జూన్ - 1
|
¤ తెలంగాణలో రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరేంతవరకూ ఈ పాలన అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. » జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంనాడు కొత్త ప్రభుత్వం కొలువుదీరడానికి అనువుగా రాష్ట్రపతి పాలనను రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 (2) ద్వారా సంక్రమించిన అధికారాలను అనుసరించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉపసంహరించారు. |
జూన్ - 2
|
¤ భారతదేశ చిత్రపటంలో తెలంగాణ 29వ రాష్ట్రంగా ఆవిర్భవించింది. దేశంలోనే మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా అవతరించిన ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు భాషా రాష్ట్రాలుగా విడిపోయింది. » 1956 నవంబరు 1న హైదరాబాద్ రాష్ట్రం ఆంధ్రతో కలిసి ఆంధ్రప్రదేశ్‌గా అవతరించగా, 57 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి తెలంగాణ రాష్ట్రంగా ఆవిర్భవించింది. అయిదున్నర దశాబ్దాల తర్వాత మరోసారి తెలుగువారికి రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. నైజాం రాజ్యంలో తెలుగు మాట్లాడే వారి ప్రాంతమే తెలంగాణ. అప్పట్లో తెలంగాణలో 8 జిల్లాలుండేవి. తర్వాత ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాల తెలంగాణ దేశ చిత్రపటంలోకి ఎక్కింది. » దేశ చరిత్రలో తెలంగాణకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. 1953లో మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయి, 1956లో హైదరాబాద్ రాష్ట్రం ఆంధ్రలో కలిసి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడింది. అప్పట్లో జరిగిన పెద్ద మనుషుల ఒప్పందాన్ని అమలు చేయడం లేదంటూ తెలంగాణ ప్రాంత నాయకుల్లో అసంతృప్తి మొదలయింది. ముఖ్యంగా ఒప్పందంమేరకు పదవుల పంపిణీ జరగకపోవడం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, ఉద్యోగాల నియామకాల్లో అన్యాయం తదితర అంశాలపై నిలదీయడం ప్రారంభించారు. ఇది ప్రజా ఉద్యమంగా మారింది. దీన్ని తొలుత ప్రభుత్వం గుర్తించలేదు. » 1969 మార్చిలో ఎ.మదన్‌మోహన్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజల సదస్సు జరిగింది. ప్రత్యేక తెలంగాణ వాదనను సమర్థించిన ఈ సదస్సు ఆ తర్వాత తెలంగాణ ప్రజాసమితిగా రూపాంతరం చెందింది. ఉద్యమం తీవ్ర రూపం దాల్చి, పోలీసు కాల్పుల్లో 369 మంది మరణించారు. ఇందులో విద్యార్థులే అధికం. ఆ సమయంలో తెలంగాణ ప్రజాసమితి నాయకత్వం డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ఆధ్వర్యంలోకి వచ్చింది. 1971 మార్చిలో జరిగిన ఎన్నికల్లో 14 లోక్‌సభ స్థానాల్లో తన అభ్యర్థులను నిలబెట్టిన తెలంగాణ ప్రజాసమితి 11 స్థానాలను కైవసం చేసుకుని, దేశం దృష్టిని ఆకర్షించింది. అప్పట్లోనే ప్రభుత్వం ముల్కీ నిబంధనల పునరుద్ధరణ కోసం అయిదు సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టింది. 1971లో అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డిని గద్దె దింపి, పి.వి.నరసింహారావును ఆ స్థానంలో నియమించారు. అప్పటి రాజకీయ పరిస్థితుల కారణంగా 1971 సెప్టెంబరులో తెలంగాణ ప్రజాసమితి కాంగ్రెస్ పార్టీలో విలీనమైంది. » ఈ దశలో సుప్రీంకోర్టు 1972 అక్టోబరులో ముల్కీ నిబంధనలు రాజ్యాంగ బద్ధమైనవేనని తీర్పునిచ్చింది. ఇది ఆంధ్ర ప్రాంత ఉద్యోగుల్లో అసంతృప్తిని లేవనెత్తింది. దీంతో జై ఆంధ్ర ఉద్యమం మొదలైంది. ఉద్యమ తీవ్రత కారణంగా 1973 జనవరి18న పి.వి. నరసింహారావు రాజీనామా చేయగా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పరిచే పరిస్థితి లేనందున రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చింది. ఆ తర్వాత ప్రధాని ఆధ్వర్యంలో 1973 సెప్టెంబరు 21న ఆరు సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టింది. వెనుకబడిన ప్రాంతాల సత్వర అభివృద్ధి, కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు, నిర్ణీత స్థాయి వరకు ప్రభుత్వోద్యోగాల్లో స్థానికులకే ప్రాధాన్యం ఇవ్వడం వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. ఆ తర్వాత కూడా ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. » ఇంకా అసంతృప్తి రగులుతూనే ఉండటంతో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక 1985లో 610 జి.ఒ.ను తెచ్చారు. అది కూడా అమలు కాలేదనే ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ నినాదం మళ్లీ తలెత్తింది. » 2000 సెప్టెంబరు 21న తెలంగాణకు చెందిన 41 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలంటూ రాష్ట్రపతికి, ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి వినతి పత్రం సమర్పించారు. ఉద్యోగుల సమస్యలపై 2001లో గిర్‌గ్లానీ కమిషన్, శాసనసభా కమిటీ వంటివెన్నో ఏర్పాటయ్యాయి. » 2001లో కె.చంద్రశేఖర రావు తెలుగుదేశం నుంచి బయటకు వచ్చి ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అప్పటినుంచి ఆయన వెనుదిరిగి చూడలేదు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, తెరాసలు అవగాహనకు వచ్చి పోటీ చేశాయి. 2004లో కాంగ్రెస్ నేతృత్వంలో కేంద్రంలో ఏర్పాటైన యూపీఏ ప్రభుత్వం కనీస ఉమ్మడి కార్యక్రమంలో తెలంగాణ అంశం చోటు చేసుకుంది. » 2009లో రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెసే అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత తెరాస అధినేత కేసీఆర్ ఆమరణ దీక్షకు కేంద్రం దిగొచ్చింది. తెలంగాణ ఏర్పాటు చేస్తున్నట్లు 2009 డిసెంబరు 9న అప్పటి కేంద్రమంత్రి చిదంబరం ప్రకటించినా, కార్యరూపం దాల్చలేదు. కేంద్ర ప్రభుత్వం జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. సుదీర్ఘ సంప్రదింపులు, అధ్యయనం తర్వాత ఆ కమిటీ నివేదిక ఇచ్చింది. అయినా, కేంద్రం నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఉద్యమం మహోగ్రరూపం దాల్చింది. ప్రత్యేక రాష్ట్రం కోసం బలిదానాలు పెరిగిపోవడంతో, 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. చివరకు తెలంగాణ ఆవిర్భవించింది. |
¤ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో 11 మంది క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. గవర్నర్ నరసింహన్ వీరందరితో ప్రమాణం చేయించారు. » తెలంగాణ తొలి ప్రభుత్వంలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను (ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన మొహమూద్ అలీ, దళిత వర్గానికి చెందిన డాక్టర్ టి.రాజయ్యలను) నియమించారు.మంత్రివర్గ స్వరూపం:
¤ కె.చంద్రశేఖర రావు: ముఖ్యమంత్రి, సాధారణ పరిపాలన, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖ, విద్యుత్, బొగ్గు, మున్సిపల్ పట్టణ వ్యవహారాలు, మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు. మొహమూద్ అలీ: ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ, పునరావాసం, యు.ఎల్.సి, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు. టి.రాజయ్య: ఉపముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్యశాఖ. నాయిని నర్సింహారెడ్డి: హోంశాఖ, జైళ్లు, అగ్నిమాపక, కార్మిక-ఉపాధి కల్పన, సైనిక్ వెల్ఫేర్. ఈటెల రాజేందర్: ఆర్థిక-ప్రణాళిక, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు. టి.హరీష్ రావు: నీటి పారుదల, శాసనసభా వ్యవహారాలు, మార్కెటింగ్. పోచారం శ్రీనివాసరెడ్డి: వ్యవసాయం, హార్టికల్చర్, సెరికల్చర్, పశు-పాడి సంవర్థక శాఖ. జోగు రామన్న: అటవీ, పర్యావరణం. జి.జగదీష్ రెడ్డి: విద్య. కె.తారక రామారావు: ఐటీ, పంచాయతీరాజ్. పి.మహేందర్ రెడ్డి: రవాణా శాఖ. టి. పద్మారావు గౌడ్: ఎక్సైజ్-ప్రొహిబిషన్. » తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కేసీఆర్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొన్నారు. |
కేసీఆర్ ప్రస్థానం:¤ 1954 ఫిబ్రవరి 17న మెదక్ జిల్లా చింతమడక గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు వెంకటమ్మ, రాఘవరావు. విద్యార్హత ఎం.ఎ. » యువజన కాంగ్రెస్ ద్వారా రాజకీయ ఆరంగేట్రం చేశారు. రాఘవాపూర్ సింగిల్‌విండో ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. 1983లో తెదేపాలో చేరి సిద్ధిపేట నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. 1985 నుంచి 2004 వరకు సిద్ధిపేట నుంచి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది, రికార్డు సృష్టించారు. ఎన్టీఆర్ క్యాబినెట్‌లో కరవు మంత్రిగా, 1996-1999 వరకు చంద్రబాబు మంత్రివర్గంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. 1999-2001 వరకు శాసనసభ ఉపసభాపతిగా బాధ్యతలు నిర్వహించారు. » 2001లో పదవికి, పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించారు. 2004లో సిద్ధిపేట శాసనసభ, కరీంనగర్ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. కేంద్రంలో కార్మికమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. రెండేళ్లకే కరీంనగర్ ఎంపీ పదవికి, కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఉప ఎన్నికల్లో తిరిగి భారీ మెజార్టీతో విజయం సాధించారు. 2008, 2009 లలో ఎంపీగా గెలిచారు. 2009 నవంబరు 29న సిద్ధిపేటలో ఆమరణ నిరాహార దీక్షకు ప్రయత్నించి అరెస్టయ్యారు. 2009 నుంచి ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లోనూ గజ్వేల్ నుంచి అసెంబ్లీకి, మెదక్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. తర్వాత మెదక్ ఎంపీ స్థానానికి రాజీనామా చేశారు. » తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ సమత బ్లాక్ ఆరో అంతస్తులోని సీఎం కార్యాలయంలో మధ్యాహ్నం 12:57 కు బాధ్యతలు చేపట్టారు. సీఎస్, ఐపీఎస్‌లు, ప్రభుత్వ సలహాదారుల నియామకాల దస్త్రంపై కేసీఆర్ తొలి సంతకం చేశారు. రైతులకు రుణమాఫీ, అమరవీరుల కుటుంబాల సంక్షేమ ప్యాకేజీపై ఆయన సంతకాలు చేయాల్సి ఉన్నా, వాటికి సంబంధించిన దస్త్రాలు సిద్ధం కాకపోవడంతో, అందుబాటులో ఉన్న నియామకాల దస్త్రంపైనే సంతకం చేసేందుకు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. » అనంతరం తొలి మంత్రిమండలి సమావేశంలో కేసీఆర్ పాల్గొన్నారు. ఏలె లక్ష్మణ్ రూపొందించిన ప్రభుత్వ రాజముద్రకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.¤ తెలంగాణ ప్రభుత్వానికి ఆరుగురు సలహాదారులు నియమితులయ్యారు. వీరిలో నలుగురు మాజీ ఐఏఎస్‌లు బి.పాపారావు, ఎ.కె.గోయల్, రమణాచారి, రామ లక్ష్మణ్, మాజీ ఇండియన్ ఎకనామిక్ సర్వీసు అధికారి జి.ఆర్.రెడ్డి, నీటి పారుదల రంగ నిపుణుడు ఆర్.విద్యాసాగర్ రావు ఉన్నారు.¤ తెలంగాణ గవర్నర్‌గా ఇ.ఎస్.ఎల్.నరసింహన్ ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా రాజ్‌భవన్‌లో ఆయనతో ప్రమాణం చేయించారు. » ఉమ్మడి రాష్ట్రానికి గవర్నర్‌గా ఉన్న నరసింహన్ ఏపీ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఆయనను తెలంగాణ గవర్నర్‌గా కూడా అదనపు బాధ్యతలపై నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు తెలంగాణలో అదనపు బాధ్యతల నిర్వహణ కోసం నరసింహన్ ప్రమాణ స్వీకారం చేశారు.¤ 'గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ' పేరిట తెలంగాణ ప్రభుత్వ వెబ్‌సైట్ ప్రారంభమైంది. » ప్రభుత్వ ఉత్తర్వుల కోసం goir.telangana.gov.in పేరిట మరో వెబ్‌సైట్ ఆరంభమైంది.¤ తెలంగాణ రాష్ట్ర బ్యాంకర్‌గా రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)ని ఎంపిక చేశారు. రాష్ట్ర బ్యాంకర్‌గా ఎంపిక చేసుకున్న ఆర్‌బీఐ ఇకపై జనరల్ బ్యాంకింగ్ బిజినెస్ నిర్వహిస్తుందని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. |
జూన్ - 3
|
¤ కేంద్ర ప్రభుత్వం కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డులను ఏర్పాటు చేసింది. » తెలంగాణ ఆవిర్భావ తేదీ జూన్ 2 తర్వాత 60 రోజుల్లోగా రెండు బోర్డులను ఏర్పాటు చేయాలని పునర్విభజన బిల్లులో పేర్కొన్నారు. ఆ ప్రకారం రెండు బోర్డులకు ఛైర్మన్‌లను నియమించారు. » కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌గా కేంద్ర జలసంఘం ఛైర్మన్ ఎ.బి.పాండ్యాను, గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌గా కేంద్ర జలసంఘం సభ్యులు మహేంద్రన్‌ను కేంద్రం నియమించింది. వీరిద్దరూ హైదరాబాద్ వచ్చి బోర్డుల తాత్కాలిక కార్యాలయాలను ఏర్పాటు చేసి, బాధ్యతలను స్వీకరించారు. » పునర్విభజన చట్టం ప్రకారం గోదావరి బోర్డును తెలంగాణలో, కృష్ణా బోర్డును ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రస్తుతానికి తాత్కాలికంగా రెండు బోర్డులను హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేశారు. బోర్డుల్లో ఒక నిపుణుడిని కేంద్ర ప్రభుత్వం నియమించాల్సి ఉంది. ఈ నియామకం కూడా 60 రోజుల్లో పూర్తికావలసి ఉంది. రెండు రాష్ట్రాల నుంచి ఒక్కో చీఫ్ ఇంజినీర్ సభ్యులుగా ఉంటారు. » కృష్ణా, గోదావరి బోర్డుల ఛైర్మన్‌లుగా నియమితులైన ఇద్దరూ కేంద్ర జలసంఘంలో కొనసాగుతూనే ఇక్కడ అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు.¤ తెలంగాణ కాంగ్రెస్ శాసనసభా పక్షనేతగా మాజీ మంత్రి జానారెడ్డి ఎంపికయ్యారు. శాసనమండలి పక్షనేతగా డి.శ్రీనివాస్, ఉపనేతగా షబ్బీర్ అలీ ఎంపికయ్యారు.¤ ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ప్రతిపక్షనేతగా కాంగ్రెస్ పార్టీ మాజీమంత్రి, ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్యను పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఎంపిక చేశారు.¤ రాష్ట్ర విభజన నేపథ్యంలో జూన్ 1 అర్థరాత్రి నాటికి ఉమ్మడి రాష్ట్ర ఖజానాలో ఉన్న రూ.6,100 కోట్లను భారతీయ రిజర్వ్‌బ్యాంక్ (ఆర్‌బీఐ) రెండు రాష్ట్రాలకూ పంపిణీ చేసింది. » జనాభా ప్రాతిపదికన జరిగిన ఈ పంపిణీ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు 58.32% చొప్పున, తెలంగాణకు 41.68% చొప్పున నిధులు పంపిణీ అయ్యాయి. ఫలితంగా సీమాంధ్ర ఖజానాకు రూ.3,557.52 కోట్లు, తెలంగాణ ఖజానాకు రూ.2,542.48 కోట్లను ఆర్‌బీఐ బదిలీ చేసింది. |
జూన్ - 4
|
¤ ఢిల్లీలో తెలంగాణ రాష్ట్రప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులుగా మాజీ మంత్రి వేణుగోపాలాచారి, విశ్రాంత ఐఏఎస్ అధికారి తేజావత్ రామచంద్రును నియమిస్తూ, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. » ప్రభుత్వం వీరికి క్యాబినెట్ హోదా కల్పించింది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వేణుగోపాలాచారి కేంద్రమంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇటీవలి ఎన్నికల్లో ఆదిలాబాద్ జిల్లా ముథోల్ నియోజకవర్గం నుంచి ఎమ్యెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. » వరంగల్ జిల్లాకు చెందిన తేజావత్ రామచంద్రు 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఒడిశా కేడర్ అధికారిగా పనిచేసి గత ఏడాది పదవీ విరమణ పొందారు.¤ తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (టీజెన్‌కో) సీఎండీగా డి.ప్రభాకరరావును నియమిస్తూ, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. » ఏపీ జెన్‌కోకు సుదీర్ఘ కాలం ఫైనాన్స్ డైరెక్టర్‌గా, జేఎండీగా పనిచేసిన ఆయన ఆరునెలల క్రితమే పదవీ విరమణ చేశారు.¤ '108' అత్యవసర సర్వీసులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు అంబులెన్సుల పంపకాలు పూర్తయ్యాయి. త్వరలోనే రెండు రాష్ట్రాల్లోని అంబులెన్సులపై ఆయా ప్రభుత్వాల అధికార చిహ్నాలతోపాటు ముఖ్యమంత్రుల ఫొటోలు ఏర్పాటు చేయనున్నారు. » అత్యవసర సర్వీసుల నిర్వహణకు సంబంధించి 2011లో జీవీకే ఈఎంఆర్ఐ సంస్థతో వైద్య ఆరోగ్యశాఖ అయిదేళ్ల కాలపరిమితితో ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రస్తుతం రెండు రాష్ట్రాలు పాత నిబంధనలను కొనసాగిస్తూ, కొత్తగా ఒప్పందాలు చేసుకోవాల్సి ఉంటుంది. » అత్యవసర సర్వీసుల కింద రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మొత్తం 752 అంబులెన్సుల్లో ఆంధ్రప్రదేశ్‌కు 436, తెలంగాణకు 316 కేటాయించారు. » '104' సర్వీసుల్లోనూ విభజన: గ్రామీణ ప్రాంతాల్లో సంచార వాహనాల ద్వారా వైద్యసేవలు అందిస్తున్న 104 సర్వీసులకు సంబంధించిన పంపకాలు కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం 104 సర్వీసు కింద ఉన్న 475 వాహనాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 275, తెలంగాణకు 200 కేటాయించారు. |
జూన్ - 7
|
¤ ప్రపంచ బ్యాంక్ రుణంతో చేపట్టిన నాగార్జునసాగర్ ఆధునికీకరణ పనుల్లో 70% వాటాను ఆంధ్రప్రదేశ్‌కు, 30% వాటాను తెలంగాణకు కేటాయించారు. » సాగర్ ఆధునికీకరణను ప్రభుత్వం రూ.4,444 కోట్లతో చేపట్టింది. మొత్తం వ్యయంలో రూ.2,025 కోట్లు ప్రపంచ బ్యాంక్ రుణం కాగా, రూ.2,419 కోట్లు రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు చేసేలా ఒప్పందం జరిగింది.¤ తెలంగాణ శాసనమండలి తొలి ఛైర్మన్‌గా నేతి విద్యాసాగర్ నియమితులయ్యారు. ఆయన నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గానికి చెందినవారు.¤ రాష్ట్ర విభజన నేపథ్యంలో నల్లమల అటవీ ప్రాంతాన్ని అధికారులు విభజించారు. ప్రకాశం, గుంటూరు, కర్నూలు, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల పరిధిలో నల్లమల అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. నల్లమలలో మొత్తం 72 పులులు సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వీటిలో 32 పులులు తెలంగాణలో, 40 సీమాంధ్రలో ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. » టైగర్ ప్రాజెక్ట్ జోన్‌గా గతంలో ఈ ప్రాంతాన్ని కేంద్రం ప్రకటించింది. ఇందులో భాగంగా మార్కాపురం, ఆత్మకూరు, నాగార్జునసాగర్, అచ్చంపేట డివిజన్‌లను ఏర్పాటు చేసింది. విభజన నేపథ్యంలో అచ్చంపేట, నాగార్జునసాగర్ డివిజన్లను తెలంగాణకు కేటాయించగా మార్కాపురం, ఆత్మకూరు డివిజన్లతో పాటు కొత్తగా విజయపురి సౌత్ డివిజన్‌ను సీమాంధ్రకు కేటాయించారు. |
జూన్ - 8
|
¤ కొత్త రూపం సంతరించుకున్న ఆంధ్రప్రదేశ్‌కు తొలి ముఖ్యమంత్రిగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. » గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ రాత్రి 7.27 గంటలకు చంద్రబాబుతో ప్రమాణం చేయించారు. » ఈ కార్యక్రమంలో మరో 19 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో భాజాపా సభ్యులు ఇద్దరున్నారు. » చంద్రబాబు తన ఎన్నికల హామీల్లోని అయిదు ముఖ్యమైన అంశాలను ప్రస్తావిస్తూ, ఆ దస్త్రాలపై సంతకాలు చేశారు. » రైతు, డ్వాక్రా, చేనేత రుణాల మాఫీకి సంబంధించిన దస్త్రంపై తొలి సంతకం చేశారు. » వృద్ధులు, వితంతువుల పింఛన్‌ను వెయ్యి రూపాయలకు, వికలాంగుల పింఛన్‌ను రూ.1,500కు పెంచారు. అక్టోబరు 2 న గాంధీజయంతి నుంచి అమలు చేస్తామని ప్రకటించారు. » గ్రామీణ ప్రజలకు సురక్షిత తాగునీరు అందించే ఎన్టీఆర్ సుజల పథకానికి సంబంధించి మూడో సంతకం చేశారు. ఈ పథకం కింద రెండు రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ అందిస్తారు. » మద్యం గొలుసు దుకాణాలను పూర్తిగా రద్దు చేశారు. » ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 60 సంవత్సరాలకు పెంచారు.¤ ఆంధ్రప్రదేశ్‌లో మద్యం బెల్ట్‌షాపులపై చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. |
జూన్ - 9
|
¤ తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈనెల 12 వరకూ ఈ సమావేశాలు జరుగుతాయి. » ప్రొటెం స్పీకర్‌గా జానారెడ్డి ఎంపికయ్యారు. శాసనసభ సభ్యులందరితో ఆయన ప్రమాణం చేయించారు. 116 మంది ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు. మొత్తం 119 మంది ఎమ్మెల్యేలు కాగా, గవర్నర్ వద్ద ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేసిన జానారెడ్డితో 117 మంది అవుతారు. ఎంఐఎంకు చెందిన అక్బరుద్దీన్, ముంతాజ్‌లు సభకు హాజరు కాలేదు. |
జూన్ - 10
|
¤ ఉమ్మడి రాజధానిలో గవర్నర్ పరిపాలన సలహాదారులుగా విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎ.పి.వి.ఎన్.శర్మ, విశ్రాంత ఐపీఎస్ అధికారి ఎ.కె.మహంతి నియమితులయ్యారు. » రాష్ట్ర విభజన ప్రక్రియ కోసం ఇప్పటికే నియమితులైన ఇద్దరు సలహాదారులు సలావుద్దీన్ అహ్మద్, ఎ.ఎన్.రాయ్‌ల పదవీకాలం ఈనెల 30తో ముగుస్తుంది. » ఉమ్మడి రాజధానిపై సలహాదారులను నియమించాలని కేంద్రం నిర్ణయించింది. గవర్నర్ సిఫార్సు మేరకు వీరిని నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి రాజధాని పరిపాలనలో గవర్నర్ సలహాదారులు కీలకపాత్ర పోషించనున్నారు. » ఉమ్మడి రాజధానిలో పరిపాలన నిర్వహణకు కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. ఉమ్మడి రాజధానిలోని జీహెచ్ఎంసీ పరిధిలో గవర్నర్ స్వతంత్రంగా వ్యవహరిస్తారు. కేంద్రం నియమించిన సలహాదారులు పరిపాలనలో ఆయనకు సాయపడుతుంటారు.¤ తెలంగాణ రాష్ట్ర తొలి సభాపతిగా సిరికొండ మధుసూధనాచారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. » ఆయన వరంగల్ జిల్లా పరకాల మండలం నర్సక్కపల్లి గ్రామంలో 1956 సెప్టెంబరు 24న జన్మించారు. |
జూన్ - 11
|
¤ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు మంత్రులకు శాఖలను కేటాయించారు. కాపుల్లో నిమ్మకాయల చినరాజప్పకు, బీసీల్లో కె.ఇ.కృష్ణమూర్తికి ఉపముఖ్యమంత్రి స్థాయి కల్పించారు.ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ స్వరూపంచంద్రబాబు నాయుడు : ముఖ్యమంత్రి, సాధారణ పరిపాలన, న్యాయం, విద్యుత్, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, పరిశ్రమలు, వాణిజ్యం, ప్రభుత్వరంగ సంస్థలు, సినిమాటోగ్రఫీ, పర్యాటకం, మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు.కె.ఇ.కృష్ణమూర్తి : ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ, స్టాంపులు-రిజస్ట్రేషన్లు.నిమ్మకాయల చినరాజప్ప : ఉప ముఖ్యమంత్రి, హోం, విపత్తుల నిర్వహణ.యనమల రామకృష్ణుడు : ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభా వ్యవహారాలు.సిహెచ్.అయ్యన్నపాత్రుడు : పంచాయతీ రాజ్, గ్రామీణ నీటిసరఫరా, ఎన్ఆర్ఈజీఎస్ (ఉపాధి హామీ).బొజ్జల గోపాల కృష్ణారెడ్డి : సహకారం, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతికం.దేవినేని ఉమామహేశ్వర రావు: నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి, జలవనరుల నిర్వహణ.పి.నారాయణ : పురపాలక, పట్టణాభివృద్ధి, పట్టణ నీటి సరఫరా, పట్టణ ప్రణాళిక.పరిటాల సునీత : ఆహారం, పౌర సరఫరాలు, ధరల సమీక్ష, వినియోగదారుల వ్యవహారాలు.ప్రత్తిపాటి పుల్లారావు : వ్యవసాయం, మార్కెటింగ్, గిడ్డంగులు, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్యశాఖ, అగ్రి ప్రాసెసింగ్.కామినేని శ్రీనివాస్ : వైద్య, ఆరోగ్య, వైద్య విద్య.గంటా శ్రీనివాసరావు : మానవ వనరుల అభివృద్ధి (ప్రాథమిక, మాథ్యమిక, ఉన్నత, సాంకేతిక విద్య.)పల్లె రఘునాథ రెడ్డి : పౌర సంబంధాలు - సమాచారశాఖ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎన్ఆర్ఐ సంబంధాలు, తెలుగు భాష, సంస్కృతి, మైనార్టీ సంక్షేమం, అభివృద్ధి.పీతల సుజాత : గనులు - భూగర్భం, మహిళా సాధికారికత, శిశు సంక్షేమం, వయోవృద్ధుల సంక్షేమం.అచ్చెన్నాయుడు : కార్మిక, ఉపాధి కల్పన, కర్మాగారాలు, యువజన వ్యవహారాలు, క్రీడలు, నైపుణ్య అభివృద్ధి.శిద్దా రాఘవరావు : రవాణా, రహదారులు-భవనాలు.కిమిడి మృణాళిని : గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణం, పారిశుద్ధ్యం.కొల్లు రవీంద్ర : అబ్కారీ, బీసీ సంక్షేమం-సాధికారికత, చేనేత.రావెల కిషోర్ బాబు : సాంఘిక సంక్షేమం - సాధికారికత, గిరిజన సంక్షేమం - సాధికారికత.పైడికొండ మాణిక్యాల రావు : దేవాదాయం. » మొత్తం 19 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.¤ తెలంగాణ తొలి అసెంబ్లీ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి, గవర్నర్ నరసింహన్ తొలిసారిగా ప్రసంగించారు. ఈ ప్రసంగంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వ గమనాన్ని చాటి చెప్పారు.¤ హైదరాబాద్‌లో నివసిస్తున్న చాలామంది పిల్లలకు వ్యవసాయం గురించి తెలియదు. రైతులు దుక్కి ఎలా దున్నుతారు? పంటలెలా పండిస్తారు? తదితర అంశాలపై పెద్దగా అవగాహన ఉండదు. ఈ నేపథ్యంలో అలాంటి పిల్లల కోసం నగరంలో ఓ వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేశారు. » దుక్కిదున్నడం నుంచి పాడిపశువుల పెంపకం వరకు అన్ని విషయాలను దగ్గరగా పరిశీలించడంతోపాటు వాటిపై అవగాహన కల్పించేందుకు 'యాక్టివ్ ఫార్మ్ స్కూల్' పేరిట గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఎస్కీ) ఆవరణలో ఈ పాఠశాలను ప్రారంభించారు.¤ ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి దాతల నుంచి రాష్ట్ర ప్రభుత్వం విరాళాలను సేకరించే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయనిధి కింద ప్రత్యేకంగా 'ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అభివృద్ధి నిధి' పేరుతో ఖాతా తెరిచింది. » ఈ ఖాతాలో దాతలు విరాళాలు జమ చేయవచ్చని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎల్.ప్రేంచంద్రారెడ్డి ప్రకటించారు. |
జూన్ - 16
|
¤ బోనాలు, బతుకమ్మ ఉత్సవాలను రాష్ట్ర పండుగలుగా గుర్తించినట్లు ఆబ్కారీ శాఖ మంత్రి టి.పద్మారావు వెల్లడించారు. ఇకనుంచి ఈ రెండు పండుగలను తెలంగాణ ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తుందని ఆయన తెలిపారు.¤ గృహనిర్మాణ కార్మికులకు నెలకు రూ.5,575 కనీస వేతనం చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటిపనివారిని కూడా కార్మికులుగానే గుర్తిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. |
జూన్ - 19
|
¤ నూతన ఆంధ్రప్రదేశ్ శాసనసభ కొలువుతీరింది. ప్రొటెం స్పీకర్ పతివాడ నారాయణస్వామి నాయుడు సభను ప్రారంభించారు. జాతీయ గీతాలాపన తర్వాత ప్రొటెం స్పీకర్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తర్వాత ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి ప్రమాణం చేశారు. అనంతరం క్యాబినెట్ మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలు, మిగిలిన శాసనసభ్యులతో అక్షర క్రమంలో ప్రమాణం చేయించారు.¤ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛను మొత్తాలను పెంచింది. సుమారు 45 లక్షల మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేత, గీత కార్మికులకు ప్రయోజనం కలిగేలా పింఛన్లు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది. » అక్టోబరు 2 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. » వితంతువులు, వృద్ధులు, చేనేత, గీత కార్మికులు, ఎయిడ్స్ బాధితులకు పింఛనుగా నెలకు రూ.1000 ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. 40 నుంచి 79 శాతం శారీరక వైకల్యం ఉన్నవారికీ రూ.1000 ఇస్తారు. 80 శాతం, ఆపైన ఉన్న వారికి రూ.1500 ఇస్తారు. » ఇప్పటివరకూ వితంతువులు, వృద్ధులు, చేనేత, గీత కార్మికులకు నెలకు రూ.200 మాత్రమే ఇచ్చేవారు. ఎయిడ్స్ బాధితులకు, వికలాంగులకు రూ.500 పింఛను దక్కేది. 2005 నుంచీ ఇదే మొత్తం అమల్లో ఉంది.¤ ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్‌గా పరాంకుశం వేణుగోపాల్, అదనపు అడ్వకేట్ జనరల్‌గా దమ్మాలపాటి శ్రీనివాస్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. » ఉమ్మడి రాష్ట్రానికి ఏజీగా ఉన్న సుదర్శన్‌రెడ్డి, అదనపు ఏజీలు కె.జి.కృష్ణమూర్తి, బి.భాస్కరరావు సమర్పించిన రాజీనామాలను ప్రభుత్వం ఆమోదించింది. |
జూన్ - 20
|
¤ అనంతపురం జిల్లా ధర్మవరం చేనేత పట్టువస్త్రాలు, పావడాలకు భారత ప్రభుత్వం నుంచి భౌగోళిక గుర్తింపు పత్రం లభించింది. » ధర్మవరంలో తయారైన పట్టు చీరలను ఇతర ప్రాంతాలవారు కొనుగోలు చేసి తమ లోగోలను అతికించి విక్రయించేవారు. ఇకపై అలాంటివాటికి తావివ్వకుండా భారత ప్రభుత్వం ధర్మవరం పట్టుచీరల నాణ్యత, కళలను గుర్తించి భౌగోళిక గుర్తింపు పత్రం ఇచ్చింది.¤ రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభ మొదటి స్పీకర్‌గా కోడెల శివప్రసాదరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. » సభాపతిగా కోడెల శివప్రసాదరావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ పతివాడ నారాయణస్వామి నాయుడు ప్రకటించారు. » కోడెల శివప్రసాదరావు 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. » కోడెల స్వగ్రామం గుంటూరు జిల్లా నకరికల్లు మండలం కండ్లగుంట. » 1983, 1985, 1989, 1994, 1999 సంవత్సరాల్లో తెలగుదేశం తరఫున నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 2004, 2009ల్లో అక్కడి నుంచే పోటీచేసి ఓటమి పాలయ్యారు. » 11 ఏళ్ల పాటు రాష్ట్రమంత్రిగా పనిచేసిన కోడెల హోం, భారీ నీటిపారుదల, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పౌరసరఫరాలు, వైద్య ఆరోగ్యశాఖల బాధ్యతలు నిర్వర్తించారు. ¤ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల భర్తీ ప్రక్రియ పూర్తయింది. తెలంగాణ శాసనమండలిలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు గవర్నర్ నరసింహన్ రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, తెరాస గిరిజన విభాగం అధ్యక్షుడు, పొలిట్‌బ్యూరో సభ్యుడు సబావత్ రాములు నాయక్ పేర్లను ఖరారుచేశారు. |
జూన్ - 21
|
¤ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నరసింహన్ రాష్ట్ర శాసనసభలో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.¤ రాజధాని హైదరాబాద్‌లో పోలీసు వ్యవస్థకు అంతర్జాతీయ ప్రమాణాలు కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. న్యూయార్క్, లండన్ నగరాల్లో అమల్లో ఉన్న విధానాలను అనుసరించనున్నారు. » నేరం జరిగిన 10 నిమిషాల్లోనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవాలని నిర్దేశించారు. రూ.300 కోట్లతో ఆధునిక హంగులతో పాటు వాహనాల కొనుగోలు, ఇతర సౌకర్యాలకు అనుమతిచ్చారు. ప్రస్తుత డ్రెస్‌కోడ్‌కు బదులు ఐక్యరాజ్యసమితి పోలీసులు ధరించే యూనిఫామ్‌ను వాడేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆమోదం తెలిపారు. |
జూన్ - 23
|
¤ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ శాసన సభ తియ్యని బహుమానాన్ని ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 సంవత్సరాలు చేసే బిల్లును సభ ఆమోదించింది. » జూన్ 2వ తేదీ నుంచి ఇది అమల్లోకి వచ్చినట్లుగా ఆ బిల్లులో స్పష్టంగా పేర్కొన్నారు. ఇప్పటివరకు పదవీ విరమణ వయసు 58 సంవత్సరాలుగా ఉంది. » శాసన సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ ప్రభుత్వ ఉద్యోగాల (పదవీ విరమణ వయసు క్రమబద్ధీకరణ) చట్టం 1984ను సవరిస్తూ బిల్లును ప్రవేశపెట్టారు. » ఇప్పటివరకూ మన రాష్ట్రంలో నాలుగో తరగతి ఉద్యోగులకు మాత్రమే పదవీ విరమణ వయసు 60 సంవత్సరాలుగా ఉంది. గెజిటెడ్, ఎన్జీవోలకు మాత్రం 58 సంవత్సరాలుగా ఉంది. ఇప్పుడు దాన్ని 60 గా మార్చారు. » కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 సంవత్సరాలు చేస్తూ 1998 లోనే నిర్ణయించింది.¤ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతిగా మండలి బుద్ధప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపసభాపతిగా బుద్ధప్రసాద్ ఎన్నికైనట్లు స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు సభలో ప్రకటించారు. » మండలి బుద్ధ ప్రసాద్ కృష్ణా జిల్లా, అవనిగడ్డ శాసనసభ నియెజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. » ఆయన అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. |
జూన్ - 29
|
¤ తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండగ గోల్కొండలో ప్రారంభమైంది. » తెలంగాణ ప్రభుత్వం బోనాల పండగను రాష్ట్ర పండగగా గుర్తించింది. |
జూన్ - 30
|
¤ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమితులైన వారందరికీ ఈ జీవో వర్తిస్తుంది. » రాష్ట్ర సంఘటిత నిధి నుంచి వేతనాలు అందుకునే స్థానిక సంస్థల అధికారులు, ఉద్యోగులు కూడా ప్రయోజనం పొందుతారు. » ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ (పదవీ విరమణ వయసు నియంత్రణ) చట్టం అమల్లోకి రాకముందు రాజ్యాంగంలోని ఆర్టికల్ 309 కింద పొందుపరిచిన సర్వీసు నిబంధనల పరిధిలోకి వచ్చే అధికారులు, ఉద్యోగులకు ఈ పెంపు వర్తిస్తుంది. » ఏపీ ప్రభుత్వ ఉద్యోగ చట్టం 1984 లోని సెక్షన్ 2, సబ్‌సెక్షన్ 6 ప్రకారం మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపల్ కౌన్సిల్స్, జిల్లా పరిషత్, పంచాయతీ సమితులు, పంచాయతీల్లో పనిచేసే ఉద్యోగులకూ ఇది వర్తిస్తుంది.¤ తెలుగు వారి ఆత్మగౌరవం కోసం తెలుగు దేశం పార్టీ పెట్టి రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు జీవిత చరిత్రను పదోతరగతిలో పాఠ్యాంశంలోని ఒక భాగంగా చేర్చారు. » ఈ ఏడాది నూతనంగా రూపొందించిన పదో తరగతి సాంఘిక శాస్త్రంలో ఎన్టీఆర్ జీవితంలోని ముఖ్య అంశాలను పొందుపరిచారు. అప్పట్లో ఢిల్లీ పెద్దలు చేస్తున్న చేష్టలకు వ్యతిరేకంగా పార్టీ పెట్టారని, అప్పటికే ఆయన ప్రముఖ కథానాయకుడిగా తెలుగు సినీరంగంలో ఉన్నారని సాంఘిక శాస్త్రంలోని 268వ పేజీలో వివరించారు. 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి అనతికాలంలోనే ముఖ్యమంత్రి అయ్యారని, అధికారంలోకి వచ్చాక పేద ప్రజల కోసం రూ.2 కిలో బియ్యం, మద్యపాన నిషేధం లాంటి పలు కార్యక్రమాలు చేపట్టినట్లు పాఠ్యాంశంలో పేర్కొన్నారు. |
|
|