జూన్ - 3
|
| ¤ భారతీయ రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ ముంబయిలో ద్వైమాసిక పరపతి విధాన సమీక్షను ప్రకటించారు. » ముఖ్యమైన రేట్లను యథాతథంగా ప్రకటించారు. రెపోరేటును 8%, రివర్స్ రేపోను 7%, సీఆర్ఆర్‌ను 4% వద్దే ఉంచారు. బ్యాంకు రేటు 9%లోనూ మార్పు లేదు. |
జూన్ - 5
|
| ¤ పంజాబ్‌లోని తోన్స గ్రామంలో ఉన్న ర్యాన్‌బాక్సీ ప్లాంట్‌పై విధించిన సస్పెన్షన్‌ను యూరోపియన్ ఆరోగ్య నియంత్రణ సంస్థ, యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ (ఈఎంఏ) తొలగించింది. » తోన్స ప్లాంట్‌లో తయారయ్యే ఔషధాలపై ఈ ఏడాది జనవరిలో అమెరికా ఆహార నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్‌డీఏ) నిషేధం విధించింది. దీంతో ఈ ప్లాంట్ నుంచి యూరప్‌కు జరిగే ఎగుమతులను కంపెనీయే స్వచ్ఛందంగా నిలిపేసింది.¤ బీమా, సంబంధిత కార్యకలాపాల్లో ఎఫ్‌పీఐలు (ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు), ఎన్నారైలు, తదితర విదేశీ ఇన్వెస్టర్లు 26% వరకూ పెట్టుబడులు పెట్టవచ్చని ఆర్‌బీఐ ప్రకటించింది. ఇది ఈ ఏడాది ఫిబ్రవరి 4 నుంచే వర్తిస్తుందని పేర్కొంది.¤ భారత వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2014-15)లో 6.2% ఉంటుందని ట్యాక్స్ కన్సెల్టెన్సీ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈ అండ్ వై) తాజాగా అంచనా వేసింది. రానున్న మూడేళ్లలో వృద్ధి 8 శాతాన్ని అందుకోగలదని కూడా పేర్కొంది. |
జూన్ - 6
|
| ¤ అంతర్జాతీయంగా ఆహారోత్పత్తుల ధరలు మేలో 3.2% తగ్గాయి. ఇలా ఆహార ధరలు తగ్గడం ఇది వరసగా రెండోనెల అని ఐరాస అనుబంధ సంస్థ అయిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) వెల్లడించింది. పాల ఉత్పత్పలు, ధాన్యాలు, వంట నూనెల ధరల చెప్పుకోదగిన స్థాయిలో క్షీణించడమే ధరలు తగ్గుదలకు కారణమని ఎఫ్ఏఓ వెల్లడించింది. |
జూన్ - 8
|
| ¤ దేశంలో అత్యధిక ఉద్యోగులున్న ప్రైవేట్ బ్యాంక్‌గా ఐసీఐసీఐ బ్యాంక్ అవతరించింది. » ఐసీఐసీఐ బ్యాంక్ ఉద్యోగుల సంఖ్య 72,226. » రెండో స్థానంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నిలిచింది. ఈ బ్యాంక్ ఉద్యోగుల సంఖ్య 68,165. |
జూన్ - 16
|
| ¤ కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు తదితర నిత్యావసర ధరలు పెరగడంతో మే నెలలో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) 6.01 శాతానికి చేరింది. ఇది 5 నెలల గరిష్ఠానికి సమానం. గతేడాది డిసెంబరులో నమోదైన 6.4 శాతం తర్వాత ఇదే అత్యధిక నమోదు స్థాయి. ఏప్రిల్‌లో డబ్ల్యూపీఐ 5.2 శాతంగా ఉంది. » బంగాళాదుంపల ధరల్లో 31.44 శాతం పెరుగుదల నమోదైంది. అంతక్రితం నెలతో పోలిస్తే పండ్ల రేట్లు 19.40 శాతం, బియ్యం ధరలు 12.75 శాతం పెరిగాయి. » ఆహార ద్రవ్యోల్బణ రేటు 9.50 శాతంగా నమోదు కాగా తయారీ వస్తువుల ధరలు 3.55 శాతం ప్రియమయ్యాయి. » గుడ్లు, చేపలు, మాంసం తదితర ప్రొటీన్లతో కూడిన పదార్థాల ధరల్లో 12.47 శాతం పెరగుదల ఉండగా పాలధరలు 9.57% పెరిగాయి. |
జూన్ - 18
|
¤ రిలయన్స్ ఇండస్ట్రీస్ 40వ సాధారణ వార్షిక సమావేశాన్ని (ఏజీఎం) ముంబయిలో
నిర్వహించారు. వచ్చే మూడేళ్లలో కంపెనీ వ్యాపారాల్లో ఏకంగా రూ.1,80,000 కోట్ల
పెట్టుబడులతో కూడిన భారీ ప్రణాళికను ప్రకటించారు.ముఖ్యాంశాలు: » వచ్చే ఏడాది నుంచి దశలవారీగా 4జీ సేవలను ప్రారంభిస్తున్నట్లు రిలయన్స్
ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేష్ అంబానీ వెల్లడించారు. 4జీ సేవలపై రూ.70,000 కోట్ల
పెట్టుబడులు పెట్టనున్నామని, వీటితో ప్రపంచంలోనే అతిపెద్ద బ్రాడ్‌బ్యాండ్నెట్‌వర్క్‌ను
అభివృద్ధి చేయనున్నట్లు ముకేష్ వెల్లడించారు. » ప్రస్తుతం ప్రపంచంలోని అతిపెద్ద 500 కంపెనీల్లో రిలయన్స్ 135వ స్థానంలోఉంది. » ముకేష్ అంబానీ భార్య నీతా అంబానీ రిలయన్స్ బోర్డులో డైరెక్టర్‌గా
నియమితులయ్యారు. ఆమె నియామకానికి వాటాదారులు ఆమోదం తెలిపారు.
రిలయన్స్ బోర్డులో తొలి మహిళా డైరెక్టర్ ఈమే కావడం విశేషం. లిస్ట్‌డ్ కంపెనీబోర్డులో
కనీసం ఒక మహిళా డైరెక్టరు ఉండాలని కొత్త కంపెనీల చట్టం నిర్దేశిస్తోంది.
నీతా నియామకంతో రిలయన్స్ ఈ నిబంధనకు అనుగుణంగా ఉన్నట్లవుతుంది.
రిలయన్స్ ఫౌండేషన్‌కు నీతా అంబానీ ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు. » గత 20 సంవత్సరాల్లో దేశంలో అత్యధికంగా ఆస్తులను సృష్టించిన
ఘనతరిలయన్స్‌కే దక్కుతుంది. » ప్రైవేటురంగంలో రిలయన్స్ అత్యధిక పన్ను చెల్లిస్తోంది. మొత్తం పరోక్షపన్ను
వసూళ్లలో రిలయన్స్ వాటా 4.7 శాతం. |
జూన్ - 19
|
| ¤ ప్రభుత్వ యాజమాన్యంలోని నమోదిత కంపెనీలన్నింటిలో ప్రజలకు కనీసం 25 శాతం షేర్లను (మినిమమ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ - ఎమ్‌పీఎస్) మూడేళ్ల లోపు విక్రయించాలనే ప్రతిపాదనను క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఆమోదించింది. » ఈ నిర్ణయం స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదై ఉన్న సుమారు 36 ప్రభుత్వరంగ సంస్థల (పీఎస్‌యూలు)లో షేర్ల విక్రయానికి వీలు కల్పిస్తుంది. తద్వారా సుమారు రూ.60,000 కోట్ల వరకు ప్రభుత్వం సమీకరించడానికి తోడ్పడనుంది. ఈ 36 పీఎస్‌యూలలో ప్రజల చేతిలో ఉన్న షేర్లు 25 శాతం కంటే తక్కువగానే ఉన్నాయి. » ప్రస్తుతం అమల్లో ఉన్న నియమావళి ప్రకారం, పీఎస్‌యూలు కనీసం 10 శాతం షేర్లను ప్రజలకు ఇస్తే సరిపోతుంది. ప్రైవేటురంగ కంపెనీలు మాత్రం కనీసం 25 శాతం షేర్లను ప్రజలకు ఇవ్వాలి. ప్రస్తుతం అమల్లో ఉన్న నియమాల ప్రకారమైతే పబ్లిక్ ఇష్యూ అనంతరం రూ.4,000 కోట్ల లోపు మూలధనాన్ని కలిగి ఉండే కంపెనీలన్నీ తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)లో కనీసం 25 శాతం షేర్లను ప్రజలకు తప్పనిసరిగా కేటాయించాలి. రూ.4,000 కోట్ల కంటే ఎక్కువ మార్కెట్ విలువ కలిగిన కంపెనీలైతే, కేవలం 10 శాతం షేర్లను ప్రజలకు కేటాయిస్తే సరిపోతుంది. ఇది వివక్షపూరితంగా ఉందన్న విమర్శల నేపథ్యంలో సెబీ తాజా నిర్ణయం తీసుకుంది. » సెబీ ఛైర్మన్ యు.కె.సిన్హా.¤ దేశంలో నివసించే పౌరులు, ప్రవాసులు (పాకిస్థానీలు, బంగ్లాదేశీయులు మినహా) భారత్‌ను వీడి బయటకు వెళ్లేటప్పుడు తమ వెంట రూ.25,000 వరకూ తీసుకెళ్లడానికి రిజర్వు బ్యాంకు అనుమతించింది. గతంలో విదేశాలకు ప్రయాణించే భారతీయులకు ఈ పరిమితి రూ.10,000 వరకు ఉండగా, విదేశీయులకు మాత్రం భారతీయ కరెన్సీని వెంట తీసుకువెళ్లే సౌలభ్యం లేదు. » పాకిస్థాన్, బంగ్లా పౌరులు, ఆ రెండు దేశాల నుంచి వచ్చేవారు, ఆ దేశాలకు వెళ్లేవారు తప్ప ఇతర ప్రవాసులు తమ వెంట రూ.25,000 తీసుకెళ్లవచ్చు. » విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (ఎఫ్ఈఎమ్ఏ) ప్రకారం భారత్‌లో నివసించే వ్యక్తి నేపాల్ లేదా భూటాన్‌కు రూ.100కు మించని ముఖవిలువ కలిగిన నోట్లను ఎన్నయినా తీసుకెళ్లవచ్చు. |
జూన్ - 20
|
| ¤ ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ 25 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. » ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని, రజతోత్సవాల సందర్భంగా హైదరాబాద్ ఎల్ఐసీ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. » ఈ ఇరవై అయిదేళ్లలో కంపెనీ 16.8 లక్షల మందికి రుణాలు ఇచ్చి వారిని గృహ యజమానులను చేసింది. » 1989 జూన్ 20న సంస్థ కార్యకలాపాలను ప్రారంభించింది.¤ వృద్ధి రేటును పెంచుకోవడానికి వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ)ను ప్రవేశపెట్టాలని, సబ్సిడీల భారాన్ని తగ్గించుకోవాలని, పన్ను చెల్లింపుదారుల సంఖ్యను పెంచుకోవాలని భారత్‌కు ప్రపంచ బ్యాంకు సూచించింది. » ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు అంచనాను 5.7 శాతం నుంచి 5.5 శాతానికి తగ్గించింది. » ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్‌పై ప్రపంచ బ్యాంకు తయారు చేసిన 'గ్లోబల్ ఎకనమిక్ ప్రాస్పెక్టస్' (జీపీఈ) - 2014లో భారత్‌కు సంబంధించిన ఈ వివరాలను కూడా పొందుపరిచారు. » 2015 - 16లో 6.3 శాతానికి, 2016 - 17లో 6.6 శాతానికి భారత వృద్ధి రేటు చేరుకోగలుగుతుందని జీపీఈ - 2014లో పేర్కొన్నారు. » అంతర్జాతీయంగా గిరాకీ పెరుగుతున్నందున భారతదేశంలో పెట్టుబడుల ప్రవాహం పుంజుకుంటుందని, తయారీరంగ కార్యకలాపాలు పెరుగుతాయని జీపీఈ - 2014లో పేర్కొన్నారు. |
జూన్ - 23
|
| ¤ హైదరాబాద్ శివారు ఎయిరోస్పేస్ సెజ్‌లో టాటా గ్రూప్, యూరప్‌నకు చెందిన రుయాగ్ ఏవియేషన్‌తో కలిసి ఏర్పాటు చేస్తున్న విమాన విడిభాగాల యూనిట్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లాంఛనంగా శంకుస్థాపన చేశారు. » ముఖ్యమంత్రిగా కేసీఆర్ శంకుస్థాపన చేసిన తొలి పరిశ్రమ ఇదే. » రూ.500 కోట్ల పెట్టుబడి అంచనాతో 'డోర్నియర్ 228' విమానానికి చెందిన విమాన రెక్కలు, ఫ్యూజ్‌లాజ్స్ తయారీ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. » ఈ సెజ్‌లో టాటాగ్రూప్‌నకు ఇది నాలుగో యూనిట్ కావడం విశేషం. ఇప్పటికే సికోర్‌స్కి సంస్థకు చెందిన ఎస్ - 92 హెలికాప్టర్లకు చెందిన క్యాబిన్లను టాటా సంస్థ ఇక్కడి నుంచే ఎగుమతి చేస్తోంది. » 2009లో 250 ఎకరాల్లో ఎయిరోస్పేస్ సెజ్‌ను ఏర్పాటు చేశారు. |
జూన్ - 24
|
¤ ప్రభుత్వరంగ సంస్థలకు ఇచ్చే అత్యున్నత గౌరవాల్లో ఒకటైన 'నవరత్న' హోదా 'ఇంజినీర్స్ ఇండియా' సంస్థకు లభించింది. » ఇతర సంస్థలతో కలిసి ఏర్పాటు చేసే ప్రాజెక్టుల్లో లేదా పూర్తి అనుబంధ సంస్థల్లో రూ. 1000 కోట్ల వరకు పెట్టుబడులను పెట్టేందుకు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే వెసులుబాటును ఈ హోదా కల్పిస్తుంది. దేశీయ, అంతర్జాతీయ విపణుల్లో కార్యకలాపాలు, ఆర్థికపరమైన విషయాల్లో స్వయంప్రతిపత్తితో వ్యవహరించే అవకాశం లభిస్తుంది. » 1965లో ఏర్పాటైన ఇంజినీర్స్ ఇండియా ముఖ్యంగా చమురు, గ్యాస్, పెట్రో కెమికల్స్ పరిశ్రమలకు ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ, ఇంజినీరింగ్ ప్రొక్యూర్‌మెంట్, కన్సల్టెన్సీ (ఈపీసీ) సేవలను అందిస్తోంది. మౌలిక సదుపాయాలు, సౌర, అణు విద్యుత్, ఎరువులు తదితర రంగాల్లోనూ తన కార్యకలాపాలను విస్తరించింది. » ఇటీవలే అంతర్జాతీయంగా తన కార్యకలాపాలను ప్రారంభించిన ఇంజినీర్స్ ఇండియా మధ్య ప్రాచ్య, ఆఫ్రికా, ఆగ్నేయాసియా దేశాల్లో వివిధ రకాల ప్రాజెక్టులకు ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ సేవలను అందిస్తోంది.
|
జూన్ - 25
|
| ¤ వాహన, మన్నికైన వినిమయ వస్తువుల రంగాలకు ఊరటనిస్తూ ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం తగ్గింపును మరో ఆరు నెలల పాటు పొడిగించింది. » డిసెంబరు 31 వరకు పాత రేట్లే అమల్లో ఉంటాయని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. » కార్లు, ఎస్‌యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్)లు, ద్విచక్ర వాహనాలతో పాటుగా మన్నికైన వినిమయ వస్తువులపై మధ్యంతర బడ్జెట్లో ప్రకటించిన సుంకం తగ్గింపునకు జూన్ 30తో గడువు తీరాల్సి ఉంది. దీన్ని డిసెంబరు 31 వరకు పొడిగించారు. » యంత్ర పరికరాలు, మన్నికైన వినిమయ వస్తువులపై ఇకపైనా 10 శాతం ఎక్సైజ్ సుంకమే అమల్లో ఉంటుంది. మధ్యంతర బడ్జెట్‌కు ముందు ఇది 12 శాతంగా ఉంది. |
జూన్ - 30
|
| ¤ ఎస్‌బీహెచ్ స్వాభిమాన్ పేరిట ప్రత్యేక డిపాజిట్ పథకాన్ని జులై 1 నుంచి డిసెంబరు 31 వరకు అమలు చేయనున్నట్లు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ప్రకటించింది. » ఈ పథకం కింద 5 సంవత్సరాలకు డిపాజిట్ చేసే మొత్తంపై నెల/ త్రైమాసిక/ వార్షిక వడ్డీ పొందవచ్చు. కనీసం లక్ష రూపాయలతో ప్రారంభించి, కోటి రూపాయల వరకు డిపాజిట్ చేయవచ్చు. » 3 - 5 సంవత్సరాల డిపాజిట్‌పై 8.75 శాతం వార్షిక వడ్డీ ఇస్తుండగా, ఈ పథకం కింద 9 శాతం వడ్డీ చెల్లిస్తారు. సీనియర్ సిటిజన్లకు 9.30 శాతం వడ్డీ లభిస్తుంది. వడ్డీ మొత్తాన్ని కూడా తిరిగి డిపాజిట్ చేసుకునే అవకాశం ఈ పథకం కింద ఉంది.¤ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో ద్రవ్యలోటు రూ. 2.4 లక్షల కోట్లుగా నమోదైంది. ఇది పూర్తి ఆర్థిక సంవత్సరానికి వేసిన బడ్జెట్ అంచనాల్లో 45.6 శాతానికి సమానం. » పూర్తి సంవత్సరానికి మొత్తం ద్రవ్యలోటు రూ. 5.28 లక్షల కోట్లు ఉండవచ్చని భావించారు. » ఆదాయానికి, ఖర్చుకు మధ్య ఉన్న తేడానే ద్రవ్యలోటుగా వ్యవహరిస్తారు. » గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో ద్రవ్యలోటు బడ్జెట్ అంచనాల్లో 33.3 శాతంగా లెక్కతేలింది. » ఏప్రిల్, మే నెలల్లో (2014) ప్రభుత్వ మొత్తం వ్యయం రూ.2.8 లక్షల కోట్లుంది. ఇందులో ప్రణాళికా వ్యయం రూ.59,609 కోట్లు. ప్రణాళికేతర వ్యయం రూ.2,20,730 కోట్లు. ఇక ఆదాయ వసూళ్లు రూ.38,505 కోట్లుగా నమోదైంది. ఇది అంచనాల్లో 3.3 శాతం. రెవెన్యూ లోటు రూ.2,05,080 కోట్లు (లేదా అంచనాల్లో 53.6 శాతం) ఉంది. » 2013 - 14 ఆర్థిక సంవత్సరానికి రూ.5,08,149 కోట్ల ద్రవ్యలోటు నమోదైంది. ఇది అదే సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 4.5 శాతానికి సమానం. 2012 - 13 లో ద్రవ్యలోటు జీడీపీలో 4.9 శాతం ఉండటం గమనార్హం. 2016 - 17 కల్లా ద్రవ్యలోటును జీడీపీలో 3 శాతానికి కుదించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.¤ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 2014 - 15 వార్షి రుణ ప్రణాళికను రూ.91,459 కోట్లుగా రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ నిర్ణయించింది. వార్షిక రుణ ప్రణాళికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్‌బీసీ) సమావేశంలో విడుదల చేశారు.వార్షిక ప్రణాళిక తీరు: » వార్షిక ప్రణాళికలో ప్రాధాన్య రంగాలకు రూ.77,894 కోట్లు, ఇతర రంగాలకు రూ.13,565 కోట్లుగా ప్రకటించారు. » రుణ ప్రణాళికలో వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.56,019 కోట్ల మేరకు రుణాలు మంజూరును లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో పంట రుణ లక్ష్యం రూ.41,978 కోట్లు కాగా, దీర్ఘ కాలిక రుణాలు రూ. 6,356 కోట్లు మంజూరు చేయాలని నిర్ణయించారు. వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలకు రూ. 7,685 కోట్ల మేరకు రుణాలు మంజూరు చేయాలని నిర్ణయించారు. అలాగే సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు రూ.10,850 కోట్లు, విద్యా రుణాలు రూ.1926 కోట్లు, హౌసింగ్ రుణాలు రూ.4,795 కోట్లు, ఇతర ప్రాధాన్య రంగాలకు రూ.4,304 కోట్ల మేరకు రుణాలను ఇవ్వాలని నిర్ణయించారు. » రుణ ప్రణాళికలో వ్యవసాయ యాంత్రీకరణకు కేటాయింపులు బాగానే జరిగాయి. కూలీల కొరతతో వ్యవసాయ రంగం సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వ్యవసాయ యాంత్రీకరణకు రూ.1686 కోట్లు కేటాయించినట్లు ఎస్ఎల్‌బీసీ తన రుణ ప్రణాళికలో పేర్కొంది. మైనర్, మైక్రో ఇరిగేషన్‌కు రూ.847 కోట్లు, ప్లాంటేషన్, ఉద్యానవన పంటల రుణాలకు రూ.739 కోట్లు కేటాయించింది. » పాడి పరిశ్రమాభివృద్ధికి రూ.3,663 కోట్లు, పౌల్ట్రీకి రూ.870 కోట్లు, ఫిషరీస్‌కు రూ.1205 కోట్లు కేటాయించింది. » గతేడాది పంట రుణాలు మంజూరుతో పోలిస్తే ఈ ఏడాది లక్ష్యం పెరిగింది. గతేడాది పంట రుణాలు రూ.37,058 కోట్లు మంజూరు కాగా ఈ ఏడాది లక్ష్యం రూ.41,978 కోట్లుగా నిర్ణయించారు. » ఎస్ఎల్‌బీసీ ఛైర్మన్ సి.వి.ఆర్. రాజేంద్రన్. » ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 5980 బ్యాంకు శాఖల్లో 68 శాతం గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లోనే ఉండటం విశేషం. » దేశంలో అతిపెద్ద క్రెడిట్ డిపాజిట్ రేషియో (121.76 శాతం)ను ఆంధ్రప్రదేశ్‌లోని బ్యాంకులు కలిగి ఉండటం విశేషం. |
|
|