మే - 5
|
| ¤ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లలో నమోదైన కంపెనీలు నియంత్రణ సంబంధమైన నిబంధనలను పక్కాగా పాటించేలా చూడటానికి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఒక కొత్త నియమావళిని ప్రతిపాదించింది. ఈ నియమావళి ప్రకారం కంపెనీలు ఇదివరకటితో పోలిస్తే మరింత ఎక్కువగా వివరాలను వెల్లడించవలసి వస్తుంది. అంతేకాదు, ఆయా కంపెనీలు నిబంధనలను పాటించకుండా ఉన్న పక్షంలో స్టాక్ ఎక్స్ఛేంజ్‌లకు ఆ కంపెనీలపై చర్యలు తీసుకునేందుకు ఇప్పుడున్న దానికంటే ఎక్కువ అధికారాలు లభిస్తాయి. » ప్రతిపాదిత నియమాలను సెబీ (లిస్టింగ్ ఆబ్లిగేషన్స్ అండ్ డిస్‌క్లోజర్ రిక్వైర్‌మెంట్స్) రెగ్యులేషన్స్ 2014గా వ్యవహరిస్తారు. |
మే - 6
|
| ¤ పదేళ్ల వయసు దాటిన పిల్లలు (మైనర్లు) సైతం ఇక స్వతంత్రంగా బ్యాంకులో పొదుపు ఖాతా (సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్) తెరవవచ్చు. లావాదేవీలూ జరపవచ్చు. చెక్‌బుక్, ఏటీఎం లాంటి సదుపాయాలు కూడా వారు పొందవచ్చు. ఇందుకు అనుకూలంగా రిజర్వ్‌బ్యాంక్ మార్గదర్శకాలను జారీ చేసింది. » ఖాతాలు ప్రారంభించడంలో భాగంగా అన్ని బ్యాంకులూ ఒకే విధానాన్ని అనుసరించడానికి, బ్యాంకింగ్ సేవల విస్తరణకు రిజర్వ్‌బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. » ఇప్పటివరకూ తల్లి సంరక్షకురాలిగా ఉంటే మైనర్లు ఫిక్స్‌డ్, పొదుపు డిపాజిట్ ఖాతాలను ప్రారంభించే వీలు ఉంది. తాజాగా సవరించిన మార్గదర్శకాల ప్రకారం మైనర్లందరూ తమ సహజ లేదా చట్టప్రకారం నియమించిన సంరక్షకుల ద్వారా సేవింగ్స్/ ఫిక్స్‌డ్/ రికరింగ్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాలను ప్రారంభించవచ్చు. పదేళ్లు నిండిన పిల్లలు స్వతంత్రంగా పొదుపు ఖాతాను ప్రారంభించి లావాదేవీలు చేయవచ్చు. పిల్లల వయసు, ఖాతాలో జమ చేసే, లావాదేవీలు చేసే మొత్తంపై బ్యాంకులు పరిమితి విధించవచ్చు. » ఖాతా నుంచి ఇతరులు నగదు డ్రా చేయడానికి వీల్లేకుండా చర్యలు చేపట్టి చెక్‌బుక్, ఏటీఎం/ డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యాలను కూడా బ్యాంకులు కల్పించవచ్చని రిజర్వ్‌బ్యాంక్ పేర్కొంది. » లావాదేవీలు నిర్వహించని ఖాతాల్లో కనీస మొత్తం లేకపోయినా ఖాతాదారులపై ఎలాంటి జరిమానా విధించవద్దని బ్యాంకులను రిజర్వ్‌బ్యాంక్ కోరింది. ఖాతాదారులకు మేలు చేసే చర్యల్లో భాగంగా బ్యాంకులకు ఈ మేరకు సూచనలు ఇచ్చింది. సాధారణంగా సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలో లావాదేవీలు చేయకపోయినా ఎలాంటి రుసుము వసూలు చేయొద్దని 2012లోనే బ్యాంకులను రిజర్వ్‌బ్యాంక్ ఆదేశించింది. |
మే - 7
|
| ¤ బ్యాంకింగ్ పద్ధతుల్లో గోప్యతను విడనాడే దిశగా మరో ముందడుగు పడింది. పన్నుల సంబంధ సమాచారాన్ని పరస్పరం మార్పిడి చేసుకునేందుకు భారత్, స్విట్జర్లాండ్ సహా 47 దేశాలు అంగీకరించాయి. » ఈ దేశాలు ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) ఆధ్వర్యంలో ఈ మేరకు ఒకడిక్లరేషన్‌ను ఆమోదించాయి. » పన్ను సంబంధ సమాచార మార్పిడిపై ఒకే అంతర్జాతీయ ప్రమాణానికి దేశాలు కట్టుబడి ఉండటానికి ఈ డిక్లరేషన్ దోహదపడుతుంది.¤ రష్యాకు చెందిన టామ్స్ ఓబ్లాస్ట్ చమురు క్షేత్రంలో ఆయిల్ ఇండియా 50% వాటాను కొనుగోలు చేసింది. » 85 మిలియన్ డాలర్లకు కొనుగోలు ఒప్పందం కుదిరింది. » ఈ క్షేత్రంలో 117.68 మిలియన్ బ్యారళ్ల చమురు నిల్వలున్నట్లు అంచనా.¤ హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సాఫ్ట్‌వేర్ సంస్థ 'ఇన్ఫోటెక్ ఎంటర్‌ప్రైజెస్' పేరును 'సైయంట్'గా మార్చారు. » ఇన్ఫోటెక్ ఎంటర్‌ప్రైజెస్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ బి.వి.ఆర్.మోహన్ రెడ్డి. |
మే - 8
|
| ¤ భారత్ తన సొంత చెల్లింపు వ్యవస్థ 'రూపే' (Rupay)ను ఆవిష్కరించింది. వీసా, మాస్టర్ కార్డ్‌ల తరహాలోనే ఈ కార్డు ఏటీఎమ్, ఇతర మర్చంట్ అవుట్‌లెట్లలో పనిచేస్తుంది. తద్వారా నగదు లావాదేవీలను తగ్గిస్తుంది. » రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రణబ్ ముఖర్జీ దీన్ని జాతికి అంకితం చేశారు. సొంత కార్డు చెల్లింపుల వ్యసవ్థ ఉన్న అతి కొద్ది దేశాల్లో భారత్ కూడా చేరిందని ఈ సందర్భంగా రాష్ట్రపతి పేర్కొన్నారు. » నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ఈ రూపే ప్లాట్‌ఫాంను అభివృద్ధి చేసింది. ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ లాంటి బ్యాంకులు ఈ ప్లాట్‌ఫాంను ఉపయోగిస్తున్నాయి. » ఏటీఎమ్‌లు, విక్రయ కేంద్రాలు (పీఓఎస్ - పాయింట్స్ ఆఫ్ సేల్), ఆన్‌లైన్ విక్రయాలపై పనిచేసే ఈ 'రూపే' ప్రపంచంలో ఏడో చెల్లింపుల వ్యవస్థ. » విదేశాల్లోనూ పనిచేసేలా 'రూపే'ను తీర్చిదిద్దాలని భావిస్తున్నట్లు ఎన్‌పీసీఐ ఛైర్మన్ ఎం.బాలచంద్రన్ పేర్కొన్నారు. |
మే - 9
|
| ¤ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి నెల (ఏప్రిల్)లో భారత్ 2,563 కోట్ల డాలర్ల (దాదాపు రూ. 1,53,780 కోట్ల) విలువైన ఎగుమతులు చేసింది. » ఏడాది క్రితం ఇదే నెల ఎగుమతులు 2,435 కోట్ల డాలర్లతో పోలిస్తే 5.26% పెరిగినప్పటికీ గత అయిదు నెలల్లో ఇవే అతి తక్కువ ఎగుమతులు. » 2014 మార్చిలో 2,957 కోట్ల డాలర్లు, ఫిబ్రవరిలో 2,568 కోట్ల డాలర్లు, జనవరిలో 2,675 కోట్ల డాలర్లు, 2013 డిసెంబరులో 2,634 కోట్ల డాలర్ల ఎగుమతులు నమోదయ్యాయి. » పసిడి దిగుమతులు గణనీయంగా తగ్గడంతో ఏప్రిల్ నెల దిగుమతులు 15% క్షీణించి 3,570 కోట్ల డాలర్లకు చేరాయి. దీంతో గత నెల వాణిజ్య లోటు 1,007 కోట్ల డాలర్లకు చేరింది. 2013 ఏప్రిల్‌లో వాణిజ్య లోటు 1,760 కోట్ల డాలర్లుగా ఉంది. » ఏప్రిల్ నెలకు ఇంజినీరింగ్, సముద్ర ఉత్పత్తులు, తోలు వస్తువుల ఎగుమతులు వరుసగా 21.25%, 42.18%, 30.42% చొప్పున పెరిగాయి. » చమురు, చమురేతర దిగుమతులు వరుసగా 0.6%, 21.5% తగ్గి, 1,297 కోట్ల డాలర్లు, 2,274 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. » విలువైన రాళ్లు, ఆభరణాల ఎగుమతులు 8% పెరిగి 327 కోట్ల డాలర్లకు చేరాయి. » 2014 ఏప్రిల్‌కు బంగారం దిగుమతులు 74.13% క్షీణించి, 175 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి. ఏడాది క్రితం ఇదే నెలలో 678 కోట్ల డాలర్ల పసిడిని దిగుమతి చేసుకున్నారు. |
మే - 13
|
| ¤ బ్రిటన్, యూరప్‌లలో తన వినియోగదారులకు మరింత సన్నిహితమయ్యే వ్యూహంలో భాగంగా మొట్టమొదటి 'డిజైన్ స్టూడియో'ను టాటా గ్రూప్ లండన్‌లో ప్రారంభించింది. » దీన్ని టాటా ఎలెక్సీ ఏర్పాటు చేసింది. టాటా ఎలెక్సీ ప్రముఖ ఉత్పత్తుల కంపెనీలతో పాటు కొత్తగా ఎదగాలనుకుంటున్న కంపెనీలకు సాంకేతికపరమైన సలహాలు, కొత్త ఉత్పత్తుల అభివృద్ధి, టెస్టింగ్ సేవలను అందజేస్తూ ఉంటుంది. |
మే - 15
|
| ¤ టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 5.2 శాతంగా నమోదయింది. అంటే, వార్షిక ప్రాతిపదికన 2013 ఏప్రిల్‌తో పోలిస్తే ఈ రేటు 2014 ఏప్రిల్‌లో 5.2% పెరిగింది. » 2014 మార్చిలో ఈ పరిమాణం 5.7%. డబ్ల్యూపీఐలో ఒక భాగంగా ఉన్న ఆహార ధరల రేటు వార్షికంగా మార్చిలో 9.9%, ఏప్రిల్‌లో 8.64% కావడం విశేషం. » వార్షిక ప్రాతిపదికన 2013 ఏప్రిల్‌తో పోలిస్తే, 2014 ఏప్రిల్‌లో పప్పు దినుసులు ( - 0.77%), ఉల్లిపాయల ( - 9.76%) రేట్లు తగ్గాయి. మిగిలిన రేట్ల విషయానికి వస్తే, తృణ ధాన్యాల ధరలు 8.31%, బియ్యం ధరలు 12.76%, కూరగాయల ధరలు 1.34%, ఆలూ ధరలు భారీగా 31.56%, పండ్ల ధరలు 16.46%, పాల ధరలు 9.19%, గుడ్లు-మాంసం-చేపల ధరలు 9.97% చొప్పున పెరిగాయి. |
మే - 20
|
¤ మన దేశం నుంచి 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.6,059.31 కోట్ల విలువైన ముడి పొగాకు, పొగాకు ఉత్పత్తుల ఎగుమతులు జరిగాయి. పరిమాణం, విలువ పరంగా ఇంతవరకు ఇదే రికార్డు. » మొత్తం రూ.4,842.01 కోట్ల విలువైన 2,34,850 టన్నుల ముడిపొగాకు, రూ.1,217.30 కోట్ల విలువైన 29,534 టన్నుల పొగాకు ఉత్పత్తులు ఎగుమతయ్యాయి. » జాతీయ పొగాకు బోర్డు గుంటూరులో ఉంది. పొగాకు బోర్డు చైర్మన్ డాక్టర్ కె.గోపాల్¤ కేంద్ర ప్రభుత్వం రూ.139.95 కోట్ల విలువైన, 10 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది.
» మైక్రోఫైనాన్స్ రంగంలో ఈక్విటాస్ హోల్డింగ్ అనే హోల్డింగ్, ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ షేర్లను భారతీయుల నుంచి ప్రవాసులకు బదలాయించడం ద్వారా ఎఫ్‌డీఐని 89.64% నుంచి 95.64 శాతానికి పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ పెట్టుబడి ప్రతిపాదన విలువ రూ.79.93 కోట్లు. యాంబిట్ ప్రాగ్మాఫండ్ 2కు కూడా విదేశీ ఈక్విటీని 93.04% నుంచి 94.48 శాతానికి పెంచుకునేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇలాంటి మరో 8 ఎఫ్‌డీఐ ప్రతిపాదనలను కూడా ప్రభుత్వం ఆమోదించింది. |
మే - 21
|
| ¤ వాణిజ్య బ్యాంకులు ఇక స్వర ఆధార సూచనలు ఇచ్చే, బ్రెయిలీ కీప్యాడ్‌లు ఉన్న ఏటీఎంలను మాత్రమే ఏర్పాటు చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు జారీ చేసింది. » 2014 జులై 1 నుంచి ఈ సదుపాయాలున్న ఏటీఎంలను మాత్రమే ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇప్పటికే ఉన్న ఏటీఎంలను కూడా ఈ సదుపాయాలున్న ఏటీఎంలుగా మార్చడానికి బ్యాంకులు చర్యలు తీసుకోవాలని, ఇందుకు ఒక ప్రణాళిక రూపొందించుకోవాలని పేర్కొంది.¤ రిజర్వ్ బ్యాంక్ బంగారం దిగుమతి నియమాలను సవరించింది. ఇప్పటికే అనుమతించిన బ్యాంకులకు తోడు ఎంపిక చేసిన వ్యాపార సంస్థలను కూడా పుత్తడిని సేకరించడానికి అనుమతించింది. ఫలితంగా పసిడి ఎగుమతులకు ఊతం లభించనుంది.¤ ఎగుమతిదారులు దీర్ఘకాల సరఫరా ఒప్పందాలను పూర్తి చేసుకోవడంలో సహకరించడానికి వీలుగా బ్యాంకులు పదేళ్ల కాలపరిమితితో కూడిన రుణాలను అందించడానికి రిజర్వ్ బ్యాంక్ అనుమతించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నియమావళి బ్యాంకులను ఒక సంవత్సరం కాలపరిమితి వరకే ఈ విధమైన రుణాలను మంజూరు చేయడానికి అనుమతిస్తోంది. |
మే - 22
|
| ¤ మ్యూచువల్ ఫండ్ నిర్వహణ సంస్థల కార్యకలాపాలు మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరించేలా చూడాలనే ఉద్దేశంతో అటువంటి ఫండ్‌ల నగదు లావాదేవీల పరిమితిని సెబీ రూ.50,000 కు పెంచింది. ఇంత వరకు ఈ పరిమితి రూ.20,000 గా ఉండేది.¤ వినూత్న ఉత్పత్తుల విడుదల, కొత్త విపణులను పెంచుకోవడం ద్వారా మదుపర్ల విశ్వాసాన్ని చూరగొంటున్న ప్రపంచవ్యాప్త వంద కంపెనీల జాబితాలో భారత్‌కి చెందిన 9 సంస్థలు చోటు సంపాదించాయి. ఇన్నోవేషన్ ప్రీమియం విధానంలో ఫోర్బ్స్ ఈ జాబితాను రూపొందించింది. మార్కెట్ విలువ 1,000 కోట్ల డాలర్ల కంటే తక్కువ ఉండి పరిశోధన, అభివృద్ధికి ఆస్తుల విలువలో కనీసం ఒక శాతం వెచ్చిస్తున్న కంపెనీలను మాత్రమే ఫోర్బ్స్ జాబితా రూపకల్పనకు పరిగణనలోకి తీసుకుంది. » జాబితాలో చోటు సంపాదించిన 9 భారత కంపెనీల్లో గోద్రెజ్ కన్జ్యూమర్ ప్రాడక్ట్స్ ముందు వరుసలో ఉంది. 425 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో ప్రపంచవ్యాప్తంగా 31వ స్థానాన్ని సంపాదించింది. ఏబీబీ ఇండియా 37వ ర్యాంకు పొందగా మారికో (53), యునైటెడ్ బ్రూవరీస్ (60), సీమెన్స్ ఇండియా (63), ఏషియన్ పెయింట్స్ (76), నెస్లే ఇండియా (78), కోల్గేట్ పామోలివ్ ఇండియా (87), దివీస్ లేబొరేటరీస్ (99) చోటు దక్కించుకున్నాయి. » జాబితాలో న్యూజిలాండ్‌కు చెందిన జెరో కంపెనీ అగ్రస్థానంలో నిలిచింది. నెట్‌సూట్, మోనిటైజ్, ఇన్సులెట్, డెక్స్‌కామ్ తరువాతి స్థానాల్లో నిలిచాయి. |
మే - 23
|
| ¤ కెనరా బ్యాంక్ నూతన ప్రాంతీయ కార్యాలయాన్ని తిరుపతిలో ప్రారంభించారు. ఈ కార్యాలయం ద్వారా చిత్తూరు, అనంతపురం, వై.ఎస్.ఆర్.కడప, కర్నూలు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని 63 శాఖలకు సేవలు అందిస్తారు.¤ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫ్యాప్సీ) సెక్రెటరీ జనరల్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎస్.భలేరావు ఎన్నికయ్యారు. |
మే - 31
|
| ¤ భారత ఆర్థిక వృద్ధి వరుసగా రెండో ఏడాదీ 5% దిగువకే పరిమితమైంది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2013-14 చివరి త్రైమాసికంలో 4.6%, మొత్తం 4.7 శాతంగా ఉన్నట్లు కేంద్ర గణాంక కార్యాలయం (సీఎస్ఓ) వెల్లడించింది. » జాతీయ తలసరి ఆదాయం 2013-14 లో రూ.39,904 గా నమోదైంది. క్రితం ఏడాది ఇది రూ.38,856 గా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు జీడీపీలో 4.5 శాతంగా నమోదైంది. ప్రభుత్వ వ్యయం, ఆదాయాల మధ్య తేడానే ద్రవ్యలోటు అంటారు. ద్రవ్యలోటు 4.5%, రెవెన్యూ లోటు 3.2 శాతంగా నమోదైంది. ద్రవ్యలోటును 5.24 లక్షల కోట్లుగా అంచనా వేయగా అది రూ.5.08 లక్షల కోట్లకే పరిమితమైంది. |
|
|