ఏప్రిల్ - 2014 ఆర్థికరంగం


ఏప్రిల్ - 1
¤  ఆదాయపు పన్ను (ఐటీ) మినహాయింపు పరిమితిని రూ.2 లక్షల వద్దే ఉంచాలని, రూ.10 కోట్ల పైబడిన వార్షికాదాయం కలిగిన అత్యంత ధనికుల (సూపర్ రిచ్‌)పై 35 శాతం పన్ను రేటును ప్రవేశపెట్టాలని 'సవరించిన ప్రత్యక్ష పన్నుల స్మృతి (డీటీసీ)' బిల్లులోప్రతిపాదించారు. బిల్లు ముసాయిదా పత్రాన్ని ఆర్థిక శాఖ వెబ్‌సైట్‌లో ఉంచింది. ఇందులో వయోవృద్ధులకు (సీనియర్‌ సిటిజన్‌లకు) పన్ను మినహాయింపు పరిమితి వయసును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించారు. ఆర్థిక మంత్రి చిదంబరం సిద్ధం చేసిన ఈ ముసాయిదాపై కొత్త ప్రభుత్వం తుది నిర్ణయాన్ని తీసుకుంటుంది.   »    భారత్‌లో 20 శాతానికి మించిన ఆస్తులు కలిగి ఉన్న విదేశీ కంపెనీలకు దేశీయ పన్ను చట్టాలను వర్తింపచేయాలనే సూచన కూడా ముసాయిదాలో పొందుపరిచారు.    »    ఐటీ మినహాయింపు పరిమితిని రూ.3 లక్షలకు పెంచాలని, ఇతర పన్ను శ్లాబుల్లో సర్దుబాట్లు చేయాలని భాజపా సీనియర్‌ నాయకుడు యశ్వంత్‌ సిన్హా నేతృత్వంలో ఏర్పాటైన స్థాయీ సంఘం చేసిన సిఫారసులను ఆర్థిక శాఖ తోసిపుచ్చింది. అలా చేస్తే ఖజానాకు ఏడాదికి రూ.60,000 కోట్ల వరకు నష్టం వస్తుందని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. రూ.3 -10 లక్షల వరకు ఆదాయంపై 10 శాతం, రూ.10 -20 లక్షల ఆదాయానికి 20%, రూ.20 లక్షలు మించిన ఆదాయానికి 30 శాతం చొప్పున పన్ను విధించాలని సిన్హా కమిటీ ప్రతిపాదించింది.   »    తాజా డీటీసీ బిల్లు ముసాయిదాలో నాలుగో శ్లాబును ప్రతిపాదించారు. దీన్ని వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్‌లు), ఆర్టిఫీషియల్‌ జ్యుడీషియల్‌ పర్సన్స్‌కు ఉద్దేశించారు. వీరి విషయంలో రూ.10 కోట్లకు మించిన మొత్తం ఆదాయంపై 35 శాతం రేటుతో పన్నును వసూలు చేయాలని పేర్కొన్నారు. సెక్యూరిటీల లావాదేవీల పన్నును రద్దు చేయాలన్న సిన్హా కమిటీ సూచనను కూడా తాజా ముసాయిదా తోసిపుచ్చింది.¤  కొత్త బ్యాంకుల ఏర్పాటుకు లైసెన్సులు జారీ చేయడానికి రిజర్వు బ్యాంకుకు ఎన్నికలసంఘం (ఈసీ) అనుమతి ఇచ్చింది.    »    మార్చి 5 తర్వాత ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో లైసెన్సుల జారీకి అనుమతి ఇవ్వాలంటూ ఆర్‌బీఐ మార్చి 12న ఎన్నికల సంఘాన్ని ఆర్‌బీఐ కోరింది. ఎట్టకేలకు దీనికి ఈసీ ఆమోదముద్ర వేసింది.   »    తొలుత ఆర్‌బీఐ చెంతకు 27 దరఖాస్తులు రాగా టాటా సన్స్‌, వేల్యూ ఇండస్ట్రీస్ వెనక్కి తగ్గడంతో మొత్తం 25 సంస్థలు రేసులో ఉన్నట్లయింది. ఇందులో ఇండియా పోస్ట్‌, ఐఎఫ్‌సీఐతో పాటు అనిల్‌ అంబానీ గ్రూపు, ఆదిత్య బిర్లా గ్రూపు, బజాజ్‌ ఫైనాన్స్‌, ముత్తూట్‌ ఫైనాన్స్‌, రెలిగేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌, శ్రీరామ్‌ క్యాపిటల్‌ తదితరాలు ఉన్నాయి.¤  వివిధ బ్యాంకుల్లో సేవింగ్స్‌ ఖాతాలు ఉండి అందులో కనీస మొత్తాన్ని ఉంచకపోయినప్పటికీ అలాంటి ఖాతాదార్లపై ఎలాంటి అపరాధ రుసుము విధించొద్దని బ్యాంకులకు రిజర్వ్‌ బ్యాంకు (ఆర్‌బీఐ) సూచించింది. వినియోగదార్ల ఇబ్బందినో, వారి అశ్రద్ధనో ఆసరాగా తీసుకుని బ్యాంకులు అనుచిత ప్రయోజనం పొందకూడదని ఆర్‌బీఐ గవర్నర్ ర‌ఘురామ్‌ రాజన్‌ అన్నారు.   »    అపరాధ రుసుములు విధించే బదులు అలాంటి ఖాతాలకు అందించాల్సిన‌ సేవలను పరిమితం చేయాలని, ఖాతాలో సొమ్ము కనీస స్థాయికి చేరినప్పుడు ఆయా సేవలను పునరుద్ధరించాలని ఆయన సూచించారు. కొన్నాళ్లుగా లావాదేవీలు జరగని ఖాతాలో సైతం కనీస నిల్వ లేకపోయినా ఎటువంటి ఛార్జీలు వసూలు చేయకూడదని చెప్పారు. ¤  ఆర్‌బీఐ తొలి ద్వైమాసిక పరపతి విధాన సమీక్షను చేప‌ట్టింది. ఈ సందర్భంగా ఆర్‌బీఐ గ‌వ‌ర్నర్‌ రఘురామ్‌ రాజన్ మాట్లాడుతూ... ప్రస్తుత పరిస్థితుల్లో కీలక రెపో, రివర్స్‌ రెపో రేట్లను యథాతథంగా కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. వడ్డీ రేట్ల విధానాల్లో మార్పులు తేవడం, నగదు లభ్యతను మెరుగుపరచడం తమ ముఖ్య ఉద్దేశమన్నారు. నగదు లభ్యత పరిస్థితుల పర్యవేక్షణను ఆర్‌బీఐ కొనసాగిస్తుందని తెలిపారు. ఉత్పాదకత రంగాల్లో తగినంత నిధుల ప్రవాహానికి హామీ ఇచ్చారు.పరపతి విధాన సమీక్ష ముఖ్యాంశాలు 8 శాతం వద్ద రెపో రేటు యథాతథం  4 శాతం వద్దనే నగదు నిల్వల నిష్పత్తి.  ద్రవ్యోల్బణం తగ్గుముఖం కొనసాగితే భవిష్యత్‌లో రేట్ల పెంపు ఉండబోదు.  2014 -15లో జీడీపీ వృద్ధిరేటు 5.5 శాతానికి చేరవచ్చు.  2013 -14లో కరెంట్‌ ఖాతా లోటు (సీఏడీ) జీడీపీలో 2 శాతం కంటే తక్కువగా ఉండవచ్చు.  2014లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 6% లోపే ఉండొచ్చు.  పోటీ, స్థిరత్వం విషయంలో రాజీ లేకుంటే బ్యాంకుల విలీనానికి ఒప్పుకుంటాం.  ఆర్థిక వ్యవస్థపై పారిశ్రామిక కార్యకలాపాల ప్రతికూల ప్రభావం కొనసాగుతోంది.  తదుపరి విధాన సమీక్ష జూన్‌ 3న ఉంటుంది.
ఏప్రిల్ - 2
¤  ఎట్టకేలకు రిజర్వ్ బ్యాంక్‌ సూత్రప్రాయంగా రెండు కొత్త బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. వీటిలో ఒకటి మౌలిక ఆర్థిక సంస్థ ఐడీఎఫ్‌సీ కాగా మరొకటి సూక్ష్మ రుణాల సంస్థ బంధన్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్. 18 నెలల పాటు ఈ సూత్రప్రాయ అంగీకారం అమల్లో ఉంటుంది. ఆలోపు ఈ రెండు కంపెనీలు నిర్దేశించిన మార్గదర్శకాలు, ఇతర షరతులను పాటించాల్సి ఉంటుంది. అప్పుడే బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ చట్టం - 1949 లోని సెక్షన్ 22 (1) కింద పూర్తి స్థాయి అనుమతి వస్తుంది. దాదాపు దశాబ్ద కాలం తర్వాత ఆర్‌బీఐ బ్యాంకు లైసెన్సులను జారీ చేయడం ఇదే తొలిసారి.   »    2013 ఫిబ్రవరిలో ఆర్‌బీఐ కొత్త బ్యాంకుల ఏర్పాటుకు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసింది. దరఖాస్తులను వడబోసిన తర్వాత‌ వాటిని బిమల్‌ జలాన్‌ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి సలహా సంఘానికి పంపింది. ఆ సంఘం 2014, ఫిబ్రవరి 25 న తన సిఫారసులను ఆర్‌బీఐకి అందించింది. వెంట‌నే ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో ఆర్‌బీఐ ఎన్నికల సంఘం చెంతకు వెళ్లాల్సి వచ్చింది. తాజాగా ఈసీ అనుమ‌తి ఇవ్వడంతో రెండు సంస్థలకు సూత్రప్రాయ ఆమోదం తెలిపింది.   »    కొత్త బ్యాంకు లైసెన్సుల కోసం జులై 2013 గడువు నాటికి రిజర్వు బ్యాంకుకు 27 దరఖాస్తులు వచ్చాయి. తర్వాత టాటా సన్స్‌, వీడియోకాన్‌ గ్రూపులు రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాయి. ఆర్‌బీఐ తాజా నిర్ణయంతో ఆదిత్య బిర్లా నువో, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, రిలయన్స్‌ క్యాపిటల్ (అడాగ్‌), ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఎల్‌ అండ్‌ టీ ఫైనాన్స్‌, ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఎడెల్‌వీజ్‌, ఐఎఫ్‌సీఐ, ఇండియా ఇన్ఫోలైన్‌, జేఎమ్‌ ఫైనాన్షియల్‌, ముత్తూట్‌ ఫైనాన్స్‌, రెలిగేర్‌, శ్రీరామ్‌ క్యాపిటల్‌, శ్రేయీ ఇన్‌ఫ్రా తదితరాలకు నిరాశే మిగిలింది.   »    ప్రస్తుతానికి 25 దరఖాస్తుల్లో రెండింటికే తాత్కాలిక అనుమతులు లభించినప్పటికీ మిగతావి భవిష్యత్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. లేదంటే ప్రతిపాదిత మార్గదర్శకాల కింద పాక్షిక బ్యాంకింగ్‌ సేవల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.   »    ప్రభుత్వ రంగానికి చెందిన 'ఇండియా పోస్ట్‌' దరఖాస్తును కావలిస్తే విడిగా పరిశీలించవచ్చని ఆర్‌బీఐకి హెచ్‌ఎల్‌ఏసీ సూచించింది. ప్రభుత్వంతో చర్చలు జరిపి లైసెన్సు ఇవ్వవచ్చని సిఫారసు చేసింది.   »    ప్రస్తుతం దేశంలో 27 ప్రభుత్వ రంగ బ్యాంకులు, 22 ప్రైవేటు రంగ బ్యాంకులున్నాయి.   »    1997, జనవరి 30 న డాక్టర్‌ రాకేశ్‌ మోహన్‌ నేతృత్వంలో 'మౌలిక ప్రాజెక్టుల వాణిజ్యీకరణపై ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ' చేసిన సిఫారసుల మేరకు ఐడీఎఫ్‌సీ ఏర్పాటైంది. 2005లో స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదైంది. 600 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు.   »    2001లో చంద్రశేఖర్‌ ఘోష్‌ నాయకత్వంలో 'బంధన్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌' ఏర్పడింది. నిరుపేద స్త్రీలకు సూక్ష్మ రుణాలను ఇవ్వడం ఈ సంస్థ ప్రాథమిక లక్ష్యం. 12 ఏళ్లుగా సూక్ష్మ రుణాలను అందిస్తున్న ఈ కంపెనీ తొలుత కోల్‌కతాకు 60 కి.మీ. దూరంలోని బాగ్నన్‌ అనే గ్రామంలో కార్యకలాపాలు ప్రారంభించింది. 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సేవలందిస్తోంది. సిడ్బి, ఐఎఫ్‌సీ ఈ కంపెనీలో ఇన్వెస్టర్లుగా ఉన్నాయి.
ఏప్రిల్ - 4
¤  ఫేస్‌బుక్‌, యూట్యూబ్ ద్వారా ఖాతాదారుల‌కు సేవలందిస్తున్న ఎస్‌బీఐ తాజాగా ట్విట్టర్‌తోనూ సేవలను ప్రారంభించింది. ఈ సేవను పొందడానికి వినియోగ‌దారులు ''https://twitter.com/TheOfficialSbi ''ను ఉపయోగించాలని తెలిపింది.    »    అధిక సంఖ్యలో ఖాతాదారులు ఉండటం వల్ల బ్యాంకు ఉత్పత్తులు, సేవలకు సంబంధించి నిరంతరం ట్వీట్స్‌ రావొచ్చని ఎస్‌బీఐ తెలిపింది.    »    యువత నుంచి ఈ ట్విట్టర్‌ అనుసంధానిత సేవల వినియోగం ఎక్కువగా ఉండొచ్చని బ్యాంక్‌ భావిస్తోంది.
ఏప్రిల్ - 7
¤ ఫ్రాన్స్‌కు చెందిన లఫర్జీ, స్విట్జర్లాండ్‌కు చెందిన హోల్సిమ్ సిమెంటు రంగ దిగ్గజాలు విలీనమవుతున్నట్లు ప్రకటించాయి. ఈ విలీన ప్రతిపాదనను రెండు కంపెనీల బోర్డులు ఏకగ్రీవంగా ఆమోదించాయి. దీంతో 32 బిలియన్‌ యూరోల (దాదాపు రూ.2,60,000 కోట్లు) వార్షిక ఆదాయం గ‌ల కొత్త సంస్థ ఏర్పడుతుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సిమెంట్‌ కంపెనీగా నిలుస్తుంది. సంయుక్త కంపెనీ దాదాపు అన్ని ఖండాల్లో 90 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. కొత్త సంస్థ 'లఫర్జీ హోల్సిమ్‌' పేరుతో స్విట్జర్లాండ్‌ కేంద్రంగా పనిచేస్తుంది.   »     హోల్సిమ్‌ తదుపరి ఛైర్మన్‌గా నియమితులైన వూల్ఫ్‌గాంగ్‌ రీజిల్ గ్రూపు ఛైర్మన్‌గాను, లఫర్జీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ బ్రూనో లాఫాంట్‌ ఉమ్మడి గ్రూపునకు ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ)గానూ వ్యవహరిస్తారు. లఫర్జీ హోల్సిమ్‌ను జ్యూరిచ్‌లోని ఎస్‌ఐఎక్స్‌లోనూ, యూరోనెక్స్‌ట్‌ ప్యారిస్‌లోనూ నమోదు చేస్తారు   »     భారత్‌లోని అంబుజా సిమెంట్స్‌లో 61.39 శాతం, ఏసీసీలో 50.01% వాటా హోల్సిమ్‌ చేతిలో ఉంది. ఏసీసీలో వాటాను అంబుజా సిమెంట్స్‌ ద్వారా హోల్సిమ్‌ చేజిక్కించుకుంది. లఫర్జీ-హోల్సిమ్‌ ఉమ్మడి ఉత్పత్తి సామర్థ్యం ప్రస్తుతం మార్కెట్‌ లీడర్‌గా ఉన్న అల్ట్రాటెక్‌ను మించిపోనుంది. అల్ట్రాటెక్‌ ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 57 మిలియన్‌ టన్నులుంది.¤ దాదాపు రూ.20,000 కోట్లు (3.2 బిలియన్‌ డాలర్లు) వెచ్చించి ర్యాన్‌బాక్సీ లేబొరేటరీస్‌ను కొనుగోలు చేస్తున్నామంటూ సన్‌ ఫార్మాస్యూటికల్స్‌ ప్రకటించింది. తద్వారా రూ.25,000 కోట్ల (4.2 బిలియన్‌ డాలర్లు) సంయుక్త ఆదాయ అంచనాతో దేశంలోని ఔషధ సంస్థల్లో తొలి స్థానంలో ఇది నిలవ‌నుంది. ప్రపంచంలోనే అయిదో అతిపెద్ద ఔషధ సంస్థగా ఆవిర్భవించ‌నుంది   »     లావాదేవీలు మొత్తం షేర్ల రూపంలోనే జరుగుతాయి. జపాన్‌కు చెందిన దైచీ శాంక్యోకు ర్యాన్‌బాక్సీలో 63.4 శాతం వాటా ఉండగా దీని నుంచి నియంత్రిత వాటాను సన్‌ ఫార్మా కొనుగోలు చేస్తుంది. .   »     షేరు హోల్డర్లు, నియంత్రణ సంస్థల ఆమోదంతో ఈ ఒప్పందాన్ని 2014 చివరికల్లా పూర్తి చేయొచ్చని రెండు కంపెనీలు భావిస్తున్నాయి.
ఏప్రిల్ - 9
¤ 2014-15కు నాస్‌కామ్‌ ఛైర్మన్‌గా కాగ్నిజెంట్‌ ఇండియాఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ఛైర్మన్‌ ఆర్‌.చంద్రశేఖరన్‌ నియమితులయ్యారు. ఆయ‌న‌కు ముందు ఈ పదవీ బాధ్యతలను మైండ్ ట్రీ సీఈఓ, ఎండీ కృష్ణకుమార్‌ నటరాజన్‌ నిర్వహించారు. అలాగే ఇన్ఫోటెక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ వ్యవస్థాపకుడు, సీఎండీ బి.వి.ఆర్‌.మోహన్‌రెడ్డి నాస్‌కామ్‌కు వైస్‌ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.¤ భారత్‌ 2014-15లో 5.7 శాతం ఆర్థిక వృద్ధి రేటును సాధించవచ్చని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. బలపడుతున్న రూపాయి మారకపు విలువ, అనేక భారీ స్థాయి పెట్టుబడి ప్రాజెక్టులకు ఆమోదం లభించడం 2014-15లో మరింత జోరు కనబరుస్తూ 5.7 శాతానికి చేరడానికి తోడ్పడగలవని ప్రపంచ బ్యాంకు 'సౌత్‌ ఏషియా ఎకనామిక్‌ ఫోకస్‌' తాజా సంచికలో పేర్కొంది. ఇలాంటి నివేదికను ప్రపంచ బ్యాంకు ఏడాదికి రెండు సార్లు వెలువరిస్తూ ఉంటుంది   »     అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎమ్‌ఎఫ్‌) 2012-13లో 4.4 శాతంగా ఉన్న భారత వృద్ధి రేటు 2013-14లో 5.4 శాతానికి చేరుకుంటుంద‌ని తెలిపింది. భారత ఎగుమతులు పటిష్టం కావడాన్ని ఐఎమ్‌ఎఫ్‌ ప్రస్తావించింది.
ఏప్రిల్ - 11
¤ వాణిజ్యలోటు మూడేళ్ల కనిష్ఠ స్థాయికి తగ్గినప్పటికీ గత ఆర్థిక సంవత్సరానికి ఎగుమతులు లక్ష్యాన్ని చేరలేకపోయాయి. 2013-14కు ఎగుమతులు 3.98 శాతం మాత్రమే పెరిగి 31,235 కోట్ల డాలర్లకు చేరినట్లు వాణిజ్య, పరిశ్రమల శాఖ వెల్లడించింది. దిగుమతులు 8.11 శాతం తగ్గి 45,094 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. దీంతో వాణిజ్యలోటు 13,859 కోట్ల డాలర్లకు పరిమితమైంది. ఇది మూడేళ్ల కనిష్ఠ స్థాయి. 2012-13లో వాణిజ్యలోటు 19,033 కోట్ల డాలర్లు ఉంది. బంగారం, వెండి దిగుమతులు తగ్గడం వాణిజ్యలోటు పరిమితం కావడానికి దోహదం చేసిందని అధికార వర్గాలు తెలిపాయి.   »     మార్చి నెలకు ఎగుమతులు 3.15 శాతం తగ్గి 2,957 కోట్ల డాలర్లకు చేరాయి. దిగుమతులు కూడా 2.11 శాతం క్షీణించి 4,000 కోట్ల డాలర్లుగా ఉండటంతో వాణిజ్య లోటు 1,050 కోట్ల డాలర్లుగా నమోదైంది. ఏడాది క్రితం ఇదే నెలలో వాణిజ్య లోటు 1,040 కోట్ల డాలర్లు ఉంది. ఎగుమతులు క్షీణించడం ఇది వరుసగా రెండో నెల కాగా వాణిజ్యలోటు అయిదు నెలల గరిష్ఠ స్థాయి. తయారీ రంగం మందగించడం, రూపాయి మారకపు విలువ పెరగడం, భారత వస్తువులను కొనుగోలు చేస్తున్న దేశాల కరెన్సీ విలువలు తగ్గడం, లోహ, సరకుల ధరలు తగ్గు ముఖం పట్టడం ఎగుమతుల క్షీణతకు కారణం.
   »     చమురు దిగుమతులు 2013-14కి 2.2 శాతం, మార్చి నెలకు 17.7 శాతం పెరిగాయి.   »     తయారీ రంగం ముఖ్యంగా భారీ యంత్రపరికరాల పరిశ్రమ పనితీరు మందగించడంతో ఫిబ్రవరి నెలకు పారిశ్రామికోత్పత్తి 1.9 శాతం క్షీణించింది. 2013-14 మొదటి పదకొండు నెలలకు పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) 0.1 శాతం తగ్గింది. ఏడాది క్రితం ఇదే కాలంలో 0.9 శాతం పెరిగినట్లు కేంద్రీయ గణాంకాల కార్యాలయం (సీఎస్‌ఓ) తెలిపింది. పారిశ్రామికోత్పత్తి సూచీలో 75 శాతానికి పైగా వెయిటేజీ ఉన్న తయారీ రంగ ఉత్పత్తి ఫిబ్రవరి నెలకు 3.7 శాతం క్షీణించింది. ఏడాది క్రితం ఇదే నెలలో 2.1 శాతం వృద్ధిరేటును నమోదు చేసింది. ఏప్రిల్‌-ఫిబ్రవరి నెలలకు తయారీ రంగ వృద్ధిరేటు 0.7 శాతం తగ్గింది. ఏడాది క్రితం ఇదే కాలంలో ఒక శాతం పెరిగింది. భారీ యంత్ర పరికరాల రంగ వృద్ధి ఫిబ్రవరి నెలలో భారీగా 17.4 శాతం, ఏప్రిల్‌-ఫిబ్రవరి నెలలకు 2.5 శాతం క్షీణించింది.
ఏప్రిల్ - 15
¤  ప్రభుత్వం ద్రవ్వోల్బణ గణాంకాలను విడుదల చేసింది.ముఖ్యాంశాలు: డిసెంబరు నుంచీ తగ్గుతూ వచ్చిన ద్రవ్వోల్బణం మళ్లీ పెరిగింది. పళ్లు, కూరగాయల ధరలు మళ్లీ ప్రియమయ్యాయి.   »     టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్వోల్బణం మార్చిలో 5.7 శాతానికి, రిటైల్ ద్రవ్యోల్బణం 8.31 శాతానికి చేరాయి.   »     ఫిబ్రవరిలో డబ్లూపీఐ తొమ్మిది నెలల కనిష్ఠ స్థాయి అయిన 4.68 శాతానికి చేరడం గమనార్హం. అదే నెలలో రిటైల్ ద్రవ్వోల్బణం 8.03%గా నమోదైంది.   »     ఆహార పదార్థాల ద్రవ్వోల్బణం రేటు 8.12% నుంచి 9.9 శాతానికి పెరిగింది.   »     ఇంధన, విద్యుత్ రంగ ద్రవ్వోల్బణం 8.75% నుంచి 11.22 శాతానికి పెరిగింది.   »     2013-14 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్వోల్బణం రేటును 5.7 శాతంగా ప్రభుత్వం పేర్కొంది. 2012-13లో ఇది 5.65 శాతంగా ఉంది.¤  ఈ సంవత్సరం బ్రిటన్‌లో అత్యంత సంపన్న ఆసియా కంపెనీగా హిందుజా గ్రూప్ వరుసగా రెండో ఏడాది కూడా అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగలిగింది.   »     ఎస్.పి.హిందుజా ఛైర్మన్‌గా ఉన్న ఈ గ్రూపు సంపద గత ఏడాదితో పోలిస్తే ఒక బిలియన్ పౌండ్ల మేర వృద్ధి చెంది, 13.5 బిలియన్ పౌండ్లకు (సుమారు రూ.1,35,000 కోట్లకు) చేరింది.   »     విశిష్ట విజయాలను సాధించినందుకు ఏషియన్ బిజినెస్ ఆఫ్ ద ఇయర్అవార్డును కూడా ఈ గ్రూపు గెల్చుకుంది.
ఏప్రిల్ - 17
¤  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధిరేటు 5.5 శాతం ఉండొచ్చని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా వేసింది.   »     ఆపై సంవత్సరంలో ఇది 6.25 శాతానికి చేరే అవకాశం ఉందని కూడా ఐఎంఎఫ్ అంచనా వేసింది. అన్నీ సవ్యంగా జరిగితే, త్వరలోనే భారత్ 7% వృద్ధి రేటునూ అందుకోగలుగుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది.
ఏప్రిల్ - 18
¤  పార్టిసిపేటరీ నోట్ల (పి నోట్ల) ద్వారా దేశీ స్టాక్స్‌లోకి ప్రవహించే విదేశీ పెట్టుబడులు మరింత పెరిగాయి. దీంతో 2014 మార్చి చివరికల్లా ఈ పెట్టుబడుల విలువ రూ.2.07 లక్షల కోట్లకు (34 బిలియన్ డాలర్లకుపైగా) చేరింది. ఇది మూడేళ్ల గరిష్ఠం కావడం విశేషం.   »     సంపన్న వర్గాలు (హెచ్ఎన్ఐలు), హెడ్జ్‌ఫండ్స్, తదితర విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు పి నోట్ల ద్వారా దేశీ షేర్లలో ఇన్వెస్ట్ చేస్తారు.   »     మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం ఈక్విటీ, డెట్, డెరివేటివ్స్‌లో పి నోట్ పెట్టుబడులు మార్చి కల్లా రూ.2,07,639 కోట్లకు చేరాయి. 2011 మే తరువాత ఇవే అత్యధికం కావడం విశేషం.
 ఏప్రిల్ - 19
¤  రాష్ట్ర అర్థగణాంక శాఖ ఆహారధాన్యాల ఉత్పత్తికి సంబంధించి మూడో ముందస్తు అంచనాలను వెల్లడించింది.ముఖ్యాంశాలు: ఈ ఏడాది (2013 - 14) మొత్తం 224.96 లక్షల టన్నుల ఆహార ధాన్యాల దిగుబడిని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. అయితే, ఇది 218 లక్షల టన్నులకు మించకపోవచ్చునని అర్థగణాంకశాఖ అంచనాలు వెల్లడించాయి. వాస్తవ గణాంకాల ప్రకారం నిరుటికంటే ఈసారి 34.34 లక్షల టన్నుల మేర ఉత్పత్తి పెరిగినా, లక్ష్యంలో 6.76 లక్షల టన్నులకు గండి పడటం గమనార్హం. ఇందులో ప్రధాన ఆహార పంట వరి దిగుబడి లక్ష్యం 147.39 లక్షల టన్నులు కాగా, 141.19 లక్షల టన్నులకే పరిమితం కానుంది. అంటే మొత్తం లోటులో 99% (6.20 లక్షల టన్నులు) ఒక్క వరి వాటాలోనే ఉంటుంది.
ఏప్రిల్ - 20
¤  రిలయన్స్ ఇండస్ట్రీస్ విదేశాల్లోని పలు చమురు క్షేత్రాల్లో 30 శాతం వరకు పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. పెరూ, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, యెమెన్‌లలో పెట్టుబడులను ఉప సంహరించాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ నిర్ణయించింది.¤  ర్యాన్ బాక్సీని సన్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ విలీనం చేసుకుంది.   »     సన్ ఫార్మా మొత్తం 4 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టి అంతా షేర్ల మార్పిడి ద్వారా ర్యాన్ బాక్సీని టేకోవర్ చేసింది.   »     ర్యాన్ బాక్సీకి ఉన్న బ్రాండ్ గిరాకీ దృష్ట్యా 100కి పైగా దేశాల్లో ఉన్న ర్యాన్‌బాక్సీకి చెందిన పలు జనరిక్ బ్రాండ్లను అదే పేరుతో కొనసాగించాలని సన్ ఫార్మా నిర్ణయించింది.
ఏప్రిల్ - 21
¤  సాధారణ ఎన్నికల అనంతరం కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటైతే, వచ్చే అయిదేళ్లలో భారత్ సగటున 6.5% వృద్ధిరేటును నమోదు చేసేందుకు అవకాశం ఉంటుందని రేటింగ్ సంస్థ క్రిసిల్ అంచనా వేసింది.   »     2014-15 నుంచి 2018-19 మధ్య భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు సగటున 6.5 శాతంగా ఉండటం సాధారణ ఎన్నికల్లో ప్రజాతీర్పు నిర్ణయాత్మకంగా వెలువడటం అనే అంశంపై ఆధారపడి ఉంటుందని క్రిసిల్ వెల్లడించింది.   »     2011-12లో 9.3% వృద్ధిని సాధించిన భారత్, గత ఆర్ధిక సంవత్సరం (2013-14) మొదటి మూడు త్రైమాసికాల్లో 4.6% ఆర్థికవృద్ధిని నమోదు చేసింది.   »     26.90 కోట్ల మంది దారిద్య్రరేఖకు దిగువన మనుగడ సాగిస్తున్న దేశమైన భారత్ వచ్చే అయిదు ఆర్థిక సంవత్సరాల్లో సగటున 6.5% వృద్ధిని సాధించినంతమాత్రాన సరిపోదని, శరవేగంగా పెరిగిపోతున్న యువతకు ఉద్యోగాలను చూపించాల్సి ఉంటుందని క్రిసిల్ గుర్తు చేసింది.¤  జపాన్‌లోని రెండు యూనిట్లను మిత్సుబిషికి చెందిన కంపెనీలో విలీనం చేసి, సాఫ్ట్‌వేర్ కంపెనీని ఏర్పాటు చేయడానికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం టీసీఎస్ జపాన్, నిప్పన్ టీసీఎస్ సొల్యూషన్ సెంటర్లను మిత్సుబిషికి చెందిన ఐటీ ఫ్రాంటియర్ కార్పొరేషన్ (ఐటీఎఫ్)లో విలీనం చేసి, కొత్త కంపెనీని ఏర్పాటు చేస్తారు. దీని పేరును ఇంకా నిర్ణయించలేదు. విలీనం అనంతరం కంపెనీలో టీసీఎస్‌కు 51%, మిత్సుబిషికి 49% వాటా ఉంటుంది.   »     ఐటీ సేవలకు ప్రపంచంలో జపాన్ రెండో అతిపెద్ద విపణి. ఈ మార్కెట్‌లో పట్టు సాధించడానికి భారత ఐటీ కంపెనీలు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మిత్సుబిషితో కంపెనీని ఏర్పాటు చేయడం వల్ల జపాన్‌లోని హైటెక్, తయారీ, బీఎఫ్ఎస్ఐ, రిటైల్ రంగాల్లోని కంపెనీలు టీసీఎస్‌కు ఖాతాదారులుగా మారగలవు. తాజా నిర్ణయం టీసీఎస్‌కు అనుకూలంగా ఉంటుంది. భవిష్యత్‌లో దీర్ఘకాలానికి ఆదాయం సమకూరుతుంది.   »     జపాన్ ఐటీ సేవల మార్కెట్ విలువ 110 బిలియన్ డాలర్ల నుంచి 125 బిలియన్ డాలర్ల వరకూ ఉంటుంది. కానీ, ఇందులో భారత ఐటీ కంపెనీల వాటా 2% కంటే తక్కువ కావడం గమనార్హం.¤  బంగ్లాదేశ్‌లో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి నిటోల్ నిలాయ్ గ్రూప్‌తో కలిసి భారత్‌కు చెందిన హీరో మోటోకార్ప్ ఒక ఒప్పందం కుదుర్చుకుంది.   »     దేశం వెలుపల ఇదే హీరో మోటోకార్ప్‌కు తొలి తయారీ ప్లాంట్ అవుతుంది. సంయుక్త సంస్థలో హీరో మోటోకార్ప్‌కు 55%, బంగ్లాదేశ్ కంపెనీకి 45% వాటా ఉంటుంది. 2015 సెప్టెంబరు నాటికి ప్లాంట్‌లో ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభమవుతాయని హీరో మోటోకార్ప్ వెల్లడించింది. ప్లాంట్ వార్షిక సామర్థ్యం 1,50,000 యూనిట్లుగా ఉంటుంది.   »     ప్లాంట్ ఏర్పాటు ఒప్పందంతో పాటు హీరో మోటోకార్ప్ తాజాగా బంగ్లాదేశ్ విపణిలోకి కూడా ప్రవేశించింది. 11 మోడళ్లను విడుదల చేసింది. తొలి అవుట్‌లెట్‌ను ఢాకాలో ప్రారంభించింది.   »     భారత్‌లో హీరో మోటోకార్ప్‌కు ప్రస్తుతం మూడు తయారీ యూనిట్లు ఉన్నాయి. రాజస్థాన్‌లో మరో యూనిట్ త్వరలో ఉత్పత్తి ప్రారంభించనుంది. గుజరాత్‌లో అయిదో ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసే సన్నాహాల్లో ఉంది.¤  గత సంవత్సరం డిసెంబరు 6న దేశవ్యాప్తంగా 709 కేంద్రాల్లో 61,902 యూనిట్ల రక్తం సేకరించినందుకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది.   »     కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద 2007 నుంచి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రక్తదాన కార్యక్రమాలను నిర్వహిస్తోంది.   »     డిగ్రీ పూర్తి చేసిన వెంటనే బ్యాంకింగ్, ఆర్థిక సేవా రంగాల్లో ఉద్యోగాలు పొందేలా విద్యార్థులకు శిక్షణ కల్పించేందుకు దేశంలోని ప్రముఖ బిజినెస్ స్కూళ్లు, విశ్వవిద్యాలయాలతో ఒప్పందం చేసుకుంటున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వెల్లడించింది. డిగ్రీ పూర్తి చేసిన 25 ఏళ్ల లోపు యువతకు ప్రవేశ పరీక్ష ఆధారంగా ఈ శిక్షణ లభిస్తుంది. వెల్త్ మేనేజ్‌మెంట్, విదేశీ మారకద్రవ్య వ్యవహారాలు, సాంకేతికత వంటి విభాగాల్లో సొంతంగా కోర్సులు తయారు చేసినట్లు కూడా బ్యాంక్ వెల్లడించింది.   »     'ది మాడర్న్ బ్యాంకర్' పేరిట తాము నిర్వహించే కోర్సు అభ్యసించిన వారు పరీక్షలో ఉత్తీర్ణులైతే తమ బ్యాంక్‌లో ఉద్యోగావకాశం కల్పిస్తామని ప్రకటించింది.   »     హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎండీ ఆదిత్యపురి.
 ఏప్రిల్ - 22
¤  ఫిలిప్పీన్స్లో మక్తాన్ సెబూ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని (ఎంసీఐఏ) అభివృద్ధి చేసి, నిర్వహించేందుకు ఉద్దేశించిన ఒప్పందంపై జీఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంతకాలు చేసింది. ఇందుకోసం 14.4 బిలియన్ ఫిలిప్పీన్ పెసోల (దాదాపు రూ.1,920 కోట్ల)ను అప్‌ఫ్రంట్ ప్రీమియంగా ఎంసీఐఏ అథారిటీకి జీఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చెల్లించింది.   »     జీఎంఆర్ ఫిలిప్పీన్స్ కే చెందిన నిర్మాణ కంపెనీ మెగావైడ్‌తో జట్టు కట్టి, ఎంసీఐఏను తీర్చిదిద్ది, ఆ విమానాశ్రయ కార్యకలాపాలను నిర్వహించనుంది.¤  ఔషధ రంగంలో మరో భారీ ఒప్పందం తెరమీదకు వచ్చింది. బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ కంపెనీ గ్లాక్సో స్మిత్‌క్లైన్ పీఎల్‌సీ (జీఎస్‌కే)కు చెందిన క్యాన్సర్ ఔషధాల వ్యాపారాన్ని స్విట్జర్లాండ్‌కు చెందిన ఔషధ రంగ దిగ్గజం నొవార్టిస్ ఏజీ 16 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.96,000 కోట్ల)కు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.   »     నొవార్టిస్ కూడా తన వద్ద ఉన్న టీకాల వ్యాపారాన్ని 7.1 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.42,500 కోట్ల)కు జీఎస్‌కేకు విక్రయించేందుకు ఒక ఒప్పందం కుదుర్చుకుంది.   »     అంతేకాకుండా, ఈ రెండు కంపెనీలు ఉమ్మడిగా వినియోగదారు ఆరోగ్య సంరక్షణ వ్యాపారానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించాయి. నొవార్టిస్‌కు చెందిన ఓవర్-ద-కౌంటర్ (ఓటీసీ) విభాగాన్ని జీఎస్‌కేకు చెందిన వినియోగదారు వ్యాపార విభాగంతో కలిపివేసి, ఒక కొత్త సంయుక్త సంస్థ (జేవీ)ని స్థాపించాలని నిర్ణయించాయి. ఈ సంయుక్త కంపెనీలో జీఎస్‌కేకు 63.5% వాటా ఉంటుంది.
ఏప్రిల్ - 24
¤  వ్యాపార ప్రకటనల ఆదాయంలో దూసుకెళ్లడంతో ఫేస్‌బుక్ తొలి త్రైమాసికంలో వాల్‌స్ట్రీట్ అంచనాలను మించి రాణించింది. ఇలా అంచనాలకు మిన్నగా ఫలితాలను ప్రకటించడం ఇది వరుసగా నాలుగో త్రైమాసికం.   »     అంతక్రితం ఏడాది చివరి త్రైమాసికంతో పోలిస్తే ఈసారి లాభం ఏకంగా మూడింతలై, 219 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.1,300 కోట్ల) నుంచి 642 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.3,800 కోట్ల)కు చేరింది. ఆదాయం 71% పెరిగి 2.5 బిలియన్ డాలర్ల (రూ.15,000 కోట్ల)కు చేరుకుంది.ఫేస్‌బుక్ గణాకాంలు మార్చి చివరకు ఫేస్‌బుక్‌లో నెలవారీ వినియోగదారుల సంఖ్య 128 కోట్లు. ప్రతి రోజూ ఫేస్‌బుక్‌లో లాగిన్ అయ్యే వారి సంఖ్య 80.2 కోట్లు తమ మొబైల్ ద్వారా నెలలో కనీసం ఒకసారైనా లాగిన్ అయ్యే వారి సంఖ్య తొలిసారిగా 100 కోట్లకు పైగా చేరింది. రోజువారీ మొబైల్ వినియోగదారుల సంఖ్య 60.9 కోట్లు. వ్యాపార ప్రకటన ఆదాయం 2.27 బిలియన్ డాలర్లు. అందులో మొబైల్ వ్యాపార ప్రకటనల ఆదాయం 1.34 బిలియన్ డాలర్లు లేదా 59%. 2013లో ప్రపంచ వ్యాప్త డిజిటల్ వ్యాపార ప్రకటనల ఆదాయంలో 6% వాటా ఫేస్‌బుక్ సొంతం. గూగుల్ వాటా 32%. మొబైల్ విషయానికొస్తే గతేడాది ప్రపంచ వ్యాప్త ప్రకటనల ఆదాయంలో 15% వాటా ఫేస్‌బుక్ పరం. 49% వాటాతో గూగుల్‌కు అగ్రస్థానం లభించింది.
ఏప్రిల్ - 25
¤  పన్ను ఎగవేతదారుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేసేందుకు భారీ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర ఆదాయ పన్ను (ఐటీ) శాఖ నిర్ణయించింది.   »     ప్రస్తుతమున్న ఈ-ఫైలింగ్, టీడీఎస్ ఇన్ఫర్మేషన్ కేంద్రాల తరహాలో దీన్ని నెలకొల్పనుంది. 'సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెల్ - కాంప్లియన్స్ మేనేజ్‌మెంట్ (సీపీసీసీఎం)' అని పేరు పెట్టిన ఈ కేంద్రం దేశ రాజధాని ఢిల్లీలో ఉంటుంది. ఆదాయ పన్ను శాఖకు చెందిన సిబ్బంది ఈ కార్యాలయాన్ని నిర్వహిస్తారు.   »     పన్నులను ఎగవేసే వారిని గుర్తించడానికి కావలసిన సాంకేతిక సమాచారాన్ని ఐటీ విభాగం ఉపయోగించుకోవడానికి ఈ కొత్త ప్రాజెక్టు ఉపయోగపడుతుంది.   »     2013-14లో 1,50,000 మంది పన్ను ఎగవేతదార్లను గుర్తించినట్లు ఐటీ శాఖ వెల్లడించింది.