్రకృతికి సంబంధించిన చరిత్రను తెలిపే ఉద్యానవనం, వస్తు ప్రదర్శనశాల (నేచురల్ హిస్టరీ పార్క్ - మ్యూజియం)ను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. » కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి ప్రభుత్వ - ప్రయివేటు భాగస్వామ్యంతో దీన్ని ఏర్పాటు చేయనున్నారు.¤ ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ మంత్రి గౌతు లచ్చన్న జయంతిని (ఆగస్టు 16) ప్రభుత్వ పండగగా ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. » లచ్చన్న శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు. |
ఆగస్టు - 15
|
¤ 68వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. » కోటలో జరిగిన ఉత్సవాల్లో నిరుపేద దళిత కుటుంబాలకు మూడెకరాల భూపంపిణీ పథకాన్ని సీఎం ప్రారంభించారు. 48 మంది లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేశారు.ప్రసంగంలోని ముఖ్యాంశాలు: వాతావరణ సమతుల్యత కోసం 'తెలంగాణకు హరిత హారం' పథకం కింద రాష్ట్రంలో 230 కోట్ల మొక్కలు నాటుతామని సీఎం ప్రకటించారు. 500 జనాభా దాటిన గిరిజన తండాలు, ఆదివాసీ గూడేలకు త్వరలోనే పంచాయతీల హోదా. తెలంగాణలో ప్రతి ఇంటికీ పరిశుభ్ర నీటి సరఫరా కోసం తాగునీటి గ్రిడ్ ఏర్పాటు.తెలంగాణ మహాకవి దాశరథి కృష్ణమాచార్యుల పేరిట ఏటా ఒక కవికి రూ.1,01,116 నగదు పురస్కారం.¤ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 68వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను కర్నూలు నగరంలో అధికారికంగా నిర్వహించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ కార్యక్రమంలో జాతీయ జెండాను ఎగురవేసి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.ముఖ్యాంశాలు అక్టోబరు 2 నుంచి ఎన్టీఆర్ క్యాంటీన్‌లు ప్రారంభించి రూ.5 కే భోజనం అందిస్తామని సీఎం ప్రకటించారు. అక్టోబరు 2 నుంచి ఎన్టీఆర్ సుజల పథకం కింద రూ.2 కే 20 లీటర్ల మంచి నీటిని సరఫరా చేస్తామని ప్రకటించారు. రాయలసీమలో ఖనిజాధారిత పరిశ్రమల స్థాపన. విశాఖ, తిరుపతి, విజయవాడ మెగా సిటీలుగా అభివృద్ధి. జిల్లాకు ఒకటి చొప్పున 13 స్మార్ట్ సిటీలు. విశాఖ, విజయవాడల్లో మెట్రో రైలు మార్గాలు. పేద కుటుంబాలకు రూ.2.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందేలా ఎన్టీఆర్ ఆరోగ్య సేవ పథకం. బీసీల ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా కాపులను బీసీల్లో చేర్చేందుకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు. 2019 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రాథమిక, సామాజిక, మౌలిక వసతులు, ఉత్పాదక, సేవ, నైపుణ్యాల అభివృద్ధి, పట్టణీకరణ అనే ఏడు మిషన్లకు సంబంధించి ఏర్పాటు చేసిన శకటాలను ప్రదర్శించారు. డ్వాక్రా పథకం ప్రాధాన్యాన్ని తెలిపేలా రూపొందించిన శకటానికి మొదటి బహుమతి లభించింది. ¤ హెచ్ఐవీ విస్తరణను నిరోధించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (APSACS - ఏపీసాక్స్) ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. ప్రధానంగా తల్లి నుంచి బిడ్డకు ఈ వైరస్ సోకకూడదనే లక్ష్యంతో గర్భిణులపై దృష్టి పెట్టింది. 'మమత ప్లస్ పేరుతో ఈ కార్యాచరణను అమలుచేస్తోంది. గర్భిణీ స్త్రీలున్న ఇళ్లను గుర్తించి, వారి ఇళ్ల వద్దే హెచ్ఐవీ పరీక్షలు నిర్వహించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనిపై ఆరోగ్య కార్యకర్తలకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. » ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధునాతన మందులతో తల్లి నుంచి బిడ్డకు హెచ్ఐవీ రాకుండా నిరోధించవచ్చని ఏపీ సాక్స్ యోచిస్తోంది. హెచ్ఐవీ వ్యక్తిలో తల్లి నుంచి బిడ్డకు వైరస్ సోకడం కూడా ఒక ముఖ్యమైన కారణం. గర్భిణిగా ఉన్నప్పుడే ఈ వైరస్ ఉన్నట్లు గుర్తిస్తే పుట్టబోయే శిశువుకు అది సోకకుండా అడ్డుకునే ఔషధాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. మూడు మాత్రల చికిత్సా విధానంలో సుమారు 90 శాతానికి పైగా కేసుల్లో తల్లి నుంచి బిడ్డకు హెచ్ఐవీ సోకకుండా ఈ మందులు విజయవంతంగా పనిచేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. » ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కలిపి సుమారు 9 వేల మంది కార్యకర్తలకు ఇప్పటికే ఈ కార్యక్రమంపై శిక్షణ ఇచ్చారు. వీరు గర్భిణులకు సాధారణ ఆరోగ్య సలహాలు ఇవ్వడంతోపాటు రక్తపరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. ప్రత్యేక కిట్ ద్వారా జరిపే ఈ పరీక్షలో కేవలం 20 నిముషాల్లోనే హెచ్ఐవీకి సంబంధించిన ఫలితాన్ని వెల్లడిస్తుంది. గత 4 నెలల్లో 4 లక్షల మందికి రక్తపరీక్షలు నిర్వహించగా, సుమారు వెయ్యిమంది గర్భిణుల్లో హెచ్ఐవీ ఉన్నట్లు గుర్తించారు. వీరికి మూడు మాత్రల చికిత్స మొదలుపెట్టారు. » ఏపీ సాక్స్ డైరెక్టర్ బి.కిషోర్.¤ తెలంగాణ రాష్ట్రంలో 112 బీసీ కులాలు ఉన్నట్లు బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి రాధ ఉత్తర్వులు జారీచేశారు. బీసీల్లోని 5 గ్రూపులకు 29 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నట్లు తెలిపారు. రాష్ట్ర విభజన దృష్ట్యా తెలంగాణ బీసీ కులాల జాబితాను వెలువరిస్తున్నట్లు వెల్లడించారు. |
ఆగస్టు - 17
|
¤ రాష్ట్ర గవర్నర్ నరసింహన్ సమక్షంలో హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన ఉన్నతస్థాయి అధికారిక సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కె.చంద్రశేఖర్‌రావు పాల్గొన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య వివాదాస్పద అంశాల పరిష్కారానికి గవర్నర్ నరసింహన్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. » సుహృద్భావ వాతావరణంలో దాదాపు రెండు గంటల పాటు జరిగిన సమావేశంలో మూడు కీలకాంశాలపై విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగుల విభజన ప్రక్రియను సామరస్యంగా పూర్తి చేయడం; శాసనసభ భవనాలను సర్దుబాటు చేసుకుని, సమన్వయంతో సమావేశాలను నిర్వహించడం; ప్రభుత్వరంగ సంస్థల విభజన ప్రక్రియ ముగిసే వరకు ఉమ్మడిగా పాలన కొనసాగించడం అనే మూడు అంశాలపై ఇద్దరు ముఖ్యమంత్రులు విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నారు. మిగిలిన అంశాలను వీలైనంత త్వరలో పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. |
ఆగస్టు - 18
|
¤ ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి బడ్జెట్ సమావేశాలు హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాయి.¤ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర గిరిజన సలహామండలి ఏర్పాటైంది. అన్ని పార్టీలకు చెందిన 12 మంది ఎస్టీ ఎమ్మెల్యేలు ఇందులో సభ్యులుగా నియమితులయ్యారు. » సాధారణంగా గిరిజన సంక్షేమశాఖ మంత్రి ఈ సలహామండలికి అధ్యక్షుడిగా ఉంటారు. ఈ శాఖను ప్రస్తుతం సీఎం నిర్వహిస్తుండటంతో ఆయనే అధ్యక్షుడిగా ఉన్నారు. |
ఆగస్టు - 19
|
¤ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'సమగ్ర కుటుంబ సర్వే'కు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. » రాష్ట్రవ్యాప్తంగా సుమారు కోటి కుటుంబాలు సర్వేలో పాలుపంచుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 95 శాతం కుటుంబాల సర్వేను ఒక్కరోజులోనే పూర్తిచేశారు. బహుళ ప్రయోజనాల లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. |
ఆగస్టు - 20
|
¤ రాష్ట్ర విభజన అనంతరం రూ.1.11 లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్ తొలి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. » 54 పేజీల బడ్జెట్‌లో రైతుల రుణమాఫీకి ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయం కింద రూ.5 వేల కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ప్రణాళికా వ్యయంలో 14 శాతం దీనికి కేటాయించింది. ప్రణాళికా వ్యయంలో కేంద్ర ప్రాయోజిత పథకాల కింద కేటాయించిన పద్దులను మినహాయిస్తే రుణమాఫీ కోసమే అత్యధిక మొత్తం కేటాయించింది. » గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మినహాయించి ఇతరత్రా సామాజిక వర్గాల పేరున కేటాయింపులు ఉండేవి కావు. ఈసారి తొలిసారిగా కాపులు, బ్రాహ్మణ సమాజ సంక్షేమానికి ప్రత్యేక కేటాయింపులు చేసి కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. » జూన్ 8న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రుణమాఫీ, వృద్ధులు, వికలాంగులకు పింఛన్ల పెంపు; రూ.2కే శుద్ధిచేసిన తాగునీరు, బెల్టుషాపుల రద్దు, ఉద్యోగాల వయోపరిమితి పెంపు అంశాలపై అయిదు సంతకాలు చేశారు. ఇందులో బెల్టుషాపుల రద్దు, ఉద్యోగుల వయోపరిమితి పెంపు హామీలను ఇప్పటికే పూర్తి చేశారు. మిగిలిన మూడింటికి తాజా బడ్జెట్‌లో పెద్దపీట వేశారు. పేదలకు రూ.1.50 లక్షలతో ఇళ్ల నిర్మాణం, ఎన్టీఆర్ క్యాంటీన్ల పథకాన్ని కూడా బడ్జెట్‌లో చేర్చారు. » ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అన్నిచోట్ల పర్యాటక సర్క్యూట్లు, బీచ్ రిసార్ట్స్, శిల్పారామాలు అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తిరుపతి, కాకినాడల్లో ఆతిథ్య రంగానికి మానవ వనరులు అందించే నైపుణ్య కేంద్రాలను ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. » రాష్ట్రంలో 10 - 12 స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. » రాష్ట్ర వార్షిక బడ్జెట్ రూ.1,11,823 కోట్లుగా చూపినా అందులో సుమారు రూ.30 వేల కోట్ల మేర సమైక్య రాష్ట్రానికి చెందిన రెండు నెలల పద్దు దాగి ఉంది. దాన్ని తీసేస్తే కొత్త రాష్ట్రం వార్షిక బడ్జెట్ రూ.81,823 కోట్లే అవుతుంది. ఇది పది నెలల కాలానికి మాత్రమే. ఒకవేళ దీన్ని 12 నెలలకు లెక్కిస్తే పదమూడు జిల్లాల వార్షిక ప్రణాళిక రూ.98,187 కోట్లు వరకు ఉండే అవకాశం ఉంది. మరోవైపు ప్రణాళికా వ్యయంలో కేంద్ర ప్రాయోజిత పథకాల కింద వచ్చే రూ.10,313 కోట్లను చూపారు. గతంలో కేంద్ర ప్రాయోజిత పథకాలను రాష్ట్ర బడ్జెట్‌లో చూపేవారు కాదు. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాల ట్రెజరీల నుంచే వీటికి నేరుగా డబ్బు మంజూరు చేస్తున్నందున ఈ పథకాలన్నింటినీ రాష్ట్ర బడ్జెట్‌లో చూపడాన్ని గతేడాది నుంచి కేంద్రం తప్పనిసరి చేసింది. లేదంటే కేంద్ర ప్రాయోజిత పథకాల కింద తెలిపిన మొత్తాన్ని తీసేసి చూపితే రాష్ట్ర వార్షిక ప్రణాళికా వ్యయం రూ.16,359 కోట్లకే పరిమితమయ్యేది. |
ముఖ్యాంశాలు వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, ఎయిడ్స్ బాధితులకు పింఛన్‌ను రూ.200 నుంచి రూ.1000 కు పెంచుతూ రూ.741 కోట్లు; వికలాంగుల పింఛన్లను రూ.500 నుంచి రూ.1500 కు పెంచుతూ రూ.303 కోట్లు కేటాయించారు. మొత్తంగా వీటికి రూ.1044 కోట్లను ఈ బడ్జెట్‌లో కేటాయించారు. అన్ని గ్రామాలకు 365 రోజులు తాగునీరు అందించేందుకు 'వాటర్ గ్రిడ్ కార్పొరేషన్'ను ఏర్పాటు చేయనున్నట్లు బడ్జెట్‌లో పేర్కొన్నారు. ఎన్టీఆర్ సుజల పథకం కింద ఈ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తారు. ఎన్టీఆర్ సుజలకు ఈ బడ్జెట్‌లో రూ.5.4 కోట్లు కేటాయించారు. ఈ పథకం ద్వారా తొలి విడతలో తీవ్ర అనారోగ్యకర నీరు తాగుతున్న 1144 గ్రామాలకు, కొంతమేర అనారోగ్యకర నీరు తాగుతున్న 4049 గ్రామాలకు మంచి నీళ్లు ఇస్తామని పేర్కొన్నారు. వాస్తవానికి వాటర్‌గ్రిడ్‌కు అవసరమయ్యే నిధులను ఇతర రూపాల్లోనూ ప్రభుత్వం సమీకరిస్తోంది. సామాజిక బాధ్యత కింద కార్పొరేట్ సంస్థలు ఇచ్చే నిధి, దాతలు ఇచ్చే విరాళాలు, వివిధ సంఘాలు ఇచ్చే నిధులనూ ఈ పథకం నిర్వహణ కోసం ఉపయోగించనుంది. బడ్జెట్‌లో కేటాయించిన నిధులకు ఇవి అదనం. మొత్తం మీద వీటన్నింటినీ కలిపి వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసి తాగునీటిని అందించనున్నారు. మరోవైపు గ్రామీణ తాగునీటి పథకాలకు రూ.1016 కోట్లను బడ్జెట్‌లో చూపారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చే జాతీయ గ్రామీణ తాగునీటి పథకం తదితరాలు కూడా కలిసి ఉన్నాయి. 'ఇందిర జలప్రభ' పేరును 'నవ్యాంధ్ర జలప్రభ'గా మార్చారు. మరుగుదొడ్ల నిర్మాణానికి రాష్ట్ర వాటాగా రూ.69.5 కోట్లు కేటాయించారు. మరుగుదొడ్లు లేని ఇళ్లల్లోనూ, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల వద్ద మరుగుదొడ్లు నిర్మిస్తామని పేర్కొన్నారు. యువతకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు కొత్తగా 'ఆంధ్ర యువశక్తి' పథకం ప్రారంభించారు. దీనికోసం బడ్జెట్‌లో రూ.25 కోట్లు కేటాయించారు. 'యువ కిరణాలు' పథకం కింద యువత నైపుణ్యాలను తీర్చిదిద్దేందుకు రూ.55 కోట్లు ఇచ్చారు. సెర్ప్‌కు రూ.548 కోట్లను కేటాయించారు. సమీకృత నీటి నిర్వహణ పథకం (ఐడబ్ల్యూఎంపీ)కి కేంద్రం నుంచి వచ్చే రూ.282 కోట్లను బడ్జెట్‌లో చూపించారు. రైతులు, డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు ఇచ్చేందుకు రూ.599 కోట్లు; డ్వాక్రా మహిళలకు బీమా, పింఛను పథకానికి రూ.185 కోట్లు కేటాయించారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పథకం కింద కేంద్రం నుంచి రానున్న రూ.91 కోట్లను బడ్జెట్‌లో చూపించారు. విజయనగరం, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాలు ఈ పథకం కిందికి వస్తాయి. ఆమ్ ఆద్మీ పథకం కింద రూ.16 కోట్లు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌లో రైతు రుణ విముక్తి (రుణ మాఫీ) పథకానికి ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్‌లో రూ.5 వేల కోట్లు ప్రతిపాదించారు. ఇందులో రూ.4 వేల కోట్లను ప్రణాళికా వ్యయంలోనూ, రూ.వెయ్యి కోట్లు ప్రణాళికేతర వ్యయంలోనూ చూపారు. ఈ మొత్తంలో రూ.805 కోట్లు ఎస్సీలకు, రూ.250 కోట్లు ఎస్టీలకు నిర్దేశించారు. ఒక్కో రైతు కుటుంబానికి రూ.లక్షన్నర చొప్పున రుణమాఫీ చేయడానికి రూ.35 వేల కోట్లు అవసరమని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ పరిస్థితిలో లాభదాయక కార్పొరేషన్ల ఆదాయాన్ని సెక్యూరిటైజేషన్ చేసి బహిరంగ మార్కెట్ నుంచి రుణాలు సేకరించే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో రైతుల్లో భరోసా నింపడానికి ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో రూ.5 వేల కోట్లు కేటాయించింది. బీసీల ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా కాపులను బీసీల్లో చేర్చేందుకు కమిషన్ ఏర్పాటు.ఆర్థికాభివృద్ధి, మౌలిక సదుపాయాలకు ముఖ్య రంగాల్లో ఏడు మిషన్ల ప్రకటన. రెసిడెన్షియల్ పాఠశాలలు సాధించిన ఫలితాలను దృష్టిలో ఉంచుకుని దశలవారీగా అన్ని సంక్షేమ హాస్టళ్లు రెసిడెన్షియల్ స్కూళ్లగా మార్పు. ఎస్సీ పేద విద్యార్థుల విదేశీ ఉన్నత విద్యాభ్యాసానికి అంబేద్కర్ ప్రవాస (ఓవర్సీస్) విద్యానిధి ఏర్పాటు. |
ఎస్సీ నిరుద్యోగ యువత స్వయం ఉపాధి కోసం ఏపీ ఎస్సీ సహకార ఆర్థిక సొసైటీ ద్వారా రాయితీపై ఆర్థిక సాయం. ఎస్సీ జనాభా 17.1 శాతానికి తగ్గట్లు ఉప ప్రణాళికకు రూ.2,657 కోట్లు కేటాయింపు. ఎస్టీలకు రూ.1150 కోట్లు. బీసీల సంక్షేమానికి రూ.3130 కోట్లు, మైనార్టీల సంక్షేమానికి రూ.371 కోట్లు, స్త్రీ శిశు సంక్షేమానికి రూ.1049 కోట్లు. వికలాంగులు, వృద్ధుల సంక్షేమానికి రూ.65 కోట్లు. రూ.100 కోట్ల కేంద్ర సాయంతో కృష్ణా, అనంతపురం జిల్లాల్లో భారీ (మెగా) పర్యాటక సర్క్యూట్లు. శ్రీకాకుళం, గుంటూరుల్లో కొత్త పర్యాటక సర్క్యూట్లు. శ్రీకాళహస్తిలో శ్రవణ, వర్ణ కాంతి ప్రదర్శన (సౌండ్ అండ్ లైట్ షో), పశ్చిమ గోదావరి జిల్లా పేరుపాలెంలో బీచ్ రిసార్ట్ ఏర్పాటు. కాకినాడ, ఏలూరు, విజయవాడ, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో శిల్పారామాల ఏర్పాటు. తిరుపతిలో రూ.50 కోట్లతో పాకశాస్త్ర సంస్థ, రూ.117 కోట్లతో అంతర్జాతీయ సమావేశ కేంద్రం (ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్). రూ.12 కోట్ల అంచనా వ్యయంతో తిరుపతి, కాకినాడల్లో హోటల్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్లు. గ్రామీణ పేదల గృహనిర్మాణం కోసం రూ.808 కోట్లు. అల్పాదాయ వర్గాల కోసం తక్కువ ధరకు ఆహారాన్ని అందించడం కోసం 'అన్న' క్యాంటీన్లు. రేషన్ కార్డులు ఆధార్ నంబర్‌కు అనుసంధానం. దారిద్య్రరేఖకు దిగువనున్న మహిళలందరికీ 'దీపం' కనెక్షన్లు. అక్టోబరు 2 నుంచి వృద్ధులు, వితంతువులకు రూ.1000, వికలాంగులకు రూ.1500 పింఛను. అక్టోబరు 2 నుంచి తొలిదశ కింద 5 వేల జనావాసాలకు రూ.2కే 20 లీటర్ల మినరల్ వాటర్. పాఠశాల విద్యకు రూ.12,595 కోట్లు, ఇంటర్మీడియట్ విద్యకు రూ.812 కోట్లు, ఉన్నత విద్యకు రూ.2,275 కోట్లు కేటాయింపు. రాష్ట్రంలో 33 శాతం అటవీ విస్తీర్ణానికి గాను 25.64 శాతమే ఉంది. మరో 7.36 శాతం విస్తీర్ణంలో పెద్దఎత్తున మొక్కల పెంపకం. పీపీపీ కింద మచిలీపట్నం నౌకాశ్రయం అభివృద్ధి; భావనపాడు, కళింగపట్నం సహా 14 చిన్నతరహా పోర్టులను పీపీపీ కింద అభివృద్ధి. కాకినాడలో రెండో పెద్ద నౌకాశ్రయం నెలకొల్పాలి. దీంతోపాటు కాకినాడలో ప్రైవేటు రంగంలో మరో వాణిజ్య పోర్టు. విజయవాడలో కొత్త టెర్మినల్ భవనం, కంట్రోల్ టవర్ నిర్మాణానికి ఎయిర్‌పోర్టు అథారిటీ నిర్ణయం. విజయవాడ - కాకినాడ మధ్య గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్. ఆంధ్రప్రదేశ్ గ్యాస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌కు కేజీ బేసిన్‌లో 4 బ్లాకులకు అనుమతి. రోడ్లు, భవనాల శాఖకు రూ.2,612 కోట్లు. ఈ సంవత్సరం ఏపీజెన్‌కో, సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్లు, స్వతంత్ర విద్యుచ్ఛక్తి ఉత్పత్తిదారుల ద్వారా అదనంగా 2,925 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి. వేలం ప్రక్రియ ద్వారా 1,000 మెగావాట్ల సౌర విద్యుత్తు కొనుగోలు. గుంటూరు, అనంతపురంలో వెయ్యి మెగావాట్ల చొప్పున 2 సోలార్ పార్కులు. రైతులకు సోలార్ పంపుసెట్లు. ఇళ్ల పైకప్పుల మీద సోలార్ విద్యుత్తు వ్యవస్థల ఏర్పాటు. దశలవారీగా 3 వేల మెగావాట్ల పవన విద్యుత్, 2 వేల మెగావాట్ల సౌర విద్యుత్ సమకూర్చుకోవాలి. పవన, సౌర విద్యుత్తు గ్రీన్ కారిడార్ ఎవాక్యువేషన్ కి రూ.5 వేల కోట్ల పెట్టుబడి. వ్యవసాయానికి 7 గంటల ఉచిత విద్యుత్తు క్రమంగా 9 గంటలకు పెంపు. గ్రామాలకు నాణ్యమైన, నమ్మకమైన త్రీ ఫేజ్ విద్యుత్తు సరఫరాకు వ్యవసాయఫీడర్ల ఏర్పాటు. ఇంధన రంగానికి రూ.7,164 కోట్ల కేటాయింపు. సాగునీటి రంగానికి రూ.8,465 కోట్ల కేటాయింపు. రాష్ట్రంలో అపారంగా ఉన్న ఖనిజాలను ఉపయోగించుకొని సిమెంటు, అల్యూమినియం, గ్రానైట్, ఉక్కు, ఫెర్రో అల్లాయిస్, పింగాణీ, గ్లాసు, కాగితం, ఎరువులు, రసాయనం తదితర పరిశ్రమలకు ప్రోత్సాహం. ఈ పరిశ్రమలన్నింటికీ 24 గంటల విద్యుత్తు సరఫరా. ఐటీ రంగంలో 5 లక్షల ఉద్యోగాలు, సాఫ్ట్‌వేర్ ఎగుమతుల్లో 5 శాతం వాటా సాధనే లక్ష్యం. ప్రస్తుతం రూ.1662 కోట్లున్న సాఫ్ట్‌వేర్ ఎగుమతులను రూ.43 వేల కోట్లకు తీసుకెళ్లాలి. ఐటీ రంగంలో 2 బిలియన్ యూఎస్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాలి ఎలక్ట్రానిక్ ఉత్పత్తి రంగంలో 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులను రాబట్టాలి. వస్తూత్పత్తి కేంద్రాలను అనుసంధానం చేసే సిలికాన్ కారిడార్ ఏర్పాటు.అన్ని గ్రామాలు గిగాబిట్‌తో అనుసంధానం. ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తినైనా డిజిటల్ అక్షరాస్యుడిగా తయారుచేసి, రాష్ట్రాన్ని డిజిటల్ ఆంధ్రప్రదేశ్‌గా మార్చడం. నిర్దిష్ట కాలవ్యవధిలో ఫలితాల సాధన కోసం మూడు ఐటీ మిషన్ల ఏర్పాటు. వాక్ టు వర్క్, సైకిల్ టు వర్క్ పద్ధతిన ఐటీ హబ్‌ల అభివృద్ధి. ఐటీ రంగానికి రూ.111 కోట్ల కేటాయింపు. విపత్తుల నిర్వహణకు రూ.403 కోట్లు. కర్నూలులో రూ.412 కోట్లతో గ్రేహౌండ్స్ హబ్, ఆరు ఏపీఎస్‌పీ బెటాలియన్ల ఏర్పాటు. రాష్ట్ర విభజనను పురస్కరించుకుని కేంద్రం నుంచి రూ.14,500 కోట్ల ఆదాయం. |
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ముఖ్యాంశాలు (రూ.కోట్లలో)2014 - 15 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కాలానికి మొత్తం బడ్జెట్ రూ.1,11,824 కోట్లు. రూపాయి రాక (బ్రాకెట్లలో అంచనా మొత్తం రూ.కోట్లలో)1. రాష్ట్ర పన్నులు, సుంకాలు - 40.61 పైసలు (37,397.67)2. కేంద్ర పన్నుల్లో వాటా - 18.29 పైసలు (16,838.77)3. పన్నేతర ఆదాయం - 35.87 పైసలు (33,028.76)4. వడ్డీ వసూళ్లు - 5.23 పైసలు (4,813.02) పోక (బ్రాకెట్లలో అంచనా మొత్తం రూ.కోట్లలో)1. అభివృద్ధి వ్యయం - 64.80 పైసలు (67,528.16)2. రుణాలపై వడ్డీ చెల్లింపులు - 9.78 పైసలు (10,186.46)3. పరిపాలన ఖర్చు - 7.99 పైసలు (8,330.35)4. పన్ను వసూళ్ల వ్యయం - 0.82 పైసలు (852.8)5. ఇతరత్రా వ్యయం - 10.79 పైసలు (11,244.05)6. లోటు - 5.82 పైసలు (6,063.60). |
ఆంధ్రప్రదేశ్ సామాజిక, ఆర్థిక గణన: 2013 - 14¤ 2013-14 ఆంధ్రప్రదేశ్ సామాజిక, ఆర్థిక గణనను రాష్ట్ర ప్రభుత్వం 2014 ఆగస్టు 20న శాసనసభకు సమర్పించింది. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ సమగ్ర స్వరూపాన్ని ప్రణాళికా విభాగం విడుదల చేసిన ఆర్థిక సర్వేలో ఆవిష్కరించింది. ఇందులో రాష్ట్ర సామాజిక, ఆర్ధిక స్థితిగతులు; జనాభా, భూవిస్తీర్ణం తదితర వివరాలను వెల్లడించింది.ముఖ్యాంశాలు అప్పులు2001-02లో రూ.42,492 కోట్ల అప్పు ఉండగా, 2013-14 ఆర్థిక సంవత్సరానికి రూ.1,78,348 కోట్లకు చేరుకుంది. రాష్ట్ర విభజనతో పాటు అప్పుల పంపకమూ జరిగింది. 2014-15 బడ్జెట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ అప్పు రూ.1,10,634 కోట్లుగా ఉంది. ఆంధ్రప్రదేశ్ మొత్తం జనాభా 4.94 కోట్లు. దీని ప్రకారం తలసరి అప్పు రూ.22,395. తలసరి ఆదాయంచతలసరి ఆదాయంలో విశాఖపట్నం జిల్లా రూ.1,13,860 కోట్లతో అగ్రస్థానంలో ఉండగా, శ్రీకాకుళం రూ.53,203 కోట్లతో చివరి స్థానంలో ఉంది. 2012-13 ధరల సూచీని ప్రామాణికంగా తీసుకుంటే ఏడు జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో తలసరి ఆదాయం రాష్ట్ర సగటు రూ.76,041 కంటే తక్కువగా ఉంది. ఆధార్ కార్డులుఆంధ్రప్రదేశ్‌లోని 4.94 కోట్ల జనాభాలో ఇప్పటివరకు 4.53 కోట్ల మందికి ఆధార్ కార్డులు అందాయి. వీటి ఆధారంగా నకిలీ లబ్ధిదారులను గుర్తించి బోగస్ రేషన్ కార్డులను ఏరివేస్తున్నారు. ఈ ప్రక్రియ ఇప్పటికే 62% పూర్తయింది. జనాభాఆంధ్రప్రదేశ్ మొత్తం జనాభా 4.94 కోట్లు. ఇది దేశ జనాభాలో 4.08 శాతం. జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ పదో స్థానంలో ఉంది. రాష్ట్ర జనాభాలో 2.47 కోట్ల మంది (50.1%) పురుషులు, 2.46 కోట్ల మంది (49.9%) స్త్రీలు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 70.42% మంది, పట్టణాల్లో 29.58% మంది నివసిస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో ప్రతి వెయ్యి మంది పురుషులకు సగటున 996 మంది స్త్రీలు ఉన్నారు. విజయనగరం జిల్లాలో వెయ్యి మంది పురుషులకు 1,019 మంది స్త్రీలు, శ్రీకాకుళంలో 1,015 మంది ఉన్నారు. నెల్లూరు, కడప జిల్లాల్లో ప్రతి వెయ్యి మంది పురుషులకు 985 మంది స్త్రీలు ఉన్నారు. భూ విస్తీర్ణంఆంధ్రప్రదేశ్‌లో 76.21 లక్షల మంది భూమి కలిగి (లాండ్ హోల్డింగ్స్) ఉన్నారు. అనంతపురం జిల్లాలో సగటున ఒక్కొక్కరికి 1.76 హెక్టార్ల భూమి ఉంది. అయితే శ్రీకాకుళం జిల్లాలో సగటున ఒక్కొక్కరికీ 0.66 హెక్టార్ల భూమి మాత్రమే ఉంది. సాగునీటి వసతి ఉన్న మొత్తం భూ విస్తీర్ణం 2013-14 ఆర్థిక సంవత్సరంలో గుంటూరు జిల్లాలో 5.71 లక్షల హెక్టార్లు కాగా, విశాఖపట్నంలో 1.51 లక్షల హెక్టార్లుగా ఉంది. వ్యవసాయరంగంస్థూల రాష్ట్రీయ ఉత్పత్తిలో వ్యవసాయరంగం వాటా నానాటికీ దిగజారుతోంది. మరోవైపు సేవారంగం వాటా వేగంగా దూసుకుపోతోంది. గత పదేళ్లలో వ్యవసాయరంగ స్థూల ఉత్పత్తి ఏటా తిరోగమనంలో వెళుతోంది. 2004-05లో స్థూల జాతీయ ఉత్పత్తిలో 19.03 శాతం ఉన్న వ్యవసాయ రంగం వాటా 2013-14 నాటికి 13.94 శాతానికి తగ్గింది. ఇదే కాలంలో సేవారంగ స్థూల ఉత్పత్తి 53.05 శాతం నుంచి 59.93 శాతానికి పెరిగింది. |
వ్యవసాయేతర రంగాలుకేవలం వ్యవసాయ రంగమే కాకుండా గత పదేళ్లలో గనులు, ఉత్పత్తి, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, నిర్మాణం, పరిశ్రమ, సామూహిక, సామాజిక, వ్యక్తిగత సేవల రంగాల స్థూల జాతీయ ఉత్పత్తి వాటా కూడా తిరోగమనంలో పయనిస్తోంది. వాణిజ్యం, హోటళ్లు, రవాణా, కమ్యూనికేషన్ రంగం మాత్రం వృద్ధి చెందుతోంది. అలాగే ఆర్థికం, బీమా, స్థిరాస్తి, వ్యాపార సేవలు కూడా వృద్ధి దిశలో ఉన్నాయి. స్థూల రాష్ట్ర ఉత్పత్తిస్థూల రాష్ట్ర ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ జాతీయ సగటు కంటే కాస్త మెరుగ్గానే ఉంది. 2004-05 నాటి స్థిర ధరలను అనుసరించి ఆంధ్రప్రదేశ్ 2013-14 ఆర్థిక సంవత్సరంలో 6.08 శాతం వృద్ధితో రూ.2.50 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి సాధించింది. ఇదే సమయంలో దేశం కేవలం 4.74 శాతం వృద్ధితో రూ.57.41 లక్షల కోట్ల జీడీపీని నమోదు చేసింది.2012-13 నాటి ధరల ప్రకారం జిల్లాల స్థూల ఉత్పత్తిలో విశాఖపట్నం రూ.56,668 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా, విజయనగరం రూ.15,858 కోట్లతో చివరి స్థానంలో ఉంది. |
రంగం
|
2004 - 05
|
2013-14
|
వ్యవసాయం, అనుబంధ రంగాలు పరిశ్రమలు సేవలు | 19.03 27.93 53.05 | 13.94 26.13 59.93 |
పరిశ్రమలుమైనింగ్ తయారీ ఇంధనం నిర్మాణం |
2.86 15.25 2.11 7.70 |
1.86 14.94 1.90 7.43 |
సేవలు వాణిజ్యం/ హోటళ్లు/ రవాణా/ కమ్యూనికేషన్లు ఆర్థికం/ బీమా/ స్తిరాస్థి/ వ్యాపార సేవలు సామూహిక/ సామాజిక/ వ్యక్తిగత సేవలు |
24.49
14.71
13.84 |
26.43
20.62
12.88 |
జిల్లా
|
స్థూల ఉత్పత్తి(రూ.కోట్లలో)
|
తలసరి ఆదాయం (రూపాయల్లో)
|
శ్రీకాకుళం |
16,050
|
53,203
|
విజయనగరం |
15,858
|
60,545
|
విశాఖపట్నం |
56,668
|
1,13,860
|
తూర్పు గోదావరి |
44,254
|
76,729
|
పశ్చిమ గోదావరి |
35,456
|
79,015
|
కృష్ణా |
46,282
|
89,850
|
గుంటూరు |
41,650
|
79,267
|
ప్రకాశం |
30,474
|
82,729
|
నెల్లూరు |
25,569
|
78,647
|
కడప |
21,440
|
66,592
|
కర్నూలు |
25,963
|
58,211
|
అనంతపురం |
29,133
|
64,970
|
చిత్తూరు |
30,593
|
65,261
|
సగటు |
4,19,391
|
76,041
|
|
ఆగస్టు - 21
|
¤ ఆంధ్రప్రదేశ్ ప్రజా భద్రతా చట్టం - 1992 ను అనుసరించి రాష్ట్రంలోని ఎనిమిది సంస్థలను చట్ట విరుద్ధమైనవిగా గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. » రెవల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఆర్ డీ ఎఫ్), కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు), రాడికల్ యూత్ లీగ్ (ఆర్ వై ఎల్), రైతు కూలీ సంఘం (ఆర్ సీ ఎస్), రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (ఆర్ ఎస్ యూ), సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస) విప్లవ కార్మిక సమాఖ్య (వికాస), ఆల్ ఇండియా రెవల్యూషనరీ స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఏఐఆర్ఎస్ఎఫ్) సంస్థలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. |
ఆగస్టు - 22
|
¤ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అఖిల భారత (సివిల్) సర్వీసు అధికారులను కేంద్ర ప్రభుత్వం విభజించింది. ఐఏఎస్, ఐపీఎస్, అటవీ సర్వీసు (ఐఎఫ్ఎస్) అధికారుల పేర్లతో సహా పూర్తి జాబితాలను విడుదల చేసింది. ఈ అధికారుల కేటాయింపుపై ఢిల్లీలో ప్రత్యూష్ సిన్హా కమిటీ తుది చర్చలు జరిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రధాన కార్యదర్శులు ఐ.వై.ఆర్.కృష్ణారావు, రాజీవ్‌శర్మ ఈ సమావేశానికి హాజరయ్యారు.¤ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తొలి వ్యవసాయ బడ్జెట్‌ను వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావు శాసనసభలో ప్రవేశపెట్టారు. » గత ఏడాదే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించింది. అయితే సభ నిబంధనల దృష్ట్యా అప్పటి వ్యవసాయ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ దీన్ని 'వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక'గా చదవాల్సి వచ్చింది. » ఈసారి నిబంధనలు ఏవీ మారకపోయినా, వ్యవసాయ మంత్రి 'వ్యవసాయ బడ్జెట్'గానే పేర్కొంటూ ప్రసంగం చేశారు. తొలి వ్యవసాయ బడ్జెట్‌గా పేర్కొంటున్నప్పటికీ ఇది సాధారణ బడ్జెట్‌లో భాగంగానే ఆమోదం పొందుతుందని భావిస్తున్నారు. » వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.13,909.39 కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి పుల్లారావు తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఇందులో ప్రణాళికా కేటాయంపు రూ.6,735.44 కోట్లు కాగా, ప్రణాళికేతర వ్యయం రూ.6,373.95 కోట్లని తెలిపారు. » వ్యవసాయం అనుబంధ రంగాలకు రూ.56,019.16 కోట్ల రుణాలు ఇచ్చేందుకు రాష్ట్రాస్థాయి బ్యాంకర్ల కమిటీ ఆమోదం తెలియజేసిందని మంత్రి ప్రకటించారు. |
ఆగస్టు - 23
|
¤ ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి ఉత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికార పండగగా ప్రకటించి ఘనంగా నిర్వహించింది. » ఈ సందర్భంగా రాజమండ్రి విమానాశ్రయానికి, ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయనున్న ఎయిమ్స్ స్థాయి వైద్య సంస్థకు టంగుటూరి ప్రకాశం పంతులు పేరు పెడతామని ప్రభుత్వం ప్రకటించింది. |
ఆగస్టు - 24
|
¤ నెల్లూరు జిల్లా వెంకటాచలంలో స్వర్ణభారత్ ట్రస్ట్ 13వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. » ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. » ఈ కార్యక్రమంలో సీఎం 'నీరు - చెట్టు' కార్యక్రమాన్ని ప్రారంభించారు. » నీరు - చెట్టు, బడి పిలుస్తోంది, పొలం పిలుస్తోంది, పేదరికంపై గెలుపు అనే నాలుగు అంశాలను రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఉద్యమ రూపంలో చేపట్టనున్నట్లు సీఎం ప్రకటించారు. » ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు కూడా హాజరయ్యారు. స్వర్ణభారత్ ట్రస్ట్‌కు వెంకయ్యనాయుడు కుమార్తె దీపా వెంకట్ మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నారు. |
ఆగస్టు - 25
|
¤ ఆంధ్రప్రదేశ్‌ను 'బ్రాండ్ ఆంధ్రప్రదేశ్'గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. ప్రభుత్వం, పరిశ్రమలు కలిసి పనిచేసేందుకు అవసరమైన వాతావరణాన్ని కల్పించడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. దేశీయ పారిశ్రామిక దిగ్గజాలతో కలిసి నూతన ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధికి కార్యచరణను రూపొందించింది. ఈ మేరకు 40 మంది సభ్యులతో పరిశ్రమలు, పెట్టుబడులపై టాస్క్‌ఫోర్స్ కమిటీని నియమించింది. ఈ కమిటీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షుడు. మూడేళ్ల కాలపరిమితితో కూడిన ఈ కమిటీ మూడు నెలలకోసారి సమావేశమై పారిశ్రామిక, మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన పలు విషయాలను చర్చిస్తుంది.¤ ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. త్వరలో కొత్త ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో 21 మంది సభ్యులతో పాటు ఏడుగురు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు. దేవాదాయ శాఖ మంత్రి ధార్మిక పరిషత్‌కు ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ధార్మిక, హిందూ మతసంస్థల, ధర్మాదాయ వ్యవహారాల నిర్వహణతో పాటు పరిపాలనలో రాష్ట్ర ప్రభుత్వానికి ధార్మిక పరిషత్ సలహాదారుగా వ్యవహరిస్తుంది. దేవదాయశాఖలో ఇదే అత్యున్నతమైన బోర్డు.¤ తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)కు ప్రత్యేక అథారిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దేవాదాయ (రెవెన్యూ) శాఖ ముఖ్య కార్యదర్శి జె.సి.శర్మ ఈ అథారిటీకి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.¤ ఐటీ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా విశాఖపట్నంకు ఐటీ పెట్టుబడుల ప్రాంతం (ఐటీఐఆర్) ప్రాజెక్టును తీసుకొచ్చేందుకు చేసిన ప్రతిపాదనలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదించారు. ఐటీఐఆర్ ప్రతిపాదనలను ప్రభుత్వం కేంద్రానికి పంపిస్తుంది. అక్కడి నుంచి ఆమోదం లభిస్తే విశాఖపట్నం ఏపీ ఐటీ కేంద్రంగా, మెగాక్లస్టర్‌గా మారుతుంది. |
ఆగస్టు - 30
|
¤ ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలికి నూతన పాలకవర్గం ఏర్పాటైంది. దీనికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావును ఛైర్మన్‌గా నియమించారు. » ప్రస్తుతం జానకి ఆర్.కొండెపి ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలికి ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఆమె పదవీకాలం మగియడంతో కొత్త పాలకవర్గాన్ని ఏర్పాటు చేశారు.¤ ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలప్‌మెంట్ కోఆపరేషన్ ఫెడరేషన్ లిమిటెడ్ ఎండీ అండ్ వైస్ ఛైర్మన్‌గా హర్‌ప్రీత్ సింగ్‌ను ప్రభుత్వం నియమించింది.
|
ఆగస్టు - 31
|
¤ పట్టణ ప్రాంతాల్లోని మురికివాడలు, శివారు కాలనీల్లో ఉంటున్న ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. » జాతీయ పట్టణ ఆరోగ్య పథకం కింద రాష్ట్రంలో తొలి విడతగా 69 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించారు. ఇందుకయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వం 75 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం భరించనున్నాయి. కేంద్ర ప్రభుత్వం రూ.64.46 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం 21.49 కోట్లు విడుదల చేశాయి. ఈ పథకం కింద రూ.600 కోట్ల వరకు ఖర్చు చేసే అవకాశం ఉంది. ఈ నిధులతో రాష్ట్రంలోని 184 నగరపాలక, పురపాలక సంస్థల్లో పట్టణ పీహెచ్‌సీలను ఏర్పాటు చేస్తారు. » ఒక పట్టణంలో జనాభా 2.5 లక్షలు దాటితే అదనంగా ఒక రిఫరల్ ఆరోగ్య కేంద్రాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. పట్టణ పీహెచ్‌సీలకు వచ్చిన రోగులకు మెరుగైన వైద్య సేవలు అవసరమైతే వారిని ఈ రిఫరల్ ఆసుపత్రికి పంపిస్తారు. |
|
|